
ఊరించి.. ఉసూరుమనిపించిన బాబు సర్కారు బడ్జెట్
ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపు సహా ఎన్నో హామీలు
అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోని వైనం
తొమ్మిది నెలల్లో మరో రూ.3 వేల కోట్లు బకాయి
మొత్తంగా రూ.26 వేల కోట్లకు చేరిన బకాయిలు
ఐఆర్ ప్రస్తావన లేదు.. రెండు డీఏల బకాయిల మాటే లేదు
ముందుకు సాగని పీఆర్‌సీ చైర్మన్ నియామకం
తమ ఆశలపై నీళ్లు చల్లిందంటున్న ఉద్యోగులు, పెన్షనర్లు
సాక్షి, అమరావతి: పేద, సామాన్య ప్రజానీకాన్ని రెండు బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను కూడా దగా చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టినప్పటికీ.. అందులో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల గురించి ప్రస్తావనే చేయకుండా మొండి చేయి చూపింది. వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన చెప్పాయి.
ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావస్తున్నా ఐఆర్‌కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్ గురించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
బకాయిలు, డీఏల మాటేంటి?
ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ, అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. పది నెలలైనా చెల్లించక పోవడంతో బకాయిలు మరో రూ.3 వేల కోట్లు పెరిగి మొత్తంగా రూ.26 వేల కోట్లకు చేరాయని చెబుతున్నారు.
మొదటి బడ్జెట్‌లో అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్‌లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించక పోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలి పోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీఏల గురించి కూడా సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి, జూలై డీఏలు పెండింగ్‌లో పెట్టిందని, ఈ బడ్జెట్‌లోనైనా ఐఆర్‌తో పాటు వాటిని చెల్లిస్తారని ఆశించామని.. అయితే తమ ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి.
సీపీఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం
సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయక పోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారని, ఇది సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

పీఆర్సీ ఆశలపై నీళ్లు
ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్‌పై కూడా పునః పరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ పది నెలలైనా పీఆర్‌సీ గురించి అసలు మాట్లాడకపోగా, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్‌సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా, అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురైయ్యారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.
వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం మాట తప్పిందని.. ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారెంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రూ.26 వేల కోట్ల బకాయిలు, రెండు డీఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, వీటి గురించి అటు కూటమి నేతలు, ఇటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment