వయసు నిర్ధారణకు ఆధార్ ఓకే!
- ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పథకానికి మార్గదర్శకాలు జారీ
- ఓటర్ కార్డు, స్కూల్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఉన్నా పర్లేదు
- జూన్ 2న లబ్ధిదారులకు రెండు నెలల మొత్తం అందజేత
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఎంపిక లో కనీస వయసు నిర్ధారణకు ఆధార్/ఓటర్ కార్డు/స్కూల్ సర్టిఫికెట్/బర్త్ సర్టిఫికెట్ వంటి పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా పర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి కల్పించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి లబ్ధిదారులకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక భృతి లభించనుంది. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రెండు నెలల మొత్తాన్ని ఒంటరి మహిళలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభమై 25కల్లా ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నిబంధనలపై పట్టుబట్టేది లేదు
ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పథకానికి లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలపై పెద్దగా ఒత్తిడి చేసేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం సచివా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అర్హత లేని వారికి లబ్ధి చేకూర్చిన అధికారులపై కఠిన చర్యలు చేపడతా మన్నారు. అలాగే ఆసరా పథకం కింద మరో 80 వేల మంది బీడీ కార్మికులకు ఆర్థిక భృతి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. గతంలో ఆసరా పింఛన్ పొందుతున్న వారి కుటుంబంలో బీడీ కార్మికులకు పింఛన్ వచ్చేది కాదని, అయితే ఈ నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులి చ్చిందన్నారు.
బీడీ కార్మికులకు మే 1 నుంచి ఆర్థిక భృతిని వర్తింపజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోగా ఆసరా లబ్ధిదారులకు చేరాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఆసరా పింఛన్లకు ప్రభుత్వం నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తోం దని విలేకరులు ప్రశ్నించగా.. జాప్యం జరుగు తున్నా నెలనెలా పింఛన్‌ను తప్పకుండా అందజేస్తున్నామన్నారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆర్థిక భృతితో ప్రభుత్వంపై ఏటా రూ.500 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు.
ఏడాదిపాటు వేరుగా ఉన్నా ఒంటరి మహిళే
18 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు ఏడాదికి పైగా భర్త నుంచి వేరుగా ఉండడం, భర్త వదిలేసి ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో వివాహం చేసుకోని 30 ఏళ్ల పైబడిన వారు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లకు పైగా వయసు కల వారిని ఒంటరి మహిళలుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు లోపు ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. నిబంధనల మేరకు అర్హులైన వారు వ్యక్తిగతంగా గ్రామ పంచాయతీ కార్యదర్శికి/ పట్టణాల్లోనైతే బిల్ కలెక్టర్‌కు/ హైదరాబాద్ పరిధిలో వీఆర్వో లకు దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తుపై తమ ఫోటోను అంటించడంతో పాటు వయసు నిర్ధారణ పత్రం, సేవింగ్స్ బ్యాంక్/పోస్టాఫీసు ఖాతా పుస్తకం, ఆహార భద్రతా కార్డు లేదా తహసీల్దారు జారీ చేసిన వార్షికాదాయ పత్రం జిరాక్స్ ప్రతులను జత చేయాలి. దరఖాస్తులను స్వీకరించిన అధికారులు గ్రామ, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుంది.