ఇంకెప్పుడో!
సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎదురుచూపు
సామాజిక భద్రతలో భాగంగా నెల నెలా వెయ్యి రూపాయల పింఛన్ పథకాన్ని దసరా నుంచే ప్రారంభిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి దాటి పోయినా లబ్ధిదారులు ప్రయోజనం పొందలేకపోయారు. ఆహార భద్రత కింద రూపాయికి కిలో బియ్యం కోసం సామాన్యులు ఎదురు చూస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందించడంలో భాగంగా ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. రోజులు నెలలు గడుస్తున్నా, విచారణ కొలిక్కి రావడం లేదు.
* గడువు సమీపిస్తున్నా పూర్తికాని అర్జీల పరిశీలన
* 300 బృందాలు పని చేస్తున్నా కొలిక్కిరాని విచారణ
* ఈనెల 8 వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం
* నగర, పురపాలక సంఘాలలో మరింత జాప్యం
* వేగవంతం చేస్తేనే పింఛన్, బియ్యం అందేది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆహార భద్రత, సామాజిక పింఛన్లు తదితర దరఖాస్తులపై విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. వాస్తవంగా జిల్లాలో నమోదైన వివిధ కేటగిరీలకు చెందిన దరఖాస్తులపై ఈ నెల ఒకటినాటికే విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి వివరాలు అందించాల్సి ఉంది. సర్వే ఆధారంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఈ నెల ఎనిమిది నుంచి ప్రభుత్వ లబ్ధి చేకూర్చాలన్న ప్రతిపాదన ఉండగా, ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలనే పూర్తి కాలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.
ఆహారభద్రత, సామాజిక భద్రత పింఛన్, కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ కోసం 14,09,632 దరఖాస్తులు రాగా, శనివారం నాటికి 50.87 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉండటంతో ప్రభుత్వం సర్వే గడువును ఈ నెల ఎనిమిది వరకు పొడిగించారు. అయినప్పటికీ గడువులోగా విచారణ పూర్తవుతుం దా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నత్తనడకన విచారణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహారభద్రత, సామాజిక భద్రత ఫించన్లు తదితర దరఖాస్తులపై విచారణ నత్తనడకన సాగుతోంది. సర్వే కోసం వెళ్తున్న బృం దాలకు అక్కడక్కడా రాజకీయ ఒత్తిళ్లు, అడ్డంగులు ఎదురవుతున్నాయి. సకాలంలో విచారణను పూర్తి చేయకపోతే వచ్చే నెలలో కూడ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందే అవకాశం లేదు. సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిం చారు. అదేనెల 15వ తేదీ వరకే అవకాశమని చెప్పినప్పటికీ 20వ తేదీ వరకు కూడ దరఖాస్తులు స్వీకరించారు.
విచారణ, సర్వే కోసం వెళ్లిన సందర్భం గానూ దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఆహారభద్రత కింద 7,25,723 దరఖాస్తులు, సామాజిక భద్రత పింఛన్ల కోసం 3,85,210 దరఖాస్తులు, కుల ధ్రువీకరణకు 1,12,011 దరఖాస్తులు, ఆదాయ ధ్రువీకరణకు 1,00,531 దరఖాస్తులు, స్థానికత ధ్రువీకరణ కోసం 93,961 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా అన్ని కేటగిరీల కింద 14,09,632 వరకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఈ దరఖాస్తులపై విచారణ జరిపేందుకు ఒక్కో టీములో 10-15 మంది చొప్పున 300 బృందాలను రంగలోకి దిం పారు. అయినా సగం పరిశీలన కూడా పూర్తి చేయలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు ఉద్యోగుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగర, పురపాలికలలో
నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు అర్మూరు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలలో దరఖాస్తుల విచారణలో మరింత జాప్యం జరుగుతోంది. మొత్తం గా నమోదైన దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే 23 శాతం కూడ వెరిఫికేషన్ కాలేదు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్ల నుంచి 83,373 మంది ఆహారభద్రత కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 6,106 (7.32 శాతం) దరఖాస్తులపై విచారణ జరిపారు. సామాజిక భద్రత పింఛన్ కోసం 34,344 దరఖాస్తులు వస్తే అందులో 3,636 మాత్ర మే వెరిఫికేషన్‌కు నోచుకున్నాయి. ఆర్మూరు మున్సిపాలిటీలో 12,256 ఆహారభద్రత దరఖాస్తులలో 3,223 పరిశీలించగా, 6,067 పింఛన్ దరఖాస్తులలో 1,460 అర్జీలపై విచారణ జరిపారు.
బోధన్‌లో 19,653 ఆహారభద్రత దరఖాస్తులకుగాను 6,742, 8,578 పింఛన్ దరఖాస్తులకుగాను 3,394, కామారెడ్డిలో 17,690 ఆహారభద్ర త దరఖాస్తులకుగాను 7,833, 6,704 పింఛన్ దరఖాస్తులకుగాను 2,788 దరఖాస్తులపై విచారణ జరిపారు. ఆరు రోజుల గడువులో 77 శాతం దరఖాస్తులపై వెరిఫికేష న్ చేయాల్సి ఉంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన మీద కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఏజేసీ డాక్టర్ శేషాద్రి, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. అయినా దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. విచారణ బృందాలు మరింత వేగం పెం చితేనే నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి అర్హులైన లబ్ధిదారుల జాబితా పంపే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం అందించే వెయ్యి రూపాయల పింఛన్ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.