సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో స్వయం ఉపాధి ప్రోత్సాహక పథకాల అమలు అస్తవ్యస్తంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. సబ్సిడీల పరిమితిని పెంచాలని మంత్రుల బృందం చేసిన సిఫారసులపై ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్‌రెడ్డి ఇంకా ఆమోదముద్ర వేయకపోవడంతో రుణాల విడుదలలో గందరగోళం నెలకొంది. పాత సబ్సిడీలను అమలు చేయాలా? లేక మంత్రులను సిఫారసులను అనుసరించాలా ? అన్న అంశంపై స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో స్వయం ఉపాధి యూనిట్ల మంజూరును నిలిపేసినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,857 యూనిట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 676, బీసీ కార్పొరేషన్ ద్వారా 4,063, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,410 యూనిట్లు, వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా 70 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇంత వరకు ఒక్క యూనిట్ కూడా మంజూరుకు నోచుకోలేదు. మరోవైపు దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడంతోనే ఈ గందరగోళ పరిస్థితి నెలకొందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పడానికి నిరుద్యోగులకు ఆయా కార్పొరేషన్లు సబ్సిడీల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 50 శాతానికి మించకుండా రూ.లక్ష వరకు సబ్సిడీ విడుదల చేసేవారు. ఈ ఏడాది నుంచి యూనిట్ విలువలో 60 శాతానికి మించకుండా రూ.లక్ష వరకు సబ్సిడీ అందించాలని మంత్రులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అదే విధంగా బీసీ, మైనారిటీల లబ్ధిదారులకు యూనిట్ విలువలో 50 శాతానికి మించకుండా రూ.30 వేల వరకు సబ్సిడీ మంజూరు చేసేవారు.
ఈ ఏడాది నుంచి యూనిట్ విలువలో 50 శాతానికి మించకుండా రూ.లక్ష వరకు సబ్సిడీ పెంచాలని మంత్రులు ప్రతిపాదించారు. మంత్రుల బృందం గత నెల 27న హైదరాబాద్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా బ్యాంకుల రుణ సహాయంతో సంబంధం లేకుండా నేషనల్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఫ్‌డీసీ) ద్వారా నేరుగా లబ్ధిదారులకు రుణాలు అందించే విధానాన్ని పునరుద్ధరించాలనే ప్రతిపాదను సైతం మంత్రులు సిఫారసు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీల పెంపుపై కొత్త మార్గదర్శకాలు అందిన తక్షణమే రుణాల విడుదలు చేసేందుకు సిద్ధమై ఉండాలని సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనలను సీఎం ఆమోదిస్తేనే అమలులోకి రానున్నాయి. అప్పటిలోగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసుకుని సబ్సిడీ రుణాల మంజూరు చేయడానికి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
బడుగుల సంక్షేమంపై నీలి నీడలు!
Published Wed, Oct 23 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement