మళ్లీ పల్లెబాట
సొంత ఊళ్లకు పయనమైన వలసజీవులు
* సంక్షేమ ఫలాలు పొందేందుకు పరుగులు
* ఆహార భద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు
* వ్యయభారమైనా తప్పని పరిస్థితి
మెదక్: ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస జీవులంతా ఇపుడు స్వగ్రామాల బాట పడుతున్నారు. ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే కోసం పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లిన శ్రమ జీవులు...ఇపుడు మరోసారి పల్లెముఖం పట్టాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. పూట గడవక పొట్టకూటికోసం పట్నం వెళ్లిన వారంతా తమ పనులు మానుకొని ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ సర్కార్ ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే ఒకేరోజు నిర్వహించింది. సర్వేకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన పల్లెవాసులు ఆగమేఘాల మీద తమ పనులు మానుకొని స్వగ్రామాలకు పరుగులు పెట్టారు. దీంతో దాదాపు తెలంగాణ రాష్ర్ట జనజీవనం స్తంభించింది.
పథకాల కోసం పల్లెలకు
అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను అందించడానికి టీఆర్‌ఎస్ సర్కార్ మరోసారి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అర్హులకు పథకాలు అందించి, అనర్హులపై వేటు వేసేందుకు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆధారం చేసుకుంది. గతంలో ఉన్న రేషన్‌కార్డులను, పింఛన్ పథకాలను రద్దు చేస్తూ సమగ్ర సర్వే ప్రాతిపదికగా ఈనెల 15లోగా అర్హులైన లబ్ధిదారులంతా దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో కూలీనాలీ చేసుకునేందుకు పట్టణాలకు వలస వెళ్లిన గ్రామీణులు తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దరఖాస్తుల గడువు కేవలం ఐదు రోజులు మాత్రమే విధించారు.
ఇందులో రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు ముగిసిపోయాయి. దీంతో మరో మూడు రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తమ కుటుంబీకుల ద్వారా విషయం తెలుసుకున్న వలస జీవులు స్వగ్రామాలకు వెళ్లేందుకు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరా గ్రామాలకు వచ్చాక ఆధార్‌కార్డులు లేక కొంతమంది, ఇతర ధ్రువ పత్రాలు లేక మరికొంతమంది పరేషాన్ అవుతున్నారు. ఈ క్రమంలో కేవలం రూ.1 విలువ చేసే దరఖాస్తు ఫారాన్ని జిరాక్స్ సెంటర్ల వారు రూ.5 విక్రయిస్తుండగా, ఆధార్ నమోదు కోసం మీ సేవా కేంద్రాలు రూ.100 పైగా దండుకుంటున్నాయి.
దరఖాస్తు తర్వాత ఊర్లోనే ఉండాలి
పింఛన్‌లు, ఆహార భద్రత కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు మరో 15 రోజుల పాటు స్వగ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దరఖాస్తులో తెలిపిన వివరాలను నిర్ధారణ చేసుకునేందుకు ఈనెల 16 నుంచి 30 వరకు మండల అధికారులు ఇంటింటి సర్వే నిర్విహ ంచనున్నారు. దీంతో అధికారులు ఎవరింటికి ఎప్పుడు వస్తారో తెలియక వలసజీవులంతా 15 రోజులపాటు ఇళ్ల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రైవేట్ ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకునే శ్రామిక జీవులు ఉపాధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు వికలాంగులు కూడా పింఛన్ల కోసం మెడికల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. అలాగే ఆధార్‌కార్డు లేనివారు కనీస ఎన్‌రోల్‌మెంట్‌నంబర్‌ను రాయాల్సి ఉం టుంది.
ఇవన్నీ ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న వలసజీవులకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో జీతాలు రాక పూట గడవని పరిస్థితి నెలకొంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా వారికి ఆహార భద్రత కార్డులు, పింఛన్లు వస్తాయోలేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కుటుంబ సమగ్ర సర్వే కోసం ఆగస్టులో సొంతూళ్లకు వచ్చిన వలసజీవులు, ఇటీవలే దసరా పండుగకూ ఓ సారి వచ్చిపోయారు. మళ్లీ ఇపుడు సర్కార్ సంక్షేమ ఫలాలు పొందాలంటే తప్పకుండా ఊర్లోనే ఉండాలని నిబంధన విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ పల్లెబాట పడుతున్నారు.
ఇలా 15రోజులకోసారి స్వగ్రామాలకు వెళ్లిరావడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని, దరఖాస్తు చేసుకున్నాక మరో 15 రోజుల పాటు గ్రామాల్లోనే ఉంటే తమ పూట గడిచేదెట్లా? అని శ్రామికులు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్ 25 వరకు పరిశీలనలు జరుపుతున్న సమయంలో కూడా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ ఏ అధికారి ఎప్పుడు తమ ఇంటికి వస్తాడో తెలియక వలసజీవులు ఆందోళన చెందుతున్నారు.