
కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ను ప్రశంసించిన సీఎం చంద్రబాబు
అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్‌ను చేసినట్లుంది: డిప్యూటీ సీఎం పవన్
సాక్షి, అమరావతి: చింతకాయల అయ్యన్నపాత్రుడు కరుడు గట్టిన పసుపు యోధుడు, ఫైర్‌బ్రాండ్ అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా శాసనసభ హుందాగా నడుస్తుందని నమ్ముతున్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడును సీఎం అభినందించారు.
ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమానపరచకూడదని సభలోని సభ్యులకు సూచించారు.
అయ్యన్నను స్పీకర్ పదవిలో చూడటం గర్వంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ సీఎం ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో వచ్చిన అయ్యన్న ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్రవేశారన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతను ఆయన పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు.
సీఎంగానే సభలో అడుగుపెట్టా..
సీఎంగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని 2021 నవంబర్ 19న సభ నుంచి బయటకువెళ్లానని, ప్రజల ఆశీస్సులతో మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెట్టానని చంద్రబాబు తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ రాలేదన్నారు. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలన్నారు.
25 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయాల ప్రభావంతోనే నేడు హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలిచిందన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తిచేయడంతో పాటు, వికసిత్, పేదరికంలేని ఏపీని తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా 2047 నాటికి రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా చట్టసభ ముందుకు సాగాలన్నారు.
ప్రజలు హుందాతనం చూస్తారు
ఇన్ని రోజులు ప్రజలు అయ్యన్నలోని వాడివేడి చూశారని, ఇక మీదట హుందాతనం చూడబోతున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై తిట్టే అవకాశం ఆయనకులేదని, సభలో తిట్టే వారిని నిలువరించే బాధ్యత ఉందన్నారు. అయ్యన్నను స్పీకర్ చేయడం చూస్తుంటే అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్‌ను చేసినట్లుందన్నారు.
గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టినప్పటికీ అయ్యన్నపాత్రుడు భయపడలేదని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. సు«దీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రజలకు ఎన్నో సేవలు చేశారని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
హుందాగా మాట్లాడాలి..
శాసనసభలో సభ్యులు హుందాతనంగా మాట్లాడాలి. ప్రస్తుత సభలో 88 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరందరికీ అవకాశాలిస్తాను. ప్రజలు, రాష్ట్రం కోసం అందరూ మాట్లాడాలి. కొత్తగా ఎన్నికైన వారందరికీ సభ సంప్రదాయాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజలెంతో నమ్మకంతో బాధ్యత ఇచ్చారు. సభ్యులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ స్పీకర్
హుందాగా నడపాలంటూనే జగన్‌పై అనవసర విమర్శలు..
గత శాసనసభను కౌరవ సభతో పోలుస్తూ.. ప్రస్తుత సభను హుందాగా నడపాలంటూ సీఎం చంద్రబాబు ప్రసంగం ముగిసిన వెంటనే మంత్రులు అనిత, బీసీ జనార్థన్‌రెడ్డి, ఫరూక్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర సహా ఇతర సభ్యుల ప్రసంగాలన్నీ మాజీ సీఎం జగన్ నామస్మరణతోనే కొనసాగాయి. పదేపదే ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శించారు.
నీతి వాక్యాలు వల్లెవేసిన అధికార పక్ష నాయకులే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా సభలోలేని ప్రతిపక్ష నేత పేరును పదేపదే ప్రస్తావిస్తూ అర్థరహిత విమర్శలు చేశారు. టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ స్పీకర్‌కు అభినందనలు చెప్పడం కంటే జగన్‌ను తూలనాడటంపైనే ఎక్కువగా దృష్టిసారించారు.
అంతకుముందు.. సభను దూషణలు, వెకిలి చేష్టలతో కాకుండా గౌరవంగా నిర్వహించాలని కోరిన చంద్రబాబే.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పిరికితనంతో సభకు రాలేదని వ్యాఖ్యానించడం విశేషం. పవన్ కళ్యాణ్ సైతం ప్రతిపక్ష సభ్యులకు సభకు వచ్చే ధైర్యంలేదని విమర్శించారు. విజయాన్ని తీసుకున్నారుగాని, ఓటమిని తీసుకోలేక పారిపోయారని ఎద్దేవా చేశారు.