ప్రకృతి సాగుతోనే ఆహార భద్రత | cultivation in nature with food safety | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగుతోనే ఆహార భద్రత

Published Sat, Feb 6 2016 4:37 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ప్రకృతి సాగుతోనే ఆహార భద్రత - Sakshi

ప్రకృతి సాగుతోనే ఆహార భద్రత

వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి
జాతీయ శాశ్వత వ్యవసాయ సదస్సు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు తగ్గిపోతున్న భూసారం, నీటివనరుల నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయానికి మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసార థి సూచించారు. జీవవైవిధ్యం, సుస్థిర యాజమాన్యం, సామాజిక బాధ్యత వంటి మేలైన అంశాలతో కూడిన సతత హరిత విప్లవమే దేశ భవిష్యత్తు ఆహార భద్రతను కాపాడగలదని... అందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల ‘జాతీయ శాశ్వత వ్యవసాయ సదస్సు’లో పార్థసారధి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మొదటి హరిత విప్లవ ఫలితాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యానని...దానివల్ల భూములు నిస్సారమై రసాయన అవశేషాలు పెరిగి ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు.

భూముల ఉత్పాదకత దెబ్బతిందన్నారు. ఫలితంగా వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని...ఈ విషవలయం నుంచి గట్టెక్కించగలిగే తరుణోపాయమే పర్మాకల్చర్ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో వర్షాధార, పర్వత ప్రాంతాల్లో ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం సాగవుతోందన్నారు.  సేంద్రియ వ్యవసాయ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని... అవసరమైతే ఎక్కువ నిధులు కేటాయిస్తామని పార్థసారథి తెలిపారు. తెలంగాణలో 17 లక్షల హెక్టార్ల భూముల్లో సహజ వ్యవసాయానికి అవకాశముందన్నారు. అయితే పెరుగుతున్న జనాభా, ఆహార అవసరాల నేపథ్యంలో ఉత్పత్తి ధోరణులపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరముందని నిపుణులను కోరారు.

విఫల ప్రయోగాల వల్లే సాగు సంక్షోభం: వందనా శివ
బహుళజాతి కంపెనీలకు ప్రయోజనం కలిగించే విఫల ప్రయోగాల వల్లే దేశం వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని...ఈ కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పర్యావరణవేత్త వందనా శివ విమర్శించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ బీటీ పత్తి తర్వాత జన్యుమార్పిడి ఆవ విత్తనాలకు తలుపులు తెరవడం నుంచి హైటెక్ బీమా పథకం వరకు అన్నీ కంపెనీల ప్రయోజనాల పరిరక్షణకే జరుగుతున్నాయని దుయ్యబట్టారు. విత్తన స్వాతంత్య్రం, ఆహార సార్వభౌమాధికారాల పరిరక్షణకు ప్రజలంతా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement