
కోర్టు స్టేలో ఉన్న ఇరువూరు రీచ్ నుంచి ఇసుక అక్రమంగా తరలింపు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణా
తిరునాళ్లలో ట్రాఫిక్ క్లియర్ చేసి మరీ అక్రమ రవాణా వాహనాలను పంపేసిన ఎస్సై
సాక్షి టాస్క్‌పోర్స్: సర్వేపల్లి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో సహజ వనరుల దోపిడీ మూడు ఇసుక లారీలు.. ఆరు గ్రావెల్ వాహనాలు అనే రీతిలో విచ్చలవిడిగా సాగుతోంది. దీన్ని అరికట్టాల్సిన పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు సహకారం అందిస్తున్నారు. పొదలకూరు మండలం ఇరువూరు రీచ్ నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది.
నిశిరాత్రి భారీ యంత్రాలు ఉపయోగించి పెన్నా నదిలో తవ్వకాలు జరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాల్లో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు స్థానిక షాడో ఎమ్మెల్యే సహకారంతోపాటు పోలీస్ శాఖ అండగా ఉండడంతో అక్రమార్కులు బరి తెగించి వ్యవహరిస్తున్నారు.
కోర్టు స్టేలో ఉన్న రీచ్ నుంచి..
పొదలకూరు మండలం ఇరువూరు రీచ్ కోర్టు స్టే పరిధిలో ఉంది. అక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధి ఈ రీచ్‌ను ఓ ఇసుకాసురుడికి అ«నధికారికంగా అప్పగించారు. పగలు రాత్రి తేడా లేకుండా నదిలో భారీ యంత్రాలు ఉంచి లోడింగ్ చేస్తున్నారు.
30 టన్నుల సామర్థ్యం ఉన్న 50 టిప్పర్ల ద్వారా నిత్యం ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.10 వేలు వంతున వసూలు చేస్తున్నారు. కోర్టు స్టే పరిధిలో ఉన్న రీచ్‌లో ఇసుక లూటీ జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.
ఇతర రాష్ట్రాలకు తరలింపు..
ఇరువూరు రీచ్ నుంచి ఇసుకను రాత్రి వేళ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పెన్నా నది ఇసుకకు తమిళనాడు, బెంగళూరుతోపాటు తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీసిటీ డిమాండ్ ఉంది. అక్కడ ఇసుక టన్ను రూ.3 వేలు వరకు పలుకుతోంది. హైవే పోలీస్‌స్టేషన్లు, రవాణా శాఖ, విజిలెన్స్, మైనింగ్ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు. ఇరువూరు రీచ్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక వాహనాలను జిల్లా మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇటీవల పట్టుకున్నారు.
దాదాపు 20 వాహనాల్లో ఇసుక లోడింగ్ చేసి తరలిస్తుండగా స్థానిక పోలీసులు సహకారం అందించపోవడంతో రెండు టిప్పర్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారం వరకు అక్రమ రవాణాకు తాత్కాలికంగా తెరపడినా మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.
నెల్లూరు రూరల్‌లో గ్రావెల్..
నెల్లూరు రూరల్ నియోజకవర్గం గొల్లకందుకూరు తిప్పను గ్రావెల్ మాఫియా పీల్చి పిప్పి చేస్తోంది. రాత్రి వేళ భారీ యంత్రాలు ఉపయోగించి నిత్యం పదుల సంఖ్యలో పొదలకూరు, నెల్లూరు రూరల్ పరిధిలోని లే అవుట్‌లకు గ్రావెల్ తరలిస్తున్నారు. గ్రావెల్‌కు డిమాండ్ ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. రోజూ దాదాపు 40 టిప్పర్లతో అక్రమ రవాణా సాగిస్తున్నారు.
ట్రాఫిక్ క్లియర్ చేసి లారీలను పంపేసిన ఎస్సై..
కోర్టు స్టే పరిధిలో ఉన్న ఇరువూరు రీచ్, గొల్లకందుకూరు తిప్ప నుంచి అక్రమంగా ఇసుక, గ్రావెల్ తరలిస్తున్న లారీలు గురువారం రాత్రి పొదలకూరు మండలం తాటిపర్తిలో శ్రీరుక్మిణి సమేత పాండురంగస్వామి బ్రహ్మోత్సవాల వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి భారీగా చేరుకున్నాయి. ఈ సమయంలో అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై హనీఫ్ వాటిని నిలువరించగా స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ కాల్ రావడంతో చేసేది లేక అప్పటికప్పుడు రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసి లారీలను పొదలకూరు వైపు పంపారు.
ఈ ఘటనను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసులే ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు కొమ్ముకాస్తూ దగ్గరుండి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి పంపటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment