పింఛన్ల అలజడి !
పింఛన్ల అలజడి !
Published Thu, Sep 1 2016 11:45 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM
సీఆర్‌డీఏ కమిటీ సభ్యులతోపాటు
పింఛను పొందిన వారిలో కలవరం
∙సమగ్రంగా పరిశీలించాలని ఉన్నతాధికారుల ఆదేశం
మంగళగిరి :
రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం రైతు కూలీలు, పేదలకు ప్రవేశపెట్టిన రూ.2,500 పింఛను సొమ్ము తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్లిందనే వార్త రాజధాని గ్రామాల్లో అలజడి సృష్టించింది. గ్రామాలలో సీఆర్‌డీఏ కమిటీల్లో సభ్యులుగా ఉన్న అధికార పార్టీ నాయకులు తమ అనుచరులు, భూములున్న వారి పేర్లు చేర్చి పింఛను మంజూరు చేయించారు. వచ్చిన పింఛన్లలో వాటాలు తీసుకుంటూ తమ జేబులు నింపుకొన్నారు. గత కొద్ది రోజులుగా అధికారులు పింఛను లబ్ధిదారుల జాబితాలతో వారి ఆధార్, రేషన్ కార్డులతో అనుసంధానం చేస్తుండడంతో పలువురు పింఛనుదారులకు భూములున్నట్లు గుర్తించారు. తప్పుడు సమాచారంతో పింఛను తీసుకున్నవారంతా తిరిగి చెల్లించాలని అ«ధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి రావడంతో కంగుతిన్న సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అన్ని గ్రామాలలో మంజూరైన పింఛన్ల జాబితాలతో ఆధార్ అనుసంధానం చేసి అనర్హులని గుర్తించడంతోపాటు భూములు ఉండి పింఛను పొందిన వారు వెంటనే తిరిగి చెల్లించాలని , లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవని గ్రామాలలో ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అనర్హులు పొందిన పింఛను సొమ్ము తిరిగి చెల్లించేలా కమిటీ సభ్యులను బాధ్యులుగా చేయాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాలలో కొన్ని పింఛన్లు అనర్హులకు మంజూరు అయిన మాట వాస్తవమేనని, తుళ్లూరు మండలంలోని గ్రామాలలో అధికశాతం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారని సమాచారం. ఈ వ్యవహారం చివరకు కమిటీలో సభ్యులైన తెలుగు తమ్ముళ్ల మెడకు చుట్టుకోనుండడంతో వారు నానా హైరానా పడుతున్నారు. భూసమీకరణ విజయవంతం చేసేందుకు రైతులకు అన్ని ఆశలు చూపాలని, తమ పార్టీ వారికి పింఛన్లు వచ్చేలా చూడాలని నాయకులు ఒత్తిడి చేయడంతోనే తాము జాబితాలో భూములున్న వారిని చేర్చామని కొందరు కమిటీ సభ్యులు వాపోతున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement