సంగారెడ్డి రూరల్: అర్హులైన పేదలందరికి ఆహారభద్రత కార్డులను అందజేస్తామని జేసీ డాక్టర్ ఎ.శరత్ పేర్కొన్నారు. మండలంలోని కవలంపేటలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పేదలందరికి ఆహారభద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో ఒక్కొక్కరికి నాలుగు కిలోల బియ్యం చొప్పున, 20 కిలోలకు మించకుండా ఇచ్చేవారన్నారు. ఆహార భద్రత కార్డుల్లో పేర్లు ఉన్న వారందరికి పరిమితి లేకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తామన్నారు. గ్రామాల్లో సభలు నిర్వహించి ఆహార భద్రత కార్డులు మంజూరైన వారి పేర్లను అధికారులు చదివి వినిపిస్తారన్నారు.
కార్డులు అందనివారు మళ్లీ దరఖాస్తుకు చేసుకుంటే అధికారులు పరిశీలించి మంజూరు చేస్తారన్నారు. జిల్లాలో ఆహారభద్రత కార్డుల కోసం 8 లక్షల 22 వేల దరఖాస్తులు రాగా వాటిల్లో 7లక్షల 2వేల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కొత్తగా మంజూరైన ఆహారభద్రత కార్డులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముద్ర ఉంటుందన్నారు. ఈ నెల 21 లోగా తహాశీల్దార్లు గ్రామసభలు నిర్వహించి తుది జాబితాను రూపొందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి తహాశీల్దార్ గోవర్దన్, ఈఓపీఆర్‌డీ సంధ్య పాల్గొన్నారు.
ఆధార్‌తో అనుసంధానం చేసి కార్డులివ్వాలి
సంగారెడ్డి అర్బన్: ఆధార్‌తో అనుసంధానం చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహరభద్రత కార్డులు అందజేయాలని జేసీ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చిహ్నంతో ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తామని, ఈ నెల 26 లోగా ఆహార భద్రత కార్డుల డేటా ఎంట్రీ పూర్తి చేసి, జనవరి మొదటి వారంలో రేషన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. డేటా ఎంట్రీ చేసే సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని తహాశీల్దార్లకు సూచించారు.
ఆహారభద్రత కార్డుల పరిశీలన పూర్తయినందున ఆ వివరాలను గ్రామపంచాయతీ వార్డుల వారీగా నిర్దేశించిన 22 కాలమ్‌లలో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 17 నుంచి 21 వరకు గ్రామసభలు జరుగుతున్నందున, గ్రామసభల్లో ఆహార భద్రత కార్డులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించాలన్నారు. ఆహర భద్రత కార్డులకు సంబంధించి ప్రతి మండల కేంద్రంలో గ్రివెన్స్ సెల్ ఏర్పాటుచేసి వచ్చే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
డ్రాప్ట్ బాక్స్‌లను ఏర్పాటుచేసి ప్రతి రోజు బాక్స్‌ను తెరచి అందులో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ నెల 22న తహాశీల్దార్లు చౌకధరల దుకాణాల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని, డీలర్లతో ఈ నెల 23న రేషన్‌కు సంబంధించిన డీడీ బ్యాంక్‌లో చెల్లించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సరఫరాల అధికారి ఏసురత్నం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు
Published Thu, Dec 18 2014 11:33 PM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement
Advertisement