Social pensions
-
సామాజిక పింఛన్లను తనిఖీ చేయండి
సాక్షి, అమరావతి: సామాజిక పింఛన్లను తనిఖీ చేసి, అనర్హులను తేల్చాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో అనేక మంది అనర్హులు ఉన్నారని చెప్పారు. ఆయన సోమవారం బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. పింఛన్లకు ఎవరు అర్హులు, ఎవరు కాదో తేలాలంటే నిర్థిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. రూ.15,000 పింఛను తీసుకుంటున్న 24 వేల మంది ఇంటికెళ్లి పరిశీలించాలన్నారు. మూడు నెలల్లో దివ్యాంగుల పింఛన్లపై తనిఖీలు పూర్తి చెయ్యాలని, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్లు, అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చేందుకు నియమించిన మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలపై మరింత కసరత్తు చేసి సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చట్టాన్ని తేవాలని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చట్టం తెస్తామన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు న్యాయ పోరాటం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించాలని ఆదేశించారు. స్కిల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్ వంటివి, వీటి ద్వారా విద్యార్థులకు బోధిస్తామన్నారు. 104 బీసీ హాస్టళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలన్నారు. మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, ఎస్.సవిత, అధికారులు పాల్గొన్నారు.ప్రపంచ పండుగ క్రిస్మస్: సీఎం చంద్రబాబు ప్రపంచమంతా పెద్దఎత్తున జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని సీఎం చంద్రబాబు అన్నారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసిన చంద్రబాబు పాస్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవ్యమన్నారు. నమ్మినవారి కోసం బలిదానానికి కూడా వెనుకాడని క్రీస్తు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధి కోసం బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చిల నిర్మాణానికి, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు -
50 కోట్ల మందికి సామాజిక భద్రత
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 కోట్ల మందికి సామాజిక భద్రత పథకాల లబ్ధి చేకూరుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014లో ఈ పథకాల లబ్ధిదారుల సంఖ్య కేవలం 4.8 కోట్లుగానే ఉందని, నాలుగేళ్ళలో 10 రెట్లు పెరిగిందన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో బుధవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘సామాజిక భద్రత పథకాలు ప్రజలు తమ జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు బలాన్ని, ధైర్యాన్నిస్తాయి. ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ సురక్ష యోజన, అటల్ పింఛను యోజన, ప్రధాన మంత్రి వ్యయ వందన యోజన వంటి పథకాల ద్వారా నేడు దేశంలోకి కోట్లాది మందికి ఈ బలం, ధైర్యం వచ్చాయి’ అని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లాగా భారత్‌లో సామాజిక భద్రత పథకాలు పేదలకు అందడం లేదనే చర్చ జరిగేదని.. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. పీఎం జన్‌ధన్ యోజనతో జీవిత బీమా, రూపే కార్డుతో ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. వీటికి తోడు రెండు బీమా పథకాలు, ఒక పింఛను పథకాన్ని ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. వీటన్నిటి ఫలితంగానే.. 2014లో 4.8 కోట్లుగా ఉన్న సామాజిక భద్రత పథకాల లబ్ధిదారుల సంఖ్య పదిరెట్లు పెరిగి 50 కోట్లకు చేరిందన్నారు. పీఎం జన్‌ధన్ యోజనలో భాగంగా దేశంలో 2014–2017 మధ్యలో 28 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచారన్నారు. నేడు ఉత్తరప్రదేశ్‌కు మోదీ ప్రధాని మోదీ గురువారం ఉత్తరప్రదేశ్‌లో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం ఓ బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కబీర్ దాస్ 500వ వర్ధంతిని పురస్కరించుకుని మఘర్‌లో ‘కబీర్ అకాడెమీ’కి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా కబీర్ దాస్ బోధనలు, తత్వాన్ని ప్రసారం చేయనున్నారు. అనంతరం మఘర్‌లో ఏర్పాటుచేయనున్న బహిరంగసభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను సీఎం యోగి సమీక్షిస్తున్నారు. మోదీ మౌలిక ప్రాజెక్టుల సమీక్ష వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్షించారు. 4కోట్ల కుటుంబాలకు విద్యుత్ అందజేసే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ప్రాజెక్టుల పనితీరును సమీక్షించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకోసం ఉద్దేశించిన పథకం అమలుపైనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. 40వేల గ్రామాల్లో (వెనుకబడిన జిల్లాల్లోని) జరుగుతున్న రెండో విడత గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఆగస్టు 15 నాటికి ఈ జిల్లాల్లోని పనులన్నీ పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని భద్రతపై సమీక్ష సాధారణమే! ప్రధాన మంత్రి సహా దేశంలో వీవీఐపీల భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడం సాధారణంగా జరిగే ప్రక్రియేనని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రధానికి ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన భద్రతపై మంగళవారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
దివ్యాంగులకు ప్రభుత్వ చేయూత
మహబూబ్‌నగర్ రూరల్: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారు అన్ని రంగాల్లో రాణించేలా రిజర్వేషన్ రూపంలో పోత్సహిస్తోంది. ప్రస్తుతం వారికి ఉన్న 3శాతం రిజర్వేషన్‌ను 5 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కానీ ఎక్కడా అమలు కాలేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 5 శాతానికి తీసుకున్న నిర్ణయంతో వికలాంగులకు ఎంతో మేలు కలగనుంది. జిల్లాలోని 61 వేల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. 2016 వికలాంగుల చట్టం ప్రకారం 5శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాల్సి ఉంది. వివిధ పథకాల్లో 61వేల మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 22,852 మంది ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత పింఛన్ నెలకు రూ.1500 చొప్పున పొందుతున్నారు. జిల్లాల విభజన అనంతరం ఇప్పటి వరకు 275 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్దిపొందారు. వివిధ కార్పొరేషన్ల నుంచి 81 మంది రుణాలు తీసుకున్నారు. దాదాపు 81 మంది ట్రై సైకిళ్లు, 22మంది వీల్‌చైర్స్‌ను అందుకున్నారు. వారంలో ప్రతి మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించి అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సదరం సర్టిఫికెట్ల కోసం ఇప్పటి దాక 48,480 మంది హాజరు అయ్యారు. ఇందులో 47,881 మందిని వికలత్వ పరీక్ష నిర్వహంచగా వారిలో 31,952 మంది అర్హత సాధించారు. ప్రభుత్వాలు 7 కేటగిరీల్లో వారి వైకల్య శాతాన్ని పరిగణలోకి తీసుకుని సంక్షేమంలో పాధాన్యమిస్తున్నాయి. భరోసా ఇచ్చిన 2016 చట్టం 1995లో వికలాంగుల కోసం చట్టం చేసినా అది అమలుకు నోచుకోలేదు. ఐక్యరాజ్య సమితి తెచ్చిన ఒత్తిడి నేపథ్యంలో 2007లో యూఎన్సీ ఆర్పీడీ డిక్లరేషన్‌పై కేంద్ర ప్రభుత్వం 2014లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. వివిధ కారణాల దృష్ట్యా ఆ బిల్లు రాజ్యసభలో ఆగిపోయింది. 2016లో వివిధ జాతీయ వికలాంగ సంఘాలు ఆందోళన చేపట్టడంతో 2016 డిసెంబర్లో చట్టం తెచ్చారు. ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలను కచ్చితంగా అమలు చేస్తే వికలాంగులు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. అమలుకు చర్యలు జిల్లాలోని వికలాంగులకు ప్రభుత్వం పెం చిన 5 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చూస్తాం. ఇటు ఉద్యోగాల భర్తీ, అటు సంక్షేమ పథకాల్లో, డబుల్ బెడ్రూం ఇళ్లలోనూ 5 శాతం వికలాంగులకు కచ్చితంగా వచ్చేలా ఆ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిం చి న్యాయం జరిగేలా చూస్తాం. – జి.శంకరాచారి, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ జిల్లా అధికారి ప్రభుత్వ నిర్ణయం మాకు వరం దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇప్పుడున్న కోటాను సర్కార్ పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం నిజంగా మాకు వరం లాంటిది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఈ కల ఇప్పుడు నెరవేరనుంది. – ఎ.నరేందర్, ఎల్ఎల్సీ సభ్యుడు రుణపడి ఉంటాం 5శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం హర్షణీయం. ఇది మాకు ఎంతగానో దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వుం మా పట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిది. పెంచిన కోటా తప్పకుండా అమలు చేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – టి.మధుబాబు, ఎన్పీఆర్టీ జిల్లా అధ్యక్షుడు -
విల పింఛెన్
కొవ్వూరు : భద్రత ఐదు రెట్లు అంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. అర్హత ఉన్నా సామాజిక పింఛన్లు అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కాళ్లరిగేలా అధికారులు, ప్రజాప్రతి నిధుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే మీకోసం కార్యక్రమాల్లో వచ్చే వినతుల్లో మూడొంతులు పింఛన్లకు సంబంధించే ఉంటున్నాయి. కనిపించిన ప్రతి అధికారికి దరఖాస్తులిస్తూ.. పింఛను ఇప్పించాలని వేలాదిమంది దీనంగా వేడుకుంటున్నా వారిపై చంద్రబాబు సర్కారు కనికరం చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 24 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మీ కోసం కార్యక్రమంలో అందిన దరఖాస్తులను కలిపితే ఆ సంఖ్య 30 వేలకు పైనే ఉంటుందని అంచనా. కొత్త వారికి దక్కని చోటు జిల్లాలో వివిధ సామాజిక పథకాల కింద 3,39,083 మందికి పింఛన్లు ఇస్తున్నట్టు సర్కారు చెబుతోంది. వీరిలో 1,56,827 మంది వృద్ధులు కాగా, 1,06,308 మంది వితంతువులు ఉన్నారు. 44,409 మంది దివ్యాంగులు, 1,977 మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతుండగా, 26,399 మంది అభయహస్తం పథకం కింద పింఛన్లు ఇస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా అన్ని పథకాల కింద పింఛన్లు పొందుతున్న వారిలో 900 నుంచి 1,100 మంది ప్రతినెలా మృత్యువాత పడుతున్నట్టు డీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. సగటున నెలకు వెయ్యి మంది పింఛనుదారులు మరణిస్తున్నట్టు అంచనా. మరణించిన వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. జిల్లాలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. గడచిన ఏడాది కాలంలో మరణించిన వారి స్థానంలో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను మంజూరు కాలేదు. పాత పింఛన్లకూ కొర్రీలు కొత్త పింఛన్ల మంజూరు విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న పాత వారికి వివిధ కారణాలతో చెల్లించకుండా ఎగవేస్తున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను సొమ్ము తీసుకోకపోతే వారి పేర్లను శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మొదట్లో గుర్తింపు కార్డుల ఆధారంగా పింఛను సొమ్ము చెల్లించేవారు. ఆ తరువాత వేలిముద్రలు, కనురెప్పలు (ఐరిస్) ద్వారా అందిస్తున్నారు. వేలిముద్రలు పడనివారు, పొరుగూళ్లకు వెళ్లిన వారు మరుసటి నెలలో అయినా సొమ్ము అందుకునే వీలుండేది. లబ్ధిదారుల్లో కొందరి పేర్లు మాయమవుతున్నాయి. కనురెప్పలు, వేలిముద్రలు పడని వారికి గ్రామాల్లో అయితే వీఆర్వోలు, పట్టణాల్లో అయితే బిల్లు కలెక్టర్ల వేలిముద్ర ద్వారా సొమ్ము ఇచ్చేవారు. తాజాగా, అందులోనూ అక్రమాలు జరుగుతున్నా నెపంతో కొర్రీలు వేస్తున్నారు. ఈ తరహా కేసులు 5 శాతం మించకూడదని సర్కారు ఆంక్షలు విధించగా, అధికారులు మరో అడుగు ముందుకేసి 2 శాతం మించకూడదనే నిబంధన పెట్టారు. ఫలితంగా వేలిముద్రలు, కనురెప్పలు పడని వారిలో చాలామంది సొమ్ము తీసుకోలేక సతమతం అవుతున్నారు. -
పింఛన్ల అలజడి !
సీఆర్డీఏ కమిటీ సభ్యులతోపాటు పింఛను పొందిన వారిలో కలవరం ∙సమగ్రంగా పరిశీలించాలని ఉన్నతాధికారుల ఆదేశం మంగళగిరి : రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం రైతు కూలీలు, పేదలకు ప్రవేశపెట్టిన రూ.2,500 పింఛను సొమ్ము తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్లిందనే వార్త రాజధాని గ్రామాల్లో అలజడి సృష్టించింది. గ్రామాలలో సీఆర్డీఏ కమిటీల్లో సభ్యులుగా ఉన్న అధికార పార్టీ నాయకులు తమ అనుచరులు, భూములున్న వారి పేర్లు చేర్చి పింఛను మంజూరు చేయించారు. వచ్చిన పింఛన్లలో వాటాలు తీసుకుంటూ తమ జేబులు నింపుకొన్నారు. గత కొద్ది రోజులుగా అధికారులు పింఛను లబ్ధిదారుల జాబితాలతో వారి ఆధార్, రేషన్ కార్డులతో అనుసంధానం చేస్తుండడంతో పలువురు పింఛనుదారులకు భూములున్నట్లు గుర్తించారు. తప్పుడు సమాచారంతో పింఛను తీసుకున్నవారంతా తిరిగి చెల్లించాలని అ«ధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి రావడంతో కంగుతిన్న సీఆర్డీఏ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అన్ని గ్రామాలలో మంజూరైన పింఛన్ల జాబితాలతో ఆధార్ అనుసంధానం చేసి అనర్హులని గుర్తించడంతోపాటు భూములు ఉండి పింఛను పొందిన వారు వెంటనే తిరిగి చెల్లించాలని , లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవని గ్రామాలలో ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అనర్హులు పొందిన పింఛను సొమ్ము తిరిగి చెల్లించేలా కమిటీ సభ్యులను బాధ్యులుగా చేయాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాలలో కొన్ని పింఛన్లు అనర్హులకు మంజూరు అయిన మాట వాస్తవమేనని, తుళ్లూరు మండలంలోని గ్రామాలలో అధికశాతం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారని సమాచారం. ఈ వ్యవహారం చివరకు కమిటీలో సభ్యులైన తెలుగు తమ్ముళ్ల మెడకు చుట్టుకోనుండడంతో వారు నానా హైరానా పడుతున్నారు. భూసమీకరణ విజయవంతం చేసేందుకు రైతులకు అన్ని ఆశలు చూపాలని, తమ పార్టీ వారికి పింఛన్లు వచ్చేలా చూడాలని నాయకులు ఒత్తిడి చేయడంతోనే తాము జాబితాలో భూములున్న వారిని చేర్చామని కొందరు కమిటీ సభ్యులు వాపోతున్నట్లు తెలిసింది. -
మోదీ హామీల అమలు ఎంతవరకు?
గత పంద్రాగస్టున ఇచ్చిన 8 హామీలపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన * జన్‌ధన్ యోజన ప్రయోజనంపై అస్పష్టత * మరుగుదొడ్ల నిర్మాణం నామమాత్రమే * ఉత్తమంగా సామాజిక భద్రత కార్యక్రమాలు న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే కార్యరూపం దాల్చాయని ‘ఫ్యాక్ట్ చెకర్’ సంస్థ పేర్కొంది. అందులోనూ కొన్ని అంశాల్లోనే మెరుగైన ప్రయోజనం కనిపించిందని.. మరిన్ని అంశాల్లో అస్పష్టత నెలకొందని తెలిపింది. ప్రధానమైన 8 అంశాల అమలుతీరుపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన జరిపింది. వివరాలు.. 1. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన నిరుపేదలందర్నీ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. తద్వారా దేశంలో బ్యాంకు ఖాతాల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు 3 నాటికి 22.8 కోట్లకు చేరింది. గత ఏడాది (17.4 కోట్ల ఖాతాలు)తో పోల్చితే.. ఖాతాల సంఖ్య 31 శాతం పెరగడం గమనార్హం. ఖాతాల్లోని సొమ్ము రూ.22,033 కోట్ల నుంచి రూ.40,795 కోట్లకు.. అంటే 85 శాతం పెరిగింది. 2. స్వచ్ఛ విద్యాలయ అభియాన్.. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బాలబాలికలకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు ‘స్వచ్ఛ విద్యాలయ అభియాన్’ను మోదీ ప్రకటించారు. కానీ ఈ లక్ష్యాన్ని ఏ మాత్రం చేరుకోలేకపోయారు.ఢిల్లీ సహా మారుమూల ప్రాంతాల వరకు కూడా స్కూళ్లలో సరైన సంఖ్యలో టాయిలెట్లు లేవని తేలింది. . 3. గివ్ ఇట్ అప్.. ధనికులు పొందుతున్న వంటగ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకునేందుకు ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. 1.04 కోట్ల మంది ఎల్పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోగా, 17.6 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. 4. డీబీటీఎల్తో సబ్సిడీ భారం తగ్గింపు పక్కదారి పడుతున్న ఎల్పీజీ సబ్సిడీ అడ్డుకట్టకు ‘ఎల్పీజీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్)’ తెచ్చారు. గతేడాదిలో రూ.20 వేల కోట్లు సబ్సిడీ భారం తగ్గిందని కేంద్రం చెప్పింది. అయితే తగ్గిన భారం సుమారు 2 వేల కోట్లేనని కాగ్ పేర్కొంది. 5. అన్ని గ్రామాలకు విద్యుత్.. దేశంలో 98.1 శాతం గ్రామాల్లో విద్యుదీకరణ జరిగిందని కేంద్రం పేర్కొనడం వాస్తవ దూరమని ‘ఫ్యాక్ట్ చెకర్’ పేర్కొంది. దేశంలోని 5,97,464 గ్రామాలకుగాను ఈ జూన్ 30 నాటికి 5,87,569 గ్రామాల్లో విద్యుత్ సరఫరా అందుతోందని కేంద్రం చెబుతోంది. అంటే కేవలం 9,895 గ్రామాలకే విద్యుత్ సరఫరా లేదు! 6. సామాజిక భద్రత.. సామాజిక భద్రత కార్యక్రమం కింద కేంద్రం ప్రధానంగా మూడు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ జూన్ 14 నాటికి అటల్ పెన్షన్ యోజన కింద 27 లక్షల మంది, ప్రధాని సురక్షా బీమా యోజన కింద 9.45 కోట్ల మంది, ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన కింద 2.97 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. 7. గ్రామీణాభివృద్ధి.. 2015-16లో వ్యవసాయానికి కేటాయించిన రూ. 24,909 కోట్లతో పోల్చితే ఈసారి 44 శాతం అదనంగా రూ.35,984 కోట్లు బడ్జెట్ కేటాయించింది. కానీ దేశంలోని మొత్తం సాగుభూమిలో 32 % కేవలం 5 శాతం మంది పెద్ద రైతుల చేతుల్లోనే ఉంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం, పట్టణీకరణ కారణంగా సాగు చేసే భూమి విస్తీర్ణం తగ్గిపోతోందని పేర్కొంది. 8. వన్ ర్యాంక్ వన్ పెన్షన్.. మాజీ సైనికోద్యోగులకు ఒక ర్యాంక్ ఒకే పెన్షన్ హామీ ఇచ్చిన మోదీ దానిని అమల్లోకీ తెచ్చారు. ఏటా రూ.7,488 కోట్లు భారం పడుతుందని, బకాయిల చెల్లింపునకు రూ.10,925 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ 2016 మార్చి నాటికి రూ. 2,861 కోట్లే ఖర్చు చేశారు. -
‘ఆసరా’ అవకతవకలపై సర్వే
♦ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారించిన అధికారులు ♦ పోస్టాఫీస్‌లలో పింఛన్ పొందకపోవడంపై ఆరా ♦ వేలిముద్రలు, పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై వాకబు ♦ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ ఏపీడీ, ఏపీఎంలు రంగంలోకి యాచారం : సామాజిక పింఛన్ల అవకతవకలపై అధికారులు దృష్టి సారించారు. ఎక్కడ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.. తప్పుదోవ ఎక్కడ పడుతున్నాయి.. ఇందులో అధికారుల చేతివాటమేమైనా ఉందా.. అంటూ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై అధికారులు రహస్య సర్వే చేపట్టారు. నేరుగా లబ్ధిదారులతో మాట్లాడి వివిధ అంశాలు తెలుసుకున్నారు. పింఛన్ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తుండడంతో కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాల మేరకు లబ్ధిదారులపై రహస్య సర్వే నిర్వహించారు. పోస్టాఫీస్‌లకు వెళ్లి ఎందుకు ఫించన్లు పొందలేకపోతున్నారు.. వేలిముద్రలు సక్రమంగా ఉన్నాయా.. లేవా అని ప్రశ్నించారు. యాచారం మండల పరిధిలోని యాచా రం, మంతన్‌గౌరెల్లి, మల్కిజ్‌గూడ, నక్కర్తమేడిపల్లి, చింతపట్ల, చౌదర్పల్లి, గునుగల్, కొత్తపల్లి తదితర గ్రామాల్లో సర్వే చేపట్టారు. దాదాపు 300 మందికి పైగా లబ్ధిదారులు పోస్టాఫీసుల వద్దకు వెళ్లకపోవడంతో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులే వారికి పింఛన్ డబ్బులు ఇస్తున్నారని విషయం తెలి సింది. డీఆర్డీఏ ఏపీడీ ఉమాదేవి, నలుగురు ఏపీఎంలు కలిసి పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించారు. యాచారంలోనే 39 మంది లబ్ధిదారులు పోస్టాఫీసులోని యం త్రంలో వారి వేలిముద్రలు సరిపోకపోవడంతో పంచాయతీ కార్యదర్శినే తన వేలిముద్రతో డబ్బులు తీసుకుని లబ్ధిదారులకు అందజేస్తున్నాడు. ఏపీడీ ఉమాదేవి ప్రతి లబ్ధిదారుడి ఇంటికెళ్లి ఎందు కు పోస్టాఫీసుకు వెళ్లలేకపోతున్నావ్.. వేలిముద్రల్లో తేడా వచ్చాయా.. పంచాయతీ కార్యదర్శులు డ్రా చేసిన డబ్బులను మీకు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో కూడా ఏపీఎంలు అదే మాదిరి సర్వే నిర్వహిం చారు. కొన్ని గ్రామాల్లో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు ఆ గ్రామాల్లో లేకున్నా పంచాయతీ కార్యదర్శులు డబ్బులు డ్రా చేసి ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రతినెలా డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడం కూడా అధికారుల సర్వేలో తేలింది. కొంతమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గ్రామాల్లో లేకున్నా వారి పేర్ల మీద పంచాయతీ కార్యదర్శులు డబ్బులు తీసుకుని వారి కుటుంబీకులకు అందజేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. విచారణలో వచ్చిన వివరాల నివేదికను కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఏపీడీ ఉమాదేవీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు సతీష్, నర్సింహ, సీసీ గణేష్ పాల్గొన్నారు. -
‘కాల్’నాగులున్నాయ్!
యూఎస్, యూకే అప్రమత్తం అమెరికాలో వెలుగులోకి ‘సోషల్’ స్కామ్ ఈ ముఠాతో సంబంధాలపై అనుమానాలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన కాల్ సెంటర్ క్రైమ్ సమాచారం తెలుసుకున్న అమెరికా, లండన్ కాన్సులేట్ కార్యాలయాలు తమ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ తరహా ముఠాలు మరికొన్ని ఉండొచ్చనే అనుమానంతో యూఎస్‌కు చెందిన సోషల్ సెక్యూరిటీ అడ్మిస్ట్రేషన్‌తో పాటు ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఓఐజీ) కార్యాలయాలు తమ వెబ్సైట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. మరోపక్క అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో బుధవారం ‘సోషల్ సెక్యూరిటీ’ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనికి భారతీయుడే ఆద్యుడని అనుమానిస్తున్న ఆ రాష్ట్ర పోలీసులు... హైదరాబాద్‌లో చిక్కిన ముఠాతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కనెక్టికట్ రాష్ట్రంలోని ఈస్ట్ హార్ట్ఫోర్డ్ టౌన్లో ఉన్న సౌత్ విండర్స్‌లో నివసించే ఇద్దరికిబుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ నుంచి వచ్చినట్లుగా ఫోన్లు వ చ్చాయి. అక్కడి పౌరులకు సోషల్ సెక్యూరిటీ కార్డు, నెంబర్ అత్యంత కీలకం కావడంతో ఫోన్ చేసిన వ్యక్తి వాటి పేర్లతోనే బెదిరించాడు. సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఇతర వివరాలు చెప్పి... అవి రద్దయ్యే ప్రతిపాదన ఉందన్నాడు. తనకు మనీగ్రామ్ ద్వారా నిర్ణీత మొత్తం పంపిచకపోతే ఆ ప్రతిపాదన కార్యరూపంలోకి వ చ్చి... అరెస్టవుతారని హెచ్చరించాడు. దీంతో వీరిద్దరూ అక్కడి పోలీసులకు ఫిర్యా దు చేశారు.ఫోనులో బెదిరించిన వ్యక్తి భాష, వాడిన పదజాలం ఆధారంగా అతడు భారతీయుడుగా అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటికే ఓ బాధితుడు సౌత్ విడ్సర్లోని వాల్‌మార్ట్ ద్వారా ఫోన్ చేసిన వ్యక్తికి 500 అమెరికన్ డాలర్లు చెల్లించేశాడు. ఈ లావాదేవీని ఆపడానికి అక్కడి పోలీసులు ప్రయత్నించినప్పటికీ... దుండగుడు ‘ఈజీ క్యాష్’ పద్ధతితో డబ్బు డ్రా చేసుకోవడంతో సాధ్యం కాలేదు. ఈ నేర విధానం... హైదరాబాద్‌లో చిక్కిన కాల్ సెంటర్ ముఠా నేరాల తీరు...ఒకేలా ఉండటంతో పాటు సౌత్ విండర్స్ వాసులను బెదిరించిన వ్యక్తి భారతీయుడిగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఈస్ట్ హోర్ట్ఫోర్డ్ టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్ సెంటర్ క్రైమ్‌కు సూత్రధారిగా ఉన్న గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఇషాన్ పాఠక్ అమెరికా, లండన్లలోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న విషయం కాన్సులేట్ ద్వారా తెలియడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ‘ఈజీ క్యాష్’ ద్వారా డబ్బు డ్రా చేసుకున్న వ్యక్తి వివరాలు తెలుసుకోవడానికి వాల్‌మార్ట్‌ను సంప్రదిస్తున్నారు. బ్యాంకు రుణాలు, సోషల్ సెక్యూరిటీ కార్డుల పేర్లతో ఫోన్లు వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఓఐజీ అమెరికా పౌరులకు సూచించింది. గాలింపు ముమ్మరం... మరో పక్క హైదరాబాద్‌లో చిక్కిన ముఠా సభ్యులైన 14 మందినీ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న ఇషాన్, రాహుల్ బజాజ్, అలీమ్, ముబీన్లతో పాటు మరో ఐదుగురి కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అరెస్టయిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ న్యాయ స్థా నంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. -
అక్షరాస్యత, ఆదాయం అంతంతే!
► తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి ► పల్లె సీమల్లో 40.42% నిరక్షరాస్యత ► 95.50 లక్షల మంది నిరక్షరాస్యులు ► కేవలం రూ.5 వేల నెల జీతంతో నెట్టుకొచ్చే కుటుంబాలు ఏకంగా 75% ► కేంద్ర సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, అక్షరాస్యత అంతంతేనని తేలింది. మొత్తం కుటుంబాల్లో 7.64 శాతం కుటుంబాలు మాత్రమే నెలసరి జీతం పొందే ఉద్యోగాలపై ఆధారపడి ఉన్నాయి. అందులోనూ రూ.5 వేల లోపు జీతం అందుకుంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ఏకంగా 75.41% కుటుంబాలు ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇక అక్షరాస్యత చూస్తే జాతీయ సగటుతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా నమోదైంది. నిరక్షరాస్యుల జాతీయ సగటు 35.73 శాతం ఉండగా.. రాష్ట్రంలోని పల్లెల్లో 40.42 శాతం నిరక్షరాస్యత నమోదైంది. ఏకంగా 95.50 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు. అక్షరాస్యులు 59.58 శాతం మాత్రమే ఉన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2011 సామాజిక, ఆర్థిక, కుల జనగణన సర్వే (గ్రామీణ ప్రాంతాలు) వివరాలను విడుదల చేశారు. తెలంగాణలో మొత్తం 83,06,746 కుటుంబాలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 57,06,161 కుటుంబాలున్నాయి. తెలంగాణ పల్లెసీమల్లో 2.36 కోట్ల మంది నివాసం ఉండగా.. ఒక్కో కుటుంబంలో సగటున 4.14 మంది సభ్యులున్నారు. గ్రామాల్లోని మొత్తం జనాభాలో 1.19 కోట్ల మంది పురుషులు, 1.16 కోట్ల మంది మహిళలున్నారు. 1,981 మంది హిజ్రాలున్నారు. 83.93 శాతం కుటుంబాలకు పురుషులు యజమానులుగా ఉంటే.. 16.06 శాతం కుటుంబాలకు మహిళలే పెద్దదిక్కుగా ఉన్నారు. 10.51 లక్షల మంది వితంతువులున్నారు. ఇక కులాల వారీగా చూస్తే 10,25,439 (17.99%) ఎస్సీ కుటుంబాలు, 6,81,169 (11.94%) ఎస్టీ కుటుంబాలున్నాయి. 39,96,561 (70.04%) ఇతర కుటుంబాలున్నాయి. 1,587 కుటుంబాలను కులం లేని కేటగిరీగా లేదా ఆదివాసీ కుటుంబాలుగా గుర్తించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి మొత్తం కుటుంబాలు 57,06,101 వెనకబాటుతనంలో ఉన్నవి 25,35,522 భూమిలేక కూలీపై ఆధారపడిన కుటుంబాలు 19,71,246 (34.55 శాతం) గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు 1,11,432 సగానికి పైగా కూలీలే రాష్ట్రంలో వ్యవ సాయంపై ఆధారపడిన కుటుంబాలు 1494378 ఉన్నాయి. ఇందులో రోజూవారీ కూలీకి వెళ్లే కుటుంబాల సంఖ్య 2829348, ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవిస్తున్న కుటుంబాలు 144001, కాగితాలు ఏరుకునే వారు 12247 కుటుంబాలు ఉండగా, వ్యవసాయేతర పనులు(చిన్నచిన్న వ్యాపారాలు) చేసేవారు 150622, ఇంకనూ అడుక్కునే కుటుంబాల సంఖ్య 11273.. నెల జీతం 7.64% మందికే గ్రామీణ ప్రాంతాల్లో 3.50 లక్షల కుటుంబాలు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాయి. మొత్తం కుటుంబాల్లో 7.64% మాత్రమే నెలసరి జీతం పొందే ఉద్యోగాలపై ఆధారపడ్డాయి. 2.73% ప్రభుత్వ ఉద్యోగాలు, 2% ప్రభుత్వరంగ సంస్థలు, 2.95% ప్రైవేటు రంగం నుంచి జీతాలు అందుకుంటున్నారు. కుటుంబంలో జీతం అందుకుంటున్నవారిని లెక్కలోకి తీసుకుంటే... నెలవారీగా రూ.5 వేల లోపు జీతం అందుకుంటున్న కుటుంబాలే ఎక్కువ. 18.77% కుటుంబాలు రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య, కేవలం 5.75% మంది రూ.10 వేలకు మించి జీతం అందుకుంటున్నాయి అత్యధికంగా మొబైల్ ఫోన్లు గ్రామీణ ప్రాంతాల్లో 83.44% మందికి సెల్ ఫోన్లుండగా 30.02% మందికి మోటార్ వాహనాలున్నాయి. టెలిఫోన్(ల్యాండ్‌లైన్) సదుపాయం ఉన్న కుటుంబాలు 67,025 కాగా, మొబైల్ 47,61,293 కుటుంబాలకు(83.44శాతం) ఉంది. రెండూ(మొబైల్/ల్యాండ్‌లైన్)ఉన్న కుటుంబాలు 1,07,823 ఉన్నాయి. మోటారు వాహనాలు (2,3,4 చక్రాలు) కలిగిన కుటుంబాలు 17,12,917 ఉన్నాయి. 5,96,588 కుటుంబాలకు రిఫ్రిజిరేటర్లున్నాయి. భూమి లేనోళ్లే ఎక్కువ భూమి ఉన్న వాళ్ల తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని వాళ్లే ఎక్కువగా ఉన్నా రు. 58% మందికి భూమి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 27367829.10 ఎకరాల భూమి ఉంది. ఇందులో సాగుకు యోగ్యం లేని భూమి 8415384.36 ఎకరాలు ఉండగా,9857792.93 ఎకరాల్లో ఏడాదికి 2 పంటలు పండుతాయి. వ్యవసాయ భూమి కలిగిన కుటుంబాలు 24,17,061 ఉండగా, భూమిలేని కుటుంబాలు 32,88,938 ఉన్నాయి. -
విధేయులకే పింఛన్
ఉదయగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తాం.. ఇందులో ఎలాంటి భేదాలు లేవు. అర్హతనే ప్రామాణికంగా తీసుకొని కొత్త లబ్ధిదారులను ఎంపిచేస్తాం. దీనిని అధికారులు తప్పక పాటించాలి. కొత్తగా సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపికపై ఇటీవల చంద్రబాబు అధికారులతో అన్న మాటలివి. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పట్నుంచో ఇస్తున్న సామాజిక పింఛన్లకు రకరకాల కొర్రీలతో కోతలు పడగా..కొత్తగా మంజూరయ్యే వాటిలోనైనా న్యాయం జరుగుతుందేమోనని వేయికళ్లతో ఎదురుచూసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. అధికారపార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కై అర్హత ప్రాతిపాదిక పక్కనపెట్టి తమ విధేయులకే పింఛను మంజూరుకు సిఫారసు చేస్తున్నారు. కొత్తగా మంజూరైన జాబితాలను పరిశీలిస్తే..ఈ విషయం తేటతెల్లమవుతుంది. 37 వేల దరఖాస్తులు : జిల్లాలో వివిధ రకాల సామాజిక పింఛన్ల కోసం 37 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 14 వేలమందిని అర్హులుగా గుర్తించి వారి పేర్లను ఆన్లై న్లో ఉంచారు. వీటిని కూడా నిశితంగా మరోమారు పరిశీలించి గ్రామకమిటీల ఆమోదం తీసుకొని మరలా అప్లోడ్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమం కూడా మంగళవారంలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. కానీ ఈ జాబితాను పరిశీలిస్తే అర్హులకు మొండిచేయి చూపించినట్లుగా అర్థమవుతోంది. నిబంధనలను గాలికొదిలేసి అధికారపార్టీ నేతలు చెప్పిన జాబితాకే అధికారులు జేకొట్టారు. ఇందుకు ఉదాహరణ.. వరికుంటపాడు మండలానికి 270 పింఛన్లు మంజూరుకాగా, వాటిలో దాదాపు 150కి పైగా అనర్హుల పేర్లే ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలినట్లు ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు చెబుతున్నారు. వృద్ధుల పింఛన్లకు వయస్సు 65 ఉండాలి. కానీ ఆ వయస్సు వారి పేర్లు జాబితాలో లేకపోగా, 40 ఏళ్లున్న వారిపేర్లు జాబితాలో చోటుచేసుకున్నాయి. బోగస్ సర్టిఫికెట్లతో..: మరికొంతమంది బోగస్ అంధత్వ సర్టిఫికెట్లతో అన్ని అవయవాలు చక్కగా ఉన్న వారి పేర్లు కూడా కొత్త జాబితాలో ఉన్నాయి. గణేశ్వరపురం పంచాయతీకి కొత్తగా 39 పింఛన్లు మంజూరుకాగా, వాటిలో అర్హత కలిగిన వారి పేర్లు పట్టుమని ఐదు కూడా లేవు. మిగతా పేర్లన్నీ కూడా యాభై ఏళ్లలోపు వయస్సు ఉన్నవారే. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు పరిశీలించడంతో ఈ విషయం తేటతెల్లమైంది. రాజకీయ నాయకులు వత్తాసుతో..: కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు రాజకీయ నాయకులకు వత్తాసు పలికి జన్మభూమి కమిటీ ఆమో దం పొందిన జాబితాను తొలగించి అనర్హులైన వారి పేర్లను కంప్యూటరీకరించారు. విషయమై ఆ గ్రామస్తులు మంగళవారం ఎంపీడీఓను నిలదీసి ఆందోళనకు దిగారు. అన్ని అర్హతలు ఉన్న 25మంది పేర్లు జాబితాలో లేకుండా చేశారు. వీరిపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులన్న ముద్రవేసి పింఛన్లు లేకుండా తొలగించారని ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలీ అహ్మద్ ఎంపీడీఓను నిలదీశారు. నా పేరు జాబితాలో లేదు: నాకు 65 శాతం వికలాంగత్వం ఉంది. ఏడాది నుంచి పింఛ ను కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. అయినా ఫలితం లేదు. ఇటీవల జన్మభూమి కమిటీ సభ్యులు నా పేరు ఎంపికచేశారు. తీరా జాబితాలో చూస్తే నాపేరు లేదు. మా ఊర్లో అర్హతలేని వారి పేర్లు ఉన్నాయి. -ఎం.అచ్చమ్మ, వికలాంగురాలు, తిమ్మారెడ్డిపల్లి -
రేషన్ షాపులో పింఛన్లు!
డీలర్లతో సర్కారు చర్చలు రూ. 10ల యూజర్ చార్జీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు వివిధ పద్ధతుల్లో పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను ఇకపై రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీ కోసం రాష్ట్రంలో ఉన్న 27,176 రేషన్ షాపుల్లో ఈ-పాస్ (బయోమెట్రిక్) పరికరాలు ఏర్పాటు చేయడానికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ-పాస్ పరికాలను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి బి.రాజశేఖర్ వారం కిందట ఉత్తర్వులు జారీ చేశారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నందున వృద్ధాప్య, వికలాంగు, వితంతు, చేనేత పింఛన్లను డీలర్ల ద్వారా పంపిణీ చేస్తే బాగుంటుందని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు వారితో చర్చలు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఒక్కో లబ్ధిదారునికి పింఛన్ పంపిణీ చేసినందుకు గాను యూజర్ చార్జీ కింద నెలకు రూ.10లు ఇవ్వాలనే డిమాండ్‌ను డీలర్లు తెచ్చారు.ఉపాధి హామీ పథకం పనుల కూలి డబ్బులు కూడా తామే చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఈ విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ నెల 20, 21న హైదరాబాద్‌లో సమావేశం కానుంది. -
అన్ని సమస్యలను పరిష్కరిస్తా: కేసీఆర్
* సీఎం కేసీఆర్ హామీ * వరంగల్ బస్తీల్లో పర్యటన * పేదల ఇళ్లలోకి వెళ్లి సమస్యలు విన్న ముఖ్యమంత్రి * పింఛన్లు రావడం లేదని మహిళల ఫిర్యాదు సాక్షి, వరంగల్: తెలంగాణలో అర్హులైన వారందరికీ సామాజిక పింఛన్లు అందేలా చూస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేదలకు భరోసా ఇచ్చారు. అందుకు చర్యలు తీసుకున్న తర్వాతే వరంగల్‌ను విడిచి వెళతానని వ్యాఖ్యానించారు. వరంగల్ నగరాన్ని మురికివాడలు లేకుండా అభివద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం, గిరిప్రసాద్‌నగర్, శాకరాసికుంట బస్తీల్లో ఆయన పర్యటించారు. దాదాపు మూడు గంటలపాటు బస్తీ ప్రజల మధ్యే గడిపారు. వారి ఇళ్లలోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా ఆసరా పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై చాలా మంది ఫిర్యాదులు చేశారు. అర్హులకు పింఛన్లు రావడం లేదని వాపోయారు. పలు బస్తీల్లో ఏర్పాటు చేసిన వేదికలపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘లక్ష్మీపురంలో యాభై గజాల దూరం నడిచానో లేదో పదిహేను పదహారు మంది వచ్చి ఫించన్లు వస్తలేదని చెప్పిన్రు. ఈ బస్తీలో ఒక్క మనిషే పట్టేంత ఇరుకు సందులు ఉన్నయి. కిందపడితే కాలు విరిగే మురికి కాల్వలు ఉన్నయి. దర్వాజ మీద ఓ కర్ర పెట్టి దానిపైన కప్పు వేసి అందులో ఉంటున్నరు. ఓ ఇంటికి పోతే... నా మీదే కూలుతుందేమోనని భయపడ్డా. బస్తీల్లో ఉండే ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా ఇళ్లు నిర్మించి ఇస్తాం. రెండు బెడ్రూంలు, హాలు, వంటగది, రెండు బాత్రూంలు ఉండే ఇళ్లు నిర్మిస్తం. వీటికి మంచి రోడ్లు, డ్రై నేజీలు, కమ్యూనిటీ హాళ్లు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తాం. మీ అందరి దగ్గరికి అధికారులు వస్తరు. స్థానిక ఎమ్మెల్యే సురేఖ కూడా ఉంటరు. ఇంటిముందు యజమానిని నిలబెట్ట్టి ఫోటో తీస్తరు. ఆ తర్వాత ఇళ్లు కట్టించి... మీ పేరు మీద ఉచితంగా రిజిస్ర్టేషన్ చేసి ఇస్తరు. దీనికి మీరందరు నాలుగు నెలలు ఓపిక పట్టాలి. మీ ఇళ్లు జాగా ఖాళీ చేసి వేరే దగ్గర ఉండాలి. ఈ బస్తీలో చదువుకున్నోళ్లు ప్రభుత్వం చేసే పనికి సాయం అందించాలి. మిగిలిన మురికివాడల ప్రజలు కంగారు పడొద్దు. అందరి ఇళ్లకు వస్తా. అందరి పరిస్థితిని తెలుసుకుంటా (ఈ సమయంలో కొందరు ఈలలు వేశారు). వట్టిగనే సంబరపడొద్దు. సంపాదించి సంబురపడాలె. నేను చెప్పిన పని కాకుంటే రాత్రి(శుక్రవారం) ఈడనే ఉంట. పాత ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి. మాట ఇచ్చినానంటే నెరవేర్చాలే. లేదంటే తలతెగి కిందపడాలే. పది రోజుల్లో వచ్చి ఈ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాను. నాలుగైదు నెలల్లో వచ్చి ప్రారంభిస్తా. మీకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల జాగాలు సమస్యలు ఏమున్నా రెండు రోజుల్లో అధికారులు పరిష్కారం చూపిస్తారు. లేకపోతే కలెక్టరా ? నేనా తేల్చుకుంటాం’ అని ప్రజలకు కేసీఆర్ భరోసా కల్పించారు. కలెక్టర్, కమిషనర్లపై ఆగ్రహం పింఛన్లు రావడం లేదని ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో.. ఇదే పద్ధతంటూ జిల్లా కలెక్టర్ కిషన్‌ను సీఎం ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ సమాధానమిస్తూ... ఆన్లైన్లో జరిగిన పొరపాట్ల వల్ల జాప్యమవుతోందని, ఈ విషయాన్ని ‘సెర్ప్’ సీఈవోకు తెలిపానని చెప్పారు. వెంటనే సెర్ప్ సీఈవోతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ‘ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు. ఈ అప్లోడ్, డౌన్లోడ్ ఎవరికి కావాలి. బుక్కులు పెట్టి పింఛన్లు ఇయ్యమన్న. వందసార్లు కూసుండబెట్టి చెప్పినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి బాగుపడలేదు. వెంటనే వరంగల్‌కు వచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరించు’ అని ఆదేశించారు. లక్ష్మీపురం వెళ్లే దారిలో రోడ్డు గుంతలమయంగా మారి సీఎం కాన్వాయ్‌పై బురద పడింది. కేసీఆర్ కారు దిగగానే.. మున్సిపల్ కమిషనర్ ఎదురుగా వెళ్లి పూలగుచ్చం ఇచ్చి పరిచయం చేసుకున్నారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ‘ఆ రోడ్డు ఏంది, ఆ గుంతలేంది. ఆ నీళ్లేంది. ఏం పని చేస్తున్నావ్. అది కూడా చూసుకోవా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ను పుష్ప అనే మహిళ తన కూతురు పేరిట కల్యాణలక్ష్మి పథకానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా డబ్బులు అందలేదని సీఎంకు ఫిర్యాదు చేయడంతో... వెంటనే పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్‌ను కేసీఆర్ ఆదేశించారు. రాత్రికి వరంగల్‌లోనే బస చేసిన కేసీఆర్.. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలో సమీక్ష జరపనున్నారు. ప్రజలను ఎందుకు చంపుతున్నరు? లక్ష్మీపురం కాలనీలో లచ్చమ్మ ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆమె భర్త శారీరక వికలాంగుడైనా పింఛను రావడంలేదని తెలుసుకున్నారు. బయటకు వచ్చాక మరికొందరు మహిళలు కూడా పింఛన్ల కోసం ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వారిని దగ్గరికి రప్పించుకున్నారు. తన భర్త చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సీఎంకు చూపెడుతూ పింఛన్ రావడం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పింఛన్లు ఎందుకు రావడం లేదని అక్కడే ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ సువర్ణపండాదాస్ను కేసీఆర్ ప్రశ్నించారు. వివరాల కోసం తన చేతిలో ఉన్న టాబ్లో వెతికి.. ‘దరఖాస్తు సరిగా లనందున పింఛను రాలేద’ని కమిషనర్ సమాధానమిచ్చారు. ‘మొగుడు సచ్చిపోయిండని సర్టిఫికేట్ చూపెడతాంటే... ఆన్లైన్, అప్లోడ్, ఇన్లోడని ప్రజలను చంపుతున్నారు. ఎదురుగా కనబడుతున్న మనుషులను చూసి పెన్షన్ మంజూరు చేయొచ్చు కదా? ఆ టాబ్లు ఎందుకు’ అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఏపీలో 12లోపే పింఛన్ల పంపిణీ పూర్తి
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ లోపే పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. మొత్తం 40.52 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. పోస్టల్ కార్యాలయాల ద్వారా జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్లు అందజేస్తామన్నారు. ఎక్కువ సంఖ్యలో పింఛన్లు ఉన్నచోట రోజుకు 150 మంది చొప్పున వీటిని ఇస్తామని తెలిపారు. ఈనెల 12న సంక్రాంతి ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి మృణాళిని చెప్పారు. -
అడ్డదారిలో ఆసరా
⇒ అనర్హుల జేబుల్లోకి పింఛన్ డబ్బులు ⇒జిల్లాలో పదివేల మంది ఉన్నట్టు అంచనా! ⇒వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ⇒రంగంలోకి దిగిన అధికారయంత్రాంగం ఏరివేతకూ దొరకని అక్రమార్కులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛన్ల పథకం(ఆసరా)లోకి అనర్హులు చొరబడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కి పింఛన్లు దక్కించుకున్నారు. దశలవారీగా ఏరివేతచేపట్టినా.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, అధికారుల పొరపాట్ల కారణంగా లక్షల రూపాయ లు పక్కదారి పట్టినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అక్రమాలను తేల్చేందుకు రంగంలోకి దిగింది. ఒకవైపు అర్హత ఉండి పింఛన్లు రాని వారి దరఖాస్తులను పరిశీలిస్తూనే.. మరోవైపు పింఛన్లు పొందిన వారి వివరాలతో ఉన్న అక్విటెన్సీలను తనిఖీచేసి అనర్హుల పేర్లను తొలగించేందుకు ఉపక్రమించింది. పది వేలకు పైమాటే.. గతంలో కంటే పింఛన్లను ఐదురెట్లు పెంచేస్తూ ప్రభుత్వం పంపిణీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,41,081 మందిని అర్హులుగా గుర్తించి ఇప్పటివరకు 2,14,116 మందికి రూ. 44.97కోట్లు పంపిణీ చేశారు. గతంలో ఇచ్చిన మొత్తం కంటే ఐదురెట్లు అదనంగా ఇవ్వడంతో అక్రమార్కులు ఈ డబ్బులపై కన్నేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులను మాయచేసి జాబి తాలో పేరు వచ్చేలా చూసుకుని లక్షాధికారులైన పలువురు పింఛన్లు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉదంతాలపై యంత్రాం గానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అనర్హులను పట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయి లో రంగంలోకి దిగారు. ప్రస్తుతం జిల్లాలో పింఛన్లు పొందినవారిలో దాదాపు పదివేల మంది అనర్హులున్నట్లు అంచనా. సాఫ్ట్‌వేర్‌లో ఏరివేత.. ప్రస్తుతం పింఛన్లు పంపిణీచేసిన వారి వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు(ఆక్విటెన్సీలు)వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలి. అయితే పింఛన్ల పంపిణీ ఇప్పుడిప్పుడే పూర్తికావడం తో.. ఒకట్రెండు రోజుల్లో ఈ ఆక్విటెన్సీలు డీఆర్డీఏకు చేరతాయి. ఈ వివరాలు సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తంచేసే క్రమంలో అనర్హులుగా తేలితే వారి పేర్లు తొల గించనున్నట్లు డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చేనెల నుంచి అనర్హులకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
లబ్..డబ్
32వ డివిజన్ పింఛన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో వృద్ధురాలి మృతి వారం వ్యవధిలో ఇద్దరి కన్నుమూత పోస్టాఫీసులు, పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద వేకువజాము నుంచే క్యూ అల్లాడుతున్న వృద్ధులు, వికలాంగులు పట్టించుకోని పాలకులు, అధికారులు విజయవాడ సెంట్రల్/చిట్టినగర్ : సామాజిక పింఛన్లు పేదల ప్రాణాలు తీస్తున్నాయి. గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము 3 గంటల నుంచి లబ్ధిదారులు పోస్టాఫీసుల వద్ద బారులుతీరుతున్నారు. టోకెన్ల కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారు. వారం రోజుల క్రితం 49వ డివిజన్లో జైనాబీ(75) అనే వృద్ధురాలు పింఛను పోరులో అలసి తనువుచాలించింది. సోమవారం కూడా 32వ డివిజన్లో పడాల కాంతమ్మ (68) అనే వృద్ధురాలు తొక్కిసలాట కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు. చిట్టినగర్ ఈద్గారోడ్డులోని పింఛన్ల కేంద్రం వద్ద పింఛన్ల కూపన్లు పంపిణీ చేస్తారని స్థానిక కార్పొరేటర్ చెప్పడంతో సోమవారం ఉదయం 5 గంటల నుంచి పెద్ద సంఖ్యలో వృద్ధులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో 5.30 గంటల సమయంలో జరిగిన తొక్కిసలాటలో పడాల కాంతమ్మ కిందపడిపోగా, ఆమెపై మరో ఇద్దరు పడ్డారు. గాయపడిన కాంతమ్మను ఆమె కుమార్తె ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలు పార్టీల నాయకులు సొరంగం రోడ్డులో మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. నిత్యం పోస్టాఫీసులు, పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరుగుతున్న తోపులాటల్లో అనేక మంది వృద్ధులు, వికలాంగులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. పరిస్థితి ఇంతదారుణంగా ఉన్నప్పటికీ అధికారులు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై జనం మండిపడుతున్నారు. ఎన్ని తిప్పలో.. నగరపాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లలో 11,777 మంది వృద్ధులు 4,545 మంది వికలాంగులు, 16,547 మంది వితంతువులు, 21 మంది చేనేత కార్మికులు పింఛన్లు పొందుతున్నారు. వీరితోపాటు 825 మంది అభయహస్తం పింఛనుదారులు ఉన్నారు. మొత్తం 33,715 మందికి గానూ, 30 సబ్ పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు డివిజన్లకు ఒకే పోస్టాఫీసులో పింఛన్లు అందించడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. పోస్టాఫీసుల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పంపిణీ లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పింఛన్లకు ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచే లైనులో నిలుచుంటున్నారు. జాబితాల్లో తప్పుల వల్లే ఇక్కట్లు అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్(యూసీడీ) విభాగం నుంచి పోస్టాఫీసులకు చేరిన జాబితాల్లో తప్పులు దొర్లడంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. 55వ డివిజన్లో వికలాంగుడైన యశ్వంత్ వేలిముద్రలు సరిగా పడలేదని పింఛన్ నిలిపివేశారు. మరొకరికి ఒక చేయి లేదు. పది వేలిముద్రలు పడితేనే పింఛన్ అని అధికారులు చెప్పడంతో వికలాంగులు నానా పాట్లూ పడుతున్నారు. రూ.లక్ష అందిస్తాం : బుద్దా వెంకన్న : పడాల కాంతమ్మ కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రకటించారు. గుంటూరు పర్యటన నిమిత్తం ఈ నెల 24ననగరానికి రానున్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని చెప్పారు. రెచ్చగొట్టే వాళ్ల మాటలు నమ్మొద్దు లబ్ధిదారులను కొందరు రెచ్చగొడుతున్నారు. వాళ్ల మాటలు వినడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. పోస్టాఫీసుల్లో రోజుకు వంద మందికి పింఛన్లు ఇస్తారు. వెయ్యి మందికి ఇవ్వలేరు కాదా.. పరిస్థితిని లబ్ధిదారులు అర్థం చేసుకోవాలి. పింఛన్ల పంపిణీలో అన్యాయం జరిగితే నా వద్దకు, లేదా కమిషనర్ వద్దకు రావొచ్చు. అనవసరంగా ఆందోళన చెందనవసరం లేదు. - కోనేరు శ్రీధర్, నగర మేయర్ డోర్ టు డోర్ పంపిణీ చేయాలి పింఛన్లను డోర్ టు డోర్ పంపిణీ చేయాలి. అలా చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. కరెంట్ బిల్లు, ఆస్తి పన్ను వంటిని ఇంటికి వెళ్లి ఇస్తున్నప్పుడు పింఛను ఇస్తే తప్పేంటి. అది సాధ్యం కాదనుకుంటే డివిజన్ల వారీగా అయినా పంపిణీ చేయాలి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పాలకులు మొద్ద నిద్ర పోతున్నారు. కాంతమ్మ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సీహెచ్ బాబూరావు, సీపీఎం నగర కార్యదర్శి ప్రభుత్వమే బాధ్యత వహించాలి నగరంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. లబ్ధిదారుల ప్రాణాలు పోతున్నా పాలకులు, అధికారులు స్పందించకపోవడం దారుణం. జాబితాలు పోస్టాఫీసులకు ఇచ్చి కార్పొరేషన్ అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులకు ఎవరు సమాధానం చెబుతారు. కాంతమ్మ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆమె కుటుంబాకి రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. - పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ -
రెండు నెలల పింఛన్ ఇవ్వాల్సిందే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రతి లబ్ధిదారుడికి రెండు నెలల పింఛన్ నగదు రూపంలో ఇవ్వాలని, ఎక్కడైనా లబ్ధిదారులకు రెండు నెలల పింఛన్ రాకుంటే తనకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు చెబుతున్నారు. జిల్లాలో బుధవారం నుంచి పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఆహారభద్రత కార్డులు కూడా డిసెంబర్ చివరి కల్లా ఇస్తామని అంటున్నారాయన. జిల్లాలో వాటర్‌గ్రిడ్ ద్వారా ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం వస్తుందని, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని, యాదగిరిగుట్టను త్వరలోనే టెంపుల్‌టౌన్‌గా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు కలెక్టర్. అదే విధంగా జిల్లాలో భూరికార్డుల నిర్వహణ సరిగా లేని కారణంగా, టైటిల్ సమస్యలు వస్తున్నాయని, దీనిని నివారించేందుకుగాను త్వరలోనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగులు మరింత శ్రమించాలని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కొంత ఇబ్బంది అయినా అంకితభావంతో పనిచేయడం ద్వారా భావి తరాలకు మేలు చేయాలని అంటున్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణపై మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సామాజిక పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి? పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలోని 3.04లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ ఇస్తాం. ప్రతి లబ్ధిదారునికి నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించాం. జిల్లాలో ఎక్కడైనా ఎవరికైనా రెండు నెలల పింఛన్ ఇవ్వకుంటే కలెక్టరేట్లోని టోల్‌ఫ్రీనంబర్ 18004251445కు ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా పింఛన్ల మంజూరుకు మరో 80వేల వరకు విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. అందులో మరో 25వేల వరకు అర్హత సాధించవచ్చని అంచనా. అన్నీ కలిపితే జిల్లాలో 3.30లక్షల మందికి సామాజిక పింఛన్లు అందే అవకాశం ఉంది. అయితే, ఈ 25వేల మందికి ఈనెల 20-25 వరకు పింఛన్లు ఇస్తాం. ఎవరూ పింఛన్లు రాలేదని నిరాశపడొద్దు. పింఛన్లు, ఆహారభద్రత కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ. అనవసర ఆందోళనకు గురయి దళారులను ఆశ్రయించవద్దు. ఆహార భద్రత కార్డుల పరిస్థితి ఏంటి? ఆహారభద్రత కార్డుల కోసం జిల్లాలో దాదాపు 11లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతోం ది. ఇప్పటివరకు 7.24లక్షల దరఖాస్తులు పరిశీలించాం. అందులో 71 శాతం అంటే 5.14లక్షల దరఖాస్తులు అర్హత సాధించాయి. మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేసి డిసెం బర్31కల్లా లబ్ధిదారుల తుదిజాబితా తయారుచేస్తాం. జనవరి1 నుంచి కొత్త కూపన్లపై రేషన్ ఇస్తాం. ఫిబ్రవరికల్లా కార్డులు కూడా వస్తాయి. గతంలో మాదిరిగా రేషన్‌బియ్య ంపై సీలింగ్ లేదు. ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున బియ్యం కిలో రూపాయికి అందిస్తాం. అదే విధంగా జనవరి నుంచి సం క్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నా యి. ఇందుకోసం వార్డెన్ల నుంచి ఇండెంట్ తెప్పిస్తున్నాం. వాటర్‌గ్రిడ్ పైలాన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు? అసలు జిల్లాలో వాటర్‌గ్రిడ్ ప్రణాళికలేంటి? ఎప్పటివరకు ఈ ప్రణాళిక పూర్తవుతుంది? దీర్ఘకాలికంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న జిల్లాకు వాటర్‌గ్రిడ్ ద్వారా పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం. వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లాకు కృష్ణాజలాలు అందుతాయి. గతంలో తలసరి నీటి వినియోగం 40లీటర్లు కాగా, ఇప్పుడు 100 లీటర్లుగా పరిగణించి జిల్లాకు 8టీఎంసీల నీరు కావాలని అంచనా వేస్తున్నాం. ఇందుకోసం మూడు చోట్ల మేజర్గ్రిడ్లు, కొన్ని సబ్గ్రిడ్లు, ట్రంక్లయిన్స్, పైప్లైన్ల విస్తరణ, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను మొత్తం 3,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అయితే, పూర్తిస్థాయి ప్రణాళిక మరోవారం పది రోజుల్లో రెడీ అవుతుంది. యాదగిరిగుట్ట అభివృద్ధి కార్యాచరణ ఏమిటి? గుట్టను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకు అనుగుణంగా రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇప్పటికే ఆలయ భూమి 130 ఎకరాలుంది. మరో 300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇస్తున్నాం. మిగిలిన 1500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ సేకరించాల్సిన భూమిని కూడా గుర్తించాం. త్వరలోనే దేవస్థాన నిర్వహణ కమిటీని కూడా ప్రకటించవచ్చు. అదే విధ ంగా యాదగిరిగుట్టను టెంపుల్‌టౌన్‌గా ప్రకటిస్తూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సే యోచనలో ఉంది. హరిత హారం ఏ దశలో ఉంది? హరితహారం కింద జిల్లాలో 14.40కోట్ల మొక్కలు నాటాల ని నిర్ణయించాం. ఇందుకోసం 480నర్సరీలను ఎంపిక చే శాం. ఈ నర్సరీలకు భూమి కూడా గుర్తించాం. వనసేవకులకు శిక్షణనిస్తున్నాం. ఔట్‌సోర్సింగ్‌ద్వారా కొందరు ఉ ద్యోగులను నియమించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో భా గంగా 50శాతం టేకు మొక్కలను నాటాలని నిర్ణయించాం. మిగిలినవి పెరటిమొక్కలు, ఇతర మొక్కలను నాటుతాం. జిల్లాలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఇంకా ప్రారంభం కానట్టుంది? జిల్లాలో మిషన్‌కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు 25 చెరువులకు టెండర్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 4600 చెరువులకు గాను 900 చెరువులను ఈ ఏడాది పునరుద్ధరిస్తాం. టెండర్లు పూర్తయితే కానీ ఖర్చు లెక్క రాదు. దళితులకు భూపంపిణీ నత్తనడకన నడుస్తోందా? ఈ ప్రక్రియలో కొంత వెనుకబాటు ఉన్న మాట వాస్తవమే. అయితే, ఇందుకు భూసమస్యలున్నాయి. భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండి, అమ్మడానికి పట్టాదారులు సిద్ధంగా ఉన్నా టైటిళ్లు సరిగా లేవు. ఈ టైటిళ్ల సమస్య కారణంగా కొంత జాప్యం జరుగుతోంది. అసలు జిల్లాలో భూరికార్డుల నిర్వహణ కూడా అంత సమగ్రంగా లేదు. అందుకే జనవరి 16 నుంచి మార్చి 30వరకు రెవె న్యూ సదస్సులు పెట్టబోతున్నాం. ఆ సదస్సుల్లో రికార్డుల ను కంప్యూటరీకరించే ప్రక్రియకు పూనుకుంటున్నాం. దళి తులకు భూపంపిణీకి సంబంధించి ఇప్పటివరకు 66 ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తయింది. మరో 60 ఎకరాలు ప్రాసెస్‌లో ఉంది. వరుసగా వస్తున్న కార్యక్రమాలతో ప్రభుత్వ ఉద్యోగులపై పనిఒత్తిడి కనిపిస్తోంది? మీపై కూడా కొందరు ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నట్టున్నారు? నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కనుక అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోంది. ఈ కార్యక్రమాలను శరవేగంతో అమలు చేయడంతో పాటు అమలులో పారదర్శకత ఉండాలి. ఇందుకు ఉద్యోగులు మరింత శ్రమ చేయాల్సి వస్తోంది. ఇది కొందరికి ఇబ్బంది అనిపించినా తప్పదు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలంటే ఒత్తిడి అనివార్యం. అయినా, పోరాడి సాధించుకున్న రాష్ట్రం కోసం అంకితభావం, ఉత్సాహంతో పనిచేయడం ఉద్యోగుల బాధ్యత. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మనస్ఫూర్తిగా స్వీకరించి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంకితభావంతో పనిచేసినప్పుడే భావితరాలకు మేలు చేసిన వాళ్లవుతాం. ఈ అసంతృప్తి సమస్య అన్ని జిల్లాల్లో ఉంది. మన దగ్గరే కాదు. అయినా, అన్ని ప్రభుత్వ పథకాల అమలులో మనమే ముందున్నాం. -
ఉందో.. ఊడిందో..!
మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్లకు ముహూర్తం రానే వచ్చింది. నేటి నుంచి జిల్లావ్యాప్తంగా పెంచిన పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికారులు రూపొందించిన జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయో.. ఊడాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా పలువురికి పింఛన్లు అందించినా.. అర్హుల నిర్ధారణలో నెలకొన్న అంతరాయంతో తాత్కాలికంగా నిలిపివేశారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నుంచి నిరసనలు మిన్నంటడంతో ఈనెల 10 నుంచి 15వ తేదీలోపు అర్హులందరికీ గత నెల బకాయిలతో సహా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 లక్షల మంది అర్హులు.. ఈ క్రమంలో జిల్లాలో 2.5 లక్షల మందిని అర్హులుగా గుర్తించిన జిల్లా యంత్రాంగం, వారికి సంబంధించి న రూ.42 కోట్లను అన్ని మండలాల ఖాతాలో జమచేసింది. జిల్లాలో 3.38 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 2.5 లక్షల మందిని ఇప్పటివరకు అర్హులుగా గుర్తించారు. గతంలో జిల్లాలో 2.60 లక్షల మంది పింఛన్‌దారులుండగా.. వడపోతతో 55 వేల మంది పింఛన్‌కు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. పింఛన్ల పంపిణీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా.. పేర్లు గల్లంతైన లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలూ లేకపోలేదు. పూర్తికాని అర్హుల జాబితా.. సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో 3.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులను క్షేత్ర స్థా యిలో పరిశీలించిన అధికారులు గత అక్టోబర్ 7వ తేదీ వరకు 2.1 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరిని ప్రభుత్వం నిర్దేశించిన సాఫ్ట్వేర్ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చే క్రమంలో వేల సంఖ్యలో అనర్హులయ్యారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా పొరపాటు జరిగిందని భావించిన అధికారులు, పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. సాంకేతిక సమస్యను పరిష్కరించే క్రమంలో నిమగ్నమయ్యారు. తాజాగ సాఫ్ట్వేర్ సమస్యను అధిగమించినట్లు అధికారులు చెబుతున్నా.. అర్హుల వివరాలు సరిపోల్చే అంశం ఇంకా పూర్తి కాలేదు. సాఫ్ట్‌వేర్‌లోని సమస్య తీరిందని గత నెల 29వ తేదీన 2.11 లక్షల మంది అర్హులని జిల్లా అధికారులు ప్రకటించినా, ఆ తరువాత జరిపిన పునఃపరిశీలనలో అర్హుల సంఖ్య 9వ తేదీ (మంగళవారం)కి 2.5 లక్షలుగా తేల్చారు. ఇప్పటికీ ఇంకా అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేనివారు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని మండల కార్యాలయాలకు రావాలని అధికారులు అంటున్నారు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారులందరికీ పింఛన్లు అందించడం ప్రహసనంగా కనిపిస్తోంది. మండల యంత్రాంగమంతా సన్నద్ధం.. బుధవారం నుంచి ఐదు రోజులపాటు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్, తదితర అధికారులు తేదీల వారీగా గ్రామాలను ఎంపిక చేసి ప్రణాళికలు సిద్ధం చేశారు. గత నెల బకాయితోపాటు, ప్రస్తుతం నెలకు సంబంధించిన పింఛన్ ఇవ్వాలి. అంటే.. ఒక్కో లబ్ధిదారుకు రెండు నెలల పింఛన్ రూ.2 వేలు, వికలాంగులకు రూ.3 వేలు పంపిణీ చేయాల్సి ఉంది. ఒకవైపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడం, మరోవైపు పారదర్శకత పేరిట పంపిణీ నెమ్మదించనుందని, దీంతో నిర్దేశించిన తేదీల్లో పూర్తిస్థాయి పంపిణీ కష్టమని అధికారులు చెబుతున్నారు. మారిన నిబంధనలతో ఇబ్బందులు సామాజిక పింఛన్లు పెంచి, కేవలం అర్హులకు మా త్రమే అందిస్తామంటూ ప్రభుత్వం సూచించిన పలు మార్గదర్శకాలు లబ్ధిదారుల పాలిట శాపంగా మా రాయి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు పెంచుతూ జీవో 23 జారీ చేసింది. కుటుంబం మొత్తం వార్షికాదాయా న్ని పరిగణలోకి తీసుకోవాలని, దాన్ని ధ్రువీకరించేందుకు తహశీల్దారు నుంచి ఆదాయ ధ్రువీకరణ ప త్రం తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది. దీంతో అ న్ని అర్హతలు ఉన్న వారు సైతం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తి రుగుతున్నారు. గతంలో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉన్నా పరవాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ పత్రమే తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆదాయ ధ్రు వీకరణ పత్రం పొందని వారు అర్హత సాధించలేక, ఈ నెలలో కూడా పింఛన్లను కోల్పోనున్నారు. ధ్రువీ కరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగితే అధికారులు తాము బిజీగా ఉన్నామంటూ సమాధానాలిస్తున్నారని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మరికొందరివి కుటుంబ సర్వేలో నమోదు చేసినా, డాటా ఎంట్రీ చేయడంలో జరిగిన పొరపాట్లతో సర్వేలో వివరాలు లేకుండా పోయాయి. జిల్లా మొత్తంలో వేలల్లోనే కుటుంబ సర్వేలో తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వీరికి కూడా పింఛన్లు మంజూరు లేకుండాపోయింది. దీంతో ఈ ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని, వచ్చే నెల వరకైనా తమకు పింఛన్ ఇస్తరో లేదోనని పలువురు వితంతువులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. అర్హులందరికీ పింఛన్.. - వెంకటేశ్వర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ జిల్లాలో 2.5 లక్షల మందిని పింఛన్‌కు అర్హులుగా గుర్తించాం. రెండు నెలలకు సంబంధించి రూ.42 కోట్లు అన్ని మండలాలకు అందించాం. అర్హుల జాబితా తయారీ ఇంకా కొనసాగుతోంది. అనర్హతతో పింఛన్ కోల్పోయిన వారు, అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వారి మండల కార్యాలయాలకు వెళితే వారు పరిశీలించి, అర్హత కల్పిస్తారు. ఆధార్‌లో వయస్సు తప్పుగా నమోదైతే ఏదైనా స్టడీ సర్టిఫికేట్, ఓటరు ఐడీకార్డు తీసుకొస్తే అందులో ఉన్న వయస్సును పరిగణలోకి తీసుకుని పింఛన్ అందిస్తాం. -
పెన్షన్.. టెన్షన్
చల్లపల్లి : సామాజిక పింఛన్లు డిసెంబర్ నుంచి పోస్టాఫీసుల్లో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో సోమవారం లబ్ధిదారులు ఆయా కార్యాలయాలకు క్యూ కట్టారు. తొలిరోజు పింఛన్లు అందకపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. డిసెంబర్ నుంచి పోస్టల్ శాఖకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం పోస్టల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కొన్ని పోస్టాఫీసులకు పింఛన్లు పంపిణీ చేసే యంత్రాలను అందజేసింది. జిల్లాలో 3.13 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉండగా, వారిలో 1.25 లక్షలు వృద్ధాప్య, 1.16 లక్షలు వితంతు, 45 వేలు వికలాంగ, 5 వేలు చేనేత, 2 వేలు కల్లుగీత, 20 వేల మంది అభయ హస్తం పింఛనుదారులు ఉన్నారు. గతంలో వీరికి సీఆర్పీలు పింఛన్లు అందజేసేవారు. ప్రస్తుతం పోస్టల్ శాఖకు మార్చినా పింఛన్ల సొమ్ము ఆయా ఖాతాలకు జమ కాకపోవడం, లబ్ధిదారుల ఫొటోలు కంపూటర్లో అసుసంధానం కాకపోవడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛనుదారులు పోస్టాఫీసుల వద్దనే పడిగాపులు పడ్డారు. ఈ నెల 7 వరకేనా? పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు మాత్రమే నిర్వహించాలని ఉన్నతాధికారులు పోస్టల్ సిబ్బందిని ఆదేశించినట్టు తెలిసింది. అవి కూడా రోజుకు వంద మందికి మాత్రమే ఇస్తామని అధికారులు, సిబ్బంది ప్రకటించారు. కొన్నిచోట్ల పోస్టాఫీస్ పరిధిలో 2 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. రోజుకు వందమంది చొప్పున పింఛన్లు ఇచ్చేటప్పుడు వీరందరికీ వారం రోజుల్లో ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని పలువురు లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. తొలిసారిగా పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు తీసుకుంటున్నవారు మూడు ఫొటోలు, ఆధార్, పింఛన్ పుస్తకం జిరాక్సు కాపీలు ఇచ్చిన తరువాత.. వాటిని సరిచూసుకుని సొమ్ము ఇస్తామని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ వారం రోజుల్లో పత్రాల పరిశీలన తతంగం ముగిసేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతుందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు నెలల పింఛన్లు కలిపి డిసెంబర్లో ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించగా ఈ నెలలో 7వ తేదీ దాటితే పరిస్థితి ఏమిటో అర్థం కావడంలేదని పలువురు పింఛనుదారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ తిప్పించుకునే కంటే రోజులో ఏ ప్రాంతం వారికి పింఛన్లు ఇస్తారో తెలియజేస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. -
పింఛన్లు ఆగమాగం..
సాక్షి, హైదరాబాద్: ‘సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 31.67 లక్షల మందికి ప్రభుత్వం ప్రయోజనం క ల్పించింది. అయితే ఆయా యూనిట్ కార్యాలయాల్లో రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు మార్చి 2013 వరకు అందిన దరఖాస్తుల సంఖ్య, అందులో ఆమోదించిన, తిరస్కరించిన వాటి వివరాల్లో స్పష్టత లేదు. మంజూరులో జాప్యానికి, తిరస్కరణకు గల కారణాలను కూడా సరిగా పేర్కొనలేదు..’ అని కాగ్ తమ నివేదికలో స్పష్టం చేసింది. పింఛన్ చెల్లింపుల్లో స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రారంభించి ఐదేళ్లు దాటినా 66 శాతానికి మించి లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు అందించలేదని, దీంతో చెల్లింపుల్లో పార దర్శకత సాధించే లక్ష్యం పూర్తిస్తాయిలో నేరవేరలేదని కాగ్ పేర్కొంది. క్షేత్రస్థాయిలో చెల్లింపు కాని నిధులను ప్రభుత్వానికి జమ చేయకపోవడం, పథకాన్ని అమలు చేసే సంస్థలు వినియోగ ధ్రువపత్రాలను అందజేయకపోవడం వంటి ఆర్థిక లోపాలను కాగ్ బహిర్గతం చేసింది. రికార్డుల నిర్వహణ పేలవంగానూ, అంతర్గత నిర్వహణ బలహీనంగానూ ఉందని... ఫలితంగా నిర్వహణ వ్యవస్థలో లోపాలకు, నష్టభయానికి అవకాశమిస్తున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. మగవారికి వితంతు పింఛన్లు.. మగవారికీ, భర్త జీవించి ఉన్న మహిళలకు వితంతు పింఛన్లు ఇచ్చినట్లు తమ పరిశీలనలో వెల్లడైనట్లు కాగ్ పేర్కొంది. వయస్సు నిర్ధారణ పత్రాలు లేకుండానే వృద్ధాప్య పింఛన్లు, ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ పింఛన్లు ఇచ్చినట్లు తేలిందని.. అర్హతలేనివారికి పింఛన్లు, దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం చేసిన సందర్భాల్లో అధికారులు రిమార్కులు రాయకపోవడం వం టి లోపాలు బయటపడ్డాయని తెలిపింది. సామాజిక పింఛన్ల డేటాబేస్ ప్రక్షాళన నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేందుకు తగిన ప్రాధాన్య త ఇవ్వాలని, అనర్హుల తొలగింపుతో పాటు అర్హుల ఎంపికను సరిచూసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. -
ఓ ఘట్టం ముగిసింది
గ్రేటర్లో పింఛను దరఖాస్తుల పరిశీలన పూర్తి 1.55 లక్షల మంది అర్హులుగా గుర్తింపు 96,590 దరఖాస్తుల తిరస్కృతి మరోసారి దరఖాస్తుకు అవకాశం సిటీ బ్యూరో: సామాజిక పింఛన్లకు సంబంధించి కీలక ఘట్టమైన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా సామాజిక పింఛన్లకు 1,55,253 మందిని ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్ జిల్లాలో 87,217 మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో 68,036 మంది ఉన్నారు. అక్టోబర్ నుంచి పెంచిన కొత్త పింఛన్ల అమలుకు పూనుకున్న ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించగా... ఎట్టకేలకు నగరంలో సమగ్ర కుటుంబ సర్వే లింకుతో ఈ తంతు పూర్తి చేశారు. అనర్హులు 96 వేలకు పైనే... నగరంలో సామాజిక పింఛన్లకు 2,51,843 దరఖాస్తులు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వే లింకుతో దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 1,55,253 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన 96,590 దరఖాస్తుదారులను అనర్హులుగా తిరస్కరించారు. వీరిలో అర్హులు ఉండీ...తిరస్కారానికి గురైతే తిరిగి ఆర్డీఓకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి అధికారులు అవకాశం కల్పించారు. ఇలాంటి దరఖాస్తులపై ఆర్డీఓ పర్యవేక్షణలో విచారణ చేపట్టి .. అర్హులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక ఇలా... రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో సామాజిక పింఛన్లకు వచ్చిన 1,13.456 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 68,036 మందిని అర్హులుగా గుర్తించారు. 45,420 దరఖాస్తులను తిరస్కరించారు. హైదరాబాద్ జిల్లాలో సామాజిక పింఛన్లకు వచ్చిన 1,38,387 దరఖాస్తులలో... 87,217 అర్హమైనవిగా గుర్తించారు. మిగిలిన 51,170 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారుల్లో వికలాంగుల పింఛన్లకు 15,728 మంది,వితంతు పింఛన్లకు 39,860 మంది ఉన్నట్టు తేల్చారు. వృద్ధాప్య పింఛన్లకు 31,629 మంది ఎంపికయ్యారు. త్వరలో పంపిణీ నగరంలో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన అధికార యంత్రాంగం సత్వరమే పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై దృష్టి సారిస్తోంది. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి పింఛన్లు అందజేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. -
‘ఆధార్’ లేదని...
రంగారెడ్డిలో 60 వేల మందికి పింఛను కట్ గ్రేటర్ పరిధిలో 8 నెలలుగా నిలిచిన పంపిణీ రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛ న్లు అందక పట్టణ ప్రాంత లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆసరా’ పథ కానికి తలెత్తిన సాంకేతిక సమస్యతో పింఛన్ల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అంతకుముందు ఇవ్వాల్సిన ఇందిరమ్మ పింఛన్లు 8 నెలలుగా యంత్రాంగం నిలిపివేసింది. మార్చి నెలాఖరు నాటికి ఆధార్ వివరాలు ఇవ్వలేదంటూ గ్రేటర్ పరిధిలోని 59, 820 మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి పింఛన్లు పంపిణీ చేయడం లేదు. రూ.11.63 కోట్లు వెన క్కి... రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ల పథకం రద్దు చేస్తూ... కొత్తగా ఆసరా పథకాన్ని అమల్లోకి తేవడంతో ఇందిరమ్మ పింఛన్లకు సంబంధించి రూ.11.63 కోట్లను జిల్లా యంత్రాంగం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీంతో లబ్ధిదారులంతా పింఛన్లకు దూరమయ్యారు. ఇటీవల ఈ అంశంపై పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని నిలదీయ గా.. ఆధార్ అనుసంధానం చేసుకున్న వారి వివరాలు ప్రభుత్వానికి నివేదించామని చెప్పి...చేతులు దులుపుకున్నారు. నమోదైంది 30వేల మందే ఆధార్ వివరాలు కోరిన నేపథ్యంలో 59,820 లబ్ధిదారుల్లో 30వేల మంది మాత్రమే సమాచారం ఇచ్చినట్లు డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. వీరి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇన్చార్జ్ పీడీ చంద్రకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం నివేదికను పరిశీలించి, నిధుల విడుదలకు అంగీకరిస్తే 30వేల మందికి పింఛను బకాయిలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన29,820 మంది పింఛనుపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. జిల్లాలో జీహెచ్ఎంసీ సర్కిళ్లవారీగా లబ్ధిదారుల వివరాలు సర్కిల్ లబ్ధిదారులు శేరిలింగంపల్లి 5676 మల్కాజిగిరి 3892 రాజేంద్రనగర్ 5075 కూకట్పల్లి 11750 ఎల్బీనగర్ 9791 ఉప్పల్ 4704 కాప్రా 5141 కుత్బుల్లాపూర్ 10674 అల్వాల్ 3117 -
వచ్చే నెల నుంచి పోస్టల్ ద్వారా పింఛన్లు
* బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ * పోస్టల్ అధికారుల వర్క్‌షాపులో కలెక్టర్ విజయవాడ : సామాజిక భద్రత పింఛన్లను బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ చేయాల్సిన గురుతర బాధ్యత పోస్టల్ సిబ్బందిపై ఉందని కలెక్టర్ ఎం. రఘునందన్ రావు చెప్పారు. సబ్-కలెక్టర్ కార్యాలయంలో నేరుగా నగదు బదిలీ పథకం(డి.బి.టి.)పై పోస్టల్ అధికారులకు సోమవారం నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. వచ్చే నెల నుంచి పోస్టల్ శాఖ ద్వారా పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పోస్టల్ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని చెప్పారు. గ్రామాల్లో పింఛన్ల పంపిణీలో ఇబ్బందులను ముందుగానే అధ్యయనం చేసి వాటిని సరిదిద్దుకోవాలన్నారు. పింఛన్లు ఏ రోజున , ఏ సమయానికి అందిస్తామో నోటీసు బోర్డుల్లో ఉంచాలని పోస్టల్ అధికారులకు సూచించారు. ఇందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఒకరిని నియమిస్తామని చెప్పారు. పోస్టు మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 11 జిల్లాల్లో 426 మండలాల్లో 8,681 గ్రామపంచాయతీల పరిధిలో 7,781 పోస్టాఫీసుల ద్వారా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. విజయవాడ పోస్టల్ సేవల సంచాలకులు కె. సోమసుందరం మాట్లాడుతూ జిల్లాలో 973 గ్రామ పంచాయతీల పరిధిలో 6,28,281 మంది పేదలకు ఎన్ఆర్ఈజీఎస్ రోజువారీ వేతనాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలో 3లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ పి. మధులత, డీఆర్డీఏ ఏపీడీ జ్యోతి, పోస్టల్ శాఖ సహాయ సంచాలకులు సయ్యద్ అన్సార్ పాల్గొన్నారు. -
మళ్లీ మొదటికే!
దరఖాస్తుల పునఃపరిశీలనకు కలెక్టర్ ఆదేశం సాక్షి, మహబూబ్‌నగర్: సామాజిక పింఛన్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. పింఛన్లకు సంబంధించి జిల్లాలో భారీగా కోత పడింది. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయంగా, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో జాబితాను బయటపెట్టడంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో భారీగా కోత పడడంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని తీరుపై సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ పింఛన్ల ప్రక్రియను మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలకు సంబంధించి సామాజిక పింఛన్లు లభించే పరిస్థితి కనిపిం చడం లేదు..! వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితరులకు సం బంధించిన సామాజిక పింఛన్లను ప్ర భుత్వం పెద్దఎత్తున పెంచింది. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 1నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 అందజేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అర్హులకు మాత్రమే పింఛన్లు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం తాజా గా దరఖాస్తులు ఆహ్వానించింది. వాటి ని ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన సమ గ్ర కుటుంబ సర్వేతో పోల్చి అర్హులను తేల్చాలని నిర్ణయించింది. అయితే వాటిని అలుసుగా చేసుకొని అధికారులు పెద్దఎత్తున కోతలు విధించారు. చాలాచోట్ల అర్హులను కూడా వదిలేశా రు. దీనికి నిరసనగా కొన్ని రోజులుగా ఎక్కడిక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు జరుగుతున్నాయి. భారీగా కోతలు జిల్లాలో గతంలో 2,45,639 వృద్దాప్య పింఛన్లు, 1,30,718 వితంతు, 46,484 వికలాంగులు, 14,416 చేనేత, 1,408 గీత కార్మికుల, 20,771 అభయహస్తం ఇలా మొత్తం 4,59,436 మంది పింఛన్లు తీసుకునే వారు. తాజా దరఖాస్తుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అ న్ని రకాల పింఛన్ల కోసం జిల్లాలో మొ త్తం 5,55,662 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు అర్హులుగా 3,10,000 తేల్చినప్పటికీ, కేవ లం 1,58,500 మందిని మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచారు. గతంతో పోల్చితే పింఛన్ల అర్హుల సంఖ్య భారీగా కో త పడింది. గతంతో పోల్చితే లక్షకు పైగా కోత పడింది. అలాగే ఆన్లైన్లో అతి తక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పింఛన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓలతో సమావేశమైన కలెక్టర్ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగళవారం ఎంపీడీఓలతో జి ల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బండమీదిపల్లిలోని శిక్షణా కేంద్రంలో ప్రత్యేకం గా సమావేశమయ్యారు. వివిధ కారణా ల చేత తిరస్కరించిన పింఛన్ల దరఖాస్తులన్నీ పున:పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన 17 జీఓలోని నిబంధనల మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్ లభించేటట్లు చూడాలని స్పష్టం చేశారు. అలాగే పింఛన్లు మంజూరు చేయడంలో పూర్తి నిర్ణయాధికారం విచారణ అధికారులకే ఉందని, అయితే మంజూరు చేసిన ప్రతి పింఛన్‌కు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. తిరస్కరించిన పింఛన్లను జాగ్రత్తగా పరిశీలించాలి మహబూబ్‌నగర్ టౌన్ : తిరస్కరంచిన పింఛన్లను జాగ్రత్తగా పునపరిశీలించాలని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ఎంపీడీఓలను సూచించారు. మంగళవారం బండమీదిపల్లిలోని శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఎంపీడీఓల సమావేశంలో కలెక్టర్ మట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్క లబ్దిదారునికి అన్యాయం జరగరాదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన 17 జీఓ లోని నిబంధనల ప్రకారం పింఛన్లు మంజురు చేయాలని ఆదేశించారు. పింఛన్ల మంజూరులో పూర్తిన్ణియాధికారం విచారణ అధికారులకే ఉందని, అయితే మంజురు చేసిన ప్రతి పించన్‌కు వారే బాధ్యత వహించాలన్నారు. వివిధ కారణాల చేత తిరస్కరించిన పింఛన్ల దరఖాస్తులన్నింటినీ పున పరిశీలించాలని కోరారు. జిల్లాలోని ఇప్పటి వరకు 2. 97 లక్షల దరఖాస్తులు డాటా ఎంట్రీ చేయగా, దాదాపు 2. 93 దరఖాస్తులను పింఛన్‌కు అనుమతించామన్నారు. డాటా ఎంట్రీ సందర్భంగా తప్పులు దొర్లిన వాటిని, అలాగే వయస్సు, ఇతర కారణాల చేత సందేహంతో పెండింగ్‌లో ఉంచిన పింఛన్ దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి వివరణ అందిన వెంటనే జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, డీఆర్డీఏ ఏపీఓ శారద, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
కంప్యూడర్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఆసరా’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పింఛన్ల పంపిణీకి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారులను ఎంపిక చేసి తుదిజాబితా తయారు చేసేందుకు అవసరమైన కంప్యూటరైజేషన్ కష్టతరమవుతోంది. కంప్యూటర్ డేటాబేస్‌లో ఉన్న సాంకేతిక తేడాల కారణంగా లబ్ధిదారులకు సంబంధించిన తుదిజాబితా ఇంకా ఖరారు కాలేదు. పింఛన్ దరఖాస్తులకు, సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) వివరాలకు లింకు పెట్టడంతో ఈ పని మరింత జఠిలమవుతోంది. వాస్తవానికి ఈనెల 15వ తేదీ నాటికి తుది జాబితాలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించి, 17వ తేదీన ప్రత్యేక అధికారికి అర్జీలు సమర్పించాల్సి ఉన్నా... డేటాఎంట్రీ పూర్తి కాక పోవడంతో ఆ ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు ఎంత త్వరగా పూర్తి చేసినా ఈ పింఛన్ల పంపిణీ జిల్లాలో ఓ కొలిక్కి వచ్చేందుకు మరో పది రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే తమ వద్ద ఉన్న మాన్యువల్ డేటా ద్వారా పింఛన్ల పంపిణీ చేసి, వచ్చే నెలలో కంప్యూటరైజేషన్ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అక్కడ 50, ఇక్కడ 65 ముఖ్యంగా సమగ్ర సర్వేకు, పింఛన్లకు పెట్టిన లింకు అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. సమగ్ర కుటుంబ సర్వే సమయంలో 65 సంవత్సరాల కన్నా తక్కువ వయసు నమోదు చేసుకున్న వారిలో వేలాది మంది ఇప్పుడు తమకు 65ఏళ్లకు పైగా ఉన్నాయని పింఛన్ల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినా, వారికి పింఛన్లు ఇచ్చేందుకు కంప్యూటర్లు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే కంప్యూటర్ డేటాబేస్‌లో సదరు లబ్ధిదారుని వయసు రెండు విధాలుగా ఉండడంతో, దానిని సాఫ్ట్వేర్ అంగీకరించడం లేదు. దీంతో ఆ లబ్ధిదారుడి డేటా కంప్యూటరైజ్ కావడం లేదు. దీంతోపాటు జిల్లాలో పింఛన్ల లబ్ధిదారుల కింద ఎంపికైన వారిలో 40వేల మందికి పైగా కుటుంబ సర్వే వివరాల్లేవని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వారంతా సర్వేలో పాల్గొనలేదా? పాల్గొన్నా వివరాలు కంప్యూటర్లో నమోదు కాలేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు అటు ఎస్కేఎస్ కానీ, ఇటు పింఛన్ల దరఖాస్తులను కూడా కంప్యూటర్లో నమోదు చేసేటప్పుడు పొరపాటున ఏదైనా తప్పు జరిగితే దానిని కూడా సాఫ్ట్వేర్ అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఎంపికైన 3.02లక్షల మంది లబ్ధిదారుల వివరాల్లో 2.5 లక్షలకు పైగా దరఖాస్తుదారుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తే కేవలం 1.40 లక్షల మందివి మాత్రమే ఓకే అయినట్టు సమాచారం. ఈ పరిస్థితులను అధిగమించి పూర్తిస్థాయిలో కంప్యూటరైజ్ కావాలంటే జిల్లా అధికారులకు వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, దీనికి వారు అంగీకరించలేదని, కలెక్టర్ సూచన మేరకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇప్పుడు ఆ ఎడిటింగ్ అవకాశం జిల్లా కలెక్టర్లకు ఇచ్చారని చెపుతున్నారు. ఈ అవకాశం ఇప్పుడు ఇచ్చినా ఇవన్నీ సరిదిద్ది కంప్యూటరీకరణ పూర్తి చేసేందుకు మరో 10 రోజులు పడుతుందని అధికారుల అంచనా. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి జాబితా తయారు చేసేందుకే నెలాఖరు వస్తుంది. ఈ పరిస్థితుల్లో కంప్యూటరీకరణ పూర్తికావాలనే నిబంధనను పక్కనపెట్టి 3.02లక్షల మంది లబ్ధిదారుల మాన్యువల్ డేటా ద్వారా ఈనెల పింఛన్ల పంపిణీ చేసే అంశాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఇలా చేస్తే త్వరలో పింఛన్లు వచ్చే అవకాశం ఉన్నా... అందుకు ప్రభుత్వం అంగీకరించకపోతే మాత్రం పింఛన్లు మరో 10 రోజులు ఆలస్యం కానున్నాయి. మరో విశేషమేమిటంటే తెలంగాణలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలోనే ఈ కంప్యూటరీకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతుందట. అదే నిజమైతే మిగిలిన జిల్లాల్లో పింఛన్ల లబ్ధిదారుల పరిస్థితేంటో ఆ కంప్యూటర్‌కే తెలియాలి. -
‘ఆసరా’ అయోమయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సామాజిక పింఛన్ల పథకం(ఆసరా) అమలు ప్రక్రియ జిల్లా యంత్రాంగంలో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి అర్హతను నిర్ధారించిన అధికారులకు తాజాగా పింఛన్ల పంపిణీ సంకటంగా మారింది. అర్హతను తేల్చి 2,05,940 మంది లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు, తాజా దరఖాస్తుల పరిశీలన వివరాలు ఏమాత్రం సరిపోలకపోవడంతో అర్హులుగా ఎంపికైన పలువురిని చివరకు అనర్హులుగా సాఫ్ట్వేర్ తేల్చడంతో యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. జిల్లాలో ఆసరా పథకం కోసం 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలనకు ఉపక్రమించిన అధికారులు మొత్తంగా 2,37,443 మందిని లబ్ధిదారులుగా తేల్చారు. అనంతరం సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదు చేపట్టిన అధికారులు.. ఇప్పటివరకు 2,05,940 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ వివరాలను ఎంపీడీఓ లాగిన్‌లోని సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చితే అర్హుల కార్డుల తుది ఫార్మాట్ ప్రత్యోక్షమవుతుంది. ప్రస్తుతం వీరికి కార్డులు అందించిన తర్వాత పింఛన్ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో కార్డులను ప్రింట్ తీసేందుకు సదరు వివరాలను సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో మ్యాచ్ చేయగా.. అర్హులుగా నిర్ధారించిన పలువురు అనర్హులయ్యారు. ఇప్పటివరకు లక్ష మంది వివరాలను ప్రింట్ చేసేందుకు ప్రయత్నించగా.. దాదాపు 25వేల మంది అనర్హులుగా సాఫ్ట్వేర్ తేల్చడంతో అధికారులు జుట్టుపీక్కుంటున్నారు. నిలిచిన పింఛన్ల పంపిణీ.. జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈనెల 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో పింఛన్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీచేసి పింఛన్లు ఇచ్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా దాదాపు 10వేల మందికి ఇచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మిగతా వారికి మరుసటి రోజునుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా.. సాఫ్ట్‌వేర్‌లో అర్హుల జాబితాలో తప్పులు చూపడంతో కార్డుల ముద్రణ నిలిపివేశారు. దీంతో కార్డుల ప్రింటింగ్ ముగిసిన తర్వాతే పింఛన్లు పంపిణీ చేయాలని భావించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు.. పంపిణీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్యపై మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ అధికారులతో అత్యవసర కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు డీఆర్డీఏ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
జర.. ఆగండి!
86 వేల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం కుటుంబ సర్వే పూర్తయితేనేపింఛన్లు {పభుత్వానికి నివేదించిన అధికార గణం తదుపరి చర్యల కోసం ఎదురుచూపులు మండల కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు గ్రేటర్ హైదరాబాద్‌లో కుటుంబ సమగ్ర సర్వే వివరాలు లేకపోవటంతో సామాజిక పింఛన్లకు వచ్చిన 86 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తిగా నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. ఇదే పరిస్థితి ఆహార భద్రతా కార్డులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనలోనూ ఎదుర వబోతోంది. దీనికి ప్రధాన కారణం నగరంలో 25 శాతానికి పైగా సమగ్ర కుటుంబ సర్వే జరగకపోవటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక పింఛను దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సమగ్ర కుటుంబ సర్వేతో ముడిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడ ంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇది దరఖాస్తుదారులకు శాపంగా మారింది. - సాక్షి, సిటీబ్యూరో నగరంలో సామాజిక పింఛన్లకు తాజాగా 2.49 లక్షల దరఖాస్తులు వచ్చా యి. వీటిలో ఇప్పటి వరకు 1.63 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిశీలించిన అధికారులు 1.17 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిపోయిన 86 వేల దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వే వివరాలు లేనందున పరిశీలించలేదు.ఈ విషయాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటినిర్ణయం వెలువడలేదు. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఒక వైపు దరఖాస్తుదారుల నుంచి పింఛన్ల కోసం ఒత్తిడి... మరో వైపు ఉన్నతాధికారుల నుంచి స్పందన కనిపించకపోవటంతో అధికారులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. సర్కారు నుంచి సరైన నిర్ణయం వస్తే గానీ ఈ దరఖాస్తుల పరిశీలనకు మోక్షం లభించే పరిస్థితి కనిపించటం లేదు. మిగిలిపోయిన ప్రాంతాల్లో మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే తప్ప ఈ దరఖాస్తుల పరిశీలన సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. పరిశీలనకు నోచుకోని దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాకు చెందినవి 56 వేలు ఉండగా, రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని దరఖాస్తులు 30 వేలకు పైగా ఉన్నాయి. కారణాలివే... సమగ్ర కుటుంబ సర్వే సమయంలో నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన వేలాది నిరుపేద కుటుంబాలు గ్రామాలకు తరలిపోవటం వల్ల ఇక్కడి సర్వేలో పాల్గొనలేకపోయారు. సొంత ప్రాంతంలోని కుటుంబ సర్వేలో పాల్గొన్న వారంతా మళ్లీ ఇక్కడా దరఖాస్తుచేశారు. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో.. అక్కడి నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని... విచారణ కు అందుబాటులో ఉండాలని అధికారులు సూచించటంతో అలా చేశారని తెలుస్తోంది. మరోపక్క గ్రేటర్లో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వే కార్పొరేషన్ సర్కిళ్ల వారీగా చేపట్టారు. ఒక్కో సర్కిల్లో రెండు, మూడు మండలాలతో పాటు డివిజన్లు ఉన్నాయి. ఇంకోవైపు సామాజిక పింఛన్ల కోసం మండలం యూనిట్‌గా దరఖాస్తులు స్వీకరించారు. దీంతో సమగ్ర కుటుంబ సర్వేను పింఛన్ దరఖాస్తులతో ముడిపెట్టడానికి సాఫ్ట్వేర్ సహకరించలేదు. ఇది కూడా దరఖాస్తుల పరిశీలనకు అంతరాయంగా మా రింది. సాంకేతిక అధికారులు కుటుంబ సర్వేను మండల యూనిట్‌గా మార్చుకోవటం ద్వారా కొంత ప్రగతిని సాధించగలిగారు. సర్వే కాని ప్రాంతాలకు సంబంధించిన సామాజిక పింఛన్ల దరఖాస్తుల పరిశీలన కష్టతరంగా మారటంతో నిలిపివేశారు. తప్పని ప్రదక్షిణలు దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికలో జాప్యంతో దరఖాస్తుదారుల్లో టెన్షన్ పెరుగుతోంది. నగరంలో ఇప్పటి వరకు 5200 మందికే పింఛన్లు పంపిణి చేసి...మిగిలిన వారిని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి గతంలో మాదిరిగానే పింఛన్లు తీసుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలియక తల్లడిల్లుతున్నారు. వీరికి సమాధానం చెప్పేవారే కనిపించడం లేదు. తిరగలేకపోతున్నా... నాది బండ్లగూడ మండలం ఫాతీమానగర్. 80 ఏళ్ల వికలాంగురాలిని. అధికారుల సూచన మేరకు గత నెల 17వ తేదీనా కార్యాలయానికి వచ్చి అతికష్టం మీద పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకూ విచారణ కోసం మా ఇంటికి ఎవరూ రాలేదు. ఇప్పటికే కొంత మంది పింఛన్లు తీసుకున్నారు. నా పింఛన్ కోసంకాళ్లరిగేలా తిరుగుతున్నా. - రహమత్బీ, ఫాతీమానగర్ -
1,00,859 వితంతు పింఛన్ లబ్ధిదారులు
రాష్ట్రంలో 6 శాతం.... వరంగల్‌లో 11 శాతం జిల్లాలోని మహిళా జనాభా లెక్కన రాష్ట్రంలో ప్రథమ స్థానం ఆందోళన కలిగిస్తున్న మూడు పదుల్లోపే వైదవ్యం... ఓరుగల్లు మహిళలకు ఒక్కో రంగంలో ఒక్కో చరిత్ర ఉంది. ఉద్యమం.. రాజకీయ నేపథ్యంలో వారిది ప్రత్యేక శైలి. కానీ.. ఇదే గడ్డపై దిగ్భ్రాంతికరమైన విషయం కూడా ఉంది.. అదేమిటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వితంతువులు జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మూడు పదుల వయసు దాటకుండానే వారిని వైదవ్యం వెక్కిరిస్తోంది. జిల్లాలో 11 శాతం వితంతువులు ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రాష్ట్రంలో సగటున 6 శాతం వితంతువులు ఉంటే.. జిల్లాలో మాత్రం ఆ సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. దీనికి కారణాల పలు రకాలు ఉన్నప్పటికీ.. ముఖ్యమైన కారణం మాత్రం మద్యం మహమ్మారేనని జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు మాత్రం పెద్దగా లేవని చెప్పొచ్చు. భర్త మరణించిన వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసి చేతులు దులుపుకుంటే చాలదు. మూలాల్లోకి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మూడు పదుల్లోపే వైధవ్యం పొందుతున్న విషయంలో మన అపఖ్యాతి మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదు. పింఛన్లలో... ప్రభుత్వం అందజేసే సామాజిక భద్రతా పింఛన్లు(ఎస్ఎస్పీ) పొందుతున్న వితంతువుల సంఖ్య జిల్లాలో లక్ష దాటింది. 10 జిల్లాల్లో వితంతు పింఛన్లు పొందుతున్న వారిలో సంఖ్యాపరంగా జిల్లా రెండో స్థానంలో నిలుస్తోంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా మనకన్నా కాస్త ముం దుంది. అయితే అన్ని వర్గాల వారిని ఆందోళనకు గురిచేస్తున్న ఈ విష యం ప్రస్తుతం కొత్త పింఛన్ల పంపిణీతో రాష్ట్రస్థాయిలో చర్చకు వస్తోంది. జిల్లాలో అత్యధికంగా వితంతువులు ఉండటంపై పలు స్వచ్ఛంద సంస్థలు పలుమార్లు సర్వేలు కూడా నిర్వహించాయి. కబళిస్తున్న గుడుంబా.. 2009లో డీఆర్డీఏతోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ప్రత్యేకంగా వితంతువుల విషయంలో సర్వే చేశాయి. ఇందలో గుడుంబా మరణాలే ఎక్కువ మందిని వితంతువులను చేశాయని సర్వేలు నిర్ధారించా యి. సర్వే లెక్కలో గుర్తిస్తున్న భయంకర నిజాల ఆధారంగా నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడంలేదనే విమర్శ వినిపిస్తోంది. కాగా, జిల్లాలో ప్రభుత్వ పింఛన్లు 4,45,030 ఉండగా.. అందులో 1,00,859 మంది వితం తు పింఛన్‌దారులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో మొత్తం పింఛన్లు 4,41,603 ఉండగా.. వితంతు పింఛన్లు 1,02,259 ఉన్నాయి. నా కుటుంబం వీధిన పడింది.. ఈమె పేరు బి.స్వరూప. వయసు 28 ఏళ్లు. హన్మకొండ మండలం వడ్డేపల్లి. భర్త సంజీవ్ ఆటోనడుపు తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఒక బాబు, పాప. సంతోషంగా సాగుతున్న కుటుం బంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తాగుడుకు బానిసై కొంతకాలానికి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త మరణంతో కుటుంబం వీధిన పడింది. పిల్లల పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగిళ్లలో పాకి పనిచేసి పిల్లల్ని చదివిస్తోంది. ఇప్పటికి 20 సార్లు వితంతు పింఛన్ కోసం అర్జీ పెట్టుకున్నా అధికారులకు స్వరూప దీన స్థితిపై జాలి కలగలేదు. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమంటే.. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటోంది. ఎక్కువగా ఉన్న మండలాలు మండలం పేరు వితంతు పింఛన్లు మొత్తం పింఛన్లు మహబూబాబాద్ 3,104 11,292 మరిపెడ 2,962 11,077 స్టేషన్‌ఘన్‌పూర్ 2,939 13,056 పరకాల 2,667 13,441 కురవి 2,594 9,881 ఆత్మకూరు 2,416 10,580 వర్ధన్నపేట 2,382 8,868 హన్మకొండ 2,346 7,951 హసన్‌పర్తి 2,298 8,567 ధర్మసాగర్ 2,236 10,068 -
రేపటి నుంచే కొత్త పింఛన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అర్హులకు సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాం గం సమాయత్తమవుతోంది. దర ఖాస్తుల పరిశీలన ప్రక్రియ దాదాపుగా పూర్తికావడంతో అర్హుల తుది జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి కొత్త పింఛన్ల జారీకి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన నేపథ్యంలో అందుకనుగుణంగా నియోజకవర్గాల వారీగా తేదీలను ఖరారు చేసింది. ‘ఆసరా’ పేరిట జారీచేస్తున్న పింఛన్లను ఈ నెల 8, 9వ తేదీల్లో అర్హులకు అందజేయనున్నట్లు కలెక్టర్ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. గురువారం నుంచి ఆర్డీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 8న రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, 9న ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి లాంఛనంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుడతారని చెప్పారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగానే పింఛన్‌దారులకు సమాచారాన్ని చేరవేయాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 15వరకు గ్రామాలవారీగా పింఛన్ల పంపిణీకి సంబంధించిన ప్రణాళికను ఖరారు చేసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ల సమక్షంలో పింఛన్లను అందజేయాలని, పింఛన్ల పంపిణీ సమయంలో అర్హులు ఉంటే దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. వీరి జాబితాను అప్డేట్ చేసి జాబితాను తమకు పంపాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, డీఆర్ఓ సుర్యారావు తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో.. జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లను ఆదే శించారు. పెన్షన్లకు సంబంధించిన డేటా ఎంట్రీ, పంపిణీ విధివిధానాలపై గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా ఎంట్రీ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌దారులకు పచ్చరంగు, వితంతు పింఛన్‌దారులకు ఊదా రంగు, చేనేత, కల్లుగీత కార్మికులకు గులాబీ రంగు కార్డుల పంపణీకి శ్రీకారం చుట్టిందని వివరించారు. శనివారంతో ప్రారంభించి 15వ తేదీ లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ప్రతి వార్డులో స్థానిక కార్పొరేటర్, వార్డు అధికారి, మురికి వాడల సంక్షేమ సంఘాల సభ్యుడితోపాటు ఎస్సీ, ఎస్టీ వార్డు సభ్యులతో కలిపి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ అనంతరం కమిటీ సభ్యుల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ చంపాలాల్, డ్వామా పీడీ చంద్రకాంత్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘కలెక్టర్’నువ్వా.. నేనా!
ప్రగతినగర్ : ‘‘కలెక్టర్ నువ్వా.. నేనా! నేను సెలవులో వెళ్లకముందు ఇంటింటి సర్వేను వేగంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా నిజామాబాద్ నగర పరిధిలో సమస్యలు వస్తాయని, అందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పాను. అయినా నా మాట పెడచెవిన పెట్టి ఇంత వరకు కొన్ని టీమ్‌లు.. అసలు సర్వే కూడా మొదలు పెట్టనట్లు తెలుస్తుంది. ఇదంతా కమిషనర్‌గా నీ వైఫల్యం’’ అంటూ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంగతాయారుపై మండిపడ్డారు.మంగళవారం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయన మున్సిపల్ అధికారులతో ఆహారభద్రత కార్డులు,సామాజిక పింఛన్ల సర్వేపై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో 80 శాతం సర్వే పూర్తయినట్లు నివేదికలు అందుతున్నాయని,అయితే నిజామాబాద్ నగరంతో పాటు మూడు మున్సిపాలిటీలు సర్వేలో వెనుకబడ్డాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశా లు జారీ చేసిందని అన్నారు. మున్సిపల్ సిబ్బంది మాత్రం సర్వేపై అంత సుముఖంగా లేరని సర్వే నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు. ఏది ఏమైన ప్పటికీ ఈ నెల 6 నాటికి ముఖ్యంగా సామాజిక భద్రత పింఛన్ల సర్వేపూర్తి చేయాలని, 8వ తేదీ నుంచి ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందన్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రతి రోజు చేసిన సర్వే వివరాలు, ఇండ్ల వివరాలు క్యాంపు కార్యాలయంలో అందించాలన్నారు. సర్వే పూర్తి అయిన వెంటనే ముందుగా నైపుణ్యం గల ఆపరేటర్లను నియమించుకొని వెంటనే సీడింగ్ మొదలు పెట్టాలన్నారు.ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే సీడింగ్కై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు, హైస్పీడ్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసి స్థానిక ఎన్ఐసీడీఎస్ఓ,రెవెన్యూభవన్,తహశీల్దార్ కార్యాలయంలో మీ-సేవ ట్రైనింగ్ సెంటర్లలో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. -
ఇంకెప్పుడో!
సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎదురుచూపు సామాజిక భద్రతలో భాగంగా నెల నెలా వెయ్యి రూపాయల పింఛన్ పథకాన్ని దసరా నుంచే ప్రారంభిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి దాటి పోయినా లబ్ధిదారులు ప్రయోజనం పొందలేకపోయారు. ఆహార భద్రత కింద రూపాయికి కిలో బియ్యం కోసం సామాన్యులు ఎదురు చూస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందించడంలో భాగంగా ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. రోజులు నెలలు గడుస్తున్నా, విచారణ కొలిక్కి రావడం లేదు. * గడువు సమీపిస్తున్నా పూర్తికాని అర్జీల పరిశీలన * 300 బృందాలు పని చేస్తున్నా కొలిక్కిరాని విచారణ * ఈనెల 8 వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం * నగర, పురపాలక సంఘాలలో మరింత జాప్యం * వేగవంతం చేస్తేనే పింఛన్, బియ్యం అందేది సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆహార భద్రత, సామాజిక పింఛన్లు తదితర దరఖాస్తులపై విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. వాస్తవంగా జిల్లాలో నమోదైన వివిధ కేటగిరీలకు చెందిన దరఖాస్తులపై ఈ నెల ఒకటినాటికే విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి వివరాలు అందించాల్సి ఉంది. సర్వే ఆధారంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఈ నెల ఎనిమిది నుంచి ప్రభుత్వ లబ్ధి చేకూర్చాలన్న ప్రతిపాదన ఉండగా, ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలనే పూర్తి కాలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఆహారభద్రత, సామాజిక భద్రత పింఛన్, కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ కోసం 14,09,632 దరఖాస్తులు రాగా, శనివారం నాటికి 50.87 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉండటంతో ప్రభుత్వం సర్వే గడువును ఈ నెల ఎనిమిది వరకు పొడిగించారు. అయినప్పటికీ గడువులోగా విచారణ పూర్తవుతుం దా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నత్తనడకన విచారణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహారభద్రత, సామాజిక భద్రత ఫించన్లు తదితర దరఖాస్తులపై విచారణ నత్తనడకన సాగుతోంది. సర్వే కోసం వెళ్తున్న బృం దాలకు అక్కడక్కడా రాజకీయ ఒత్తిళ్లు, అడ్డంగులు ఎదురవుతున్నాయి. సకాలంలో విచారణను పూర్తి చేయకపోతే వచ్చే నెలలో కూడ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందే అవకాశం లేదు. సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిం చారు. అదేనెల 15వ తేదీ వరకే అవకాశమని చెప్పినప్పటికీ 20వ తేదీ వరకు కూడ దరఖాస్తులు స్వీకరించారు. విచారణ, సర్వే కోసం వెళ్లిన సందర్భం గానూ దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఆహారభద్రత కింద 7,25,723 దరఖాస్తులు, సామాజిక భద్రత పింఛన్ల కోసం 3,85,210 దరఖాస్తులు, కుల ధ్రువీకరణకు 1,12,011 దరఖాస్తులు, ఆదాయ ధ్రువీకరణకు 1,00,531 దరఖాస్తులు, స్థానికత ధ్రువీకరణ కోసం 93,961 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా అన్ని కేటగిరీల కింద 14,09,632 వరకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఈ దరఖాస్తులపై విచారణ జరిపేందుకు ఒక్కో టీములో 10-15 మంది చొప్పున 300 బృందాలను రంగలోకి దిం పారు. అయినా సగం పరిశీలన కూడా పూర్తి చేయలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు ఉద్యోగుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర, పురపాలికలలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు అర్మూరు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలలో దరఖాస్తుల విచారణలో మరింత జాప్యం జరుగుతోంది. మొత్తం గా నమోదైన దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే 23 శాతం కూడ వెరిఫికేషన్ కాలేదు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్ల నుంచి 83,373 మంది ఆహారభద్రత కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 6,106 (7.32 శాతం) దరఖాస్తులపై విచారణ జరిపారు. సామాజిక భద్రత పింఛన్ కోసం 34,344 దరఖాస్తులు వస్తే అందులో 3,636 మాత్ర మే వెరిఫికేషన్‌కు నోచుకున్నాయి. ఆర్మూరు మున్సిపాలిటీలో 12,256 ఆహారభద్రత దరఖాస్తులలో 3,223 పరిశీలించగా, 6,067 పింఛన్ దరఖాస్తులలో 1,460 అర్జీలపై విచారణ జరిపారు. బోధన్‌లో 19,653 ఆహారభద్రత దరఖాస్తులకుగాను 6,742, 8,578 పింఛన్ దరఖాస్తులకుగాను 3,394, కామారెడ్డిలో 17,690 ఆహారభద్ర త దరఖాస్తులకుగాను 7,833, 6,704 పింఛన్ దరఖాస్తులకుగాను 2,788 దరఖాస్తులపై విచారణ జరిపారు. ఆరు రోజుల గడువులో 77 శాతం దరఖాస్తులపై వెరిఫికేష న్ చేయాల్సి ఉంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన మీద కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఏజేసీ డాక్టర్ శేషాద్రి, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. అయినా దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. విచారణ బృందాలు మరింత వేగం పెం చితేనే నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి అర్హులైన లబ్ధిదారుల జాబితా పంపే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం అందించే వెయ్యి రూపాయల పింఛన్ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. -
‘ధర’ఖాస్తులు గందరగోళం
ముకరంపుర : ఆహారభద్రత కార్డులు, సామాజిక పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ముందస్తు ప్రచారం లేకుండానే పట్టణాలు, నగరాల్లో బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం ప్రజలను అయోమయానికి గురిచేసింది. కౌంటర్లకు సంబంధించిన సమాచారం లేకపోవడం, కనీస ఏర్పాట్లు చేయకపోవడం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ముందుగా నవంబర్ ఒకటి నుంచి 7వ తేదీ వరకు పట్టణాలు, నగరాల్లో దరఖాస్తులు స్వకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తీరా ఈ నెల 29 నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు నాలుగు రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని మంగళవారం రాత్రి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు హడావుడిగా బుధవా రం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించా రు. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల మున్సిపాలిటీలు, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, వేములవాడ నగరపంచాయతీల్లోని వంద డివిజన్లు, 226 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. క్షేత్రస్థాయిలో ముందస్తు ప్రణాళికా లోపంతో పలుచోట్ల కేంద్రాలను అప్పటికప్పుడు మార్చారు. దీంతో కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియక ప్రజలు ఆగమయ్యారు. తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వీరబ్రహ్మయ్య స్పష్టం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుకు భిన్నం గా వ్యవహరించారు. దరఖాస్తులకు ధ్రువీకరణపత్రాల జిరాక్స్, ఆధార్ జిరాక్స్ జతచేయాలనడంతో పాటు నిర్ణీత ఫార్మాట్లోనే అందజేయాలనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆధార్‌కార్డుల జిరాక్స్‌లు, దరఖాస్తు ఫారాల కోసం జిరాక్స్ సెంటర్ల వైపు పరుగులు తీశారు. ఇదే అదునుగా నిర్వాహకులు జిరాక్స్‌కు రూ.2 నుంచి రూ.5, దరఖాస్తులకు రూ.5 నుంచి రూ.10 చొప్పున వసూలు చేశారు. చాలాచోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లే ముందుండి దరఖాస్తుల సమర్పణలో సాయపడ్డారు. ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలంటూ ప్రచారం చేశారు. పూర్తి స్థాయిలో ప్రచారం లేనప్పటికీ ఆయా డివిజన్లు, వార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆ నోటా ఈ నోటా విని సాయంత్రం వరకు నాలుగో వంతు దరఖాస్తులు అందజేశారు. కేంద్రాల ఏర్పాటులో గందరగోళం ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. సెంటర్ల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో దరఖాస్తులు స్వీకరించే సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు చెట్ల కిందనే ఇబ్బందులుపడ్డారు. వృద్ధులు, వికలాంగులకు తిప్పలు తప్పలేదు. కరీంనగర్ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు అరకొరగానే దరఖాస్తులు వచ్చాయి. ముందస్తు ప్రచారలోపంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. అప్పటికప్పుడు తెలుసుకోవడంతో దరఖాస్తుల కోసం పరుగులు తీశారు. తెల్లకాగితం కాకుండా ప్రింటె డ్ ఫార్మాట్, ధ్రువీకరణ జిరాక్స్‌లు తప్పనిసరని పేర్కొనడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. ప్రతి సెంటర్‌కు ఒక మున్సిపల్‌సిబ్బందితో పాటు ఇద్దరు ఆర్పీలను కేటాయించగా ఆర్పీలు సరిగా హాజరు కాకపోవడంతో కార్పొరేటర్లే ప్రత్యామ్నాయ మార్గాలతో ప్రజలకు సహకరించారు. రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో కేంద్రాలు మధ్యాహ్నం వరకు ప్రారంభం కాకపోవడంతో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యమయ్యింది. కేంద్రాలకు అంగన్వాడీ కార్యకర్తలు గైర్హాజరు కావడంతో సిబ్బంది లేక ఇబ్బందులుపడ్డారు. కేంద్రాలను ఉదయం నుంచి అప్పటికప్పుడే ఏర్పాటు చేయడంతో అవి ఎక్కడున్నాయో తెలియక ఇబ్బందులుపడ్డారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపించింది. కార్పొరేషన్ పాలకవర్గం పిక్నిక్ వెళ్లి అందుబాటులో లేకపోవడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు రూ.5 నుంచి రూ.10 చొప్పున ప్రజల నుంచి దోచుకున్నారు. కొంతమంది కార్పొరేటర్లు తమకు అనుకాలమైన వారితో దరఖాస్తు ఫారాలకు డబ్బులు వసూలు చేశారు. 24వ డివిజన్లో కనీస సౌకర్యాలు లేకపోడంతో ఆ డివిజన్ కార్పొరేటర్ కుంట సాయి స్పందించి స్వయంగా టెంటు, కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయించాడు. దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేయడానికి సరిపడ నోట్‌పుస్తకాలు లేకపోడంతో 18వ డివిజన్ కార్పొరేటర్ తోట అనసూర్య కుమారుడు తోట వేణు తమ డివిజన్లో తన స్వంత ఖర్చులతో కొనుగోలు చేసి ఇచ్చాడు. హుస్నాబాద్‌లో 20 వార్డులుండగా ప్రచారలోపంతో దరఖాస్తులు అరకొరగానే వచ్చాయి. కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారు. ప్రజలను దరఖాస్తులు చేసుకోవాలంటూ కౌన్సిలర్లు వాడవాడలా ప్రచారం చేయడం, దరఖాస్తులు నింపడం కనిపించింది. హుజురాబాద్‌లో 20 వార్డులు, జమ్మికుంటలో 20 వార్డులున్నాయి. గతంలో నిర్ణయించిన కేంద్రాలు కాకుండా ఉదయం హడావుడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో చెట్లకింద దరఖాస్తులు స్వీకరించారు. కౌన్సిలర్లే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అన్ని రకాల సర్టిఫికెట్లు అడగడంతో జనాలు ఇబ్బందులుపడ్డారు. సిరిసిల్లలోని 33 వార్డులలో కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. కౌన్సిలర్ల ఇళ్ల వద్దే కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రజల్లో పూర్తిస్థాయిలో ప్రచారం లేదు. ఇక్కడ కూడా జిరాక్స్‌లు తప్పనిసరిగా తీసుకున్నారు. పెద్దపల్లిలోని 20 వార్డులలో కేంద్రాలు ఏర్పాటు చేయగా ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు తీసుకోవడంతో ప్రజలపై అదనపు భారం పడింది. వేములవాడలోని 20 వార్డుల్లో ప్రచారలోపంతో కేంద్రాలు వెలవెలబోయాయి. తొలిరోజు అరకొర దరఖాస్తులే వచ్చాయి. కోరుట్లలోని 31 వార్డులలో కౌంటర్లు ఏర్పాటు చేయగా కౌన్సిలర్లే ప్రధాన పాత్ర పోషించారు. ప్రింటెడ్ ఫారాలను జిరాక్స్ సెంటర్లలో విక్రయించారు. జగిత్యాలలోని 38 వార్డులుండగా, రాత్రికి రాత్రి అధికారులు కౌన్సిలర్లతో మీటింగ్ పెట్టి ప్రజలకు తెలియజేయాలని కోరారు. కౌన్సిలర్లు అప్రమత్తమై ప్రజలకు కొంతమేర సమాచారాన్ని అందించారు. సెంటర్లు సైతం సక్రమంగా ఏర్పాటు చేయలేదు. ఇళ్లల్లోనే గద్దెలపై కూర్చుని దరఖాస్తులను స్వీకరించారు. మెట్‌పల్లిలోని 24 వార్డులలో ఆధార్ నెంబర్‌కోసం జనం తిప్పలుపడ్డారు. దరఖాస్తులు అమ్మడం సిగ్గుచేటు - మామిడాల చంద్రయ్య, మాజీ కౌన్సిలర్, రామగుండం 5వ డివిజన్లో ఐదు రూపాయల చొప్పున దరఖాస్తులు అమ్మారు. తెల్లకాగితం మీద దరఖాస్తులు స్వీరించాల్సింది పోయి ఫారాలు అమ్మకం ద్వారా సొమ్ము చేసుకోవడం సిగ్గుచేటు. ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. తొలిరోజు పట్టణాలు, నగరాలు, కార్పొరేషన్లలో ఆహారభద్రత, పెన్షన్ల దరఖాస్తులిలా.. పట్టణం, నగరం ఆహారభద్రత పెన్షన్లు కరీంనగర్ 16404 5637 రామగుండం 13127 5151 జగిత్యాల 11533 3844 కోరుట్ల 6224 1608 మెట్పల్లి 6094 2836 సిరిసిల్ల 3940 3580 వేములవాడ 4629 1595 హుస్నాబాద్ 1605 1019 జమ్మికుంట 2131 920 హుజూరాబాద్ 2128 845 పెద్దపల్లి 3876 1434 మొత్తం 71691 28469 - ముకరంపుర -
సమస్తం..‘ఆధార’మే
అక్రమాల చెక్కు నివారణోపాయం చేవెళ్ల: మీవద్ద ఎన్ని గుర్తింపు కార్డులున్నా అవి అంతగా ప్రాధాన్యం లేనివే కాబోతున్నాయి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డుయే లింకు కాబోతుంది.ప్రభుత్వ పథకాలలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అర్హులైన వారికే ప్రయోజనాలను అందించడానికి, దళారుల వ్యవస్థనుంచి లబ్ధిదారులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అన్ని పథకాలకు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, సామాజిక పింఛన్లకు ఈ ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్న ప్రభుత్వం, తాజాగా ఓటరు గుర్తింపు కార్డులతో కూడా లిం కు పెట్టబోతున్నారు. ఓటరు కార్డులతో ఆధార్‌ను లింకుచేస్తే బోగస్ ఓటర్లను అవలీలగా తొలగించే వీలున్నందున ముందుగా సైబరాబాద్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. పింఛన్‌దారులు, ఉపాధిహామీ కూలీల నుంచి ఆధార్ కార్డులతో పాటుగా వారి వేలిముద్రలు తీసుకుంటున్నారు. వీటిని కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ విధానం ద్వారా కూలీలకు, పింఛన్‌దారులకు ఇక నుంచి పోస్టాఫీసు, బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావి స్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారుని నెంబరును ఆధార్‌కార్డుతో లింకుచేసి నగదు బదిలీ పథకం ద్వారా సబ్సీడీని నేరుగా బ్యాంకు ఖాతాలో వేయడం తప్పనిసరి చేయబోతోంది. ఉపాధి పైసలకు భరోసా... నియోజకవర్గంలోని పలు మండలాలలో ఉపాధి పనులను ఏటా చేపడుతున్నారు. చేవెళ్ల మండలంలోనే 11,900 మందికి పైగా జాబ్‌కార్డుదారులున్నారు. షాబాద్, నవాబుపేట మండలాల్లో సైతం ఉపాధి కూలీలు అధికంగా ఉన్నారు. ఏటా రూ. కోట్లు విలువ చేసే పనులను ఉపాధిహామీ పథకంలో చేపడుతున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతుండటం వల్ల కూలీలకు చెల్లింపుల్లో అన్యాయం జరిగేది. దీంతో ఆధార్‌తో అనుసంధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఆధార్ సీడింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పింఛను లబ్ధిదారులకు సైతం.. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభయహస్తం, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు కలిపి సుమారుగా 19 వేల వరకు ఉన్నాయి.బోగస్ పేర్లతో పలువురు పింఛన్ అందుకుంటున్నారని సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి బోగస్‌ల అడ్డుకట్టకు చేపడుతున్న ఆధార్, బ్యాంకు ఖాతా నమోదుతో పింఛన్‌దారుల ఖాతాల్లోకి డబ్బు నేరుగా చేరనుంది. బోగస్‌రేషన్ కార్డుల గుర్తింపులో ప్రధాన పాత్ర.. ఆధార్ అనుసంధానంతో బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతకు మార్గం సులభతరమైందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం రేషన్‌కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న బోగస్ రేషన్‌కార్డులను గుర్తించారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే మరిన్ని బోగస్ కార్డులను ఏరి వేయడానికి వీలవుతుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. -
సదరం... ప్రాణాంతకం
క్యాంపుల నిర్వహణ అస్తవ్యస్తం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలనే నిబంధన ప్రాణాలు బలిగొంటోంది. దరఖాస్తులపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. బుధవారం వేలాదిమంది వికలాంగులు, వృద్ధులు సదరం కేంద్రాల వద్దకు తరలిరావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రస్తుతం 48వేల మంది వికలాంగులకు సామాజిక పింఛన్ అందుతోంది. ఆరు నెలలుగా మరో 11వేల మందికి సదరం క్యాంపుల ద్వారా వికలాంగులు గా గుర్తించారు. వీరికి కూడా పింఛన్ మంజూరైతే లబ్ధిదారుల సంఖ్య సుమారు 59వేలకు చేరనుంది. డీఆర్డీఏ గతంలో చేపట్టిన వివిధ సర్వేల ప్రకారం జిల్లాలో వికలాంగుల సంఖ్య సుమారు 80వేల మంది మాత్రమే. అంటే మరో 20వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం సామాజిక పింఛన్ పథకం కింద అర్హుల నుంచి మరోమారు దరఖాస్తులు కోరుతోంది. సదరం సర్టిఫికెట్ జతచేసి దరఖాస్తు చేసుకుంటేనే వికలాంగ పింఛన్ మంజూరవుతుందనే భావన లబ్ధిదారుల్లో నెలకొంది. దరఖాస్తు చేసుకునే విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో సదరం కేంద్రాలకు ఒక్కసారిగా దరఖాస్తుల తాకిడి పెరిగింది. వృద్ధులు కూ డా తమను వికలాంగులుగా గుర్తించాలంటూ సదరం కేంద్రాలకు వస్తుండడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, గద్వాల డివిజన్ కేంద్రాల్లో సదరం క్యాంపులు శాశ్వత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. డివిజన్ కేంద్రాల్లో ఎముకలు (ఆర్థో) సంబంధిత వైకల్యానికి మాత్రమే గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర వైకల్యం కలిగిన వారు జిల్లా కేంద్రానికి రావాల్సిందే. దీంతో బుధవారం రోజు 25వేల మంది మహబూబ్‌నగర్ సదరం కేంద్రానికి వచ్చినట్లు అంచనా. పింఛన్లో వ్యత్యాసం వల్లే? వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వేయిరూపాయలు, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల మేరకు 40శాతం వైకల్యమున్న వారికే వికలాంగ పింఛన్ మంజూరవుతుంది. గతంలో సదరం పరీక్షలో 40శాతం పొందలేక పోయిన వారు మరోమారు ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్నారు. సదరం క్యాంపులకు వస్తున్న వారిలో సుమారు 60 శాతం మంది వృద్ధులే. పింఛన్ మొత్తం ఎక్కువగా వుండడం వల్లే వయసుతో పాటు వచ్చే రుగ్మతలను కూడా వృద్ధులు వైకల్యంగా చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాతే సదరం పరీక్షలు నిర్వహించి అర్హులను తేలుస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
అధికారులు.. ప్రజలకు.. దడఖాస్తులు!
* ఇప్పటికి అందిన మొత్తం అర్జీలు: 11.24 లక్షలు * ఆహార భద్రత : 7.65 లక్షలు * సామాజిక పింఛన్లు : 2.59 లక్షలు * కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ : 0.99 లక్షలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు 16లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. ఇందులో 10.7లక్షల మంది రేషన్ కార్డుదారులు, 2.6లక్షల మంది పింఛన్‌దారులు, 2లక్షల మంది ఉపకారవేతనాలు, ఫీజు రాయితీ పొందుతున్నారు. తాజాగా సర్కారు తలపెట్టిన దరఖాస్తు ప్రక్రియలో వీరంత నమోదు చేసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా కొత్తగా సంక్షేమాన్ని పొందగోరేవారు కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో బుధవారం నాటికి 11.24లక్షల దరఖాస్తులందాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 20 వరకు గడువుంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల సంఖ్య 20లక్షలకుపైగా చేరే అవకాశం లేకపోలేదని అధికారయంత్రాంగం అంచనా వేస్తోంది. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లా జనాభా దాదాపు 63 లక్షలకు చేరడం.. కుటుంబాల సంఖ్య 16 లక్షలు నమోదు కావడంతో దరఖాస్తులు కూడా అదేస్థాయిలో రావచ్చని భావిస్తోంది. కేంద్రాల సంఖ్య పెంపు.. * ప్రస్తుతం గ్రామ, మండల కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తులు స్వీకరించే కేంద్రాల సంఖ్య తక్కువగా ఉంది. * దీంతో కేంద్రాల వద్ద వందల మంది గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడకుండా పలుచోట్ల కొత్తగా కేంద్రాలు ఏర్పాటుచేసి స్థానికంగా విస్తృత ప్రచారం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో 30 కౌంటర్లు ఏర్పాటు చేయడమేకాకుండా 650 చౌకధరల దుకాణాల్లోనూ దరఖాస్తులు స్వీకరించే వెసులుబాటు కల్పించింది. కంగారు వద్దు.. పరిశీలన రోజూ ఇవ్వొచ్చు కలెక్టర్ శ్రీధర్ అనివార్య కారణాల వల్ల గడువులోపు దరఖాస్తులు సమర్పించకపోయినా.. పరిశీలన రోజు నేరుగా అధికారుల కు అందజేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. నిర్ణీత వ్యవధిలోపు దరఖాస్తులు ఇవ్వాలనే ఆత్రుతతో కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు బారులు తీరడాన్ని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ‘వైకల్య నిర్ధారణ పరీక్షలకు వికలాంగులు సదరమ్ శిబిరాలకు రావాల్సిన అవసరంలేదు. ఐకేపీ ద్వారా వారికి స్లిప్పులు పంపిణీ చేస్తాం. నిర్ధేశిత రోజులో సదరమ్ శిబిరాలకు వస్తే సరిపోతుంది’ అని కలెక్టర్ పేర్కొన్నారు. వికలాంగుల పింఛన్ల లబ్ధిదారులు ప్రత్యేకంగా ఇప్పుడు వైకల్య నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ 21వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ముందుగా కేటగిరీల వారీగా దరఖాస్తులను విభజిస్తామని తెలిపారు. దరఖాస్తుతోపాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాల పత్రాన్ని కూడా జతపరిచి క్షేత్రస్థాయి పరిశీలనాధికారులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ప్రకటించే షెడ్యూల్ ప్రకారం స్థానిక వీఆర్ఓ, వీఆర్ఏ, గ్రామ కార్యదర్శి సహకారంతో దరఖాస్తులను పరిశీలించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. -
పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి
కలెక్టర్ కిషన్ సుబేదారి : ఆహార భద్రత (రేషన్) కార్డుతో పాటు సామాజిక పింఛన్లు, ఫాస్ట్ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఈనెల 15వ తేదీలోగా దరఖా స్తు చేసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ సూచించా రు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు, సామాజిక పింఛన్లు పొందుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక ఫారాలు ఉండవని, తెల్లకాగితంపై పూర్తి వివరాలు, ఏ పథకం కింద ఇస్తున్నారో రాస్తే సరిపోతుందని తెలిపారు. సెలవు దినాల్లోనూ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తారని వివరించారు. ఆహార భద్రత కార్డు, పింఛన్లకు గ్రామాల్లోనే.. ఆహార భద్రత (రేషన్) కార్డుతోపాటు సామాజిక పింఛన్ల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారి గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కిషన్ సూచించారు. ఆహార భద్రత కార్డు, పింఛన్ల కోసం గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేయాలని, వచ్చిన దరఖాస్తులను ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తారని తెలిపారు. ఇక విద్యార్థులు ఫాస్ట్ పథకం కింద ఆర్థిక సాయం, కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, ఆహార భద్రత కార్డు, సామాజిక పింఛన్ల కోసం వరంగల్ నగర ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డీఆర్వో వీఎల్.సురేంద్రకరణ్, సమాచార పౌర సం బంధాల శాఖ ఏడీ డీఎస్.జగన్, డీడీ బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్‌దారుల గగ్గోలు
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జన్మభూమి- మాఊరు’కి అడుగడుగునా అటంకాలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీ మేరకు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని రైతులు, డ్వాక్రా మహిళలు నిలదీస్తున్నారు. అర్హత ఉన్నా తమను పింఛన్ల జాబితాలో నుంచి ఎలా తొలగించారని అధికారులు, టీడీపీ నాయకులపై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల టీడీపీ నాయకులకు, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం తాజాగా, చీరాలలో ఇద్దరు నేతల మధ్య ప్రొటోకాల్ రగడ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు స్పందించి ఇరుపక్షాలను కట్టడి చేయాల్సి వచ్చింది. జిల్లాలో ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమం నిర్వహణ ప్రభుత్వ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఈనెల రెండోతేదీ నుంచి జిల్లామంత్రి శిద్దా రాఘవరావు జన్మభూమిని ప్రారంభించారు. ప్రధానంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పేరిట పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారుల ఆందోళనకు జన్మభూమి కార్యక్రమం వేదికగా మారుతోంది. మొదటిరోజు కొండపి, ఒంగోలు నగరంలో నిర్వహించిన సభల్లోనే అసంతృప్తులు గళం విప్పాయి. వికలాంగులు, వృద్ధులు, వితంతు పింఛన్ల జాబితా తప్పుల తడకగా ఉందని.. భూమిలేని నిరుపేదలను సైతం ధనవంతులుగా చూపారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరికి ఆధార్ కార్డు సీడింగ్ లేదంటూ జాబితాలో నుంచి పేర్లను తొలగించడంపై స్థానిక అధికారులను నిలదీస్తున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. రేషన్కార్డుల్లేవని, వయస్సు ధ్రువీకరణ పత్రాలు చూపడం లేదంటూ పేర్లను తొలగించిన వారంతా వేదికల వద్దకు వచ్చి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే అధికారులను నిలదీస్తున్నారు. ఒంగోలులోని త్రోవగుంటలో శనివారం జరిగిన జన్మభూమిలో ఒకరిద్దరు తమకు పింఛన్ల పంపిణీలో అన్యాయం జరిగిందని చెప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. వారికి అవకాశమివ్వకుండానే నగరపాలక సంస్థ సభను మొక్కుబడిగా జరిపి వెళ్లారు. అదేవిధంగా అద్దంకిలో లాంఛన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మంత్రి ప్రసంగం ముగియగానే... ఒకరిద్దరికి మాత్రమే పింఛన్లు అందించి మమ అనిపించారు. జిల్లాలో పరిస్థితిదీ... అసలే బ్యాంకుల్లో బకాయిలు తీరక.. కొత్తరుణాలు పుట్టక.. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులు ప్రభుత్వ కార్యక్రమాలంటేనే భగ్గుమంటున్నారు. మండలాల్లో జన్మభూమి - మాఊరు కార్యక్రమానికి హాజరవ్వాలని స్థానిక నేతలు కోరడానికే భయపడే పరిస్థితి నెలకొంది. రైతులు, డ్వాక్రామహిళలు, పింఛన్‌దారుల నుంచి నిరసనలను ముందస్తుగా గుర్తించిన అధికారపార్టీ నేతలు ప్రతీ కార్యక్రమ వేదికల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒకట్రెండు చోట్ల నిరసనకారులు వేదిక వద్దకు రాగానే పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టేస్తున్నారని.. ప్రజాసమస్యల్ని వినేనాధుడు లేనప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలెందుకంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభమై మూడు రోజులు గడిచినా.. ఇంతవరకు ఏఒక్క మండలంలోనూ అధికారిక పింఛన్ల జాబితాను బహిరంగంగా ప్రకటించకపోవడం గమనార్హం. ముందుగా ఒకరిద్దరు అధికారపార్టీ అనుకూలురైన లబ్ధిదారులను పిలిపించి సిద్ధంచేసి.. వేదికలపై వారికి మాత్రమే పింఛన్ సొమ్ము అందించి మమ అనిపిస్తున్నారు. మూడోరోజు శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలంలో నిర్వహించగా, అర్హులైనవారందరినీ పింఛన్ జాబితాలో నుంచి తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరనప్పుడు జన్మభూమి కార్యక్రమం అనవసరమంటూ బహిష్కరించారు. జన్మభూమిని అధికార పార్టీ నాయకులు టీడీపీ కార్యక్రమంగా భావిస్తున్నారని ఆయన స్థానికంగా విలేకరుల సమావేశంలో ఆదివారం దుయ్యబట్టారు. అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు, మార్కాపురం రూరల్లోనూ వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కందుకూరులోని కేతవరంతో పాటు కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం, పామూరు మండలాల్లో రైతులు, డ్వాక్రాసంఘాల సభ్యులతోపాటు పింఛన్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అద్దంకి నియోజకవర్గంలోని ధర్మవరంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్వయంగా స్పందించి పింఛన్ల జాబితా అవకతవకలపై నిలదీశారు. తలలు పట్టుకుంటున్న అధికారులు అధికారపార్టీ ఆర్భాటంగా నిర్వహించ తలపెట్టిన ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమం అధికారులకు తలనొప్పిగా మారింది. కార్యక్రమాల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలోనే ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఒంగోలుకు సీనియర్ ఐఏఎస్ ఉదయలక్ష్మి, కందుకూరుకు మరో సీనియర్ ఐఏఎస్ కరికాలవళవన్తోపాటు మార్కాపురానికి సీనియర్ ఐఎఫ్ఎస్ కె.గోపీనాథ్‌ను పంపగా... జిల్లాస్థాయిలో మాత్రం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించడం మరిచారు. ప్రస్తుతం మండలాల్లోని ఎంపీడీవోలే ఈకార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభల్లో అధికారపార్టీ నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల ప్రొటోకాల్ సమస్యతో ఎంపీడీవోలు సతమతమవుతున్నారు. తాజాగా, ప్రొటోకాల్ రగడ నేపథ్యంలో చీరాలలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పోతుల సునీత వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలాఉంటే, గ్రామసభల్లో ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించే మార్గాల్లేక.. వారికి సరైన సమాధానాలు చెప్పలేక అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
పెన్షనర్ల గుండెల్లో టెన్షన్
* ఏపీలో లక్షల పింఛన్లపై వేలాడుతున్న వడపోత * కత్తి కుంటిసాకులు చూపుతూ వేటేస్తున్న అధికారులు ఈ ఫొటోలోని బడ్నాన అప్పలస్వామి, నరసమ్మలు దంపతులు. అప్పలస్వామి వయసు 70 ఏళ్లు, నరసమ్మ వయసు 66 సంవత్సరాలు. వీరిది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎరకందొరవలస గ్రామం. నిరుపేదలైన వీరికి గత ఏడాది రచ్చబండలో రేషన్‌కార్డు ఇచ్చారు. అప్పటి నుంచీ వీరికి వృద్ధాప్య పింఛను వస్తోంది. తాజాగా సర్కారు చేపట్టిన తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ దంపతులకు పింఛను కత్తిరించేశారు. వారు కాళ్లావేళ్లా పడ్డా.. స్థానిక నేతలు బతిమిలాడినా కనికరం చూపలేదు. ఇంతకీ పింఛను కత్తిరించటానికి అధికారులు చూపిన కారణం.. పండు ముదుసలులైన వీరిద్దరి ఫొటోలతో ఉన్న రేషన్ కార్డులో వారి వయసు 25 ఏళ్లు, 22 ఏళ్లుగా నమోదై ఉండటమే! రేషన్ కార్డు నమోదులో ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పును సాకుగా చూపి.. పండు ముదుసలులు కళ్లెదుట కనబడుతున్నా పింఛన్లు కత్తిరించేశారు!! ఈ ఒక్క ఉదాహరణ చాలు.. సామాజిక పింఛన్లను ఏరివేయటానికి సర్కారు వారు ఎంతగా తహతహలాడుతున్నారో తెలియడానికి!!! సాక్షి, హైదరాబాద్: ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు! నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం 13.18 లక్షల మంది పింఛనుదారుల బతుకు ఆధారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్నికల సమయంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్‌దారులకు రూ. 1,000 చొప్పున, వికలాంగులకు రూ. 1,500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెరగాల్సిన పింఛనుదారుల సంఖ్యను కుదిస్తోంది. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆర్భాటంగా పెంచిన పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుండగా.. రాష్ట్రంలో 13.18 లక్షల మంది పింఛనుదారుల భవితవ్యం గందరగోళంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 43.12 లక్షల పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు 18 నుంచి 25వ తేదీ లోపు పరిశీలించిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు అనర్హత పేరుతో 3.34 లక్షల పింఛన్లను తొలగించారు. అలాగే ఆధార్ కార్డు లేదన్న కారణంగా మరో 1.63 లక్షల ఫించన్లను పక్కనపెట్టారు. ఇవికాకుండా.. సామాజిక పింఛన్లకు ఇంకా 2.61 లక్షల మంది అర్హులు ఉన్నారని గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం సందర్భంగా గుర్తించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. ఇక తాజా కసరత్తులో గ్రామ, మండల కమిటీలకు 5.60 లక్షల మంది పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ఈ దరఖాస్తులను కూడా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు ఇవ్వాలా? వద్దా? అన్నది తేల్చలేదు. సర్కారు సాయంతో ఇల్లు కట్టుకున్నా కట్... 2007లో ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా భవనాలు నిర్మించుకున్న వారిని సైతం జాబితా నుంచి అనర్హులుగా ప్రకటించారు. తామేమీ సొంతంగా గూడు నిర్మించుకోలేదని ప్రభుత్వ సహాయంతో నిర్మించిన గృహాలను సైతం ఓ కారణంగా చూపి పింఛన్లు రద్దు చేయడమేమిటని గ్రామసభల్లో ప్రశ్నించినప్పటికీ పట్టించుకోలేదు. ఇక.. అర్హులై ఉండి ఇన్నాళ్ళూ పెన్షన్ దక్కక బాధపడే వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు పెద్దలు.. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా పింఛన్ల జాతరలో పింఛన్ అందివ్వకపోవడం గమనార్హం. కాగా, వేలిముద్రలతో సరిపోల్చుతూ ఐదారేళ్లుగా పింఛన్ పొందుతున్నప్పటికీ ఆధార్ లేదన్న కారణంగా 1.63 లక్షల పింఛన్లను పక్కనపెట్టారు. నిరంతరం వేలాడనున్న వడపోత కత్తి... పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి వడపోత కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో కొన్నేళ్ళుగా పింఛన్లు తీసుకుంటున్న 43.12 లక్షల మందిలో అనర్హులుగా 4.97 లక్షల మందిని తేల్చారు. ప్రస్తుతం ఏరివేత అనంతరం 38.15 లక్షల మందే అర్హులుగా తేల్చారు. ఈ జాబితా వడపోతను నిరంతరం కొనసాగించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా కమిటీలు ధ్రువీకరించిన అర్హుల జాబి తాను థర్డ్ పార్టీతో మరోసారి పరిశీలింపజేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఓ మంత్రి వెల్లడిం చారు. సానుభూతితోనూ, మానవతా థృ క్పథం తో అందించే పింఛన్ల జాబితాపైనా ఇకపై ఆంక్ష ల పర్వం కొనసాగించాలని నిర్ణయించారు. నామమాత్ర కేటాయింపులతో ఎలా? ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత కింద బడ్జెట్లో రూ. 1,338 కోట్లు మాత్ర మే కేటాయించారు. గడిచిన 5 నెలల కాలంలో 43.12 లక్షల మందికి పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 130 కోట్ల చొప్పున చెల్లించారు. ఆ లెక్కన ఆ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.650 కోట్లు అవు తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇక మిగిలిన ఏడు నెలల కాలానికి ప్రభుత్వం తేల్చిన 38.15లక్షల మందికి (మెజారిటీ పింఛన్లు రూ. 1,000 చొప్పు న, మరికొన్ని రూ. 1,500 చొప్పున) పింఛన్లు ఇవ్వాలన్నా నెలకు దాదాపు రూ. 450 కోట్ల చొప్పున రూ. 3,080 కోట్లు కావాలి. గడిచిన ఐదు నెలల్లో చెల్లించిన మొత్తా న్ని కలిపితే కనీ సంగా రూ. 3,730 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 3,292 కోట్ల లోటు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా సమకూర్చుతుందన్న విషయాన్ని చెప్పడం లేదు. ఈ లెక్కన ప్రస్తుత నిధులతో మూడో నెలలో పెంచిన పింఛన్ ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పింఛన్ల కత్తిరింపు అమానవీయం: వైఎస్సార్సీపీ పింఛన్లు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇపుడు కోతలు విధించడం అమానవీయం, అమానుషమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 2 నుంచి పిం ఛన్ల మొత్తం పెరుగుతుందని ఆశతో ఎదురు చూసిన లక్షలాది వృద్ధులు, వితంతువుల పింఛన్లను అడ్డంగా క త్తిరించి వారి ఉసురు పోసుకుంటున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఒక ప్రకటనలో విమర్శించారు. ఓవైపు కోత లు పెడుతూ మరోవైపు ‘భరోసా’ ఇస్తున్నామ ని గొప్పలు చెప్పుకుంటారా? అని ప్రశ్నిం చారు. ఆధార్ కార్డు లేదన్న కారణంగా 1.7 లక్షలు, అనర్హులంటూ 3.5 లక్షల మంది పింఛన్లకు కోత విధించారని విమర్శించారు. వృద్ధులకు, వితంతువులకు సామాజిక భద్రతను కల్పించే ఈ పింఛన్లను సంతృప్తస్థాయిలో ఇస్తారా? ఇవ్వరా? అని నిలదీశారు. -
పండుగకు పస్తులే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సామాజిక భద్రతా పింఛన్ పథకం లబ్ధిదారులకు ఇది చేదు కబురే. దసరా పండుగకు పింఛన్ డబ్బులు చేతికందుతాయని భావించిన వారు నిరాశకు గురయ్యే పరిస్థితి నెలకొంది. సాంకేతిక కారణాలతో బుధవారం జిల్లావ్యాప్తంగా చెల్లింపులు నిలిపివేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ (డీఆర్డీఏ) మంగళవారం విడుద ల చేసిన ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబ ర్ మాసానికి సంబంధించి వృద్ధాప్య, వికలాంగ, వితంతువు, చేనేత, కల్లుగీత కార్మికులు, అభయహస్తం ఫించన్లను నిలిపివేయనున్నారు. డీఆర్డీఏ అధికారుల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 2,84,165 మంది లబ్ధిదారులకు నెలనెలా రూ.3.16 కోట్ల మేరకు పింఛ న్లు పంపిణీ చేస్తున్నారు. 15 వేలకు పైగా దరఖాస్తులు ఏడాదిగా పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడున్న లబ్ధిదారులకు సాంకేతిక కారణాలు తరచూ ప్రతిబంధకాలు అ వుతున్నాయి. ఉగాదికి ముందు ఇదే తరహాలో ఫించన్లను ఆపేశారు. ఇదిలా ఉండగా, సామాజిక భద్రత ఫించన్ల పంపిణీకి పోస్టాపీసుల్లో బయోమెట్రిక్ మిషన్ లో తమ ఆధార్‌కార్డులను నమోదు చేయించుకోవా ల్సి ఉంది. ఆధార్ సంఖ్య లేనట్లయితే ఫించన్ చెల్లించే వీలు లేదు. అధికారులే లబ్ధిదారులకు అవగాహన క ల్పించి సరైన సమయంలో ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంది. జిల్లా మొత్తంగా చూస్తే 25,52,073 మంది జనాభా ఉంటే 23,61,450 మంది (92.53 శాతం) ఆధార్‌తో అనుసంధానం అయినట్లు గణాంకా లు చెప్తున్నాయి. ఆధార్ కార్డులు లేనివారు ఎక్కువ మంది ఫించన్‌దారులే. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకం గా భావించని కారణంగా ఫించన్‌దారులకు పండగపూట చేతికి డబ్బులందకుండా పోతున్నాయి. -
ఆధార్‌తో బోగస్‌కు తెర
వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు(అగ్రికల్చర్): ఆధార్ నంబర్ అనుసంధానంతో ప్రభుత్వ పథకాల్లో బోగస్ లబ్ధిదారులకు తెర పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సామాజిక భద్రతా పథకం పింఛన్ల వెరిఫికేషన్, జన్మభూమి- మా ఊరు, నీరు-చెట్టు తదితర వాటి ప్రాధాన్యతలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సందేశాన్ని ఆర్డీఓ, తహశీల్దారు, పంచాయతీ కార్యాలయాల్లో లైవ్ టెలీకాస్ట్ చేశారు. కర్నూలులో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయ్‌మోహన్, జేసీ కన్నబాబు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పింఛన్లు అర్హులకే ఇవాలనే ఉద్దేశంతో పంచాయతీ, వార్డు స్థాయిలో పకడ్బందీ సర్వే చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పురోగతి సాధించామని 100శాతం పూర్తయ్యేందుకు కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000లకు పెంచుతున్నామన్నారు. అదే రోజు నుంచి 20వ తేదీ వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా చూడాలన్నారు. -
‘అమ్మ హస్తానికి’ ఫ్రాక్చర్
మూడు నెలలుగా అరకొరగా సరకుల పంపిణీ రెండు నెలలుగా అందని చింతపండు, పసుపు, కారం నెల రోజులుగా వంట నూనె నిలిపివేత ఈ నెల కూడా పంపిణీ అనుమానమే నర్సీపట్నం, న్యూస్‌లైన్: గత ప్రభుత్వం ప్రచారాస్త్రంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. గత ఏడాది ఉగాది రోజున ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ఏడాదైనా ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది. ప్రచారం కోసమే పథకం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్, ఇతర మంత్రుల ఫొటోలను విరివిగా వాడుకున్న ఈ పథకాన్ని కేవలం ప్రచార అస్త్రంగానే వాడుకున్నారు తప్ప సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. మూడు నెలలుగా వినియోగదారులకు ప్రభుత్వం అరకొరగా సరుకులు పంపిణీ చేస్తూ నెట్టుకొస్తోంది. మూడు నెలల క్రితం నుంచిసరుకుల కొరత ఏర్పడింది. ప్రారంభంలో ఉప్పు, గోధుమ పిండి సరఫరాను నిలిపివేసి, తరువాత పునరుద్ధరించారు. రెండు నెలలుగా చింతపండు, పసుపు, కారం పం పిణీ నిలిపివేశారు. గత నెల నుంచి వంట నూనె కూడా పంపిణీకి నోచుకోలేదు. నూనె కొరత ఈ నెల కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పంచదారపై ఇచ్చే రాయితీని కేంద్రం మూడు నెలల క్రితమే నిలిపివేసింది. ఎన్నికల ముందు పంచదార పంపిణీ నిలిపివేయడం మంచిది కాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారాన్ని భరి స్తూ ఈ మూడు నెలలూ నెట్టుకొచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చాక దీనిపై ఒక నిర్ణయం తీసుకోకుంటే పంచదార పంపిణీ సైతం నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సాక్షాత్తూ అధికారులే అంటున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల కుటుంబాలు ఈ సరుకులపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆ బాబు నీడలు మాకొద్దు
ఒక వికలాంగురాలిగా నా అనుభవ పాఠాలతో చెబుతున్నాను. ప్రభుత్వాలిచ్చే సామాజిక పెన్షన్లను రాజకీయంగా చూడవద్దు. సామాజికంగా దెబ్బతిన్న వర్గాలకు ఇది చేయూత అనుకోండి. వారు భావితరాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని మరవద్దు. అలా ఆలోచించే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నది నా కోరిక. వికలాంగులు, వయో వృద్ధులు, వితంతువుల ఆవేదన నుంచి వచ్చే ఏకైక మాట ఇది. ఒకింత బాసట కావాలని ఆశించే అభ్యర్థన ఇది. గెస్ట్ కాలం: సమాజంలో మెజారిటీ వికలాంగులు దయనీయస్థితిలో ఉన్నారు. వయో వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఈ వర్గాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. వంద కూడా దాటని పెన్షన్ కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లం. వైఎస్ పాదయాత్రలో అనేకమంది ఈ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగురాలిగా నాకూ ఏదో తెలియని అపనమ్మకం ఉండేది. దానికి బలమైన కారణాలూ న్నాయి. చంద్రబాబు తన హయాంలో తొమ్మిదేళ్లు ఉద్యోగ నియామకాలు నిలిపివేశారు. ఫలితంగా ఒక్క వికలాంగుడికీ ఉద్యోగం రాలేదు. ఆయన ఈ ద్రోహం చేసి ఉండకపోతే వికలాంగుల్లో కనీసం 50 శాతం మంది బాగుపడి ఉండేవారు. ఉద్యోగాల్లో చేరి ఉండేవారు. వైఎస్‌కు మేలు చేయాలని ఉన్నా... చంద్రబాబు చర్యలు అడ్డుగా నిలిచాయి. అప్పటికే అనేకమంది ఉద్యోగాల్లో చేరేందుకు వయోపరిమితి దాటిపోయారు. వయో వృద్ధుల పరిస్థితి ఇంతకంటే దారుణం. చంద్రబాబు కాలంలోని వరుస కరవు.. గ్రామీణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసింది. ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలోనే అంతరించాయి. ఖాళీ అయిన ఊళ్లు, వలసలు వెళ్లిన కొడుకులు ఆనాటి పరిస్థితి. దీంతో వయసు ఉడిగిన పెద్దలకు ఆసరా కరవైంది. పూట గడవడమే కష్టమనే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత హైటెక్ మోజులో యువత పట్టణాలకు ఎగబాకారు. అంతిమంగా వృద్ధులు నిరాశ్రయులయ్యారు. వితంతువుల స్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే భర్తలు కోల్పోయిన వారిని 2004కు ముందు పట్టించుకున్నదెవరు? పెన్షన్లు ఇవ్వడం వైఎస్ గొప్పతనమే. పెన్షన్లు పెంచడం, వాటిని నెలనెలా సక్రమంగా ఇవ్వడం వల్ల మాకు కొంతైనా ఊరట కలిగింది. ఆయన తర్వాత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. వికలాంగులు, వయోవృద్ధులకు ఇతర దేశాల్లో ప్రభుత్వాలే చేయూతనిస్తున్నాయి. మన దేశంలో మూడు శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. రాజకీయంగా ఆ మాత్రం కూడా లేదు. వితంతువులు, వికలాంగుల్లో అత్యధికులు నిరుద్యోగులు. వికలాంగుల్లో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉన్నారు. దీనికి ఫ్లోరైడ్ కూడా కారణం కావచ్చు. విద్య, వైద్యం అందరికీ అందాలని వైఎస్ చెప్పేవారు. ఆ దిశగా ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ వంటి వైద్య సదుపాయాలు ఉండొచ్చు. అయితే మహిళా వికలాంగులకు ఇవే చేయూతనిస్తాయని చెప్పలేం. వారి సమస్యలు వేరు. ప్రసూతి సమయంలో వారికి ఉండే ఇబ్బందులు భిన్నం. వయసు మీదపడే కొద్దీ వికలాంగుల ఆరోగ్య పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఔషధాల వినియోగం పెరుగుతుంది. వృద్ధుల పరిస్థితీ ఇదే. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడిచ్చే పెన్షన్‌ను మరింత పెంచాలి. సామాజిక పెన్షనర్లను రాజకీయ ఆయుధంగా వాడుకోకూడదు. ఎన్నికల మేనిఫెస్టోలో వారి గురించి ఆలోచిస్తే చాలు. చంద్రబాబు ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించడం వల్ల ఒకతరం అవిటిదైపోయింది. ఇది గుర్తించి ఊరట కలిగిద్దామనుకున్నారు వైఎస్. తన ప్రయత్నాలు కార్యరూపం దాల్చేలోపే ఆయన లేకుండాపోయారు. ఆ తర్వాత పాలకులు కనీసం ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లినా బాగుండేది. మా సానుభూతి వైఎస్వైపే ఉందనుకున్నారో ఏమో! అన్యాయం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మూడేళ్లుగా ఇవ్వడం లేదు నేను పుట్టుకతోనే వికలాంగుడను. కాలు పనిచేయదు. 75శాతం వికలత్వం ఉన్నట్టు సదరం క్యాంపులో వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు వికలాంగ పింఛన్ మంజూరు చేశారు. ఆయన ఉన్నంత వరకు పింఛన్లు సక్రమంగా ఇచ్చిన అధికారులు మూడేళ్లుగా సరిగా ఇవ్వడం లేదు. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి తిరిగి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - శివకుమార్, కొత్తపల్లి(హెచ్), నార్నూర్ వైఎస్ పుణ్యమాని.. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.75 వృద్ధాప్య పింఛన్ ఇచ్చేవాళ్లు. వైఎస్ పుణ్యమా అని అది రూ.200కు పెరిగింది. దీంతోనే బతుకుతున్నం. మాలాంటి ఎంతో మంది వృద్ధులకు వైఎస్సార్ అన్నం పెట్టిండు. వేలి ముద్రల పేరుతో ఇప్పుడు పింఛన్ ఇచ్చేందుకు పరేషాన్ చేస్తుండ్రు. వేలి ముద్రలు రాక పోవడంతో డబ్బులు సమయానికి దొరకడం లేదు. పోస్టాఫీస్ చుట్టూ తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. పింఛన్ పెంచిన రాజశేఖరరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. - హమీదా బేగం, వాంకిడి, ఆదిలాబాద్ పింఛన్‌తోనే బతుకుతున్నా.. నా భర్త చనిపోయి 20ఏండ్లయింది. ఆసరాగా ఎవరూ లేరు. మొదట్లో రూ.75 పింఛన్ వచ్చేది. రాజన్న వచ్చినంక రూ.200కు పెంచిండు. ఒకటో తారీఖు రాంగనే పంచాయతీకి పోయి పైసలు తెచ్చుకుంట. ఎన్నికల్లో గెలిసేటోళ్లు పింఛన్ పెంచాలి. రూ.700 ఇత్తే అండగా ఉంటది. - బోగ రాజమ్మ, వితంతు పింఛను లబ్ధిదారురాలు, బచ్చన్నపేట, వరంగల్