Self-employed
-
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్‌లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్‌తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్‌గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌కుమార్ మోర్ల -
సిరి గానుగ
స్వయం ఉపాధి పొందడంతోపాటు సమాజానికిఆరోగ్యదాయకమైన గానుగ నూనెలు అందించడం కోసంసోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు నళినీ సింధే ఎద్దుతో నడిచే కట్టె గానుగ నూనెలు ఆరోగ్యదాయకమైనవని డాక్టర్ ఖాదర్ వలి వంటి నిపుణులు ప్రచారం చేస్తుండడంతో కొందరు గ్రామీణ యువతీ యువకులు ఈ నూనెల తయారీని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. నగరాల్లో ఉద్యోగాలు వదిలేసి గ్రామాలకు తిరిగి వెళ్లి గానుగలు నెలకొల్పుతున్న వారు కొందరైతే, ఉన్న ఊళ్లోనే ఎద్దు గానుగలు ఏర్పాటు చేసుకొని తమ కాళ్ల మీద తాము నిలబడుతూ మరొ కొందరికి ఉపాధి కల్పిస్తున్న ఉన్నత విద్యావంతులు మరికొందరు. నళిని కూడా ఈ కోవకే చెందుతారు. మైసూరు జిల్లాలోని అత్తిగుప్పె నళిని స్వగ్రామం. మైసూరు–కె.ఆర్. నగర్ మెయిన్‌రోడ్డులో మైసూరుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నదీ గ్రామం. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదువుకున్న నళిని డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగం విన్నారు. ఉపాధి కోసం నగరాలకు వెళ్లడం కాదు.. తమ గ్రామంలోనే తల్లి సత్యవతిబాయితోపాటే ఉండిపోవాలనుకున్నారు. తాను స్వయం ఉపాధి పొందడంతోపాటు సమాజానికి ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలు అందించడం కోసం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నారు. 6 నెలల క్రితం మోహన్‌కుమార్ అనే వ్యక్తి భాగస్వామ్యంతో రూ. 3 లక్షల పెట్టుబడితో ఎద్దుతో నడిచే కట్టెగానుగను తమ ఇంటివద్ద ఏర్పాటు చేశారు. రూ. 1,30,000తో కట్టె గానుగ తెచ్చారు. రూ. 60 వేలతో దేశీ జాతి జోడెడ్లు కొన్నారు. గానుగ కోసం రేకుల షెడ్డు వేశారు. ‘గ్రామ సిరి’ అని పేరు పెట్టారు. పరిసర గ్రామాల్లో రైతులు సేంద్రియ పద్ధతుల్లో పండించిన వేరుశనగలు, నువ్వులు, కొబ్బరికాయలను కొనుగోలు చేసి తేవడం, గానుగ పట్టించడం వంటి పనులను మోహన్‌కుమార్ చూస్తుంటారు. ఇద్దరు మహిళా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా ఆడించిన నూనెను అర లీటరు గాజుసీసాల్లో లేదా స్టీలు క్యానుల్లో నింపి, విక్రయించడం నళిని బాధ్యత. డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగాలు వినడానికి వచ్చిన వారు, చికిత్స కోసం వచ్చే వారు తమ వద్ద ఎద్దు గానుగ నూనెలు కొనుగోలు చేస్తున్నారని నళిని తెలిపారు. అంతేకాదు.. నూనెలను స్టీలు క్యాన్లలో తీసుకెళ్లి నళిని స్వయంగా డోర్ డెలివరీ ఇస్తున్నారు. జత ఎద్దులు నెమ్మదిగా గానుగను తిప్పుతూ ఉంటాయి. ఎద్దు కట్టె గానుగ నిమిషానికి 3 సార్లు అతి నెమ్మదిగా తిరుగుతుంది. అందువల్ల నూనె వెలికి తీసే సమయంలో ఉష్ణం జనించదు (అందుకే దీన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు). కాబట్టి, నూనెలో పోషకాలు దెబ్బతినకుండా ఉంటాయి. విత్తన రకాన్ని బట్టి ఎంత సమయంలో నూనె వస్తుంది, ఎంత పరిమాణంలో నూనె వస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. రోజూ రెండు బ్యాచ్‌లలో నూనె తీస్తున్నారు. బ్యాచ్‌కు ఏ రకం నూనె గింజలైనా 12.5 కిలోలను గానుగలో వేస్తారు. 12.5 కిలోల వేరుశనగ నూనె గింజలు వేస్తే 4.5–5 లీటర్ల తీయడానికి 3.5 గంటలు పడుతుంది. ఎండుకొబ్బరి వేస్తే 2.30 – 3 గంటల్లోనే 4.5–5 లీటర్ల నూనె వస్తుంది. వెర్రి నువ్వులు వేస్తే 6 గంటల్లో కేవలం 1.7 – 2 లీటర్ల నూనె వస్తుంది. నువ్వులైతే 4–4.30 గంటల్లో 2–2.5 లీటర్ల నూనె వస్తుంది. డిమాండ్‌ను బట్టి ఒక్కో రకం నూనెను రెండు లేక మూడు రోజులు వేస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలతోపాటు నగర వాసుల్లో కూడా అవగాహన పెరుగుతుండడంతో గానుగ నూనెలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. రోజూ పది గంటలు శ్రమిస్తున్నారు నళిని. ఈ పని తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తున్నదని, ప్రస్తుతం నెలకు రూ. 30 వేల వరకు నికరాదాయం పొందుతున్నానని నళిని ‘సాక్షి’తో చెప్పారు. త్వరలో రెండోగానుగ ఏర్పాటు చేసుకోవాలని, రెండోజత ఎడ్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు ఉత్సాహంగా చెప్పారామె. గ్రామ స్వరాజ్యం, స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న నళిని, మోహన్ కుమార్ ఆదర్శనీయులు. పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్, సాక్షి -
శిక్షణతోనే సరి.. రాయితీలు మరి!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి గాడి తప్పింది. నిరుద్యోగ యువతను ఉద్యోగావకాశాలకు ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి రంగంవైపు ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ఫైనాన్స్ కార్పొరేషన్ల లక్ష్యం అటకెక్కింది. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించిన ఆశావహులందరికీ రాయితీలిచ్చి సహకరిస్తామంటూ వార్షిక సంవత్సరం ప్రారంభంలో భారీ ప్రణాళికలు తయారు చేసిన వివిధ కార్పొరేషన్లు ప్రస్తుతం ముఖం చాటేశాయి. రాయితీలపై నోరుమెదపకుండా శిక్షణ కార్యక్రమాలతో సరిపెడుతున్నా యి. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న వారికి చెయ్యిచ్చాయి. మరో నెలన్నరలో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. కనీసం దరఖాస్తుల పరిశీలన సైతం చేయకపోవడంతో అర్జీదారులు డీలా పడ్డారు. 10.25 లక్షల మంది ఎదురుచూపులు.. భారీ వార్షిక ప్రణాళికలు రూపొందించిన ఫైనాన్స్ కార్పొరేషన్లు గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 10.25 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. ఇందులో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరం చివర్లో 7,59,788 మంది దరఖాస్తు చేసుకోగా... 2018–19 వార్షికం ప్రారంభంలో 2,65,375 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలిం చి లబ్ధిదారులను గుర్తించాలి. ఈక్రమంలో ముందు గా జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధారిస్తే... ఆమేరకు పరిశీలన చేపట్టి అర్హులను గుర్తిస్తారు. కానీ ఇప్పటివరకు జిల్లాల వారీ లక్ష్యాలను ఆయా ఫైనా న్స్ కార్పొరేషన్లు నిర్ధారించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఫైనాన్స్ కార్పొరేషన్ల రాష్ట్ర వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించకపోవడమే. సాధారణంగా ఫైనాన్స్ కార్పొరేషన్లు వార్షిక ప్రణాళికలను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే వాటికి ఆమోదం రావాల్సి ఉంటుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు సమర్పించిన 2018–19 వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు. దీంతో ఆయా కార్పొరేషన్లు లబ్ధిదారుల ఎంపికను సైతం నిర్వహిం చలేదు. 2018–19 వార్షిక ప్రణాళికలకు ఆమోదం రాకపోవడం, గత దరఖాస్తులకు మోక్షం కలగని కారణంగా ఈ ఏడాది ఎస్టీ, బీసీ కార్పొరేషన్లతో పాటు బీసీ ఫెడరేషన్లు కనీసం దరఖాస్తులు సైతం స్వీకరిం చలేదు. ప్రస్తుతం కార్పొరేషన్ల వద్ద ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలంటే రూ.18,062.41 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఎంబీసీ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న రూ.250 కోట్ల నిధితో 17వేల మంది లబ్ధిదారులకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. వీరంతా రూ.50 వేలలోపు యూనిట్లు పెట్టుకున్నవారే. కానీ ముందస్తు ఎన్నికలు రావడంతో ఇవికూడా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. ‘ముందస్తు’తో ఆవిరైన ఆశలు.. 2017–18 వార్షికంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ తరువాతి ఏడాదిపైనే కార్పొరేషన్లు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఈక్రమంలో 2018–19 వార్షిక ప్రణాళికలను భారీగా తయారు చేసిన అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు. ఎన్నికల సీజన్ కావడంతో తప్పకుండా నిధులు వస్తాయని అన్నివర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ రెండో త్రైమాసికంలోనే ప్రభుత్వం ముందస్తుకు సిద్ధం కావడంతో నిరుద్యోగ యువతకు భంగపాటు తప్పలేదు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో మరో రెండు నెలలపాటు కాలయాపన జరిగింది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానుండడంతో ఈసారి స్వయం ఉపాధికి రాయితీ రుణాలు కష్టమేనని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
కార్లకు ఫుల్..బైక్‌లకు డల్
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాలకు నిరుద్యోగ యువత నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2018–19 వార్షిక సంవత్సరంలో మోటార్ ఎంపవర్మెంట్ కింద 4 వేల యూనిట్లు పంపిణీ చేయాలని యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం క్యాబ్‌లతోపాటు ఈ కామర్స్ కంపెనీలకు సంబంధించిన సర్వీసులకు బాగా డిమాండ్ ఉంది. దీంతో క్యాబ్ కేటగిరీలో 2 వేల కార్లు, బైక్ కేటగిరీలో 2 వేల ద్విచక్ర వాహనాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. క్యాబ్ కేటగిరీకి ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ ఇస్తారు. బైక్ కేటగిరీలో యూనిట్ విలువపై 80 శాతం వరకు రాయితీ ఇస్తారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఆగస్టు తొలివారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 20తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. భారీ ఎత్తున రాయితీ ఆశిస్తున్న నిరుద్యోగ యువత క్యాబ్ కేటగిరీ వైపే మొగ్గు చూపగా.. బైక్ కేటగిరీ వైపు కనీసం ఆసక్తి చూపలేదు. క్యాబ్ కేటగిరీలో 6,360 మంది దరఖాస్తు చేసుకోగా.. బైక్ కేటగిరీలో 982 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. క్యాబ్ కేటగిరీ పథకాన్ని గతంలోనూ అమలు చేయడంతో క్షేత్రస్థాయిలో కొంత అవగాహన ఉంది. దీంతో ఈ కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు బైక్ కేటగిరీని కొత్తగా తెచ్చారు. అయితే దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గి ఉండొచ్చని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
బీసీ ఫెడరేషన్లలో అయోమయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాల (బీసీ) ఫెడరేషన్లలో అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ.. వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత కొరవడింది. మూడేళ్ల తర్వాత ఫెడరేషన్లకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నేపథ్యంలో అధికారులు నూతనోత్సాహంతో పథకాల అమలుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ.. భారీ స్థాయిలో వార్షిక ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ సైతం ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. 11 ఫెడరేషన్లకు 2.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ పూర్తయి మూడున్నర నెలలు కావస్తున్నా అర్హుల ఎంపిక మాత్రం జరగలేదు. వాస్తవానికి ఫెడరేషన్లకు సంబంధించిన వార్షిక ప్రణాళిక ఖరారైతేనే జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్ణయించే వీలుంటుంది. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ 2018–19 వార్షిక సంవత్సరం ప్రారంభమై రెండో త్రైమాసికం ముగుస్తున్నా ఫెడరేషన్ల వార్షిక ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. దీంతో లబ్ధి దారుల ఎంపిక ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పరిశీలనతో సరి.. బీసీ ఫెడరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రాథమిక కసరత్తులో భాగంగా అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తులను పూరించిన మేరకు స్వయం ఉపాధి యూనిట్ బడ్జెట్ స్థాయిని బట్టి కేటగిరీల వారీగా విభజించారు. అయితే వివిధ ఫెడరేషన్లను నిర్ణయించిన బడ్జెట్లో ఏయే యూనిట్లకు అనుమతి ఇవ్వొచ్చనే అంశంపై స్పష్టత వస్తేనే కేటగిరీల వారీగా లబ్ధిదారులను గుర్తించవచ్చు. కానీ వార్షిక ప్రణాళికలకు ప్రభుత్వ ఆమోదం రాకపోవడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలనకే పరిమితమయ్యారు. -
‘లక్ష’ణంగా రాయితీ రుణం
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు బీసీ కార్పొరేషన్ వడివడిగా చర్యలు తీసుకుంటోంది. నిధుల విడుదలలో జాప్యంతో మూడేళ్లుగా రాయితీ పథకాలను అటకెక్కించిన ఆ శాఖ.. తాజాగా 2018–19 సంవత్సరంలో ఏకంగా లక్ష యూనిట్ల మంజూరుకు ఉపక్రమించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి యూనిట్ల ఏర్పాటును వేగిరం చేయనుంది. 2018–19 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్‌తో పాటు 11 బీసీ ఫెడరేషన్లకు 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు ఉన్న స్వయం ఉపాధి యూనిట్లు 1.45 లక్షలు ఉన్నాయి. తొలివిడతలో భాగంగా చిన్న యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన బీసీ కార్పొరేషన్ ఈ మేరకు దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. నవంబర్‌లోగా రాయితీ విడుదల.. బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ప్రాధాన్యత క్రమంలో రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలివిడత రూ.లక్ష లోపు ఉన్న యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల లోపు ఉన్న యూనిట్లకు రెండో విడత, రూ.10 లక్షల లోపు ఉన్న యూనిట్లకు మూడో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేసి రాయితీ ఇవ్వనుంది. ప్రస్తుతం తొలివిడత కింద లక్ష మందికి రాయితీ రుణాలు ఇవ్వాలని భావిస్తోంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేస్తోంది. తొలివిడత లక్ష మందికి రాయితీ ఇచ్చేందుకు రూ.750 కోట్లు అవసరం. 2018–19 వార్షిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఫెడరేషన్లకు కేటాయించిన నిధులతో పాటు ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను వినియోగించుకోనుంది. ప్రస్తుతం లక్ష మందికి రాయితీ ఇవ్వనున్నప్పటికీ.. ఇందులో ఆయా సామాజిక వర్గాల వారీగా ఫెడరేషన్లకు దరఖాస్తులను బదలాయించాలని, దీంతో బీసీ కార్పొరేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా నవంబర్ నెలాఖరు నాటికి నిర్దేశించిన లక్ష మందికి రాయితీ రుణాలిచ్చి యూనిట్ల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
నైపుణ్యానికే పట్టం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త. నైపుణ్యం ఉన్న యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించే కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ శ్రీకారం చూడుతోంది. ఈ మేరకు ఆరు కేటగిరీల్లో 81 రకాల ఉపాధి యూనిట్లను గుర్తిస్తూ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. సిఫార్సులకు తావు లేకుండా దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికీ చేయూత ఇవ్వనుంది. ఇందుకు దరఖాస్తుదారుల నైపుణ్యమే కీలకం కానుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు మండల స్థాయి కమిటీకి 50 శాతం వాటా ఇస్తూ మిగతా 50 శాతాన్ని నేరుగా కార్పొరేషన్ అధికారులే ఎంపిక చేయనున్నారు. సాధారణంగా కార్పొరేషన్ రుణాలంటే దరఖాస్తుల అనంతరం వాటి పరిశీలన, బ్యాంకు నుంచి రుణ మంజూరు అంగీకార పత్రం, ఉమ్మడి లబ్ధిదారుల ఎంపికలో అర్హత సాధిస్తేనే రాయితీ దక్కుతుంది. ఈ సంప్రదాయాన్ని ఎస్సీ కార్పొరేషన్ సరికొత్తగా మార్పు చేయనుంది. క్షేత్ర స్థాయిలో ఉమ్మడి లబ్ధిదారుల ఎంపికకు ప్రాధాన్యతనిస్తూనే.. నైపుణ్యం ఉన్న యువతకు నేరుగా రాయితీలిచ్చేలా కార్యాచరణ రూపొందించింది. సగభాగం మహిళలకు.. ఎస్సీ కార్పొరేషన్ అమలు చేయనున్న స్వయం ఉపాధి పథకంలో ఆరు కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందులో పారిశ్రామిక వ్యాపారం, వ్యవసాయ ఆధారిత యూనిట్లు, చిన్న నీటి పారుదల, పశుసంవర్ధకం/మత్స్య పరిశ్రమ, ఉద్యాన/పట్టు పరిశ్రమలు, వాహన రంగం కేటగిరీల్లో దాదాపు 81 రకాల ఉపాధి యూనిట్లను గుర్తించింది. అభ్యర్థుల విద్యార్హతను పరిగణనలోకి తీసుకుని తగిన యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఫార్మసీ చేసిన నిరుద్యోగి ఉంటే మెడికల్ షాప్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తే డయాగ్నస్టిక్ సెంటర్, డ్రైవింగ్ వస్తే క్యాబ్ కొనుగోలుకు సహకారం.. ఇలా వినూత్న అంశాలను జోడించింది. యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చును బట్టి రూ.80 వేల నుంచి రూ.6 లక్షల వరకు రాయితీలివ్వనుంది. తాజా ప్రణాళికలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సగం యూనిట్లను వారికే కేటాయించనుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 17 వేల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. ఈ మేరకు రూ.1,000 కోట్లతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నెలాఖరులోగా ప్రభుత్వం నుంచి ఆమోదం రానున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఆమోదం వచ్చిన వెంటనే క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తిస్తామని, అక్టోబర్‌కల్లా యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
అనుచరుల పచ్చం!
స్వయం ఉపాధితో జీవితాన్ని చక్కబెట్టుకోవాలనుకున్న నిరుద్యోగుల ఆశలపై టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. పార్టీ వర్గీయులు, అనుచరులకే పెద్దపీట వేయడం.. అధికారులను పక్కనపెట్టి స్వయంగా నాయకులే రుణమేళా నిర్వహించడంతో అర్హులకు నిరాశ మిగిలింది. గుత్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ, కాపు సబ్సిడీ రుణాలకు సంబంధించి 470 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఇంటర్వ్యూ ప్రారంభమైన పది నిముషాలకే టీడీపీ నేతలు బ్యాంకు, మండల పరిషత్ అధికారుల స్థానంలో కూర్చొని పెత్తనం చెలాయించారు. ఆ పార్టీ కార్యకర్తల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ముగించేశారు. - గుత్తి: -
ఎంత దారుణం
రుణాల మంజూరులో రాజకీయ ప్రమేయం చెప్పిన వారికే ఇవ్వాలంటూ అధికార పార్టీ నాయకుల హుకుం ఎమ్మెల్యేలనుంచి చోటా నాయకుల దాకా ఒత్తిళ్లు నిజమైన లబ్ధిదారులకు మొండిచెయ్యే! దిక్కుతోచని స్థితిలో అధికారులు అధికారంతో పనిలేకుండా అందరినీ సమానంగా చూడాల్సిన ప్రజాప్రతినిధులు వివక్ష పాటిస్తున్నారు. తాము చెప్పిన లబ్ధిదారులకే రుణాలు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అర్హులను పక్కనబెట్టి తమ కార్యకర్తలకే రుణాలు మంజూరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో తేడావస్తే సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పోటీ ఎక్కువకావడంతో అధికారపార్టీ నాయకులు రంగంలోకి దిగారు. తాము ఎవరికి చెబితే వారికే రుణాలు మంజూరు చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టార్గెట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 4,142 యూనిట్లను టార్గెట్‌గా విధించింది. వీటికి 25,128 దరఖాస్తులు అందాయి. ఒక్కో యూనిట్‌కు సగటున ఆరుగురు పోటీపడ్డారు. ఎస్టీ కార్పొరేషన్‌కు 265 యూనిట్లకుగాను 6,002 దరఖాస్తులు వచ్చాయి. బీసీ రుణాలకు 1,662 యూనిట్లు కేటాయించగా 25,714 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాపు రుణాలకు 2,916 యూనిట్లు కేటాయించగా 13,834 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికార ముద్ర పడాల్సిందే రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైంది. మొదట జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదించి సంబంధిత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌కు సిఫార్సు చేస్తున్నారు. ఆపై తాము రూపొందించిన రహస్య నివేదికలను అధికారులకు చేరవేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో పలుచోట్ల అధికార పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం వారికి ఇస్తే మరో వర్గం అధికారులపై ఒత్తిడి పెంచుతోంది. నిబంధనలు తూచ్ ఎంపిక ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదు. గ్రామసభల సమక్షంలో జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధు లు, డ్వాక్రా సంఘాల మహిళల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రహస్యంగా పంపిన నివేదికల ఆధారంగా అధికారులు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోంది. హెచ్చరికలు ‘‘మేం చెప్పిన అభ్యర్థులకే రుణాలు మంజూరు చేయాలి.. లేదంటే మీ అంతు చూస్తాం’’ అంటూ కొందరు అధికారపార్టీ నేతలు అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చేసేది లేక నిజమైన లబ్ధిదారులను పక్కన పెట్టి, అనర్హులకు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోందని పలువురు మదనపడుతున్నారు. -
సీజీజీ పోర్టల్‌లో ‘స్వయం ఉపాధి’ వివరాలు
పొందుపరచాలని సీఎస్ ఆదేశం సాక్షి,, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారు లకు మంజూరైన పథకాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్‌లో పొందుపరచాలని అధికారులను సీఎస్ ప్రదీప్‌చంద్ర ఆదేశించారు. మంజూరైన స్వయంఉపాధి, లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన పథకాల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. మంగళ వారం సచివాలయంలో సంక్షేమ శాఖల్లో స్వయం ఉపాధి పథకాల అమలు తీరును సీఎస్ సమీక్షించారు. గుడుంబా బాధిత కుటుంబాలకు స్వయంఉపాధి కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని ఆదే శించారు. సంక్షేమానికి సంబంధించి ప్రతి శాఖ ద్వారా హాబిటేషన్లు, లబ్ధిదారుల వారీగా వివరాల సేకరణ, శాఖల వారీగా స్వయం ఉపాధి పథకాల మంజూరీని సమీక్షిస్తూ నెలవారీ కార్యాచరణ రూపొం దించుకోవాలన్నారు. అధికారులు అజయ్ మిశ్రా, సోమేశ్‌కుమార్,జలీల్, సందీప్ కుమార్, అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
జోగిని... అభాగిని
- కూడూగూడు లేక అత్యంత దుర్భర జీవనం - దేవుడి భార్యలుగా చలామణి అవుతున్నా నిరాదరణే - పింఛన్లు, రేషన్‌కార్డులు సైతం లేని వైనం - వితంతు పింఛన్‌కు భర్త డెత్ సర్టిఫికెట్ కావాలంటున్న అధికారులు - దేవుడు మరణించినట్లు ధ్రువీకరించేదెవరంటున్న జోగినీలు సాక్షి, మహబూబ్‌నగర్: వారంతా దేవుడి భార్యలుగా చలామణి అవుతున్నారు.. కానీ వారికే దిక్కు లేకుండా పోయింది. ఓ వైపు సమాజం.. మరోవైపు బంధువుల నిరాదరణకు గురవుతూ ఒంటరి జీవనం సాగిస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో మూఢ నమ్మకాల కారణంగా దేవుడికి పెళ్లి చేసి జోగినీలుగా మార్చారు. ప్రస్తుతం వారి వయసు పైబడడంతో అనారోగ్యం బారిన భారంగా బతుకీడుస్తున్నారు. ఏ ఆధారం లేని వీరంతా ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సుమారు ఐదు వేల మంది జోగినీ మహిళలు ఉన్నారు. ఏ దిక్కులేని వారికి ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్ల విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోంది. మొత్తం ఐదు వేల మంది జోగినీల్లో దాదాపు 60 శాతం పైగా మహిళలు పనులు చేయలేకపోతున్నారు. యుక్త వయసులో వీరంతా శారీరకంగా, మానసికంగా హింసకు గురయ్యారు. ప్రస్తుతం వీరి ఆలనాపాలనా చూసుకునే పరిస్థితి లేదు. జోగినీలు ఎక్కువ శాతం వితంతువు పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. అయితే అధికారులు మాత్రం వింతతువు పింఛన్‌కు దరఖాస్తు చేస్తే.. కచ్చితంగా భర్త మరణించినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని పట్టుబడుతున్నారు. దీంతో జోగినీలు కంగుతినాల్సి వస్తోంది. దేవుడి భార్యలుగా ముద్రవేసిన తమకు.. భర్త చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చేదెవరంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు వృద్ధాప్య పింఛనైనా మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ఆదరణ ప్రకటనలకే పరిమితం జోగినీలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తున్నా.. ఆచరణ భిన్నంగా ఉంటోంది. జోగిని వ్యవస్థపై మాజీ ఐఏఎస్ రఘోత్తమరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 2013లో నివేదిక అందజేసింది. ఈ కమిషన్ ప్రకారమే తెలంగాణ వ్యాప్తంగా 12 వేల మంది జోగినీలు ఉన్నారని, అందులో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలోనే ఐదువేల మంది ఉన్నట్లు తేలింది. వీరంతా ఎలాంటి ఆధారం లేక అత్యంత దీనావస్థలో బతుకీడుస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు వారికోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. స్వయం ఉపాధి రుణాలైనా ఇప్పించండి సమాజంలో నిరాదరణకు గురైన తమకు ప్రభుత్వం భరోసా కల్పించాలని జోగినీలు వేడుకుంటున్నారు. ఏకసభ్య కమిషన్ సూచన మేరకు తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా చేయూత కల్పించాలని విన్నవిస్తున్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తే తమ కాళ్లపై తాము నిలబడతామని చెపుతున్నారు. ఆసక్తి ఉన్న ఒకరిద్దరు స్వచ్ఛంద సంస్థల సహకారంలో మిరపపొడి గిర్నీలు కొనుగోలు చేసి స్వయంగా పనిచేస్తున్నారు. ఇదే మాదిరిగా ప్రభుత్వం సహకారం అందిస్తే చిరు వ్యాపారులు చేసుకుని జీవనం సాగిస్తామని వారు విన్నవిస్తున్నారు. రూ.3 వేల భృతి ఇవ్వాలి జోగినీ వ్యవస్థ కారణంగా కొందరు మహిళలు నిరాదరణకు గురయ్యారు. చాలామంది అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో వీరిని ఆదుకోవాలి. ప్రతి జోగినీకి ప్రతి నెలా రూ.3 వేల పింఛన్ అందజేయాలి. మూడెకరాల భూమి కేటాయించడంతో పాటు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఉపాధి కల్పనలో భాగంగా ఎలాంటి ష్యూరిటీలు లేకుండా రూ.ఐదు లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలి. – హాజమ్మ, జోగినీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్, మహబూబ్‌నగర్ జిల్లా దేవుడు సచ్చినట్లు కాగితం రాసియరు కదా.. జోగినీగా చేసి ఇంట్లో నుంచి పంపిండ్రు. బలం ఉన్నన్ని రోజులు బతికినం. ఇప్పుడు ఏం చేతకావట్లేదు. పింఛన్ అడిగితే ఎట్ల ఇయ్యాలే అని అధికారులు అడుగుతుండ్రు. వితంతువు పింఛన్ అంటే మొగుడు సచ్చినట్లు కాగితం తేమంటున్నరు. దేవునికిచ్చి పెళ్లిచేసిరి.. దేవుడు సచ్చినట్లు కాగితం రాసియరు కదా. ముసలొళ్లకు ఇచ్చే పింఛన్ కూడా ఇస్తలేరు. కాసింతకూడు కోసం కింద మీద పడి బీడీలు చేసుకొని బతుకుతున్న. – బాలమ్మ, ధన్వాడ, మహబూబ్‌నగర్ జిల్లా ఇదీ ఓ జోగిని ఆవేదన..కాదు ఆ వ్యవస్థలో కూరుకు పోయిన ఎందరో అభాగినుల ఆక్రోశం. తమను ఇలా చేసిన సమాజానికి సంధిస్తున్న ప్రశ్నలు -
స్వయం ఉపాధి కోసం ఇంటర్వ్యూలు
దుబ్బాక: నగర పంచాయతీ పరిధిలోని డ్వాక్రా సంఘాలకు 25 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మెప్మా కో-ఆర్డినేటర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ యూనిట్లకు నేడు(శుక్రవారం) సాయంత్రం 3 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 25 యూనిట్లలో ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున వ్యక్తిగత రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందులో ఏపీజీవీబీ చిట్టాపూర్ బ్రాంచ్‌లో 5 యూనిట్లకు రూ. 10 లక్షలు, ఏపీజీవీబీ దుబ్బాక శాఖకు 10 యూనిట్లకు రూ. 20 లక్షలు, ఎస్బీహెచ్ దుబ్బాక శాఖకు 10 యూనిట్లకు రూ. 20 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యక్తిగత దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, డ్వాక్రా సంఘం బ్యాంకు పాసు పుస్తకం, స్లమ్ సమాఖ్య తీర్మాన కాపీలు తీసుకొని సాయంత్రం 5 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. -
సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్..
టాప్ స్టోరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. స్వయం ఉపాధికి ఆధునిక పేరు! ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యం ఉంటున్న విభాగమిది! ఇందులో ప్రస్తుతం మరో కొత్త విభాగం కీలకంగా మారుతోంది. అదే.. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సామాజిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడే సంస్థలను స్థాపించడమే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇందులోని అవకాశాలపై విశ్లేషణ.. ఒకవైపు కెరీర్ పరంగా స్వయం ఉపాధి లక్ష్యాన్ని, మరోవైపు సామాజిక అవసరాలను తీర్చాలనే ఆకాంక్షను నెరవేరేలా చేస్తోంది సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇది సామాజికంగా నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు మొదలు అభివృద్ధి సమస్యల వరకు పరిష్కారాలను చూపుతోంది. సామాజిక అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి బాటలు వేస్తోంది. ఎన్నో రంగాలు * సాధారణ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో పోల్చితే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఆదాయం కొంత తక్కువ ఉంటుంది. కానీ, సమాజాభివృద్ధికి తోడ్పడ్డామన్న సంతృప్తికి కొదవ ఉండదు. * ప్రస్తుతం దేశంలో ఐఐటీల నుంచి సాధారణ కళాశాలల విద్యార్థుల వరకు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై మొగ్గుచూపుతున్నారు. ఔత్సాహికులు స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐఐటీ చెన్నైకు చెందిన కృష్ణన్ అనే విద్యార్థి రైల్వేస్టేషన్లలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, రూ.2కు లీటర్ నీటిని అందిస్తున్నారు. అమృత ధార పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఆలోచన.. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్’ సంస్థ నిర్వహించిన పోటీలో విజయం సాధించింది. దీంతో ఆ విద్యార్థి ఆర్థిక సహకారం పొందాడు. సోషల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సంస్థలకు వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. విద్యలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విద్యా రంగానికి కూడా విస్తరిస్తోంది. ఆన్లైన్ ట్యుటోరియల్స్ సంస్థలు, ఈ-లెర్నింగ్ సంస్థలు, వెబ్సైట్లు వంటివన్నీ ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పరిగణించవచ్చు. వీటికి కూడా సీడ్ ఫండింగ్ ఏజెన్సీల నుంచి మద్దతు లభిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన Edutor ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్ సంస్థకు దాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే హైదరాబాద్ ఏంజెల్స్ సంస్థ రూ.2 కోట్లు సీడ్ క్యాపిటల్ అందించింది. ఉద్యోగావకాశాలు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో సంస్థల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో ఇందులో ఉద్యోగ అవకాశాలు అధికమవుతున్నాయి. ఈ విభాగంలో వచ్చే రెండేళ్లలో 70 వేల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశమున్నట్లు అంచనా. కానీ ఇతర ఎంటర్ప్రెన్యూర్ సంస్థలతో పోల్చితే వీటిలో వేతనాలు కొంత తక్కువగా ఉంటాయి. కార్పొరేట్ సంస్థలు సైతం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీం ప్రకారం సంస్థలు తమ నికర లాభంలో రెండు శాతం సామాజిక అభివృద్ధికి కేటాయించాలి. ఈ క్రమంలో పలు కార్పొరేట్ సంస్థలు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కొత్త వెంచర్లు ప్రారంభిస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాల్లో స్టార్టప్ ఔత్సాహికులకు నిధులను కూడా సమకూరుస్తున్నాయి. కేవలం స్వచ్ఛంద సంస్థలు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి అడుగుపెడతాయనుకుంటే పొరపాటు. పూర్తిస్థాయిలో కమర్షియల్‌గా మారిన రంగాల్లోనూ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్థల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన IMPRINT పథకంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు పెద్దపీట వేశారు. ఫండింగ్ ఏజెన్సీలు ACUMEN ఫండ్ SONG: ఈ సంస్థ చిన్న, మధ్య తరహా సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్థిక సహకారం అందిస్తోంది. ఆవిష్కార్ ఇండియా మైక్రో వెంచర్ క్యాపిటల్: ముంబైకు చెందిన ఈ సంస్థ చెత్త నిర్వహణ, ఇంధనం, హస్తకళలు తదితరాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది. గ్రే మేటర్స్ క్యాపిటల్ ఫౌండేషన్: హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ మైక్రో ఫైనాన్స్, ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఫండింగ్ సదుపాయం కల్పిస్తోంది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు ఇండియా ఇన్‌క్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్ పేరుతో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఓర్పు అవసరం. ప్రారంభంలో లక్షిత క్లయింట్లను చేరుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. నిధుల కోసం సీడ్ ఏజెన్సీలను మెప్పించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇటీవల కాలంలో స్టార్టప్ కాంపిటీషన్లలో సోషల్ స్టార్టప్ ఔత్సాహికుల సంఖ్య పెరగడంతో ఫండింగ్ ఏజెన్సీల ఆలోచన దృక్పథంలోనూ మార్పు వస్తోంది. - రామ్ గొల్లమూడి, ఫౌండర్, ఎడ్యూటర్ -
స్త్రీ శక్తికి ప్రతీక గిరిజన మహిళ
స్వయం ఉపాధితో జీవనం పేదరికం వల్ల కానని ప్రగతి పాడేరు: స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే గిరిజన మహిళలు ప్రగతిలో వెనుకబడి ఉన్నారు. నిరక్షరాస్యులైన వేలాదిమంది గిరిజన మహిళలు తమ సంస్కృతి సంప్రదాలయాలకు ప్రతిరూపంగా స్వయం ఉపాధితో కొండకోనల్లో శ్రమైక్య జీవనం సాగిస్తున్నారు. మన్యంలో పురుషులతో సమానంగా నిలిచే గిరి మహిళల పురోభివృద్ధికి పేదరికం, నిరక్ష్యరాస్యత అడ్డుగోడలుగా ఉన్నాయి. దశాబ్దాల కాలంగా మన్యంలో గిరిజన మహిళలకు ఉపాధి రంగంలో అవకాశాలు మెరుగుపడటం లేదు. మైదాన ప్రాంతాలతో పోల్చితే మన్యంలో మహిళాభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేది అంతంత మాత్రమే! మన్యంలో శ్రమజీవులుగా కనిపించే గిరిజన మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వపరంగా చిన్నతరహ ,కుటిర పరిశ్రమలు అందుబాటులో లేవు. సాంకేతిక ఉపాధి రంగాల్లో గిరిజన మహిళాలకు తోడ్పటునందించడం కోసం నేటికీ ప్రత్యేక కార్యక్రమాలు అమలు జరగడం లేదు. అక్షరాస్యతకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన మహిళలు ఒక శ్రామిక శక్తిగా జీవనం సాగిస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. నేటికీ వీరి జీవనానికి కూలీపనులు, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ అధారంగా ఉన్నాయి. విద్య అవకాశాలను అందిపుచ్చుకున్న గిరిజన మహిళలు కూడా నేడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందడం లేదు. కాఫీ కార్మికులుగా, అరోగ్యకార్యకర్తలుగా, అంగన్వాడీకార్యకర్తలుగా,హాస్టల్వర్కర్లుగా. జీవనోపాధికి కష్టపడుతూ ఉద్యోగభద్రత లేక శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధించడంలో గిరిజన మహిళలు వెనుకబడి ఉన్నారు. పేదరికం నుంచి విముక్తి పొందడం లేదు. ఆర్థిక తోడ్పాటు అందించాలి. గిరిజన మహిళలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రత్యేక పథకాలు చేపట్టాలి. మన్యంలో మహిళల ప్రగతి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. విద్యావకాశాలు విస్తరించడం లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా అందుకోలేకపోతున్నారు. మన్యంలో మహిళల కోసం ప్రభుత్వ పథకాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల డ్వాక్రా సంఘాలు వెనుకబడ్డాయి. రుణసౌకర్యాలు అంతంతమాత్రమే. అటవీ ఉత్పత్తులు అంతరించి ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు విద్య, వైద్యం, ఆహార కొరత వంటి సమస్యల వల్ల పేదరికం సమసి పోవడం లేదు. మహిళలకు అవసరమైన రంగాలలో, పురుషులతో సమాన హక్కు కల్పించాలి. -ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి(పాడేరు) -
పక్కదారి పడుతున్న రుణాలు
ఎంపీడీవోల ఇష్టారాజ్యం బ్యాంకర్ల సహకారం ప్రజాప్రతినిధులే లబ్ధిదారులు ఫిర్యాదుల వెల్లువ కరీంనగర్ సిటీ : నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన సంక్షేమ రుణాలు జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకర్ల సహకారంతో ఎంపీడీవోలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలాలు, పట్టణాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల జాబితా చాలా చోట్ల కొలిక్కి రాకపోవడానికి కారణం ఇదేననే విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా అందచేస్తున్న రుణాల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా గణనీయంగా సబ్సిడీని, రుణాలు పెంచిన విషయం తెలిసిందే. రూ.80వేల నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధిదారులకు సబ్సిడీ లభిస్తుండడంతో సహజంగానే పెద్దల కన్ను ఈ రుణాలపై పడింది. ఇందుకు తగినట్లుగానే ఆయా యూనిట్లకు లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సాక్షాత్తు కలెక్టర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోనరావుపేట మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రుణాల లబ్ధిదారుల ఎంపికలో ఇన్చార్జి ఎంపీడీవో అక్రమాలకు పాల్పడ్డారని ఆ మండలం ఎంపీటీసీలు కలెక్టర్, సీఈవోలకు ఫిర్యాదు చేశారు. రుణాల మంజూరులో రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు చేతులు మారాయని ఆరోపించారు. బ్యాంక్ టార్గెట్ లేకున్నా ఎనిమిది మందికి ఎస్టీ రుణాల మంజూరు ప్రతిపాదనలు పంపించారన్నారు. పైగా ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులనే రుణాలకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తకు, అంగన్వాడీ కార్యకర్త భర్తకు, 2014-15లో రుణాలు తీసుకున్న వారిని తిరిగి ఎంపిక చేశారని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనర్హులైన కేవలం ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్నారనే ఎంపిక చేశారని తెలిపారు. వీటిపై విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. గంగాధర మండలంలో లబ్ధిదారుల ఎంపిక మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇటీవల ఎంపిక చేసిన జాబితాను చూసిన నిరుద్యోగులు మండిపడుతున్నారు. కలెక్టర్‌ను కలిసిన మండలానికి చెందిన నిరుద్యోగులు పర్శరాం, సుధాకర్ తదితరులు ఫిర్యాదు చేశారు. మండలంలోని ప్రజాప్రతినిధి భర్తను రూ.10 లక్షల రుణానికి (కారుకోసం) ఎంపిక చేశారు. రుణానికి ఎంపిక బ్యాంక్ పరిధిలోనే అతని గ్రామం లేకపోవడం విశేషం. పైగా కారు లోను కోసం తప్పనిసరిగా దరఖాస్తుదారుడి పేరిట డ్రైవింగ్ లెసైన్స్, బ్యాడ్జీ ఉండాలి. కాని ఇవేవీ అతడికి లేవు. అయినా ఎంపిక పూర్తయింది. అలాగే ఇదే మండలం బూరుగుపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురికి ఎస్సీ రుణాలు మంజూరయ్యా యి. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు దరఖాస్తుదారులుగా అవతారమెత్తితే, బ్యాంకర్ల సహకారంతో ఎంపీడీవోలు నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతూ లబ్ధిదారుల ఎంపిక తతంగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.ఇవి జిల్లాలో రుణాల ఎంపికలో జరుగుతున్న బాగోతానికి మచ్చుతునకలు. ఆయా మండల పరిధిలో ఎంపీడీవోలు, బ్యాంకర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, అనర్హులకు యూనిట్లు దక్కుతున్నాయనే ప్రచారం ఉంది. వీటిపై కలెక్టర్ దృష్టిసారిస్తే అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. -
బీసీ రుణాల్లో భారికోత
స్వయం ఉపాధి బాట పడదామనుకున్న యువత చేతులకు ప్రభుత్వం సంకెళ్లు వేస్తుంది. ఉన్నత చదువులు చదివినా... ఉద్యోగం రాని పురుషులు, మహిళలు స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపినా సర్కార్ వారి ఆశలపై నీళ్లు జల్లుతుంది. బీసీల సంక్షేమానికి హామీ ఇస్తూనే... వారిని సంక్షోభంలోకి నెడుతోంది. వెనుకబడిన తరగతుల యువతకు ఇచ్చే రుణాల్లో కోత విధించింది. బీసీ రుణాలను ఏటా తగ్గిస్తోంది. గతంలో ప్రకటించిన రుణాలు కూడా ఇప్పటికీ మంజూరు చేయలేదు. మళ్లీ జాబితాలు పంపించాలి బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయనున్న యూనిట్లకు మరలా జాబితాలు సమర్పించాలని మండల పరిషత్ అభివృద్ధి, పురపాలక సంఘం అధికారులను కోరాం. గతంలో పంపిన జాబితాను సరిచేసి అందజేయాలని చెప్పాం.- శ్రీహరిరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం బీసీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ఇచ్చే రుణాల్లో భారీ కోత విధించింది. చాలా తక్కువ యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితాను మళ్లీ తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించింది. వివరాలు ఇలావున్నాయి. జిల్లాలో 38 మండలాల్లోని బీసీలకు సంబంధించి 2014-15 సంవత్సరంలో 5547 యూనిట్లను ల క్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను రూ. 1517.60 లక్షలను కేటాయిస్తున్నట్టు పేర్కొంది. జిల్లాలోని 18,89,535 బీసీ జనాభా నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశిస్తూ అర్హతలను ప్రకటించింది. దీని ప్రకారం బీసీ కో-ఆపరేటివ్ సర్వీస్ లిమిటెడ్ అధికారులకు ఎంపీడీవోల ద్వారా అర్హుల జాబితా అందింది. జన్మభూమి కమిటీల ఆమోదంతో పంపించాలని ప్రభుత్వం చెప్పడంతో ఆ మేరకే అర్హుల దరఖాస్తులను అందించారు. దరఖాస్తులు చేసుకున్న వారంతా త్వరలో రుణాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 70 శాతం మేర కోత పెట్టింది. జిల్లాకు గతంలో కేటాయించిన 5547 యూనిట్లకు గాను 1616 యూనిట్లు మాత్రమే మంజూరు చేయాలని ఆదేశించింది. ఇందుకు రూ. 442 లక్షలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. ఇంత భారీ కోత విధించడంతో అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి నివేదించగా వీరిలో 70 శాతం మందిని ఎలా తొలగించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. కొత్త జాబితాను ఫిబ్రవరి 10లోగా నివేదించాలని సర్కార్ చెప్పడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. జాబితా నుంచి తొలగించేవారికి ఏం చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే రుణాలు మంజూరునకు ఆమోదం తెలపాలంటే లబ్ధిదారులు కొంత ముట్టజెప్పాలని కొందరు జన్మభూమి కమిటీ సభ్యులు వసూళ్లు సాగించారు. ఇటువంటివారంతా ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీరుపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, రుణాల్లో భారీ కోత వల్ల బీసీల నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వద్ద చెబుతున్నా వారు సైతం చేతులెత్తేస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు ప్రకటనలు చేస్తూ లోలోన వారికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుండటంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘బీసీ’ సబ్సిడీ 80%
- కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల మార్గదర్శకాల జారీ - రూ.లక్ష లోపు 80శాతం, రూ.1-2లక్షల వరకు 70శాతం - రూ.2-10లక్షల వరకు 60 శాతం సబ్సిడీ సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల్లో సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. రూ.లక్షలోపు రుణాలకు 80శాతం, రూ.లక్ష-2లక్షల వరకు 70శాతం, రూ.2-10 లక్షల వరకు 60శాతం (రూ.5లక్షలకు మించకుండా) సబ్సిడీ అందజేయనుంది. యూనిట్ కాస్ట్ పరిమితిని కూడా గతంలో ఉన్న రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పెంచింది. ఇక బీసీ ఫెడరేషన్లకు ఆర్థిక సహాయాన్నీ భారీగా పెంచింది. సొసైటీల్లో ఒక్కో సభ్యుడికి రూ.లక్ష వరకు సబ్సిడీ, మరో రూ.లక్ష బ్యాంకు రుణంగా అందజేయనున్నారు. అంటే 15 మంది సభ్యులున్న సొసైటీకి రూ.30 లక్షల వరకు అందుతుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. విడివిడిగా కార్యాచరణ.. 2015-16కు సంబంధించి స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలను పట్టణ ప్రాంతా ల్లో రాజీవ్ అభ్యుదయ యోజనగా, గ్రామీణ ప్రాంతాల్లో మార్జిన్ మనీ స్కీం పేరు మీద అమలుచేస్తారు. రూ.లక్షలోపు రుణానికి 80 శాతం, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణంపై 70 శాతం, రూ.2లక్షల నుంచి రూ.10 లక్షలలోపు రుణంపై 60 శాతం (రూ. 5లక్షలకు మించకుండా) సబ్సిడీ అందజేస్తారు. దీంతోపాటు మిగతా సొమ్మును బ్యాంకు నుంచి రుణంగా అందజేస్తారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2014-15 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యూనిట్‌కాస్ట్ రూ.లక్షకు మించకుండా 50 శాతం సబ్సిడీతో మాత్రమే రుణాలిచ్చారు. తాజాగా యూనిట్ కాస్ట్‌ను, సబ్సిడీని భారీగా పెంచారు. ఇక ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేం దుకు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షన్నరకు... పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రూ. 2లక్షలకు పెంచనున్నారు. ఇందుకు సంబంధించి విడిగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. 11 బీసీ ఫెడరేషన్లకు.. బీసీశాఖ పరిధిలోని 11 బీసీ ఫెడరేషన్లకు 2015-16కుగాను సవరించిన కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. 2014-15 వరకు ఒక్కో సభ్యుడికి రూ.25 వేల చొప్పున 15 మంది ఉన్న సొసైటీకి గరిష్టంగా రూ.3.75 లక్షలు రుణం ఇచ్చేవారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక్కో సభ్యుడికి రూ.లక్ష సబ్సిడీ (50శాతం), రూ.లక్ష బ్యాంకు రుణం (50శాతం)గా ఇవ్వనున్నారు. మొత్తంగా 15 మంది సభ్యులున్న సొసైటీకి రూ. 30 లక్షలు (రూ.15 లక్షలు సబ్సిడీ, రూ.15 లక్షలు బ్యాంకు రుణం) అందిస్తారు. ఈ లెక్కన ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు అందజేస్తారు. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలపై కసరత్తు చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల బృందం నాలుగు నెలల కిందే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అన్ని వర్గాలకూ ఒకే రాయితీ విధానాన్ని అనుసరించాలని సూచించింది. అయితే తొలుత బీసీ శాఖకు సంబంధించి విధానాన్ని ప్రకటించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు నూతన విధానం గతంలోనే సీఎం ఆమోదం పొందింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇక మిగతా కార్పొరేషన్లకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. -
పేదరిక నిర్మూలనకే ‘ముద్ర’
చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు రుణాలు: వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే నిరుద్యోగులను స్వయంఉపాధి వైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. పేదరిక నిర్మూలనతోపాటు యువత, చిరు వ్యాపారులు, చేతివృత్తులవారికి తోడ్పాటు అందించేందుకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ) యోజన పథకం ప్రచార కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు శుక్రవారమిక్కడ ప్రారంభించి, లబ్ధిదారులకు రుణపత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలతోపాటు వ్యాపారులు, చేతివృత్తులవారిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ప్రధాని మోదీ భావించారని, అందులో భాగంగానే ముద్ర యోజనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ముద్ర పథకానికి ఆర్బీఐ రూ. 20 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు అర్హులైనవారికి రుణాలు మంజూరు చే స్తారన్నారు. అక్టోబర్ 2 వరకు ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రుణాల మంజూరులో రాజకీయ జోక్యం కూడా ఉండదని చెప్పారు. రుణాల చెల్లింపులో పేదలే ముందుంటారని, మహిళా పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలను 98 శాతం తిరిగి చెల్లించడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు, వ్యాపారులే బ్యాంకులకు బకాయిదారులుగా ఉన్నారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, పీహెచ్డీ చదివినవారు ఫ్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి బాధాకరమన్నారు. దేశంలో 4 కోట్ల మంది ఎంప్లాయీమెంట్ ఎక్స్ఛేంజ్లలో నమోదు చేసుకొని ఎదురు చూస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, జి. కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధికి సమాధి
సబ్సిడీ చెల్లించని సర్కారు పేరుకుపోతున్న బకాయిలు ముందుకురాని బ్యాంకులు సీఎంకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు అయినా లెక్కలేస్తున్న అధికారులు విశాఖపట్నం: ఈ ఏడాది స్వయం ఉపాధి కింద యూనిట్ల ఏర్పాటు సందేహమే. సర్కా రు నుంచి సబ్సిడీ రాక..లబ్ధిదారుల నుంచి రికవరీ లేక బ్యాంక ర్లు ముఖం చాటేస్తున్నాయి. అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి రూ.200 కోట్ల మేర సబ్సిడీ విడుదల కాకపోవడంతో రుణాలిచ్చేం దుకు విముఖత చూపుతున్నాయి. జిల్లా లో ఏటా యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం..ఆనక సబ్సిడీ విడుదల కాక యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం పరిపాటిగా మా రిపోయింది. గతేడాది డిసెం బర్లో ఆదరాబాదరాగా ఎస్సీ, బీసీ కార్పొ రేషన్లకు యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సర్కార్ నేటికి సబ్సిడీ విడుదల చేయలేదు. ఈ ఏడాది కూడా సబ్సిడీ విడుదలవుతుందో లేదోననే ఆందోళన అటు బ్యాంకర్లలోనూ ఇటు అధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. తాజాగా కొత్త గా యూనిట్స్ నెలకొల్పేందుకు సంక్షేమ శాఖలన్నీ సిద్ధమవుతున్నాయి. సబ్సిడీ బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంక ర్లు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. పైగా సంక్షేమ పథకాల లబ్దిదారుల నుంచి రికవరీ పెద్దగా లేకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. దీంతో సబ్సిడీ మొత్తాన్ని డిపాజిట్‌గా పెట్టుకుని రుణాలిస్తామని చెబుతున్నాయి. బ్యాంక ర్ల తీరును తప్పుబడు తూ అధికార పార్టీ ఎ మ్మెల్యేలు జిల్లాకు వ చ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేశారు. బ్యాంకర్లు వ్యాపార ధోరణితో ఆలోచించడం సరికాదని..సామాజిక బాధ్యత కోణంలో చూడాలని ఇటీవల సీఎం కూడా వ్యాఖ్యానించిన ట్టు సమాచారం. సబ్సిడీ బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చినప్పటికీ బ్యాంకర్లు మాత్రం విశ్వసించడం లేదు. సబ్సిడీ విడుదల కాకుం డా రుణం ఇవ్వలేమని తెగేసి చెబుతున్నాయి. బకాయిలన్నీ ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఆశతో లబ్దిదారులెవ్వరూ ఒక్క పైసా చెల్లించడం లేదని..ఈ విధంగా జిల్లాలో రూ.450కోట్లకు పైగా పేరుకుపోయాయని చెబుతున్నారు. బ్యాంకర్ల నుంచి సహాయనిరాకరణ ఎదురవుతున్నా...జిల్లా యంత్రాంగం మాత్రం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనికి సర్కార్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎస్సీ,బీసీ, మైనార్టీ తదితర సంక్షేమ శాఖల ద్వారా 9760 యూనిట్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గతేడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నెలకొల్పిన787 యూనిట్స్‌కు రూ.12.53కోట్ల మేర సబ్సిడీ ఇటీవలే విడుదలైంది. మిగిలిన బీసీ, మైనార్టీ తదితర సంక్షేమ శాఖల ద్వారా గ్రౌండ్ చేసిన యూనిట్స్‌కు నేటికీ సబ్సిడీ మొత్తం విడుదల కాలేదు. ఈనేపథ్యంలో ఈ ఏడాది నిర్ధేశించిన యాక్షన్ ప్లాన్ అమలుపై సందేహాలు ముసురుకున్నాయి. -
మైనార్టీలపై చిన్న చూపేలా..!
బాన్సువాడ : ‘బాన్సువాడకు చెందిన లియాఖత్ అనే యువకుడు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తనకు మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణం ఇవ్వాలని వేడుకున్నాడు. బ్యాంకులో రుణం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు అధికారులతో అనుమతి పత్రం పొందాడు. తీరా మైనార్టీ కార్పొరేషన్‌కు వెళితే బాన్సువాడకు కేటాయించిన టార్గెట్ పూర్తయిందని, ఈ ఏడాది రుణం ఇవ్వలేమని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు అతడి దరఖాస్తును పక్కనపెట్టారు. ఇలా సుమారు 46 మంది దరఖాస్తులను పక్కన పెట్టారు. అయితే జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇంకా లక్ష్యం పూర్తి కాలేదు. అయినప్పటికీ వచ్చిన దరఖాస్తులను పక్కనపెట్టడంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇదీ ఎంఎఫ్‌సి(ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్) తీరు.’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ నిరుద్యోగ యువకులకు 50 శాతం సబ్సిడీ రుణాల కోసం ఇచ్చిన లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 1440 యూనిట్లు. అయితే జిల్లా వ్యాప్తంగా 1389 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా నిజామాబాద్ నగరం నుంచి 609 మంది దరఖాస్తు చేసుకోగా, కామారెడ్డి నుంచి 119, బాన్సువాడ నుంచి 102, ఏడపల్లి నుంచి 74, బీర్కూర్ మండలం నుంచి 50, కోటగిరి మండలం నుంచి 40, వర్నీ మండలం నుంచి 43 దరఖాస్తులు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు వచ్చాయి ఆయా మండలాలకు కేటాయించిన టార్గెట్ కంటే ఈ మండలాల్లో అధికంగా దరఖాస్తులు రాగా, మిగితా మండలాల్లో కేవలం 20లోపే దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ల ద్వారా 842 దరఖాస్తులు రాగా, పబ్లిక్ రిజిస్ట్రేషన్ ద్వారా 547 దరఖాస్తులు ఆన్లైన్లో ఫీడ్ అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టార్గెట్ 1440 యూనిట్లు. కాగా, 1389 దరఖాస్తులే వచ్చారుు. ఇంకా 51 దరఖాస్తులు రావాల్సి ఉంది. అయితే ఎంఎఫ్సీ అధికారులు ఆయా మండలాలకు కేటాయించిన టార్గెట్‌నే పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన ప్రాంతాల్లోనూ టార్గెట్ ప్రకారమే ఎంపిక చేసి, మిగతా దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తాము బ్యాంకు మేనేజర్లను ఒప్పించి రుణాల కోసం ఒప్పించామని, ఎంతో కష్టపడి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, ఎంఎఫ్సీ అధికారులు టార్గెట్ అయిపోయిందంటూ దరఖాస్తులను పక్కనపెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. 1389 దరఖాస్తులు రాగా, వాటిలో లక్ష్యం మించిపోయిన మండలాల నుంచి 432 ద రఖాస్తులను పక్కన పెట్టారనే సమాచారంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 1440 యూనిట్ల లక్ష్యం ఉండగా వాటిలో కేవలం 957 దరఖాస్తులనే పరిశీలించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 51 దరఖాస్తులు తక్కువగా ఉన్నా, వాటిని భర్తీ చేయకుండా, ఏకంగా 432 దరఖాస్తులను పక్కన పెట్టడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు. పబ్లిక్ రిజిస్ట్రేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిలో అసంపూర్తి పత్రాలు ఉన్నా, వాటిని పరిశీ లించలేదని తెలుస్తోంది. లక్ష్యం చేరుకోవడంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బ్యాంకర్లతో ఎంపీడీఓలకు సమన్వయ లోపం కారణంగా లక్ష్యం దరిచేరడం లేదనే ఆరోపణలు ఉన్నా రుు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికల్లా ఈ లక్ష్యం పూర్తి కావాలి. గతంలో మైనారిటీ కార్పోరేషన్ ద్వారా ’లక్ష రుణం తీసుకుంటే గరిష్టంగా లక్షకు రూ.30 వేల రూపాయల సబ్సిడీ అందించే వారు. ఇప్పుడు దీన్ని సగానికి పెంచారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జనాభా ప్రాతిపదికన వీటిని కేటాయించారు. ఈ రుణాల్లో 33 శాతం రుణాలను మహిళలకు అందజేయనున్నారు. అయితే బ్యాంకర్లు, ఎంఎఫ్సీ అధికారులు, మండల పరిషత్ అధికారుల సమన్వయ లోపం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు రుణాలు అందడం లేదని తెలుస్తోంది. కొందరికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి తప్ప అర్హులకు అందడం లేదని సమాచారం. రెండు నెలల్లోపు అర్హులను గుర్తించి వారికి రుణాలు అందించడంలో ఆ శాఖ ప్రచార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీని వల్ల నిధులు వెనక్కి వెళ్ళే అవకాశాలున్నాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్య సాధనకు కృషి చేస్తున్నాం ప్రభుత్వం జిల్లాకు 1440 యూనిట్లకు మంజూ రీ ఇచ్చింది. అయితే బాన్సువాడ, నిజామాబా ద్ తదితర ప్రాంతాల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చాయి. జేసీ ఆదేశా ల మేరకే లక్ష్యానికి మించి దరఖాస్తులు వచ్చిన వాటిని పక్కన బెట్టాం. ప్రస్తుతం 957 దరఖాస్తులను ఎంపిక చేశాం. మిగతా దరఖాస్తుల గురించి నిర్ణయం తీసుకుంటాం. -ప్రేంకుమార్, ఎంఎఫ్‌సి ఈడీ -
ఉపాధికి ‘నిమ్స్‌మే’ తోడ్పాటు
తిరుచానూరు : స్వయంగా ఉపాధి పొందాలనుకునే వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రజైస్(నిమ్స్‌మే) సంస్థ తోడ్పాటు అందిస్తోంది. నిరుద్యోగ యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేం దుకు శిక్షణ కార్యక్రమాలు అందిస్తోంది. ఇంటర్ విద్యార్హత కలిగి, 20 నుంచి 35 ఏళ్ల లోపున్న వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇప్పిస్తోంది. స్వయం ఉపాధితో పాటు పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తోంది. తద్వార నిరుద్యోగ సమస్యను అధిగమించడంతో పాటు ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీస్ అండ్ ఎంటర్ప్రైనియర్(నిఫ్టే) సౌజన్యంతో నిమ్స్‌మే సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్(ఆహార సంస్కరణ పరిశ్రమ) కోర్సులో శిక్షణ ఇస్తోంది. తిరుచానూరు రోడ్డులోని మహిళా ప్రాంగణంలో చేపట్టిన 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో 50 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిని తిరుపతి పరిసరాల్లోని వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు తీసుకెళ్లి అక్కడ నిపుణులతో శిక్షణ ఇప్పించి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే వివిధ విభాగాలకు చెందిన నిష్ణాతులతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటులో సాంకేతిక సమస్యలను అధిగమించడం, తయారుచేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌లో మెళకువలు, సూచనలు ఇప్పిస్తున్నారు. సర్టిఫికెట్లతో బ్యాంకు రుణాలు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నిమ్స్‌మే సంస్థ సర్టిఫికెట్లు అందిస్తుంది. సర్టిఫికెట్ ఉన్న వారికి వివిధ బ్యాంకులు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణ సౌకర్యం కల్పిస్తున్నాయి. తద్వార ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తాము సంపాదిస్తూ పది మందికి ఉపాధి కల్పించేందుకు ఆస్కారం ఉంటోంది. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో ఉద్యోగావకాశాలకు నిమ్స్‌మే అందిస్తున్న సర్టిఫికెట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్వయం ఉపాధిపై మక్కువ బీటెక్ చదివాను. ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కంటే స్వయం ఉపాధిపైనే మక్కువ. ఇంట్లోనే కుటీర పరిశ్రమ నెలకొల్పి పది మందికి ఉపాధి కల్పించాలన్నదే నా కోరిక. అయితే ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత లేదు. నిమ్స్‌మే అందిస్తున్న శిక్షణ ద్వారా నాకున్న సందేహాలు తొలగిపోయాయి. - తులసీమాల, ఎస్టీవీ నగర్, తిరుపతి ఇంటి వద్ద నుంచే సంపాదన నేను గృహిణిని. బీఏ చదివినప్పటికీ ఉద్యోగంపై ఆసక్తి లేదు. అయితే ఇంట్లోనే ఉంటూ సంపాదించాలని భావించాను. ఇదే సమయంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలుసుకుని వచ్చాను. శిక్షణలో పలు విషయాలు తెలిశాయి. ఇంట్లోనే చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి పదిమందికి ఉపాధి కల్పిస్తా. - పద్మజ, బీఏ, బైరాగిపట్టెడ సొంతంగా వ్యాపారం చేయాలి ఫార్మశీ పూర్తి చేసి చెన్నైలోని డెల్ కంపెనీలో పనిచేస్తున్నా. సొంతంగా వ్యాపారం చేయాలన్నది కోరిక. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి మరింత అభివృద్ధి చెందనుంది. ఇదే అనువైన సమయం. చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇక్కడ తీసుకుంటున్నా. మాంసం, డెయిరీ ప్రాడెక్టుల పరిశ్రమను నెలకొల్పుతా. - బాలమురళి, ఎస్టీవీ నగర్, తిరుపతి పాల ఉత్పాదనపై ఆసక్తి మెకానికల్ డిప్లొమో పూర్తి చేసినప్పటికీ నాకు పాల ఉత్పాదనపై ఆసక్తి ఎక్కువ. దీంతోనే ప్రయివేటు జాబ్‌ను వదిలిపెట్టేశాను. ఇంట్లో ఉన్న ఆవు ద్వారా లభించే పాలతో రకరకాల తినుబండారాలు తయారు చేస్తుంటాను. పూర్తి స్థాయిలో అవగాహన కోసం శిక్షణ తీసుకుంటున్నా. శిక్షణ పూర్తికాగానే సొంతంగా చిన్న పరిశ్రమ ఏర్పాటు చేస్తా. - వీ.దిలీప్‌కుమార్, ఖాదీకాలనీ, తిరుపతి -
రంగమేదైనా పట్టుదల అవసరం
సినీనటుడు ఫిష్ వెంకట్ కాజీపేట : పని చేయాలనే తపన, సాధించాలనే పట్టుదలతో కార్యాచరణలోకి దిగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సినీ హాస్యనటుడు మంగిళిపల్లి(ఫిష్) వెంకట్ అన్నారు. అత్యాధునిక వసతులతో కాజీపేటలో ప్రారంభమైన మిరాకిల్ సిజర్స్ బ్యూటీపార్లర్ వంద రోజుల వేడుకలను శనివారం వెంకట్ ప్రారంభించారు. పార్లర్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువత ముందుకుసాగాలన్నారు. పేద కుటుంబంలో పుట్టిన హరికృష్ణ..మిత్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారంతో జావేద్ హబీబ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ తీసుకుని కాజీపేటలో బ్యూటీపార్లర్ స్థాపించడం అభినందనీయమన్నారు. కులవృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు మరింతగా రాయితీలు ఇచ్చి యువతను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరారు. అనంతరం ఫిష్ వెంకట్‌ను మిరాకిల్ సిజర్స్ సంస్థ డెరైక్టర్ కొత్తపల్లి హరికృష్ణ శాలువ, మెమొంటోతో సత్కరించారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలకంటి శ్రీనివాస్, ఆర్.లక్ష్మణ్ సుధాకర్, కొండా అశోక్ యాదవ్, ఎస్పీ ప్రభాకర్, కొత్తపల్లి సదానందం, శివకృష్ణ, వెంకటకృష్ణ, భద్రయ్యగౌడ్ పాల్గొన్నారు. ‘ఆది’ సినిమాతోనే గుర్తింపు - ఫిష్ వెంకట్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాతో సినీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు వచ్చిందని హాస్యనటుడు ఫిష్ వెంకట్ అన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం కాజీపేట వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఒరేయ్.. తమ్ముడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాను ఇప్పటి వరకు 90 సినిమాల్లో నటించానని చెప్పారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో గంగపుత్ర కుటుంబంలో పుట్టిపెరిగిన తాను మూడో తరగతి వరకే చదువుకున్నానని తెలిపారు. సినిమాల్లో చాలామంది వెంకట్లు ఉండడంతో తనను సులభంగా గుర్తుపెట్టుకునేందుకు ఫిష్ వెంకట్‌గా పిలిచేవారని, తర్వాత అదే పేరు స్థిరపడిపోయిందన్నారు. తనతో విలక్షణమైన పాత్రలు చేయిస్తూ ప్రోత్సహిస్తున్న దర్శకుడు వీవీ వినాయక్ తనకు గాడ్‌ఫాదర్ అన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మిత్రుడు దివంగత శ్రీహరిని ఏనాడూ మర్చిపోలేనన్నారు. హీరోగా చేసేందుకు రెండు సినిమాలు ఒప్పుకున్నానని, ఈ ఏడాదే అవి ప్రారంభం కావొచ్చని వెల్లడించారు. సినీ ప్రపంచం పైకి బాగానే కనిపిస్తుందని కానీ అందులోనూ బోలెడన్ని బాధలుంటాయని వెంకట్ తెలిపారు. తనకు బాగా నచ్చిన ప్రాంతం వరంగల్ అని, ఇక్కడ తనకు ఎందరో మిత్రులు ఉన్నారని చెప్పే వెంకట్ తను నటించిన నాలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
మోక్షమెప్పుడో..?
ఖమ్మం హవేలి: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు సెట్‌కం(యువజన సర్వీసుల శాఖ) ద్వారా అందించే రుణాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి విధివిధానాలు రాలేదు. దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌లో ప్రతి జిల్లాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో లక్ష్యం నిర్దేశించి అందుకు సంబంధించిన విధి విధానాలను జిల్లాల్లోని సెట్‌కం కార్యాలయాలకు పంపిస్తారు. దీని ప్రకారం జిల్లా స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తారు. ఆయా మండలాలకు నిర్ణయించిన బ్యాంకు శాఖల వారీగా స్వయం ఉపాధి రుణాల ప్రక్రియ ఎలా నిర్వహించాలో ఇందులో పొందుపరుస్తారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్థాయి కమిటీ అప్రూవల్ తరువాత కార్యాచరణ ప్రణాళిక వివరాలను జూన్‌లో నిర్వహించే డీఆర్సీ సమావేశంలో ప్రవేశపెడతారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న జిల్లా స్థాయి కమిటీ అప్రూవల్ తరువాత జూలైలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. స్వయం ఉపాధి పొందగోరు నిరుద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తుల ప్రకారం మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైనవారు లోన్ ఖాతా, లబ్ధిదారు ఖాతాలను ప్రారంభించాలి. బ్యాంక్ కాన్సెంట్ ఇచ్చిన తరువాత లబ్ధిదారు ఖాతాలో సబ్సిడీ, లోన్ ఖాతాలో బ్యాంక్ రుణం వేస్తారు. అనంతరం యూనిట్లను గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంపై ప్రభావం.. క్రమపద్ధతి ప్రకారం ప్రక్రియ కొనసాగితే యూనిట్లు గ్రౌండ్ అయ్యేవరకు సంవత్సర కాలం పడుతుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఇంకా విధివిధానాలు ఎప్పుడో వస్తాయో కూడా తెలియడం లేదు. ఇంకా ఆలస్యం అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సబ్సిడీ పెంచితే మేలు.. సెట్‌కం ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణాలకు రూ.30 వేలకు మించి సబ్సిడీ ఇవ్వడంలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్లో మొత్తం 50 శాతం సబ్సిడీగా ఇస్తున్నారు. సెట్‌కం ద్వారా కూడా 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గత ఏడాది 365 యూనిట్లు గ్రౌండింగ్.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సెట్‌కం ద్వారా పరిశ్రమలు, సేవల రంగానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో 365 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఈ యూనిట్లకు సంబంధించిన ప్రాజెక్టుల విలువ రూ.3.26 కోట్లు కాగా వీటికి సంబంధించి రూ.1.10 కోట్ల మేర నిరుద్యోగులకు సబ్సిడీ అందింది. -
‘సాక్షి మైత్రీ మహిళ’కు విశేష ఆదరణ
తిరుపతి కల్చరల్: సాక్షి దినపత్రిక, టీవీ, పిడిలైట్, ఉషా కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి నగరంలో నిర్వహించిన సాక్షి మైత్రీ మహిళ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో భాగంగా బైరాగిపట్టెడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యువలరీ అండ్ ఫ్యాషన్ డిజైన్ సంస్థ కార్యాలయంలో గృహిణులకు స్వయం ఉపాధికై చేతి వృత్తులపై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని సుమారు 80 మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి మైత్రీమహిళ రాయలసీమ ప్రోగ్రామ్ ఇన్చార్జి జే.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి తద్వారా వారు ఆర్థికంగా ఎదిగి తమవంతు కుటుంబానికి ఆదరణగా నిలపాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తం గా సాక్షి మైత్రీ మహిళ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లాలో చిత్తూరులో కూడా నిర్వహించామని, తిరుపతి నగరంలో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నా రు. ఐదు రోజుల పాటు మహిళలకు ఉచితంగా హస్తకళల తయారీ, టైలరింగ్, పెయింటింగ్ వంటి చేతివృత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శిక్షణలో పాల్గొనే మహిళలకు ఎలాంటి విద్యాప్రామాణికం లేదన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అంద జేయడంతో పాటు సాక్షి మైత్రీ మహిళలో సభ్యత్వం కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఆసక్తి గల మహిళలు 9505555020, 9640131153ను సంప్రదించాలని ఆయన కోరారు. అనంతరం ఎన్ఎఫ్ఐ సంస్థ డెరైక్టర్ మాదిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సాక్షి మైత్రీ మహిళ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పడిలైట్, ఉషా కంపెనీ ప్రతినిధు లు మహిళలకు హస్తకళలు, టైలరింగ్ వృత్తులపై శిక్షణ కల్పించారు. చిత్తూరులో రెండోరోజూ ‘సాక్షి’ మైత్రీమహిళ చిత్తూరు(సిటీ) : పిడిలైట్ సంస్థ, సాక్షి దినపత్రిక-టీవీ సంయుక్త ఆధ్వర్యంలో గృహిణుల కోసం నిర్వహిస్తున్న సాక్షి మైత్రీమహిళ కార్యక్రమం రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. స్థానిక పీసీఆర్ ప్రభుత్వ వృత్తివిద్యా కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు మహిళలు హాజరై పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఇతర హేండీక్రాఫ్ట్స్పై శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రో గ్రామ్ కో-ఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గృిహ ణులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పా రు. మరో మూడు రోజుల పాటు చిత్తూరు నగరంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిడిలైట్ సంస్థకు చెందిన ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు. -
‘నారే’ నీరు పోస్తోంది!
ఇక్కడ కొబ్బరినారతో తాళ్ళు నేస్తున్న అమ్మాయిపేరు షిజి. చిన్నతనంలో పెళ్లయిన షిజి భర్తకు సాయంగా ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించాలనుకుంది. కొబ్బరిపీచుతో తాళ్లను నేయడం నేర్చుకుని ఇంటి దగ్గరే పని మొదలుపెట్టింది. రోజుకి 75 తాళ్లను నేస్తున్న షిజి సంపాదన రోజుకి 250 వరకూ ఉంటోంది. రోజుకూలీగా పనిచేస్తున్న భర్తకు సమానంగా డబ్బు సంపాదిస్తున్న షిజి లాంటివారు కేరళలో చాలామంది ఉన్నారు. అలప్పుళా జిల్లాలోని నెడుమ్ పరక్కాడ్ గ్రామానికి చెందిన షిజి తనలాంటివారితో చేయి కలిపి ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో తాళ్లను తయారుచేసే యంత్రాన్ని కొన్నారు. వీరు నేసిన సన్నతాళ్లకు రంగులేసి ఆ యంత్రం సాయంతో పెద్దసైజు తాళ్లను తయారుచేసి మార్కెట్‌కి పంపుతున్నారు. స్వయం ఉపాధితో తమ కాళ్ళమీద తాము నిలబడుతున్నారు.