ఆధార్.. ఆహారభద్రతకుకుదరని లింకు..!
⇒ ఆహారభద్రత కార్డులకు పొంతన లేని 5.80లక్షల కుటుంబాల వివరాలు
⇒ మరో 4లక్షల మందికి ఆధార్ లేకుండానే...
⇒ 90వేల కుటుంబాలకు తాత్కాలిక అనుమతి
⇒ గ్రామాలు, మున్సిపాలిటీల్లో రెండు చోట్ల ఆహారభద్రత దరఖాస్తులు
⇒ బోగస్ కార్డుల ఏరివేతకు ఆధార్ తప్పనిసరి
నల్లగొండ: ‘నల్లగొండ పట్టణం 9 వార్డులో నివాసముంటున్న లంగిశెట్టి రాధకు ఆధార్ కార్డులో ఆమె భర్త పేరు రమేష్ అనే ఉంది. ఆధార్ కార్డు వివరాలు ఆధారంగానే ఆహారభద్రత కార్డుకు దరఖాస్తు చేశారు. వార్డుల వారీగా ప్రకటించిన ఆహారభద్రత కార్డుల అర్హుల జాబితాలో కూడా ఆమె పేరు సరిగానే ఉంది. తీరా రేషన్ కోసం డీలర్ వద్దకు వెళ్లినప్పుడు మాత్రం ఆ జాబితాలో రాధకు బదులు సుగుణ అనే పేరు ఉంది.
ఆధార్ నంబరు, చిరునామా అన్ని సరిగానే ఉన్నా పేరు మారింది. దీంతో డీలరు రేషన్ ఇవ్వకుండా నిలిపేశాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే ఈ తప్పు ఏ విధంగా జరిగింది.. అనే దానిపై మాత్రం అధికారులు నోరుమెదపలేదు’. ఇదొక్కొటే కాదు...ఇలాంటి సమస్యలు జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.
పొంతనలేని వివరాలు...
జిల్లా వ్యాప్తంగా 9.38 లక్షల ఆహారభద్రత కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి గాను 29లక్షల 17వేల కుటుంబాలు అర్హులుగా తేల్చారు. దీంట్లో 18,65,000వేల మంది ఆధార్ నంబర్లు ఇచ్చారు. ఇవిగాక మరో నాలుగు లక్షల మందికి ఆధార్ నంబరు లేకున్నప్పటికీ తహసీల్దార్లు రేషన్ ఇచ్చేందుకు అనుమతిచ్చారు. 90వేల మందికి తాత్కాలిక అనుమతులు జారీచేశారు. ఆధార్‌నంబర్ ఆహారభద్రత కార్డులకు జతచేసే ప్రక్రియ పూర్తికాకపోవడంతో తహసీల్దార్లు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 5.80లక్షల కుటుంబాలకు చెందిన చిరునామాల విషయంలోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డు నంబరు ప్రకారం ఆన్‌లైన్‌లో ఆహారభద్రత దరఖాస్తుల వివరాలను పోల్చి చూసిన ప్పుడు అసలు సమస్య ఎదురైంది.
ఆధార్ వివరాలకు, ఆహారభద్రత దరఖాస్తుల వివరాలకు పొంతన కుదరడం లేదు. ఆధార్ కార్డులో పేర్కొన్న చిరునామా, పేర్లకు, ఆహారభద్రత దరఖాస్తుల్లో నమోదైన వివరాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆహారభద్రత దరఖాస్తులను సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేశాయి. రెండు, మూడు స్టేజీల్లో వాటన్నింటినీ విచారణ జరిపిన తర్వాతే అర్హులుగా గుర్తించి జాబితా విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ వివరాలను, ఆధార్ యూఐడీ నంబరుతో ఆన్‌లైన్‌లో పరిశీలించినప్పుడు మాత్రం ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
ఆహారభద్రతకు ఆధార్ కార్డు అర్హులు కాకపోయినప్పటికీ బోగస్ కార్డులు ఏరివేయాలంటే ఆధార్ కార్డుల్లో ఉన్న ఫొటోనే కీలకం. దీంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ర్ట స్థాయిలోనే దీనికి పరిష్కారం దొరుకుతుందన్న దృ క్పథంతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య చిక్కుముడి వీడేదాకా అర్హులుగా ఎంపికైన 9.38లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయక తప్పదు.
వెలుగులోకి బోగస్ కార్డులు..
ఆధార్ కార్డుతో సంబంధం లేకుండానే ఆహారభద్రతకు అర్హులైన వారిందరికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ హారభద్రత కార్డుల జారీకి అవసరమయ్యే ఫోటోగుర్తింపు, బోగస్ కార్డుల ఏరివేతకు ఆధార్ కార్డు తప్పనిసరి. దీని ఆధారంగానే అనర్హులను ఏరివేసేందుకు వీలుంటుంది. ఇప్పటికప్పుడు బోగస్ ఏరివేతలపై దృష్టిసారించకున్నా కొత్త కార్డులు జారీ అయ్యే నాటికి ఆ వ్యవహారం కూడా పూర్తిచేస్తారు.
తాజాగా నల్లగొండ మున్సిపాలిటీలో బోగ స్ కార్డులు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆధార్ కార్డు వివరాల ఆ ధారంగా ఆహారభద్రత కార్డుల దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పోల్చి చూసినప్పుడు 3వేల బోగస్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. పట్టణానికి సంబంధంలే ని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొం దరు నల్లగొండ మున్సిపాలిటీలో కూడా దరఖాస్తు చేశారు. దీంతో గ్రామాలతో పాటు, మున్సిపాలిటీలో కూడా డబుల్ ఎంట్రీలు ఉండటంతో వాటిన్నింటినీ తిరస్కరించారు.