కూటమి సర్కార్‌ వికటాట్టహాసం.. పోసానికి 14 రోజుల రిమాండ్‌ | Chandrababu Naidu govt Red Book Rule On YSRCP Leader Posani Krishna Murali | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌ వికటాట్టహాసం.. పోసానికి 14 రోజుల రిమాండ్‌

Published Fri, Feb 28 2025 4:13 AM | Last Updated on Fri, Feb 28 2025 7:19 AM

Chandrababu Naidu govt Red Book Rule On YSRCP Leader Posani Krishna Murali

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు పోసానిని తీసుకువచ్చిన పోలీసులు

పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసా?

పోసానిని ఉగ్రవాదిలా 9 గంటలపాటు ఎస్పీ విచారిస్తారా?

భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హుంకరింపు 

పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనం 

ప్రశ్నించే వారికి వేధింపులా? రేపటి తేదీ వేసి ఈ రోజే అరెస్టా? 

ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎత్తుకు రావడమేంటి? 

15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పకుండా కక్ష సాధింపా? 

పోసానిపై నమోదైంది దేశ ద్రోహం కేసా? హత్య కేసా? 

విచారించే చోటుకు స్వయంగా జిల్లా ఎస్పీ రావడమేంటి? 

న్యాయవాదులు, వైఎస్సార్‌సీపీ నేతలు పోసానితో మాట్లాడకూడదా? 

ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని 9 గంటలపాటు విచారిస్తారా? 

ఇవన్నీ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ కావా?  

ఇదంతా చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పక్కా కుట్రేనని స్పష్టం 

మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచిన పోలీసులు.. రాత్రంతా కొనసాగిన వాదనలు

పోసానికి 14 రోజుల రిమాండ్‌

రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కూటమి సర్కారు పాతరేసింది. భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హూంకరిస్తోంది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు.. కామెంట్లు సహజం అన్న స్ఫూర్తిని మంటగలిపింది. ప్రశ్నించే వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని రాక్షస పాలన సాగిస్తోంది. చట్టం, కోర్టులు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లు లెక్కలేనితనంతో బరితెగించింది. పదేళ్ల కిందట నంది అవార్డు తిరస్కరిస్తూ వ్యాఖ్యలు చేస్తే.. దానిపై సంబంధం లేని వారెవరో ఇప్పుడు ఫిర్యాదు చేస్తే.. మరెక్కడో కేసు.. పొరుగు రాష్ట్రంలో అరెస్టు.. స్వయంగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణ.. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిది అక్రమ అరెస్టు అని చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?

⇒ పక్కా కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పోసానిని వేధిస్తోందని స్పష్టమవుతోంది. అతనో అంతర్జాతీయ టెర్రరిస్ట్‌ అన్నట్లు పోలీసులు వ్యవహరించిన తీరు నివ్వెర పరుస్తోంది. రేపటి తేదీ వేసి ఈ రోజే (27వ తేదీ వేసి.. 26నే) అరెస్ట్‌ చేయడం.. అదీ వేరే రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం.. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్కడి నుంచి ఎత్తుకు రావడం.. 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పక పోవడం.. తుదకు ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీ రావడం.. ఉన్నతాధికారులు గంట గంటకూ ఆరా తీయడం.. ఇవన్నీ చూస్తుంటే ఓ వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దలే వెనకుండి నడిపించారని తేటతెల్లమవుతోంది.

⇒ పోసానిపై ఇచ్చిన ఫిర్యాదు దేశ ద్రోహానికి సంబంధించింది కాదు.. స్మగ్లింగ్‌కు సంబంధించిందీ కాదు.. హత్యా నేరం అంతకంటే కాదు.. ఆయన వయసు 66 ఏళ్లు.. పైగా గుండె సమస్యతో బాధ పడుతున్నారు.. ఇలాంటి వ్యక్తిని ఇంతగా వేధించాల్సిన అవసరం ఏముంది? ఒక మామూలు కేసు ఇది.. ఇలాంటి కేసులో ఇంత హంగామా, భయభ్రాంతులకు గురి చేయడం అవసరమా? రాత్రిళ్లు అరెస్టు చేయడం ఏమిటి? విచారణ జరుగుతున్న చోటుకు ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు రావడం ఎంత వరకు అవసరం? న్యాయ­వా­దులను, వైఎస్సార్‌సీపీ నేతలను పోసానితో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించ లేదు? ఇదంతా కుట్ర కాదా? ఇవన్నీ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ కావా? దీనిని బరితెగింపు అనాలా.. కండ కావరం అనాలా.. అధికార మదం అనాలా.. లేక ఇంకేమనాలి?

సాక్షి, అమరావతి/ఓబులవారిపల్లె/రైల్వేకోడూరు అర్బన్‌/ సాక్షి, రాయచోటి: రెడ్‌బుక్‌ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. 

ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్‌ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్‌ కొనసాగించింది. 

జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్‌ 196, 353(2), 111 ఆర్‌/డబ్ల్యూ 3(5) ఆఫ్‌ ది బీఎన్‌ఎస్‌ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు. 

ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి.      

ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్న పోలీసులు 
   
ఒత్తిడికి గురిచేయొద్దన్న వైద్యులు 
పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చిన అనంతరం తొలుత వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు గురు మహేష్‌.. బీపీ, షుగర్, పల్స్‌ పరిశీలించారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయని, తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. అయితే గుండె సమస్య కారణంగా సాఫ్ట్‌గా విచారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైతే పోసాని కృష్ణమురళి ఆరోగ్యం నార్మల్‌గానే ఉందని వైద్యులు తెలియజేశారు. 

కాగా, పోసానిని కలవడానికి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతిని«ధి, మాజీ అసిస్టెంట్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మాజీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ సుదర్శన్‌రెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ జిల్లా కనీ్వనర్‌ నాగిరెడ్డి తదితరులను పోలీసులు అనుమతించ లేదు. తాము పోసానికి వ్యక్తిగత న్యాయవాదులమని, పోసాని వద్ద కాకుండా పక్క గదిలో ఉంటామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా లీగల్‌ సెల్‌ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగినా వినిపించుకోలేదు. రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతర నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారు.

హైకోర్టు ఆదేశాల ధిక్కారం 
‘కేసులో నిందితుడిని న్యాయవాది కలిసి మాట్లాడవచ్చు. లేదంటే పక్క గదిలో కూర్చోవచ్చు’ అన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరించారు. పోసాని కృష్ణ మురళి ఏం చేశారని అతడిపై ఈ సెక్షన్లతో కేసు నమోదు చేశారు? అసలు ఫిర్యాదు ఎవరు చేశారన్నది చెప్పాలి కదా.. ఎవరి ఆదే­శాలతో ఇలా చేస్తున్నారు?’ అని వైఎస్సార్‌సీపీ లీగల్‌ అడ్వ­యి­జర్‌ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో సూపర్‌­సిక్స్‌ పథకాలను అమలు చేయలేదు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోంది.’ అని కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.

ధైర్యంగా ఉండండి.. మేమంతా తోడుగా ఉన్నాం 
పోసాని సతీమణి కుసుమలతను ఫోన్లో 
పరామర్శించిన వైఎస్‌ జగన్‌
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పోసాని భార్య పోసాని కుసుమలతతో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్‌ విషయంలో పోసాని కృష్ణ మురళికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, తామంతా తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్‌ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు.  

పోలీస్‌స్టేషన్‌కు జిల్లా ఎస్పీ
ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు పోసాని కృష్ణ మురళిని తీసుకొచ్చిన అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆయన నేరుగా పోలీస్‌ స్టేషన్‌ లోపలికి వెళ్లి కేసు పూర్వాపరాలను పరిశీలించడంతోపాటు పోసానిని కూడా విచారించినట్లు సమాచారం. ప్రభుత్వ న్యాయవాదులను స్టేషన్‌కు పిలిపించి మంతనాలు సాగించారు. ఈ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇటు పోలీసులకు, అటు న్యాయవాద వర్గాలకు మార్గ నిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

పోలీస్‌స్టేషన్‌ నుంచి సమీపంలోని ప్రధాన రహదారి వరకు అటు, ఇటుగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి  ఎవరినీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్‌ సమీపంలో ఆందోళనకు దిగాయి. వయోభారం, ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టడం సరికాదని నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుగా కేసులు నమోదు చేసిందని ధ్వజమెత్తారు.  

అర్ధరాత్రి 2.. కొనసాగిన వాదనలు 
పోసాని కృష్ణ మురళిని ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో విచారణ పేరుతో గురువారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9.10 గంటలకు వరకు వేధింపులకు గురి చేశారు. ఆయనకు కొంత మేర అనారోగ్య సమస్యలున్నా అన్ని గంటలపాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. పోలీసుస్టేషన్‌ ద్వారం వద్దకు వాహ­నాన్ని తీసుకెళ్లి పోసానిని ఎక్కించుకుని రైల్వేకోడూరులోని మెజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్లారు. 

పోసాని తన వెంట తెచ్చుకున్న బ్యాగుతో వాహనంలో ఎక్కి కూర్చున్నారు. పోసాని కొంత మేర నిస్సత్తువతో కనిపించారు. రాత్రంతా వాహనంలో జర్నీ చేయడం, నిద్రలేమితోపాటు అనారోగ్య సమస్యలు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టడంతో నీరసించిపోయారు. కాగా ఉదయం 5 గంటలదాకా కొనసాగిన వాదనలు. సుమారు 7 గంటలు కొనసాగిన వాదనలు. సుదీర్ఘ వాదనల అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్‌ విదించింది. కాసేపట్లో కడప జైలుకు పోసాని తరలింపు.

త్రిబుల్‌ వన్‌ సెక్షన్ల దుర్వినియోగం  
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది హామీలు నెరవేర్చడానికని, అయితే వాటిని గాలికి వదిలేసి ఇష్టంలేని వ్యక్తులపై త్రిబుల్‌ వన్‌ (111) సెక్షన్‌లతో కేసులను నమోదు చేస్తోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతిపక్ష నాయకులపై మూడేళ్ల క్రితం నమోదైన కేసులను తిరగదోడి వేధిస్తోంది. అధికారం మారాక అధికార బలంతో కేసులు పెడుతున్నారా.. అని సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పటికీ, 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తోంది. 

వైఎస్సార్‌సీపీ నాయకులపై వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులను పెడుతోంది.  వైఎస్సార్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలపై పెట్టిన పోస్టులకు సంబంధించి ప్రతి జిల్లాలో ఫిర్యాదులు చేసినా, కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేయలేదా? పోసాని కృష్ణ మురళి పోస్టులకు సంబంధించి కోర్టులు చూసుకుంటాయి. 111 సెక్షన్‌ దుర్వినియోగం అవుతోందన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. మా అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా వచ్చాం.  
    – పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, మాజీ అసిస్టెంట్‌ అడ్వొకేట్‌ జనరల్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement