
పాఠశాల నాలుగో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణం
‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అని రాసిన ఎనిమిదో తరగతి విద్యార్థి
పాఠశాలను సీజ్ చేసిన డీఈఓ
ఉప్పల్ (హైదరాబాద్): నగరంలోని ఓ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పీఈటీ కొట్టడమే కాకుండా తోటి విద్యార్థుల ముందు అవమానించాడంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ భవనం నాల్గో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం పొందిన ఘటన శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్ద హంగిర్గా గ్రామానికి చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు.
పెద్ద కుమారుడు లింగారెడ్డి, చిన్న కుమారుడు సంగారెడ్డి(14). వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్‌లో నివాసముంటోంది. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సంగారెడ్డి.. ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ సమయంలో సంగారెడ్డి స్కూల్లో సీసీ కెమెరాలను కదిలించాడంటూ క్లాస్ టీచర్.. పీఈటీ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంజనేయులు కొట్టడంతోపాటు మందలించారు. శనివారం ఉదయాన్నే స్కూల్‌కు వచి్చన సంగారెడ్డిని పీఈటీ పనిష్మెంట్ పేరిట మరోసారి తరగతి గదిలో కొట్టడంతోపాటు అరగంటపాటు నిలబెట్టారు. తల్లిదండ్రులను పిలిపిస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారు.
తోటి విద్యార్థుల ముందు దీన్ని అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన నోట్ బుక్‌లో ‘సారీ మదర్– ఐ విల్ డై టుడే’అని రాసి వాష్‌రూంకు వెళ్తున్నానని చెప్పి తరగతి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ స్నేహితులకు బైబై అని చెప్పాడు. మూడవ అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి నాల్గో అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి సంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం, పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ డీఈవో పాఠశాలను సీజ్ చేశారు.
కన్నీరు మున్నీరైన తల్లి
‘ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నా. ఎంతకష్టమొచి్చనా ఫీజును ఆపే వాళ్లం కాదు. నా కొడుకు ఏ పాపం చేశాడని చంపేశారు? అంటూ సంగారెడ్డి తల్లి కన్నీరు మున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ ఆవరణలో కూర్చుని రోదించడం స్థానికులను కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment