విశ్లేషణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రైతుల పట్ల గల అమిత శ్రద్ధ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయం ఆయన రైతుల కోసం తీసుకున్న నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అన్నదాతల జీవితాలను మార్చడమే ప్రధాని మొదటి, అత్యంత ప్రాధాన్య లక్ష్యం. అందుకే ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో వ్యవసాయం, రైతులకు అధిక ప్రాధాన్యం కొనసాగించారు.
రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘వ్యావసాయిక మౌలిక సదుపాయాల నిధి’ (ఏఐఎఫ్), ‘పీఎం ఆశా’ వంటి పథకాలలో ఈ నిబద్ధత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఏఐఎఫ్ రూపంలో సుస్థిర పరిష్కారాన్ని అందించడం ద్వారా రైతుల సాధికారతకు ప్రభుత్వం గణనీయమైన సహకారం అందిస్తోంది.
దేశంలో పంట కోత అనంతర నష్టాలు ఒక పెద్ద సవాలు. ఇది వ్యవసాయ రంగ ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. లక్షలాది రైతుల శ్రమను నీరుగారుస్తోంది. తాజా అంచనాల ప్రకారం, దేశంలో ప్రతి ఏటా మొత్తం ఆహార ఉత్పత్తిలో 16–18% ఈ విధంగా నష్టపోతున్నాం.
పంట కోత, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ వంటి వివిధ సందర్భాల్లో ఈ తరహా నష్టాలను చూస్తున్నాం. సరైన నిల్వ, శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం, తగిన శుద్ధి యూనిట్ల కొరత, సమర్థమైన రవాణా సదుపాయాలు లేని కారణంగా ఈ భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. ఇది మొత్తం ఆహార భద్రతపై దుష్ప్రభావం చూపిస్తోంది.
నిల్వ సదుపాయాలు పెరిగాయి
మోదీ సమర్థ నాయకత్వంలో శాస్త్రజ్ఞుల పరిశోధనలను ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా 2020 జూలైలో ‘ఏఐఎఫ్’ను ప్రధాని ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట తరువాతి నిర్వహణ సమస్యలను పరిష్కరించడం, తద్వారా ఆహార నష్టాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం.
కొత్త ప్రాజెక్టులు, కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవాలి. ఏఐఎఫ్ కింద బ్యాంకులు 9 శాతం వడ్డీ పరిమితితో ఏడాదికి 3 శాతం వడ్డీ రాయితీ రుణాలు, ‘సీజీటీఎంఎస్‌ఈ’ (క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్) కింద ఆర్థిక సంస్థలు రూ. 2 కోట్ల వరకు రుణాలు అందిస్తాయి. ఈ పథకంలో భాగంగా గత ఆగస్టు వరకు మంజూరు చేసిన మొత్తం రూ. 47,500 కోట్లు దాటింది.
ఇందులో రూ. 30 వేల కోట్లకు పైగా ఇప్పటికే వివిధ ప్రాజెక్టులకు కేటాయించారు. మంజూరైన ప్రాజెక్టుల్లో 54 శాతం... రైతులు, సహకార సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘా లకు అనుసంధానం కావడం విశేషం. ఇది పొలాల వద్దే మౌలిక సదుపాయాలను అందించడంలో రైతుల బలమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
పంట నష్టాల నుంచి రైతులను కాపాడటానికి నిల్వ (డ్రై, కోల్డ్ స్టోరేజీలు), రవాణా మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాని ప్రాధాన్యమిస్తున్నారు. డ్రై స్టోరేజ్ పరంగా చూస్తే, దేశంలో 1,740 లక్షల మెట్రిక్ టన్నుల పంటను నిల్వ చేసే సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 44% కొరత ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఉద్యాన ఉత్పత్తుల కోసం, దేశంలో సుమారు 441.9 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ అందుబాటులో ఉంది.
ఈ సామర్థ్యం దేశంలోని పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 15.72% మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐఎఫ్ వల్ల సుమారు 500 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్య అంతరాన్ని తగ్గించడానికి వీలైంది. దీనివల్ల పంట కోత అనంతర నష్టం రూ. 5,700 కోట్లు ఆదా అవుతుంది. సరైన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల ఉద్యాన ఉత్పత్తుల నష్టం 10% తగ్గింది.
పాతిక లక్షల మందికి ఉపాధి
వ్యవసాయ మౌలిక సదుపాయాల వృద్ధి, అభివృద్ధికి ఏఐఎఫ్ కొత్త ఉత్తేజాన్ని అందిస్తోంది. గత ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 74,695 వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఏఐఎఫ్ కింద ఆమోదం లభించింది. వీటిలో 18,508 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 16,238 ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు, 13,702 గోదాములు, 3,095 సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, 1,901 కోల్డ్ స్టోర్స్, కోల్డ్ చైన్లు, 21,251 ఇతర రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు 2015 నుంచి వ్యవసాయ రంగంలో రూ. 78,702 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.
ప్రభుత్వ చర్యల వల్ల యువత కూడా వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో సుమారు 50,000 కొత్త వ్యవసాయ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇది రైతుల స్వావలంబనకు దారి తీస్తోంది. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రయత్నాలు 8 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించదానికి దోహదపడ్డాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 25 లక్షల ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. పొలాల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పన వల్ల రైతులు తమ పంటలను నేరుగా ఎక్కువమందికి అమ్ముకోవడానికి వీలు కలిగింది. ఆధునిక ప్యాకేజింగ్, స్టోరేజీ వ్యవస్థల కారణంగా రైతులు మార్కెట్లలో తమ ఉత్పత్తులను మరింత సమర్థంగా అమ్ముకోగలుగుతారు. ఫలితంగా మంచి ధర దక్కుతుంది. ఈ యత్నాలు రైతుకు సగటున 11–14% అధిక ధరలను పొందడానికి వీలు కల్పిస్తున్నాయి.
పూచీకత్తు భరోసా, వడ్డీ రాయితీ ద్వారా రుణ సంస్థలు తక్కువ రిస్క్‌తో రుణాలు ఇచ్చి, తద్వారా తమ వినియోగదారులకు సాయ పడతాయి. నాబార్డ్ రీఫైనాన్ ్స సదుపాయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని భాగస్వామ్యం చేయడం వల్ల ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల(పీఏసీఎస్) వడ్డీ రేటును ఒక శాతానికి తగ్గించడం గమనార్హం. దీంతో ఇలాంటి పీఏసీఎస్‌లతో సంబంధం ఉన్న వేలాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనాలు చేకూ రాయి. ఏఐఎఫ్ కింద 9,573 పీఏసీఎస్ ప్రాజెక్టులకు నాబార్డ్ ఇప్పటి వరకు రూ. 2,970 కోట్ల రుణం మంజూరు చేసింది.
ఆరు సూత్రాల వ్యూహం
వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచడం, వ్యవ సాయ వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తికి గిట్టుబాటు ధరలు కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తగిన ఉపశమనం కల్పించడం, వ్యవసాయం, ప్రకృతి సేద్యాన్ని వైవిధ్యపరచడం వంటి ఆరు సూత్రాల వ్యూహంతో ముందుకు వచ్చాం.
హైడ్రోపోనిక్ వ్యవ సాయం, పుట్టగొడుగుల పెంపకం, వెర్టికల్ ఫామింగ్, ఏరోపోనిక్ వ్యవసాయం, పాలీహౌస్, గ్రీన్ హౌస్ వంటి ప్రాజెక్టులను రైతు సమూహాలు, సంఘాలకు మాత్రమే కేటాయించారు. వాటి పరిధిని విస్తరించడం ద్వారా వ్యక్తిగత లబ్ధిదారులు ఇప్పుడు ఈ ప్రాజె క్టులను చేపట్టడానికి ఏఐఎఫ్ కింద అనుమతులు పొందడానికి అర్హులయ్యారు.
దీనికి అదనంగా, ‘పీఎం–కుసుమ్’ యోజనలోని ‘కాంపోనెంట్ ఎ’... బంజరు, బీడు, సాగు, పచ్చిక బయలు లేదా చిత్తడి భూములలో రెండు మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీనిని సులభంగా ఎఐఎఫ్ పథకంతో అనుసంధానించవచ్చు.
ఈ వ్యూహాత్మక సమ్మేళనం రైతులకు వ్యక్తిగ తంగా సహాయపడుతుంది. రైతు సమూహాలను సాధికారం చేస్తుంది. ‘అన్నదాత’ నుండి ‘ఉర్జాదాతా’ (ఇంధన ప్రదాత) వరకు వారి పాత్రను పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విశ్వసనీయమైన ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
విస్తృత స్థాయిలో మెరుగు పడిన సమాచార వ్యవస్థ, సమష్టి కృషితో రైతు సంక్షేమంలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ‘వికసిత భారత్’లో భాగంగా అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగ కలలను సాకారం చేయడంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది.
శివరాజ్ సింగ్ చౌహాన్
వ్యాసకర్త కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం; గ్రామీణాభి
వృద్ధి శాఖల మంత్రి; మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment