సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు బీసీ కార్పొరేషన్ వడివడిగా చర్యలు తీసుకుంటోంది. నిధుల విడుదలలో జాప్యంతో మూడేళ్లుగా రాయితీ పథకాలను అటకెక్కించిన ఆ శాఖ.. తాజాగా 2018–19 సంవత్సరంలో ఏకంగా లక్ష యూనిట్ల మంజూరుకు ఉపక్రమించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి యూనిట్ల ఏర్పాటును వేగిరం చేయనుంది. 2018–19 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్‌తో పాటు 11 బీసీ ఫెడరేషన్లకు 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు ఉన్న స్వయం ఉపాధి యూనిట్లు 1.45 లక్షలు ఉన్నాయి. తొలివిడతలో భాగంగా చిన్న యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన బీసీ కార్పొరేషన్ ఈ మేరకు దరఖాస్తుల పరిశీలన చేపట్టింది.
నవంబర్‌లోగా రాయితీ విడుదల..
బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ప్రాధాన్యత క్రమంలో రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలివిడత రూ.లక్ష లోపు ఉన్న యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల లోపు ఉన్న యూనిట్లకు రెండో విడత, రూ.10 లక్షల లోపు ఉన్న యూనిట్లకు మూడో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేసి రాయితీ ఇవ్వనుంది. ప్రస్తుతం తొలివిడత కింద లక్ష మందికి రాయితీ రుణాలు ఇవ్వాలని భావిస్తోంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేస్తోంది.
తొలివిడత లక్ష మందికి రాయితీ ఇచ్చేందుకు రూ.750 కోట్లు అవసరం. 2018–19 వార్షిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఫెడరేషన్లకు కేటాయించిన నిధులతో పాటు ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను వినియోగించుకోనుంది. ప్రస్తుతం లక్ష మందికి రాయితీ ఇవ్వనున్నప్పటికీ.. ఇందులో ఆయా సామాజిక వర్గాల వారీగా ఫెడరేషన్లకు దరఖాస్తులను బదలాయించాలని, దీంతో బీసీ కార్పొరేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా నవంబర్ నెలాఖరు నాటికి నిర్దేశించిన లక్ష మందికి రాయితీ రుణాలిచ్చి యూనిట్ల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
‘లక్ష’ణంగా రాయితీ రుణం
Published Mon, Jul 23 2018 1:13 AM | Last Updated on Mon, Jul 23 2018 1:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment