సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. డీఎస్సీ ద్వారా 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్ కాకుండా వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తోందంటూ బోడ శ్రీనివాసులు సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘డీఎస్సీలో మహిళలకు 33.33 శాతానికి బదులు 51శాతం పోస్టులను కేటాయించారు.
గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను విద్యా శాఖ పాటించడం లేదు. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్‌లో కోరారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. సమాంతర రిజర్వేషన్ పాటించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment