సదరం... ప్రాణాంతకం
క్యాంపుల నిర్వహణ అస్తవ్యస్తం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలనే నిబంధన ప్రాణాలు బలిగొంటోంది. దరఖాస్తులపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. బుధవారం వేలాదిమంది వికలాంగులు, వృద్ధులు సదరం కేంద్రాల వద్దకు తరలిరావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
జిల్లాలో ప్రస్తుతం 48వేల మంది వికలాంగులకు సామాజిక పింఛన్ అందుతోంది. ఆరు నెలలుగా మరో 11వేల మందికి సదరం క్యాంపుల ద్వారా వికలాంగులు గా గుర్తించారు. వీరికి కూడా పింఛన్ మంజూరైతే లబ్ధిదారుల సంఖ్య సుమారు 59వేలకు చేరనుంది. డీఆర్‌డీఏ గతంలో చేపట్టిన వివిధ సర్వేల ప్రకారం జిల్లాలో వికలాంగుల సంఖ్య సుమారు 80వేల మంది మాత్రమే. అంటే మరో 20వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం సామాజిక పింఛన్ పథకం కింద అర్హుల నుంచి మరోమారు దరఖాస్తులు కోరుతోంది.
సదరం సర్టిఫికెట్ జతచేసి దరఖాస్తు చేసుకుంటేనే వికలాంగ పింఛన్ మంజూరవుతుందనే భావన లబ్ధిదారుల్లో నెలకొంది. దరఖాస్తు చేసుకునే విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో సదరం కేంద్రాలకు ఒక్కసారిగా దరఖాస్తుల తాకిడి పెరిగింది. వృద్ధులు కూ డా తమను వికలాంగులుగా గుర్తించాలంటూ సదరం కేంద్రాలకు వస్తుండడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, గద్వాల డివిజన్ కేంద్రాల్లో సదరం క్యాంపులు శాశ్వత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. డివిజన్ కేంద్రాల్లో ఎముకలు (ఆర్థో) సంబంధిత వైకల్యానికి మాత్రమే గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర వైకల్యం కలిగిన వారు జిల్లా కేంద్రానికి రావాల్సిందే. దీంతో బుధవారం రోజు 25వేల మంది మహబూబ్‌నగర్ సదరం కేంద్రానికి వచ్చినట్లు అంచనా.
పింఛన్‌లో వ్యత్యాసం వల్లే?
వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వేయిరూపాయలు, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల మేరకు 40శాతం వైకల్యమున్న వారికే వికలాంగ పింఛన్ మంజూరవుతుంది. గతంలో సదరం పరీక్షలో 40శాతం పొందలేక పోయిన వారు మరోమారు ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్నారు. సదరం క్యాంపులకు వస్తున్న వారిలో సుమారు 60 శాతం మంది వృద్ధులే. పింఛన్ మొత్తం ఎక్కువగా వుండడం వల్లే వయసుతో పాటు వచ్చే రుగ్మతలను కూడా వృద్ధులు వైకల్యంగా చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాతే సదరం పరీక్షలు నిర్వహించి అర్హులను తేలుస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.