
‘ఉపాధి’పై భరోసా ఇచ్చేనా?
నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఏటా మంజూరు చేస్తున్న ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాల మంజూరు అనుమానంగా మారింది.
ఏలూరు, న్యూస్‌లైన్: నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఏటా మంజూరు చేస్తున్న ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాల మంజూరు అనుమానంగా మారింది. 2013-14 ఏడాదికి సంబంధించి ఉపాధి యూనిట్ల స్థాపనకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జనవరిలో జారీ చేసింది. అనంతరం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులకు యూనిట్ల మంజూరుపై బ్యాంకులకు మార్గదర్శకాలు కూడా సర్కారు జారీ చేసింది. అయితే మార్చి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నెల 26తో ఎన్నికల కోడ్ ముగియనుంది. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా జూన్ రెండున కొత్త ప్రభుత్వాలు కొలువు తీరనున్నాయి. ఆ తర్వాతే ఉపాధి యూనిట్ల స్థాపనపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.
టీడీపీ సర్కారు అంగీకరిస్తుందా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం అంగీకరిస్తుందా అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఇదే జరిగితే నిరుద్యోగులకు ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాలు ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సబ్సిడీ మొత్తాలను పెంచేసింది. ఉపాధి యూనిట్ల స్థాపనకు సంబంధించి ఏటా సెప్టెంబర్ నాటికే గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం జారీ చేసేది. ఎన్నికల దృష్ట్యా ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు సబ్సిడీని 30 శాతం నుంచి 60 శాతం వరకు పెంచింది. వీటి ఎంపికలో సవాలక్ష నిబంధనలు పెట్టడంతో బ్యాంకర్లు ఒక్కరికి కూడా రుణాలు మంజూరు చేయలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి యూనిట్లకు 21 నుంచి 40 ఏళ్ల లోపు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 21-45 సంవత్సరాల లోపు వయోపరిమితికి కుదించారు. దీంతో అప్పటి వరకు అర్హులైన చాలా మంది అనర్హులుగా మారారు.
8,418 మంది లబ్ధిదారుల ఎంపిక
జిల్లాలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ల నుంచి రూ.65 కోట్ల వ్యయంతో 8,418 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి వ్యక్తిగత యూనిట్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. బీసీ కార్పొరేషన్ పరిధిలో రూ.26 కోట్లతో 4,518 యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించగా 938 మందికి మాత్రమే రూ. 2.86 కోట్ల సబ్సిడినీ మంజూరు చేస్తూ అధికారులు ఆదేశాల జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3,914 మందికి రూ.39.01కోట్లతో యూనిట్ల స్థాపన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఇందులో 1456 మందికి రూ.5.96 కోట్లు సబ్సిడీని ఇవ్వాలని ప్రభుత్వానికి ఎస్పీ కార్పొరేషన్ అధికారులు సిఫార్సు చేశారు. వీటిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.