
చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలతో బరి తెగిస్తున్న చంద్రబాబు సర్కారు ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ అడ్డదారులు తొక్కుతోంది. దర్యాప్తు పేరిట కొండను తవ్వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేకపోయిన సీఐడీ సరికొత్త కుట్రకు తెరతీసింది. న్యాయ ప్రక్రియలో అత్యంత కీలకమైన 164 సీఆర్‌పీసీ వాంగ్మూలాల (183 బీఎన్‌ఎస్‌ఎస్) నమోదు ముసుగులో కుతంత్రం పన్నుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా వాంగ్మూలాలను నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌తో సీఆర్‌పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడం ద్వారా కుట్రకు మరింత పదునుపెట్టింది. ఆ అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా రెడ్‌బుక్ కుట్రను అమలు చేసేందుకు పావులు కదుపుతోంది.
టీడీపీ ఆఫీసులో తయారీ.. న్యాయమూర్తి ఎదుట నమోదు
వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మోపిన అక్రమ కేసు దర్యాప్తులో సీఐడీ అడ్డదారులు తొక్కుతోంది. పూర్తిగా టీడీపీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు దర్యాప్తును కొనసాగిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తాము అందచేసిన జాబితాలో ఉన్నవారిపై అక్రమ కేసు నమోదు చేయాల్సిందేనని ఇటీవల డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాకు ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు.
ఈమేరకు దర్యాప్తు పేరిట వేధింపులను పర్యవేక్షించే బాధ్యతను రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు అప్పగించారు. దీంతో మద్యం అక్రమ కేసులో సీఐడీ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్‌లో గతంలో పని చేసిన సత్యప్రసాద్‌ను సీఐడీ అధికారులు అనధికారికంగా అదుపులోకి తీసుకుని బెదిరింపులకు గురి చేశారు.
ఆయన కుటుంబ సభ్యులను కూడా అక్రమ కేసులతో వేధిస్తామని హెచ్చరించారు. దీంతో సీఐడీ అధికారులు చెప్పినట్టుగా వాంగ్మూలం ఇచ్చేందుకు సత్యప్రసాద్ సమ్మతించినట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో తిష్టవేసిన రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను సీఐడీ అధికారులు సంప్రదించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అప్పటికే రూపొందించిన వాంగ్మూలం ప్రతిని ఆయన సీఐడీ అధికారులకు పంపినట్లు సమాచారం.
అందులో ఉన్నట్లుగా సత్యప్రసాద్‌తో 164 సీఆర్‌పీసీ కింద న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించాలని ఆదేశించారు. దాంతో సీఐడీ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా సత్యప్రసాద్‌ను తరలించి న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్‌పీసీ వాంగ్మూలం ఇప్పించినట్లు సమాచారం. సీఐడీ అధికారులు రాసిచ్చిన సమాచారాన్నే యథాతథంగా తాను వాంగ్మూలంగా న్యాయమూర్తి ఎదుట చదివి వినిపించానని సత్యప్రసాద్ తన సన్నిహితుల వద్ద పేర్కొనడం గమనార్హం.
సంబంధం లేని వ్యక్తుల పేర్లు...!
మద్యం కేసులో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తోంది. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం నమోదుకు నిర్దేశించిన విధానాన్ని సీఐడీ నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో వాంగ్మూలం నమోదు చేయించిన తీరే అందుకు నిదర్శనం.
టీడీపీ కార్యాలయం రూపొందించిన వాంగ్మూలాన్నే ఆయన న్యాయమూర్తి ఎదుట వల్లె వేసేలా పక్కా కుట్రతో కథ నడిపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు నిర్వర్తించని వారు.. రాష్ట్రంలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేనివారు... పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నవారు... ఇలా పలువురి పేర్లను మద్యం విధానం, వ్యవహారాలతో ముడిపెడుతూ తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించినట్లు తెలుస్తోంది.
అసలు బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేనివారు, ప్రభుత్వంలో ప్రత్యక్షంగాగానీ పరోక్షంగా భాగస్వాములుకానివారు, జీవితంలో తాను ఏనాడూ ప్రత్యక్షంగా చూడనివారు, అసలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే లేనివారి పేర్లను కూడా ప్రభుత్వ పెద్దలు సత్య ప్రసాద్ అబద్ధపు వాంగ్మూలం ద్వారా చెప్పించినట్టు సమాచారం. 164 సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం కేసుతో నేరుగా ప్రమేయం ఉన్నవారి గురించే వాంగ్మూలంలో పేర్కొనాలి.
అంతేగానీ ఆ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను వాంగ్మూలంలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. తాము చెప్పే వాటికి సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలతో నిరూపించగలిగే వాటినే చెప్పాలి. అంతేగానీ గాలి కబుర్లు, అక్కడ ఇక్కడ విన్నవాటిని చెప్పడం నిబంధనలకు విరుద్ధం. 164 సీఆర్‌పీసీ వాంగ్మూలం స్వచ్ఛందంగా ఇవ్వాలేగానీ అధికారులు, ఇతరుల ఒత్తిడితో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు.
ఈ రెండు నిబంధనలకు విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది. అయితే ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న సీఐడీ అధికారులు నిబంధనలను కాల రాస్తున్నారు. అంటే చట్టప్రకారం సాగాల్సిన దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా భ్రష్టుపట్టిస్తోందన్నది స్పష్టమవుతోంది.
అంతేకాదు న్యాయమూర్తి ఎదుట నమోదు చేసే వాంగ్మూలం ప్రక్రియను కూడా అపహాస్యం చేస్తోందనడానికి పరాకాష్ట ఈ ఉదంతం. ఆ అబద్ధపు వాంగ్మూలాన్ని ఏకైక ఆధారంగా చేసుకుని ఈ కేసులో అక్రమ అరెస్టులకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిలతోపాటు మరికొందర్ని అరెస్టు చేసి వేధించాలన్నది సీఐడీ పన్నాగం.
అనంతరం వారిని విచారణ పేరిట వేధించి తాము చెప్పినట్లుగా నడుచుకునేలా ఒత్తిడి తేవాలన్నది కుతంత్రం. దర్యాప్తు నిబంధనలు, న్యాయ విచారణ ప్రక్రియ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ సీఐడీ బరితెగిస్తున్న తీరుపై పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేసే సాధనంగా సీఐడీ దిగజారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నించే గొంతు నొక్కాలనే..
ప్రశ్నించే గొంతు నొక్కాలన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యం. రాజకీయాల నుంచి తప్పుకున్నానని పోసాని ప్రకటించినా చంద్రబాబు వెంటాడ్డం అన్యాయం. చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రం రగిలిపోతోంది. నాగరిక సమాజం నుంచి మళ్లీ ఆటవిక సమాజంలోకి తీసుకెళ్తున్నారు. చట్టాలను, న్యాయవ్యవస్థలను సీఎం అపహాస్యం చేస్తున్నారన్నారు.
– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
ప్రజాస్వామ్యం ఖూనీ..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. విమర్శలను టీడీపీ కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అందుకే పోసాని లాంటి వారి అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టును
తీవ్రంగా ఖండిస్తున్నా.
– గడికోట శ్రీకాంత్‌రెడ్డి,మాజీ చీఫ్ విప్
ఒక నియంతలా చంద్రబాబు
చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవు. పోసాని అరెస్టుతో ప్రభుత్వ అరాచకం తీవ్రస్థాయికి చేరినట్లయింది. కచ్చితంతా ప్రజలు గుణపాఠం చెప్తారు. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నాం. పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– మేరుగు నాగార్జున, మాజీ మంత్రి
కక్ష రాజకీయాలు మంచివి కావు
రాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నానని పోసాని ఎప్పుడో ప్రకటించారు. అయినా ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్ పాలనలోనే స్వేచ్ఛగా ఉన్నామేమోనన్న భావన ప్రజలకు వస్తోంది. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావు.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి
పండగ పూటా హింసిస్తున్నారు
శివరాత్రి రోజున కూడా చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టే దీనికి నిదర్శనం. చంద్రబాబును ఎవ్వరూ ప్రశ్నించకూడదా? పోసాని అనారోగ్యంతో ఉన్నా చంద్రబాబు వేధిస్తున్నారు. పోలీసులు బలిపశువులు కావొద్దని కోరుతున్నా. చట్టాన్ని మీరితే ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
– అంబటి రాంబాబు, మాజీ మంత్రి
కక్ష సాధింపులకు పరాకాష్ట..
పోసాని కృష్ణమురళి అరెస్టు టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను గాలికొదిలేసి, ఎంపిక చేసుకున్న వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్టుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు ప్రభుత్వ చర్యలు దుర్మార్గం.
– కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment