
2024 ఏప్రిల్ 9వ తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో వలంటీర్లను తొలగించబోమని, గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ప్రకటించిన చంద్రబాబు
బాబు ఉగాది దగా.. 2.66 లక్షల మంది బతుకుల్లో ‘చేదు’
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలు
వలంటీర్ల వ్యవస్థనూ కొనసాగిస్తామని హామీ..
వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఊరింపు.. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన వైనం
ఆ తర్వాత సూపర్ సిక్స్ సహా హామీలన్నింటిపై దాటవేత ధోరణి.. మొదటి నెల నుంచే వలంటీర్లకు విధులు అప్పగించకుండా మోసం
ఈ వ్యవస్థ 2023 నుంచే మనుగడలో లేదంటూ మాటమార్పు.. 2024 జూన్ వరకు ఠంఛన్‌గా వేతనాలు అందుకున్న వలంటీర్లు
సర్కారు తీరుతో రోడ్డున పడిన 2.66 లక్షల కుటుంబాలు.. పది నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన.. పట్టించుకోని ప్రభుత్వం
చిరు జీవితాలతో చెలగాటం
ఇదిగో బాబు.. ‘ఈనాడు’లో నీ ఉగాది హామీ
సరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వలంటీర్లను తొలగించం. గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం’ అని ప్రకటించారు. కానీ గద్దెనెక్కిన తర్వాత వలంటీర్లను నిండా ముంచేశారు.
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు ఆపై మాట మార్చేశారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేస్తానని మోసపూరిత హామీలతో అధికారం చేపట్టాక ప్రతి వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబు.. వలంటీర్లను సైతం మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, పైరవీలు, పక్షపాతం లేకుండా క్షేత్ర స్థాయిలో సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థనూ ఒక్కసారిగా కుప్పకూల్చారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. చివరకు తనకు ఓటు వేయని వారికైనా సరే అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలన్న నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులు నిర్వర్తించారు.
వారికి కేటాయించిన ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారికి ఏయే పథకాలకు అర్హత ఉందో గుర్తించి.. వారితో దరఖాస్తు చేయించి.. ఆయా పథకాలు వర్తింప చేసి.. ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగేలా కృషి చేశారు. ఇంతగా సేవలు అందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి వలంటీర్లకు చిక్కులు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు విధులు అప్పజెప్పడం మానేసింది.
ఇప్పుడు మళ్లీ ఉగాదొచ్చింది..
ఇప్పుడు మళ్లీ ఉగాది వచ్చింది. గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతున్నారు. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వలంటీర్లందరి ఉద్యోగాలు పోయాయి. 2024 జూన్ ఒకటో తేదీన సైతం వలంటీర్లు గౌరవ వేతనాలు పొందారు. అయితే 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదంటూ చంద్రబాబు ప్రభుత్వమే వలంటీర్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది ఉగాది పండుగ రోజున చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు వారి వేతనాలు పెరగకపోగా, ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా పోయాయి. పది నెలలుగా వారి వేతన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. అసలు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థే ప్రస్తుతం ఉనికిలో లేదని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి నిస్సిగ్గుగా ప్రకటించారు. ‘ఆ వ్యవస్థే లేనప్పుడు వారిని ఎలా కొనసాగిస్తాం? వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎక్కడ ఉంటుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించడంతో వలంటీర్ల దిమ్మ తిరిగిపోయింది.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని వల్లె వేశారు. ‘అసలు వలంటీర్లు అఫీషియల్‌గా లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, జీవోలో ఎక్కడా వాళ్లు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు’ అంటూ వ్యాఖ్యానించడంతో అందరూ విస్తుపోయారు. దీంతో తామంతా దారుణంగా మోసపోయామని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు.
గత ఉగాది పండుగ పూట మీకు తీపి కబురు చెబుతున్నామన్న చంద్రబాబు ఇంత దుర్మార్గంగా తమను మోసం చేస్తారని అనుకోలేదని నిప్పులు చెరిగారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పది నెలలుగా ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. 2.66 లక్షల మంది వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడంతో పాటు వినతులు ఇస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం వారి గురించి కనీస ఆలోచన చేయడం లేదు.
కరోనా సమయంలో కీలక సేవలు
వైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి, వివక్ష, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించారు. ప్రజలకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పని ఉన్నా వలంటీర్లే గ్రామ సచివాలయాల ద్వారా చేయించారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి నెలా రెండు విడతల చొప్పున కేవలం మూడు రోజుల సమయంలో అన్ని కుటుంబాల్లో ఫీవర్ సర్వే పూర్తి చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు రోగుల గుర్తింపులో కీలక పాత్ర పోషించారు.
వరదల సమయంలో బాధిత ప్రజలకు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా సహాయక చర్యలు అందించడంలో ముందు వరుసలో నిలిచారు. గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నికల వరకు చంద్రబాబు సహా కూటమి నేతలంతా తీవ్ర విమర్శలు చేశారు. తీరా పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2.66 లక్షల కుటుంబాలను నిట్ట నిలువునా ముంచేశారని వలంటీర్లు వాపోతున్నారు.
ఇప్పుడు ఊడగొట్టిన ఉద్యోగాలే ఎక్కువ
కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని చూస్తే ఆ ఊసే లేదు. ఊడకొట్టిన ఉద్యోగాలే ఎక్కువ. 2.66 లక్షల మంది వలంటీర్ల ఉద్యోగాలు పోయాయి. బేవరేజ్ కార్పొరేషన్‌లో 18 వేల మందిని తొలగించారు. ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా ఆయా ప్రభుత్వ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను పూర్తిగా కుదించేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు..
తెలుగుదేశం.. ఎన్డీయే మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ.5 వేలు కాదు,
మీకు రూ.10 వేలు పారితోషకం ఇచ్చే బాధ్యత మాది.
-అసెంబ్లీ ఎన్నికల ముందు 2024 ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబు
వలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్‌సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఓ అన్నగా చెబుతున్నా. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను.
-ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్
అధికారంలోకి వచ్చాక..
వలంటీర్లు అసలు అఫీషియల్‌గా లేరు ఇప్పుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, ఎక్కడా.. జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయింది.
-నాలుగు నెలల క్రితం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘ ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రూ.4.57 లక్షల కోట్ల పంపిణీలో కీలక పాత్ర
2019 ఆగస్టు 15న అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మక వలంటీర్ల వ్యవస్థకు నాంది పలికింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మందిని నియమించింది. 2024లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే వరకు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం ద్వారా లబ్ధిని ప్రజల గడప వద్దకే అందజేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఆ ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ రూపంలో, మరో రూ.1.84 లక్షల కోట్లు నాన్ డీబీటీ రూపంలో మొత్తంగా రూ.4.57 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో క్షేత్ర స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు.
అరచేతిలో వైకుంఠం చూపారు
చంద్రబాబు వలంటీర్లకు అరచేతిలో వైకుంఠం చూపారు. అది నిజమనుకుని, ఆ హామీలు నమ్మాం. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. గతేడాది ఉగాది నాడు నూతన పట్టు వస్త్రాలు ధరించి, నుదుట బొట్టుతో చంద్రబాబు మా భవిష్యత్ గురించి ఎంతగానో తపన పడుతున్నట్లు మాట్లాడారు. మమ్మల్ని ఊరిస్తూ బూటకపు హామీలు ఇచ్చారు. ఆ హామీని నమ్మి దగా పడ్డ వలంటీర్లంతా ఈ ఉగాదిని కూటమి దగా–దినంగా పాటించాలని నిర్ణయించుకున్నాం. పండుగ పూట పస్తుండి నిరసనలు తెలుపుతాం.
– హుమాయూన్ బాషా, ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల సంఘం అధ్యక్షుడు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి
సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా మాకు (వలంటీర్లకు) ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. చంద్రబాబు గత ఉగాది నాడు పచ్చడి తింటూ ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ లేదని చెబుతున్నారు.
మంత్రులు ‘పుట్టని బిడ్డ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో మా సేవలు వినియోగించుకున్నారు. పుట్టని బిడ్డతో సేవలు ఎలా చేయించుకున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి.
–గాలి షైనీ, వలంటీర్, విజయవాడ
మా ఉసురుతో ఈ ప్రభుత్వం పతనం
ఉగాది పండుగ రోజున వలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మరిచిపోలేం. గతేడాది ఉగాది రోజున వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన మమ్మల్ని సీఎం చంద్రబాబు మోసం చేశారు. వలంటీర్లంతా పేద కుటుంబాలకు చెందిన వారే. అలాంటి కుటుంబాల్లో వలంటీర్ ఉద్యోగం కల్పించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మేలు చేసింది. కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ చేసిన మోసాన్ని మేము మరిచిపోలేం.. మా ఉసురు ఈ ప్రభుత్వ పతనానికి దారి తీయడం ఖాయం.
– చేపల రాజు, వలంటీర్, రేవుపోలవరం, అనకాపల్లి జిల్లా
దుర్మార్గంగా పక్కన పెట్టేశారు
వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు సైతం రెట్టింపు చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించి సీఎం చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి పది నెలలైనా మా గురించి పట్టించుకోవడం లేదు. జీతాలు పెంచే విషయం అటుంచి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారు. గత ఐదేళ్లలో వలంటీర్లు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందించాము.
కరోనా సమయంలో మేము చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి. చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి జీతాలు పెరుగుతాయని అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చాక దుర్మార్గంగా పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి.
– అన్నపూర్ణ, వలంటీర్, రాములవీడు గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా
నమ్మించి నట్టేట ముంచేశారు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచేశారు. రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వలంటీర్లను మోసం చేశారు. ఎన్నికల్లో నెగ్గాక ఈ వ్యవస్థే లేదంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో, ఇతరత్రా మా సేవలు చూసి యావత్ దేశ ప్రజలంతా ప్రశంసించడం నిజం కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే వలంటీర్లకు చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలి. లేదంటే తగిన బుద్ధి చెబుతాం.
– పెదపూడి చినబాబు, వలంటీర్, ఎన్‌ఆర్‌పీ అగ్రహారం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా
దగ్గరలోనే బుద్ధిచెప్పే రోజులు
వలంటీర్లను కొనసాగించడానికి పరిపాలన అనుమతులు లేవని సాకులు చెప్పి నిలిపివేశారు. అయితే విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో వలంటీర్ల సేవలను ఏ అధికారంతో వినియోగించుకున్నారో చెప్పాలి. గత ప్రభుత్వానికి సాధ్యమైంది.. ఈ ప్రభుత్వానికి ఎందుకు కావడం లేదు? వలంటీర్లను తప్పించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం సాకులు చెబుతోంది. చాలా మంది డిగ్రీ వరకు చదువుకొని ఉన్న ఊరిలో ఇంటి పనులు, ప్రజా సేవ చేస్తూ జీవనం సాగించే వారు. కూటమి ప్రభుత్వం కుట్రతోనే వలంటీర్లను పక్కనపెట్టింది. ఇది నిజం. వారికి తగినబుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
– రామ్‌గోపాల్, చిన్నటేకూరు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా
ఉగాది చేదు జ్ఞాపకం
ఉగాది పండుగ మా వలంటీర్లందరికీ చేదు జ్ఞాపకం. ఎన్నికలకు ముందు గత ఉగాది పండుగను పురస్కరించుకుని విజయవాడలో చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు. ఉగాది రోజు వలంటీర్లందరికీ తీపి కబురు చెబుతున్నామన్నారు. రూ.10 వేలు జీతం ఇచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం అదే మాట చెప్పారు. ఇప్పుడేమో వలంటీర్లకు జీతాలు పెంచాలని చూస్తున్నాం కానీ వారందరూ ఎక్కడా జీవోలో లేనే లేరు అని తప్పించుకోవడం బాధాకరం. చిరు జీతానికి పని చేసుకుంటున్న మమ్మల్ని మోసం చేయడం సబబు కాదు.
– చలపతి, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా