జోగిని... అభాగిని
- కూడూగూడు లేక అత్యంత దుర్భర జీవనం
- దేవుడి భార్యలుగా చలామణి అవుతున్నా నిరాదరణే
- పింఛన్లు, రేషన్‌కార్డులు సైతం లేని వైనం
- వితంతు పింఛన్‌కు భర్త డెత్ సర్టిఫికెట్ కావాలంటున్న అధికారులు
- దేవుడు మరణించినట్లు ధ్రువీకరించేదెవరంటున్న జోగినీలు
సాక్షి, మహబూబ్‌నగర్: వారంతా దేవుడి భార్యలుగా చలామణి అవుతున్నారు.. కానీ వారికే దిక్కు లేకుండా పోయింది. ఓ వైపు సమాజం.. మరోవైపు బంధువుల నిరాదరణకు గురవుతూ ఒంటరి జీవనం సాగిస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో మూఢ నమ్మకాల కారణంగా దేవుడికి పెళ్లి చేసి జోగినీలుగా మార్చారు. ప్రస్తుతం వారి వయసు పైబడడంతో అనారోగ్యం బారిన భారంగా బతుకీడుస్తున్నారు. ఏ ఆధారం లేని వీరంతా ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సుమారు ఐదు వేల మంది జోగినీ మహిళలు ఉన్నారు. ఏ దిక్కులేని వారికి ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్ల విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోంది.
మొత్తం ఐదు వేల మంది జోగినీల్లో దాదాపు 60 శాతం పైగా మహిళలు పనులు చేయలేకపోతున్నారు. యుక్త వయసులో వీరంతా శారీరకంగా, మానసికంగా హింసకు గురయ్యారు. ప్రస్తుతం వీరి ఆలనాపాలనా చూసుకునే పరిస్థితి లేదు. జోగినీలు ఎక్కువ శాతం వితంతువు పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. అయితే అధికారులు మాత్రం వింతతువు పింఛన్‌కు దరఖాస్తు చేస్తే.. కచ్చితంగా భర్త మరణించినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని పట్టుబడుతున్నారు. దీంతో జోగినీలు కంగుతినాల్సి వస్తోంది. దేవుడి భార్యలుగా ముద్రవేసిన తమకు.. భర్త చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చేదెవరంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు వృద్ధాప్య పింఛనైనా మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
ఆదరణ ప్రకటనలకే పరిమితం
జోగినీలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తున్నా.. ఆచరణ భిన్నంగా ఉంటోంది. జోగిని వ్యవస్థపై మాజీ ఐఏఎస్ రఘోత్తమరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 2013లో నివేదిక అందజేసింది. ఈ కమిషన్ ప్రకారమే తెలంగాణ వ్యాప్తంగా 12 వేల మంది జోగినీలు ఉన్నారని, అందులో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలోనే ఐదువేల మంది ఉన్నట్లు తేలింది. వీరంతా ఎలాంటి ఆధారం లేక అత్యంత దీనావస్థలో బతుకీడుస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు వారికోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
స్వయం ఉపాధి రుణాలైనా ఇప్పించండి
సమాజంలో నిరాదరణకు గురైన తమకు ప్రభుత్వం భరోసా కల్పించాలని జోగినీలు వేడుకుంటున్నారు. ఏకసభ్య కమిషన్ సూచన మేరకు తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా చేయూత కల్పించాలని విన్నవిస్తున్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తే తమ కాళ్లపై తాము నిలబడతామని చెపుతున్నారు. ఆసక్తి ఉన్న ఒకరిద్దరు స్వచ్ఛంద సంస్థల సహకారంలో మిరపపొడి గిర్నీలు కొనుగోలు చేసి స్వయంగా పనిచేస్తున్నారు. ఇదే మాదిరిగా ప్రభుత్వం సహకారం అందిస్తే చిరు వ్యాపారులు చేసుకుని జీవనం సాగిస్తామని వారు విన్నవిస్తున్నారు.
రూ.3 వేల భృతి ఇవ్వాలి
జోగినీ వ్యవస్థ కారణంగా కొందరు మహిళలు నిరాదరణకు గురయ్యారు. చాలామంది అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో వీరిని ఆదుకోవాలి. ప్రతి జోగినీకి ప్రతి నెలా రూ.3 వేల పింఛన్ అందజేయాలి. మూడెకరాల భూమి కేటాయించడంతో పాటు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఉపాధి కల్పనలో భాగంగా ఎలాంటి ష్యూరిటీలు లేకుండా రూ.ఐదు లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలి.
– హాజమ్మ, జోగినీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్, మహబూబ్‌నగర్ జిల్లా
దేవుడు సచ్చినట్లు కాగితం రాసియరు కదా..
జోగినీగా చేసి ఇంట్లో నుంచి పంపిండ్రు. బలం ఉన్నన్ని రోజులు బతికినం. ఇప్పుడు ఏం చేతకావట్లేదు. పింఛన్ అడిగితే ఎట్ల ఇయ్యాలే అని అధికారులు అడుగుతుండ్రు. వితంతువు పింఛన్ అంటే మొగుడు సచ్చినట్లు కాగితం తేమంటున్నరు. దేవునికిచ్చి పెళ్లిచేసిరి.. దేవుడు సచ్చినట్లు కాగితం రాసియరు కదా. ముసలొళ్లకు ఇచ్చే పింఛన్ కూడా ఇస్తలేరు. కాసింతకూడు కోసం కింద మీద పడి బీడీలు చేసుకొని బతుకుతున్న.
– బాలమ్మ, ధన్వాడ, మహబూబ్‌నగర్ జిల్లా
ఇదీ ఓ జోగిని ఆవేదన..కాదు ఆ వ్యవస్థలో కూరుకు పోయిన ఎందరో అభాగినుల ఆక్రోశం. తమను ఇలా చేసిన సమాజానికి సంధిస్తున్న ప్రశ్నలు