విశ్లేషణ
కాలచక్రంలో నెలలు, సంవత్సరాలు పరిగెడుతున్నాయి. కొన్ని రంగాలు రూపు రేఖలు గుర్తుపట్టలేనంతగా మారుతున్నాయి. కానీ, మార్పు లేనిదల్లా వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల జీవితాలే. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు దాటిపోయినా, ఇంకా రైతులు తమ గోడు చెప్పు కోవడానికి రోడ్లపైకి వస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. ఇంతా చేసి రైతులు కోరుతున్నదేమీ అన్యాయమైన డిమాండ్లు కావు. ప్రభుత్వాలు నెరవేర్చగల సహేతుక డిమాండ్లే! ఆత్మగౌరవంతో జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేంత వరకూ రైతులకు ఆత్మగౌరవం లభించదు. రైతాంగం ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి కనీస మద్దతు ధరలు లభించాల్సిందే. వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందే.
2024 ఏడాది ప్రారంభంలో పంజాబ్ రైతులు మరో పోరాటానికి ఉద్యుక్తుల య్యారు. ఏడాది గడిచినా ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి గల కారణాలను విశ్లేషించి చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమా నుష వైఖరి బహిర్గతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు నల్ల చట్టాలను తేవాలని ప్రతిపాదించడం, దానిపై అన్ని రాష్ట్రాల రైతాంగం ఢిల్లీలో చలికి, ఎండలకు, వానలకు తట్టుకొని చేసిన సుదీర్ఘ ఉద్యమం దరిమిలా కేంద్రం దిగొచ్చింది, ప్రతిపాదిత బిల్లుల్ని ఉప సంహరించుకుంది.
అయితే, ఆ సందర్భంగా రైతులకు చేసిన వాగ్దానాలను మాత్రం కేంద్రం నెరవేర్చలేదు. ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, రైతుల్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న పంట రుణాలను మాఫీ చేయాలనీ రైతాంగం చేసిన డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయ లేదు. దాంతో 2024 ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హరి యాణా సరిహద్దుల్లోని శంభూ అంబాలా, అఖేరిజింద్ కూడళ్ల వద్ద బైఠాయించి ఉద్యమం నడుపుతున్నారు.
రైతుల డిమాండ్ల పరిష్కా రానికి సహేతుక ముగింపు లభించాలన్న ఉద్దేశంతో రైతు నాయకుడు జగ్జీత్‌సింగ్ డల్లేవాల్ (నవంబర్ 26న) ఆమరణ దీక్ష మొదలు పెట్టాక, ఈ పోరాటానికి దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. నిజానికి ఓ పోరాటాన్ని విరమింపజేసే సమయంలో ఇచ్చిన వాగ్దానాల్ని కేంద్రం నెరవేర్చకపోవడం, వాటిని నెరవేర్చాలన్న డిమాండ్‌తో రైతాంగం మరో పోరాటానికి దిగడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు.
కనీస మద్దతు ధర ప్రాథమిక హక్కు లాంటిదే!
మూడేళ్ల క్రితం ఉపసంహరించుకున్న మూడు నల్ల చట్టాల్ని కేంద్రం మరో రూపంలో తీసుకురాబోతోందన్న సంకేతాలతోనే పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75 సంవత్సరాలలో పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించక, సాగు గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో చిక్కుకొని గత్యంతరం లేక, తమ జీవితం పట్ల తమకే విరక్తి కలిగి ఇప్పటికి 7 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నా ప్రాణం పోతే పోతుంది. కానీ ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల జాబితాలోకి మరికొన్ని పేర్లు చేరకూడదు’’ అన్న 70 ఏళ్ల డల్లేవాల్ మాటలు వ్యవసాయరంగ వాస్తవ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తాయి.
దేశానికి ఆహార భద్రత అందించే రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకొనే దుఃస్థితి ఎందుకు ఉన్నదో పాలకులు ఆలోచించడం లేదు. గతంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు తాజాగా తెస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్కరణలు రైతుల పాలిట ఉరి తాళ్లుగా మారనున్నాయి. పంట ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (అగ్రి కల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లను రద్దు చేసి కాంట్రాక్టు సాగుకు పట్టం కట్టాలన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ప్రతిపాదనకు రైతాంగం ససేమిరా ఇష్టపడటం లేదు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకురాదలిచిన సంస్కరణలకు సంబంధించి 2024లో విడుదల చేసిన ముసాయిదా పత్రంలో పేర్కొన్న అంశాలు దాదాపుగా అంతకుముందు విరమించుకొన్న వ్యవసాయ బిల్లుల్లోని అంశాలకు నకలుగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తు న్నారు. అవి: 1. జాతీయ వ్యవసాయ మార్కెట్లను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం; 2. ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకు రావటం; 3. ఫీజు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లింపు చేయటం;4. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తించడం; 5. ప్రైవేట్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికల ఏర్పాటు... ఇలా పలు ప్రతిపా దనలను ముసాయిదా బిల్లులో చేర్చి, వాటిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు.
సాధారణంగా వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు రైతాంగ ప్రతినిధులతో చర్చించడం, వారిని భాగస్వాముల్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కేంద్రం ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడాన్ని రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. తమకు అంగీకార యోగ్యం కాని నిర్ణయాలు చేయడం కోసమే కేంద్రం ఏక పక్షంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఆశించడం రాజ్యాంగంలో ప్రజలకు దఖలు పడిన ప్రాథమిక హక్కు లాంటిదేనని డల్లేవాల్ పేర్కొనడం దేశవ్యాప్త చర్చకు ఆస్కారం కల్పించింది.
దేశవ్యాప్త డిమాండ్ కూడా అదే!
తాము పండించే పంటకు ఎంత ధర ఉండాలో నిర్ణయించుకొనే హక్కు ఎలాగూ రైతాంగానికి లేదు. కనీసం పండించే పంటకు ఎంత మొత్తం కనీస మద్దతు ధర (ఎంఎస్íపీ)గా ఇస్తారో ముందుగా తెలుసుకోవాలను కోవడం అత్యాశేమీ కాదు కదా? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అంటే పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటు లెక్క గట్టి ధరల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్రానికి తగిన సూచనలు చేయాలని అభ్యర్థించారు. అయితే, ప్రజల జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని... కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించలేమనీ, అలా చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పుతాయనీ సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదారి పట్టించిందన్నది నిర్వివాదాంశం.
నిజానికి ఈ సమస్యను న్యాయస్థానాలు పరిష్కరించాలని ఆశించడం కూడా సముచితం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించే సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్)లో చైర్మన్ నుంచి సభ్యుల వరకూ అందరూ బ్యూరోక్రాట్లే. రైతాంగ ప్రతినిధులు ఉండరు. పేరుకు ‘సీఏసీపీ’ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా కనిపిస్తుంది గానీ, దానిపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. సీఏసీపీ నిర్ణయించే కనీస మద్దతు ధరల విధానం ఆమోదయోగ్యం కాదని దశాబ్దాలుగా రైతాంగ సంస్థలు మొత్తుకొంటున్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే శిరోధార్యం అని ఎందరు చెప్పినా దానికి మొగ్గుచూపడం లేదు. పైగా, తాము అనుసరించే విధానాన్నే స్వామినాథన్ కమిషన్ సూచించిందనీ, ఆ ప్రకారం సాగు వ్యయంపై 50 శాతం జోడించి ఇస్తున్నా మనీ దాదాపు ఐదారేళ్ల నుంచి కేంద్రం బుకాయిస్తూనే ఉంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడ్డం జాతీయ రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిన నేపథ్యంలోనే రైతాంగ సమస్యలు నేటికీ రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అన్న దాతలతో తక్షణం చర్చలు జరపాలి (ఎట్టకేలకు ఫిబ్రవరి 14న చర్చలకు ఆహ్వానించింది). ‘మార్కెటింగ్ ఫ్రేవ్‌ువర్క్’ పేరుతో తెచ్చిన ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతాంగం కోరు తున్నట్లు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం ఒక్కటే దేశ రైతాంగానికి సంజీవనిగా పని చేయగలుగుతుంది.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment