కూటమి పాలనలో హడలెత్తిపోతున్న ఆడబిడ్డలు
4 నెలల్లో 74 అత్యాచారాలు, లైంగిక వేధింపులు
వారిలో ఆరుగురు దారుణ హత్య
వేధింపులు భరించలేక మరో ఐదుగురు బలవన్మరణం
కాలకేయులుగా మారి మహిళలను కాటేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు.. పింఛన్ కావాలన్నా... ఇంటి పట్టా ఇవ్వాలన్నా తమ కోరిక తీర్చాలని పట్టు
బద్వేలు ఘటన మరువక ముందే తెనాలిలో యువతిపై పెమ్మసాని అనుచరుడి పాశవిక దాడి
వెంటిలేటర్‌పై అత్యంత విషమంగా బాధితురాలు
యువతులపై అఘాయిత్యాలకు పాల్పడి చంపేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
‘రెడ్‌బుక్’కు సలాం చేస్తూ చేతులెత్తేసిన పోలీసులు
‘దిశ’, మహిళల భద్రతను నీరుగార్చేసిన సర్కారు
నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై దారుణం.. కనికరం లేకుండా ఆ చిన్నారి హత్య... ఆ ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం.. ఆ వెంటనే వైఎస్సార్ జిల్లాలో యువతిపై లైంగిక దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేయడం.. అంతలోనే గుంటూరు జిల్లాలో యువతిపై అత్యాచారం చేసి తలపై కొట్టడంతో బ్రెయిన్ డెడ్ కావడం... ఇలా అక్క చెల్లెమ్మలపై రోజుకో అఘాయిత్యం!
ఈ నాలుగు నెలల్లో ఏకంగా 74 మంది మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు.. వీరిలో ఆరుగురు హత్యకు గురవ్వగా మరో ఐదుగురు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో వీటినిబట్టి తెలుసుకోవచ్చు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక హత్యాచారాలు.. హత్యలు.. దాడులు.. వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. గత ఐదేళ్ల పాటు రక్షణ కల్పించిన ‘దిశ’ వ్యవస్థను నీరుగార్చేశారు. ఈ ఘటనలన్నీ నమోదైనవి మాత్రమేనని, రికార్డులకెక్కనవి ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయని సాక్షాత్తు హోం మంత్రి అనిత వ్యాఖ్యానించడం కొసమెరుపు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన ‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని’ తలపిస్తోంది. అడ్డూ, అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో యువతులు, బాలికల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి.
ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలే తమను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దంపడుతోంది. ఉద్యోగానికి వెళ్లిన మహిళ... కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని... తుదకు వీధిలో ఆడుకుంటున్న బాలికలు ... ఇంట్లో ఉన్న చిన్నారుల భద్రతకు సైతం భరోసా కరువైంది. ఉదయం నిద్రలేచి దినపత్రిక తెరిచినా... టీవీలో న్యూస్ చానల్ పెట్టినా.. అత్యాచారం వార్త కనిపించడం సర్వసాధారణమైంది.
సాక్షి, అమరావతి: దసరా పండుగ నాడు తిరుమల బ్రహ్మోత్సవాలు గానీ... విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రసారాలు గానీ.. వస్తాయని టీవీ పెడితే... అనంతపురం జిల్లాలో అత్తా కోడళ్లను వేటకొడవళ్లతో బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడిన దురాగతం గురించిన వార్తలు చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఆ ఘటన మరువక ముందే వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో శనివారం ఓ యువతిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
తీవ్రంగా గాయపడిన యువతి కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఇక తాజాగా తెనాలిలో టీడీపీ నాయకుడు, రౌడీషీటర్ ఏకంగా ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె తలపై బలంగా కొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆదివారం వచ్చిన వార్త సంచలనం సృష్టింది.
ఇవీ.. 4 నెలలుగా రాష్ట్రంలో యథేచ్చగా
సాగుతున్న అత్యాచారాలు, హత్యలకు కొన్ని ఉదాహరణలు. ఒకప్పటి చంబల్ లోయ, బిహార్‌లోని దారుణాలను తలదన్నేలా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై బరితెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏం చేసినా సరే తమకు అడ్డేముందన్న అధికార మదంతో టీడీపీ రౌడీలు, గూండాలు తెగబడి మహిళలు, బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడిగడుతున్నారు. అంతటితో ఆగని కొందరు ఆపై దారుణంగా హత్యలు చేసి దర్జాగా జారుకుంటున్నారు.
నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 74మంది మహిళలు, బాలికలు లైంగిక దాడులకు గురయ్యారు. వీరిలో ఆరుగురిని హత్య చేయడం వారి బరి తెగింపునకు నిదర్శనం. వేధింపులు భరించలేక ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి అధికారికంగా కేసులు నమోదు చేసిన ఘటనలే. టీడీపీ గూండాలకు భయపడి ఫిర్యాదు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి.
పెన్షన్.. ఇంటి పట్టా కోసం కోర్కె తీర్చాలని..
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం టీడీపీ పరిశీలకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాయచోటికి చెందిన ఖాదర్‌బాషా తనకు పెన్షన్, ఇంటి పట్టా ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధిత మహిళ వీడియో ఆధారాలతో సహా వెల్లడించారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆమెను ఏకంగా కిడ్నాప్ చేయడం రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలకు తార్కాణం.
పట్టించుకోని బాబు, పవన్.. వారి దారిలోనే పోలీసులు..
వరుస అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొద్దునిద్ర వీడటం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసత్య ప్రచారాలతో హడావుడి చేసిన పవన్‌కళ్యాణ్... ప్రస్తుతం టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వంలో రోజూ జరుగుతున్న అత్యాచారాలపై స్పందించడమే లేదు. మరోవైపు తాము అమలు చేసేది రెడ్‌బుక్ రాజ్యాంగమేనని చంద్రబాబు, లోకేశ్ విస్పష్టంగా ప్రకటించాక... ఇక తమకు పనేం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే టీడీపీ కీచకులు రోడ్లపైకి వచ్చి అత్యాచారాలకు తెగబడుతున్నా సరే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
టీడీపీ సోషల్ మీడియా విశృంఖలత్వం
నాలుగు నెలలుగా అధికార టీడీపీ కూటమి సోషల్ మీడియా విభాగాల ఆగడాలు, వేధింపులకు అడ్డే లేకుండాపోతోంది. వేలాది ఫేక్ అకౌంట్ల నుంచి రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వారి బాధితుల్లో సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు ఉన్నారు. పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో టీడీపీ కూటమి సోషల్ మీడియా ఆగడాలు మరింతగా పేట్రేగిపోతున్నాయి.
వాసంతి జాడ నేటికీ తెలియదు!
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వాసంతి అనే ఎనిమిదేళ్ల బాలికను జూలై 7వ తేదీ ఉదయం ఆగంతకులు అపహరించుకుపోయారు. అదేరోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటలపాటు పోలీసులు పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు మొద్దు నిద్ర వీడారు. అయినా కేసును సక్రమంగా దర్యాప్తు చేయనే లేదు.
పది రోజుల తర్వాత వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించండి.. అంత్యక్రియలు చేసుకుంటామన్న ఆ పేద తల్లిదండ్రుల ఆవేదన కూడా చంద్రబాబు ప్రభుత్వం మనసును కరిగించలేకపోయింది. నాలుగు నెలలు గడిచినా ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వం కనిపెట్టి ఆమె కుటుంబానికి అప్పగించలేకపోయింది.
విద్యా సంస్థలు.. వసతిగృహాల్లోనూ దుర్మార్గాలు
⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్రూముల్లో రహస్య కెమెరాలతో విద్యార్ధినుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది మంది విద్యార్ధినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. కానీ అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. నిందితులను గుర్తించి శిక్షించకపోవడం గమనార్హం.
⇒ ఏలూరులో ఓ ఆశ్రమం నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో ఉంటున్న తమను వార్డెన్ భర్త శశికుమార్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధిత విద్యార్థినులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోషూట్‌ల పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నట్లు బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
⇒ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో సంక్షేమ హాస్టల్లో విద్యార్ధినులపై లైంగిక దాడులకు పాల్పడ్డారు.
⇒ అనంతపురంలో మెడికల్ కాలేజ్ విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారన్న వార్త విభ్రాంతి కలిగించింది.
టీడీపీ నేతలు, కార్యకర్తల బరితెగింపు
⇒ టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు, రౌడీ షీటర్ నవీన్ తెనాలిలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె తలపై తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని ఆదివారం ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు.
టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌తో నవీన్ (ఫైల్)
గుంటూరులో సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య కేసులతోపాటు మరెన్నో తీవ్రమైన నేరాల్లో నవీన్ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ తరఫున క్రియాశీలంగా వ్యవహరించాడు. ఈ కేసును పక్కదారి పట్టించాలని పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తునట్టు సమాచారం.
⇒ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసి అత్యాచారం చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో 8 రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. కానీ కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు.
⇒ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు.
⇒ అనంతపురం జిల్లాలో టీడీపీ నేత ఉపాధి హామీ పథకం మహిళా కూలీలను లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాధిత మహిళలు ఫిర్యాదు చేసినా సరే టీడీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయలేదు.
⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.
లోకేశ్‌తో జాన్ (ఫైల్)
ఎమ్మెల్యేలే కీచకులుగా మారితే..
ఎవరైనా లైంగికంగా వేధింపులకు గురిచేస్తే న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. లేదా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి మొర పెట్టుకుంటారు. కానీ తాము ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యేలే లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని బాధిత మహిళ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ఆధారాలను విడుదల చేయడంతో యావత్ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. తర్వాతి పరిణామాల్లో ఆ బాధిత మహిళ కేసును ఉపసంహరించుకోవడం గమనార్హం.
ఈ వ్యవహారం మరువకముందే ఆదిమూలం మరో మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి భార్యకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తుండటం సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనిపై ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితోపాటు ఆయన వర్గీయులు ఆందోళన చేయడంతోపాటు టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment