ఎంత దారుణం
రుణాల మంజూరులో రాజకీయ ప్రమేయం
చెప్పిన వారికే ఇవ్వాలంటూ అధికార పార్టీ నాయకుల హుకుం
ఎమ్మెల్యేలనుంచి చోటా నాయకుల దాకా ఒత్తిళ్లు
నిజమైన లబ్ధిదారులకు మొండిచెయ్యే!
దిక్కుతోచని స్థితిలో అధికారులు
అధికారంతో పనిలేకుండా అందరినీ సమానంగా చూడాల్సిన ప్రజాప్రతినిధులు వివక్ష పాటిస్తున్నారు. తాము చెప్పిన లబ్ధిదారులకే రుణాలు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అర్హులను పక్కనబెట్టి తమ కార్యకర్తలకే రుణాలు మంజూరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో తేడావస్తే సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు.
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పోటీ ఎక్కువకావడంతో అధికారపార్టీ నాయకులు రంగంలోకి దిగారు. తాము ఎవరికి చెబితే వారికే రుణాలు మంజూరు చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
టార్గెట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 4,142 యూనిట్లను టార్గెట్‌గా విధించింది. వీటికి 25,128 దరఖాస్తులు అందాయి. ఒక్కో యూనిట్‌కు సగటున ఆరుగురు పోటీపడ్డారు. ఎస్టీ కార్పొరేషన్‌కు 265 యూనిట్లకుగాను 6,002 దరఖాస్తులు వచ్చాయి. బీసీ రుణాలకు 1,662 యూనిట్లు కేటాయించగా 25,714 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాపు రుణాలకు 2,916 యూనిట్లు కేటాయించగా 13,834 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అధికార ముద్ర పడాల్సిందే
రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైంది. మొదట జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదించి సంబంధిత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌కు సిఫార్సు చేస్తున్నారు. ఆపై తాము రూపొందించిన రహస్య నివేదికలను అధికారులకు చేరవేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో పలుచోట్ల అధికార పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం వారికి ఇస్తే మరో వర్గం అధికారులపై ఒత్తిడి పెంచుతోంది.
నిబంధనలు తూచ్
ఎంపిక ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదు. గ్రామసభల సమక్షంలో జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధు లు, డ్వాక్రా సంఘాల మహిళల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రహస్యంగా పంపిన నివేదికల ఆధారంగా అధికారులు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోంది.
హెచ్చరికలు
‘‘మేం చెప్పిన అభ్యర్థులకే రుణాలు మంజూరు చేయాలి.. లేదంటే మీ అంతు చూస్తాం’’ అంటూ కొందరు అధికారపార్టీ నేతలు అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చేసేది లేక నిజమైన లబ్ధిదారులను పక్కన పెట్టి, అనర్హులకు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోందని పలువురు మదనపడుతున్నారు.