గ్యాస్‌ బండ రూ. 200 తగ్గింది | Cooking gas prices reduced by Rs 200 for a cylinder in India - Sakshi
Sakshi News home page

గ్యాస్‌ బండ రూ. 200 తగ్గింది

Published Wed, Aug 30 2023 5:21 AM

Cooking gas prices reduced by Rs 200 for a cylinder in India - Sakshi

వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు నిర్ణయానికిఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓనం, రక్షాబంధన్‌ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక.– అనురాగ్‌ ఠాకూర్, కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ:  ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఏకంగా రూ.200 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది.

మధ్యప్రదేశ్‌తోపాటు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చౌక ధరకే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్‌ బండ ధరను రూ.200 చొప్పున తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో గత రెండేళ్లుగా గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1,103 ఉండగా, బుధవారం నుంచి రూ.903కు లభించనుంది.

‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులు వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇప్పటికే రూ.200 చొప్పున రాయితీ పొందుతున్నారు. తాజా తగ్గింపు ధర వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక్కో సిలిండర్‌ రూ.703కే పొందవచ్చు. అంతేకాకుండా ఉజ్వల యోజన కింద అదనంగా 75 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్య 10.34 కోట్లకు చేరుకోనుంది.  

ఎన్నికలతో సంబంధం లేదు: మంత్రి
ప్రజలకు ఉపశమనం కలి్పంచడానికే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది ఓనం, రక్షాబంధన్‌ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక అని వివరించారు.

ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే గ్యాస్‌ ధరను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేసింది. నిత్యావసరాలు సరసమైన ధరలకే ప్రజలకు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది.  

సోదరీమణులకు ఉపశమనం: మోదీ
గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా వెలువడిన ఈ నిర్ణయం కుటుంబాల్లో సంతోషాన్ని పెంచుతుందని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు మరింత ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. తన సోదరీమణులంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్‌ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్‌ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇస్తోంది.

కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్‌ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్‌ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.   

ఎన్నికల వ్యూహమే!? 

Advertisement
 
Advertisement
 
Advertisement