
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పిల్లపాళెం వద్ద స్వర్ణముఖి నదిలో జేసీబీతో అక్రమంగా జరుపుతున్న ఇసుక తవ్వకాలు
ఉచితం ముసుగులో లూటీకి తెగబడుతున్న పచ్చ ముఠాలు
రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌లలో పాగా.. ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు
సామాన్యులకు అవస్థలు.. కార్మీకులు విలవిల
నిత్యం వందలాది టిప్పర్లు.. వేలాది ట్రాక్టర్లతో అక్రమ వ్యాపారం
మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలోనే దందా
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు పెద్ద ఎత్తున అక్రమ రవాణా
జేసీబీలు, పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వడంతో నదులకు గర్భశోకం
స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేలకు.. వారి నుంచి ముఖ్యనేతకు ముడుపులు
కళ్లెదుటే కొల్లగొడుతున్నా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షకపాత్ర
చూడు నాగిరెడ్డి..! నేను ఎన్నికల్లో రూ.10 లక్షలు ఖర్చు చేశా. మా ఊరి నుంచి ఇసుక నేనే తవ్వుకుంటా. ఎవరూ అడ్డు రావద్దు..!
నేను ఎమ్మెల్యే (జయనాగేశ్వరరెడ్డి)కి చెప్పి ఇసుక తోలుతున్నా. సీఐకి రూ.50 వేలు ఇచ్చినా..! నా టిప్పర్‌తోనే ఇసుక తోలుతా. ఇసుక బండి ఆపేదెవడు? దమ్ముంటే రమ్మను!
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం టీడీపీ నేతలు గురజాల జయరాముడు, రాయచోటి నాగిరెడ్డి ఫోన్ సంభాషణ ఇదీ!
నాకు తెలియకుండా మట్టి తోలుతున్నావ్..! నాకు చెప్పాలి కదా..? బండ్లు మనయే ఉన్నాయ్..!రామలింగారెడ్డి (ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కుడి భుజం)తో మాట్లాడా..! ఎమ్మెల్యే.. తహసీల్దార్‌కు కూడా చెప్పాడు. మట్టి శాంపిల్ కూడా తీశా. మనమే ఒకటిగా లేకుంటే ఎట్టా...? వచ్చే డబ్బులో రామలింగారెడ్డి వాటా ఆయనకు పోతాది. వైఎస్సార్‌సీపీ వాళ్లు బండ్లు ఆపుతున్నారు..ఆపోజిట్ వాళ్లు ఎవడైనా బండి ఆపితే టిప్పర్‌తోనే కొడతా..! రమ్మను..!
- శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో టీడీపీ నేతలు క్రాంతి కుమార్, శ్రీనివాసులు ఫోన్ సంభాషణ ఇదీ!!
మీ ఓనర్‌కు ఫోన్ చేసి రెండు నెలలైంది.. ఎమ్మెల్యే వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పినా కలవలేదు. మీ ఓనర్ వచ్చి మాట్లాడే దాకా లారీ స్టేషన్‌లోనే ఉంటుంది..
-లారీ డ్రైవర్ లంకన్నకు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పీఏ నాగరాజు గౌడ్ బెదిరింపులు!
ఉచిత ఇసుక పేరుతో పచ్చ ముఠాలు ఏ స్థాయిలో బరి తెగించి సామాన్యులపై రౌడీయిజం చేస్తున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే! టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు నదులు, వాగులు, వంకల్లో ఇసుకను యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం అండతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని వాటాలు పంచుకు తింటున్నారు. ఆరు లారీలు.. మూడు ట్రాక్టర్లు అనే రీతిలో ఈ అక్రమాల పర్వం రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా సాగుతోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీలు లాంటి భారీ యంత్రాలతో నదీ గర్భాలను గుల్ల చేస్తున్నారు.
పేరుకు ఫ్రీ అంటున్నా ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. 18 టన్నుల లారీ ఇసుకను రూ.30 వేల నుంచి 60 వేల వరకూ అమ్ముతున్నారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీఎత్తున ఇసుక నిత్యం అక్రమంగా తరలిపోతోంది.
అన్నిచోట్లా కూటమి ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. కమీషన్లు కరకట్ట బంగ్లాకు ఠంచనుగా చేరిపోతున్నాయి. ముఖ్యనేతకు కప్పం కట్టి ఎక్కడికక్కడ నదులు, వాగులను కొల్లగొట్టేస్తూ రూ.వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.
– సాక్షి, అమరావతి, నెట్‌వర్క్
తెలంగాణకు అక్రమ రవాణా
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఇసుక దందాలో ఆరితేరిపోయారు. పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం, శనగపాడు గ్రామాల నుంచి రాత్రిళ్లు తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆళ్లూరుపాడు ఇసుక క్వారీ నుంచి పొక్లెయిన్‌లు, జేసీబీలతో లోడు చేసి లారీ లోడు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు.
నందిగామ నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అనుచరులు ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా లారీకి రూ.10 వేలు చొప్పున వసూలు చేసి ఎంత కావాలన్నా సై అంటున్నారు. మున్నేరు నుంచి ఇసుక అక్రమంగా వైరా, మధిర తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. నిషేధిత జాబితాలో ఉన్న యనమలకుదురు, హైకోర్టు స్టే పరిధిలో ఉన్న పెదపులిపాక, సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన చోడవరం క్వారీల్లో సైతం యంత్రాలతో పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.
అమరావతిలో యథేచ్చగా అక్రమాలు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు, అబ్బురాజుపాలెం గ్రామాల్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేసి రాత్రి పూట బయట ప్రాంతాలకు చేరవేస్తున్నారు. మంత్రి లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని గొడవర్రులో పొక్లెయిన్‌లతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. గుండిమెడ, పాతూరు, చినరావూరులో అనుమతులు లేకపోయినా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తోడేస్తున్నారు. కొల్లిపర, తెనాలి, చెరుకుపల్లి మండలాల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మల్లాది గ్రామం, అచ్చంపేట మండలం చింతపల్లి నుంచి ఇసుక అక్రమంగా కూటమి నేతలు తరలిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో ఇసుక హైదరాబాద్‌కు తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో పెసర్లంక, గాజుల్లంక, వోలేరు ప్రాంతాల్లోని కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు రేయి పగలు తేడాలేకుండా యంత్రాలతో తోడేస్తున్నారు.
నెల్లూరు.. అందరూ అందరే..
నెల్లూరు జిల్లాలో పెన్నానదిలోని సంగం, సూరాయపాలెం, పోతిరెడ్డిపాలెం డీ సిల్టింగ్ పాయింట్లకు గడువు పూర్తయినా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సూరాయపాలెంలో ఓ అధికార పార్టీ నేత నేరుగా నదిలోకి రహదారి ఏర్పాటు చేసి హిటాచీతో 12 టైర్ల టిప్పర్లకు లోడింగ్ చేస్తున్నారు. పల్లిపాడులో ఓపెన్ రీచ్‌లో యంత్రాలు ఉపయోగించి లోడింగ్ జరుగుతోంది.
ఆత్మకూరు, వెంకటగిరి, కోవూరు, నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో భారీ యంత్రాలతో పెన్నా నదిలోకి బాటలు వేసి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. రోజుకు 200కు పైగా టిప్పర్లు చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. లోకేశ్ టీమ్ పేరుతో మన్నేరు నుంచి టీడీపీ నాయకులు భారీగా ఇసుకను తరలిస్తున్నారు. కరేడు అటవీ భూముల్లో టీడీపీ నాయకుడు పోలుబోయిన శ్రీనివాసులు ఇసుకను హేచరీలకు తరలించారు.
ప్రకాశంలో ఇష్టారాజ్యం
ప్రకాశం జిల్లాలో ఇసుక మాఫియా చెప్పిందే వేదంగా నడుస్తోంది. అన్నిచోట్లా టన్నుకు రూ.200 నుంచి రూ.500 వరకు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో అక్రమ రవాణా జరుగుతోంది. కొండపి నియోజకవర్గం నుంచి ఒంగోలుకు ఇసుక తరలించే విషయంలో దామచర్ల సోదరుల వర్గీయుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు.
దామచర్ల అనుచరుల ప్రైవేటు సైన్యం వేధింపులు భరించలేక టిప్పర్ల యజమానులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. దర్శిలో టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కనుసన్నల్లో మాఫియా చెలరేగుతోంది. మార్కాపురంలో కూటమి నాయకుల నేతృత్వంలో ఇసుక విక్రయాలు సాగుతున్నాయి.
పశ్చిమలో ఎడాపెడా బాదుడు
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు రీచ్‌లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో మూసివేసినందున ఇసుక దొరకడంలేదు. దీంతో తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, జొన్నాడ, గోపాలపురం తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ లారీకి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ర్యాంపు నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు.
భీమవరానికి లారీ ఇసుక చేరవేసేందుకు రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాకు రోజుకు 500 నుంచి 600 ట్రిప్పుల వరకు ఇసుక రవాణా జరుగుతుండగా.. అదనపు వసూళ్ల రూపంలో జిల్లాలోని వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోంది.
గోదావరి గుల్ల గుల్ల..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరిని గుల్ల చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో సైతం తవ్వకాలు జరుగుతున్నాయి. కోటిలింగాల, కొవ్వూరు ర్యాంపుల్లో నిషేధిత డ్రెడ్జింగ్ అడ్డగోలుగా సాగుతోంది. ఒక్కో ర్యాంపు నుంచి రోజుకు 50కి పైగా లారీల్లో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ (18 టన్నులు) ఇసుకను రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ విక్రయిస్తున్నారు.
రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై రోడ్ కమ్ రైల్వే వంతెన, గామన్ వంతెనల సమీపంలో ఇసుక తవ్వకాలను నిషేధించారు. బ్రిడ్జిలు దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున అక్కడ ఇసుక తవ్వకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయినా కూటమి నేతలు లెక్క చేయకుండా రెండు బోట్ల ద్వారా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అనుమతి లేకుండానే పలు ప్రాంతాల్లో యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్విన గోతుల్లో ఇటీవల కొత్తపేట గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు దుర్గాప్రసాద్ స్నానానికి దిగి మునిగిపోయి మరణించాడు.
సిక్కోలులో మంత్రులకు వాటాలు!
శ్రీకాకుళం జిల్లాలో అంబళ్లవలస, బట్టేరు, అంగూరు, బూరవల్లి, గార, గోపాల పెంట, కాఖండ్యాంలోని రీచ్‌లను కూటమి నేతలు తమకు కావాల్సిన వారికి ఇప్పించుకుని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలో సైలెంట్‌గా ఓ సెంట్రల్ మినిస్టర్.. వయలెంట్‌గా మరో మినిస్టర్ వాటాలు వసూలు చేసుకుంటున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన బినామీలతో రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.
ఆమదాలవలసలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు బూర్జ మండలం నారాయణపురం, చిన అంకలాం వద్ద భారీ లారీల్లో ఇసుక తరలించేస్తున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇసుక రీచ్‌లను సొంత జాగీర్లుగా మార్చుకుని రాజ్యమేలుతున్నారు.
పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇసుక వ్యాపారాన్ని ఇష్టానుసారం సాగిస్తున్నారు. ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇసుక తన సరిహద్దు దాటాలంటే లారీకో రేటు ఫిక్స్ చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో ఇసుక డంపింగ్ కేంద్రాలు పెట్టించి తన కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులకు ఇసుకలో వాటాలు ఇస్తున్నారు.
చిత్తూరు టు కర్ణాటక, తమిళనాడు
తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నది, అరుణానదిలోని ఇసుకను ఒక ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు భారీ యంత్రాలతో తోడి కర్ణాటక, తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ ఇసుక రూ.60 వేల చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల అనుచరులు, బంధువులే కీలక పాత్రపోషిస్తున్నారు.
నాయుడుపేట మండలం అన్నమేడు, మర్లపల్లి, భీమవరంలో స్వర్ణముఖి నదినుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తండ్రి పేరుతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. చిత్తూరు రూరల్ మండల పరిధిలో బీఎన్‌ఆర్‌పేట రీచ్‌ను టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు అనుచరులు అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారానికి తెర తీశారు. పలమనేరు నియోజక వర్గ పరిధిలోని కౌండిన్య నది, జీడిమాకనపల్లి, పెద్దచెరువులో కేటిల్ఫాం నుంచి వైయస్సార్ జలాశయం దాకా ఇసుకను ట్రాక్టర్లలో తోడి నిల్వ చేస్తున్నారు.
కర్నూలులో దర్జాగా దందా
కర్నూలు జిల్లాలోని కర్నూలు, కల్లూరు మండలాల పరిధిలో తుంగభద్ర, హంద్రీ నదుల్లో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. సుంకేసుల, మునగాలపాడు, నిడ్జూరు, పంచలింగాల తదితర గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గ్రామానికి ఒకరిని నియమించుకుని దర్జాగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు.
కర్నూలు జిల్లా మునగాలపాడు సమీపంలో తుంగభద్ర నదీ తీరంలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్న అక్రమార్కులు
పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు హైదరాబాద్‌కు తరలి వెళుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.10 వేలు చొప్పున పోలీసు అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. రీచ్‌ల వద్ద అదనంగా రూ.1,000 వసూలు చేస్తున్నారు. టిప్పర్‌కు రూ. 15 వేలు ఇవ్వాల్సిందే. ఈ డబ్బంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు చేరుతోంది.
వైఎస్సార్ జిల్లాలో పచ్చ నేతల చేతివాటం
వైఎస్సార్ జిల్లాలో కొండాపురం మండలం బెడుదూరు నుంచి స్థానిక టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పెండ్లిమర్రి, కమలాపురం మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరులు అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు.
నాగావళిని చెరబట్టిన ఇసుకాసురులు
విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో టీడీపీ నాయకులు నాగావళిని చెరబట్టారు. జావాం సమీపంలో రెండు పొక్లెయినర్లతో రాత్రీపగలు తవ్వుతున్నారు. బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పెంట, అలజంగి, కారాడ గ్రామాల వద్ద వేగావతీ నదీతీరంలో ప్రభుత్వ ఇసుక రీచ్ లేకపోయినా వేలం పాట నిర్వహించి మరీ ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో నాగావళి నదీతీరం వెంబడి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కనుసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి.
వేదవతిని ఊడ్చేస్తున్న తమ్ముళ్లు..
అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గంలో ఇసుక అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్, రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో వేదావతి హగరి నది చుట్టూ కర్ణాటక సరిహద్దు ఆనుకుని ఉంది. టీడీపీ నాయకులు చీకటి పడగానే జేసీబీలతో టిప్పర్లలో ఇసుక లోడ్‌చేసి బళ్లారి, బెంగళూరు, తుమకూరు, చిత్రదుర్గం, సండూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇసుక అడ్డగోలుగా అక్రమ రవాణా జరుగుతోంది. చిత్రావతి, పెన్నా, కుముద్వతి, జయమంగళి నదులను జేసీబీలతో తోడేస్తున్నారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నాటకకు భారీగా ఇసుక తరలిస్తున్నారు. రొద్దం, చిలమత్తూరు, పుట్టపర్తి, గోరంట్ల, హిందూపురం నుంచి రాత్రింబవళ్లు ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిపోతోంది.