
కేసులు బనాయించి విచారణ పేరుతో వేధించండి
పోలీసులకు బాబు సర్కారు ఆదేశం
పక్కా పన్నాగంతో 17 అక్రమ కేసులు
ఫలించిన న్యాయ పోరాటం
నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
సాక్షి, అమరావతి: సినిమాల్లో విలన్లు.. వృద్ధులు, మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు..! అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది!! తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది.
రోజుకో కేసులో అరెస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ రోడ్డు మార్గంలో ఏకంగా 2,501 కి.మీ. తిప్పి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది! 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు.
ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని పోసాని కృష్ణ మురళి నివాసంపై పోలీసులు దండెత్తారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. రాత్రంతా వాహనంలో తిప్పి ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పోసానిని ఏకంగా 9 గంటల పాటు విచారించడం గమనార్హం.
ఫలించిన న్యాయ పోరాటం..
నేడు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశం
విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తదితర పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి ఆ జిల్లాలకు వరసగా తరలించాలని పోలీసులు భావించారు. అయితే పోసాని న్యాయ పోరాటం ఫలించింది. ఆయనపై బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు.

పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. ఇక పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి. విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఆదోని ఇన్‌చార్జి అపర్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment