food security
-
ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకం
ప్రస్తుత వేగంతో 2050 నాటికి ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించడమనే పెను సవాలును ఎదుర్కోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో బిగ్గరగానూ, స్పష్టంగానూ వ్యవసాయ శాస్త్ర వేత్తలు, పరిశోధకులు తమ లేఖ ద్వారా చేసిన హెచ్చరిక సకాలంలో వినిపించిన మేల్కొలుపులా కనపడుతోంది. ‘‘భవిష్యత్ ఆహార అవసరాలను తీర్చడానికి మనం సరైన మార్గంలో లేకపోగా, కనీసం దానికి సమీపంలో కూడా లేము’’ అని వారి లేఖ అప్రమత్తం చేసింది.14వ దలైలామా, జోసెఫ్ స్టిగ్లిడ్జ్, కైలాస్ సత్యార్థి, రాబర్ట్ హుబెర్, డరోన్ అసెమోగ్లు, సర్ జాన్ ఇ వాకర్ వంటి నోబెల్ గ్రహీ తలు, డాక్టర్ గురుదేవ్ ఎస్ ఖుష్, పెర్ పిన్ స్ట్రప్ ఆండర్సన్, రట్టన్ లాల్, హాన్స్ ఆర్ హెర్రెన్ వంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీతలు ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో ఉన్నారు. ‘‘సైన్స్, ఆవిష్కరణల నాయకులుగా మేము ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు హామీ నివ్వడానికి, ప్రపంచాన్ని మేల్కొలపటంలో, సామూహిక ఆకాంక్షలను పెంచడంలో మాతో చేరాలని, పరిశోధనాపరమైన పెద్ద ముందంజ వేయాలని మిమ్మల్ని కోరుతున్నాము’’ అని ఆ లేఖ ముగుస్తుంది.2050 నాటికి ప్రపంచం 980 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి పూనుకుంటున్న వేళ, దాదాపు 80 కోట్లమందిని ఆకలితో అలమటింపజేస్తున్న ఆహార కొరత అనేది ఉత్పత్తి పడిపోవడం వల్లనే ఏర్పడలేదు. ఆహార కొరత కేవలం తప్పుడు విధానాల ఫలితమేనని అందరూ గ్రహించాలి. ‘హంగర్స్ టిప్పింగ్ పాయింట్’ అనే శీర్షికతో కూడిన ఆ లేఖ... ‘వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న సాధారణమైన తీవ్ర వాతావరణ ఘటనల’ గురించి ఈ శతాబ్ది మధ్యనాటికి ఆహార, పోషకాహార సంక్షోభం మరింత తీవ్రమవడం గురించి మాట్లాడుతుంది. ఇక ఆ లేఖలోనే సరిగ్గానే వేర్కొన్నట్లుగా.. నేలకోత, భూమి క్షీణత, జీవవైవిధ్య నష్టం, నీటి కొరత, సంఘర్షణలు వంటి అదనపు అంశాలు ఆహార ఉత్పాదకతను తగ్గిస్తాయి.ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఆఫ్రికాకు ప్రధాన ఆహారమైన మొక్కజొన్న గురించి ఆ లేఖలో పేర్కొన్నప్పటికీ భవిష్యత్తులో ఆహార దిగుబడి తగ్గుతుందనే అంచనాల వల్ల ఆ పంటకు నిజంగానే ముప్పు పొంచి ఉంది. అయితే చేతులు కలిపి సహకరించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రపంచం గ్రహించేవరకు, ఆహార, పోషకాహార భద్రతకు సంబంధించిన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు, ఆఫ్రికా తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ, అమెరికాలో దేశీయ మొక్కజొన్న ఉత్పత్తిలో 44 శాతం ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తున్నారు. అలాగే, న్యూ సైంటిస్టు జర్నల్ (2022 మార్చి 14) లోని ఒక నివేదిక ప్రకారం, 9 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఇథనాల్ కోసం మళ్లించారు. ఇక యూరో పియన్ యూనియన్ గోధుమలు, మొక్కజొన్నతో సహా కోటి 20 లక్షల టన్నులను ఆటోమొబైల్స్ కోసం ఆహారంగా ఉపయోగిస్తోంది. ఇంకా, 35 లక్షల టన్నుల పామాయిల్‌ను ఈయూ డీజిల్ ఉత్పత్తి కోసం మళ్లించింది.రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార సరఫరాలు దెబ్బతిన్నప్పుడు ఇదంతా జరిగింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ లలో జీవ ఇంధన ఉత్పత్తిలో కేవలం 50 శాతం తగ్గించినట్లయితే, అలా ఆదా చేసిన ధాన్యం... యుద్ధం వల్ల ఏర్పడిన మొత్తం ఆహార కొరతను తీర్చగలదు. గోధుమ, వరి వంటి పంటల్లో కిరణజన్య సంయోగక్రియను పెంపొందించడం, ప్రధాన తృణ ధాన్యాలలో జీవసంబంధమైన నత్రజనిని స్థిరీకరించడం, వార్షిక పంటలను శాశ్వత పంటలుగా మార్చడం, పంటల వ్యవస్థను వైవిధ్యీకరించడం, సూక్ష్మజీవులు – శిలీంధ్రాల నుండి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సృష్టించటం వంటి అవసరమైన పరివర్తనా ప్రయత్నాలను చేపట్టాలని ఈ లేఖ కోరుతోంది. ‘‘బిలియన్ల కొద్దీ ప్రజలకు ఆరోగ్యకరమైన, ఉత్పాదక, సురక్షితమైన జీవితాలను కల్పించడం వల్ల కలిగే ప్రయోజనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా విస్తృతంంగా రాబడిని ప్రవహింపజేస్తుంది’’ అని అంగీకరించాలని ఆ లేఖ పేర్కొంది.వ్యవసాయ పరిశోధనలో పెట్టే పెట్టుబడి బహుళ రాబడిని కలిగిస్తుందని చూపడానికి తగినన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ‘‘భవి ష్యత్తులో విజయవంతమైన ఆహార వ్యవస్థను నడిపించే ఆవిష్క రణకు పునాదిగా సమాజం స్పాన్సర్ చేసిన పరిశోధన ఉండాలని’’ కూడా నివేదిక పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వ ప్రాయోజిత పరిశోధనకు ప్రాధాన్యం ఉందా, లేక ప్రైవేట్ పరిశోధనల ఆధిపత్యంపై ప్రాధాన్యం ఉందా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రజలకు ఆరోగ్యకరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న స్థిరమైన ఆహారాన్ని అందించడంలో బహుళ మార్కెట్ వైఫల్యాల గురించి ఈ లేఖ మాట్లాడుతుంది. అయితే ఇంకా అతి పెద్ద ఉపద్రవం ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతిచోటా వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో మార్కెట్ల వైఫల్యం!నా అవగాహన ప్రకారం, స్థిరమైన వ్యవసాయ జీవనోపాధికి హామీ ఇచ్చేందుకు కఠినమైన ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో ఆహారం, పోషకాహార భద్రతకు సంబంధించి సవాళ్లను ఎదుర్కో వడం కష్టం కావచ్చు. ఉదాహరణకు, 2024 సెప్టెంబర్‌లో ముగిసిన చివరి ఐదు సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ కోసం అమెరికా వ్యవసాయ బిల్లు రైతులకు, వ్యవసాయానికి 1.8 ట్రిలియన్ డాలర్లను కేటాయించింది. అయినప్పటికీ ఈ సంవత్సరం ఐదుగురు రైతుల్లో ఒకరు వ్యవసాయం మానేస్తారని అమెరికా అంచనా వేస్తోంది. నిజానికి, సరకుల ధరలు తక్కువగా ఉండడం, అధిక ఉత్పత్తి వ్యయం కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని పూడ్చడానికి 10 బిలియన్ డాలర్ల తక్షణ సాయం వాగ్దానం చేసింది. అయినప్పటికీ ఈ పరిణామం జరగబోతోంది. కొత్త వ్యవసాయ బిల్లు–2024 ఆమోదం కోసం వేచి ఉంది.గత సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 24 దేశాల్లో రైతుల నిరసన తర్వాత యూరోపియన్ యూనియన్‌లో హామీ ఇచ్చిన వ్యవసాయ ఆదాయం ఒక సాధారణ సూత్రంగా ముందుకొచ్చింది. పక్షం రోజుల క్రితం ఫ్రాన్స్‌లోని చిన్న రైతుల సమాఖ్య అయిన కాన్ఫెడరేషన్ పేజన్, వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయ ఆహార సరఫరా గొలుసుకు చెందిన సర్దుబాటు అస్థిరతగా వదిలివేయ కూడ దని పిలుపునిచ్చింది. రైతులకు హాని కలిగించే విధంగా దిగువ స్థాయి అదనపు మార్జిన్లను సమాఖ్య ఖండించింది. దీని అర్థం ఏమిటంటే ఆహార గొలుసులోని అన్ని ఇతర వాటాదారులు భారీ లాభాలతో ముందుకు వెళ్లిపోతున్నప్పటికీ, రైతు మాత్రం దాని అంచుల వద్దే మనుగడ సాగించాల్సి వస్తుంది.భారత్‌లో, పంజాబ్–హరియాణా సరిహద్దులో 11 నెలలకు పైగా జరుగుతున్న రైతుల నిరసన నేపథ్యంలో గమనిస్తే, 14 ఖరీఫ్ పంటలలో ఏడింటి మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే 12 నుండి 26 శాతం తక్కువగా ఉన్నాయి. సంవత్సరాలుగా, వ్యవసాయ ఆదాయాలు స్తబ్ధుగా ఉంటున్నాయి లేదా కిందికి పడిపోతున్నాయి. నిజం చెప్పాలంటే, 2050లో 150 కోట్ల మంది అదనపు ప్రజలకు ఆహారమివ్వడం కచ్చితంగా సాధ్యమే. కానీ వ్యవసాయాన్ని ఆచరణీ యమైనదిగా, లాభదాయకమైనదిగా మార్చే కార్యాచరణ విధానం కీలకం. అప్పుడే అది సాధ్యం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
‘కనీస’ చట్టబద్ధతే సంజీవని!
కాలచక్రంలో నెలలు, సంవత్సరాలు పరిగెడుతున్నాయి. కొన్ని రంగాలు రూపు రేఖలు గుర్తుపట్టలేనంతగా మారుతున్నాయి. కానీ, మార్పు లేనిదల్లా వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల జీవితాలే. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు దాటిపోయినా, ఇంకా రైతులు తమ గోడు చెప్పు కోవడానికి రోడ్లపైకి వస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. ఇంతా చేసి రైతులు కోరుతున్నదేమీ అన్యాయమైన డిమాండ్లు కావు. ప్రభుత్వాలు నెరవేర్చగల సహేతుక డిమాండ్లే! ఆత్మగౌరవంతో జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేంత వరకూ రైతులకు ఆత్మగౌరవం లభించదు. రైతాంగం ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి కనీస మద్దతు ధరలు లభించాల్సిందే. వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందే.2024 ఏడాది ప్రారంభంలో పంజాబ్ రైతులు మరో పోరాటానికి ఉద్యుక్తుల య్యారు. ఏడాది గడిచినా ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి గల కారణాలను విశ్లేషించి చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమా నుష వైఖరి బహిర్గతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు నల్ల చట్టాలను తేవాలని ప్రతిపాదించడం, దానిపై అన్ని రాష్ట్రాల రైతాంగం ఢిల్లీలో చలికి, ఎండలకు, వానలకు తట్టుకొని చేసిన సుదీర్ఘ ఉద్యమం దరిమిలా కేంద్రం దిగొచ్చింది, ప్రతిపాదిత బిల్లుల్ని ఉప సంహరించుకుంది. అయితే, ఆ సందర్భంగా రైతులకు చేసిన వాగ్దానాలను మాత్రం కేంద్రం నెరవేర్చలేదు. ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, రైతుల్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న పంట రుణాలను మాఫీ చేయాలనీ రైతాంగం చేసిన డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయ లేదు. దాంతో 2024 ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హరి యాణా సరిహద్దుల్లోని శంభూ అంబాలా, అఖేరిజింద్ కూడళ్ల వద్ద బైఠాయించి ఉద్యమం నడుపుతున్నారు. రైతుల డిమాండ్ల పరిష్కా రానికి సహేతుక ముగింపు లభించాలన్న ఉద్దేశంతో రైతు నాయకుడు జగ్జీత్సింగ్ డల్లేవాల్ (నవంబర్ 26న) ఆమరణ దీక్ష మొదలు పెట్టాక, ఈ పోరాటానికి దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. నిజానికి ఓ పోరాటాన్ని విరమింపజేసే సమయంలో ఇచ్చిన వాగ్దానాల్ని కేంద్రం నెరవేర్చకపోవడం, వాటిని నెరవేర్చాలన్న డిమాండ్‌తో రైతాంగం మరో పోరాటానికి దిగడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు.కనీస మద్దతు ధర ప్రాథమిక హక్కు లాంటిదే!మూడేళ్ల క్రితం ఉపసంహరించుకున్న మూడు నల్ల చట్టాల్ని కేంద్రం మరో రూపంలో తీసుకురాబోతోందన్న సంకేతాలతోనే పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75 సంవత్సరాలలో పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించక, సాగు గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో చిక్కుకొని గత్యంతరం లేక, తమ జీవితం పట్ల తమకే విరక్తి కలిగి ఇప్పటికి 7 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నా ప్రాణం పోతే పోతుంది. కానీ ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల జాబితాలోకి మరికొన్ని పేర్లు చేరకూడదు’’ అన్న 70 ఏళ్ల డల్లేవాల్ మాటలు వ్యవసాయరంగ వాస్తవ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. దేశానికి ఆహార భద్రత అందించే రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకొనే దుఃస్థితి ఎందుకు ఉన్నదో పాలకులు ఆలోచించడం లేదు. గతంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు తాజాగా తెస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్కరణలు రైతుల పాలిట ఉరి తాళ్లుగా మారనున్నాయి. పంట ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (అగ్రి కల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లను రద్దు చేసి కాంట్రాక్టు సాగుకు పట్టం కట్టాలన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ప్రతిపాదనకు రైతాంగం ససేమిరా ఇష్టపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకురాదలిచిన సంస్కరణలకు సంబంధించి 2024లో విడుదల చేసిన ముసాయిదా పత్రంలో పేర్కొన్న అంశాలు దాదాపుగా అంతకుముందు విరమించుకొన్న వ్యవసాయ బిల్లుల్లోని అంశాలకు నకలుగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తు న్నారు. అవి: 1. జాతీయ వ్యవసాయ మార్కెట్లను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం; 2. ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకు రావటం; 3. ఫీజు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లింపు చేయటం;4. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తించడం; 5. ప్రైవేట్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికల ఏర్పాటు... ఇలా పలు ప్రతిపా దనలను ముసాయిదా బిల్లులో చేర్చి, వాటిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు రైతాంగ ప్రతినిధులతో చర్చించడం, వారిని భాగస్వాముల్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కేంద్రం ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడాన్ని రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. తమకు అంగీకార యోగ్యం కాని నిర్ణయాలు చేయడం కోసమే కేంద్రం ఏక పక్షంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఆశించడం రాజ్యాంగంలో ప్రజలకు దఖలు పడిన ప్రాథమిక హక్కు లాంటిదేనని డల్లేవాల్ పేర్కొనడం దేశవ్యాప్త చర్చకు ఆస్కారం కల్పించింది. దేశవ్యాప్త డిమాండ్ కూడా అదే!తాము పండించే పంటకు ఎంత ధర ఉండాలో నిర్ణయించుకొనే హక్కు ఎలాగూ రైతాంగానికి లేదు. కనీసం పండించే పంటకు ఎంత మొత్తం కనీస మద్దతు ధర (ఎంఎస్íపీ)గా ఇస్తారో ముందుగా తెలుసుకోవాలను కోవడం అత్యాశేమీ కాదు కదా? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అంటే పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటు లెక్క గట్టి ధరల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్రానికి తగిన సూచనలు చేయాలని అభ్యర్థించారు. అయితే, ప్రజల జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని... కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించలేమనీ, అలా చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పుతాయనీ సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదారి పట్టించిందన్నది నిర్వివాదాంశం.నిజానికి ఈ సమస్యను న్యాయస్థానాలు పరిష్కరించాలని ఆశించడం కూడా సముచితం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించే సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్)లో చైర్మన్ నుంచి సభ్యుల వరకూ అందరూ బ్యూరోక్రాట్లే. రైతాంగ ప్రతినిధులు ఉండరు. పేరుకు ‘సీఏసీపీ’ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా కనిపిస్తుంది గానీ, దానిపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. సీఏసీపీ నిర్ణయించే కనీస మద్దతు ధరల విధానం ఆమోదయోగ్యం కాదని దశాబ్దాలుగా రైతాంగ సంస్థలు మొత్తుకొంటున్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే శిరోధార్యం అని ఎందరు చెప్పినా దానికి మొగ్గుచూపడం లేదు. పైగా, తాము అనుసరించే విధానాన్నే స్వామినాథన్ కమిషన్ సూచించిందనీ, ఆ ప్రకారం సాగు వ్యయంపై 50 శాతం జోడించి ఇస్తున్నా మనీ దాదాపు ఐదారేళ్ల నుంచి కేంద్రం బుకాయిస్తూనే ఉంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడ్డం జాతీయ రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిన నేపథ్యంలోనే రైతాంగ సమస్యలు నేటికీ రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అన్న దాతలతో తక్షణం చర్చలు జరపాలి (ఎట్టకేలకు ఫిబ్రవరి 14న చర్చలకు ఆహ్వానించింది). ‘మార్కెటింగ్ ఫ్రేవ్ువర్క్’ పేరుతో తెచ్చిన ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతాంగం కోరు తున్నట్లు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం ఒక్కటే దేశ రైతాంగానికి సంజీవనిగా పని చేయగలుగుతుంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -
ఆహార భద్రతపై కలెక్టరేట్లలో ఫిర్యాదు కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ)కు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు, రిజి్రస్టేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. గత పదేళ్లలో పెరిగిన హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగం బలోపేతం కాలేదని మంత్రి అన్నారు. తామిప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్యను పెంచబోతున్నామని చెప్పారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇవిగాకుండా కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా మంచిపేరు ఉందని, ఆ పేరును నిలబెట్టేలా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మంచిగా బిజినెస్ చేసుకునే వారికి అండగా ఉంటూనే, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు. హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మాత్రమే కాదని, హాస్టళ్లు, హాస్పిటల్స్, వర్క్‌ప్లేస్‌లో ఉండే క్యాంటీన్లు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. భద్రకాళి టెంపుల్‌కు భోగ్ సర్టిఫికేషన్...: వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి, హైదరాబాద్‌లోని శ్రీజయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌కు భోగ్ సర్టిఫికెట్లను మంత్రి దామోదర అందజేశారు. హైజెనిక్ కండీషన్లో ఫుడ్ తయారు చేస్తూ, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించే దేవస్థానాలు, మందిరాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భోగ్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట, సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంసహా సుమారు పది ఆలయాలు, ధ్యాన మందిరాలకు భోగ్ సరి్టఫికేషన్ ఉందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. -
రైతుల ఆదాయం పెంచే ‘మౌలిక నిధి’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రైతుల పట్ల గల అమిత శ్రద్ధ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయం ఆయన రైతుల కోసం తీసుకున్న నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అన్నదాతల జీవితాలను మార్చడమే ప్రధాని మొదటి, అత్యంత ప్రాధాన్య లక్ష్యం. అందుకే ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో వ్యవసాయం, రైతులకు అధిక ప్రాధాన్యం కొనసాగించారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘వ్యావసాయిక మౌలిక సదుపాయాల నిధి’ (ఏఐఎఫ్), ‘పీఎం ఆశా’ వంటి పథకాలలో ఈ నిబద్ధత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఏఐఎఫ్ రూపంలో సుస్థిర పరిష్కారాన్ని అందించడం ద్వారా రైతుల సాధికారతకు ప్రభుత్వం గణనీయమైన సహకారం అందిస్తోంది.దేశంలో పంట కోత అనంతర నష్టాలు ఒక పెద్ద సవాలు. ఇది వ్యవసాయ రంగ ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. లక్షలాది రైతుల శ్రమను నీరుగారుస్తోంది. తాజా అంచనాల ప్రకారం, దేశంలో ప్రతి ఏటా మొత్తం ఆహార ఉత్పత్తిలో 16–18% ఈ విధంగా నష్టపోతున్నాం. పంట కోత, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ వంటి వివిధ సందర్భాల్లో ఈ తరహా నష్టాలను చూస్తున్నాం. సరైన నిల్వ, శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం, తగిన శుద్ధి యూనిట్ల కొరత, సమర్థమైన రవాణా సదుపాయాలు లేని కారణంగా ఈ భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. ఇది మొత్తం ఆహార భద్రతపై దుష్ప్రభావం చూపిస్తోంది.నిల్వ సదుపాయాలు పెరిగాయిమోదీ సమర్థ నాయకత్వంలో శాస్త్రజ్ఞుల పరిశోధనలను ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా 2020 జూలైలో ‘ఏఐఎఫ్’ను ప్రధాని ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట తరువాతి నిర్వహణ సమస్యలను పరిష్కరించడం, తద్వారా ఆహార నష్టాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. కొత్త ప్రాజెక్టులు, కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవాలి. ఏఐఎఫ్ కింద బ్యాంకులు 9 శాతం వడ్డీ పరిమితితో ఏడాదికి 3 శాతం వడ్డీ రాయితీ రుణాలు, ‘సీజీటీఎంఎస్ఈ’ (క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్) కింద ఆర్థిక సంస్థలు రూ. 2 కోట్ల వరకు రుణాలు అందిస్తాయి. ఈ పథకంలో భాగంగా గత ఆగస్టు వరకు మంజూరు చేసిన మొత్తం రూ. 47,500 కోట్లు దాటింది. ఇందులో రూ. 30 వేల కోట్లకు పైగా ఇప్పటికే వివిధ ప్రాజెక్టులకు కేటాయించారు. మంజూరైన ప్రాజెక్టుల్లో 54 శాతం... రైతులు, సహకార సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘా లకు అనుసంధానం కావడం విశేషం. ఇది పొలాల వద్దే మౌలిక సదుపాయాలను అందించడంలో రైతుల బలమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.పంట నష్టాల నుంచి రైతులను కాపాడటానికి నిల్వ (డ్రై, కోల్డ్ స్టోరేజీలు), రవాణా మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాని ప్రాధాన్యమిస్తున్నారు. డ్రై స్టోరేజ్ పరంగా చూస్తే, దేశంలో 1,740 లక్షల మెట్రిక్ టన్నుల పంటను నిల్వ చేసే సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 44% కొరత ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఉద్యాన ఉత్పత్తుల కోసం, దేశంలో సుమారు 441.9 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ అందుబాటులో ఉంది. ఈ సామర్థ్యం దేశంలోని పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 15.72% మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐఎఫ్ వల్ల సుమారు 500 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్య అంతరాన్ని తగ్గించడానికి వీలైంది. దీనివల్ల పంట కోత అనంతర నష్టం రూ. 5,700 కోట్లు ఆదా అవుతుంది. సరైన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల ఉద్యాన ఉత్పత్తుల నష్టం 10% తగ్గింది. పాతిక లక్షల మందికి ఉపాధివ్యవసాయ మౌలిక సదుపాయాల వృద్ధి, అభివృద్ధికి ఏఐఎఫ్ కొత్త ఉత్తేజాన్ని అందిస్తోంది. గత ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 74,695 వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఏఐఎఫ్ కింద ఆమోదం లభించింది. వీటిలో 18,508 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 16,238 ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు, 13,702 గోదాములు, 3,095 సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, 1,901 కోల్డ్ స్టోర్స్, కోల్డ్ చైన్లు, 21,251 ఇతర రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు 2015 నుంచి వ్యవసాయ రంగంలో రూ. 78,702 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రభుత్వ చర్యల వల్ల యువత కూడా వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో సుమారు 50,000 కొత్త వ్యవసాయ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇది రైతుల స్వావలంబనకు దారి తీస్తోంది. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రయత్నాలు 8 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించదానికి దోహదపడ్డాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 25 లక్షల ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. పొలాల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పన వల్ల రైతులు తమ పంటలను నేరుగా ఎక్కువమందికి అమ్ముకోవడానికి వీలు కలిగింది. ఆధునిక ప్యాకేజింగ్, స్టోరేజీ వ్యవస్థల కారణంగా రైతులు మార్కెట్లలో తమ ఉత్పత్తులను మరింత సమర్థంగా అమ్ముకోగలుగుతారు. ఫలితంగా మంచి ధర దక్కుతుంది. ఈ యత్నాలు రైతుకు సగటున 11–14% అధిక ధరలను పొందడానికి వీలు కల్పిస్తున్నాయి.పూచీకత్తు భరోసా, వడ్డీ రాయితీ ద్వారా రుణ సంస్థలు తక్కువ రిస్క్‌తో రుణాలు ఇచ్చి, తద్వారా తమ వినియోగదారులకు సాయ పడతాయి. నాబార్డ్ రీఫైనాన్ ్స సదుపాయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని భాగస్వామ్యం చేయడం వల్ల ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల(పీఏసీఎస్) వడ్డీ రేటును ఒక శాతానికి తగ్గించడం గమనార్హం. దీంతో ఇలాంటి పీఏసీఎస్‌లతో సంబంధం ఉన్న వేలాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనాలు చేకూ రాయి. ఏఐఎఫ్ కింద 9,573 పీఏసీఎస్ ప్రాజెక్టులకు నాబార్డ్ ఇప్పటి వరకు రూ. 2,970 కోట్ల రుణం మంజూరు చేసింది.ఆరు సూత్రాల వ్యూహంవ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచడం, వ్యవ సాయ వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తికి గిట్టుబాటు ధరలు కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తగిన ఉపశమనం కల్పించడం, వ్యవసాయం, ప్రకృతి సేద్యాన్ని వైవిధ్యపరచడం వంటి ఆరు సూత్రాల వ్యూహంతో ముందుకు వచ్చాం. హైడ్రోపోనిక్ వ్యవ సాయం, పుట్టగొడుగుల పెంపకం, వెర్టికల్ ఫామింగ్, ఏరోపోనిక్ వ్యవసాయం, పాలీహౌస్, గ్రీన్ హౌస్ వంటి ప్రాజెక్టులను రైతు సమూహాలు, సంఘాలకు మాత్రమే కేటాయించారు. వాటి పరిధిని విస్తరించడం ద్వారా వ్యక్తిగత లబ్ధిదారులు ఇప్పుడు ఈ ప్రాజె క్టులను చేపట్టడానికి ఏఐఎఫ్ కింద అనుమతులు పొందడానికి అర్హులయ్యారు. దీనికి అదనంగా, ‘పీఎం–కుసుమ్’ యోజనలోని ‘కాంపోనెంట్ ఎ’... బంజరు, బీడు, సాగు, పచ్చిక బయలు లేదా చిత్తడి భూములలో రెండు మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీనిని సులభంగా ఎఐఎఫ్ పథకంతో అనుసంధానించవచ్చు. ఈ వ్యూహాత్మక సమ్మేళనం రైతులకు వ్యక్తిగ తంగా సహాయపడుతుంది. రైతు సమూహాలను సాధికారం చేస్తుంది. ‘అన్నదాత’ నుండి ‘ఉర్జాదాతా’ (ఇంధన ప్రదాత) వరకు వారి పాత్రను పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విశ్వసనీయమైన ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. విస్తృత స్థాయిలో మెరుగు పడిన సమాచార వ్యవస్థ, సమష్టి కృషితో రైతు సంక్షేమంలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ‘వికసిత భారత్’లో భాగంగా అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగ కలలను సాకారం చేయడంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది.శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాసకర్త కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం; గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి; మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి -
సాగుకు భారీ ఊతం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి ఊతమివ్వడంతో పాటు ఆహార భద్రతను మరింత పెంచే లక్ష్యంతో రూ.14 వేల కోట్లతో ఏడు నూతన సాగు పథకాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సోమవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే వీటి లక్ష్యమని కేంద్ర ఐటీ, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తాజా పథకాలు సాగులో మరిన్ని పరిశోధనలతో పాటు సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయ రంగంలో డిజిటైజేషన్ తదితరాలకు మరింత దోహదపడతాయని తెలిపారు. ఆ ఏడు పథకాలివే... 1. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (రూ.2,817 కోట్లు). 2. ఆహార, పౌష్టిక భద్రత (రూ.3,979 కోట్లు). 3. వ్యవసాయ విద్య, నిర్వహణ (రూ.2,291 కోట్లు). 4. ఉద్యాన ప్రణాళిక (రూ.860 కోట్లు). 5. పశు ఆరోగ్య నిర్వహణ, ఉత్పాదకత (రూ.1,702 కోట్లు). 6. కృషీ విజ్ఞాన కేంద్రాల బలోపేతం (రూ.1,202 కోట్లు). 7. సహజ వనరుల నిర్వహణ (రూ.1,115 కోట్లు). ప్రతి రైతుకూ డిజిటల్ ఐడీ! వ్యవసాయ రంగంలో డిజిటల్ ఇన్నొవేషన్లకు మరింత మద్దతిచ్చేందుకు ఉద్దేశించిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు రూ.2,817 కోట్లను కేటాయించారు. దీనికి మొత్తమ్మీద రూ.20,817 కోట్లు కేటాయించాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా డిజిటల్ మౌలిక సదుపాయాల (డీపీఐ) మెరుగుదల, డిజిటల్ విధానంలో సాధారణ సాగు అంచనాల సర్వే (డీజీసీఈఎస్) అమలుతో వంటి ఐటీ ఆధారిత చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడతాయి. దీని కింద అగ్రిస్టాక్, కృషీ డెసిషన్ సపోర్ట్ సిస్టం, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ పేరిట మూడు డీపీఐలను రూపొందించనున్నారు. ‘‘వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్నిరకాల సమాచారాన్నీ విశ్వసనీయమైన రీతిలో నిరంతరం రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవమే దీని లక్ష్యం’’ అని కేంద్రం వెల్లడించింది. ‘అగ్రిస్టాక్‌లో భాగంగా ప్రతి రైతుకూ ఆధార్ మాదిరిగా ఒక డిజిటల్ ఐడీ కేటాయిస్తారు. దీన్ని రైతు గుర్తింపు (కిసాన్ కీ పెహచాన్)గా పేర్కొంటారు. అందులోకి లాగిన్ అయిన మీదట సాగుకు సంబంధించిన సమస్త సమాచారమూ అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర భూ రికార్డులు, పంట సాగుతో పాటు పథకాలు, భూములు, కుటుంబం తదితర వివరాలన్నింటినీ చూడవచ్చు. ప్రతి సీజన్లోనూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను మొబైల్ ఆధారిత భూసర్వేల ద్వారా ఇందులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. అంటే ఇది డిజిటల్ పంట సర్వే లాంటిది’’ అని వివరించింది. దీనికోసం ఇప్పటిదాకా కేంద్ర వ్యవసాయ శాఖతో 19 రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. రూ.26 వేల కోట్లతో వాయుసేనకు 240 ఏరో ఇంజన్లు వైమానిక దళానికి సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాల కోసం రూ.26 వేల కోట్లతో హెచ్ఏఎల్ నుంచి 240 ఏరో ఇంజన్లు సమకూర్చుకునేందుకు కూడా భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది మొదలై ఎనిమిదేళ్లలో హెచ్ఏఎల్ వీటిని పూర్తిస్థాయిలో అందజేస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర కేబినెట్ ఇతర నిర్ణయాలు: → గుజరాత్‌లోని సనంద్‌లో రోజుకు 63 లక్షల చిప్స్ తయారీ సామర్థ్యంతో కూడిన సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటుకు కైన్స్ సెమీకాన్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం. దీని అంచనా వ్యయం రూ.3,307 కోట్లు.→ 309 కిలోమీటర్ల ముంబై–ఇండోర్ నూతన రైల్వే లైన్‌కు కేబినెట్ పచ్చజెండా ఊపింది. → స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ లక్ష్యసాధనకు 14 సభ్య దేశాలతో కూడిన ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్) భేటీలో చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. -
ఐరాసలో పెరగనున్న పాక్ ప్రభావం
లోక్‌సభ ఎన్నికల హడావిడిలో ఈ వార్త అంతగా దృష్టిలో పడలేదుగానీ, భద్రతా మండలిలో రెండేళ్ల కాలానికి పాకిస్తాన్ ఎన్నిక కావడం భారత్ పట్టించుకోవాల్సిన అంశమే. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదు సభ్యదేశాలు భద్రతా మండలిలో ఉండటమూ పాక్‌కు కలిసొచ్చేదే. కశ్మీర్‌పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి అది ప్రయత్నించవచ్చు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత ఐరాస ఎజెండాలో కీలకమైంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాక్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని చర్చలోకి తేగలదు. ఒక భారతీయుడిని ఐరాస నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కూడా పాక్ ప్రయత్నించవచ్చు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి పాకిస్తాన్ ఇటీవల ఎన్నికైన విషయాన్ని, భారత్‌లో విస్తృతంగా నివేదించి ఉంటే, అది భారతీయులను కలవరపరిచి ఉండేది. భారత్ లోక్‌సభ ఎన్నికల్లో కూరుకుపోవడంతో, ఐక్యరాజ్య సమితి అత్యున్నత కమిటీలో పాకిస్తాన్ స్థానం గురించిన వార్తలకు దేశంలో పెద్దగా స్పందన లభించలేదు. ఐరాసలోని 193 సభ్య దేశాలలో 182 పాకిస్తా¯Œ కు అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎన్నిక, మూడవ దఫా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి పెద్ద సవాలుగా మారనుంది.2025 జనవరి 1న భద్రతామండలిలో రెండేళ్ల కాలానికి చేరనున్న పాకిస్తాన్, సోమాలియాల ఎంపికతో ఐక్యరాజ్యసమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్’కు చెందిన ఐదు సభ్యదేశాలు ఉంటాయి. మొత్తం ప్రపంచం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే నిర్ణయాలు చేసే ఏకైక ఐరాస సంస్థ అయిన భద్రతామండలి ఎన్నుకున్న సభ్యుల సంఖ్యలో ఇది సగం. అటువంటి నిర్ణయాలను మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీటో ద్వారా తిరస్కరించవచ్చన్నది మరొక విషయం. ఈ సభ్యదేశాలనే పి–5 లేదా బిగ్ ఫైవ్ అంటారు. ఇప్పుడు ఇస్లామాబాద్‌కు ఐరాస భద్రతామండలి తలుపులు తెరిచినంత మాత్రాన, భారత్ ఏదైనా దౌత్యపరమైన ముప్పును ఎదుర్కొంటుందని అర్థం కాదు. ప్రమాదం ఉండదు, కానీ సవాలు మాత్రం ఉంటుంది. అందువల్ల, భారత్ నిశ్చింతగా ఉండకూడదు. న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి పదవి ఖాళీగా ఉంది. పాకిస్తాన్ తరఫున గత ఐదేళ్లుగా ఈ పదవిని నిర్వహిస్తున్న మునీర్ అక్రమ్ ఒక ఘోరమైన రాయబారి. ఆయన అంతకుముందు కూడా 2002 నుండి ఆరేళ్ల పాటు అదే పదవిలో ఉన్నారు. 1994లో ఐరాస మానవ హక్కుల సంఘం ఎజెండాలో కశ్మీర్‌ను చేర్చడంలో అక్రమ్ రహస్య దౌత్యం దాదాపుగా విజయం సాధించింది. మరుసటి సంవత్సరం, ఆయన అధికారికంగా జెనీవాలో ఐరాస శాశ్వత ప్రతినిధిగా నియమితులవడమే కాకుండా ఏడేళ్లు ఈ పదవిలో కొనసాగారు. కాబట్టి, లోక్‌సభ ఎన్నికల ప్రచారం మధ్యలో పదవీ విరమణ చేసిన భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్థానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలి.వచ్చే ఏడాది ద్వైవార్షిక సమీక్ష కోసం కౌంటర్ టెర్రరిజం డాక్యుమెంట్ ఐక్యరాజ్యసమితి వద్దకు తిరిగి వస్తుంది. ఈ సమీక్షలోని పాఠం సరిహద్దు ఉగ్రవాద బాధితురాలిగా భారత్‌కు ముఖ్యమైనది. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని రాజ్య విధాన సాధనంగా ఉపయోగించిన పాకిస్తాన్ వంటి మొండి రాజ్యాల కారణంగా, ఉగ్రవాదానికి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రూపొందించలేకపోయారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆ సమావేశంలో సోమాలియాది కూడా సందేహాస్పద వైఖరి కావడంతో, జనరల్ అసెంబ్లీపై ఈ రెండు దేశాల ప్రభావమూ పడుతుంది. అదే సమయంలో భారత్ మరో ప్రమాదం నుంచి తనను కాపాడుకోవలసి ఉంది. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదుగురు భద్రతా మండలి సభ్యులు ఒక భారతీయుడిని ఐక్యరాజ్యసమితి నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కలిసి పని చేసే అవకాశం ఉంది. వాళ్లు కచ్చితంగా భద్రతా మండలి ప్రసిద్ధ తీర్మానం 1267 ప్రకారం, ఒక హిందువును ఉగ్రవాది జాబితాలో చేరడాన్ని చూడాలనుకుంటారు. 1999లో ఆమోదం పొందిన ఈ తీర్మానం ప్రకారం, ఉగ్రవాది జాబితాలో చేరిన అపఖ్యాతి ఒసామా బిన్ లాడెన్‌ది. న్యూఢిల్లీలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం ఈ విషయంలో ఓఐసీకి మేత అవగలదనే చెప్పాలి. అయితే 2024లోనూ, వచ్చే ఏడాదిలోనూ మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం భారత్‌లో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఇది చాలావరకు ఆధారపడి ఉంటుంది.1267 తీర్మానంతో ఏర్పాటు చేసిన ఆంక్షల కమిటీ ద్వారా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చడంలో అమెరికాతో కలిసి పనిచేసిన భారత్ సఫలీకృతమైంది. ఆ ఘటన పాక్ రాయబారి అక్రమ్‌ను ఇప్పటికీ గాయపరుస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు మక్కీయే కారణమని ఆ తీర్మానం ఇచ్చిన వివరణ పాక్ బాధను మరింత పెంచింది. ఈ మక్కీ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు స్వయానా బావ.రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత, భద్రతా మండలిలో పాకిస్తాన్ ‘సంప్రదింపులు’ మాత్రమే చేయగలిగింది. ఇటువంటి ప్రక్రియ మండలి సభ్యుల మధ్య అంతర్గత చర్చలను సూచిస్తుంది. ఈ చర్చల గురించి బహిరంగంగా ఎటువంటి రికార్డూ ఉండదు. ఇప్పుడు పాక్ భద్రతా మండలిలోకి ప్రవేశించిన తర్వాత, మిగతా ఓఐసీ సభ్యదేశాల మద్దతుతో కశ్మీర్‌పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. అవి ‘బహిరంగ సంప్రదింపుల’ ద్వారా జరిగే అవకాశం ఉంది. అంటే వాటి గురించి మీడియాకు, ప్రజలకు తెలియజేస్తారని అర్థం. సందర్భానుసారంగా ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ కూడా ఆ చర్చల గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు. భారత్ దృక్కోణం నుండి ప్రమాదం ఏమిటంటే, ఇటువంటి జిత్తులు కొనసాగుతున్నప్పుడు కశ్మీర్ సమస్యపై ఐరాస పూర్తి దృష్టి పడుతుంది. అయినప్పటికీ భద్రతా మండలిలో వీటో కలిగివున్న పి–5 దేశాలపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.15 మంది సభ్యులతో కూడిన భద్రతామండలి పనికి ఆటంకం కలగకుండా గతంలో భారత్, పాక్ సహజీవనం చేశాయి. రెండు దేశాలూ చివరిసారిగా 2012లో కలిసి పనిచేశాయి. కానీ తర్వాతరెండు విషయాలు మారిపోయాయి. ఐరాసలో అప్పటి పాకిస్తాన్ మిషన్ కు ‘డాన్’ మీడియా గ్రూప్‌ను కలిగి ఉన్న హరూన్ కుటుంబానికి చెందిన హుస్సేన్ హరూన్ నాయకత్వం వహించారు. ఆయన చాలామంది పాకిస్తాన్ కెరీర్ దౌత్యవేత్తల మాదిరిగా కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ నోరు జారలేదు. రెండవ మార్పు ఏమిటంటే, అప్పట్లో 2012లో ప్రపంచం చాలా భిన్నమైనదిగానూ, తక్కువ సంక్లిష్టమైనదిగానూ ఉండేది.ఇటీవలి సంవత్సరాలలో ఐరాసలో దురదృష్టవశాత్తు ప్రత్యర్థులు, శత్రువుల మధ్య రహస్య, బహిరంగ ఘర్షణకు అవకాశాలు పెరిగాయి. అందువల్ల, భారత్‌తో తన ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ కు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత అనేది ఐరాస ఎజెండాలో కీలకంగా ఉంది. వివాదాలను పరిష్కరించడానికి సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని గట్టిగా చర్చలోకి తీసుకురాగలదు. వారు తమ కుతంత్రాలలో విజయం సాధించకపోవచ్చు కానీ ఇస్లామాబాద్ ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండిపోదు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికలలో యూరప్ మితవాదం వైపు దూసుకెళ్లిన తర్వాత, ఐరాస చర్చల్లో ఇస్లామోఫోబియా కూడా ఎక్కువగా ఉంటుంది. భద్రతా మండలిలో ఓఐసీ దౌత్యవేత్తల సంఖ్య పెరగడం వారికి దేవుడిచ్చిన వరం. ఐక్యరాజ్యసమితిలో తన ప్రయోజనాలను ముందుకు తీసుకురావడానికి పాకిస్తాన్ దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.- వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- కేపీ నాయర్ -
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాకు రేషన్ కార్డు రాక పదేళ్లయింది!
నల్లగొండ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో నూతన రేషన్ కార్డులపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలోనే రేషన్ కార్డులను ఇచ్చింది. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో ఒక్క కార్డు కూడా ముద్రించి ఇవ్వలేదు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న కొందరికి మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ఇచ్చింది. ఆ తర్వాత రేషన్ కార్డుల జారీ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్తవారితోపాటు పిల్లల పేర్లు కార్డులో నమోదు చేయించుకునేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్సే అధికారంలోకి రావడం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి తాజాగా మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో కొత్త దరఖాస్తుదారులతోపాటు పాతవారు కూడా ఆనందపడుతున్నారు. 4.66లక్షల కార్డులు జిల్లాలో మొత్తం 4,66,180 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో పాతవాటితోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫుడ్‌సెక్యూరిటీ కార్డులు కూడా ఉన్నాయి. కార్డుదారులందరికీ ప్రభుత్వం ప్రతినెలా 6 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఒక్క బియ్యం తప్ప ఎలాంటి సరుకులు అందడం లేదు. అయితే జనాభా కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో కార్డుల తొలగింపునకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం వల్ల చాలా మంది అనర్హులకు కార్డులు తొలగిపోయాయి. అలాగే అనర్హులు ఉంటే కార్డును స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేయడంతో చాలామంది అప్పగించడంతో చాలావరకు కార్డులు తగ్గాయి కానీ, అర్హులైన వారందరికీ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ముదిరంచి ఇవ్వలేదు. పదేళ్లయినా రేషన్ కార్డు రాలే.. నాకు పదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పడు నాకు ఇద్దరు కొడుకులు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెయ్యి తొలగించారు. రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వంటి పథకం కింద వైద్యం చేయించుకోలేక పోతున్నాను. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామన్నందుకు సంతోషంగా ఉంది. – గుండగోని రాజు, కట్టంగూర్ రెండేళ్ల క్రితం 11,950 కార్డులు జారీ.. రెండేళ్ల క్రితం హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు జిల్లాలో 22వేల మంది కొత్త రేషన్‌కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో 22వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వివిధ కారణాలతో కొందరిని అనర్హులను తొలగించిన ప్రభుత్వం కేవలం11,950 మందికే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు జారీచేసింది. అనంతరం కొత్త దరఖాస్తుల ఆహ్వానానికి ఓపెన్ చేసిన ప్రత్యేక సైట్‌ను బంద్ చేయడంతో దరఖాస్తులు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని కార్డులురాని కుటుంబాలు ప్రస్తుతం 6,450 ఉన్నాయి. జిల్లాలో ఇంకా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లక్ష కుటుంబాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్‌ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్‌ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం అందించే కమీషన్కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ను అదనంగా అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్ఎఫ్ఎస్సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
సుస్థిర వ్యవసాయంతోనే ఆహార భద్రత
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రానున్న సంవత్సరాల్లో భారత్‌లో ఆహార సంక్షోభం తలెత్తనుందా? దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధ్యం కావడం లేదా? కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ సుస్థిర వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నాయా? అలా వెళ్తున్న రాష్ట్రాలు ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయా? సుస్థిర వ్యవసాయానికి మొత్తం 51 సూచికలను ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనం తర్వాత సుస్థిర వ్యవసాయం సాధించలేని పక్షంలో ఆహార భద్రత కష్టమేనని అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐకార్) అభిప్రాయపడుతోంది. ‘కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చర్ సస్టైనబులిటీ’పేరిట దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానా లను ఐకార్ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రేమ్‌చంద్, కిరణ్‌కుమార్‌లు పరిశీలించి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఐకార్ ఈ అభిప్రాయానికి వచ్చింది. వ్యవసాయ విధానాల్లో స్పష్టమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. వ్యవసాయ సుస్థిరతకు సవాళ్లు ‘వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగం పెరగడం, తీవ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, భూసారం తగ్గిపోవడం వ్యవసాయ సుస్థిరతకు పెనుసవాలుగా మారుతోంది. 2030 నాటికి దేశ జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. ఆ జనాభాకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత సాగు రంగంపై ఉంది. కొన్ని రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. వ్యవసాయ సుస్థిరత సూచీలకు వచ్చేస రికి వెనుకబడుతున్నాయి..’అని ఐసీఏఆర్ వెల్లడించింది. పంజాబ్, హరియాణ సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ.. వ్యవసాయ సుస్థిరత సూచీని పరిశీలించినప్పుడు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. భారత వ్యవసాయ రంగం సుస్థిరత కోణంలో ఉన్నత స్థానంలో లేదని ఓ మోస్తరు సుస్థిరతతోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వాలుసహకరించాలి.. ‘సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూచికలైన అతి తక్కువ నీరు,రసాయనాలు, ఎరువులు,విద్యుత్ వినియోగిస్తూ, భూసారం తగ్గకుండా పంటలు పండించే రైతాంగానికి ప్రభుత్వాలు సరైన సమయంలో సాయం అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్‌లో ఆహార భద్రతకు ఇబ్బందులు రావు. ప్రస్తుతం మిజోరం, కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్ మాత్రమేసుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులుఎదుర్కొనే రాజస్తాన్ సుస్థిరవ్యవసాయంలో చివరలో ఉంది..’ అని ఐకార్ నివేదిక తెలిపింది. సుస్థిర వ్యవసాయానికి 51 సూచికలు సుస్థిర వ్యవసాయాభివృద్ధికి 51 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు ఐకార్ వెల్లడించింది. సారవంతమైన నేలలు, నీటి వనరులు, జీవ వైవిధ్యం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమతుల్యత తదితర సూచికలు ప్రధానమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, హరియాణాతోపాటు వరి పండించే జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు ఐకార్ వివరించింది. ఇక్కడ వ్యవసాయ విధానాల్లో మార్పులు అత్యావశ్యమని హెచ్చరించింది. పంటల మార్పిడి, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంట రుణాలు, నీటి వనరుల కల్పన తదితరాలతో సుస్థిర వ్యవసాయం సాధ్యమంది. అధిక ఇన్పుట్ సబ్సిడీల నుంచి పద్ధతి ప్రకారం రైతులకు లబ్ధి చేకూరే విధానాలు రావాల్సి ఉందని తెలిపింది. భూములు సారవంతంగా లేని చోట రసాయన ఎరువుల వాడకం పెరుగుతోందని, దీనివల్ల భూమిలో ఆర్గానిక్ కార్బన్ తగ్గుదల చోటు చేసుకుంటోందని వివరించింది. దేశంలో ఓ మాదిరి సుస్థిరతే.. సుస్థిర వ్యవసాయంలో 0 నుంచి 1ని ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో సరాసరిన 0.50 నమోదు అవుతోందని, ఇది ఓ మాదిరి సుస్థిరత మాత్రమేనని ఐసీఏఆర్ తేల్చింది. 0ను అధ్వానంగా పేర్కొంటే, 1ని అత్యుత్తమంగా పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలు జాతీయ సగటును మించి ఉన్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో భూ గర్భ జలాల వినియోగం అధికంగా ఉందని, భూగర్భ జలాలు 40 సెంటీమీటర్ల మేరకు వేగంగా పడిపోయాయని ఐకార్ పేర్కొంది. ఇక పర్యావరణ సుస్థిరతలో కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరం, ఉత్తరాఖండ్‌లు మెరుగైన పనితీరును కనపరుస్తున్నట్లు తెలిపింది. ఇందులో అస్సాం, మణిపూర్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ అధ్వానంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చాలా తక్కువ పరిమాణంలో ఉందని, గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచే వెలువడుతున్నట్లు పేర్కొంది. వాణిజ్య పంటలున్నా ఏపీ భేష్ సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం అభినందనీయం. మిజోరం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు తక్కువగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య పంటలు అధికంగా సాగు చేస్తున్నా.. రసాయన ఎరువులు, నీరు తక్కువ వినియోగం, భూసారాన్ని పెంపొందించేలా చేయడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించింది. సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ రైతులను ఆదుకుంటే దేశ ఆహార భద్రతకు వచ్చే ముప్పేమీ ఉండదు. -
కొత్త రేషన్ కార్డులివ్వరా !
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆహార భద్రత కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతున్నా.. ఏడాదిన్నర కాలంగా కొత్త కార్డులను మంజూరు చేయడం లేదు. 2021 జూలైలో పెండింగ్‌లో ఉన్న నూతన కార్డులను జారీ చేశారు. మళ్లీ ఏడాదిన్నర పూర్తయినా నూతన కార్డులు మంజూరు కావడం లేదు. పైగా జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కార్డుల్లో మార్పులు, చేర్పుల (మ్యూటేషన్ల)కు మోక్షం కలగడం లేదు. ఫలితంగా అర్హులైన పేదలు సంక్షేమ పథకాలకు దూరమవుతుతున్నారు. వేలాది మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు కొత్త రేషనన్ కార్డులు, పాత వాటిల్లో చేర్పులు, మార్పుల కోసం చాలా మంది ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు పరిశీలించి జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి లాగిన్‌న్‌కు పంపించారు. ఇక్కడ వాటిని పరిశీలించిన అధికారులు మంజూరు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఏడాదిన్నర నుంచి లాగిన్ తెరుచుకోకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడిన వాళ్లు కొత్తగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా పాత కార్డులోంచి వారి పేరును తొలగిస్తేనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా చాలామంది కొత్తకార్డుల కోసం ఉమ్మడి కుటుంబం కార్డుల నుంచి పేర్లను తొలగించుకొని నూతన కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, వారందరికీ కార్డులు మంజూరు కావపోవడంతో వారి పరిస్థితి రెంటింకి చెడ్డ రేవడిలా మారింది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వచ్చిన వారు కూడా కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కావడం లేదు. 2018 డిసెంబర్ ఎన్నికలు జరిగే వరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరాయంగా సాగించింది. ఆ తరువాత 2021 జూలై మాసంలో హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నూతన రేషన్ కార్డుల దరఖాస్తులకు మోక్షం కలిగింది. జిల్లాలో సుమారు 12 వేల నూతన కార్డులు మంజూరయ్యాయి. కానీ, పేర్ల మార్పులు– చేర్పులు (మ్యూటేషన్ల)పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన అర్జీలకూ మోక్షం లేదు. దరఖాస్తుల వివరాలు.. కొత్తకార్డుల కోసం అర్జీలు 25,179 మ్యూటేషన్ కోసం 46,354 మొత్తం పెండింగ్ 71,533 ఆరోగ్య సేవలకు దూరం.. రేషన్‌్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందుతుండగా, కార్డులు లేని వారు నిర్ణీతీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏడాదికి సుమారు రూ.2లక్షల విలువైన సేవలు పొందలేక పోతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు నిర్ణీత ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. కానీ, కొత్త కార్డులు రాక పోవడంతో అర్హులు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. ఇలా మరెన్నో ప్రభుత్వ, ప్రైవేట్ పథకాలకు పేదలు దూరమవుతున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను నిరంతరం జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని పేదులు కోరుతున్నారు. -
TS: తగ్గిన తలసరి కోటా
సాక్షి, హైదరాబాద్: బియ్యంలో కోతపడింది. కొన్నినెలలుగా పంపిణీ చేస్తున్న తలసరి 10 కిలోల ఉచిత బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నిలిపివేసింది. ఈ నెల నుంచి ఆహార భద్రతా కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ ఆహార భద్రతా కార్డుల(ఎన్ఎఫ్ఎస్సీ)తోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులందరికీ ఇదే వర్తించనుంది. కేంద్రమిచ్చేదానికి అదనంగా.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రేషన్‌కార్డులపై రూపాయికి కిలో బియ్యం చొప్పున.. కుటుంబంలోని నలుగురికి ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున పంపిణీ చేసేవారు. కేసీఆర్ సర్కారు 2015 జనవరి 1 నుంచి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకం మొదలైంది. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేంద్రం 54.44 లక్షల కార్డుల పరిధిలోని 1.91 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కిలోకు రూ.3 రేటుతో బియ్యం ఇస్తుంది. ఇందులో 2 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతోపాటు అదనంగా మరో కిలో కలిపి.. ఆరు కిలోల చొప్పున ‘రూపాయి’బియ్యం ఇస్తూ వచ్చింది. కరోనా పరిస్థితులతో ఉచితంగా.. కేంద్ర ప్రభుత్వం కరోనా పరిస్థితుల నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం తెచ్చి.. పేదలందరికీ ఉచితంగా 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 10కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వస్తోంది. తాజాగా 2023 డిసెంబర్ వరకు కూడా ఐదు కిలోల ఉచిత బియ్యం పథకాన్ని పొడిగిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదనంగా ఇస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి స్వస్తి పలికింది. ఆహార భద్రతా కార్డులన్నింటిపై ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఉచిత బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే కరోనాకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తలా ఆరు కిలోల బియ్యం ఇవ్వగా.. ఇప్పుడు అందులోనూ ఒక కిలో కోత పడటం గమనార్హం. ఇన్నాళ్లూ తీవ్ర భారం మోస్తూ.. రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య 90,13,512. ఇందులో 54.44 లక్షలకార్డులు జాతీయ ఆహార భద్రతాచట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేటాయించినవికాగా, 30 లక్షలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవి. ఇవికాకుండా 5.62 లక్షల అంత్యోదయ అన్నయోజన, 5 వేలకుపైగా అన్నపూర్ణ కార్డులు ఉన్నా యి. మొత్తంగా 2.68 కోట్ల మందికి రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. అయితే కరోనా సమయం నుంచి రాష్ట్రంలో అదనంగా ఉచిత బియ్యం ఇవ్వడంతో రాష్ట్ర ఖజానాపై భారం పడింది. దీనికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3వేల కోట్లు ఖర్చయ్యాయి. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రతినెలా ప్రభుత్వం రూ.300 కోట్ల చొప్పున సబ్సిడీ భరించింది. ఇప్పుడీ భారం చాలా వరకు తగ్గనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. -
భారత్ సూచనతో చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం
రోమ్: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023 మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్‌లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొని పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉందని.. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో వినియోగదారులు, రైతులు, పాలకులను చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేయటమే తమ లక్ష్యమని ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు ఈ సందర్భంగా అన్నారు. చిరుధాన్యాలు తరతరాలుగా భారతీయ సమాజానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మోదీ సందేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ చదివి వినిపించారు. ఇదీ చదవండి: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే: ఐక్యరాజ్యసమితి -
చిరుధాన్యాలతోనే విరుగుడు
సాక్షి, అమరావతి: ప్రజల సంపూర్ణారోగ్యానికి దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని తక్షణం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిరుధాన్యాలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వినియోగం పెరగడంలేదని, సరఫరా చేయడం సాధ్యంకావడంలేదని నివేదిక తెలిపింది. ఇటీవల రాయచూర్‌లోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం, నాబార్డు సంయుక్తంగా మిల్లెట్ సదస్సును నిర్వహించాయి. ఇందులో మిల్లెట్స్–సవాళ్లు స్టార్టప్‌ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాయచూర్ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కొన్ని సిఫార్సులు చేశాయి. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రపంచమంతా సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కూడా వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించేందుకు సిద్ధపడుతోందని నివేదిక పేర్కొంది. చిరుధాన్యాలతోనే పోషకాహార లోపం నివారణ దేశంలో 59 శాతం మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో సతమతమవుతున్నారని, అలాంటి వారికి చిరుధాన్యాలను ఆహారంగా అందించాల్సి ఉందని నివేదిక తెలిపింది. చిరుధాన్యాల్లో 7–12 శాతం ప్రొటీన్లు, 2–5 శాతం కొవ్వు, 65–75 శాతం కార్బోహైడ్రేట్లు, 15–20 శాతం ఫైబర్, ఐరన్, జింక్, కాల్షియం ఉన్నాయని వివరించింది. ఊబకాయం, మధుమేహం, జీవనశైలి జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిరుధాన్యాల వినియోగమే పరిష్కారమని తేల్చింది. మరోవైపు.. 1970 నుంచి దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని.. ఇందుకు ప్రధాన కారణం బియ్యం, గోధుమల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంచడమేనని నివేదిక స్పష్టం చేసింది. 1962లో చిరుధాన్యాల తలసరి వినియోగం 32.9 కిలోలుండగా ఇప్పుడది 4.2 కిలోలకు తగ్గిపోయిందని నివేదిక వివరించింది. రైతులకు లాభసాటిగా చేయాలి చిరుధాన్యాల సాగుతో రైతులకు పెద్దగా లాభసాటి కావడంలేదని, మరోవైపు.. వరి, గోధుమల సాగుకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. చిరుధాన్యాలకే ఎక్కువ మద్దతు ధర ఉన్నప్పటికీ ఉత్పాదకత, రాబడి తక్కువగా ఉండటంతో రైతులు వరి, గోధుమల సాగుపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు నగదు రూపంలో రాయితీలు ఇవ్వడంతో పాటు ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాలని నాబార్డు నివేదిక సూచించింది. విజయనగరంలో మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ ఇక ఆంధ్రప్రదేశ్‌లో మిల్లెట్స్ ఉత్పత్తుల ద్వారా డబ్బు సంపాదించవచ్చునని నిరూపించిన విజయగాథలున్నాయని నివేదిక పేర్కొంది. విజయనగరం జిల్లాలో 35 గ్రామాలకు చెందిన 300 మంది మహిళా సభ్యులు ఆరోగ్య మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్‌ను 2019–20లో స్థాపించినట్లు తెలిపింది. మహిళా రైతులకు ఆహార భద్రత, పోషకాహారం, జీవవైవిధ్యంతో పాటు భూసారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఎఫ్పీఓగా ఏర్పాటై ఆరోగ్య మిల్లెట్స్ అనే బ్రాండ్ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు విజయవంతంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎఫ్పీఓతో కలిసి మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోందని, రేగా గ్రామంలో రూ.4.1 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయడం ద్వారా 240 మందికి ఉపాధి కల్పించనుందని పేర్కొంది. చిరుధాన్యాల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలివే.. ► సెలబ్రిటీలతో పాటు ఇతరుల ద్వారా చిరుధాన్యాల వినియోగంపై అవగాహన ప్రచారాలు కల్పించాలి. ► ప్రతీ సోమవారం తృణధాన్యాల వినియోగం అలవాటు చేయాలి. ► విమానాలతో పాటు రైళ్లల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. ► అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో చిరుధాన్యాలను వినియోగించాలి. ► ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చాలి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం అమలుచేస్తోంది. ► తయారుచేసి సిద్ధంగా ఉండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రాసెసింగ్, విలువ జోడింపు, సాంకేతిక సౌకర్యాలను కల్పించాలి. ► పట్టణ వినియోగదారులే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించాలి. ► చిరుధాన్యాలను పండించే రైతులకు నగదు ప్రోత్సాహకాలను అందించాలి. ► సాంకేతికత సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన మిల్లింగ్ పరికరాలను ఏర్పాటుచేయాలి. -
అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!
కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆహార, ఆదాయ కొరత సమస్యల నుంచి బయటపడటానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేద కుటుంబాలకు.. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) కొత్త బతుకు బాట చూపింది. అందుబాటులో ఉన్న స్థలాల్లో మెరుగైన పద్ధతుల్లో సేంద్రియ కూరగాయల సాగు నేర్పించింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వ్యవసాయక కుటుంబాల్లో పుట్టి పొట్ట చేతపట్టుకొని నగరాలకొచ్చి స్థిరపడిన పేదలకు స్వీడన్ నిధులతో ఎఫ్.ఎ.ఓ. అర్బన్ గార్డెనింగ్‌లో ఇచ్చిన శిక్షణ వారికి కొత్త భరోసా ఇస్తోంది. దీంతో 2.2 కోట్ల జనాభాతో కాంక్రీటు నివాసాలతో కిటకిటలాడే ఢాకా నగరం అంతటా కోవిడ్ కష్టకాలంలో సేంద్రియ కూరగాయ తోటలు వెలిశాయి. ఇవి పేదలకు సేంద్రియ ఆహారాన్ని రుచి చూపించాయి! ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో శిక్షణకు హాజరైన తర్వాత నాకు తెలిసింది’ అని మజెదా బేగం ఆనందంగా చెబుతోంది. ఢాకాలో నివాసం ఉండే పేద కుటుంబాల్లో ఆమె కుటుంబం ఒకటి. భర్త, ఐదుగురు పిల్లలతో కలసి రెక్కల కష్టం మీద మజెదా బేగం కుటుంబాన్ని లాక్కొస్తుంటుంది. కోవిడ్ విరుచుకుపడే సమయానికి టీ స్టాల్ నడుపుకుంటూ, చిన్నా చితకా వస్తువులు అమ్ముతూ, మురికివాడలో జీవనం సాగించేవారు. టీ స్టాల్ ప్రారంభించిన తర్వాత జీవన పరిస్థితులు అంతకుముందుకన్నా మెరుగుపడినప్పటికీ, వచ్చే ఆదాయం కుటుంబానికి పూర్తిగా సరిపోయేది కాదు. ఐదుగురు పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఎలాగూ సాధ్యపడదు. అయితే, ఆహార వ్యవసాయ సంస్థ తోడ్పాటు వల్ల మజెదా ఏర్పాటు చేసుకున్న అర్బన్ కిచెన్ గార్డెన్ ఈ కొరత తీర్చింది. అసంఘటిత రంగంలో ఆహార, ఆర్థిక అభద్రత మధ్య జీవనం సాగించే అనేక మందిలాగే మజెదా కుటుంబాన్ని కూడా కోవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. లాక్డౌన్ వల్ల జీవనాధారమైన టీ స్టాల్‌ను మూసివేయవలసి వచ్చినప్పుడు మజెదా చేతిలో డబ్బేమీ లేదు. పనులు దొరకడం కష్టమైపోయింది. పైగా, ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విధంగా ఏడుగురితో కూడిన కుటుంబానికి ఆమే జీవనాధారమైంది. అయినా, ఆమె నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడింది. వ్యవసాయం అంటే ఆమెకు బాల్యం నుంచి ఉన్న ఇష్టం ఇప్పుడు ఉపయోగపడింది. ఇళ్లకు దగ్గర్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించటం, కుటుంబం తినగా మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం పొందటంలో పేద మహిళలకు ఎఫ్.ఎ.ఓ. శిక్షణ ఇచ్చింది. దీంతో, ఢాకా నగరం మధ్యలో ఇళ్ల వెనుక స్థలాలు, ఖాళీ స్థలాల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు వెలిశాయి. మజెదా కూడా కూరగాయల సాగు చేపట్టింది. ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో, చీడపీడల్ని ఎలా అదుపులో ఉంచాలో అంతకుముందు నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా రైతును కావడం గొప్ప అదృష్టం’ అంటోంది మజెదా సంతృప్తితో. పురుగుమందులు వాడకుండా తమ కళ్ల ముందే ఆమె పండించే కూరగాయలకు స్థానికంగా చాలా డిమాండ్ ఉంది. కూరగాయల తోట ద్వారా తన కుటుంబ అవసరాలు పోను నెలకు 1500 టాకాల (సుమారు రూ. 2 వేలు) ఆదాయం పొందుతోంది మజెదా. ఐదుగురు బిడ్డలున్నా ఎన్నడూ లేనిది ఇప్పుడు ఒక బిడ్డను ఆమె బడికి పంపగలుగుతోంది. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలవగలిగినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మజెదా పట్టలేని సంతోషంతో చెబుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం–2022 సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. ఆమెను ‘ఫుడ్ హీరో’గా గుర్తించి గౌరవించింది అందుకే! (క్లిక్ చేయండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
PM PRANAM Scheme: ఈ పథకంతో ఆహార భద్రతకు ప్రమాదం
కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని చర్చల కోసం విడుదల చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రాలు ఆమో దిస్తే చట్టం చేయాలని నిర్దేశించారు. దేశంలో ఎరువుల వాడకం విచక్షణా రహితంగా పెరుగుతున్నదనీ, ఆ విని యోగాన్ని తగ్గించాలనీ ఈ పథకాన్ని రూపొందించారు. ఎరువుల వినియోగం తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇప్పటికే వంటనూనెలు, పప్పులు, పంచదార, పత్తి, ముతక ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాము. గతంలో ఇవన్నీ ఎగుమతి చేసిన దేశం మనది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) విధానాలు వచ్చిన తర్వాత, స్వయంపోష కత్వంలో ఉన్న దేశం సబ్సిడీలు తగ్గించడంతో దిగుమతులపై ఆధారపడుతున్నాము. ‘పీఎం ప్రణామ్’(పీఎం ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజేమెంట్) పథకం ఎరువుల సబ్సిడీలను కోత పెట్టాలని స్పష్టంగా చెపుతున్నది. 2017–18లో 528 లక్షల టన్నుల ఎరువులు విని యోగించాము. 2021–22లో 640 లక్షల టన్నులకు వినియోగం పెరిగింది. ఈ పెరుగుదలను తగ్గించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ప్రకారం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని ఆదా చేస్తారు. ఆదా చేసిన దానిలో 50 శాతం రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 50 శాతంలో 70 శాతం గ్రామ, జిల్లా, బ్లాక్‌లకు ప్రత్యామ్నాయ ఎరువుల సాధనకు ఇస్తారు. మిగిలిన 30 శాతం ఎరువుల తగ్గింపుపై, సేంద్రీయ ఎరువులపై అవగాహన కల్పించడానికీ, రైతులను చైతన్యపర్చడానికీ శిక్షణ ఇస్తారు. మిగిలిన 50 శాతం కేంద్రప్రభుత్వం తన బడ్జెట్లో కలుపుకొంటుంది. భారతదేశంలో హెక్టారుకు 175 కిలోల ఎరువులు వాడుతున్నాము. హెక్టారు ఉత్పాదకత 3,248 కిలోలు వస్తున్నది. 43 కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న దేశంలో నేటికి 9 కోట్ల ఎకరాల భూమి బీడుగా మారింది. జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతున్నది. పెరిగిన జనాభాకు ఆహారధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచాలి. వాస్తవానికి భారతదేశంలో 80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అందులో 40 కోట్ల మంది దినసరి ఆహారధాన్యాల వాడకం 450 గ్రాముల నుండి 325 గ్రాములకు తగ్గిపోయింది. సేంద్రీయ ఎరువులను, రసాయనిక ఎరువులను కలిపి వాడడం ద్వారానే వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయి. చైనాలో 25.5 కోట్ల ఎకరాలలో 61.22 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి చేస్తున్నారు. హెక్టారుకు 6,081 కిలోలు ఉత్పత్తి అవుతున్నది. 2018 గణాంకాల ప్రకారం హెక్టారుకు 393.2 కిలోల ఎరువులు వాడుతున్నారు. ఎరువుల వినియోగం పెంచడంతో మనదేశం కన్నా రెట్టింపు ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతున్నది. పైగా వారు 2.77 బిలియన్ డాలర్ల ఎరువులను ఎగుమతి చేస్తున్నారు. ఎరువుల వినియోగాన్ని పెంచకుండా ఉత్పత్తి, ఉత్పాదకత పెరగదు. ఈమధ్య శ్రీలంక అనుభవం చూసినపుడు సేంద్రీయ ఎరువుల వాడకంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తీవ్ర సంక్షోభంలో పడి ప్రభుత్వమే కూలిపోయింది. ఈ పథకం అమలుచేస్తే భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగంలోకి 8 కార్పొరేట్ సంస్థలు వచ్చి తమ వ్యాపారాలు సాగిస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడంకన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే వారికి మంచి లాభాలు వస్తాయి. 2015లో శాంత కుమార్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలను ఎత్తివేయడం, సబ్సిడీని నగదు బదిలీగా మార్చడం చేయాలని ఇచ్చిన సలహాలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్నది. మనకు ఎగుమతులు చేస్తున్న దేశాలు తమ బడ్జెట్లలో 7 నుండి 10 శాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాయి. పైగా ముడి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అదనపు లాభానికి భారతదేశానికి ఎగుమతి చేస్తూ వేలకోట్ల లాభాలు గడిస్తున్నాయి. దిగుమతులు రావడం వల్ల స్థానిక పంటల ధరలు తగ్గి రైతులకు గిట్టుబాటు కావడంలేదు. కార్పొరేట్ సంస్థలు వ్యవసాయరంగంలో తమ ప్రాబల్యం పెంచడానికి వీలుగా ఇలాంటి పథకాలను తేవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రుణాలు ఇవ్వక పోవడం, సబ్సిడీలకు కోతపెట్టడంతో రైతులు మైక్రోఫైనాన్స్ సంస్థల బారిన పడి, వారికి వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో 2.5 శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. దీనిని 7 శాతానికి పెంచాలి. ఎరువులను శాస్త్రీయంగా వినియోగించడానికి వీలుగా భూసార పరీక్షలు జరిపి రైతులను చైతన్య పరచాలి. అంతేగానీ ఇలాంటి ప్రమాదకర పథకాలను అమలు పరచరాదు. - సారంపల్లి మల్లారెడ్డి ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు -
Shanghai Cooperation Organisation: అనుసంధానమే బలం
సమర్ఖండ్: షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల నడుమ అనుసంధానం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. లక్ష్యాల సాకారానికి మెరుగైన అనుసంధానం, రవాణా సదుపాయాల విషయంలో పరస్పరం పూర్తి హక్కులు కల్పించడం ముఖ్యమన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో శుక్రవారం ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్–రష్యా యుద్ధం దేశాలతో మధ్య రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అందుకే విశ్వసనీయమైన, ప్రభావవంతమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్లను అభివృద్ధికి సభ్యదేశాలన్నీ కృషి చేయాలన్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యధికంగా 7.5 శాతం వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. ఎస్సీఓ సభ్యదేశాల మధ్య మరింత సహకారం, పరస్పర విశ్వాసానికి భారత్ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి ప్రపంచదేశాల్లో ఆహార భద్రత సంక్షోభంలో పడిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దీనికి ఆచరణీయ పరిష్కారముంది. తృణధాన్యాల సాగును, వినియోగాన్ని భారీగా ప్రోత్సహించాలి. తృణధాన్యాల సాగు వేల ఏళ్లుగా ఉన్నదే. ఇవి చౌకైన సంప్రదాయ పోషకాహారం. మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి’’ అన్నారు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి మోడల్ ‘‘కరోనాతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అవి తిరిగి కోలుకోవడంలో ఎస్సీఓ పాత్ర కీలకం’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచ జీడీపీలో ఎస్సీఓ వాటా 30 శాతం. జనాభాలో 40 శాతం’’ అన్నారు. తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతిభావంతులైన యువత వల్ల ఇండియా సహజంగానే ప్రపంచదేశాలకు పోటీదారుగా ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 7.5 శాతం వృద్ధితో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా ఎదగబోతున్నామని వివరించారు. టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామని, తమ అభివృద్ధి మోడల్‌కు ప్రజలే కేంద్రమని తెలిపారు. ప్రతి రంగంలో నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తున్నామని, ఇండియాలో ప్రస్తుతం 70,000కు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇందులో 100కు పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయన్నారు. ఇండియా సంపాదించిన అనుభవం ఎస్సీఓలోని ఇతర దేశాలు సైతం ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌పై ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయడం ద్వారా తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకుంటామని చెప్పారు. ప్రపంచానికి భారత్ గమ్యస్థానం మెడికల్, వెల్నెస్ టూరిజంలో ప్రపంచానికి భారత్ గమ్యస్థానంగా మారిందని మోదీ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం తమదేశంలో పొందవచ్చని తెలిపారు. ఇక భారత్ సారథ్యం రొటేషన్ విధానంలో భాగంగా ఎనిమిది మంది సభ్యుల ఎస్సీఓ సారథ్యం ఉజ్బెకిస్తాన్ నుంచి భారత్ చేతికి వచ్చింది. 2023లో ఎన్సీఓ శిఖరాగ్రానికి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయంలో భారత్‌కు అన్నివిధాలా సహకరిస్తామని ఉజ్బెక్ అధ్యక్షుడు షౌకట్ మిర్జియోయెవ్ చెప్పారు. ఆయనతో కూడా మోదీ భేటీ అయ్యారు. పలకరింపుల్లేవ్.. కరచాలనాల్లేవ్ న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో ఎస్సీవో సదస్సుకు హాజరైన భారత్ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. శుక్రవారం ఒకే వేదికపైన ఫొటోల కోసం మిగతా నేతలతో కలిసి పక్కపక్కనే నిలబడిన సమయంలోనూ ఒకరినొకరు పట్టనట్లుగా వ్యవహరించారు. చిరునవ్వుతో పలకరించుకోలేదు. కరచాలనం చేసుకోలేదు. గల్వాన్ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం తెలిసిందే. అప్పటినుంచి వారు ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి. అమెరికాపై జిన్‌పింగ్ విమర్శలు ‘‘కొన్ని శక్తులు ఇంకా ప్రచ్ఛన్న యుద్ధ భావజాలం, ఏకపక్ష పోకడలు ప్రదర్శిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతను విచ్ఛిన్నం చేయజూస్తున్నాయి’’ అని అమెరికానుద్దేశించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విమర్శలు గుప్పించారు. వాటిపట్ల ఎస్సీఓ సభ్యదేశాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రక్షణ సహా అన్ని రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం సభ్య దేశాలకు చెందిన 2,000 మంది సైనిక సిబ్బందికి చైనాలో శిక్షణ ఇస్తాం. ఉమ్మడి అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేసుకుందాం’’ అంటూ ప్రతిపాదించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు తదితరాల కోసం వర్ధమాన దేశాలకు 105 కోట్ల డాలర్ల మేరకు సాయం అందిస్తామని ప్రకటించారు. -
ఆహార భద్రత కార్డుదారులకూ ఆరోగ్యశ్రీ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెల్లరేషన్ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కోసం తెల్లకార్డుల స్థానంలో 10లక్షల ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది. వాటిని కేవలం రేషన్ సరుకుల కోసం మాత్రమే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్ భారత్ కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డుగానీ, లేదా తెల్ల రేషన్ కార్డుగానీ ఉండాలనే నిబంధన ఉంది. దీనివల్ల ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రజల నుంచి వినతులు రావడంతో.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత సేవలు లభిస్తాయి. -
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈనెలలో 15 కిలోలు ఉచితం
సాక్షి, నల్లగొండ: ఆగస్టు నెలకు సంబంధించి ఆహారభద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఉచితంగా 15 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే జిల్లాలో మొత్తం 4,67,814 కార్డుదారులు ఉండగా ఇందుకు గాను ప్రభుత్వం 21,825.100 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. వీటిని ఆగస్టు 4 నుంచి పంపిణీ చేయించేలా జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్, మేలో రూపాయికి కిలో చొప్పున.. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే మాసాల్లో కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంపిణీ చేయలేదు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మరో 5 కిలోలను కూడా ఉచితంగా ఇవ్వకండా రూపాయికి కిలో చొప్పున యూనిట్‌కు 6 కిలోలు పంపిణీ చేసింది. జూన్ మాసంలో కూడా మొదట రూపాయికి కిలో చొప్పున ఇచ్చింది. మరలా అదేనెల 23 నుంచి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా ఇవ్వనందున జూలైలో ఒకేసారి ఒక్కో యూనిట్‌కు పది కిలోల బియ్యం పంపిణీ చేయించింది. కాగా ఆగస్టు మాసానికి సంబంధించి కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కిలో బియ్యాన్ని ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 19 వరకు పంపిణీ చేయిస్తాం.. జిల్లావ్యాప్తంగా ఉన్న 991 రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు ఆగస్టు 4 నుంచి 19 వరకు పంపిణీ చేయిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీలర్ల వారీగా గోదామలు నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చర్యలు తీసుకుంటున్నాం. కార్డుదారులంతా సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ చదవండి: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?.. ఆలస్యం వద్దు.. మంచి ముహూర్తాలు ఇవే -
ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..
హిందూపురం/లేపాక్షి: కేంద్ర ఆహార భద్రత చట్టం–13 అమలు బాధ్యత అధికారులదేనని ఆహార భద్రత కమిషన్ సభ్యురాలు కృష్ణమ్మ స్పష్టం చేశారు. స్థానిక లక్ష్మీపురంలోని వైఎస్సార్ ఆరోగ్యకేంద్రం, సింగిరెడ్డిపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, సీపీఐ కాలనీలోని కస్తూరిబా విద్యాలయ, ఎంఎల్ఎస్ పాయింట్, చౌకధాన్య డిపోలను గురువారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రూ.వేల కోట్ల వ్యయంతో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాయన్నారు. ఆహార భద్రత కింద అమలులో ఉన్న వివిధ పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఇందులో నాన్ ఎఫ్ఏసీ కింద సుమారు 56లక్షల కార్డుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ రేషన్‌కార్డు అందజేస్తామన్నారు. ఎక్కడైనా అర్హులైన కార్డు రాకపోయినా, రేషన్ బియ్యంలో పంపిణీలో అవకతవకలు, నాణ్యత ప్రమాణాలు లోపించినా వెంటనే ఫుడ్‌కమిషన్ టోల్‌ఫ్రీ నంబర్ (155235)కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపించినా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ప్రధానమంత్రి మాతృయోజన పథకం కింద మొదటి, రెండవ కాన్పులకు అందిస్తున్న పారితోషికానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్‌ను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని గురువారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీ«కృష్ణారెడ్డి, డీఎం అశ్వత్థనారాయణ, ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి, నోడల్ ఆఫీసర్ గాయత్రి, సీడీపీఓ నాగమల్లేశ్వరి, డాక్టర్ ఆనంద్, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఈఓ రంగస్వామి, ఏడీ నాగరాజు, ఈడీ దివాకర్‌రెడ్డి, ఎంఈఓ గంగప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: కులాంతర వివాహంతోనే హత్య) -
శతమానం భారతి: ఆహార భద్రత
స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఉప్పులకు, ఉప్పులకు కొత్త సంసారంలా ఉండేది ఇండియాకు! నాటి జనాభా 35 కోట్లే అయినా తిండికి తిప్పలు అన్నట్లుగా ఉండేది. దిగుమతులే శరణ్యం అన్నట్లుగా గడిచింది. నాలుగేళ్లలో కాస్త నిలదొక్కుకున్నాక అయిదు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను సొంతంగా ఉత్పత్తి చేసుకోగలిగాం. ఇప్పటికి ఆ మొత్తం ఐదు రెట్లకు పెరిగింది. సమానంగా జనాభా కూడా పెరిగి 140 కోట్లకు చేరుకోబోతున్నాం. అందుకే ఇప్పుడు మన దేశానికి ఆహార భద్రత అవసరమైంది. భద్రత అంటే ఏం లేదు. కరువు దాపురించకుండా జాగ్రత్త పడటం. పంటల దిగుబడులను పెంచుకోవడం తోపాటు, నిల్వ సదుపాయాలను సమకూర్చుకోవడం. దేశంలోని జనాభాకు ఆహారం కొరత లేకుండా చూడటం. వీటిల్లో నిల్వ దశ ముఖ్యమైనది. ఇందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. జనపనార సంచుల్లో నింపిన ఆహార ధాన్యాలను గట్టి సీలింగు ఉన్న గోదాములలో బస్తాలుగా సర్దడం. ఎల్తైన ట్యూబుల్లాంటి అత్యాధునిక గిడ్డంగులలో ధాన్యాన్ని నిల్వ చేయడం. ఆరు బయట ప్లాస్టిక్ కవర్ల కింది బస్తాలుగా పేర్చి నిల్వ చేయడం. పొడవాటి గొట్టాల రూపంలో ఉండే ప్లాస్టిక్ సంచుల్లో ధాన్యాన్ని నిల్వ చేయడం. ఏదేమైనా.. సంపాదిస్తే సరిపోదు. దాచుకోవడం తెలియాలి అని ఆర్థిక నిపుణులు అంటుంటారు. అలాగే ఆహార నిపుణులూ.. ‘‘ధాన్యం దిగుబడులు పెంచుకున్నంత మాత్రాన సరిపోదు, వాటిని భద్రపరుచుకుని పేదలకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వం చేయవలసి పని’’ అని సూచిస్తునాన్నారు. వచ్చే 25 ఏళ్లల్లో ఒక లక్ష్యంతో.. మరింత అత్యాధునికమైన నిల్వ విధానాలను కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
సీబీఎస్ఈ సిలబస్‌లో భారీ మార్పులు
న్యూఢిల్లీ: 2022–23 విద్యా సంవత్సరానికి 11, 12వ తరగతుల సిలబస్‌లో సీబీఎస్ఈ పలు మార్పులు ప్రకటించింది. చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లోని అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధ కాలం, ఆసియా–ఆఫ్రికా దేశాల్లో ముస్లిం సామ్రాజ్యాల అవతరణ, మొగలుల పాలన, పారిశ్రామిక విప్లవం పాఠ్యాంశాలను తొలగించింది. 10వ తరగతిలో ఫుడ్ సెక్యూరిటీ చాప్టర్లోని ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ అగ్రికల్చర్‌ను తీసేసింది. ఉర్దూ కవి ఫయీజ్ అహ్మద్ ఫయిజ్ అనువాద కవితలను, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ చాప్టర్లను తీసేసింది. సిలబస్‌లో హేతుబద్ధత కోసమే ఈ మార్పులు చేసినట్టు చెప్పింది. గత విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా నిర్వహించిన ఫైనల్ పరీక్షను ఈసారి ఒకే దఫా నిర్వహించాలని నిర్ణయించింది. 2020లోనూ 11వ తరగతి రాజనీతి శాస్త్రంలో పలు చాప్టర్లు తొలగించిన సీబీఎస్ఈ, నిరసనలతో మరుసటి ఏడాది నుంచి వాటిని పునరుద్ధరించింది. -
ఆహారభద్రతే... ఆకలిచావులకు మందు!
కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలు వంటి వాటివల్ల ప్రపంచంలో చాలా దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయనీ, కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయనీ పేద రిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్ ఫామ్’ సంస్థ వెల్లడించింది. ఆకలి కార ణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా వుంది అని అంచనా వేసింది. ఆ సంస్థ ‘ది హంగర్ ముల్టిప్లయిస్’ అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాది నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు. అదనంగా 11 కోట్ల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్ఠమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం, ఆహార కొరతల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికమవ్వడం వంటి విషయాలు ఈ నివేదిక వెల్లడించింది.. మన దేశంలో 2021–22లో 315 మిలియన్ టన్నుల రికార్డ్ స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8 శాతం ఉండగా... 2020 నాటికి 15.3 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. కొనుగోలు సామర్థ్యం కొరవడింది. పోషకాహారం లోపం వల్ల ఆకలి చావులు పెరుగుతున్నాయి. భారత్‌లో దాదాపు 14 శాతం ప్రజలు పోషకా హార లోపంతో, ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 20 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 52 శాతం రక్తహీనతతో సతమతమౌతు న్నారని అంచనాలు తెలుపుతున్నాయి. 2021 ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో 116 దేశా లను చేర్చారు. ఇందులో భారతదేశం అట్టడుగున 101వ స్థానంలో ఉండటం విచారకరం. 2020లో భారతదేశం స్థానం 94 కాగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది. శ్రీలంక 65, బంగ్లాదేశ్ 76, పాకిస్తాన్ 92 స్థానాల్లో ఉండటం ఈ సందర్భంగా గమ నించాలి. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలు గుర్తించి వారికి సకాలంలో ఆహార ధాన్యాలు అందించాలనీ, ఆకలితో ఎవ్వరూ చని పోకూడదనీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలైనా ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొలుపు తాయేమో చూడాలి. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చెయ్యాలి. ఆహార భద్రత అంటే బియ్యం, గోదుమలు ఇవ్వడం కాదు. దారిద్య్రరేఖకు కింద వున్నవారికి పౌష్టికాహారం అందించడం. అప్పుడే పేద వర్గాలలో ఆహార భద్రత కలుగుతుంది. ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం ప్రజలు ఆరోగ్య దాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సుర క్షిత పౌష్టికాహారం ప్రజలందరికీ అందించాలి. ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా పేదలకు ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలి. అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం సరఫరా చేయాలి. అణగారిన వర్గాలకు, గిరిజనులకు, మురికి వాడల్లో నివసించే వారికి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందజేయాలి. అప్పుడే ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరుతుంది. నేదునూరి కనకయ్య వ్యాసకర్త తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు మొబైల్: 94402 45771 -
ఆహారభద్రతకు భరోసా చిరుధాన్యాలే
ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. వీటి వైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022–23 కేంద్ర బడ్జెట్లో చిరుధాన్యాలకు అదనపు విలువను జోడిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వీటికి బ్రాండ్ విలువను తీసుకురానున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం సరైన దిశగా తీసుకున్న చర్య అనే చెప్పాలి. చిరుధాన్యాల పైపొట్టు తీయడంలో ఉన్న క్లిష్టత కారణంగా వాటి వినియోగం దేశంలో తగ్గిపోతోంది. కాబట్టి పోషక విలువలు కోల్పోకుండా చిరుధాన్యాల పొట్టు తీయడాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన యంత్రాలను రూపొందించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటి పొట్టు తినదగినది కాదు. దేశీయ చిరుధాన్యాలతోనే ఆహార, ఆరోగ్య భద్రత ముడిపడి ఉందని గుర్తించాలి. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2023ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. ఈ పంటల జీవవైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022–23 కేంద్ర బడ్జెట్లో చిరుధాన్య పంటలకు అదనపు విలువ జోడిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో వీటి వినియోగాన్ని పెంచడం, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వాటికి బ్రాండ్ విలువను తీసుకురానున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం సరైన దిశగా తీసుకున్న చర్య అనే చెప్పాలి. చిరుధాన్యాల్లో మూడు కీలక పంటలు (జొన్నలు, సజ్జలు, రాగులు); ఆరు మైనర్ పంటలు (ఊదలు, వరిగలు, కొర్రలు, అరికెలు, అండు కొర్రలు, చిన్న అండు కొర్రలు) ఉంటాయి. గోధుమ, వరిలో కంటే పోషకపదార్థాలు, మినరల్స్, విటమిన్స్ మూడు నుంచి 5 రెట్లు ఎక్కువగా చిరుధాన్యాల్లో ఉంటాయి. పైగా వీటి ఉత్పత్తికి చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. చెరకు, అరటి వంటి పంటలకు అవసరమయ్యే వర్షపాతంలో 25 శాతం మాత్రమే జొన్న పంటకు సరిపోతుంది. మరీ ముఖ్యంగా, పశువుల పేడ వంటి వ్యర్థాలే దన్నుగా విస్తారమైన పొడినేలల్లో చిరు«ధాన్యాలు పండుతాయి కాబట్టి రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది. అందుచేత, వాతావ రణ సవాళ్లు, పర్యావరణ క్షీణత, పోషకాహార లేమి వంటి ఇబ్బందులు ఎదుర్కోవడంలో చిరుధాన్యాల సాగు కీలక పాత్ర పోషిస్తుంది. జొన్నలు అధికంగా పండించే రాష్ట్రాల్లో రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హరియాణా, మహరాష్ట్ర, కర్ణాటక ముందువరుసలో ఉన్నాయి. ఇక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రా ల్లోని కొన్ని ప్రాంతాల్లో సజ్జలు అధికంగా పండిస్తారు. సామలను మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికంగా పండి స్తారు. దేశవ్యాప్తంగా కోటి 14 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలను పండిస్తున్నారని అంచనా. అంటే సంవత్సరానికి దాదాపు కోటి 60 లక్షల టన్నుల పంట పండుతోంది. ఆసియా చిరుధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం, ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 20 శాతాన్ని భారతదేశంలోనే పండిస్తున్నారు. భారతీయ చిరుధాన్య ఎగుమతులు 2020 సంవత్స రంలో 2 కోట్ల 60 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా చిరుధాన్యాలకు బదులుగా సోయా బీన్, మొక్కజొన్న, పత్తి, చెరకు, పొద్దుతిరుగుడు వంటి పంటలు పండించడం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. వారిని చిరు ధాన్యాల సాగువైపు మరల్చాల్సిన అవసరముంది. దేశంలో చిరు ధాన్యాలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా అధికంగా వాటి ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఉందనీ, అయితే... ఇందుకోసం పలు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందనీ నిపుణులు పేర్కొంటున్నారు. చిరుధాన్యాల ప్రాథమిక ప్రాసెసింగ్‌లో ఉన్న క్లిష్టతే వాటి వినియోగం తగ్గిపోవడానికి దారితీసిందని వీరి అభిప్రాయం. కాబట్టి పోషక విలువలు కోల్పోకుండా జొన్నల పొట్టు తీయడాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన యంత్రాలను రూపొందించడం చాలా ముఖ్యం. నాణ్యమైన జొన్నలను పండించడం, వాటిని వేగంగా వ్యాపారుల ద్వారా మార్కెటింగ్ చేయడం అవసరం. సన్నకారు చిరుధాన్యాల రైతులను ఎలెక్ట్రానిక్ అగ్రికల్చరల్ నేషనల్ మార్కెట్ (ఇ–ఎన్ఏఎమ్) వంటి ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫాంలతో అను సంధానించాల్సి ఉంది. అలాగే దేశ, ప్రపంచ మార్కెట్లలోనూ చిరు ధాన్యాల ఉత్పత్తిదారుల బేరమాడే శక్తిని పెంపొందించడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్పీఓలు) ఏర్పర్చాల్సి ఉంటుంది. నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాల ఉత్పత్తి, పంపిణీ, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, శిక్షణలు, ప్రాథమిక ప్రాసెసింగ్ క్లస్టర్లు, పరిశోధనా మద్దతుతో రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి... భారత ప్రభుత్వం, జాతీయ ఆహార భద్రతా లక్ష్యసాధనా నిర్వాహక మార్గదర్శకాల్లో మార్పులు తీసుకొచ్చింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో 212 చిరుధాన్యాలు పండించే జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 67 విలువ ఆధారిత టెక్నాలజీలను ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో 77 అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, 10 జీవ రక్షణ విత్తన రకాల విడుదల సాధ్యమయింది. చిరుధాన్య వ్యాపారులకు, చిరుధాన్యాల పొట్టు తీసే ప్రాథమిక ప్రాసెసింగ్ మెషిన్లకు, రైతు కలెక్టివ్‌లకు మద్దతునివ్వడానికీ; చిరు ధాన్యాలు పండించే రాష్ట్రాలకు పెట్టుబడులు అందించడానికీ 14 బిలి యన్ డాలర్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న వ్యవసాయ వాతావరణ అనుకూల పంటల సాగు కోసం ‘ఒక జిల్లా ఒక పంట’ (ఓడీఓపీ) ఇనిషియేటివ్‌ని ఏర్పర్చి దీనిపై దృష్టి పెట్టడానికి చిరుధాన్యాలు పండించే 27 జిల్లాలను గుర్తించారు. 9 కోట్ల 24 లక్షల డాలర్ల వ్యయంతో, 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీఓ లు) ఏర్పర్చేందుకు ప్రోత్సహించారు. ఈ సంస్థల్లో రైతులనే సభ్యులుగా చేసి చిరుధాన్యాల ఉత్పత్తిదారులు మార్కెట్లో సమర్థంగా పాలు పంచుకునేలా చేయడమే వీటి లక్ష్యం. తమిళనాడులోని ధర్మపురి జిల్లా ‘మైనర్ మిల్లెట్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ’ దీనికి ఒక ఉదాహరణ. వెయ్యిమంది రైతు సభ్యులకు సాంకేతిక సహాయం అందించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 100 ఎఫ్‌పీఓలలో ఇది ఒకటి. వీరికి విత్తనాలను, యంత్రాలను సబ్సిడీ రేట్ల కింద ఇస్తారు. సముచితమైన ధరలతో రైతుల నుంచి పంట సేకరణను ఇవి చేపడతాయి. అంతకుమించి కుకీలు, పిండి, మొలకెత్తిన చిరుధాన్యాలు, రైస్ వంటి ఉత్పత్తులతో ‘డిమిల్లెట్స్’ అనే బ్రాండ్ పేరుతో చిరుధాన్యాలకు అదనపు విలువను చేకూరుస్తాయి. మరోవైపున, దక్షిణ ఒడిశాలోని నియమ్‌గిరి హిల్ సుదూర ప్రాంతాల్లో డోంగ్రియా కోండులు అనే సాంప్రదాయిక తెగ నివసి స్తోంది. వీరు అనేకరకాల చిరుధాన్యాలను దేశీయ ఆహారంగా తీసు కుంటారు. ఈ ప్రాంతంలో తరాలుగా విత్తన సేకరణ వ్యవస్థను స్థానిక కమ్యూనిటీ విస్తృతంగా చేపడుతోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఉనికిలో లేని అరికలను వీరు కాపాడుతూ వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిరుధాన్య పంటలు పండించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోంగ్రియా కోండుల వంటి దేశీయ సన్నకారు రైతుల మార్కెట్ అవసరాలు తీర్చడానికి ఒడిశా ప్రభుత్వం అయిదేళ్లపాటు మిల్లెట్ మిషన్ పేరిట ఉత్పత్తులను అందించాలని ప్లాన్ చేసింది. దీంతోపాటుగా ఒడిశా కేంద్రంగా పనిచేసే లివింగ్ ఫారమ్స్ వంటి ఎన్జీఓలు పోషకాహార లేమి, వాతావరణ ఒత్తిడి వంటి అంశాలపై వారికి అవగాహన కలిగిస్తున్నాయి. కాబట్టి పరిస్థితులను తట్టుకునే చిరుధాన్య రకాలను ఇక్కడ విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదేవిధమైన పథకాలను ప్రవేశపెట్టాయి. డోంగ్రియా కోండులు వంటి ఒడిశాలోని ఆదివాసీ జాతులకు చెందిన దేశీయ ఆహార వ్యవస్థల నుంచి ధర్మపురి జొన్నల ఎఫ్పీఓల మార్కెట్ల వరకు... భారత గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాల పరి రక్షణకు సంబంధించి ఉత్తమ విధానాలు అమలులో ఉన్నాయి. ఆరోగ్యకరమైన చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునే దిశగా వినియో గదారులను మళ్లించడానికి.. దేశవ్యాప్తంగా నిపుణులను రంగంలోకి దింపాల్సిన అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా యువ వ్యవసాయ వ్యాపారవేత్తలు స్థాపించిన 200 వరకు చిరుధాన్యాల స్టార్టప్‌ల అనుభవాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వర్షం సహాయంతో చిరుధాన్యాలను పండించే మహిళా రైతులకు నైపుణ్యాలు నేర్పించి వారి సమర్థతను పెంచాల్సి ఉంది. అందుచేత, మార్కెట్ అనుకూల తను ఏర్పర్చే విధంగా చిరుధాన్యాల సాగు విధానాలను బలపర్చి, సంస్థాగత జోక్యం చేసుకునేలా మన ప్రయత్నాలు సాగాలి. – అభిలాష్ లిఖి ‘ అదనపు కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ -
మోదీజీ యుద్ధం ఆపమని పుతిన్‌కి చెప్పండి!
భారత్ ప్రయోజానాల దృష్ట్యా యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కి చెప్పండి అని ఉక్రెయిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరండి అని ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు. ఇది అన్ని దేశాల ఉత్తమ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. యుద్ధం ముగిస్తే గనుక అన్ని దేశాలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఉక్రెనియన్ వ్యవసాయ ఉత్పత్తుల అతిపెద్ద వినయోగదారులలో భారత్ ఒకటి అన్నారు. ఈ యుద్ధం కొనసాగితే కొత్త పంటలకు విత్తనాలు వేయడం మాకు కష్టమవుతుంది కాబట్టి భారత ఆహార భద్రత పరంగా కూడా ఈ యుద్ధాన్ని ఆపాడం ఉత్తమం అని చెప్పారు. ఈ యుద్ధం అందరి ప్రయోజనాలకు విరుద్ధం" అని వ్లాదిమిర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేయాలని రష్యాతో ప్రత్యేక సంబంధాలను నెరుపుతున్న భారత్‌తో సహా అన్ని దేశాలను డిమిట్రో కులేబా కోరారు. పైగా రష్యా పై మరిన్ని ఆంక్షలను విధించాలని డిమాండ్ కూడా చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. విదేశీ పౌరులను తరలించే వరకు కాల్పలు నిలిపివేయాలని కోరారు. విదేశీయుల తరలింపు కోసం ఉక్రెయిన్ రైళ్లను ఏర్పాటు చేయడమే కాక రాయబార కార్యాలయంతో పనిచేస్తోందని కూడా చెప్పారు. పైగా ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా తనవంతుగా కృషి చేస్తుందని అన్నారు. (చదవండి: పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. బైడెన్‌కు జెలెన్ స్కీ ఫోన్) -
ఆహార భద్రతలో ఏపీ భేష్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆహార భద్రతకు రాష్ట్రంలో ఢోకా లేదు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) అమలులో మన రాష్ట్రం మొదటి ర్యాంకు సాధించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైనట్లు తేలింది. తాజాగా నీతి ఆయోగ్, సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) భారత్ ఇండెక్స్ నివేదికల ప్రకారం పలు అంశాల్లో ఏపీ అద్భుత ప్రతిభ కనబరిచినట్టు తేలింది. అందరికీ ఆహార భద్రత కల్పించడంలో వంద శాతం విజయవంతమైంది. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడంలో దేశంలోని ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీ చేస్తున్నట్టు నీతి ఆయోగ్, ఎస్డీజీ ఇండెక్స్‌లో తేలింది. 2020–21కి గాను ఎస్డీజీ భారత్ ఇండెక్స్‌లో హెల్త్ ఇన్‌స్రూ?న్స్ కల్పించడంలో వందకు 91.27 మార్కులతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. వివిధ అంశాల్లో సాధించిన ప్రగతి.. ర్యాంకులు ఇలా.. ► గతంలో మాతా మరణాల నియంత్రణలో రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు మంచి ఫలితాలు సాధించింది. 59.63 శాతం మార్కులతో 5వ ర్యాంకు కైవసం చేసుకుంది. ప్రసవ సమయంలో తల్లుల మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ విషయంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ► 9 నెలల నుంచి 11 నెలల వయసున్న చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో ఏపీ ముందంజ వేసింది. గతంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ► వరి పండించే రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానం దక్కించుకుంది. ఈ అంశంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ► రాష్ట్రంలో నర్సులు, ఫిజీషియన్లు, మిడ్ వైఫరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో పదో స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 95.14 మార్కులతో రెండో స్థానానికి చేరింది. 115 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. ► నర్సులు, డాక్టర్ల రేషియో విషయంలో 95.14 మార్కులతో రెండో స్థానంలోను, సురక్షిత తాగునీటి సరఫరా అంశంలో 86.58 మార్కులతో మూడో స్థానంలోను మన రాష్ట్రం నిలిచింది. ► మరుగుదొడ్ల ఏర్పాటులోనూ ఏపీ ప్రగతి సాధించింది. నూటికి నూరు మార్కులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ కూడా చోటు దక్కించుకుంది. ► అందరికీ విద్యుత్ విషయంలోనూ ఏపీ గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించటంలో వందకు వంద మార్కులు సాధించిన అతి కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కావడం గమనార్హం. ► వ్యర్థాల నిర్వహణ, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే విషయంలో ఏపీ మంచి ఫలితాలు సాధించింది. వంద శాతం మార్కులు సాధించిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ► సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది. 52.40 శాతం మార్కులతో ఈ ఘనత సాధించింది. ► ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల విషయంలో రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది. 89.13 మార్కులతో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఇందులో మహిళల ఖాతాల విషయంలో దేశంలోనే రెండో ర్యాంకు సాధించింది. -
కూల్ డ్రింక్ తాగిన మైనర్ బాలిక.. కాసేపటికే నీలిరంగులోకి..
చెన్నై: కూల్‌డ్రింక్ తాగిన ఒక మైనర్ బాలిక.. కాసేపటికే కిందపడిపోయి అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బసంత్‌నగర్ ప్రాంతంలో జరిగింది. కాగా, తరణి, అశ్విని ఇద్దరు అక్కచెల్లెలు. వీరిద్దరు తమ కుటుంబంతో కలిసి బసంత్‌నగర్‌లోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో, 13 ఏళ్ల తరణి గడిచిన మంగళవారం(ఆగస్టు3)న మధ్యాహ్నం తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాప్‌కు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకుంది. కాసేపటి తర్వాత.. తరణి కూల్ డ్రింక్ తాగింది. అప్పటి వరకు బాగానే ఉన్న తరణి ఒక్కసారిగా కిందపడిపోయింది. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఎంత కదిలించిన ఉలుకు.. పలుకులేదు. ఈ అనుకొని ఘటనతో అశ్విని షాక్‌కు గురయ్యింది. కాగా, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు, హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. తరణిని పరీక్షీంచిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. యువతి శరీరం కూడా.. నీలిరంగులోకి మారింది. తరణి మృత దేహన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, యువతి ఊపిరితిత్తులలో కూల్ డ్రింక్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ పానీయంలో.. ఏదైన ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా.. అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణంపై దాడిచేసి.. షాపును సీజ్ చేశారు. అక్కడ ఉన్న 540 కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం లాబ్‌కు తరలించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దుకాణంలో 17 కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను అమ్మినట్లు గుర్తించారు. ఆ షాపును అధికారులు సీజ్ చేశారు. కాగా, ధరణి గతంలో అస్తమాతో బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సీతా'సోకు' చిలుకలు
సాక్షి, అమరావతి: సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అంటూ సప్తవర్ణ శోభితమైన వాటి అందాన్ని ఓ సినీకవి ఎంతో రమణీయంగా వర్ణించినట్లే పచ్చదనం పర్చుకున్న ఈ ప్రకృతి కూడా ఎన్నో అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఇందులో రకరకాల వృక్ష సంపదే కాదు.. అనేక రకాల కీటకాలూ మనల్ని అలరిస్తాయి.. ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి సీతాకోక చిలుకలు. ఓ పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకు.. ఓ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు.. వయ్యారంగా రెక్కలూపుకుంటూ ఎగిరే ఈ సీతాకోకలు సర్వమానవాళికీ ఆహార భద్రత కలిగిస్తాయి. పర్యావరణంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ జాతిలో ఇప్పుడు కొత్తగా నాలుగు రకాలు చేరాయి. అది కూడా ఎక్కడో కాదు.. మన ఏపీలోనే. ఆ వివరాలు.. రుతుపవనాలు పర్యావరణంలో కొన్ని అందమైన మార్పులు తీసుకొస్తాయి. పెరుగుతున్న పచ్చదనం, వికసిస్తున్న పువ్వులు, కొత్త వృక్ష సంపద.. వాటి చుట్టూ అనేక రకాల పురుగుల మనుగడ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతిలో జరిగే ఈ అందమైన మార్పులు, కీటకాల మనుగడను ప్రకృతి ప్రేమికులు నిశితంగా పరిశీలిస్తారు. వారి అన్వేషణలో (నేచర్ వాక్స్) ఇటీవల రాష్ట్రంలో నాలుగు కొత్త సీతాకోక చిలుక జాతులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుమలలో ఫ్లంబియస్ సిల్వర్‌లైన్, నారో బ్యాండెడ్ బ్లూ బాటిల్ జాతి సీతాకోక చిలుకలను కనుగొన్నారు. విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు ప్రాంతంలో లాంగ్ బ్యాండెడ్ సిల్వర్‌లైన్, డార్క్ పైరాట్ జాతులను గుర్తించారు. ఈ నాలుగు జాతుల సీతాకోక చిలుకలు ఇంతవరకు మన రాష్ట్రంలో రికార్డు కాలేదు. విజయవాడ నేచర్ క్లబ్‌కి నేతృత్వం వహిస్తున్న రాజేష్ వర్మ దాసి, రాజశేఖర్ బండి బృందం ఇటీవల నిర్వహించిన నేచర్ వాక్స్‌లో తొలిసారిగా వాటిని తమ కెమెరాల్లో బంధించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అరుదైన ఆర్కిడ్ టిట్ జాతి సీతాకోక చిలుక కూడా రికార్డయింది. ఇది గతంలో రికార్డయినా చాలా అరుదైనది. ప్రకృతి ప్రేమికుడు జిమ్మీ కార్టర్ దీన్ని రికార్డు చేశారు. ఈ ఆర్కిడ్ టిట్ సీతాకోక చిలుక 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం షెడ్యూల్–1 పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం.. పులులను సంరక్షిస్తున్నట్లే ఈ జాతి సీతాకోక చిలుకల్ని సంరక్షించాల్సి వుంది. అందుకే పర్యావరణంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. 170 సీతాకోక చిలుక జాతులు, 200 చిమ్మట జాతులు సీతాకోక చిలుకలు, చిమ్మటలు (పురుగు సీతాకోక చిలుకలు), తేనెటీగలు, కందిరీగల వంటి కీటకాలు ముఖ్యమైన పరాగ సంపర్క జీవులు. ఇవి అనేక ఆహార పంటలను పరాగ సంపర్కం చేయడం ద్వారా మానవాళికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయి. మన దేశంలో వెయ్యి కంటే ఎక్కువ జాతుల సీతాకోక చిలుకలు, 10 వేల జాతుల చిమ్మటలు ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 170కి పైగా సీతాకోకచిలుక జాతులు, 200కి పైగా చిమ్మటలు రికార్డయ్యాయి. వీటి జీవిత కాలం ఎంతంటే.. కొన్ని రకాలు కేవలం 15 రోజులు మాత్రమే జీవిస్తే.. మరికొన్ని 12 నెలల వరకూ బతుకుతాయి. నేచర్ వాక్స్‌తో కొత్త విషయాలు ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), తిరుపతి విభాగం తరచూ నేచర్ వాక్స్ నిర్వహిస్తుంది. ఈ వాక్స్‌లో అనేక కొత్త సీతాకోక చిలుకలు, ఇతర కీటకాలను రికార్డు చేస్తున్నాం. ప్రకృతి, జీవ వైవిధ్యానికి సంబంధించి ఎన్నో కొత్త విషయాలు వీటి ద్వారా తెలుస్తాయి. సెప్టెంబర్ నెలను బిగ్ బటర్‌ఫ్లై మంత్‌గా పిలుస్తారు. వలంటీర్లు వారి చుట్టూ ఉన్న సీతాకోక చిలుక జాతులను రికార్డ్ చేసి సిటిజన్ సైన్స్ పోర్టల్స్‌లో పంచుకుంటారు. మన దేశంలో ఈ సమాచారాన్ని ifoundbutterflies,indiabiodiversityportal, moths of india and inaturalist వంటి వెబ్సైట్లలో సమర్పిస్తారు. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా జీవవైవిధ్య పరిరక్షణకు ఈ పనిచేయవచ్చు. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి గొప్ప జీవ వైవిధ్యం ఏపీ సొంతం రాష్ట్రంలో చాలా గొప్ప జీవ వైవిధ్యం ఉంది. దురదృష్టవశాత్తు అది తగినంతగా నమోదుకాలేదు. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే జీవవైవిధ్యం, జీవులను రికార్డు చేసి డాక్యుమెంట్ చేయడం చాలా ముఖ్యం. వాటి ఆవాసాల విధ్వంసం, వాతావరణ మార్పులు, పురుగు మందులు అధిక వినియోగం వంటి అనేక అంశాలు కొన్ని పరాగ సంపర్క జాతుల్ని కనుమరుగయ్యేలా చేస్తున్నాయి. అందుకే వాటి సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంటుంది. ఇటీవల మేం చేపట్టిన నేచర్ వాక్స్‌లో నాలుగు సీతాకోక చిలుక జాతులను కొత్తగా మన దగ్గర రికార్డు చేశాం. – రాజేష్ వర్మ దాసి, విజయవాడ నేచర్ క్లబ్ నిర్వాహకుడు -
రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి ఇలా?
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను ఆమోదించాలని జూన్ 8న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మండల తహశీల్దార్ కార్యాలయంలో గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఇప్పుడు వాటిని ఆమోదించారో లేదా అనేది ఎలా చూడాలో చాలామంది ప్రజలకి తెలియదు. సాదారణంగా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు వాటిని అప్రూవ్ చేశారా లేదా అని మీ సేవ కేంద్రానికి వెళ్లి చూసుకుంటారు. కానీ,ఇక నుంచి మీకు ఆ అవసరం లేదు. మీరు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఇంట్లో నుంచో తెలుసుకోవచ్చు. అదే ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదట మీరు ఈపిడీస్ తెలంగాణ(https://epds.telangana.gov.in/FoodSecurityAct/) పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు వెబ్ సైట్ ఓపెన్ చేశాక, ఎఫ్ ఎస్ సీ సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు కనిపించే రేషన్ కార్డు సర్చ్ లో ఎఫ్ఎస్ సీ సర్చ్, ఎఫ్ఎస్ సీ అప్లికేషన్ సర్చ్ అనే రెండు కేటగిరీలు ఉంటాయి. ఇందులో ఎఫ్ఎస్ సీ అప్లికేషన్ సర్చ్ అనే దానిమీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ జిల్లాను ఎంచుకొని, పక్కనే ఉన్న దానిలో మీ సేవ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్ (లేదా) అప్లికేషన్ నెంబర్ సహయంతో సర్చ్ చేయండి. ఇప్పుడు మీ రేషన్ కార్డు దరఖాస్తును ఆమోదించారో లేదా అనేది మీకు తెలుస్తుంది. చదవండి: హ్యాకర్ల దెబ్బకు భారీగా డబ్బు చెల్లించిన జెబిఎస్ -
మన విత్తనం దేశంలోనే ఉత్తమం
సాక్షి, అమరావతి : పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార భద్రతను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ప్రధాన ఆహార పంట వరి. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో తక్కువ విస్తీర్ణం, నీరు, పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించుకోవాలి. ఇందుకు అనువైన వాతావరణంతో పాటు మేలైన విత్తనం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించినందునే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల రూపకల్పనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. మంచి విత్తనాలు అభివృద్ధి చేయాల్సిందిగా యూనివర్సిటీ పరిధిలోని శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయించారు. రెండు నెలలకొకసారి జరిగే యూనివర్సిటీ అసోసియేట్ డీన్స్ సమావేశంలో ఇటీవల ఆయన ఈ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగు ► రాష్ట్రంలో సుమారు 59 లక్షల హెక్టార్ల మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. వ్యవసాయ రంగంలో వరి రెండంకెల వృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. అధిక ఆదాయాన్నిస్తోంది. ► 2018–19లో 123.52 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే హెక్టార్‌కు సగటు ఉత్పాదకత 5,593 కిలోలుగా ఉంది. సార్వాలో హెక్టార్‌కు 5,593 కిలోల ఉత్పాదకత ఉంటే దాళ్వాలో 6,973 కిలోలుగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో విత్తనాన్ని మార్చి సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి ► రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు చేస్తున్న వరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థలు గానీ, ప్రైవేటు విత్తన సంస్థలు గానీ సరఫరా చేయడం సాధ్యం కాదు. అందువల్ల రైతులే తమ పొలంలో విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. ► గుర్తించిన ఆర్బీకేల పరిధిలో రైతులకు మూల విత్తనాన్ని ఇచ్చి సొంతంగా విత్తనం తయారు చేసుకునే అవకాశం కల్పించింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకుంటే తమ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకూ విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వైస్ చాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. లక్ష్య సాధనకు అనుగుణంగా చర్యలు ► వరి సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక నుంచి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందన్న లక్ష్య సాధనకు అనుగుణంగా పని చేస్తామని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు. ► కొత్తవి కనుగొనేలోగా ఇప్పటికే యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాలు రూపొందించిన వంగడాలకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ► రాష్ట్రంలో సుమారు 43 రకాల వంగడాలు సార్వా, దాళ్వాలో సాగవుతున్నాయి. బాపట్ల, మార్టేరులో కనిపెట్టిన వరి వంగడాలైతే జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచాయి. -
ఆహార భద్రతకు ఆ రెండూ కీలకం
న్యూఢిల్లీ: రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టం చేశారు. దేశ ఆహార భద్రతకు ఈ రెండు అంశాలు ముఖ్యమైనవని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా కనీస మద్దతు ధర విధానం శాస్త్రీయమైన పద్ధతిలో కొనసాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రపంచ ఆహార భద్రత విషయంలో భారత్ నిబద్ధతకు ఇటీవలి వ్యవసాయ సంస్కరణలే నిదర్శనమని ఆయన వివరించారు. అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో మండీల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సాగును విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకూ ఉద్దేశించినవని వివరించారు. ఎసెన్షియల్ కమాడిటీస్ చట్టంలో చేసిన మార్పులతో మండీల మధ్య పోటీతత్వం ఏర్పడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు ఆహార వృథాను అరికట్టవచ్చునని ప్రధాని చెప్పారు. ‘‘ఇప్పుడు మార్కెట్లే చిన్న, సన్నకారు రైతుల ఇంటి ముందుకు వచ్చేస్తాయి. అధిక ధరలు అందేలా చేస్తాయి. దళారులు లేకుండా పోతారు’’అని వివరించారు. కోవిడ్–19 కాలంలో భారత ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల విలువైన తిండిగింజలను 80 కోట్ల మందికి అందించిందని మోదీ తెలిపారు. ఈ ఉచిత రేషన్ అనేది యూరప్, అమెరికాలోని జనాభా కంటే ఎక్కువ మందికి అందించామని అన్నారు. పోషకాహార లోపాలను అధిగమించేందుకు కేంద్రం సిద్ధం చేసిన ఎనిమిది పంటల 17 బయో ఫోర్టిఫైడ్ వంగడాలను మోదీ విడుదల చేశారు. 2023 సంవత్సరాన్ని ‘‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ఆచరించేందుకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంగీకరించడం అధిక పోషక విలువలున్న ఆహారానికి ప్రోత్సాహమివ్వడంతోపాటు చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. వంగడాలతో కొత్త వెరైటీలు ప్రధాని జాతికి అంకితం చేసిన 17 కొత్త వంగడాల్లో ప్రత్యేకతలు ఎన్నో. కొన్ని పోషకాలు సాధారణ వంగడాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. స్థానిక వంగడాలు, రైతులు అభివృద్ధి చేసిన వంగడాల సాయంతో కొత్త వెరైటీలను సిద్ధం చేశారు. ► ఇనుము, జింక్, కాల్షియం, ప్రొటీన్, లైసీన్, ట్రిప్టోఫాన్, విటమిన్లు ఏ, సీ, యాంథోసైనిన్, ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ల వంటి పోషకాలను వీటితో పొందవచ్చు. ► సాధారణ వంగడాల్లో పోషకాలకు వ్యతిరేకంగా పనిచేసే యురుసిక్ ఆసిడ్, ట్రిప్సిన్ నిరోధకం తదితరాలు కొత్త వంగడాల్లో తక్కువగా ఉంటాయి. ► కొత్త వంగడాల్లో రెండింటిని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) అభివృద్ధి చేసింది. గిర్నార్ –4, గిర్నార్ –5 అని పిలుస్తున్న ఈ రెండు వేరుశనగ వంగడాల్లో ఓలిక్ ఆసిడ్ మోతాదు ఎక్కువ. సబ్బులు, ఫార్మా, వస్త్ర పరిశ్రమల్లో ఓలిక్ ఆసిడ్‌ను ఉపయోగిస్తారు. ► జాతికి అంకితం చేసిన వాటిల్లో గోధుమ వంగడాలు ఐదు ఉండగా.. మొక్కజొన్న వంగడాలు మూడు, రాగులు, వేరుశనగ రెండు చొప్పున ..వరి, సామలు, ఆవాలు, కంద వంగడాలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇంకో వంగడం వివరాలు తెలియాల్సి ఉంది. ఆడపిల్లల వివాహ వయో పరిమితిపై త్వరలో నిర్ణయం ఆడపిల్లల కనీస వివాహ వయో పరిమితిపై కేంద్రం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వివాహానికి తగిన వయసు ఏమిటన్న విషయంపై ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయని, కనీస వయో పరిమితిని సవరించేందుకు ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా బాలికలు ఎక్కువ సంఖ్యలో బడిలో చేరుతున్నారని ఫలితంగా స్థూల నమోదు నిష్పత్తిలో తొలిసారి బాలికలు పై చేయి సాధించారని వివరించారు. స్వాతంత్య్ర దినో త్సవ ప్రసంగంలో భాగంగా మోదీ ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితి 18 ఏళ్లు కాగా, పురుషుల విషయంలో ఇది 21 ఏళ్లుగా ఉంది. -
ఆకలి తీర్చే కార్యక్రమానికి శాంతి బహుమతి!
రోమ్: ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉన్నచోట సాయమందించే ఈ కార్యక్రమం రోమ్ కేంద్రంగా పనిచేస్తోంది. గత ఏడాది ప్రపంచ ఆహార కార్యక్రమం దాదాపు 88 దేశాల్లోని పది కోట్ల మందికి ఆసరా కల్పించింది. ‘ఆకలి బాధలు ఎదుర్కొంటున్న కోటానుకోట్ల మంది కష్టాలపై ప్రపంచం దృష్టి పడేందుకు ఈ అవార్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అవార్డు కమిటీ అధ్యక్షులు బెరిట్ రీస్ ఆండర్సన్ వ్యాఖ్యానించారు. శాంతి స్థాపనకు కీలకమైన ఆహార భద్రత కల్పించేందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆకలన్నది మరోసారి ప్రపంచం మొత్తమ్మీద సమస్యగా మారుతోందని, కరోనా వైరస్ పరిస్థితులు దీన్ని మరింత ఎక్కువ చేసిందని కమిటీ తెలిపింది. 2019లో సుమారు 13.5 కోట్ల మంది ఆకలితో అలమటించారని, ఇటీవలి కాలంలో సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడం ఇదే మొదటిసారని వివరించింది. యెమెన్, కాంగో, నైజీరియా, సౌత్ సూడాన్ వంటి దేశాల్లో కోట్లాది మందికి ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. హర్షాతిరేకాలు... నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించిన వెంటనే నైజర్‌లోని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యాలయంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా బీస్లీ అక్కడి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘రెండు విషయాలు. మనకు అవార్డు వచ్చినప్పుడు నైజర్‌లో ఉన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. రెండో విషయం. నేను గెలవలేదు. మీరు గెలుచుకున్నారు’’అని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి చాలాకాలంపాటు అమెరికన్లే అధ్యక్షత వహిస్తూ వచ్చారు. ఈ సంప్రదాయంలో భాగంగా 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ కారొలీనా రాష్ట్ర గవర్నర్ డేవిడ్ బీస్లీని అధ్యక్షుడిగా నియమించారు. ఆహార కార్యక్రమానికి నోబెల్ అవార్డు ప్రకటించిన విషయాన్ని తెలుసుకున్న బీస్లీ మాట్లాడుతూ ‘‘మాటల్లేని క్షణమంటూ నా జీవితంలో ఒకటి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి’’అని, ఆవార్డు దక్కడం తనకు షాక్ కలిగించిందన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమమనే తన కుటుంబం అవార్డుకు అర్హురాలని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమంలో పనిచేస్తున్న యుద్ధం, ఘర్షణ, వాతావరణ వైపరీత్యాల వంటి దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని అటువంటి వారు ఈ అవార్డుకు ఎంతైనా అర్హులని ఆయన నైజర్ నుంచి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆహార కార్యక్రమం ఇదీ... 2030 నాటికల్లా భూమ్మీద ఆకలిబాధలను సమూలంగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లేదా ప్రపంచ ఆహార కార్యక్రమం. కరువు కాటకాలొచ్చినా.. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు చెలరేగినా నిరాశ్రయులకు, బాధితులకు ఆహారం అందివ్వడం ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం. దీనికి మాత్రమే పరిమితం కాకుండా.. సుస్థిర అభివృద్ధికి వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. సిరియా, యెమెన్ వంటి దేశాల్లో లక్షల మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థకు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న మరో సవాలు వాతావరణ వైపరీత్యాలు. గత ఏడాది ఇడాయి తుపాను కారణంగా ముజాంబీక్‌లో సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో పంట నీటమునిగిపోయింది. తిండిగింజల్లేని పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణం రంగలోకి దిగింది ఈ సంస్థ. ఆహారంతోపాటు నిరాశ్రయులకు మళ్లీ ఇళ్లు కట్టించడం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టింది. భూసార పరిరక్షణ, పెంపు, సాగునీటి కల్పన, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాల్లోనూ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తనవంతు సాయం అందిస్తుంది. -
అన్నం పెడుతున్న ఆంధ్రప్రదేశ్
లాక్డౌన్ వల్ల పలు రాష్ట్రాలకు ఆహార కొరత ఏర్పడింది. దీంతో ఏపీలోని భారత ఆహార సంస్థ గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని గూడ్స్ రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలించి ప్రజల ఆకలి తీరుస్తున్నారు. రాష్ట్రంలో సేకరించిన బియ్యాన్ని కేరళ,కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్‌కు పంపించినట్లు ఎఫ్‌సీఐ తెలిపింది. సాక్షి, అమరావతి: లాక్డౌన్ వేళ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అన్నం పెడుతోంది. ఆపద సమయంలో దేశానికి ఆహార భద్రత కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ఆహార కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని ప్రత్యేక గూడ్స్ రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలించి ప్రజల ఆకలి తీర్చడంలో మన రాష్ట్రం కీలక భూమిక పోషించింది. రాష్ట్రంలో ఎఫ్‌సీఐ ద్వారా సేకరించిన బియ్యాన్ని కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 116 గూడ్స్ రైళ్ల ద్వారా పంపించినట్లు ఎఫ్‌సీఐ సీఎండీ డీవీ ప్రసాద్ చెప్పారు. అండమాన్, నికోబార్ దీవులకు కూడా కొంతమేర బియ్యం పంపించామన్నారు. విపత్తు వేళ ఆకలి తీరుస్తూ.. ► కరోనా విపత్తును ఎదుర్కోవడంలో భాగంగా.. పేదల కడుపు నింపేందుకు అవసరమైన బియ్యం ఏ రాష్ట్రానికి అవసరం ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగా గుర్తించింది. ► ఆయా రాష్ట్రాలకు ఏ మేరకు బియ్యం అవసరమనేది అంచనా వేసి మన రాష్ట్రం నుంచి యుద్ధప్రాతిపదికన తరలించింది. ► రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ గోదాముల నుంచి వివిధ రాష్ట్రాలకు ఇప్పటివరకు 3.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించారు. వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు కోరితే సబ్సిడీపై బియ్యం ఇస్తారు. ధాన్యం సేకరణకూ ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ► ఆహార కొరత ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా ఖరీఫ్‌లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎఫ్‌సీఐతో కలిసి 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించింది. ► రబీ సీజన్లో 25 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించేందుకు రాష్ట్ర సివిల్ సప్లైస్, ఎఫ్‌సీఐ సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన సివిల్ సప్లైస్ సంస్థ ధాన్యం సేకరణను మరింత ముమ్మరం చేసింది. ► రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది లేకుండా ముందుజాగ్రత్తగా తగినన్ని బియ్యం నిల్వలను కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉంచింది. 3రాష్ట్రంలోని పేదలు ఆహారానికి ఇబ్బంది పడకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నెలలో 3 విడతలుగా సరుకులను అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. ► రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడినప్పటికీ 1.48 కోట్ల పేద కుటుంబాలకు బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా అందజేశారు. -
కరోనాకు ముందే దారుణ పరిస్థితులు!
పారిస్: మహమ్మారి కరోనా కంటే ముందే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జనం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి మంగళవారం వెల్లడించింది. 55 దేశాల్లోని 135 మిలియన్ల (13.5 కోట్లు) ప్రజలు తిండి దొరక్క అల్లాడుతున్నారని తమ ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ నివేదిక తెలిపిందని పేర్కొంది. నిత్యావసరాలకు నోచుకోక అవస్థలు పడుతున్న బీదబిక్కిపై కోవిడ్ రక్కసి మరింత తీవ్ర ప్రభావం చూపుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్రితం ఏడాది 50 దేశాల్లో 123 మిలియన్ల మంది ఆహార సంక్షోభంలో కూరుకుపోతే.. తాజా రిపోర్టులో ఆ సంఖ్య.. మరో 10 శాతం పెరిగి 135 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. సామాజిక విబేధాలు, ఆర్థిక వృద్ధి క్షీణించడం, కరువు వంటి వాతావరణ సంబంధిత సంఘటనలు ఈ పెరుగుదలకు కారణాలని రిపోర్టు వివరించింది. (చదవండి: వాట్సాప్ యూజర్లకు శుభవార్త) పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో 183 మిలియన్ల మంది ఆహార సంక్షోభం ఎదుర్కొంటారని అంచనా వేసింది. కరోనా విజృంభణకు పూర్వం డేటా ప్రకారమే ప్రస్తుత రిపోర్టు తయారు చేశామని.. కోవిడ్-19తో పరిస్థితులు మరింత దారుణం కానున్నాయని రిపోర్టు రచయితలు పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా కింది స్థాయిలో ఉన్నవారు కోవిడ్ బాధితులుగా మారితే.. నష్టం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సమాజం సమన్వయం చేసుకుని.. త్వరితగతిన చర్యలు చేపట్టి ఆహార సంక్షోభం నుంచి బయటపడేందుకు పేదలకు తోడుగా నిలవాలని తెలిపారు. కాగా, ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రతియేడు ‘గ్లోబల్ రిపోర్టు ఆన్ ఫుడ్ క్రైసిస్’ నివేదిక రూపొందిస్తాయి. (చదవండి: కరోనా : అమ్మా! మీ సేవకు సలాం) -
సుసంపన్నం దుంప పంటల వైవిధ్యం
ప్రజల ఆహారంలో ధాన్యాల తర్వాత అంత ప్రాధాన్యం కలిగినవి దుంపలు. దుంప పంటలు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేవి బంగాళ దుంప, కంద, చేమదుంప, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఇంకా చెప్పాలంటే కర్రపెండలం, తాటి తేగలు కూడా. అయితే, మనకు తెలియని దుంప పంట రకాలు మరెన్నో ఉన్నాయి. ఈ పంటల జీవవైవిధ్యం చాలా సుసంపన్నమైనది. గ్రామీణులు, ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలకు ఆహార భద్రతను కల్పిస్తున్నప్పటికీ దుంప పంటలు జీవవైవిధ్యం క్రమంగా అంతరించిపోతోంది. భూసార క్షీణత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూతాపోన్నతిని దీటుగా ఎదుర్కోవడంలో దుంప పంటలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ దృష్ట్యా దుంప పంటలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని ఎలుగెత్తి చాటడం కోసం సహజ సమృద్ధ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఇటీవల మైసూరులో ఇటీవల జరిగిన ప్రత్యేక దుంప పంటల ప్రదర్శన దక్షిణాదిలో దుంప జాతుల జీవవైవిధ్యానికి అద్దం పట్టింది. వివిధ దుంప జాతులను తోటల్లో అంతర పంటలుగా పండించుకొని పరిరక్షించుకోవచ్చు. దుంప జాతుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం, వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారంలోకి తేవడం కోసం సహజ సమృద్ధ సంస్థ నాబార్డు తోడ్పాటుతో ఇటీవల కేలండర్‌ను ప్రచురించడం విశేషం. గతంలో దేశీ వరి వంగడాలు, చిరుధాన్యాలపై కూడా కేలండర్లను ఈ సంస్థ ప్రచురించింది. దుంప పంటలు, వంటల కేలండర్ ధర రూ. 75. వివరాలకు.. బెంగళూరులోని సహజ మీడియా వారిని 70900 09922 నంబరులో సంప్రదించవచ్చు. -
‘సాక్షి’ కథనంపై స్పందించిన ఉపరాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు, పేరంటాలు, వేడు కల్లో ఆహారం వృథా అవుతోందన్న అంశాన్ని వివరిస్తూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కాస్త.. చూసి వడ్డించండి’ అనే కథనంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఉపరాష్ట్రపతి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘సాక్షి’ కథనాన్ని ప్రస్తావించారు. ‘ఆహార భద్రతపై చర్చ జరుగుతున్న సమయంలో.. వివా హాది శుభకార్యాల్లో పరబ్రహ్మ స్వరూపమైన అన్నం 20 నుంచి 25 శాతం చెత్తకుప్పల పాలవుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తాజా సర్వేలను ఉటంకిస్తూ ‘సాక్షి’పత్రికలో సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి రాసిన కథనాన్ని అందరూ చదివి ఆలోచించాల్సిన తరుణమిది’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ‘మన సంప్రదాయ పద్ధతిలో అతిథులకు స్వయంగా వడ్డించినప్పుడు తక్కువ మొత్తంలో.. బఫే పద్ధతిలో ఎక్కువగా వృథా జరుగుతోందనే విషయాన్ని మనం గమనించాలి. ఈ మధ్య అలంకరణలతో పాటు విందుల్లో ఆడంబరాలు ఎక్కువవుతున్నాయి. ఈ దుబారా, ఆడంబరాలపై అందరం ఆలోచించి వీటిని అరికట్టేందుకు ఉపక్రమించాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. (చదవండి: కాస్త.. చూసి వడ్డించండి) ఆహార భద్రతపై చర్చ జరుగుతున్న సమయంలో.. వివాహాది శుభకార్యాల్లో పరబ్రహ్మ స్వరూపమైన అన్నం 20-25% చెత్తకుప్పల పాలవుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తాజా సర్వేలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రికలో శ్రీ సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి రాసిన కథనాన్ని అందరూ చదివి ఆలోచించాల్సిన తరుణమిది.— Vice President of India (@VPSecretariat) December 1, 2019 -
కాస్త.. చూసి వడ్డించండి
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’అని భోజనాన్ని దైవంతో పోలుస్తాం. ఇలాంటి మన దేశంలో ఆహార పదార్ధాల వృథా పెరిగిపోతోంది. ఓ పక్క దేశంలో ఆహార భద్రత కరువై పేదలు ఆకలితో అలమటిస్తుంటే.. మరోపక్క పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు, శుభకార్యాల పేరిట చేస్తున్న హం గామాతో వేల కోట్ల విలువైన ఆహారం చెత్తకుప్పల్లోకి వెళుతోంది. దేశ వ్యాప్తంగా ఏటా జరుగుతున్న శుభకార్యాల ద్వారా కనిష్టంగా 20 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతోందని, దాని విలువ కనిష్టంగా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ అంచనా వేసింది. ఆర్థిక, సామాజిక పరపతిని చూపించుకోవడం కోసం ఎక్కువ సంఖ్యలో వంటకాలు పెట్టడం, భారీ సంఖ్యలో జనం హాజరైన సందర్భాల్లోనే వృథా ఎక్కువగా ఉంటోందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. 75 రోజులు.. 838 కార్యక్రమాలు.. ఓ సర్వే దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో 21.4 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కరువైంది. మూడేళ్లలోపు చిన్నారుల్లో 46% మంది ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఆహార కొరత కారణంగా 23% మంది తక్కువ బరువు తో పుడుతున్నారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాల పేరిట భారీగా ఆహార వృథా దేశాన్ని పట్టి పీడుస్తోందని కేంద్రం గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు.. అసలు ఎక్కడెక్కడ వృథా ఎక్కువగా ఉంది.. ఆర్థిక ప్రభావం ఏయే సందర్భాల్లో వృథా పెరుగుతోంది.. వంటి అంశాలపై కేంద్ర ఆహార సంస్థ ప్రధాన పట్టణాల్లో సర్వే చేయించింది. దేశవ్యాప్తంగా 75 రోజుల పాటు ఆతిథ్య రంగ సంస్థలు, వివిధ రకాల ప్రజలు, చెత్త నిర్వహణ సిబ్బందితో విడివిడిగా ఓ కమిటీతో అభిప్రాయ సేకరణ చేసింది. 838 వివాహాది శుభకార్యాలను, సాంఘిక జన సమీకరణ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. దీనిని విశ్లేషించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. ముఖ్య పరిశీలనలు ఇలా.. - వివాహాది కార్యక్రమాల సమయంలో వృథా ఎక్కువగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 89 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత వార్షికోత్సవాలు, పుట్టిన రోజు వేడుకల్లో వృథా ఎక్కువని 32.5 శాతం ప్రజలు అభిప్రాయాలు చెప్పారు. - ఆతిథ్య రంగ సంస్థలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో 15 నుంచి 25 శాతం వృథా ఉంటోందని 44.9 శాతం ప్రజలు తెలిపారు. - వృథా అవుతున్న దాంట్లో 67.9% ఎక్కువ వంటకాలు వడ్డించి నప్పుడు, 57.4% భారీగా జనాలు హాజరైనప్పుడు ఉంటోంది. ఇందులో కూరగాయల భోజనంలో వృ«థా ఎక్కువగా ఉండగా, బియ్యం, బిర్యానీ వంటకాలను ఎక్కువగా పారేస్తున్నారు. - కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డించిన సమయంలో ఆహార వృథా 11.45 శాతమే ఉంటుండగా, క్యాటరింగ్ నిర్వాహకులు వడ్డిస్తే 14.45 శాతం ఉంటోంది. బఫేలో అయితే ఈ వృథా 74.95 శాతం ఉంటోంది. - వడ్డించకుండా వదిలేసిన, లేక మిగిలిన వంటకాలను చారిటీలకు లేక ఎన్జీవోలకు దానం చేసే విధానం 7.2 శాతం మాత్రమే ఉండగా, 15.6 శాతం వివిధ సందర్భాల్లో జరుగుతోంది. 77.2 శాతం మాత్రం పూర్తిగా వృథాగానే పారేస్తున్నారు. 10 వేల కోట్ల వృథా.. దేశంలో ఆర్థిక సంపద పెరుగుతున్న మాదిరే మధ్య, దిగువ తరగతి సంపద వృద్ధి చెందుతోందని, దీనికి అనుగుణంగానే శుభకార్యాల నిర్వహణ, వాటిల్లో ఆహార వంటకాలపై ఖర్చు పెరిగిందని కేంద్రం అధ్యయనం తేల్చింది. సమాజంలో ఆర్ధిక పరపతిని చూపేందుకు, సామాజికంగా తన బలాన్ని తెలిపేందుకు కార్యక్రమాల్లో విరివిగా ఖర్చు చేసేందుకు ప్రజలు వెనుకాడటం లేదని గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏటా రూ.1.10 లక్షల కోట్లు శుభకార్యాలపై ఖర్చు చేస్తుండగా, ఇందులో రూ.40 వేల కోట్ల మేర అంటే దాదాపు 40 శాతం ఆహార వంటకాలపై వెచ్చిస్తున్నారు. ఇందులో 15 నుంచి 25 శాతం అంటే రూ.10 వేల కోట్ల ఆహార వృథా ఉంటోంది. వంటకాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు, భారీగా జనాలు హాజరైనప్పుడే వృథా ఎక్కువగా ఉంటోందని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో ఏటా పెళ్లిళ్లు, ఇతర సామూహిక సమ్మేళనాల పేరిట రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని అంచనా ఉంది. ఇందులో రూ.4 వేల కోట్ల మేర వంటకాలపై ఖర్చు చేస్తున్నా, ఆహార వృ«థా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని కేంద్ర నివేదిక ఆధారంగా తెలుస్తోంది. కమిటీ ప్రతిపాదనలు ఇలా.. - అతిథుల సంఖ్యను పరిమితం చేయడం అనేది సాధ్యం కాదు కనుక ఆహార వృథాపై అవగాహన కల్పించడమే సరైన మార్గం. - కొన్ని స్వచ్ఛంద సంస్థలకు నిధులు కేటాయించి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసేలా చూడాలి. - ప్రభుత్వ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా ఒక ప్రణాళిక లేకపోవడంతో ఆహార వృథా అవుతోంది. దీన్ని నివారించాలి. - ఆహ్వాన పత్రికల మీద ఆహార వృథాపై అవగాహన సందేశాలతో పాటు కార్యక్రమానికి హాజరయ్యేది, లేనిది ముందే సమాచారం ఇచ్చేలా ఆహ్వానితులకు అవగాహన కల్పించాలి. - ఆహారాన్ని గౌరవించేలా, వృథా వల్ల జరిగే నష్టాన్ని వివరించి చెప్పేలా విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఈ అంశంపై బోధన ఉండాలి. - అస్సాం, రాజస్థాన్, మిజోరం, జమ్మూకశ్మీర్‌లో గెస్ట్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆరు రకాలైన వంటకాలు మాత్రమే శుభకార్యాల్లో వడ్డించాలనే నిబంధన ఉంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఫలితం ఉంటుంది. - (సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి) -
ఎన్‌రిప్.. 'పండంటి' ఆరోగ్యానికి టిప్!
సాక్షి, హైదరాబాద్: పండ్లను మగ్గబెట్టే క్రమంలో అటు పర్యావరణానికి, ఇటు మానవ ఆరోగ్యానికి హానికలిగించే రసాయన కారకాలను పూర్తిగా నిర్మూలించాలని తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇథిలిన్ వినియోగంతో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ‘ఎన్‌రిప్’అనే ఉత్పత్తులను వినియోగించనుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించే మామిడి, నారింజ, అరటి పండ్లను మగ్గబెట్టే క్రమంలో భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించనుంది. బెంగళూరులోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మామిడి, అరటి పండ్లపై ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపిన అనంతరం ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’కూడా ఈ ఉత్పత్తులను అనుమతించింది. దీంతో మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సహకారంతో ఉద్యాన శాఖ ముందుగా రాష్ట్రంలోని పెద్ద పండ్ల మార్కెట్లలో త్వరలోనే ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించి పండ్లను మగ్గబెట్టడంపై పరిశీలన జరపనుంది. వెంటనే ప్రారంభించండి త్వరలోనే మామిడి పండ్ల సీజన్ రానున్నందున ‘ఎన్‌రిప్’పరిజ్ఞానం వినియోగంపై ప్రయోగం చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పేరుగాంచిన గడ్డిఅన్నారం, జగిత్యాల, వరంగల్ మార్కెట్లలో ప్రయోగాలు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. వీటిలో త్వరలోనే ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించి పండ్లను మగ్గబెట్టాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆ ప్రకారం పండ్లను మగ్గబెట్టే వ్యాపారులు లేదా ఏజెంట్లు ఎప్పటికప్పుడు నమూనాలను పరిశీలించి తాము అనుసరిస్తున్న పద్ధతుల్లో ‘ఎసిటిలిన్’లేదా ‘కార్బైడ్’లను వినియోగించడం లేదని ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ కూడా ఆ విధానాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు గతంలో మాదిరిగా వ్యవసాయ క్షేత్రాల్లోనే ‘ఇథిలిన్’పౌడర్ ద్వారా మగ్గబెట్టే విధానాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యాల్షియం కార్బైడ్‌తో అనర్థాలివే - కాల్షియం కార్బైడ్ వినియోగం ద్వారా వెలువడే కార్బైడ్, ‘ఎసిటిలిన్’వాయువు ద్వారా పండ్లను మగ్గబెట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరమంటూ 2011 నుంచి ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ఈ పద్ధతిని అనుమతించడం లేదు. - ఈ పద్ధతిలో పండ్లను పక్వానికి తెచ్చే పనిని చేపట్టే కార్మికులు, ఆ వ్యాపారులు, పండ్లు అమ్మే చిరు వ్యాపారులు, వారితో కలిసి జీవించే వారి కుటుంబీకులతో పాటు పండ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా కార్బైడ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. - ఈ పండ్లు తినే చిన్నారులు, వృద్ధులతో పాటు గర్భిణుల ఆరోగ్యానికి ముప్పు. - మగ్గబెట్టిన పండ్లను రవాణా చేసే సమయంలో అవి పాడుకాకుండా ఉండేందుకు క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించడం వల్ల హానికర వాయువులు వెలువడి పర్యావరణంతో పాటు పంటలు, ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. దీంతో ‘ఇథిలిన్’తో పాటు ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించాలని నిర్ణయించింది. -
జాతీయ భద్రత, ఆర్ధిక ప్రగతే లక్ష్యం : నిర్మలా సీతారామన్
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నవ భారత్ కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. లోక్‌సభలో శుక్రవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీతారామన్ జాతీయ భద్రత, ఆర్థిక ప్రగతి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆహార భద్రతపై ఖర్చును రెట్టింపు చేశామని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ మార్పు చూడగలిగేలా చేశామని అన్నారు. దేశంలోని ప్రతి మూలకూ పథకాలను ప్రజలకు చేరువ చేశామని చెప్పారు. సంస్కరణలు పనిచేయడం ద్వారా కొత్త ఒరవడి సృష్టించామని అన్నారు. -
నాణ్యమైన విత్తనోత్పత్తే ‘ఇస్టా’ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విత్తనోత్పత్తిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వాయస్ అన్నారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఆండ్రియాస్ ఇస్టా సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా నోవాటెల్ లో తనను కలిసిన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంలో విత్తన నాణ్యతే ప్రధానమని ఆయన అన్నారు. అధిక దిగుబడులు సాధించడానికి మెరుగైన విత్తనాలు అందిం చేలా నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడమే తమ బాధ్యత అని చెప్పారు. ఇది ఒకరకంగా సీడ్ పాస్‌పోర్టు లాంటిదన్నారు. అంతర్జాతీయ విత్తన వ్యాపారంలో ఇస్టా సర్టిఫికేషన్ కీలకమని చెప్పారు. అమెరికా, యూరప్ తదితర 80 దేశాల్లో విత్తన రవాణా, అంతర్జాతీయ విత్తన వ్యాపారానికి ఇస్టా సర్టిఫికెట్ అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లలో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే వాటికి సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఏటా 2 లక్షల సర్టిఫికెట్లను జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఇస్టా అధ్యక్ష ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి వార్షిక సమావేశాల్లో మాత్రమే జరుగుతాయన్నారు. అలాగే కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. అంతర్జాతీయం గా సభ్యత్వం ఉన్న దేశాల సభ్యులు ఇస్టా ఎన్నికల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎన్నికల్లో భారతదేశానికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ఇస్టాలో కీలకస్థానంలో ఉన్న తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులుకు సముచిత స్థానం ఇస్తారా అని ప్రశ్నించగా, వచ్చే నెల మూడున జరిగే ఎన్నికల వరకు ఆగాలని ఆయన బదులిచ్చారు. సరైన విత్తనాలులేకే ఆత్మహత్యలు నాణ్యత, విత్తన జెర్మినేషన్ ఉండే హైక్వాలిటీ విత్తనా లకే అనుమతిస్తామని, ప్రభుత్వ ల్యాబ్‌లు, ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఏ దేశానికైనా వాతావరణం అనుకూలించడంతో పాటు విత్తన పరీక్షలు నిర్వహించే ల్యాబొరేటరీలు అవసరమన్నారు. 150 ఏళ్ల క్రితమే జర్మనీలో విత్తనాల పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేశారన్నారు. మంచి నాణ్యమైన విత్తనాలు వినియోగిస్తేనే పంట దిగుబడి వస్తుంది. సరైన విత్తనాలు వినియోగించక పోవడం వల్ల ఇండియాలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే నాణ్యమైన విత్తనాలు అందించాలి. విత్తనాలు మొలకెత్తే సామర్థ్యాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు అందించడం ద్వారా రైతులను రక్షించుకోవాలి. కొత్త వంగడాలు అందించాలి. వాతావరణ, పర్యావరణ మార్పులు ఇక్కడి రైతుల జీవన విధానంపై ప్రభా వం చూపుతాయన్నారు. రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టి పండించినా సరైన దిగుబడులు రాక నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందన్నారు. ప్రత్యేక వ్యవసాయ విధానం అవసరం... ‘విత్తనాల ఉత్పత్తిలో ప్రత్యేక విధానాలను అవలంబించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను పండించాలి. నీటి వినియోగం, వనరులు, భూసార పరీక్షలు అందుబాటులో ఉండాలి. వర్సిటీలు, పరిశోధన సంస్థలు ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను రూపొందించాలి. నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చు. రెట్టింపు దిగుబడి సాధించే విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడి రైతులు పంట పండించడానికి కష్టపడుతున్నారు. హైక్వాలిటీ విత్తనాల ద్వారానే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దిశలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందించి రైతులకు తోడ్పడా లి. విత్తన రంగంలో ఏ విత్తనాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వాలకు, రైతులకు వివరించి ఆహార భద్రతపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యం’ అని ఆండ్రియాస్ అన్నారు. -
చౌకగా పౌష్టికాహారం!
సాక్షి, హైదరాబాద్: ప్రజలందరికీ పౌష్టికాహారం అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరగాల్సిన అవసరముందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, పౌష్టికత, ఆరోగ్యం అనే అంశాలపై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు ఒకటి మొదలైంది. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌గా పిలుస్తున్న ఈ సదస్సును ఇక్రిశాట్, ఎన్ఐఎన్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసన్, సీజీఐఏఆర్లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో 35 దేశాలకు చెందిన సుమారు 3,560 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. వ్యవసాయం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం ఎలా? తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఎలా? అనే అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. సదస్సు ప్రారంభం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజీఐఏఆర్ పరిశోధనా విభాగం అగ్రికల్చర్ ఫర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ డైరెక్టర్ జాన్ మెక్‌డర్మెట్ మాట్లాడుతూ.. ఆహార భద్రత కోసం భారత్ దశాబ్దాల క్రితం చేపట్టిన హరిత విప్లవం మంచి ఫలితాలిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పౌష్టికాహార లభ్యతపై దృష్టి పెట్టడం అవసరమని అన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం వరి, గోధుమ వంటి ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే విధానాలను అవలంబించిందని.. వీటిని మార్చుకుని పుష్టినిచ్చే కాయగూరలు, పప్పు దినుసులు, చేపలు, ఆకుకూరల పెంపకానికి అనువైన విధానాలను సిద్ధం చేయాలని సూచించారు. లింగ వివక్ష కోణమూ ఉంది: కడియాల సంగీత వ్యవసాయం, ఆరోగ్యం, పౌష్టికతల్లో లింగ వివక్ష కోణమూ ఉందని.. పొలాల్లో ఎక్కువ కాలం పనిచేసే మహిళలు పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఇది కాస్తా వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ కడియాల సంగీత తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ముంచుకొస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌లో భాగంగా తాము ఆయా రంగాల్లో వస్తున్న కొత్త కొత్త అధ్యయనాల ఫలితాలను ఆచరణ రూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ చర్యలు కీలకమని అన్నారు. పౌష్టికాహారం పొందేందుకు ఆదాయం ముఖ్యమైన అంశమైనప్పటికీ అదొక్కటే కారణం కాదని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం అధిక దిగుబడుల కోసం మాత్రమే కాకుండా.. పోషకాలు అందించేలా మారాల్సిన అవసరముందని చెప్పారు. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌కు ఆతిథ్యం ఇస్తున్న జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ భారతీ కులకర్ణి మాట్లాడుతూ, పౌష్టికాహారం విషయంలో ఎన్ఐఎన్ విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తోందని.. ప్రభుత్వానికి విధానపరమైన సలహాలు, సూచనలు ఇస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త జి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపార దృక్పథంతో వ్యవసాయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని వ్యాపార దృక్పథంతో చూడాలని, అప్పుడే రైతుకు మెరుగైన ఆదాయం సమకూరుతుందని కేంద్రం కీలక సిఫార్సు చేసింది. రైతు ఆదాయం రెట్టింపుపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికపై వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే కేవలం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలతోనే సరిపోదని, వ్యవసాయాన్ని వ్యాపారం వైపు బదలాయించాల్సిన అవసరముందని విశ్లేషించింది. వినియోగదారుడి అవసరాలే కేంద్రంగా వ్యవసాయం చేస్తే పెద్ద ఎత్తున లాభాలు గడించవచ్చని పేర్కొంది. అలాగే వ్యవసాయ రంగాన్ని ఆధునికత వైపు పరుగులు పెట్టించాలని పేర్కొంది. దేశంలో 85 శాతం మంది రైతులు సన్న, చిన్నకారు రైతులేనని, వారి చేతుల్లో అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన కమతాలు ఉన్నాయని పేర్కొంది. అటువంటి వారికి సాగు ఖర్చు తగ్గించేలా వ్యవసాయ యాంత్రీకరణ కల్పించాలని వివరించింది. దేశంలో వ్యవసాయం రైతుకు లాభసాటిగా లేదు. 2011–12 నాటి లెక్కల ప్రకారం సాగుచేసే రైతు ఆదాయం ఏడాదికి రూ. 78,264 ఉంటే, వ్యవసాయ కూలీ ఆదాయం రూ. 32,311 ఉండగా, వ్యవసాయేతర కార్మికుడి ఆదాయం రూ. 2.46 లక్షలుగా ఉంది. మొదటి నుంచీ రైతు పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో రైతులు అప్పులపాలవుతున్నారు. ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. దేశంలో మూడో వంతు రైతులు వరి లేదా గోధుమలే పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సిఫార్సులు చేసింది. ప్రధాన సిఫార్సులు.. - యాంత్రీకరణను అందిబుచ్చుకుంటే ఉత్పాదకతలో ఉన్న భారీ తేడాను అధిగమించవచ్చు. దీనివల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా చూసుకోవచ్చు. - సూక్ష్మసేద్యంతో ఉత్పాదకతను పెంచుకోవచ్చు. అలాగే సాగునీటి వసతులు కల్పిస్తే ఉత్పాదకత పెరుగుతుంది. - అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను తయారు చేయడం వల్ల కూడా ఉత్పాదకత పెరుగుతుంది. దీనివల్ల రైతులకు అధిక ఆదాయం సమకూరుతుంది. - వ్యవసాయ పరిశోధనలపై పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల పరిశోధన, విస్తరణ రంగాలపై దృష్టి సారించాలి. - ప్రస్తుత ధరల విధానాన్ని ఆధునీకరించాలి. గత నాలుగున్నర దశాబ్దాలుగా దేశంలో కేవలం వరి, గోధుమల మద్దతు ధరపైనే దృష్టి సారించారు. దీనివల్ల ఇతర ఆహారధాన్యాల సాగు, ఆదాయంలో అనేక తేడాలు కనిపించాయి. వాటి ధరలు తగ్గడంతో రైతులు ఆదాయం కోల్పోయారు. - మార్కెట్లో ధరల తీరుపై రైతుకు ఎప్పటికప్పుడు అందించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించాలి. - సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులో ఉంచితే వారి ఆదాయం కూడా పెరుగుతుంది. - గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గ్రామీణ రోడ్లు, విద్యుత్ సరఫరా, రవాణా సదుపాయాలు కల్పించాలి. తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించాలంటే ఇవన్నీ అవసరం. ఫలితంగా వారు అధిక ఆదాయం పొందుతారు. - మార్కెట్లలోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల పంటల నాణ్యత పెరుగుతుంది. నష్టం తగ్గుతుంది. ప్రధానంగా నిల్వ, ట్రేడ్ రంగాల్లో అనేక మార్పులు తీసుకురావాలి. - అత్యంత కీలకమైన రుణ సదుపాయం రైతుకు అందాలి. అప్పుడే పంటల సాగు, విత్తనాలు, ఎరువుల వంటి వాటికి ఇబ్బంది ఉండదు. ఈ విషయంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. -
‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మేనిఫెస్టోలో చేర్చండి’
హైదరాబాద్: అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దిష్టంగా పొందుపర్చి ఆ మేరకు నడుచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కాలుష్యం ప్రధాన సమస్యగా మారిందని, పర్యావరణ పరిరక్షణకు ఏ రాజకీయ పార్టీ కూడా తగిన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నా రు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) ఆధ్వర్యంలో ‘ప్రిపేరింగ్ తెలంగాణ ఫర్ ఎ గ్లోబల్ ఛేంజ్’పేరుతో 17 అంశాలతో రూపొందించిన సమీకృత ఎన్నికల ప్రణాళిక–2018ను ఆవిష్కరించారు. ఇండిపెండెట్ పాలసీ ఎక్స్పర్ట్ డాక్టర్ నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి, సీజీఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన 17 అంశాల్లో ఒక్కో అంశంపై ఆయా రంగాల నిపుణులు ప్రసంగించారు. మేనిఫెస్టోలో ప్రధానంగా జీవావరణ సంబంధమైన జీవనోపాధి, హరిత నైపుణ్యం, పర్యావరణ సుస్థిరాభివృద్ధి, ఇంధనాలు, ఆహార భద్రత వంటి అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. ఈ మేనిఫెస్టోను అన్ని పార్టీల అధినాయకులకు అందిస్తామని చెప్పారు. సీజీఆర్ ఆధ్వర్యంలో నవంబర్ 17న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ ఇంజనీర్ డాక్టర్ కేశవరెడ్డి, పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు. -
కావాల్సింది ‘పౌష్టికాహార భద్రత’
‘ఈసురోమని మనుషులుంటే.. దేశమేగతి బాగు పడునోయ్’ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ జాతి నిర్మాణానికి అక్కరకొచ్చే ఆరోగ్యవంతులు ఎంతమంది అన్నది ప్రశ్నార్థకం. దేశంలో మెజారిటీ ప్రజ లకు సమతులాహారం, ఆహార భద్రత మాట అటుంచి కనీసం పొట్ట నింపుకోవడానికి కనీస పోషకాహారం కూడా దొరకని దుస్థితి ఈనాటికీ సమాజంలో తొలగిపోలేదు. అక్టోబర్ 16న జరిగిన ‘ప్రపంచ ఆరోగ్య దినం’ సందర్భంగా వివిధ దేశాల ఆహార భద్రతపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదిక భారతదేశానికి సంబంధించి మింగుడుపడని ఓ చేదు మాత్ర. ఈ నివేదికలో అనేక ఆందోళనకర వాస్తవాలు వెలుగుచూశాయి. 130 కోట్లమంది భారతీయుల్లో 14% మంది ప్రజలు ప్రతిరోజూ కడుపునిండా తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. దేశంలోని ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు పోషకాహారలేమితో బాధపడుతుంటే, 5 ఏళ్లలోపు పిల్లల్లో 20% మంది పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. ఏటా దేశంలో 10 లక్షల 95 వేల మంది పోషకాహార లేమికి సంబంధించిన జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యధిక శాతం ప్రజలకు కేవలం పోషకవిలువలున్న సమతుల ఆహారం అందుబాటులో లేదు. ఆర్థిక ప్రగతిలో భారత్ వేగం రెండంకెలు దాటుతున్న మాట నిజం. గత రెండు దశాబ్ధాలకుపైగా భారతదేశం సాంకేతికంగా, వైజ్ఞానికంగా వడివడిగా ముందుకు సాగుతున్నది. 2022 నాటికి భారత్ ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్ను దాటుతుందని ప్రపంచ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రగతిని చూసి సగటు భారతీయుడు మురిసిపోవాలా? లేక ఆర్థికాభివృద్ధి రేటుతో సమాంతరంగా పెరుగుతున్న సగటు మానవుని ఆకలి కేకల్ని చూసి బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితి దేశంలో నెలకొంది. ఇందుకు ఆర్థిక అసమానతలు పెరగడం, పేద, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తి క్షీణించడమే. 2014–2017 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆకలికి బలైపోయిన వారి సంఖ్య 82 కోట్లకు చేరగా అందులో భారత్‌లో 32 లక్షల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఆహారధాన్యాల లభ్యత, పౌష్టికాహార లోపం, అస్తవ్యస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తయారుచేసిన ఈ నివేదికలో.. 119 దేశాల ఆకలి సూచీలో భారత్ 100వ స్థానంలో నిలిచింది. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ మనకంటే మెరుగ్గా 88వ ర్యాంకులో నిలువడం గమనార్హం! తలసరి ఆదాయాలు పెరుగుతున్నా, కేంద్ర బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు చేరుతున్నదని గొప్పగా చెప్పుకున్నా అవేవీ దేశ ప్రజల ఆకలిని సంపూర్ణంగా తీర్చలేకపోతున్నాయి. పరిస్థితి చేయి దాటుతోం దంటూ ఐక్యరాజ్య సమితి భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 60వ దశకం చివర్లో సాధించి, అమలులోకి తెచ్చిన హరితవిప్లవం 90వ దశకం వరకూ దేశ ఆహార భద్రతను పెంచింది. అయితే, ఆ తర్వాత దేశంలో, అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీశాయనే చెప్పాలి. 1954లో తలసరి ఆహార ధాన్యాల లభ్యత సగటున ఏడాదికి 167.1 కిలోలు ఉండగా, హరిత విప్లవం వచ్చాక అది గరిష్టంగా 1968లో 187.2 కిలోలకు పెరిగింది. ఆ తర్వాత ఆ మొత్తం తగ్గుతూ 2005 నాటికి 154.2 కిలోలకు పడిపోయింది. 2016–17 నాటికి దేశంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఏడాదికి 160 కిలోల వద్దకు చేరుకొంది. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగడం లేదన్నది సుస్పష్టం. ఐక్యరాజ్య సమితి రూపొందించిన 17 అభివృద్ధి లక్ష్యాలలో ప్రజ లందరికీ ఆహార భద్రత ప్రధానమైనది. నిజానికి, దేశ ప్రజలకు ఆహార భద్రతను కల్పించడమే కాకుండా పోషకాహార భద్రతపైకి దృష్టి మళ్లిం చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలు అన్నీ వ్యవసాయ, ఆరోగ్య, పోషకాహార రంగాలను అనుసంధానం చేసి అమలు చేస్తే.. దేశంలో ఆహార భద్రతతోపాటు పౌష్టికాహార భద్రత కూడా సాధించవచ్చు. వ్యాసకర్త: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
భూగోళంపై ఆకలి కేకలు
వాతావరణంలో ఏర్పడిన తీవ్రమైన మార్పులతో ప్రపంచ ప్రజల ఆకలి అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆహార కొరత కొద్దిగా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం జనాభాలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. తీవ్రమైన వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమని కూడా స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన 2018 పౌష్టికాహారం, ఆహారభద్రతా రిపోర్టు ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై హెచ్చరికలు జారీచేసింది. 2015 నుంచి గత మూడేళ్ళుగా వరసగా ప్రపంచ ప్రజలు ఆకలితీవ్రత ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని అధ్యయనం తేల్చిచెప్పింది. గత ఒక్క యేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 8.21 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాలు తీవ్రమైన ఆహార కొరతతోనూ, పౌష్టికాహారలోపాన్నీ ఎదుర్కొంటున్నాయి. ఆసియాలో 50 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు కరువు కాటకాలు తాండవిస్తోంటే, మరోవైపు నదులు, సముద్రాలు పొంగిపొర్లి వరదలు ముంచెత్తుతున్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ రెండు భిన్నమైన పరిస్థితులే 2017లో ఆర్థిక కుంగుబాటుకీ, ఆకలికీ కారణమౌతున్నాయని గుర్తించింది. దీంతో దాదాపు కోటి మంది ప్రజలు ఆకలి నుంచి విముక్తికోసం అర్థిస్తున్నట్టు వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నమోదౌతోన్న అధిక ఉష్టోగ్రతలు చివరకు ఆకలి ప్రపంచాన్ని సృష్టించాయని ఆక్స్‌ఫామ్ జిబిలో ఆహారమూ, వాతావరణ విధానాల శాఖాధిపతి రాబిన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా 2018లో సైతం తీవ్రమైన వాతావరణ సంక్షోభాన్ని చూసామన్నారు. గత కొద్ది నెలలుగా పరిస్థితి మరింత భయానకంగా తయారైందన్నారు. ఐక్యరాజ్య సమితి రిపోర్టు ప్రకారం ప్రపంచంలో తీవ్రమైన వాతావరణ సంక్షోభం ఉన్నప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వర్షపాతంలో మార్పుల వల్ల గత ఐదేళ్ళలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనీ, దీనివల్ల గోధుమ, వరి లాంటి కీలక పంటలు దెబ్బతింటున్నాయనీ రిపోర్టు వెల్లడించింది. కరువు కాటకాలను తట్టుకునేందుకు తక్కువ నీళ్ళు అవసరమైన పంటలను వేయడం వర్షపాతానికి అనుగుణంగా పంటమార్పిడీ పద్ధతులను అవలంభించక తప్పని పరిస్థితి రైతులకు ఎదురయ్యింది. యూనిసెఫ్, వ్యవసాయాభివృద్ధి సహాయక సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, పౌష్టికాహారం 2018 నివేదికని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఆకలినీ, పౌష్టికాహారలోపాన్నీ జయించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తక్షణమే తీవ్ర వాతావరణ మార్పులపై స్పందించాలని ఈ రిపోర్టు ముందు మాటలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6.72 కోట్ల మంది ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్తూలకాయంతో అవస్త పడుతున్నవారే. పౌష్టికాహారలోపమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా 1.51 కోట్ల మంది ఐదేళ్ళలోపు పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లలు ఉండాల్సిన ఎత్తుకంటే చాలా పొట్టిగా ఉండడానికి సైతం పౌష్టికాహారలోపమే కారణం. అయితే 2012లో ప్రపంచవ్యాప్తంగా 1.65 కోట్ల మంది చిన్నారులు ఎదుగుదలా లోపంతో ఉన్నారు. 2012 కంటే ఇప్పుడు కొంత మెరుగైనా మొత్తం ఆసియాలోనే 55 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులను ఎదుగుదల లోపం బాధపెడుతోంది. ప్రతి ముగ్గురు గర్భిణీల్లో ఒకరు రక్తహీనతతో అనారోగ్యంపాలవుతున్నారు. ఇది వారి పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 శాతం పిల్లలకే ఆరునెలల పాటు తప్పనిసరిగా యివ్వాల్సిన తల్లిపాలు లభ్యం అవుతున్నట్టు ఈ నివేదిక తేల్చింది. -
‘ఆహారభద్రత’కు మోక్షమెప్పుడో!
కరీంనగర్ సిటీ: ఆహారభద్రత కార్డుల జారీ విషయంలో జిల్లా యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా కొత్త లబ్ధిదారులు వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు తీసుకునే వీలు లేకుండాపోతోంది. ఆగస్టు 15 నుంచి ఆహారభద్రత కార్డు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. గడువు దగ్గర పడుతున్నా లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులు సమగ్ర విచారణ పేరుతో రెవెన్యూ అధికారుల జాప్యం.. హార్డ్‌కాపీలు అందకపోవడంతో సంబంధిత పౌరసరఫరాల శాఖ ఆన్లైన్ మంజూరు చేయకపోవడం వెరసి ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లాలో మొత్తంగా 13,000 మంది కొత్త రేషన్‌కార్డుల మంజూరుతోపాటు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోగా 8,900 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఆహారభద్రత కార్డులపై అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి హడావుడి చేసిన ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. కేవలం కార్డుల లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన డేటా, వినియోగదారుని ఆధార్ సంఖ్య ఆధారంగానే రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తున్నారు. ఆహారభద్రత కార్డుల జారీకి ప్రభుత్వం నూతన విధానాన్ని చేపట్టి సులభతరంగా చేసినా కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తుల విచారణ వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు. రాష్ట్రస్థాయిలో మంజూరు విధానాన్ని పక్కనపెట్టి జిల్లా స్థాయిలోనే దరఖాస్తులను పరిశీలించి అనుమతి జారీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. క్షేత్రస్థాయిలోనే ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్తగా రేషన్‌కార్డు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని మూడు నెలల కిందట ప్రభుత్వం సూచించింది. 13,400 దరఖాస్తులు.. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఆహారభద్రత కార్డులకు 13,400 దరఖాస్తులు వచ్చాయి. వీటిని రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించి కార్డు మంజూరుకు పౌరసరఫరాలశాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుంచి కొత్తరేషన్ కార్డులు జారీకి అర్హులను గుర్తించి, వచ్చే నెల నుంచి వారికి రేషన్ సరుకులు పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా 7,200 కొత్త కార్డుల కోసం దరఖాస్తులు రాగా 6,200 మ్యుటేషన్లు (మార్పులు, చేర్పుల) కోసం వచ్చాయి. జిల్లాలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన దరఖాస్తులు 7 వేలకు పైగానే ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించిన దరఖాస్తులు పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పౌరసరఫరాలశాఖకు 6 వేల దరఖాస్తులు హార్డ్‌కాపీల రూపంలో అందగా అందులో 1,500 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఆన్లైన్లో అనుమతించాల్సి ఉంది. 4,500 దరఖాస్తులను ఆన్లైన్ అప్లోడ్ పూర్తి చేశారు. జిల్లా స్థాయి లాగిన్‌లోనే అనుమతివ్వాలని ప్రభుత్వం తాజా మార్పులతో కొత్తకార్డుల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఇంకా 8,500 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. గత జనవరి నుంచి దరఖాస్తులు సమర్పించిన వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో త్వరితగతిన అనుమతినిచ్చే అవకాశమున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. జిల్లా స్థాయిలోనే మంజూరు మారిన నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మంజూరు చేస్తారు. ఆన్లైన్ ప్రక్రియ అయినప్పటికీ విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ సేవలో పూర్తి వివరాలతో చేసుకున్న దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయ లాగిన్లోకి వస్తుంది. తహసీల్దార్ సంబంధిత ఆర్ఐకి విచారణ కోసం సిఫారసు చేస్తారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసిన ఆర్ఐ ఆ నివేదికను తహసీల్దార్ లాగిన్‌కు పంపిస్తారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో సరి చూసుకుని అర్హులైతే తన లాగిన్ ద్వారా జిల్లా పౌరసరఫరాల అధికారికి ఆన్లైన్లో సిఫారసు చేస్తారు. విడిగా ఒక ప్రతీని డీఎస్వోకు పంపించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన డీఎస్వో ఆహార భద్రత కార్డును మంజూరు చేస్తారు. మీసేవ ద్వారా కార్డు ప్రతీని పొంది సంబంధిత రేషన్ షాపులో సరుకులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్ల కిందట కొత్త రేషన్ కార్డులు ముద్రించి జిల్లాలకు పంపారు. అదే సమయంలో జిల్లాల విభజన చేయడంతో పాత జిల్లాల పేర్లతో ముద్రించిన కార్డులను పంపిణీ చేయకుండా నిలిపేశారు. ఇప్పుడున్న 31 జిల్లాల వారీగా ఆహారభద్రత కార్డులను ముద్రించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్నారు. ఎదురుచూపులు..! జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. నూతనంగా పెళ్లి చేసుకున్న అర్హులైన కుటుంబాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కార్డుల జారీ ప్రక్రియలో మాత్రం ముందుకు సాగడం లేదు. క్షేత్ర స్థాయి విచారణలోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు భూరికార్డుల ప్రక్షాళన, రైతు బంధు తదితర పనులతో ఈ దరఖాస్తులపై దృష్టి పెట్టడం లేదు. ఇంకా డీఎస్వో దగ్గరకు రాని 7,400 దరఖాస్తుల్లో 5,800 వరకు విచారణకే నోచుకోలేదు. ఆర్ఐల స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. 1,600 వరకు దరఖాస్తుల విచారణ పూర్తయినా తహసీల్దార్ తుది నివేదిక హార్డ్‌కాపీ రాకపోవడంతో మంజూరుకు నోచుకోలేదు. మొత్తంగా 7,400 దరఖాస్తులకు మోక్షమే లేదు. కేవలం 4,500 దరఖాస్తులకే పూర్తి స్థాయి విచారణ జరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వాటిని పౌరసరఫరాల శాఖ హార్డ్‌కాపీలతో సరిచూసుకుని అప్రూవల్ చేస్తున్నారు. 13,400 దరఖాస్తులో 8,900 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామస్థాయిలో ఆర్ఐలు విచారణ వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. అర్హులందరికీ ఆహార భద్రతకార్డులు ఆహారభద్రత కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులకు ఆమోదం తెలిపి డీఎస్వో కార్యాలయానికి నివేదించాలని మండలాల అధికారులను కోరాం. మండల స్థాయి నుంచి పూర్తి స్థాయిలో విచారణ, హార్డ్‌కాపీల అందజేయడంలో జాప్యం కారణంగా కొంత ఆలస్యమవుతోంది. విచారణ వివిధ దశల్లో పూర్తి చేయడం కష్టతరమే. డీఎస్వో స్థాయిలోనే అనుమతి ఇవ్వొచ్చని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా 13 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. పౌరసరఫరాలశాఖకు అందిన 6 వేలల్లో కేవలం 1,500 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అర్హత కలిగిన వారందరినీ లబ్ధిదారులుగా మంజూరు చేస్తాం. – గౌరీశంకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
ఇక ‘జైవిక్ భారత్’
సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమబద్ధీకరించే ప్రక్రియకు తొలి అడుగు పడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.) ఏడాది క్రితం ప్రకటించిన నిబంధనావళి ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 2017 డిసెంబర్ 29న గజెట్లో ప్రకటితమైన ఈ నియమావళి.. ఈ ఏడాది జూలై నుంచి చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది. నిబంధనలు పాటించడంలో విఫలమైన సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం కల్పిస్తోంది. కఠినమైన సర్టిఫికేషన్ నిబంధనల కారణంగా సేంద్రియ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. సేంద్రియ మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశాలపై ‘సాగుబడి’ ఫోకస్.. మన దేశంలో రైతులు అనాదిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయాన్ని ప్రభుత్వం వ్యాప్తిలోకి తెచ్చిన తర్వాత.. ఇప్పటికీ చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. అయితే, వీరంతా అసంఘటితంగానే ఎవరికి వారు అనువంశిక సేంద్రియ సేద్యాన్ని ఒక జీవన విధానంగా, అవిచ్ఛిన్న వ్యవసాయక సంస్కృతిగా కొనసాగిస్తున్నారు. ఈ దశలో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు చిన్న, సన్నకారు రైతులతో ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయాన్ని చేయిస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ సర్టిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. రైతులే స్వచ్ఛందంగా తమకు తామే పరస్పరం తనిఖీలు చేసుకుంటూ.. సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చుకునే వ్యవస్థను ‘పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) ఆర్గానిక్ కౌన్సిల్’ పేరిట 2011లో ఏర్పాటు చేశాయి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదు. ఈ నేపథ్యంలో ఏటా 20–25% విస్తరిస్తున్న సేంద్రియ వ్యవసాయాన్ని క్రమబద్దీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుము బిగించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ‘పి.జి.ఎస్. ఇండియా’ సంస్థను ఏర్పాటు చేసింది. దేశంలో హోల్‌సేల్/రిటైల్ మార్కెట్లో ప్యాక్ చేసి వ్యాపారులు అమ్మే సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు విధిగా ప్యాకింగ్, లేబెలింగ్ నిబంధనలు వర్తింపజేయడానికి రంగం సిద్ధమైంది. పిజిఎస్ ఇండియా అనేది కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.), ఘజియాబాద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సేంద్రియ ధ్రువీకరణ వ్యవస్థ. వార్షిక టర్నోవర్ రూ. 12 లక్షల కన్నా తక్కువగా ఉండే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు లేబిలింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. అయితే, అంతకుమించి వ్యాపారం చేసే రైతు కంపెనీలకు ప్యాకింగ్, లేబిలింగ్ ఖర్చు కిలోకు రూ. 10ల మేరకు పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో, సేంద్రియ ఉత్పత్తుల ధరలు ఆ మేరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ అస్తిత్వానికి ముప్పు! ప్రభుత్వ హయాంలో ‘పిజిఎస్ ఇండియా’ ఏర్పాటు కావడంతో.. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న ‘పీజిఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’కు అస్తిత్వ సమస్య ఏర్పడింది. సేంద్రియ ఉత్పత్తులపై జూలై 1 నుంచి ‘జైవిక్ భారత్’ లోగోను విధిగా ముద్రించాలని, సేంద్రియ నాణ్యతా ప్రమాణాలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్. ఎస్. ఎస్.ఎ.ఐ.) నిర్దేశించిన నేపథ్యంలో ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనాదిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రారంభించిన నెట్వర్క్. డెక్కన్ డవలప్మెంట్ సొసైటీ(పస్తాపూర్, సంగారెడ్డి జిల్లా), టింబక్టు కలెక్టివ్(చెన్నేకొత్తపల్తి, అనంతపురం జిల్లా) వంటి సంస్థలు ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ను ఏర్పాటు చేసి నిర్వహించడంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి. ‘పీజీఎస్ ఇండియా’ను సమాంతర ప్రభుత్వ వ్యవస్థగా ఏర్పాటు చేసినప్పటికీ.. సేంద్రియ రైతుల హక్కులను పరిరక్షిస్తున్న ‘పీజిఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’కున్న గుర్తింపు రద్దు చేయవద్దని డీడీఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే, దీనిలో సభ్యులైన సేంద్రియ రైతులు కూడా ‘పిజిఎస్ ఇండియా’లో సభ్యులుగా చేరడం ద్వారా ఖర్చు లేకుండానే ప్రభుత్వ వ్యవస్థ పరిధిలోకి రావచ్చని ఎన్.సి.ఓ.ఎఫ్. చెబుతోంది. రూ. 12 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు! సేంద్రియ ఉత్పత్తులను దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులకు, రూ. 12 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉండే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతుల సహకార సంఘాలకు మాత్రం లేబిలింగ్ నిబంధనలు వర్తించవు. అయితే, వీరి వద్ద నుంచి కొని విక్రయించే రిటైల్ దుకాణదారులు, సూపర్ మార్కెట్ వ్యాపారులు(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) మాత్రం ఈ నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయడానికి, శిక్ష విధించడానికి కూడా అవకాశాలున్నాయి. కాబట్టి, వీరి ఉత్పత్తులను రిటైల్ డీలర్ల నుంచి కొనుగోలు చేసే సేంద్రియ ఆహార వినియోగదారులపై భారం మరింత పడనుంది. సేంద్రియ ఆహారోత్పత్తులను దేశంలో అమ్మకానికి ‘పీజిఎస్ ఇండియా’ సర్టిఫికేషన్ పొందితే చాలు. స్థానిక వ్యవసాయ అధికారుల ద్వారా, రీజినల్ కౌన్సిళ్ల ద్వారా రైతులు పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ పొందే వీలుంది. అయితే, విదేశాలకు ఎగుమతి అయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులకు జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం (ఎన్.పి.ఓ.పి.) నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ సేంద్రియ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు దేశీయంగా అమ్మే సేంద్రియ ఉత్పత్తులకు కూడా కంపెనీలు ఎన్.పి.ఓ.పి. ధ్రువీకరణ పొందవచ్చు. ఎన్.పి.ఓ.పి. ధ్రువీకరణ వ్యవస్థ 2001 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా.. ‘అపెడా’ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. అయితే, ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ క్లిష్టమైనది. అంతేకాక, అత్యంత ఖరీదైనది. సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్మే చిన్న, సన్నకారు రైతులు లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్.పి.ఓ.లు) ఎటువంటి ధ్రువీకరణనూ విధిగా పొందాలన్న నిబంధనేదీ లేదు. ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా సర్టిఫికేషన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి అనేక ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఐచ్ఛికంగానే ఉన్నాయి. అయితే, ‘జూలై నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను అమ్మే ఏ కంపెనీ అయినా ఇప్పుడు మేం ప్రకటించిన ప్రమాణాలను విధిగా పాటించకపోతే ప్రాసిక్యూట్ చేస్తాం’ అని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. హెచ్చరిస్తోంది. కొత్త నియమావళి ప్రకారం.. మన దేశంలోని దుకాణాల్లో/ షాపింగ్ మాల్స్‌లో అమ్మకానికి పెట్టే సేంద్రియ ఉత్పత్తులేవైనా సరే విధిగా అందుబాటులో ఉన్న రెండు ధ్రువీకరణ వ్యవస్థల్లో (ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా) ఏదో ఒక దాని నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా సేంద్రియ ఆహారోత్పత్తి, అమ్మకం, పంపిణీలతోపాటు విదేశాల నుంచి సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుమతికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. సేంద్రియ ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై ఆయా ఉత్పత్తుల సేంద్రియ స్థితిగతులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరచాలి. ఎన్.పి.ఓ.పి. ప్రకారం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లోగో లేదా పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ లోగోలలో ఏదో ఒకదానితో పాటుగా.. ‘జైవిక్ భారత్’ లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాలని సరికొత్త నిబంధనావళి నిర్దేశిస్తోంది. అయితే, వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు జైవిక్ భారత్ లోగోను సేంద్రియ ఉత్పత్తుల ప్యాకెట్‌పై నాన్–డిటాచబుల్ స్టిక్కర్ రూపంలో విధిగా ముద్రించాలన్న నిబంధనకు వచ్చే సెప్టెంబర్ 30 వరకు సడలింపు ఇచ్చినట్టు ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. తాజాగా ప్రకటించింది. జైవిక్ భారత్ లోగోకు సంబంధించిన పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. టర్నోవర్ పరిమితి పెంచాలి! సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ క్రమబద్ధీ్దకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహజాహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తరఫున మేం స్వాగతిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులందరూ పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయాలి. రైతులు మరో 2, 3 ఏళ్ల పాటు గడువు అవసరం ఉంది. రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు రూ. 12 లక్షల టర్నోవర్ వరకు నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నారు. ఈ పరిమితిని రూ. కోట్లకు పెంచాలి. ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న రైతుల కంపెనీలకు ప్రభుత్వ తోడ్పాటు మరికొంత కాలం ప్రోత్సాహం అవసరం. తాజా నిబంధనల వల్ల ప్యాకింగ్ ఖర్చు కిలోకు రూ. 10 మేరకు పెరుగుతుంది. దీని వల్ల చిన్న రిటైలర్లు దెబ్బతింటారు. ఒకే ఊళ్లో ఒకటో, రెండో దుకాణాలు పెట్టుకొని సేంద్రియ ఉత్పత్తులను అమ్మే రిటైలర్లకు రూ. 50 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు ఇవ్వాలి. లేబుల్ ముద్రించే బాధ్యత కేవలం సేంద్రియ రైతులకే పరిమితం చేయకూడదు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వాడే రైతుల ఉత్పత్తులపై కూడా ‘ఇవి రసాయనాలు వాడి పండించినవి’ అని లేబుల్ వేసేలా నిబంధనలు పెట్టాలి. అప్పుడు ప్రజల్లోనూ సేంద్రియ ఉత్పత్తులపై చైతన్యం ఇనుమడిస్తుంది. – డా. జీ వీ రామాంజనేయులు (90006 99702), సహజాహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, సికింద్రాబాద్ రైతుల హక్కును లాక్కోవద్దు! జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయాన్ని జీవన విధానంగా అనుసరిస్తున్న చిన్న, సన్నకారు రైతులే కలసి దేశవ్యాప్తంగా 21 స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ను పదేళ్ల క్రితం ఏర్పాటు చేసుకొని స్వతంత్రంగా నిర్వహించుకుంటున్నారు. 14 రాష్ట్రాల్లో కనీసం 10 వేల మంది రైతులు సేంద్రియ సర్టిఫికేషన్ సదుపాయం ఖర్చులేకుండా పొందారు. ఇప్పుడు ప్రభుత్వం ‘పీజీఎస్ ఇండియా’ను ఏర్పాటు చేసి సర్టిఫికేషన్ హక్కును లాగేసుకోవటం అన్యాయం. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను పెట్టుకోవచ్చు. మేం ప్రమాణాలు పాటించకపోతే కేసులు పెట్టి జైలులో పెట్టండి. అంతే కానీ సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చే హక్కును మాత్రం పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ నుంచి లాగేసుకోవటం సమంజసం కాదు. రైతుల హక్కును కాలరాయాలనుకోవడం తగదు. – పీ వీ సతీష్, పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యులు, డీడీఎస్, పస్తాపూర్ (వివరాలకు.. జయశ్రీ: 94402 66012) – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
30 శాతం అనర్హులే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత కార్డులు పక్కదారిపట్టాయి. దాదాపు 30 శాతం మంది అనర్హులకు ఈ కార్డులు అందాయి. వీరికి ప్రభుత్వం అందించే పీడీఎస్ బియ్యం అవసరం లేకున్నా కార్డులు తీసుకున్నారు. ఈ పాస్ విధానం అమలు కారణంగా అక్రమార్కుల చిట్టా బయటపడుతోంది. చాలా మందికి అవసరం లేకున్నా కేవలం కార్డు రద్దవుతుందనే భయంతో బలవంతంగా బియ్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొందరు బియ్యం కొనుగోలు చేసి షాపుల్లో, టిఫిన్ సెంటర్ల యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారుల్లో సగానికి పైగా మధ్యతరగతి కుటుంబాలున్నాయి. దీంతో రేషన్ బియ్యంపై ఆసక్తి తగ్గింది. ప్రస్తుతం కుటుంబంలోని సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఎంత మంది సభ్యులు ఉంటే అన్ని కిలోల బియ్యం పంపిణీ జరుగుతోంది. రేషన్ బియ్యం నాసిరకం, నాణ్యతా లోపం కారణంగా వాటిని వండుకొని తినేందుకు మధ్యతరగతి వారు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. రేషన్ షాపునకు వెళ్లి ప్రతి నెలా బియ్యం కోనుగోలు చేయకుంటే.. ఈ పాస్ పద్ధతి కారణంగా మూడు మాసాల తర్వాత కార్డు రద్దవుతుందనే నిబంధన ఉండేది. దీంతో చాలా మంది కార్డును రద్దు కాకుండా చూసుకునేందుకే బియ్యం తీసుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య 30 శాతం పైనే ఉందని తెలుస్తోంది. బహుళ ప్రయోజనకారి... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డులు రద్దు చేసి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. గతంలో తెల్లరేషన్ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు మధ్య తరగతి, నాలుగ అంకెల జీతం కలిగిన ప్రయివేటు ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకొని ఆహార భద్రత కార్డులు పొందారు. ప్రభుత్వం కార్డు దారుడి కుటుంబంలో సభ్యుడు (యూనిట్)కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయిస్తోంది. గత రెండేళ్ల క్రితం వరకు మ్యానువల్ పద్ధతిలో బియ్యం పంపిణీ కొనసాగేది. గత రెండేళ్ల క్రితం ఈ–పాస్ ద్వారా సరుకులు పంపిణీ ప్రారంభం కావడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. దీంతో రేషన్ బియ్యం అత్యవసరం లేనివారు రెండు మూడు నెలల ఒకసారి బియ్యం కొనుగోలు చేసి కార్డు రద్దు కాకుండా కాపాడుకుంటూ వచ్చారు. తాజాగా బియ్యం తీసుకోకున్నా కార్డులు రద్దు కావని అధికారులు ప్రకటించడంతో వీరంతా ఉపశమనం పొందారు. ఇదీ పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సర్కిల్స్ 12 ఉన్నాయి. మొత్తం 1545 ప్రభుత్వ చౌకధరల దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో కార్డుల సంఖ్య 10.94 లక్షలపైనే. అందులో 41.42 లక్షల లబ్ధిదారులు (యూనిట్లు) ఉన్నారు. ఇందుకు గాను నెలసరి బియ్యం కేటాయింపులు 26 వేల మెట్రిక్ టన్నులు పైనే ఉంటాయి. ప్రతినెల ఈ పాస్ అమలుతో సగటున 30 నుంచి 40 శాతం సరుకులు డ్రా కావడం లేదు. తాజాగా సరుకులు తీసుకోకున్నా కార్డు రద్దు కాదన్న అధికారుల ప్రకటనతో సరుకులు డ్రా చేయని కార్డుదారుల సంఖ్య మరింత పెరుగనుంది. -
ఆహార భద్రత కార్డు వెబ్సైట్ పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : పేదల ఆహార భద్రత (రేషన్) కార్డు వెబ్సైట్ బుధవారం పునఃప్రారంభమైంది. దీంతో మీ–సేవ, ఈ–సేవల ద్వారా కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది. 9 నెలల విరామం తర్వాత వెబ్సైట్ పునఃప్రారంభమవడంతో తొలిరోజే దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. దీంతో మీ–సేవ, ఈ–సేవ సర్వర్లపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని కేంద్రాల్లో వెబ్సైట్లో లాగిన్ కావడానికి అధిక సమయం పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు కోసం ఈ వెబ్‌సైట్‌ను నిలిపేయడంతో కొత్త కార్డుల మంజూరు, మార్పులు, చేర్పులు, పునరుద్ధరణకు ఆస్కారం లేకుండా పోయింది. అప్పటికే వచ్చిన సుమారు 3 లక్షలకుపైగా దరఖాస్తులను సైతం పౌరసరఫరాల శాఖ నిలిపేసింది. ఇటీవల మొత్తం 17,027 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తికావడంతో ఈ నెల 13న ఆహార భద్రత కార్డు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఎన్ఐసీ, మీ–సేవ డైరెక్టర్లకు లేఖ రాశారు. ఈ మేరకు అధికారులు బుధవారం వెబ్‌సైట్‌ను పునఃప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 50,24,511 ఆహార భద్రత కార్డులుండగా, అందులో 1,91,71,623 లబ్ధిదారులు ఉన్నారు. కార్డుల్లేని కుటుంబాలు సుమారు 12 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. -
కల్తీపై ‘పిడి’కిలి!
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆహారాన్ని కల్తీ చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేవారిపై పీడీ చట్టం ప్రయోగించాలని నిర్ణయించింది. ఆహార నియంత్రణ విభాగాన్ని పటిష్టం చేయాలని భావిస్తోంది. ఆహార నాణ్యతా నియంత్రణ విభాగం సిబ్బంది కొరతతో అవస్థలు పడుతోంది. కనీసం ఆహార నమూనాలను సేకరించే పరిస్థితి కూడా లేదు. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం నగరాలు, పట్టణాల్లో ప్రతి 50 వేల మంది జనాభాకు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష మంది జనాభాకు ఒకరు చొప్పున ఆహార నియంత్రణ అధికారి ఉండాలి. ప్రతి జిల్లాలో కనీసం ముగ్గురు అధికారులు ఉండాలి. 15 జిల్లాల్లో నియంత్రణ అధికారుల్లేరు... రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18 మంది ఆహార నియంత్రణ అధికారులున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురు, 15 జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. మరో 15 జిల్లాల్లో ఆహార నియంత్రణ విభాగమేలేదు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇప్పుడు ఆహార ఉత్పత్తుల తయారీ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో ఆహార కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. ఏది కల్తీయో, ఏదీ నాణ్యమైన పదార్థమో తెలియని పరిస్థితి ఉంది. కల్తీ నియంత్రణ దాదాపు లోపించింది. ఆహార కల్తీపై ఇటీవల హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీ నియంత్రణకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నారో తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనవరి 23న దీనిపై హైకోర్టుకు నివేదించాల్సి ఉండగా వాయిదా పడింది. హైకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలియక వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు పాలుపోవడంలేదు. పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఏడాది క్రితమే ప్రతిపాదనలు రూపొందించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఆహార నియంత్రణ అధికారి ఉన్న జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్(ముగ్గురు), వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్. -
ఇక హోటళ్లకూ గ్రేడింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు ఆహార పదార్థాలను సరఫరా చేసే అన్ని రకాల హోటళ్లకు వాటి నాణ్యత ప్రమాణాలను బట్టి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి లక్ష్మా రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఆహార భద్రతా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాల సరఫరాకు ప్రధానంగా ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం, నాణ్యత విషయంలో వర్తకులు, వినియోగదారుల మధ్య భరోసా కలిగించడం, నాణ్యత పరీక్ష కేంద్రాలను పటిష్టపరచడం, పౌష్టికాహారాన్ని తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆహారపు అలవాట్లలో మార్పులను ప్రోత్సహిం చడం, వర్తకుల నాణ్యత ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడం, నాణ్యత ప్రమాణాల అమలుకు పక్కా వ్యవ స్థను ఏర్పాటు చేయడం.. లాంటి అంశాల అమలుకు అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించామన్నారు. -
మార్కెట్లో విషతుల్య ఆహారోత్పత్తులెన్నో?
సాక్షి, న్యూఢిల్లీ : పుష్పమ్ ఫుడ్స్ కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న 'రెస్ట్‌లెస్ జిన్సెంగ్' అనే ఎనర్జీ డ్రింక్‌లో ప్రమాదకరమైన 'కఫేన్, జిన్సెంగ్' మిశ్రమం ఉందని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రమాదకరమైన మిశ్రమం కారణంగా ఈ ఎనర్జీ డ్రింక్ తాగినవారికి ఎంత ఎనర్జీ వస్తుందో తెలియదుగానీ గుండెపోటు, రక్తపోటు రావడం ఖాయమని వారు తేల్చిచెప్పారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకే ఆహార భద్రతా సంస్థ తరఫున శాస్త్రవేత్తలు స్పందించారనడం ఇక్కడ గమనార్హం. ఈ ఉత్పత్తిని అమ్ముతున్న కంపెనీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015, జూన్‌లో 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' జారీ చేసింది. ఆహార భద్రతా అధికారులతోపాటు వినియోగదారుల సంఘాలు గోల చేయడంతో విష రసాయనం వెలుగులోకి వచ్చిన ఏడు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్పత్తికి ఎన్ఓసీని రద్దు చేసింది. ఈలోగా మార్కెట్లోకి విడుదల చేసిన ఎనర్జీ డ్రింక్ స్టాక్‌నంతా పుష్పమ్ ఫుడ్స్ కంపెనీ అమ్ముకోగలిగింది. ఈ ఏడు నెలలపాటు ఆ ఎనర్జీ డ్రింక్‌ను తాగిన వినియోగదారుడు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నాడన్న మాట. అవసరమైన ముందస్తు తనిఖీలు లేకుండా 'మా ఉత్పత్తులు సురక్షితం' అంటూ కేవలం కంపెనీలు ఇచ్చే భరోసాపైనా మార్కెట్లోకి విడుదలైన ఇలాంటి ఆహార ఉత్పత్తులు దాదాపు 800 రకాలు ఉన్నాయి. వాటన్నింటినిపై పరిశోధనలు జరిపితే ఎన్ని జబ్బులకు దారితీస్తున్న విష మిశ్రమాలున్నాయో! 'జిన్సెంగ్' ఉత్పత్తిని నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏడు నెలలు పట్టడానికి కారణం అందులో ప్రత్యక్ష పాపం తనది కూడా కావడం. ఆహార పరిశ్రమ నుంచి వస్తున్న ఒత్తిడికి తట్టుకోలేకనో లేదా చేతులు తడుపుకోవాలనే తహతహో తెలియదుగానీ ఆహార భద్రత ప్రమాణాలను భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ 2012 నుంచి సడలిస్తూ వస్తోంది. ఇక కేంద్రంలోని ఆహార శాఖా కార్యాలయంలోని డాక్యుమెంట్ల ప్రకారం 2014, ఆగస్టు నెలలో కేంద్రంలోని ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా జోక్యం చేసుకొని సడలింపు పేరిట నిబంధనలను నీరుగార్చింది. ఆహార భద్రతా సంస్థ అధికారులతోపాటు, కేంద్ర ఆహార శుద్ధి శాఖ, పారిశ్రామిక వర్గాలతో ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి సమావేశమై కొత్త ప్రమాణాలను నిర్దేశించారు. వీటిని అప్పటి ఆహార భద్రతా సంస్థ సీఈవో వైఎస్ మాలిక్ తీవ్రంగా వ్యతిరేకించారు. అదే ఏడాది మే నెలలో ఈ ప్రమాణాలు ప్రమాదరమైనవంటూ నచ్చ చెప్పేందుకు పారిశ్రామికవేత్తలకు ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. 'మా ఆహారోత్పత్తులు సురక్షితం' అంటూ కంపెనీలే భరోసా ఇస్తున్నప్పుడు మనకెందుకు అభ్యంతరమంటూ మాలిక్‌కు నచ్చచెప్పేందుకు ప్రధాని ప్రధాన కార్యదర్శి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో మాలిక్‌ను ఆహార భద్రతా సంస్థ నుంచి బదిలీ చేశారు. ఇంతకు ఆయన వ్యతిరేకించిన అంశాలేమిటీ? శుద్ధి చేసిన ఆహార పదార్థాలలో సాధారణంగా మూడు రకాల పదార్థాలు లేదా మిశ్రమాలు ఉంటాయి. ఒకటి ప్రొప్రైటరీ ఫుడ్స్, రెండు నావెల్ ఫుడ్స్, మూడు యాడింగ్స్. ప్రొప్రైటరీ ఫుడ్స్ అంటే, మనం తినే రకరకాలు దినుసులు. కెఫిన్, జిన్సెంగ్ కూడా ఈ రకం పదార్థాలే. విడివిడిగా ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటి మిశ్రమం వల్ల ప్రమాదరకమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇక రెండోది నావెల్ ఫుడ్స్. కొత్త రుచుల ఆహారం లేదా ఆహార మిశ్రమం. ఇక యాడింగ్స్ అంటే ఆ ఆహార పదార్థాలను ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మిశ్రమాలు, రసాయనాలు. నావెల్ ఫుడ్స్..కంపెనీ యాజమాన్యం ఇష్ట ప్రకారం ఉంటాయి. ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్ మాత్రం ఆహార భద్రతా సంస్థ శాస్త్రవేత్తలు సూచించిన ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. ఏయే పదార్థాలు, ఏయే మిశ్రమాలు ఏ స్థాయిలో ఉండాలో ఆహార సంస్థ భద్రతా ప్రమాణాలు సూచిస్తాయి. పారిశ్రామిక వర్గాల ఒత్తిడి ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్ వల్ల అనవసరంగా తమకు కాలయాపన అవుతోందని, వీటిని సడలించాలని ఎప్పటి నుంచో పారిశ్రామిక వర్గాలు కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఆ ఒత్తిళ్లకు లొంగి 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రమాణాలను కొంత సడలించగా, 2014లో అధికారంలోకి వచ్చిన బీజీపీ ప్రభుత్వం మరింతగా సడలించింది. అయితే పలు అవాంతరాలు, కోర్టు కేసుల కారణంగా సడలించిన నిబంధనలు 2016, జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆహార భద్రతకు సంబంధించి పీఎంవో ఆధ్వర్యంలో కేంద్ర ఆహార శాఖ తీసుకున్న నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం లేదన్న కారణంగా ముంబై హైకోర్టు కొట్టి వేయడం, దానిపై కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లడం తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇంత జాప్యం జరిగిందన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా భద్రతా ప్రమాణాలను నోటిఫై చేయకుండానే అమల్లోకి తెచ్చింది. సడలించిన ప్రమాణాలేమిటీ? సడలించిన ప్రమాణాల ప్రకారం ప్రొప్రైటరీ ఫుడ్స్ విషయంలో ఆహార సంస్థ ఆమోదించిన పదార్థాలు లేదా దినుసులు ఉపయోగించాలి. అయితే వాటిని వేటివేటితో కలుపుతారో, ఏ మోతాదులో కలుపుతారో ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ నిబంధన ఉండేది. ఇక్కడ కెఫేన్, జిన్సెంగ్ భారత ఆహార సంస్థ ఆమోదించినవే. అయితే వాటి మిశ్రమానికి ఆహార సంస్థ ఆమోదం లేదు. ఈ రెండింటిని కలపడం వల్ల జిన్సెంగ్ ప్రమాదకర డ్రింక్‌గా మారింది. అలాగే ఎక్కువ కాలం ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పదార్థాలు కూడా ఆహార సంస్థ ఆమోదించినవే ఉండాలి. అయితే అది ఏ మోతాదులో ఉండాలో యాజమాన్యం ఇష్టం. ఇంతకుముందు ప్రమాణాలు పాటించాల్సి వచ్చేది. ప్రజల ఆరోగ్యానికి అసలైన ప్రమాదకారి ఈ నిల్వ ఉంచే పదార్థమే. అయితే ఇది మోతాదు మించితే మనుషుల ప్రాణాలకే ముప్పు. వ్యాపారులు లాభాపేక్షతో తమ ఉత్పత్తులు మార్కెట్లో త్వరగా పాడవకుండా ఉండేందుకు ఈ పదార్థాల మోతాదును ఎక్కువ కలుపుతారనే విషయం ఎవరైనా గ్రహించగలరు. 'మ్యాగీ' నూడిల్స్‌లో మోతాదుకు మించి సీసం ఉందన్న కారణంగా కొంతకాలం వాటి ఉత్పత్తులను మార్కెట్లో నిలిపేసిన విషయం తెల్సిందే. ఇంకా అప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నోటిఫై కాలేదు. గుడ్డిగా ప్రోత్సహించడంతోనే భారతీయ మార్కెట్లో ఆహారోత్పత్తుల కంపెనీలను ప్రోత్సహించాలనే అత్యుత్సాహంతో కేంద్ర ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలను సడలిస్తూ వస్తున్నాయి. 2025 నాటికి దేశంలో ఏటా 72 లక్షల కోట్ల ఈ ఆహరపదార్థాల వ్యాపారం నడుస్తుందని, వాటిలో ఏటా 60 లక్షల కోట్ల రూపాయలు లాభాలే ఉంటాయన్నది ఓ అంచనా. ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతా ప్రమాణాలను పణంగా పెట్టినప్పుడు ఇన్ని కోట్ల వ్యాపారం ఎవరి కోసం!? అమెరికా, యూరోపియన్ యూనియన్లు తమ ఆహార భద్రతా ప్రమాణాలను రోజురోజుకు కఠినం చేస్తూ వెళుతుంటే మన దేశం సడలిస్తూ రావడం విచిత్రం. -
ఆహార భద్రతకు ముప్పు
సాక్షి, అమరావతి: భూ సేకరణ సవరణ చట్టంపై కేంద్ర సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. కేంద్ర భూ సేకరణ చట్టం– 2013కు ఎలాగైనా సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొంద డానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్ఫరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ (ఆంధ్రప్రదేశ్ భూ సేకరణ సవరణ చట్టం–2017) బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున కేంద్ర భూ సేకరణ చట్టానికి సవరణలు సరికాదని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని, ఆ రెండు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌కు పోలిక లేదని కూడా పేర్కొంది. 2013 భూ సేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు ఆహార భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని, బహుళ పంటలు పండే భూములను సేకరించడంతో ఆహా రానికి కొరత ఏర్పడుతుందని, సాగు భూమి కూడా అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభు త్వ నిబంధనలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. ప్రైవేట్ రంగం వారికి రాష్ట్ర ప్రభుత్వం భూములను ఎలా సేకరించి ఇస్తుందని ప్రశ్నించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన సవరణ బిల్లులో అనేక లోపాలుండటంతో ఆ బిల్లును కేంద్రం రాష్ట్రానికి తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో తిప్పి పంపిన బిల్లును ఇటీవల ఉపసంహ రించుకున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కొత్త సవరణలతో బిల్లును అసెంబ్లీలో ఆమో దించి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. రాష్ట్రానికి ఆహార భద్రత ముప్పులేదు.. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది. కొత్తగా 12 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు వస్తున్నందున రాష్ట్రానికి ఎటువంటి ఆహార భద్రత ముప్పు లేదని తెలిపింది. -
‘దీపం’ బాధ్యతలు తహసీల్దార్లకు..
♦ లబ్దిదారుల ఎంపిక చేయాల్సింది వీరే.. ♦ ఎంపీడీవోలను తప్పించిన సర్కార్ ♦ జాప్యం, అనర్హుల నివారణకే ఈ నిర్ణయం ♦ దరఖాస్తుల స్వీకరణ మొదలు ♦ మహిళలకు తప్పనున్న కట్టెలపొయ్యి కష్టాలు నిర్మల్‌రూరల్: కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న మహిళల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం దీపం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాల్లోని మహిళల పేరుమీద ఈ పథకం కింద రాయితీ వంటగ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు చేసేవారు. కానీ ఇక నుంచి వీరుని తప్పిస్తూ ఆయా మండలాల తహసీల్దార్లకు ఎంపిక బాధ్యతను ప్రభుత్వం అప్పజెప్పింది. ఎంపికలో జాప్యం వల్లే.. దీపం పథకం అనగానే స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉండేవి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతం వరకు మున్సిపల్ కార్యాలయంలో కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఆ దరఖాస్తులను స్థానిక పంచాయతీ కార్యదర్శులు విచారించి, అర్హుల జాబితాను ఎంపీడీవోలు, మున్సిప ల్ కమిషనర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖకు పంపించేవారు. అక్కడి నుంచి కలెక్టర్‌కు చేరి, సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం పొందాల్సి ఉండేది. ఈ తతంగం అంతా పూర్తయ్యే సరికి చాలా జాప్యం జరిగేది. ఈ సమస్యను నివారించేందుకు తహసీల్దార్లకు దరఖాస్తు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లకు బాధ్యతలు దీపం పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు ఇక నుంచి తమకు సంబంధించిన తహసీల్దార్ కార్యాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన వాటిని తహసీల్దార్ ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు. వారి ఆధార్ నంబర్, కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ ఉందా...? లేదా..? ఉంటే ఎవరి పేరుపైన ఉంది. ప్రైవేట్ కనెక్షన్ లేదా దీపం కనెక్షన్ వంటి వివరాలు పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో తమ సిబ్బందిని కూడా పంపి పరిశీలించే అవకాశం ఉంది. దరఖాస్తుదారు అర్హుడని నిర్ణయించుకున్న తరువాత వారిని ఎంపిక చేస్తారు. గ్రామసభల్లో వివరాలు చదివి వినిపించి తీర్మానం చేసి జాబితాను రూపొందిస్తున్నారు. అనంతరం జాబితాను పౌరసరఫరాల శాఖకు పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌కు చేరుతుంది. అతని ఆమోదంతో లబ్ధిదారులకు సిలిండర్‌ను మంజూరు చేస్తారు. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో ఐదు గ్యాస్ కనెక్షన్ల ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్షా 10 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 25 వేల వరకు దీపంవి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సీజన్లో 17 వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో దీపం కనెక్షన్ల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ కోరేవారు ఆయా మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు దరఖాస్తుతో జత చేయాలి. అర్హులను తహసీల్దార్ ఎంపిక చేసి ఉన్నతాధికారులకు పంపిస్తారు. కిరోసిన్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాను కిరోసిన్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం అర్హులైన పేద లబ్ధిదారులందరికీ దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తాం. ఇప్పటికే 7వేల కనెక్షన్లను మూడు నెలల క్రితం అందించాం. మరో 10 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 10 వేల మంది దీపం పథకం సిలిండర్లను అందించేందుకు కార్యాచరణ రూపొందించాం. – సుదర్శన్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
సహకారమా.. స్వాహాకారమా?
రెండో మాట ఈ సంస్కరణలకు భారత పాలకులు ‘డూడూ బసవన్నల్లా’ తలలూపారు. ‘అధికార బసవన్న’లు కూడా తమ చేతికి మట్టి అంటుకోకుండా అనుకూల ముద్రలు వేశారు. ఇందుకు తొలి ఉదాహరణల్లో ఒకటి– ‘నరసింహం కమిటీ’. వ్యవసాయ రంగానికి కల్పించాల్సిన ప్రభుత్వ పరపతి (రుణ) సౌకర్యంలో భారీ ఎత్తున కోత విధించడాన్ని సమర్థిస్తూ ఈ కమిటీ సిఫారసు చేసింది. ప్రపంచబ్యాంక్, అమెరికా పాలకులు బహుళజాతి గుత్త సంస్థల మెరమెచ్చులకోసం ఇలాంటి పనులెన్నో చేశారు. ‘అన్నార్తులైన ప్రజలు హేతువాదాన్నీ, సత్యాన్నీ వినిపించుకోరు. న్యాయం జరుగుతోందా లేదా అన్న అంశాన్ని కూడా పట్టించుకోరు. నీవు ఎన్ని ప్రార్ధనలు చేసినా వారు లొంగరు అని రోమన్ తత్వవేత్త సెనెకా రెండువేల ఏళ్ల నాడే చెప్పాడు. ఇంతకూ మన దేశ ప్రజల ఆకలిదప్పులు మార్కెట్లో తగినంత ఆహారం లేకకాదు. బతికి బట్టకట్టడానికీ, ఊపిరి నిలుపుకోవడానికీ తగినన్ని అవకాశాలు లేనందువల్ల. తగినంత కొలుగోలు శక్తి లేనందువల్ల. ఈ దురవస్థ అందుకేనని గ్రహించాలి. కొనుగోలు శక్తి లేకపోవడం, దారిద్య్రాల వల్లనే పేద కుటుంబాలకు తగిన ఆహార పదార్థాలు, శక్తి (కేలరీలు) సమకూడడం లేదు. దేశంలో పుష్కలంగా ఆహారధాన్యాలు లభ్యం కావడమే ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. ఇటు దేశాభివృద్ధికీ, అటు ప్రపంచ స్థాయి వర్తక ఒప్పందాలకూ భారత పౌరుల ఉపాధి కల్పనే పునాదిగా ఉండాలి.’ – డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ (విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, బోర్లాగ్ పురస్కార గ్రహీత) దేశంలో 70 శాతం వ్యవసాయం పైన ఆధారపడుతున్నవారే. భారత్ బహుముఖ ప్రగతికి మూలాధారం కూడా ఆ రంగమే. అలాంటి వ్యవసాయ రంగానికీ, ఆ రంగం మీద ఆధారపడిన పారిశ్రామిక, సాంకేతిక ఉపాధి రంగాలకు సంబంధించిన ఉపాంగాలకీ సమస్యలు ఎదురైనప్పుడు అందుకు విరుగుడుగా దేశవాళీ పరిష్కారాలు చూడడం సరైనది. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్యవాద పెట్టుబడుల వైపు అర్రులు చాచడం, చాస్తూ ఉండడం ఒక వాస్తవం. ఆ విధంగా ఆ ప్రభుత్వాలు దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీశాయి. 1991, 2000–2001 కాలంలో ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ప్రజా వ్యతిరేక సంస్కరణలకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు లొంగిపోవడం ఇందుకు పరాకాష్ట. ఆ విధంగా అవి దేశాభివృద్ధిని పరా«ధీన స్థితికి నెట్టేశాయి. ప్రపంచ మార్కెట్లో స్థానం లేదా? ఈ స్థితి నుంచి ఇప్పటికీ మనం బయటపడలేదు. ఇందుకు తాజా సాక్ష్యం ఫ్రీట్రేడ్ ఒప్పందం. ఇండియా, చైనా సహా పదహారు ఆసియా– పసిఫిక్ దేశాలను కలిపి భారీ ఎత్తున ప్రాంతీయ స్వేచ్ఛావాణిజ్య ఒప్పంద సమాఖ్యను (ఫ్రీట్రేడ్ ఎగ్రిమెంట్) రూపొందించడానికి ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్య ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ద్వారా పన్నాగం పన్నాయి. తన పన్నాగాలలో భాగం పంచుకుంటున్న దక్షిణ కొరియా, జపాన్ లాంటి పది ఏసియాన్ దేశాలను కలిపి ప్రపంచ బ్యాంక్ ఒక కూటమిని ఏర్పరిచింది. పదహారు సభ్య దేశాలతో ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థికాభివృద్ధి సమాఖ్య చైనా ఆధ్వర్యంలో ఉన్నది. దేశాల మధ్య ఎలాంటి ఆటంకాలు లేకుండా వర్తక వాణిజ్యాలు సాఫీగా సాగించాలనే ఈ రెండు వాణిజ్య కూటముల ఆరాటం. కానీ ఇంతకాలం ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల ద్వారా అమెరికా చేస్తున్న పనంతా బడుగు, వర్ధమాన దేశాల వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తులు ప్రపంచ మార్కెట్‌కు చేరనివ్వకుండా ఆంక్షలు పెట్టడమే. ఇది చాలదన్నట్టు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌లకు తోడు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమెరికా నెలకొల్పింది. పైగా అమెరికా, యూరప్ దేశాల వస్తూత్పత్తులతో బడుగు దేశాల మార్కెట్లను ముంచెత్తించేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలి లేదా ఎత్తివేయాలని చాలాకాలంగా షరతులు విధిస్తున్నది. అలా భారత్ మెడలు వంచింది. మన దేశం సునాయాసంగా ఉత్పత్తి చేయగల 2,000 రకాల వ్యవ సాయ, పారిశ్రామికోత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు రాకుండా చేసింది. ఆ మేరకు తన దిగుమతులను మన దేశం మీద రుద్దింది కూడా. ఇందుకుగాను ప్రపంచ బ్యాంక్ ద్వారా అమెరికా అమలు చేయించిన దుర్మార్గపు పని– దీనికి సంబంధించిన 22 భారతీయ చట్టాలను నిబంధనలను సవరించేటట్టు చేయడం లేదా ఎత్తించి వేయడం. హైదరాబాద్ సదస్సు వెనుక ఈ నెల 24 (నిన్నటి నుంచి) మొదలుపెట్టి, 28వ తేదీ వరకు హైదరాబాద్ కార్యస్థానంగా అమెరికా, ప్రపంచ బ్యాంక్ తలపెట్టిన బృహత్ ప్రాంతీయ సహకార సంస్థ సమావేశాలు అలాంటి కుట్రలో భాగమే. ఇది పైకి స్వచ్ఛం దంగా జరుగుతున్న ప్రాంతీయ సహకారంగా కనిపించవచ్చు. కానీ సంపన్న దేశాల స్వాహాకార ఎత్తుగడగానే భావించాలి. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ప్రపంచ సంస్థల ఆధ్వర్యంలో అంత తేలిగ్గా సాధ్యపడే వ్యవహారం కాదు. ఇందుకు తిరుగులేని నిదర్శనం– ఈ ‘ప్రాంతీయ సహకారాన్ని’ ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్య ప్రభుత్వాలు నిజంగానే కోరుకునే పక్షంలో ఈ సదస్సుకు ఆహ్వానించే సభ్య దేశాలకు, వాటి పార్లమెంటులకు తమ ప్రతిపాదనల పత్రాల్ని ముందుగానే చర్చ కోసం పంపి ఉండాల్సింది. కానీ ఈ రోజు దాకా అలాంటి ప్రజాస్వామిక సంప్రదాయాన్ని పాటించలేదు, పాటించరు కూడా. ఎందుకంటే, భారత వ్యవసాయ రంగంపై పట్టు సాధించడానికి ప్రపంచ బ్యాంకు (1991 నుంచీ) సంస్కరణల కోసం ఎంచుకున్న రంగాలు/శాఖలు–పాడి పరిశ్రమ, రొయ్యల పెంపకం, రబ్బరు తోటలు, చేపల పరిశ్రమ, పట్టు పరిశ్రమ వగైరా. వీటికితోడు దేశీయ ఎరువుల పరిశ్రమ, భూగర్భ జలాలను పైకి తోడగల పంపుసెట్లు, అధికోత్పత్తి సాధనాలంటూ కృత్రిమ విత్తనాల తయారీలపై కూడా వరల్డ్‌బ్యాంక్ కన్ను వేసింది. అందుకే ఆ బ్యాంకు 17 రాష్ట్రాల్లో వ్యవసాయ విస్తరణ ‘సేవల’ పేరిట పథకాలు ప్రవేశపెట్టించినట్టే పెట్టించి, మధ్యలో విరమింపజేసింది. కనుకనే, 1995 నాటికే, ‘సంస్కరణలు’ ప్రారంభమైన నాలుగేళ్లకే ప్రసిద్ధ ఆర్థికవేత్తలూ, నిపుణులతో కూడిన ‘పబ్లిక్ ఇంట్రస్ట్ రీసెర్చి గ్రూపు’ ప్రపంచ బ్యాంకు పనులను సమీక్షిస్తూ ఇలా శఠించవలసి వచ్చింది: ‘దారిద్య్ర నిర్మూలన పథకాల పేరిట ప్రపంచ బ్యాంకు సరికొత్త మార్గం కనిపెట్టింది. పేదలపైన, ఆదివాసీలపైన పన్నుల భారాన్ని మోపడం ద్వారా, మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఉద్దేశించిన సబ్సిడీలను, దేశ సహజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడమే, ఆ మార్గం’ (రీసెర్చి గ్రూపు నివేదిక పే.27). ఒకసారి రుణం తీసుకుంటే అంతే! ప్రపంచ బ్యాంకు బడుగు దేశాలకు రుణాల ఎర చూపిస్తే, వాటిని తీర్చుకోలేని దేశాలకు మరిన్ని రుణాలు ఎరచూపే సంస్థ ఐఎంఎఫ్. అంటే, రుణం పొందిన దేశం శాశ్వత రుణగ్రస్థ దేశంగా మిగిలిపోతుంది. బడుగు, వర్ధమాన దేశాలపై ‘ప్రాంతీయ సహకార’వ్యవస్థ ఏర్పాటు పేరిట ‘స్వేచ్ఛా వాణిజ్యం’ ముసుగులో జరుగుతున్న హైదరాబాద్ సదస్సు లాంటి సమావేశాలకు వేసిన ప్రాతిపదిక ఈనాటిది కాదు. 1991 నాటి సంస్కరణల సమయానికే వరల్డ్ బ్యాంకు ‘భారతదేశ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ప్రతిపాదన’ పేరిట ప్రత్యేక పత్రాన్ని సిద్ధం చేసింది. ఆ మెమొరాండంలో పేర్కొన్న ప్రధాన అంశాలనేæ ‘స్వేచ్ఛా వాణిజ్యం’ పేరిట ‘ప్రాంతీయ సమగ్రాభివృద్ధి’కి షరతులుగా నిర్దేశించింది. అవి 1. వినియోగ వస్తువుల/సరకుల, వ్యవసాయోత్పత్తులు, ఎరువులు, విత్తనాల సరఫరా వగైరా వ్యవహారాల అన్ని దశల్లోనూ ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదు. 2. రైతుకు గిట్టుబాటు ధరలు లభించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండరాదు. 3. ప్రోత్సాహకాల పేరిట ఇచ్చే సబ్సిడీలలో కోత పెట్టాలి. 4. అవసరాలను బట్టి ప్రపంచబ్యాంకు, దాని అనుబంధ సంస్థలే రుణాలిస్తాయి. సంబంధిత శాఖల వారీగా సర్దుబాటు రుణాలు కూడా ఇస్తుంది’(వరల్డ్‌బ్యాంక్ డెవలప్మెంట్ రిపోర్టు: 1986). ఈ సంస్కరణలకు భారత పాలకులు ‘డూడూ బసవన్నల్లా’ తలలూపారు. ‘అధికార బసవన్న’లు కూడా అనుకూల ముద్రలు వేశారు. ఇందుకు తొలి ఉదాహరణల్లో ఒకటి– ‘నరసింహం కమిటీ’. వ్యవసాయ రంగానికి కల్పించాల్సిన ప్రభుత్వ పరపతి (రుణ) సౌకర్యంలో భారీ ఎత్తున కోత విధించడాన్ని సమర్థిస్తూ ఈ కమిటీ సిఫారసు చేసింది. బ్యాంక్, అమెరికా పాలకులు బహుళజాతి గుత్త సంస్థల మెరమెచ్చులకోసం ఇలాంటి పనులెన్నో చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ హయాంలో బీజేపీ ‘మేక్ ఇన్ ఇండియా’(ఇండియాలోనే తయారీ) పేరిట సాగుతున్న తతంగంలో కూడా సరిగ్గా ఇదే. అమెరికా ఆధ్వర్యంలోని ‘ఏసియాన్’ సమాఖ్యకు రూపొందించిన ఆ ప్రతిపాదనల పత్రం ‘ప్రాంతీయ సహకార’ సదస్సులో పాల్గొనే సభ్య దేశాలకు అందలేదు. సదస్సు రహస్య ఉద్దేశానికి ఇదే నిదర్శనం. బడుగు, వర్ధమాన దేశాల మౌలిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేయబోయే నిర్ణయాలకూ ఇదొక సూచన. అయితే, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర మీనన్ ఈ భావనతో (21.7.17) విభేదించడం విచిత్రమే. ఈ సమస్యను కేవలం భారత్–చైనాల మధ్య సిక్కిం, భూటాన్‌తో ఏర్పడిన సరిహద్దు ‘గిల్లికజ్జాల’ దృష్టితో చూడరాదని హితవు చెబుతూ ఇలా అభిప్రాయపడ్డారు కూడా: ‘ఈ సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్య వ్యవస్థలో ప్రధాన భాగస్వామ్య దేశం చైనా. అయినప్పుడు చైనా సరకులు భారత మార్కెట్లో ప్రవేశిస్తే మనం (ఇండియా) జడిసిపోరాదు. ఎందుకంటే, అలా మనం వెనుకడుగు వేస్తే మిగతా 16 దేశాలూ చైనాతో కలుస్తాయి. సామెత చెప్పినట్టుగా, గదిలోంచి మనం బయటకు వాకౌట్ చేయడం తేలికేగానీ, తిరిగి గదిలోకి ప్రవేశించడం కష్టం’ అన్నారు. అదొక రక్తచరిత్ర ప్రపంచబ్యాంక్ ఆధ్వర్యంలో అమెరికా వివిధ దేశాల్లో అమలు జరిపిస్తూ వచ్చిన ప్రజా వ్యతిరేక సంస్కరణలకు కొంతకాలం స్వయానా బ్యాంక్– ఐ.ఎం.ఎఫ్. సంస్థల ఉపాధ్యక్షునిగా, దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన ఆఫ్రికా ఖండ దేశాల్లో బ్యాంక్ సంస్కరణలను అమలు చేస్తున్న క్రమంలో డాక్టర్ డేవిసన్బుధూ తన దారుణ అనుభవాలను భరించలేక మనస్తాపంతో ఐ.ఎం.ఎఫ్. అధిపతి కామ్డెసస్కు రాసిన సుదీర్ఘ బహిరంగ లేఖ మన లాంటి వర్ధమాన దేశాలకు మరువరాని గుణపాఠం కావాలి: ‘కొన్ని ఆఫ్రికా దేశాల్లో బ్యాంక్ సంస్కరణలను బలవంతంగా నేను అమలు చేస్తున్న క్రమంలో నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ప్రజల్ని పీడించిన ఆ సంస్కరణలవల్ల రక్తమోడుస్తున్న చేతుల్ని ఆఫ్రికాలో నలుమూలలా లభించే నీళ్లతో కడిగినా, నా చేతులు చేసిన పాపం తొలగదుగాక తొలగదు’’. ఇలాంటి సత్యాన్ని మన దేశ పాలకుల్లో ఇక్కడి నోటినుంచి అయినా వినగలమా?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
గుండెచెరువు
►వరిని మింగేస్తున్న ఆక్వా ►పడిపోతున్న వరి సాగు విస్తీర్ణం ►అంతా చెరువుల మయం ►ఆక్వాకు అధికారపార్టీ వత్తాసు ►నిబంధనలకు తూట్లు ►అధికారుల చర్యలకు ప్రజాప్రతినిధుల మోకాలడ్డు ►ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ►రైతు సంఘాల ఆందోళన జిల్లాకు గుండెలాంటి గోదావరి డెల్టా.. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా పేరొందింది. ప్రస్తుతం దైన్యాగారంగా మారింది. నానాటికీ వరి విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్వా సాగు పెరుగుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు చెరువులు తవ్వేస్తున్నారు. వారికి అధికారపార్టీ నేతలు వత్తా సు పలుకుతున్నారు. ఏలూరు (మెట్రో) : ‘అనుమతులు లేని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేయండి. అక్రమంగా అనుమతులు ఇస్తే మత్స్యశాఖ అధికారులపై చర్యలు తప్పవు. ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడను’ ఇదీ గత వారం కలెక్టరేట్లో నిర్వహించిన చేపల చెరువుల అనుమతుల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పలికిన మాటలు.. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల అండ అడ్డదిడ్డంగా ఆక్వా చెరువుల తవ్వకానికి అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. నిబంధనలు పాటించని అక్రమార్కులపై అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంటే వారు అడ్డుతగులుతున్నారు. అధికారులపై దూషణల పర్వానికీ పూనుకుంటున్నారు. ‘ప్రభుత్వం మాదే.. అనుమతులు ఇవ్వకుంటే అంతు చూస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. ఫలితంగా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో అధికారులు ఉండిపోతున్నారు. ఉండి, భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవిగో.. ఉదాహరణలు.. ఉండి నియోజవకర్గం ఆకివీడు మండలంలో ఇటీవల మండల స్థాయి టీడీపీ కార్యకర్తలు, అధికారులతో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సమావేశాన్ని ఏర్పాటు చేసి.. చేపల చెరువుల అనుమతులు ఎందుకు రద్దుచేశారంటూ అధికారులను మందలించారు. కార్యకర్తల ముందే నిలబెట్టి దూషణలకు దిగారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ నేత నిడమర్రు మండలంలో చెరువుల అనుమతులపై మండల స్థాయి అధికారులపై విరుచుకుపడ్డారు. భీమవరానికి మంచినీటిని సరఫరా చేసే వేండ్ర మార్గంలో తాగునీటి చెరువు సమీపంలో చేపల చెరువులు తవ్వుతున్నారని నిలిపేందుకు యత్నించిన అధికారులకు అక్కడి ప్రజాప్రతినిధి నుంచి చివాట్లు ఎదురయ్యాయి.దీంతో అధికారులు నలిగిపోతున్నారు. చెరువులకు అనుమతులు ఇవ్వకుంటే.. ప్రజాప్రతినిధులు, ఇస్తే కలెక్టర్ తమపై విరుచుకుపడుతుండడంతో ఏమి చేయాలో పాలుపోక తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేయాలని మదన పడుతున్నారు. నాయకులే చెరువుల దళారులు చేపల చెరువులకు మండల స్థాయి నుంచి, జిల్లాస్థాయి వరకూ అనుమతులు తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలే దళారులుగా మారారు. వీరు గతంలో ఎకరా చెరువు అనుమతికి రూ.25వేలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిప్పించేందుకు తమ కమీషన్‌ను తగ్గించుకున్నారు. ప్రస్తుతం రూ.15వేలకు అన్నిరకాల అనుమతులూ తీసుకొస్తామని రైతుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనలకు పాతర.. మాగాణి భూములను చేపలు, రొయ్యలు చెరువులుగా మార్చాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటిని కచ్చితంగా అమలు చేయాల్సిందే. అయితే అక్రమార్కులు, దళారులు వీటిని పట్టించుకోవడం లేదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకుని చెరువులు తవ్వేస్తున్నారు. కొందరు అనుమతులు లేకుండానే అనధికార సాగుచేపట్టేస్తున్నారు. నిబంధనలు ఇవి.. వరి, ఇతర పంటలకు పనికిరాని భూములను మాత్రమే చేపల చెరువులుగా మార్చాలి.తమ భూములకు సాగునీటి వసతి లేదని, పంటలకు పనికి రావని ధ్రువీకరించే ఆధారం చూపించాలి.పంట, కాలువలు, డ్రెయిన్లకు దగ్గరలో చెరువులు తవ్వకూడదు. ఉప్పునీటి రొయ్యల సాగుకు అనుమతి లేదు. నిర్దేశించిన ఆరు రకాల చేపలను మాత్రమే పెంచాలి.అయితే ఈ నిబంధనలేమీ అక్రమార్కులకు పట్టడం లేదు. అక్రమ చెరువులపై ఫిర్యాదుల వెల్లువ ఇదిలా ఉంటే జిల్లాలో అక్రమంగా తవ్విన చెరువులపై కలెక్టరేట్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతివారం మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలకు సుమారు 20 నుంచి 50 ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కలెక్టర్ అక్రమంగా తవ్విన చెరువులపై దృష్టిపెట్టారు. మండల స్థాయి అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతల వల్ల చెరువుల తవ్వకాల నియంత్రణ అధికారులకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ మరింతగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవాలి! ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వరి మాయమవుతుందని, ఆహారభద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మత్స్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు వరి ప్రాధాన్యం, ఆక్వా చెరువుల వల్ల కలిగే అనర్థాలపై సదస్సులు నిర్వహించారు. ఇప్పటికైనా నష్టనివారణ చర్యలు చేపట్టాలని, అప్పుడే వరిసాగు వర్థిల్లుతుందని రైతు సంఘాలు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
వయసు నిర్ధారణకు ఆధార్ ఓకే!
- ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పథకానికి మార్గదర్శకాలు జారీ - ఓటర్ కార్డు, స్కూల్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఉన్నా పర్లేదు - జూన్ 2న లబ్ధిదారులకు రెండు నెలల మొత్తం అందజేత సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఎంపిక లో కనీస వయసు నిర్ధారణకు ఆధార్/ఓటర్ కార్డు/స్కూల్ సర్టిఫికెట్/బర్త్ సర్టిఫికెట్ వంటి పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా పర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి కల్పించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి లబ్ధిదారులకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక భృతి లభించనుంది. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రెండు నెలల మొత్తాన్ని ఒంటరి మహిళలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభమై 25కల్లా ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిబంధనలపై పట్టుబట్టేది లేదు ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పథకానికి లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలపై పెద్దగా ఒత్తిడి చేసేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం సచివా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అర్హత లేని వారికి లబ్ధి చేకూర్చిన అధికారులపై కఠిన చర్యలు చేపడతా మన్నారు. అలాగే ఆసరా పథకం కింద మరో 80 వేల మంది బీడీ కార్మికులకు ఆర్థిక భృతి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. గతంలో ఆసరా పింఛన్ పొందుతున్న వారి కుటుంబంలో బీడీ కార్మికులకు పింఛన్ వచ్చేది కాదని, అయితే ఈ నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులి చ్చిందన్నారు. బీడీ కార్మికులకు మే 1 నుంచి ఆర్థిక భృతిని వర్తింపజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోగా ఆసరా లబ్ధిదారులకు చేరాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఆసరా పింఛన్లకు ప్రభుత్వం నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తోం దని విలేకరులు ప్రశ్నించగా.. జాప్యం జరుగు తున్నా నెలనెలా పింఛన్‌ను తప్పకుండా అందజేస్తున్నామన్నారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆర్థిక భృతితో ప్రభుత్వంపై ఏటా రూ.500 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఏడాదిపాటు వేరుగా ఉన్నా ఒంటరి మహిళే 18 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు ఏడాదికి పైగా భర్త నుంచి వేరుగా ఉండడం, భర్త వదిలేసి ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో వివాహం చేసుకోని 30 ఏళ్ల పైబడిన వారు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లకు పైగా వయసు కల వారిని ఒంటరి మహిళలుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు లోపు ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. నిబంధనల మేరకు అర్హులైన వారు వ్యక్తిగతంగా గ్రామ పంచాయతీ కార్యదర్శికి/ పట్టణాల్లోనైతే బిల్ కలెక్టర్‌కు/ హైదరాబాద్ పరిధిలో వీఆర్వో లకు దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తుపై తమ ఫోటోను అంటించడంతో పాటు వయసు నిర్ధారణ పత్రం, సేవింగ్స్ బ్యాంక్/పోస్టాఫీసు ఖాతా పుస్తకం, ఆహార భద్రతా కార్డు లేదా తహసీల్దారు జారీ చేసిన వార్షికాదాయ పత్రం జిరాక్స్ ప్రతులను జత చేయాలి. దరఖాస్తులను స్వీకరించిన అధికారులు గ్రామ, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. -
ఫుడ్ వెరీ బ్యాడ్
►నగరంలో ‘ఆహార భద్రత చట్టం’ విఫలం ►హోటళ్లలో జోరుగా కల్తీ, అపరిశుభ్ర ఆహారం ►కోటి మందికి ఇద్దరే ఫుడ్ సేఫ్టీ అధికారులు ►తూతూమంత్రపు తనిఖీలతో ప్రయోజనం సున్నా ►ప్రహసనంగా శాంపిల్స్ సేకరణ కుళ్లిన మాంసం..రోజుల కొద్దీ ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన ఆహారం.. అపరిశుభ్రత మధ్యే వంటలు..డ్రైనేజీల పక్కనే గ్యాస్ స్టౌవ్‌లు..అడ్డగోలుగా రంగులు గుప్పించిన పదార్థాలు...బాబోయ్ నగరంలో హోటళ్లకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన హోటళ్ల తనిఖీల్లో భయంకర వాస్తవాలు వెలుగుచూశాయి. సిబ్బంది కొరత.. ఏళ్లుగా తనిఖీలు లేకపోవడం.. ఆహార భద్రత చట్టాన్ని తుంగలో తొక్కడం..ఫుడ్ సేఫ్టీపై నిర్లక్ష్యం వల్లే హోటల్ యజమానులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ‘ఫుడ్ సేఫ్టీ’పై సాక్షి ఫోకస్... సిటీబ్యూరో :జీహెచ్ఎంసీ అధికారులు గత 25 రోజులుగా నిర్వహిస్తున్న హోటళ్ల తనిఖీల్లో ప్రతినిత్యం కుళ్లిన మాంసం.. అపరిశుభ్ర వంటగదులు, శుచీ శుభ్రతల లేమితో తినడానికి పనికిరాని ఆహారాన్ని గుర్తిస్తున్నారు. తనిఖీల తంతుగా జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ, హోటళ్లలో పరిస్థితులు మారాయా ?అంటే లేదు. ఇలా ఎన్ని రోజులు తనిఖీలు చేసినా మారుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే గ్రేటర్లో ఉండాల్సినంతమంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. 30 మంది ఉండాల్సిన చోట ముగ్గురు కూడా లేరు. కోటి జనాభా దాటిన నగరంలో లక్షకు పైగా హోటళ్లను తనిఖీ చేయడం వీరివల్ల కాదని హోటల్ నిర్వాహకులకు తెలుసు. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు తనిఖీలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. అన్ని హోటళ్లలో జరగడం లేవు. ఎక్కువమంది ప్రజలు హోటళ్లకు వెళ్లే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి ప్రాంతాల్లో తనిఖీల్లేవు. జీహెచ్ఎంసీ స్లాటర్‌హౌస్‌ల్లో స్టాంప్ వేసిన (తినడానికి యోగ్యమైనదిగా) మాంసాన్ని వినియోగిస్తున్నారా లేదా అన్న అంశంపై తప్ప ఆహారకల్తీపై శ్రద్ధ చూపడం లేదు. మాంసం కల్తీని అరికట్టేందుకు ఈ తనిఖీలు అవసరమే అయినా.. మాంసం తప్పమరెందులోనూ కల్తీ జరగదా అంటే సమాధానం లేదు. అంతేకాదు.. కుళ్లినమాంసాన్ని, వాడి పారేసిన మాంసాన్ని తిరిగి వినియోగిస్తున్నారని పేర్కొంటున్నారు. ఆ మేరకు ఫొటోలతో ప్రకటనలు గుప్పిస్తున్నారు మినహా శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపుతున్న దాఖలాల్లేవు. ల్యాబ్‌లలో పరీక్షిస్తే.. కల్తీ తీవ్రత ఎంతో.. ఎంత ప్రాణాంతకమో తెలుస్తుంది. నిబంధనల కనుగుణంగా, సేకరించిన శాంపిల్స్‌ను నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌కు పంపే యంత్రాంగం సైతం లేదు. మొక్కుబడిగా జరిమానాలు రాసి హోటళ్లవారితో లాలూచీ పడుతున్నారు తప్ప నిజంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన యంత్రాంగమే జీహెచ్ఎంసీలో లేదు. ఆ మాటకొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి. ఎఫ్ఎస్ఎస్ఏ ఎక్కడ? ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏ(‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2002) నగరంలో అమలు కావడం లేదు. దేశంలోని ఇతర నగరాల్లో 2011 ఆగస్టునుంచి ఇది అమల్లోకి వచ్చినప్పటికీ, నగరంలో అమలవుతున్న జాడ లేదు. ఈ చట్టం మేరకు, ఆస్తిపన్ను వివరాల మాదిరిగా ప్రతి ఆహార విక్రయ కేంద్రం వివరాలు జీహెచ్ఎంసీ వద్ద ఆన్లైన్లో జాబితా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని గుర్తించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలు.. కల్తీని బట్టి కఠినచర్యలుండాలి. కానీ.. ఇవేవీ లేవు. దీంతో ప్రజారోగ్యం.. వైద్యాధికారుల దాడులు ప్రహసనంగా మారాయి. రాష్ట్రంలో ఫుడ్‌సేఫ్టీ అథారిటీలో తగినంతమంది అధికారులతోపాటు జీహెచ్ఎంసీకి సంబంధించి కావాల్సినంతమంది అధికారులు లేరు. గతంలో ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ (పీఎఫ్ఏ) చట్టం అమల్లో ఉన్నప్పుడున్న హెల్త్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నవారే కొత్త ఫుడ్ సేఫ్టీ చట్టం వచ్చాక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్త చట్టం మేరకు జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లకు 30 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఐదు జోన్లకు ఐదుగురు డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు (డీఓలు) ఉండాలి. వీరిపైన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్(ఏఎఫ్సీ)ఉండాలి. కానీ ఒక ఏఎఫ్సీ(అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఇద్దరు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. డాక్టర్లు ‘చెత్త’ పనులకు.. చట్టం పకడ్బందీగా అమలు కావాలంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, డిజిగ్నేటెడ్ ఆఫీసర్లుగా డాక్టర్లుంటే మేలు. పలు రాష్ట్రాల్లో డాక్టర్లే ఈ విధులు నిర్వహిస్తుండగా, జీహెచ్ఎంసీ ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలోని డాక్టర్లు మాత్రం చెత్త పనుల్ని పర్యవేక్షిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. ఫుడ్ సేఫ్టీ, డిజిగ్నేటెడ్ ఆఫీసర్లుగా వారు వ్యవహరిస్తే పరిస్థితి కొంతైనా మారే వీలుంది. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర , ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో డాక్టర్లే ఈ పోస్టుల్లో ఉన్నారు. శిక్షణ లేమి.. డీఓ, ఎఫ్ఎస్ఓలుగా నియమితులైన వారు కల్తీని నిరోధించే అంశంలో ప్రత్యేక శిక్షణ పొందాలి. ఎఫ్ఎస్ఎస్ఏ ధ్రువీకరించిన సంస్థలో శిక్షన పొందాలి. అయితే నగరంలో ప్రస్తుతమున్న ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఓలు ఎలాంటి శిక్షణ పొందలేదని సమాచారం. ఈ నేపథ్యంలో నగరజీవి ఆరోగ్యం.. దైవాదీనంగా మారింది. తనిఖీలు.. జరిమానాలు.. గడచిన 25 రోజుల్లో .. తనిఖీ చేసిన హోటళ్లు : 363 జరిమానా విధించిన హోటళ్లు: 201 విధించిన జరిమానా మొత్తం : రూ. 16,62,100 కోటి మంది జనాభాకు ఇద్దరే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు.. జీహెచ్ఎంసీలో 2012లో ముగ్గురు డిజిగ్నేటెడ్ ఆఫీసర్ (డీఓ)లను మాత్రం నియమించారు. వారిలో ఒకరు 2013లో రిటైరయ్యారు. 2016లో ఒకరు అసిస్టెంట్‌ఫుడ్ కంట్రోలర్ (ఏఎఫ్సీ)గా పదోన్నతి పొందారు. మరొకరు 2016లో మాతృసంస్థకు(పబ్లిక్‌హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) బదిలీ అయ్యారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఒక ఏఎఫ్సీ, ఇద్దరు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు (ఎఫ్ఎస్ఓ) మాత్రం ఉన్నారు. ఏఎఫ్సీయేగా బాధ్యతలు నిర్వహిస్తున్నవారే ఐదు జోన్లకు ఇన్‌ఛార్జి డీఓగా వ్యవహరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. ప్రస్తుతం కేవలం ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఓలు మాత్రమే ఉన్నారు. శాంపిల్స్ సేకరిస్తున్నాం తనిఖీల సందర్భంగా జరిమానాలు విధించడంతోపాటు శాంపిల్స్ సేకరణ కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు 30 శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. వాటి రిపోర్టు రావడానికి నెలరోజులు పడుతుంది. వచ్చాక కల్తీని బట్టి అవసరమైన కఠినచర్యలు తీసుకుంటాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
నీటి భద్రతకు చట్టం కావాలి: సుజనా
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతకు చట్టమున్నట్లే దేశంలోని రైతులు పంటలు పండించేందుకు నీరు అందుబాటులో ఉంచేలా ప్రత్యేక చట్టం అవసరమని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. రైతులు తమ శ్రమ శక్తికి, పంటలు పండించే భూమికి తగిన విలువ సంపాదించుకునే ఆలోచన చేయాలని, ఇందుకోసం వారు ఆర్థిక వ్యవహారాలనూ ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కాన్క్లేవ్’లో ఆయన మాట్లాడుతూ... రైతులు తమ శ్రమ, పంటలు పండించే నేల నుంచి అత్యధిక విలువను పొందడంలో విఫలమవుతున్నారని, వారికి కాస్ట్ అకౌంటెన్సీ, లాభ నష్టాలను ఎలా లెక్కిస్తారో.. వేటిని పెట్టుబడులుగా పరిగణిస్తారో తెలియ జేయాల్సిన అవసరముందన్నారు. దీంతోపాటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించి, వారికి సాయపడేలా స్వచ్ఛంద కార్యకర్తలను సిద్ధం చేయాలన్నారు. ఆటోడెస్క్‌తో ఒప్పందం... గ్రామీణ సృజనలను వాణిజ్య స్థాయికి తీసుకొచ్చేందుకు వీలుగా ఎన్ఐఆర్డీ...అంతర్జాతీయ సంస్థ ఆటోడెస్క్‌తో అవగాహన ఒప్పం దం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా డిజైనింగ్, ప్రొటో టైపింగ్ లకు ఉపయోగపడే ఆటోడెస్క్ సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐఆర్డీకి ఉచితంగా అందజేస్తామని ఆటోడెస్క్ ససై్టనబిలిటీ ఫౌండేషన్ అధికారి జేక్ లేస్ తెలిపారు. గ్రామీణ స్థాయి ఇన్నోవేటర్స్, స్టార్టప్ కంపెనీలు వీటిద్వారా మెరుగైన ఉత్పత్తులను సిద్ధం చేయవచ్చన్నారు. సామాజిక ప్రభావం చూపగల ఆవిష్కరణలు, సేవల విషయంలో తాము ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్ కంపెనీలకు చేయూత అందిస్తున్నామన్నారు. ఏటా దాదాపు 1.5 లక్షల డాలర్ల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులను స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్స్, ఇన్నొవేటర్లకు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
9 కరువు పీడిత రాష్ట్రాలకు సుప్రీం సమన్లు
న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైనందుకు ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది కరువు పీడిత రాష్ట్రాలకు సుప్రీంకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తగినంత సమయం లభించినా తొమ్మిది రాష్ట్రాలు ఆహార భద్రత పథకాన్ని ప్రజలకు సక్రమంగా అందించడంలో విఫలమయ్యాయని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హరియాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు వెళ్లాయి. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కూడా ఆహార కమిషన్లను ఇంకా ఏర్పాటు చేయకపోయినా, ఇప్పటికే ఆ ప్రక్రియను మొదలుపెట్టడంతో ఆ రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కోర్టు సమన్లు ఇవ్వలేదు. -
‘ఆహార భద్రత’ కింద నిషేధమా..?
పొగాకు ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఆహార నిర్వచనం కింద పొగాకు ఉత్పత్తుల తయారీ, పంపిణీ, నిల్వ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద ఆహార భద్రత కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. పొగాకు ఉత్పత్తులకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద నిషేధం ఎలా వర్తిస్తుందో వివరించాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆహార, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆహార భద్రత కమిషనర్, డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రత కమిషనర్ ఈ ఏడాది జనవరి 10న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కరీంనగర్ జిల్లా ప్రకాశంగంజ్కు చెందిన శ్రీ వెంకటేశ్వర జనరల్ స్టోర్ యజమాని కె.కరణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున ఇ.మదన్మోహన్రావు వాదనలు వినిపిస్తూ... పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం కింద కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని... సిగరెట్లు, చుట్టలు, బీడీలు తదితరాలు పొగాకు ఉత్పత్తుల పరిధుల్లోకి వస్తాయని పేర్కొందన్నారు. అయితే రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతా చట్టం కింద నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. గతేడాది కూడా ఇదే విధంగా నోటిఫికేషన్ జారీ చేయగా, దానిపై హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. -
2030కి ఆకలి కేకలకు అంతం!
♦ సమతుల పౌష్టికాహారమే ఇప్పుడు మన ముందున్న సమస్య ♦ చిరు ధాన్యాలతోనే పౌష్టికాహారం.. పప్పు ధాన్యాల వినియోగాన్ని పెంచాలి ♦ నిత్య హరిత విప్లవం ద్వారానే ఇది సాధ్యం ♦ వరి, గోధుమలతో పాటు చిరుధాన్యాలను తక్కువ ధరకు అందించాలి ♦ సముద్ర మట్టం పెరిగితే నష్టపోయేది వ్యవసాయ రంగమే.. ♦ దీన్ని నివారించడానికి మడ అడవులను పెంచాలి ♦ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ స్వామినాథన్ (తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఆకలి కేకల నుంచి భారత్ విముక్తం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, బహుశా 2030 నాటికి ఆకలి బాధ అంతమవుతుందని హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశం ముందున్న అతి పెద్ద సమస్య సమతుల పౌష్టికాహారమన్నారు. ఆహార భద్రతా చట్టం దేశ చరిత్రలో ఓ మైలురాయని అభివర్ణించారు. అందరికీ పౌష్టికాహారం అందాలంటే శాశ్వత హరిత విప్లవమే(ఎవర్ గ్రీన్ రివల్యూషన్) మార్గమని స్పష్టం చేశారు. 104వ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా శుక్రవారమిక్కడ ఆహారం, పౌష్టికాహార భద్రతపై ప్రసంగించారు. అనంతరం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో పలు అంశాలను చెప్పారు. బెంగాల్ కరువు మొదలు ఆహార భద్రత వరకు 1942–43లో వచ్చిన బెంగాల్ కరువుతో వేలాది మంది క్షుద్బాధతో మరణించారు. అయితే ఆ వేళ ఆహారం లేక జనం చచ్చిపోయిన దానికన్నా సరైన పంపిణీ లేదా అందుబాటులో లేక మరణించారు. ఆ దుస్థితి నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకు స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పాటు పలువురు వ్యవసాయం, నీటిపారుదల, ఎరువుల రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. శాస్త్రీయ విజ్ఞానం ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ విధానం (మార్కెటింగ్, ధరలు, సేకరణ), ప్రజా ప్రాతినిధ్యం కీలకాంశాలుగా సాగిన ఆ ఉద్యమంతో 1968 నాటికి తిండిగింజల తిప్పలు తీరాయి. ఆనాటి ఉద్యమం మధ్యలోనే విఫలమైనా... 2013లో తీసుకువచ్చిన ఆహార భద్రతా చట్టం దేశ చరిత్రలో ఓ మైలు రాయి. ఈ చట్టంతో అందరికీ సమతుల ఆహారం అందాల్సి ఉంది. వరి, గోధుమలతో పాటు చిరుధాన్యాలను అతి తక్కువ ధరకు అందించాలి. 2030 నాటికి సుస్థిర వ్యవసాయాభివృద్ధి... 2030 నాటికి సుస్థిర వ్యవసాయాభివృద్ధిని సాధించాలన్నది ప్రస్తుత ఎజెండా. కేంద్రప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఇదొకటి. ఆకలిని అంతం చేయడం, ఆహార లక్ష్యాన్ని సాధించడం, పౌష్టికాహారాన్ని అందించడం మన ముందున్న లక్ష్యం. 2020 నాటికి దేశంలో వంద మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అదే స్థాయిలో చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల దిగుబడి, వినియోగం కూడా పెరగాలి. అప్పుడే సమతుల ఆహారం అందించినట్టవుతుంది. ఈ లక్ష్య సాధనకు నిత్య హరిత విప్లవమే మార్గం. ఇది శాశ్వతంగా సాగాలి. 2010లో ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం ఈ అంశంపై కలసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. క్యాలరీలు, ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు సమపాళ్లలో అందకపోతే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్నే శాస్త్రపరిభాషలో హిడెన్ హంగర్ అంటారు.(తీరని ఆకలి. కడుపు నిండుతుందే తప్ప పోషకాలు ఉండవు. ఫలితంగా వ్యాధులు వస్తాయి.) ఈ నేపథ్యంలో ఈ బయో ఫోర్టిఫికేషన్ (బయోటెక్నాలజీతో పోషక విలువలున్న వంగడాలను సృష్టించడం) వంగడాలను రూపొందించాలి. బొటానికల్ గార్డెన్స్ ప్రాధాన్యత పెరగాలి... గతంలో మనకు ప్రతి ఇంటా కూరగాయల పందిళ్లు ఉండేవి. ఇప్పుడు లేదు. అవకాశం ఉన్న ప్రతి ఇంటా బొటానికల్ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లను పెంచితే అటు పర్యావరణానికి ఇటు పోషకాలకూ ఢోకా ఉండదు. సముద్ర మట్టం పెరిగితే అంతా అనర్థమే... ప్రస్తుతం పర్యావరణానికి ముంచుకొస్తున్న సమస్య సముద్ర మట్టం పెరగడం. దీన్ని నివారించేలా మడ అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి. సముద్ర మట్టాలు పెరిగితే తొలుత నష్టపోయేది వ్యవసాయ రంగమే. ఆగ్రో బయోడైవర్శిటీని కాపాడుకునేలా సంప్రదాయ దృక్పథంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో ముందుకు వెళ్లాలి. ఆహార భద్రత అంటే.. ఆహార అవసరాలను తీర్చేందుకు అవసరమైన తిండిగింజలను భౌతికంగా అందుబాటులో ఉంచడమే కాకుండా అవి సామాజికంగా, ఆర్థికంగా, అందరికీ సరిపడా అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే క్రియాశీల, ఆరోగ్యకరమైన జీవనానికి అనువైన ఆహారాన్ని అందించినట్టవుతుంది. దీన్నే ఆహార భద్రత అంటారు. పోషకాహార భద్రత అంటే.. సమతుల ఆహా రాన్ని అందరికీ భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అందుబాటులో ఉంచాలి. రక్షిత మంచి నీరు, పరిశుభ్రమైన పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడం. యువత ఎందుకు మొగ్గు చూపడం లేదు? ఆర్థికంగా గిట్టుబాటు కాకనే. వాస్తవ ఆదాయం వస్తుందన్న భరోసా ఉంటే యువకులు వస్తారు. ఐటీ రంగంలో ఆకర్షణీయ వేతనాలున్నాయి. ఇప్పుడు వ్యవసాయ వర్సిటీలు వ్యవసాయ సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలి. ఆర్థికంగా గిట్టుబాటయ్యే పనిని ప్రభుత్వాలు చేస్తే సాంకేతికంగా, ఆకర్షణీయంగా మలిచేలా విశ్వవిద్యాలయాలు చేయాలి. పాలకులు పంటల బీమా, ఇతరత్రా రాయితీలు వంటి పథకాలను ప్రవేశపెట్టినా అవి పరిమితమైనవి. పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై.. ఆయన తరఫున స్వామినాథన్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ భవానీ సమాధానం ఇస్తూ... ఎవరికి తోచిన రీతిలో వారు భూమిని సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలేకర్ విధానంపై మాకు నిర్ధిష్టమైన అభిప్రాయమేమీ లేదు. ఒకరు సేంద్రీయం అంటున్నారు, మరొకరు ప్రకృతి సేద్యం అంటున్నారు. ఇంకొకరు సంప్రదాయ సేద్యం అంటున్నారు. ఇలా ఎన్ని ఉన్నా అందరి లక్ష్యం మానవాళి సంక్షేమమే, భూ ఆరోగ్యస్థితిని కాపాడడమమే కదా...!! పేదలకు వరం చిలగడదుంప పౌష్టికాహారాన్ని చిలగడ దుంపలోనూ (స్వీట్ పొటాటో) పొందవచ్చు. అల్పాదాయ వర్గాలకు ఇదో వరం. పోషకాలపై అవగాహనను పెంచాలి. ఇళ్ల వద్ద పండించే దుంపలను, పండ్లను, కూరలను విరివిగా తీసుకునేలా మహిళలకు అవగాహన కల్పించాలి. ఆహారమే ఔషధం... ఎంత తింటున్నాం అనే దానికన్నా ఏమి తింటున్నాం అన్నదే ప్రధానం. అందుకే ఆహారమే ఔషధం అంటారు. మందులతో అన్ని వ్యాధులను నయం చేస్తారనుకోవడం భ్రమ. న్యూట్రీషియన్, వ్యవసాయ, ఆరోగ్య, అటవీ, వైద్య విభాగాలన్నీ కలసి పని చేయాలి. అప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయి. రైతు ఆత్మహత్యలు సంక్లిష్ట సమస్య ఇది చాలా సంక్లిష్టమైన సమస్య. అననుకూల పరిస్థితులు, వాతావరణం, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ లేకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రుణాలు పెద్ద సమస్యగా మారాయి. బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి వస్తే వాయిదా రూపంలో కట్టమంటున్నారు. చేతిలో డబ్బులే లేకుంటే ఎక్కడి నుంచి తీసుకువచ్చి రుణాలు చెల్లిస్తారో పాలకులు ఆలోచించాలి. ఏదైనా ఉపద్రవం వస్తే ఆదుకోవడానికి గతంలో మాదిరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఈ నేపథ్యంలో స్థానిక కమ్యూనిటీలే ధైర్యం చెప్పాలి. జీవితం ఉన్నది బతకడానికే గాని ప్రాణం తీసుకోవడానికి కాదు. -
గత వినతులకే గతిలేదు..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచింది. మూడు పర్యాయాలు ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమాలు నిర్వహించింది. లక్షల మంది రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు, మరుగుదొడ్లు, గ్రామీణ సమస్యలపై వినతులు, ఫిర్యాదులు అందజేశారు. వీటిని పరిష్కరించకుండానే సోమవారం నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి సభల నిర్వహణకు సిద్ధం కావడంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్ప తెలుగుదేశం పాలనలో ఒక్కసంక్షేమ పథకమూ సరిగా అందడం లేదంటూ వాపోతున్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం సాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా... నగదు కష్టాలు పరిష్కరించకుండా, పింఛన్లు సరిగా పంపిణీ చేయకుండా మళ్లీ జన్మభూమి కమిటీలు ఎందుకంటూ ధ్వజమెత్తుతున్నారు. గతంలో వచ్చిన 1,41,053 వినతుల్లో ఎన్ని సరిగా పరిష్కరించారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. విధిలేక మరోసారి వ్యయప్రయాసల కోర్చి వినతులు, ఫిర్యాదులు అందజేసేందుకు, అధికారుల ముందు గోడు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇలా... తొలివిడత జన్మభూమి కార్యక్రమం 2014 అక్టోబర్ 2 నుంచి 20 తేదీ వరకు జరిగింది. తొలిసారి కావడంతో ప్రజలు స్పం దించి జిల్లా వ్యప్తంగా 34 శాఖలకు సంబంధించిన 1,74,153 వినతులు అందజేశారు. వీటిలో ప్రధానంగా రెవెన్యూ–44,314, సివిల్ సప్లై (కొత్తకార్డు కోసం)–36,557, గృహనిర్మాణం–44,313, పంచాయతీ రాజ్ విభాగానికి 11,780, పింఛన్లు కోసం–12,502, తాగునీటి సమస్యలపై–2,190 ఇలా అన్ని శాఖలకు సంబంధించిన వినతులు వచ్చాయి. వీటిలో అధిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో 2015 జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన జన్మభూమిలో కేవలం 6,155 సమస్యలే వచ్చాయి. 2016 జనవరి 2 నుంచి 11 వరకు జరిగిన జన్మభూమి సభల్లో కేవలం జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే రేషన్ కార్డులు అందజేశారు.అన్ని శాఖలకు సంబంధించి 60,745, వినతులు వచ్చినా పరిష్కారం అంతంత మాత్రమే. నేటి నుంచి నాలుగో విడత జన్మభూమి సభలు జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఈ సారి 15 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేశారు. కుటుంబ వికాసం.. సమాజ వికా సం, సమగ్ర రాష్ట్ర వికాసం.. సంపూర్ణ దేశ వికాసం ధ్యేయంగా జీవన భద్రత ఎన్టీఆర్ భరోసా, ఆహార భద్రత, చంద్రన్న బీమా, విద్యుత్ భద్రత, దీపం పథకం, ఆత్మ గౌరవం, ఆరోగ్య భద్రత, విద్యాభద్రత, మంచినీటి భద్రత, గృహ భద్రత, ఇంటింటా పశుసంపద, ఉపాధి ఉద్యోగ భద్రత, సమాచార సాంకేతిక విజ్ఞానం, శాంతిభద్రతల పరిరక్షణ/మహిళలకు భద్రత, ప్రతి కుటుంబానికి రూ.10 వేలు కనీస ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకొవాలంటూ ప్రణాళికలు సిద్ధం చేశారు. పింఛన్లు, ఇళ్లు మంజూరు, రేషన్‌కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీపం కనెక్లన్లు, సంక్రాంతి కానుకలను జన్మభూమి సభల్లోనే పంపిణీ చేయాలని తీర్మానించారు. అయితే... ప్రణాళికలు కార్యరూపం దాల్చేనా అన్న అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఫిర్యాదుల స్వీకరణ జిల్లా వ్యాప్తంగా జరిగే జన్మభూమి–మా ఊరు గ్రామ సభల్లో విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీరు దత్తు సత్యనారాయణ తెలిపారు. సోమవారం నుంచి జరగనున్న జన్మభూమి–మాఊరు గ్రామ సభలకు విద్యుత్ సిబ్బంది హాజరవుతారని, తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అనర్హుల చేతిలో ‘అన్నపూర్ణ’!
సగానికిపైగా దుర్వినియోగం ధనవంతులకూ ‘ఆహారభద్రత’ నిఘావర్గాల సర్వేలో తేలిన నిజాలు! పేదలకే దక్కాల్సిన సంక్షేమ పథకా లు పక్కదారి పట్టాయి. అనాథలు, ఏ ఆసరా లేనివారికి దక్కాల్సిన అన్నపూర్ణ కార్డులు, నిరుపేదల అం త్యోదయ అన్నయోజన కార్డులు అనర్హుల చేతికి చేరాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే దక్కాల్సిన ఆహార భద్రత కార్డులు కోటీశ్వరులకూ అందాయి. అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులకు సంబంధించి ఇటీవల నిఘా వర్గాలు నిర్వహించిన సర్వేలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూసినట్లు తెలిసింది. సగానికిగా అనర్హుల వద్దే ఉన్నట్లు సమాచారం. సాక్షి, కామారెడ్డి : ఏ ఆసరా లేని నిరుపేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రవేశపెట్టిన అన్నపూర్ణ పథకం అభాసుపాలవుతోంది. అనర్హులే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. ఏ ఆసరా లేని వారికి అన్నపూర్ణ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్డు కలిగిన వారికి ఉచితంగా నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు. అయితే అనర్హులకు సైతం ఈ కార్డులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇటీవల నిఘా వర్గాల ద్వారా ఆరా తీసింది. కామారెడ్డి జిల్లాలో అన్నపూర్ణ కార్డులు 1,087 ఉన్నాయి. ఇందులో సగానికి పైగా అనర్హుల చేతిలో ఉన్నట్లు నిఘా వర్గాల సర్వేలో తేలినట్లు సమాచారం. అంత్యోదయ కార్డులదీ అదేదారి అంత్యోదయ కార్డుల ద్వారా నిరుపేద కుటుంబాలకు రూపాయికి కిలో చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తారు. జిల్లాలో 16,425 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు సైతం నిరుపేదలతోపాటు ఇతరులకూ అందాయని సర్వేలో తేలి నట్లు సమాచారం. సాధారణంగా ఆహార భద్రత కార్డుల ద్వా రా కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం మాత్రమే ఇస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్న వారికి మాత్రం కుటుంబ సభ్యుల సంఖ్యకు సంబందం లేకుండా 35 కిలోల బియ్యం ఇస్తారు. నిరుపేద కుటుంబాలకు ఈ పథకాలు వర్తిస్తాయి. కానీ రాజకీయ పార్టీల నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికార యంత్రాంగం అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండడం పరిపాటిగా మారింది. కోటీశ్వరులకూ ‘ఆహార భద్రత’ జిల్లాలో 2,28,527 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. దారి ద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఈ కార్డులు ఇవ్వాల్సి ఉం టుంది. అయితే ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండి, ఆదాయ పు పన్ను చెల్లించేవారికి సైతం ఆహార భద్రత కార్డులు అం దాయి. పెద్దపెద్ద బంగళాలు ఉండి, కార్లలో తిరిగే కోటీశ్వరులు సైతం ఈ కార్డులు పొందారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు ఉంటే చర్య లు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించడంతో చాలా మంది తమ కార్డులను వెనక్కు ఇచ్చేశారు. ఇంకా చాలా మంది అనర్హుల వద్ద ఆహార భద్రత కార్డులున్నాయి. జిల్లా యంత్రాంగంపైనే భారం అనాథలు, అత్యంత నిరుపేదలకు చెందాల్సిన అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులు అనర్హుల చేతుల్లో చిక్కిన వైనం వెలుగులోకి వస్తున్నందున జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిం చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు పేదల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు వారికే చెందేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. -
బినామీలే!
సగం రేషన్ షాపులు బినామీల చేతుల్లోనే.. ఏళ్లుగా ఇదే వ్యవహారం కామారెడ్డి :జిల్లాలో 575 రేషన్ షాపుల పరిధిలో 2,28,260 ఆహారభద్రత కార్డులు, 16,419 అంత్యోదయ కార్డులు, 1,090 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. నెలలో పక్షం రోజుల పాటు రేషన్ సరకులు సరఫరా చేయాల్సిన డీలర్లు.. కొన్ని చోట్ల రెండు, మూడు రోజులు మాత్రమే దుకాణాలను తెరుస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో 575 రేషన్ షాపుల్లో దాదాపు సగం దుకాణాలు బినామీల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో సగానికిపైగా షాపులను బినామీలే నిర్వహిస్తున్నారు. రేషన్ డీలర్లుగా స్థిరపడిన కొందరు.. అధికారులతో కుమ్మక్కై ఒక్కొక్కరు నాలుగైదు రేషన్ షాపుల బాధ్యతలు చూస్తున్నారు. వీరు అసలు డీలర్లకు ఎంతోకొంత కమీషన్ ఇచ్చి ఆయా షాప్‌లను తమ గుత్తాధిపత్యంలోకి తీసుకుంటున్నారు. ఏదైనా కేసుల్లో ఇరుక్కుని డీలర్లు సస్పెండ్ అయితే.. వాటిని కూడా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులతో పాటు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని తమ బినామీ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. చాలా రేషన్ షాపులు మహిళల పేరిట ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ కూతుళ్ల పేరిట రేషన్ షాప్ అనుమతులు పొందినవారు.. కూతుళ్ల వివాహమయ్యాక కూడా ఆ షాప్‌లను తమ అధీనంలోనే ఉంచుకుని బినామీ డీలర్లుగా కొనసాగుతున్నారు. దారిమళ్లుతున్న సరకులు బినామీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలకు అందాల్సిన రేషన్ సరకులను నల్లబజారుకు తరలిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో బినామీ డీలర్ల హవా కొనసాగుతోంది. ఒక్కొక్కరు రెండు, మూడు షాపులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సరకులను రవాణా చేస్తున్నారు. బినామీ డీలర్లు అసలు డీలర్లకు నెలనెలా రూ. 3 వేల నుంచి రూ. 6 వేల దాకా కమీషన్ ఇస్తున్నారని తెలిసింది. అలాగే అధికారులకు మామూళ్లు ఇస్తూ బినామీ డీలర్లుగా తమ అక్రమాలు కొనసాగిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం రేషన్ షాప్ ఎవరి పేరిట ఉందో వారే నిర్వహించాలి. బినామీలతో నిర్వహిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని షాపులపై చర్యలు తీసుకున్నాం. రేషన్ సరకులను లబ్ధిదారులకు అందించకుండా నల్లబజారుకు తరలిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. బినామీ షాపుల గురించి వివరాలు సేకరిస్తున్నాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి -
ఈనెల నుంచి దేశమంతా ఆహార భద్రత
న్యూఢిల్లీ: ఆహార భద్రత చట్టం కింద దేశంలోని 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలను సబ్సిడీపై అందించడానికి ఏటా రూ. 1.4 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. 2013లో ఆమోదం పొందిన ఈ చట్టాన్ని కేరళ, తమిళనాడు మినహా దేశమంతటా ఈనెల నుంచే అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ప్రతీ మనిషికి బియ్యం, గోధుమలను 5 కేజీల చొప్పున అందించనున్నారు. బియ్యం కేజీ రూ. 3, గోధుమలు కేజీ రూ. 2కు ఇవ్వాలని నిర్ణయించారు. -
గ్యాస్ కనెక్షన్ ఉంటేనే రేషన్ కార్డు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో ఆహార భద్రత(రేషన్) కార్డు దారులకు గ్యాస్ కనెక్షన్ తప్పని సరిగా మారింది. పౌరసరఫరాల శాఖ కొత్త కార్డుల మంజూరుకు వంట గ్యాస్ కనెక్షన్ మెలిక పెట్టింది. వంట గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న పేద కుటుంబాలకు మాత్రమే కొత్త కార్డులు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్డులకు సైతం గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి చేయాలని అధికారులను సూచించారు. విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహా నగరాన్ని కాలుష్య రహిత మార్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే నగరంలో కిరోసిన్ వినియోగం నివారణ కోసం కసరత్తు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు తక్షణమే వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల వారీగా గ్యాస్ వినియోగం లేని కుటుంబాలను గుర్తించి వారికి కనెక్షన్లు ఇప్పించే బాధ్యతలను డీలర్లకు అప్పగించింది. వంటగ్యాస్ లేని కుటుంబాలపై దృష్టి గ్రేటర్ హైదరాబాద్‌లో వంట గ్యాస్ కనెక్షన్లు లేని ఆహార భద్రత కార్డుదారులపై పౌరసరఫరా శాఖ దృష్టి సారించింది. మొత్తం 11.71 లక్షల ఆహార భద్రత (రేషన్) కార్డుదారులుండగా అందులో వంట గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలు 2.37 లక్షలపైన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెలా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులకు నాలుగు లీటర్లు, సింగిల్ ఎల్పీజీ సిలిండర్ గల కార్డుదారులకు ఒక లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా సుమారు 18.77లక్షల లీటర్ల వరకు కిరోసిన్ కోటాను కేటాయిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో తెల్ల కిరోసిన్ లీటరు ధర రూ.49లు ఉండగా, చౌక ధరల దుకాణాల ద్వారా కేవలం లీటరు కిరోసిన్ రూ.15ల చొప్పున కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. మిగితా రూ.34లను సబ్సిడీగా కేంద్రం భరించి చమురు సంస్థలకు చెల్లిస్తోంది. అయితే ఇందులో 60 శాతం పైగా కిరోసిన్ పక్కదారి పడి వంటింట్లోకి బదులు వాహనాల్లో ఇంధనం గా మారుతోంది. ఫలితంగా వాహనాలు కాలుష్యం చిమ్ముతూ నగర వాసుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. -
ఆహారభద్రత కార్డులొచ్చాయ్
జిల్లాకు చేరిన 10.72 లక్షల కార్డులు తహసీల్దార్ కార్యాలయాలకు సీల్డ్బాక్సులు పంపిణీకి విడుదల కాని మార్గదర్శకాలు మరోసారి పరిశీలన తర్వాతే పంపిణీ ముకరంపుర : ఎట్టకేలకు ఆహారభద్రత కార్డులు జిల్లాకు వచ్చేశాయి. 121 సీల్డ్‌బాక్సుల్లో 10.72 లక్షల కార్డులు గురువారం జిల్లాకు చేరాయి. పౌరసరఫరాల శాఖ ద్వారా వీటిని ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలకు పంపిణీ చేయనున్నారు. కమిషనరేట్ నుంచి మార్గదర్శకాలు విడుదలైన తర్వాత సీల్డ్‌బాక్సులను తెరిచి మరోసారి కార్డులను పరిశీలన అనంతరం వాటిని గ్రామాల్లో పంపిణీ చేయనున్నామని డీఎస్వో నాగేశ్వర్రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన రేషన్‌కార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఆహారభద్రత కార్డులను జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు మీ–సేవలో ముద్రించిన కూపన్‌తోనే సరిపెట్టారు. ఆధార్ అనుసంధానం, ఆన్లైన్లో నమోదు, కార్డుల ముద్రణ వంటి కారణాలతో గత రెండేళ్లుగా కొత్త కార్డుల పంపిణీలో జాప్యం జరిగింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోగో, సీఎం కేసీఆర్ ఫొటోతో కార్డులను ముద్రించారు. వాటిని సీల్డ్‌బాక్సుల్లో పంపించడంతో కార్డుల నమూనా బయటికి తెలియడంలేదు. 10.72లక్షల కార్డులు.. గతంలో జిల్లాలో అన్ని రకాల కార్డులు కలిపి 10,93,674 ఉన్నాయి. ఇందులో ఆహారభద్రత కార్డులు 10,25,692, అంత్యోదయ కార్డులు 67,317, అన్నపూర్ణ కార్డులు 665. సింగిల్ కార్డులను ఒకే కుటుంబంలో మిళితం చేయడంతో 21,674 కార్డులు తగ్గాయి. బోగస్‌కార్డులు, మరణించిన వారి కార్డులు ఏరివేశారు. దీంతో తాజాగా కార్డుల సంఖ్య 10,72,000లకు చేరింది. ఈ కార్డులను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ముద్రించి సీల్డ్‌బాక్సుల్లో జిల్లాకు పంపించారు. ఆహారభద్రత కార్డులు రేషన్ సరకులకు మాత్రమే ఉపయోగపడుతాయని ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ పథకాలతో ఆహారభద్రత కార్డుకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. జిల్లాలో 38 లక్షల జనాభా ఉండగా.. 31,50,935 మంది ఆహారభద్రత కార్డులతో లబ్ధిపొందనున్నారు. కొత్త జిల్లాలో సంబంధం లేకుండానే... ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మూడు జిల్లాలుగా మారుతోంది. కరీంనగర్‌తోపాటు కొత్తగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కార్డుల జారీకి జిల్లాల విభజనకు సంబంధం లేదంటూ రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయం తేల్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మరోసారి కొత్త కార్డులు ముద్రించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాత కార్డులు 10,93,674 తొలగించినవి 21,674 కొత్త కార్డులు 10,72,000 ఆహారభద్రత 10,25,692 అంత్యోదయ 67,317 అన్నపూర్ణ 665 -
ఆహారభద్రతతో పేదరికంపై గెలుపు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దేశంలో ఆహారభద్రత కల్పించబడడంతో పేదరికంపై గెలుపు సాధించగలిగామని జాయింట్ కలెక్టర్–2 సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. కృష్ణాపుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్నచర్చల్లో భాగంగా శుక్ర వారం పేదరికంపై గెలుపు అనే అం శంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతా ల్లో వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులపై ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చేతి పని వృత్తుల వారల జీవనం ఆశించిన మేరకు లేదని అభిప్రాయపడ్డారు. సగటు ఆదాయం రూ.లక్షా 70వేలు ఉండగా విశాఖపట్టణం జిల్లా మొదటిస్థానంలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 19.2శాతం యువతీయువకులు ఉన్నారని తెలిపారు. వీరికి వృత్తినైపుణ్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యానవన పంటలు, కోళ్లపెంపకం, తదితర అంశాల్లో శిక్షణ ఇస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. డ్వామాపీడీ హరిత, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన కళ..
సాక్షి,వీకెండ్: ఇన్నేళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఆహారం, ఆరోగ్య భద్రత, న్యాయం, చదువు... ప్రతి వారికి ఇవి అందుతున్నాయా.? అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు సంతృప్తితో కూడిన సమాధానం రావడం కష్టమే. ఆరోగ్యం అనేది ఇప్పటికీ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రజలకు ఏ రోగం వచ్చినా ఫర్వాలేకుండా పోయింది. మనకు భద్రత ఉందనే భరోసా ఎంత మాత్రం లేదు. అలాగే ఇంకా ఆహారం కోసం అల్లాడుతున్న వాళ్లు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక విద్య సైతం ఎంతో మందికి అందని ద్రాక్షే. కావాల్సింది దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి పడడానికి అలవాటు పడిపోతాం. కానీ మనం నిజంగా తృప్తిగా ఉన్నామా? అని మనల్ని మనం ప్రశ్నించుకొని, ప్రశ్నించడం మొదలుపెడితే పరిస్థితులు మారుతాయి అంటారు యంగ్ ఆర్టిస్ట్‌లు స్వాతి, విజయ్. మనలో ఆత్మ పరిశీలనకు ఇలాంటి ప్రశ్నలు రాజేయడానికి, తమ ఆలోచనను అందరిలో కలిగించడానికి వీరి చిరు ప్రయత్నం ఈ పెయింట్ వర్క్. తెల్లవారుజామున దాదాపు 5 గంటలు శ్రమపడి తమ ఆలోచనలు నలుగురికి తెలిసేలా ఇలా రోడ్డుపై చిత్రించారు. ఫిలింనగర్ నుంచి గచ్చిబౌలి మధ్యలో 80 అడుగుల రోడ్డుపై ఉన్న ఈ రైటింగ్స్ సిటీలోనే అతిపెద్ద స్ట్రీట్ ఆర్ట్ రైటింగ్. – ఓ మధు -
కార్డులకే పరిమితం...సరుకులకు దూరం!
సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ఆహార భద్రత (రేషన్) కార్డుదారుల్లో అనర్హులు అక్షరాల నాలుగున్నర లక్షల పైనే ఉనట్లు బహిర్గతమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఈ-పాస్ అమలు వాస్తవ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. గత మూడు నెలలుగా ఈ-పాస్ (వేలి ముద్రల) ద్వారా సరుకులు పంపిణీ చేస్తుండటంతో వినియోగం లేని కార్డుల చిట్టా బయటపడుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే కక్కుర్తితో ఆర్థికంగా ఉన్న వారు సైతం ఆహార భద్రత కార్డులు పొందారు. కానీ, నెలసరి రేషన్ సరుకులకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వారి కోటా పక్కదారి పట్టి ప్రతి నెల వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం స్వాహాకు గురైనట్లు స్పష్టమవుతోంది. ఈ -పాస్ అమలుకు ముందు ప్రతినెల సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుండగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో సరుకులకు దూరంగా ఉంటున్న కార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. గత మూడు నెలల పరిస్థితిని పరిశీలించిన సంబంధిత అధికారగణం సరుకులకు దూరంగా ఉంటున్న కార్డుదారును అనర్హులు గుర్తించి ఏరివేసేందుకు చర్యలకు దిగుతోంది. ఇదీ పరిస్థితి.. గ్రేటర్ హైదరాబాద్‌లో 13 లక్షలకు పైగా కార్డుదారులున్నారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 11 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెల్లరేషన్ కార్డులు రద్దు చేసి ఆహార భద్రత పథకం కింద దరఖాస్తులు అహ్వనించడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. నిరుపేదలతో పాటు ఆర్థికంగా బలపడ్డ వారు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. పౌరసరఫరాల అధికారులు కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా కేవలం ఆధార్ అనుసంధానంతో కార్డులు మంజూరు చేస్తూ వచ్చారు. దీంతో అర్హులతో పాటు అనర్హులకు కూడా కార్డులు మంజూరయ్యాయి. ఫలితంగా కార్డుల సంఖ్య ఒకేసారి పెరిగింది. కార్డులు మంజూరైన అనర్హులు మాత్రం సరుకులకు దూరంగా ఉంటూ వస్తూన్నారు. అయితే ఆహార భద్రత పధకం కింద కార్డులోని యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయించడంతో చౌకధరల దుకాణాల డీలర్లకు అనర్హుల కార్డులు వరప్రసాదంగా మారాయి. గత ఏడాదిన్నర కాలంగా వినియోగం లేని కార్డులు కోటా కూడా డ్రా అవుతూ వచ్చింది. తాజాగా ఈ పాస్ అమలుతో వినియోగం లేని కార్డుల సంఖ్య బయటపడి వారి అవినీతికి అడ్డుకట్టపడినట్లయింది. -
ఈ పాస్ గుట్టు విప్పుతోంది...!
♦ వేలిముద్ర వేస్తేనే సరుకులు ♦ వినియోగం లేని కార్డులు40 శాతం పెనే ♦ బయటపడుత్ను డీలర్ల చేతివాటం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజాపంపిణీ వ్యవస్ధ లో ఈ-పాస్ అమలు డీలర్ల గుట్టు విప్పుతోంది. ఆహార భద్రత కార్డుల్లో వినియోగంలో లేనివి 40 శాతం పైనే ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతి నెలా వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం పక్కదారి పడ్డాయా..? అంటే అవుననేపిస్తోంది. సాక్షాత్తు స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ (ఎస్ఓటీ) సైతం దాడుల సందర్భంగా పేర్కొంటూ వచ్చింది. తాజాగా ప్రభుత్వ చౌకధరల దుకాణాలలో ఈ-పాస్ అమలుతో డీలర్ల చేతివాటానికి చెక్ పెట్టినట్లయింది. ఈ-పాస్ అమలుకు ముందు ఫిబ్రవరి మాసం వరకు సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుండగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో వినియోగకార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. దీనిని బట్టి డీలర్ల మాయజాలంతో వినియోగం లేని కార్డుల సరుకు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. ఇదీ పరిస్థితి... గ్రేటర్ హైదరాబాద్‌లోని జంట పౌర సరఫరాల శాఖకు చెందిన 12 అ ర్బన్ సర్కిళ్లలో 13.57 లక్షల మ ంది కార్డుదారు లు ఉండగా ప్రతి నెలా సగటున 12 లక్షల కార్డుదారుల వరకు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజాగా ఈ-పాస్ అమలుతో సరుకులు తీసుకుంటున్న కార్డుదారుల సం ఖ్య ఒకే సారి తగ్గిపోయింది. ప్రస్తుత నెలలో సరుకుల పంపి ణీ గడువు ముగిసే బుధవారం నాటికి 8.67,208 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు ఈ-పాస్‌లో రికార్డు అయింది. ఏప్రిల్ లో మొత్తం కార్డుదారుల్లో 8,51,205 కార్డుదాలు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు నమోదైంది. మొత్తం మీద హైదరాబాద్‌లోని 859 చౌకధరల దుకాణాల పరిధిలో మొత్తం 7,95,418 కార్డులు ఉండగా ఈ నెల 4,94,996 కార్దుదారులు, గత నెలలో 4,87,623 కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అర్బన్ లోని 684 దుకాణాల పరిధిలో మొత్తం 5,61,880 కార్డు దారులు ఉండగా ఈ నెలలో 3,72,212 కార్డుదారులు, గత నెలలో 3,63,582 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సబ్సిడీ సరుకులు ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పక్కదారి పడినట్లు స్పష్టం అవుతోంది. -
డ్రై ప్రూట్స్ స్టాల్‌పై కేసు నమోదు
ద్వారకానగర్: వీఐపీ కూడలిలోని నట్స్, ప్రూట్స్ దుకాణంలోని డ్రైప్రూట్స్, కిస్మిస్లో పురుగులు ఉన్నట్లు కమిషనర్‌కు అందిన ఫిర్యాదు మేరకు శనివారం ఆహారభద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. పురుగులు ఉన్నట్లు గుర్తించి ఆహరభద్రత చట్టప్రకారం షాపు యాజమానికి నోటీసులు జారీ చేసికేసు నమోదు చేశారు. మొత్తం 15 రకాల శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం లేబరేటరీకిపంపించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు యస్.జనార్ధనరావు,జి.వి.అప్పారావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ రిపోర్టు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. -
సామాజిక రక్షణ చర్యలతోనే నిజమైన ఆహార భద్రత
కాంపిటీటివ్ గెడైన్స్ : సివిల్స్, గ్రూప్స్ ఎస్సే సామాజిక రక్షణ-ఆహార భద్రత-ప్రభుత్వ పాత్ర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆకలి, పోషకాహార లోపం. ప్రభుత్వ విధానాలు సామాజిక రక్షణ కల్పించేవిగా ఉన్నట్లయితే ఆకలి, పోషకాహారలోప సమస్యలను తగ్గించవచ్చని ఇటీవల జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు (ప్రపంచ ఆరోగ్య సంస్థ; ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ, తదితర) 64 పేద దేశాల నుంచి సేకరించిన సమాచార విశ్లేషణ ఈ వాదనకు బలం చేకూర్చింది. తక్కువ తలసరి ఆదాయం ఉన్న పేద దేశాలు కూడా సగటు మానవుని ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయా దేశాలు తమకు లభ్యమవుతున్న పరిమిత వనరులను సామాజిక రక్షణకు కేటాయించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆకలి, పోషకాహార లోపం ముఖచిత్రం పేదరికం, నిరపేక్ష ఆకలి, పోషకాహారలోపం, మానవ సమాజాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. 201214 మధ్యకాలంలో 805 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నట్లు తేలింది. 1990వ దశాబ్దం నుంచి పేదరికం కొంత మేరకు తగ్గినప్పటికీ 2014 ప్రాపంచిక ఆకలి సూచిక (Global Hunger Index) దాదాపు 39 దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. లాటిన్ అమెరికా, తూర్పు ఆగ్నేయాసియా, కరేబియన్ దేశాల్లో పేదరికం కొంత తగ్గినప్పటికీ దక్షిణాసియా, సహారా దిగువ ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా ఉంది. ప్రాంతీయ ప్రాతిపదికన ప్రాపంచిక ఆకలి సూచిక విలువలు1996లో జరిగిన ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశంలో ఆహార భద్రతను.. ‘ప్రజలందరికీ, ఎల్లప్పుడు పోషకాహారం అందుబాటులో ఉంటూ, వారు ఆరోగ్యంగా, చురుకుగా జీవించగలగడం, భౌతికంగా, ఆర్థికంగా దీన్ని పొందగలగడం’గా నిర్వచించారు. దీంట్లో పారిశుధ్యం, మంచినీరు, వైద్య సదుపాయం అంతర్లీనంగా ఉంటాయి. ఇటీవల కాలంలో అహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలను అధిగమించింది. కానీ, బహుళజాతి సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆయా దేశ ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాలు కృత్రిమ కొరతను సృష్టించి, పేద ప్రజలకు ఆహారధాన్యాలు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కూడా ఆహార ధాన్యాల మీద ప్రభావం చూపుతోంది. ఇండియా లాంటి దేశాల్లో పర్యావరణ మార్పుల వల్ల సకాలంలో వర్షాలుపడటం లేదు. దీంతో పంట దిగుబడి తగ్గి, సాగుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా సన్నకారు రైతులు అప్పులపాలై, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేద ప్రజలు వీధులపాలవుతున్నారు. మహిళలే అధిక బాధితులు ఆకలి, పోషకాహార లోపాన్ని స్త్రీ, పురుష కోణంలో పరిశీలించినట్లయితే ఆకలితో అలమటించే వారిలో 60% మంది మహిళలే ఉన్నారు. 50% గర్భిణీస్త్రీలకు సరైన పోషకాహారం లభించడం లేదు. ఈ కారణంగా (2,40,000 మంది) తల్లులు, పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారం లభించక ప్రతి ఆరుగురిలో ఒకరు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఐదు సంవత్సరాల లోపు బాలబాలికల్లో 45% మంది మరణిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రతి 10 సెకండ్లకు ఒక శిశుమరణం సంభవిస్తుంది. భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు/తెగల్లో ఆకలి, పోషకాహారలోపంతో బాధపడే వారి సంఖ్య సహారా దిగువ ఆఫ్రికాలోని వారికంటే ఎక్కువ. దీనికి పరిష్కారమేంటి? ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. జీవనోపాధి పథకాల అమలు, బీమా పథకం వర్తింపు, పారిశుధ్యం, రక్షితనీటి పథకం, తిండి, బట్ట, వసతి వంటి కనీస సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి తేవాలి. దీన్నే సామాజిక రక్షణ అంటారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఈ భావనను ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ పథకం కింద వైద్య సదుపాయం, అనారోగ్య భృతి, నిరుద్యోగ భృతి, వయోవృద్ధులకు ఆర్థికసహాయం, కుటుంబభృతి, ప్రసూతి భృతి, క్షతగాత్రుల భృతి మొదలైనవి అందించాలి. యూరోపియన్ కమిషన్, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించి స్థూలంగా సామాజిక భద్రతకు పలు సూచనలు చేశాయి. 1995లో కోపెన్‌హాగన్‌లో జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ‘సామాజిక అభివృద్ధి’ ఆవశ్యకతను పునరుద్ఘాటించింది. 2010లో ఐక్యరాజ్యసమితి అధ్యక్షతన జరిగిన శిఖరాగ్ర సమావేశం శతాబ్ది అభివృద్థి లక్ష్యాలను (Millenium Development goals) గుర్తించింది. ఈ లక్ష్యాల్లో దారిద్య్ర నిర్మూలన ప్రధానమైందిగా ఉంది. ఇందులో భాగంగా 2015లో (Sustainable development goals) ‘పేదరిక నిర్మూలన, ధరిత్రీ పరిరక్షణ, అందరికీ సంపద’ నినాదాన్ని ప్రారంభించారు. పేద దేశాల్లో వనరుల కేటాయింపు అత్యల్పం అభివృద్ధి చెందిన, చెందుతున్న అనేక దేశాల్లో సామాజిక రక్షణలో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, బీమా, ప్రజోపయోగార్థ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే పేద దేశాలు తమ స్థూల దేశీయ ఉత్పత్తి (ఎఈ్క)లో ఈ రంగానికి ఆశించిన మేర వనరులను కేటాయించడం లేదు. వాస్తవానికి పేద దేశాల్లో ఈ రంగంపై ఎక్కువ వనరులను వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈ రంగంపై ఆఫ్రికా ఖండంలో (201011) కేవలం 5.1 శాతం వనరులను మాత్రమే ఖర్చుచేయగా, అదే ఏడాది పశ్చిమ యూరప్ 26.7% వనరులను కేటాయించింది. ప్రపంచ దేశాల సగటు కేటాయింపు 8.6% ఉండగా, ఆసియా, పసిఫిక్ దేశాలు 5.3 శాతం కేటాయించాయి. సామాజిక భద్రత రంగంలో వృద్ధులకు అందించే పింఛను చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో ఇది నెలకు కేవలం రూ.250 మాత్రమే. కొన్నిసార్లు ఈ చిన్న మొత్తాన్ని కూడా నెలల తరబడి చెల్లించడం లేదు. విద్య, ఆరోగ్యం, దారిద్య్ర నిర్మూలన, పారిశుధ్యం, బీమా రంగాలపై ప్రాంతాలవారీగా ప్రభుత్వం కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. పైన పేర్కొన్న గణాంకాలను బట్టి సంపన్న దేశాలు సామాజిక రక్షణకు తమ ఎఈ్కలో ఎక్కువ శాతం ఖర్చుపెడితే, పేద దేశాలు తక్కువ కేటాయిస్తున్నాయి. భారతదేశంలో భారతదేశం ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (1997) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాహిత కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. నాలుగు లక్షల తొంభై ఎనిమిదివేల (4,98,000) చౌకధర దుకాణాలు దేశవ్యాప్తంగా 16 కోట్ల కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి కుటుంబానికి 25 నుంచి 35కిలోల వరకు చౌకధరలో ఆహారధాన్యాలను ప్రతినెలా అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు 1990 తొలినాళ్లలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ క్రమేణా బలహీనపడుతూ వచ్చింది. కానీ, మొత్తంగా చూస్తే ఈ వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూలన కొంత వరకు విజయవంతమైందని చెప్పవచ్చు. 2013నాటికి జాతీయస్థాయిలో పేదరిక తేడా సూచిక (Poverty Gap Index) గ్రామీణ స్థాయి పేదరికాన్ని 18% నుంచి 22% కి తగ్గించింది. తమిళనాడులో 61% నుంచి 83%కి, ఛత్తీస్‌గఢ్‌లో 39% నుంచి 57%కి గ్రామీణ స్థాయి పేదరికాన్ని తగ్గించడంలో ప్రజాపంపిణీ వ్యవస్థ విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో పేదవారికి ధనసహాయం అందించడం మంచిదా? వస్తు సహాయాన్ని అందించడం మంచిదా? అనే వివాదం తలెత్తింది. లబ్ధిదారుల మీద జరిపిన సర్వే వివరాల ప్రకారం ముఖ్యంగా మహిళలు వస్తురూప సహాయాన్నే కోరుకుంటున్నారని తేలింది. బ్రెజిల్లో ప్రజలు ధనసహాయాన్ని కోరుకుంటున్నారు. వివిధ దేశాలు ఆయా పరిస్థితులను బట్టి విభిన్న విధానాలను అవలంబిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, సేవల విస్తరణ, పారదర్శకత, అందిస్తున్న సహాయం, అనుసరిస్తున్న పద్ధతులపై సామాజిక రక్షణ కార్యక్రమాల విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. భారతదేశం విషయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లొసుగుల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉపయోగిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐఇఖీ) ఈ లొసుగులను తగ్గించటంలో ప్రముఖపాత్ర పోషిస్తోంది. ఇది 200405 నుంచి 2011-12 మధ్యకాలంలో ఈ రంగంలో అవినీతిని 35%55%కి తగ్గించడంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి 23% 44.5% కుటుంబాలు వచ్చాయి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఇతర సామాజిక పథకాలు సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐఇఈ), మధ్యాహ్న భోజన పథకం బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషించాయి. వీటి వల్ల గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం మెరుగుపడింది. శైశవ బాల్యదశలో శారీరక, మానసిక ఎదుగుదల లేని పిల్లలు పెద్దవారైన తర్వాత అన్ని రంగాల్లో విఫలం చెందడం వైద్యపరంగా నిరూపితమైంది. అందువల్ల పోషకాహారలోపాన్ని నివారించేందుకు అందరూ కృషి చేయాలి. పేదప్రజల ఆదాయాన్ని పెంపొందించడంలో 2005లో ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి పథకం.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (కూఖఉఎ్క) చక్కగా ఉపయోగపడింది. దీని కింద ఏటా 5 కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం దీనివల్ల లబ్ధి పొందుతుంది. 201314 సంవత్సరాలలో 1.21 బిలియన్ పని దినాలను కల్పించారు. అందులో 40% పనిదినాలు బలహీన వర్గాలైన షెడ్యూల్డు కులాలు, తెగల వారికి, 55% పనిదినాలు మహిళలకు లబ్ధి చేకూర్చాయి. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేయడం వల్ల వారి కుటుంబాలకు ఆహార భద్రత లభిస్తుంది. ఎందుకంటే పురుషులతో పోల్చితే మహిళలే కుటుంబ ఆహార అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దక్షిణాఫ్రికాలో సత్ఫలితాలు దక్షిణ ఆఫ్రికాలో వృద్ధులకు పింఛన్ పథకం, బాలబాలికలకు ధనసహాయం మొదలైన కార్యక్రమాల ద్వారా సామాజిక రక్షణ అందుతోంది. తాజా అంచనాల ప్రకారం కోటి మంది బాలబాలికలు లబ్ధి పొందుతున్నారు. దీని ఫలితంగా బడి హాజరు శాతంలో గణనీయమైన పెరుగుదల, పౌష్టికాహార లభ్యత మెరుగైంది. బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బాలబాలికలకు అందించే ధన సహాయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి బిడ్డల చదువుకు, పోషకాహారానికి మరింత ఉదారంగా వెచ్చించటానికి వీలు కల్పించింది. బ్రెజిల్ దేశంలో ‘శూన్య ఆకలి’ అనే పథకం బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడింది. ఆౌట్చ జ్చఝజీజ్చీ అనే ప్రత్యక్ష నగదు పథకం కింద గత 9 ఏళ్లలో బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని 61%, గ్రామీణ పేదరికాన్ని 15% మేర తగ్గించారు. దీని కారణంగా మూడు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. వర్ధమాన దేశాలన్నిటికంటే సామాజిక పరిరక్షణకు బ్రెజిల్ అత్యధికంగా తలసరి ఆదాయంలో 17.9% వెచ్చిస్తుంది. ఆహార అభద్రతను ఎదుర్కోవాలంటే? ఈ పై అంశాలను పరిశీలించినప్పుడు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ధన సహాయం అందించడానికి.. పేదరికం, ఆహార అభద్రత తగ్గుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో తగినన్ని వనరులు, సరైన విధాన రూపకల్పన, సుపరిపాలన, రాజకీయ ఉద్యోగిస్వామ్య చిత్తశుద్ధి, సామాజిక రక్షణలు ప్రముఖపాత్ర వహిస్తాయి. బంగ్లాదేశ్ అమలుచేస్తున్న "Challenging the frontiers of poverty reduction",రువాండాలో "Vision 2020 umurenge", భారతదేశంలో MGNREGA పథకాలు వీటికి చక్కని ఉదాహరణలు. పేద దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ వనరులు కేటాయించలేవనే భావన బహుళ ప్రచారాన్ని పొందింది. ముఖ్యంగా పైన ప్రస్తావించిన దేశాలన్నీ పేద దేశాలనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అభ్యుదయ భావాలు కలిగిన రాజకీయ నాయకత్వం, అంకితభావం కలిగిన ఉద్యోగిస్వామ్యం, చురుకైన పౌరసమాజాలు ఎన్ని పరిమితులనైనా అధిగమించి సామాజిక సంరక్షణకు దోహదం చేస్తాయి. వర్ధమాన దేశాల సమస్య వనరుల లేమి కాదు. వాటిని వెలికితీయడంలో విఫలం కావడమే. తృతీయ ప్రపంచదేశాల్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. పరోక్ష పన్నులు పేదలను మరింత కుంగదీసి, ధనికులకు పన్ను మినహాయింపునకు దారితీస్తాయి. దీనికి సరైన పరిష్కార మార్గం ప్రత్యక్ష పన్నుల పరిధిని విస్తృత పరచడమే. ఇండియా లాంటి దేశంలో ఆదాయం, సంపద విషయంలో ఖచ్చితమైన గణాంకాలు లేవు. దేశంలో 38% సంపద కేవలం 5% ఉన్న అత్యంత ధనికుల చేతిలో ఉంది. అట్టడుగున ఉన్న 60% కుటుంబాల చేతిలో 13% సంపద మాత్రమే ఉంది. సేవాపన్నుల విషయంలో కూడా ఇదే వైపరీత్యం కనపడుతుంది. ప్రోత్సాహకాలు అనే నెపంతో సంపన్న వర్గాలకు ఇచ్చే పన్ను మినహాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం 201314 సంవత్సరంలో పన్ను ప్రోత్సాహకాల రూపంలో రూ. 5 లక్షల 49 వేల 984 కోట్లను నష్టపోయింది. ఈ మొత్తం.. పన్ను ఆదాయంలో 40 శాతానికి పైగా ఉంటుంది. గనులు, నిర్మాణం, స్థిరాస్థిరంగం, నగలు, రత్నాలు వంటివాటిపై పన్నులు విధించి వాటిని సక్రమంగా ఉపయోగించినట్లయితే సామాజిక రక్షణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. - డా॥బి.జె.బి. కృపాదానం సబ్జెక్ట్ నిపుణులు, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్ -
ఆటోడ్రైవర్లకు వైద్యం.. అందని వైనం!
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లకు కేంద్ర కార్మికశాఖ ప్రకటించిన ఈఎస్ఐ వైద్య సౌకర్యానికి అతీగతీ లేదు. ఈ పథకం ప్రారంభించి ఐదునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై కేంద్ర కార్మికశాఖ నుంచి నోటిఫికేషన్ ఇంకా రాలేదని చెబుతూ అధికారులు మొహం చాటేస్తున్నారు. ఆటోడ్రైవర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు.. ఇలా అసంఘటిత రంగ కార్మికులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఏడాదికాలంగా పదే పదే ప్రకటిస్తున్నారు. మొదటగా ఆటోడ్రైవర్లకు ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామంటూ ఈ ఏడాది జనవరి మొదటివారంలో హైదరాబాద్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కొంతమందికి ఈఎస్ఐ కార్డులను కూడా పంపిణీ చేశారు. ఆటోడ్రైవర్లకు కల్పించిన ఈఎస్ఐ మెడికల్ స్కీం కింద కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, అందుకోసం ఒక్కో ఆటోడ్రైవర్ తన వాటాగా ఆరు నెలలకోసారి రూ.1500 చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. ఈఎస్ఐ బ్రాంచ్‌లలో డబ్బులు చెల్లించి కార్డులు తీసుకోవాలని, ఈ కార్డు ద్వారా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అన్ని వైద్యసేవలతోపాటు మందులను కూడా ఉచితంగా పొందవచ్చని తెలిపింది. కానీ, ఇప్పటి వరకు ఆటోడ్రైవర్ల నుంచి ఒక్క దరఖాస్తును కూడా స్వీకరించలేదు. దీంతో హైదరాబాద్‌లోని దాదాపు 1.5 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఈఎస్ఐ వైద్యసేవల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆటోడ్రైవర్లు నిత్యం ఈఎస్ఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశగా వెనుదిరుగుతున్నారు. -
‘భద్రత’కు బ్రేక్
నిలిచిన ఆహార భద్రత కొత్త కార్డులు పెండింగ్‌లో 19,776 దరఖాస్తులు పట్టించుకోని అధికారులు ఇబ్బంది పడుతున్న పేదలు సాక్షిప్రతినిధి, వరంగల్ : పేదలకు సబ్సిడీతో నిత్యావసర సరుకులు లభించే ఆహార భద్రత(తెల్ల రేషన్) కార్డుల పంపిణీ జిల్లాలో నిలిచిపోయింది. మూడు నెలలుగా కొత్త కార్డులు జారీ చేయడం లేదు. దీనిపై జాయింట్ కలెక్టర్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. దీంతో క్షేత్రస్థాయి అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్న అర్హులకు సైతం ఆహార భద్రత కార్డులు రాక వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజా పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆహార భద్రత కార్డులకు ఆధార్‌తో లింక్ చేసి బోగస్ కార్డులను ఏరివేసింది. అనంతరం అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేస్తోంది. ఆహార భద్రత కార్డులతో ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డు కోసం... తెల్ల కాగితంపై వివరాలను రాసి, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలతో స్థానిక మీసేవ కేంద్రంలో రూ.35 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 30 రోజుల్లో అధికారులు పరిశీలించి అర్హులా, కాదా అనేది నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అర్హుల వివరాలను సంబంధిత రేషన్ షాపునకు కేటాయిస్తారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వాటిని మొదట రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్/ఏఎస్వో పరిశీలించి ధృవీకరించిన తర్వాత పౌరసరఫరాల జిల్లా అధికారి ఆమోదం కోసం పంపిస్తారు. ఇక్కడ తుది నిర్ణయం జరిగిన తర్వాత లబ్ధిదారులుగా నిర్ధారించి రేషన్ సరుకుల కోటా జారీ అవుతుంది. జిల్లాలో 9,72,211 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 58,484, ఆన్నపూర్ణ కార్డులు 141, సాధారణ ఆహార భద్రత కార్డులు 9,13,586 ఉన్నాయి. ఇవి కాక 19,776 కుటుంబాల వారి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నారుు. అరుుతే ఈ కార్డులు ఇష్టారాజ్యంగా జారీ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ జిల్లాలోని తహసీల్దార్లను హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులకు కార్డులు జారీ చేయాల్సిన అధికారులు మొత్తంగా పక్కన పెడుతున్నారు. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఆహార భద్రత కార్డులకు సంబంధించిన దరఖాస్తులు, అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న వివరాలు... కార్యాలయం దరఖాస్తులు ఆర్ఐ ఎంఆర్వో/ డీఎస్వో ఆమోదం తిరస్కరించినవి ఏఎస్వో ఆత్మకూరు 117 117 0 0 0 0 బచ్చన్నపేట 234 218 4 11 0 1 భూపాలపల్లి 721 284 297 135 5 0 చెన్నారావుపేట 207 190 0 12 5 0 చేర్యాల 319 236 0 83 0 0 చిట్యాల 126 105 16 5 0 0 దేవరుప్పుల 202 127 0 74 1 0 ధర్మసాగర్ 415 410 5 0 0 0 డోర్నకల్ 441 282 0 159 0 0 దుగ్గొండి 113 87 13 12 1 0 ఏటూర్‌నాగారం 266 266 0 0 0 0 గీసుకొండ 207 168 0 36 3 0 గణపురం 186 115 0 70 1 0 గణపురం(స్టే) 613 208 9 389 7 0 గోవిందరావుపేట 95 75 10 10 0 0 గూడూరు 232 232 0 0 0 0 హన్మకొండ 3,128 2,549 385 149 45 0 హసన్‌పర్తి 647 305 0 309 31 2 జనగామ 322 315 0 7 0 0 జనగామఅర్బన్ 397 391 0 5 1 0 కేసముద్రం 377 376 1 0 0 0 ఖానాపురం 146 132 4 10 0 0 కొడకండ్ల 431 369 6 54 2 0 కొత్తగూడెం 226 146 26 53 1 0 కురవి 232 167 11 50 4 0 కార్యాలయం దరఖాస్తులు ఆర్ఐ ఎంఆర్వో/ డీఎస్వో ఆమోదం తిరస్కరించినవి ఏఎస్వో లింగాలఘనపూర్ 153 152 1 0 0 0 మద్దూరు 356 138 10 198 8 2 మహబూబాబాద్ 494 346 147 0 1 0 మంగపేట 667 609 53 5 0 0 మరిపెడ 286 167 12 98 5 4 మొగుళ్లపల్లి 309 304 0 2 3 0 ములుగు 150 149 1 0 0 0 నల్లబెల్లి 203 36 5 143 4 15 నర్మెట్ట 252 189 0 63 0 0 నర్సంపేట 208 122 3 79 4 0 నర్సింహులపేట 159 158 1 0 0 0 నెక్కొండ 247 223 0 21 2 0 నెల్లికుదురు 360 194 0 166 0 0 పాలకుర్తి 412 274 13 123 2 0 పరకాల 299 206 0 90 3 0 పర్వతగిరి 143 129 2 11 1 0 రఘునాథపల్లి 377 145 40 192 0 0 రాయపర్తి 202 157 0 45 0 0 రేగొండ 175 175 0 0 0 0 సంగెం 196 135 17 34 10 0 శాయంపేట 200 149 51 0 0 0 తాడ్వాయి 61 51 0 9 1 0 తొర్రూర్ 520 510 0 2 0 0 వెంకటాపూర్ 219 153 49 16 1 0 వరంగల్అర్బన్ 2194 1830 79 243 41 1 వర్దన్నపేట 363 228 2 120 11 2 జఫర్గడ్ 171 170 0 1 0 0 మొత్తం 19776 14977 1273 3294 205 27 -
అదనపు బియ్యానికి కేంద్రం ఓకే !
♦ రాష్ట్రానికి గోధుమలకు బదులు బియ్యం ♦ కేంద్ర పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కమిటీ సిఫార్సు ♦ 4వేల టన్నుల అదనపు బియ్యం ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం ♦ రాష్ట్రంపై దాదాపు రూ.400 కోట్ల భారం తగ్గే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకానికి అదనపు బియ్యం సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపంపై కేంద్రం ఎట్టకేలకు కరుణ చూపింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పథకాలను దృష్టిలో పెట్టుకొని బియ్యం అవసరాలకు సహకారం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఆహార భద్రతా పథకం కింద సరఫరా చేస్తున్న గోధుమల స్థానంలో బియ్యం ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయిలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. ఆహార భద్రతా చట్టం కింద తెలంగాణలో మొత్తంగా 1.91కోట్ల మందిని అర్హులుగా తేల్చిన కేంద్రం వీరి అవసరాల మేరకు బియ్యాన్ని సరఫరా చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం కింద అర్హత సాధించిన వారి సంఖ్య 2.80 కోట్ల పైచిలుకుగా ఉంది. అదీగాక ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం తలా 4 కేజీల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుండగా రాష్ట్రం దానికి అదనంగా మరో రెండు కిలోలను కలిపి పంపిణీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం అవసరమవుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 13.36 లక్షల మెట్రిక్ టన్నుల మేర మాత్రమే సరఫరా చేస్తుండటంతో రాష్ట్రంపై 5 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు భారం పడుతోంది. దీనికి తోడు రాష్ట్రంలోని 2,757 సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 4,80,926 మంది, 34,319 ప్రభుత్వ పాఠశాలల్లోని 29,86,010 మంది విద్యార్థుల భోజనంకోసం ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. దీనికోసం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నెలకు 14వే ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. దీంతో బియ్యం సబ్సిడీ భారం అధికమవుతోంది. ఎట్టకేలకు సానుకూలత.. భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేం ద్రానికి పలుమార్లు విన్నవించినా పెద్దగా చలనం కనిపించలేదు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి కేంద్రం ఆహార భద్రతా చట్టం అమలు చేస్తున్న రాష్ట్రాలకు గోధుమలను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ప్రతి నెలా 8,268 మెట్రిక్ టన్నుల గోధుమలను సరఫరా చేస్తోంది. అయితే రాష్ట్రంలో గోధుమలకు పెద్దగా డిమాండ్ లేని దృష్ట్యా వాటికి బదులు బియ్యాన్ని ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా ఎట్టకేలకు ఉన్నతాధికారుల కమిటీని నియమించింది. రాష్ట్రానికి గోధుమలకు బదులు 4 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు కమిటీ సానుకూలత తెలిపింది. ఈ బియ్యాన్ని ఎప్పటి నుంచి సరఫరా చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రంపై దాదాపు రూ.400 కోట్ల మేర భారం తగ్గే అవకాశాలున్నాయని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. -
ఈ-పాస్‌తో అవినీతికి చెక్
- ప్రజాపంపిణీ వ్యవస్థలో బయోమెట్రిక్ విజయవంతం - అర్భన్‌లో సత్ఫాలితాలు.. 32శాతం సరుకుల మిగులు - బోగస్ ఏరివేత తరువాతనే పుడ్‌సెక్యూరిటీ కార్డులు - ఈపాస్‌తోఆధార్ అనుసంధానం పూర్తయితే జిల్లాలో ఎక్కడినుంచైనా సరుకులు - జేసీ-2 దృష్టికి కందిపప్పు విక్రయకేంద్రాలు - జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీఎస్ఓ) గౌరీశంకర్ తాండూరు(రంగారెడ్డి జిల్లా) ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బయోమెట్రిక్(ఈ-పాస్) విధానం విజయవంతమైందని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి(డీఎస్ఓ) ఎం.గౌరీశంకర్ పేర్కొన్నారు. గురువారం తాండూరు దిగ్రేన్‌అండ్‌సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం డీఎస్ఓ విలేకరులతో మాట్లాడారు. చౌకధరల దుకాణాల నుంచి రేషన్‌కార్డుదారులు లేదా వారి కుటుంబసభ్యులు సరుకులు తీసుకువెళ్లేందుకు, సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ విధానం అమలు చేసినట్టు ఆయన వివరించారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తయితే బోగస్ కార్డులను తొలగించడానికి వీలవుతుందని ఆయన వివరించారు. బోగస్ తొలగింపు తరువాత అసలైన లబ్ధిదారులకు పుడ్‌సెక్యూరిటీ కార్డులను జారీ చేసే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ నుంచి మండలాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు సరుకుల రవాణా పక్కదారి స్టేజ్ -1లో 53వాహనాల్లో జియోట్యాగింగ్ యంత్రాలను అమర్చినట్టు చెప్పారు. తాండూరులో మాదిరిగానే అర్భన్ ప్రాంతాల్లో దాల్మిల్ అసోసియేషన్, ఇతర వ్యాపార వర్గాల భాగస్వామ్యంతో తక్కువ ధరకు కందిపప్పు అందించేందుకు యోచిస్తామన్నారు. ఈ విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్-2 దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. గత ఏడాది వనస్థలిపురం,కూకట్పల్లి,ఉప్పల్‌లో 4 విక్రయకేంద్రాల ద్వారా తక్కువ ధరకు కందిపప్పు అందించినట్టు గుర్తు చేశారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వస్తే ఈసారి కూడా బాలానగర్, వనస్థలిపురం తదితర చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని డీఎస్ఓ వివరించారు. -
‘పతంజలి నూడుల్స్ నాసిరకం’
మీరట్: పతంజలి ‘ఆటా నూడుల్స్’ నాసిరకంగా ఉన్నాయని ఆహార భద్రత, ఔషధాల నిర్వహణ(ఎఫ్ఎస్డీఏ) సంస్థ తేల్చింది. వాటిలో మోతాదుకు మించి మూడురెట్లు బూడిద శాతం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 5న మీరట్‌లో పతంజలి, మ్యాగీ, యిపీ నూడుల్స్ నమూనాలను పరీక్ష కోసం సేకరించారు. మూడు కంపెనీల నమూనాల్లో బూడిద శాతం మోతాదుకన్నా అధికంగా ఉన్నట్లు తేలింది. నిబంధనల ప్రకారం నూడుల్స్‌లో బూడిద 1 శాతం ఉండాలి. -
రేషన్ కట్ !
♦ దొడ్డిదారి ‘రేషన్ కార్డులకు’ చెల్లుచీటీ ♦ 19 వేల ఆహారభద్రత కార్డుల తొలగింపు ♦ ఎన్ఐసీతో సమాచారం విశ్లేషించి నిర్ధారణ ♦ అనర్హులుగా తేలడంతో తీసివేతలు.. దొడ్డిదారిన రేషన్‌కార్డులు పొందిన అక్రమార్కులపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. తాజాగా మరో 19 వేల మంది అనర్హుల పేర్లను ఆహారభద్రత జాబితా నుంచి తొలగించింది. రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిన ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం.. ఆహారభద్రతలో అనర్హుల ఏరివేతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆధార్ సీడింగ్‌తో ప్రతి యూనిట్ సమాచారాన్ని నిక్షిప్తం చేసిన జిల్లా యంత్రాంగం.. ఇప్పుడు ఆ సమాచారాన్ని ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్)తో అనుసంధానిస్తోంది. తద్వారా ఉద్యోగుల తల్లిదండ్రులు, పొరుగు రాష్ట్రాల్లో కార్డు కలిగిఉన్నవారి చిట్టాను రాబట్టింది. అదేసమయంలో ఆధార్‌తో సరిపోలని కార్డుదారుల జాబితా కూడా ఎన్ఐసీ సేకరించింది. అలాగే ఉద్యోగులు హెల్త్‌కార్డుల్లో పొందుపరిచిన సమాచారంతో వడపోత జరిపారు. ఈ నేపథ్యంలోనే 19,451 మంది అనర్హులున్నట్లు గుర్తించారు. ఫిబ్రవరి కోటాలో 8,395, మార్చి కోటాలో 11,056 కార్డులు అక్రమమని నిర్ధారించారు. ఈ కార్డుల తొలగింపుతో నెలకు 1,064 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. మార్చి నుంచి ఈ- పాస్ యంత్రాలు ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మార్చి నుంచి ఈ-పాస్ యంత్రాలను ప్రవేశపెడుతోంది. గ్రేటర్ పరిధిలోని మూడు సర్కిళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది. సర్కిల్‌కు 35 యంత్రాల చొప్పున ప్రవేశపెడుతున్న అధికారులు.. వీటిని చౌకధరల దుకాణాలకు అందజేశారు. నిత్యావసర సరుకులు తీసుకునేందుకు వచ్చే కార్డుదారుల వేలిముద్రల ఆధారంగా రేషన్‌ను పంపిణీ చేయనున్నారు. అదేసమయంలో ఏరోజుకారోజు సరుకు పంపిణీకి సంబంధించిన సమాచారం పౌరసరఫరాలశాఖకు చేరనుంది. మరోవైపు జీపీఎస్ యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా నిఘా పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జీపీఎస్, వెహికల్ ట్రాకింగ్ యూనిట్లను కూడా ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తోంది.