వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
ఏడాదికి 24 వేల ఆహార నమూనాలు పరీక్ష చేసేలా లేబొరేటరీలు.. హైదరాబాద్ బిర్యానీ పేరు నిలబెట్టేలా ఆహార పరిశ్రమ ఉండాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ)కు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు, రిజి్రస్టేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. గత పదేళ్లలో పెరిగిన హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగం బలోపేతం కాలేదని మంత్రి అన్నారు. తామిప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్యను పెంచబోతున్నామని చెప్పారు.
నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇవిగాకుండా కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా మంచిపేరు ఉందని, ఆ పేరును నిలబెట్టేలా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మంచిగా బిజినెస్ చేసుకునే వారికి అండగా ఉంటూనే, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు. హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మాత్రమే కాదని, హాస్టళ్లు, హాస్పిటల్స్, వర్క్‌ప్లేస్‌లో ఉండే క్యాంటీన్లు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు.
భద్రకాళి టెంపుల్‌కు భోగ్ సర్టిఫికేషన్...: వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి, హైదరాబాద్‌లోని శ్రీజయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌కు భోగ్ సర్టిఫికెట్లను మంత్రి దామోదర అందజేశారు. హైజెనిక్ కండీషన్‌లో ఫుడ్ తయారు చేస్తూ, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించే దేవస్థానాలు, మందిరాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భోగ్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు.
మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట, సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంసహా సుమారు పది ఆలయాలు, ధ్యాన మందిరాలకు భోగ్ సరి్టఫికేషన్ ఉందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment