Derangement
-
అబ్బో.. గుత్తి ఎంత గబ్బో..
గుత్తి: స్థానిక మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా, వాటిలో సగం వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దీంతో మురుగునీరు రోడ్లపై, ఇళ్ల ముందర నిల్వ ఉంటున్నారుు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తురకపల్లి రోడ్డు, జంగాల కాలనీ, సీపీఐ కాలనీ, స్వీపర్స్ కాలనీ, జెండావీధి, బండగేరి, కోట, మాల వీధి, కమాటం వీధితో పాటు గుత్తి ఆర్ఎస్లోని ఎస్సీ కాలనీ, తోళ్లషాపు కాలనీ, 7, 8వ వార్డులు, ఎంఆర్ ఫ్యాక్టరీ రోడ్డు, జడ్పీ బాలికల పాఠశాల వీధి తదితర చోట్ల డ్రైనేజీ సరిగా లేదు. డ్రైనేజీలను మెరుగు పరచాలని పలుసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయా కాలనీ వాసులు వాపోయూరు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాహెబ్‌ను వివరణ కోరగా.. గుత్తి పట్టణం కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. దీంతో నిధులు లేమి కారణంగా డ్రై నేజీలను ఏర్పాటు చేయలేక పోతున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా తక్కువగా ఉన్నారన్నారు. దశల వారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామన్నారు. -
సదరం... ప్రాణాంతకం
క్యాంపుల నిర్వహణ అస్తవ్యస్తం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలనే నిబంధన ప్రాణాలు బలిగొంటోంది. దరఖాస్తులపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. బుధవారం వేలాదిమంది వికలాంగులు, వృద్ధులు సదరం కేంద్రాల వద్దకు తరలిరావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రస్తుతం 48వేల మంది వికలాంగులకు సామాజిక పింఛన్ అందుతోంది. ఆరు నెలలుగా మరో 11వేల మందికి సదరం క్యాంపుల ద్వారా వికలాంగులు గా గుర్తించారు. వీరికి కూడా పింఛన్ మంజూరైతే లబ్ధిదారుల సంఖ్య సుమారు 59వేలకు చేరనుంది. డీఆర్డీఏ గతంలో చేపట్టిన వివిధ సర్వేల ప్రకారం జిల్లాలో వికలాంగుల సంఖ్య సుమారు 80వేల మంది మాత్రమే. అంటే మరో 20వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం సామాజిక పింఛన్ పథకం కింద అర్హుల నుంచి మరోమారు దరఖాస్తులు కోరుతోంది. సదరం సర్టిఫికెట్ జతచేసి దరఖాస్తు చేసుకుంటేనే వికలాంగ పింఛన్ మంజూరవుతుందనే భావన లబ్ధిదారుల్లో నెలకొంది. దరఖాస్తు చేసుకునే విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో సదరం కేంద్రాలకు ఒక్కసారిగా దరఖాస్తుల తాకిడి పెరిగింది. వృద్ధులు కూ డా తమను వికలాంగులుగా గుర్తించాలంటూ సదరం కేంద్రాలకు వస్తుండడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, గద్వాల డివిజన్ కేంద్రాల్లో సదరం క్యాంపులు శాశ్వత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. డివిజన్ కేంద్రాల్లో ఎముకలు (ఆర్థో) సంబంధిత వైకల్యానికి మాత్రమే గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర వైకల్యం కలిగిన వారు జిల్లా కేంద్రానికి రావాల్సిందే. దీంతో బుధవారం రోజు 25వేల మంది మహబూబ్‌నగర్ సదరం కేంద్రానికి వచ్చినట్లు అంచనా. పింఛన్లో వ్యత్యాసం వల్లే? వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వేయిరూపాయలు, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల మేరకు 40శాతం వైకల్యమున్న వారికే వికలాంగ పింఛన్ మంజూరవుతుంది. గతంలో సదరం పరీక్షలో 40శాతం పొందలేక పోయిన వారు మరోమారు ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్నారు. సదరం క్యాంపులకు వస్తున్న వారిలో సుమారు 60 శాతం మంది వృద్ధులే. పింఛన్ మొత్తం ఎక్కువగా వుండడం వల్లే వయసుతో పాటు వచ్చే రుగ్మతలను కూడా వృద్ధులు వైకల్యంగా చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాతే సదరం పరీక్షలు నిర్వహించి అర్హులను తేలుస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
బడుగుల సంక్షేమంపై నీలి నీడలు!
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో స్వయం ఉపాధి ప్రోత్సాహక పథకాల అమలు అస్తవ్యస్తంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. సబ్సిడీల పరిమితిని పెంచాలని మంత్రుల బృందం చేసిన సిఫారసులపై ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్‌రెడ్డి ఇంకా ఆమోదముద్ర వేయకపోవడంతో రుణాల విడుదలలో గందరగోళం నెలకొంది. పాత సబ్సిడీలను అమలు చేయాలా? లేక మంత్రులను సిఫారసులను అనుసరించాలా ? అన్న అంశంపై స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో స్వయం ఉపాధి యూనిట్ల మంజూరును నిలిపేసినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,857 యూనిట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 676, బీసీ కార్పొరేషన్ ద్వారా 4,063, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,410 యూనిట్లు, వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా 70 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇంత వరకు ఒక్క యూనిట్ కూడా మంజూరుకు నోచుకోలేదు. మరోవైపు దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడంతోనే ఈ గందరగోళ పరిస్థితి నెలకొందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పడానికి నిరుద్యోగులకు ఆయా కార్పొరేషన్లు సబ్సిడీల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 50 శాతానికి మించకుండా రూ.లక్ష వరకు సబ్సిడీ విడుదల చేసేవారు. ఈ ఏడాది నుంచి యూనిట్ విలువలో 60 శాతానికి మించకుండా రూ.లక్ష వరకు సబ్సిడీ అందించాలని మంత్రులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అదే విధంగా బీసీ, మైనారిటీల లబ్ధిదారులకు యూనిట్ విలువలో 50 శాతానికి మించకుండా రూ.30 వేల వరకు సబ్సిడీ మంజూరు చేసేవారు. ఈ ఏడాది నుంచి యూనిట్ విలువలో 50 శాతానికి మించకుండా రూ.లక్ష వరకు సబ్సిడీ పెంచాలని మంత్రులు ప్రతిపాదించారు. మంత్రుల బృందం గత నెల 27న హైదరాబాద్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా బ్యాంకుల రుణ సహాయంతో సంబంధం లేకుండా నేషనల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఫ్డీసీ) ద్వారా నేరుగా లబ్ధిదారులకు రుణాలు అందించే విధానాన్ని పునరుద్ధరించాలనే ప్రతిపాదను సైతం మంత్రులు సిఫారసు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీల పెంపుపై కొత్త మార్గదర్శకాలు అందిన తక్షణమే రుణాల విడుదలు చేసేందుకు సిద్ధమై ఉండాలని సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనలను సీఎం ఆమోదిస్తేనే అమలులోకి రానున్నాయి. అప్పటిలోగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసుకుని సబ్సిడీ రుణాల మంజూరు చేయడానికి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.