ప్రాసంగికత కోల్పోతున్న యూరప్‌? | Sakshi Guest Column On Europe | Sakshi
Sakshi News home page

ప్రాసంగికత కోల్పోతున్న యూరప్‌?

Published Thu, Apr 10 2025 12:22 AM | Last Updated on Thu, Apr 10 2025 12:59 PM

Sakshi Guest Column On Europe

విశ్లేషణ

డోనాల్డ్‌ ట్రంప్, జె.డి. వాన్స్‌ కలిసి వైట్‌ హౌస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఎలా వేధించారో ప్రపంచం అంతా చూసింది. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయన పట్ల పాశవికంగా ప్రవర్తించి గుడ్‌ బై సైతం చెప్పకుండా తరిమేశారు. ‘రష్యాను ధిక్కరించండి, మీకు మేము అండగా ఉన్నాం...’ అంటూ ఉక్రెయిన్‌ అధినేతకు బాసటగా నిలిచి ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహించిన యూరప్‌ ఈ ఘట్టాన్ని చేష్టలుడిగి చూసింది. యూరప్‌ ప్రభావం పలుచబడిపోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

తగ్గుతున్న జనాభా
యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు బలమైన నాయ కత్వం లేదు. ఎవరి దౌత్య విధానం వారిదే. ‘యూరప్‌తో మాట్లాడా లనుకుంటే, నేను ఎవరికి ఫోన్‌ చేయాలి?’ అంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ ఒక సందర్భంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. యూరప్‌ దేశాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ దేశాల్లో జననాల రేట్లు తగ్గుతున్నాయి.

వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, యువకులు తగ్గిపోతున్నారు. 2050 నాటికి యూరప్‌ సగటు వయసు 48 ఏళ్లకు పెరుగుతుంది. 60 ఏళ్లు దాటినవారు జనాభాలో 40 శాతం ఉంటారు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభాలో 25 శాతం యూరప్‌ దేశాల ప్రజలే ఉండేవారు. 2050 నాటికి, వీరి వాటా కేవలం 7 శాతానికి పరిమితం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

యుద్ధరంగానికి దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారుతోంది. రష్యా ఇప్పటికే ఉత్తర కొరియా దళాలను రెగ్యులర్‌ ప్రాతిపదికన తన సైన్యంలో నియమించుకోవలసి వచ్చింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నా సరే... యూరప్‌ కాలం చెల్లిన తన పాత ఇమ్మిగ్రేషన్‌ విధానాలనే పట్టుకు వేలాడుతోంది. ఇది శ్రమశక్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఉక్రెయిన్‌ శ్వేతజాతి శరణార్థుల పుణ్యమా అని పనిచేసే వారి సంఖ్య పెరిగినా ఇది తాత్కాలికమే! 

ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థ
పరిపాలన సరిగా ఉండదు, ఆర్థికంగా పురోగమనం లేదు, వయసు మళ్లుతున్న జనం పెరుగుతున్నారు, వృత్తిపరమైన అవకా శాలూ అంతంత మాత్రమే. ఇలాంటి యూరప్‌ ఇండియాను ఎలా ఆకట్టుకుంటుంది? అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా, సత్తాను బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. ఆ మాదిరిగా మార్పు చెందటంలో యూరప్‌ సమాజం విఫలమైంది. 

నత్తనడకగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న సామాజిక భద్రతా వ్యయాలు, నడ్డి విరుస్తున్న రుణభారం... ఇవన్నీ ఆ ఖండం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అమెరికా పాత్రికేయుడు ఫరీద్‌ జకారియా చెప్పినట్లు, యూరప్‌ దుఃస్థితికి మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం. ఉదాహర ణకు ఇటలీ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా ఒక దశాబ్దంగా ఎలాంటి పెరుగుదల లేదు.

ఆసియా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాల్లోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలం పుంజుకుంటూ దూసుకు వస్తున్నాయి. గ్లోబల్‌ గవర్నెన్స్‌లో తమకు అధిక పాత్ర ఉండాలని ఈ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జీ–7, నాటో వంటి ప్రపంచ అధికార సంస్థలు ఇప్పటికీ యూరప్‌ చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. 

కానీ ఆర్థిక వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు యూరప్‌ దేశాలు (జర్మనీ, యూకే, రష్యా, ఫ్రాన్స్‌, ఇటలీ) ప్రపంచ టాప్‌–10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. 2050 నాటికి ఈ అయిదింటిలో కేవలం జర్మనీ, యూకే రెండే టాప్‌–10 జాబితాలో మిగిలి ఉంటాయి. 

ఆ పదిలో వాటికి దక్కే ర్యాంకులు చిట్టచివరి తొమ్మిది, పది! ఇందుకు భిన్నంగా, వాటి కంటే ముందుండే ఇండియా, బ్రెజిల్, ఇంకా ఇతర వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గణనీయ పాత్ర ఉండాలని ఒత్తిడి చేస్తాయి. ఇప్పటి ప్రపంచ వ్యవస్థ పునర్‌ వ్యవస్థీకరణను ఎంతో కాలం అడ్డుకోలేరు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం ఇప్పటికే కాలం చెల్లిపోయింది. దీన్ని ఎలా పునర్‌ వ్యవస్థీకరించాలనే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలు ప్రస్తుత సభ్యత్వాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నాయి.

ఇండియా జీడీపీలో మూడోవంతు కంటే తక్కువ, జపాన్‌ జీడీపీలో దాదాపు సగం ఉండే యూకే, ఫ్రాన్స్‌ వంటి దేశాలు శాశ్వత సభ్యు లుగా ఉండటం... ఇండియా, జపాన్‌ వెలుపల ఉండటం ఎలా సమంజసమనీ, వాటి మీద ఈ రెండు యూరప్‌ దేశాలు ఎలా పెత్తనం చలా యిస్తాయనీ గట్టి వాదన వినబడుతోంది. భద్రతా మండలి, జీ–7 లను సభ్యత్వ పరంగా విస్తరించడం మీద చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచ పాలన సంస్థల పునర్‌ వ్యవస్థీకరణ జరగాలన్నది కాదనలేని అంశం. 

తిరుగులేని అమెరికా?
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా మున్ముందు కూడా ప్రబలమైన ప్రపంచ శక్తిగా కొనసాగుతుంది. చైనా, ఇండియా వంటి దేశాలు దాన్ని వెన్నంటి ఉంటాయి. ఒకవేళ అధిగమించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పటి విజేతల్లో ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్‌–10 జాబితా నుంచి కను మరుగవుతాయి.

అమెరికా లోలోపల పలు మార్పులు చెందుతోంది. జనాభా వర్గాల్లో పరివర్తన ఫలితంగా రాజకీయంగానూ మార్పులు సంభవి స్తున్నాయి. నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆఫ్రో–ఇండి యన్‌ మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టగలిగింది. భారతీయ అమెరికన్లు ప్రభుత్వంలో, విద్యా పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. 

గుజ్జూభాయి కశ్యప్‌ పటేల్‌ ఎఫ్‌బీఐ పగ్గాలు చేపడతాడని ఎప్పుడైనా అనుకున్నామా? వివిధ దేశాల సంతతులకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ, ఇతర రంగాల్లో ప్రముఖ స్థానాలు పొందడం వల్ల ఆ యా దేశాలు అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. విదేశీయులకు ప్రవేశం కల్పించడం వల్ల అమెరికా ప్రతిభ ఇనుమడించింది. యూరప్‌ ఈ విషయంలో విఫలమైంది. 

వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపు దిద్దబోతున్నందున... ప్రపంచ వ్యవహారాల్లో యూరప్‌ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. యూరప్‌ గనుక జనాభా సంబంధిత (డెమో గ్రాఫిక్‌) నూతన విధానాలు రూపొందించకపోతే, ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టకపోతే అది ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో గుర్తింపు లేని ఖండంగా మిగిలిపోతుంది.

రానున్న రోజుల్లో ఆసియానే ప్రపంచ అధికార కేంద్రంగా ఆవి ర్భవిస్తుంది. 2020లో ఈ ఒక్క ఖండమే ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 60 శాతం వాటా కైవసం చేసుకుంది. ఇదే ట్రెండ్‌ ఇక మీదటా కొనసాగబోతోంది. చైనా, ఇండియా ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ పలుకుబడి పెంచుకుంటూ పోయి, ప్రపంచ పాలన (గ్లోబల్‌ గవర్నెన్స్‌)లో మార్పుల కోసం పట్టుబడతాయి. 

అయితే, అమెరికాతో విరోధం కారణంగా చైనా, యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు చేరువయ్యే అవకాశం ఉంది. ఇక చైనాతో సంబంధాలు బెడిసినందువల్ల ఇండియా, అమెరికాకు బహుశా మరింత దగ్గర అవుతుంది.

మోహన్‌ గురుస్వామి 
వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత
mohanguru@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement