విశ్లేషణ
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనుండగా, రష్యా–ఉక్రెయిన్‌లు... యుద్ధంలో చివరి దశ క్రీడలు సాగిస్తున్నాయి. ట్రంప్ ఈ సమస్య పరిష్కారానికి తన ప్రతినిధిగా జనరల్ కీత్ కెల్లోగ్ అనే అనుభవజ్ఞుడిని నియమించారు. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారైన కెల్లోగ్, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై తన ఆలోచనలను ఇప్పటికే వివరించారు. ఈ పరిణామాల దృష్ట్యా రష్యా, ఉక్రెయిన్‌లు చర్చలకు సమ్మతిస్తూనే, అవి జరిగేలోగా యుద్ధంలో వీలైనంత పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయి.
చర్చలు అంటేనే ఎవరి షరతులు వారు విధి స్తారు. మధ్యవర్తి అయినవారు ఇరుపక్షాల మధ్య రాజీ కోసం ప్రయత్నిస్తూనే, తమవైపు నుంచి కొన్ని ప్రతిపాద నలు చేస్తారు. వాటిపై చర్చల క్రమంలో ఒక రాజీ కుదురుతుంది. అయితే ప్రస్తుత అంశంపై చర్చలు త్వరలోనే ప్రారంభం కావచ్చు గానీ, రాజీ ఎప్పటికి జరిగేదీ ఎవరూ చెప్పలేరు. వంద రోజులన్న జనరల్ కెల్లోగ్ అయినా!
ఉక్రెయిన్ తూర్పున తమ సరిహద్దుల వెంట గల డోన్ బాస్ ప్రాంతాన్నంతా పూర్తిగా తమకు వదలి వేయటం, 2014 నుంచి
తమ ఆక్రమణలో గల క్రిమియా దీవిని తిరిగి కోరక పోవటం, ఉక్రె యిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరినా, ఎప్పటికీ నాటోలో చేరక పోవటం అన్నవి రష్యా షరతులు. బ్లాక్ సీలో గల క్రిమియా, ముఖ్యంగా చలికాలంలో ఆ సముద్రం ఘనీభవించదు గనుక నౌకా రవాణాకు రష్యాకు తప్పనిసరి అవసరం.
ఉక్రెయిన్ నాటోలో చేరినట్ల యితే రష్యా భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. సోవియట్ యూనియన్, వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లో రద్దయిన తర్వాత, అమెరికన్ నాటో కూటమి మాత్రం మరింత విస్తరిస్తూ, రష్యా సరిహద్దునే గల ఉక్రెయిన్‌ను కూడా చేర్చుకొన జూస్తుండటం మాస్కో భయానికి కారణం.
తక్షణం యుద్ధం ఆగితేనే చర్చలు
రష్యా దృష్టి నుంచి గల పరిస్థితులు ఇవి కాగా, ఉక్రెయిన్ షరతులు రెండు. ఒకటి–క్రిమియాను, ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్ర మించిన డోన్ బాస్ భూభాగాలను తమకు తిరిగి అప్పగించటం. రెండవది–నాటోలో చేరే స్వేచ్ఛ తమకు ఉండటం. డోన్ బాస్‌లో రష్యా ఇప్పటికి 20 శాతానికి పైగా భాగాన్ని ఆక్రమించింది. ఇక ట్రంప్ ప్రతినిధిగా జనరల్ కెల్లోగ్ సూచిస్తున్నది, మొదట యుద్ధం వెంటనే ఆగిపోవాలి. ఇరు సైన్యాలు ఎక్కడివక్కడ నిలిచి పోవాలి.
తర్వాత చర్చలు ఆరంభమవ్వాలి. రష్యా ఆక్రమణలో గల భూభా గాలు కనీసం కొన్నింటిని వదులుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధపడాలి. దానికి నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా, కనీసం 20 ఏళ్లపాటు, వాయిదా వేయాలి. ఇందుకు రష్యా అంగీకరించనట్లయితే ఉక్రెయి న్‌కు తమ సహాయం కొనసాగిస్తారు. ఉక్రెయిన్ కాదంటే వారికి అన్ని సహాయాలూ నిలిపివేస్తారు.
వీటన్నింటిపై చర్చలు ఏ విధంగా పురోగమించవచ్చునన్నది అట్లుంచి కొన్ని విషయాలు గమనించాలి. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతునిస్తూ రష్యా ఆక్రమణలో గల డోన్ బాస్ ప్రాంతాన్ని, క్రిమియాను వదలుకునేందుకు జెలెన్ స్కీ సిద్ధపడవలసి ఉంటుందని సలహా ఇస్తున్నాయి.
ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసేందుకు రష్యా ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించ బోదని, అటువంటి షరతు వస్తే యుద్ధాన్ని కొనసాగించగలదని, అపుడు అమెరికా కూటమి ఎంత సహాయం చేసినా రష్యా మరిన్ని భూభాగాలు ఆక్రమిస్తూ పోగలదని, ఉక్రెయిన్ పక్షాన తాము ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదని వారికి తెలుసు.
తామూ, అమె రికా ఇప్పటికే ఎంత ఆధునిక ఆయుధాలనిచ్చినా రష్యాను ఉక్రెయిన్ నిలువరించలేక పోతున్నది. ఇప్పటికే రష్యా ఆక్రమణలో గల ప్రాంతా లను, క్రిమియాను వదులుకునేందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్న సూచనలున్నాయి. కానీ, రష్యా డిమాండ్ చేస్తున్నట్లు డోన్ బాస్ ప్రాంతం యావత్తునూ వదిలేందుకు ససేమిరా అంగీకరించక పోవచ్చు. అట్లాగే, తాము నాటోలో ఎన్నటికీ చేరక పోవటాన్ని.ఇందుకు బహుశా ట్రంప్ కూడా సమ్మతించకపోవచ్చు.
ట్రంప్ గెలుపుతో కొత్త చిక్కులు!
అమెరికా, యూరప్‌లకు కూడా కొన్ని ఆందోళనలున్నాయి. సోవి యట్ యూనియన్ పతనం తర్వాత 10–15 సంవత్సరాలకు తమ అపారమైన సహజ వనరుల బలంతో పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకోవటం ప్రారంభించిన రష్యా.. చైనా, ఇండియా తదితర అనేక దేశాలతో మైత్రీ సంబంధాల అభివృద్ధితో ఆర్థికంగా, ఆయుధ బలం రీత్యా ఈసరికి శక్తిమంతంగా మారింది.
అటువంటి స్థితిలో పుతిన్ ఉక్రెయిన్‌తో ఆగక తమకు కూడా సవాలుగా మారగలరన్నది అమెరికా, యూరప్‌ల సందేహం. అందువల్ల రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో ఓడించదలచారు గానీ అదీ సాధ్యం కాదని ఆంక్షల వైఫ ల్యంతో, తమ ఆయుధాల వైఫల్యంతో అర్థమైంది. అందుకే ఇపుడు రాజీ ప్రయత్నాలను సమర్థిస్తున్నారు. అనూహ్యంగా ట్రంప్ గెలుపు వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. రష్యా పట్ల కొంత మెతకదనం కలవాడనే పేరు తన మొదటి హయాంలోనూ కలిగి ఉండిన ఆయన, ప్రస్తుత యుద్ధం వల్ల అందరికీ నష్టమేనంటూ అసలు యుద్ధాన్నే వ్యతిరేకించారు.
జెలెన్‌స్కీ వైఖరిని విమర్శించి ఆయన వాదనలను కొట్టివేశారు. ఉక్రెయిన్‌కు బైడెన్ ప్రభుత్వం ఆయుధాలు, నిధులు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. అంతటితో ఆగక నాటోను, యూరో పియన్ యూనియన్‌ను సైతం వేర్వేరు విషయాలపై తప్పుపట్టడం మొదలు పెట్టారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) అనే తన నినాదానికి అనుగుణంగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెట్టించగలమని ప్రకటించారు.
ఐరోపా దేశాలకు అమెరికా భయం!
ఈ మార్పులను గమనించి, ఉక్రెయిన్ సందర్భంలోనే గాక ఇతరత్రా కూడా జంకిన యూరప్ నేతలు ట్రంప్‌కు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే కీడెంచి మేలెంచమన్నట్లు, ట్రంప్ రాక తర్వాత అమెరికా భాగస్వామ్యం పరిమితమైనప్పటికీ ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సహాయాలు అదే స్థాయిలో కొనసాగించాలని తీర్మానాలు చేశారు. కానీ, తమ సైనిక, ఆర్థిక శక్తి రెండూ క్రమంగా బలహీన పడుతున్నందున అది సాధ్యం కాదని గ్రహించి రాజీ ఆలోచనలు మొదలు పెట్టారు.
పాశ్చాత్య దేశాల నుంచి ఇప్పటికి ఉక్రెయిన్‌కు సుమారు 130 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందగా అందులో సగం అమెరికాదే. ఆయుధాలతో పాటు ఆర్థిక సహాయాన్ని ట్రంప్ నిలిపివేస్తే ఉక్రెయిన్ అక్షరాలా కుప్పకూలుతుంది. ఇది యూరోపియన్ దేశాలను భయపెడుతున్న అతి పెద్ద విషయం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఉభయుల మధ్య రాజీని కుదర్చటం కెల్లోగ్‌కు సమస్య కాబోదు.
బేరసారాలకు ఇరు దేశాల ఎత్తుగడ
పోతే, పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారే అవకాశా లున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రచార సమయంలోనే అను మానించిన జెలెన్‌స్కీ రష్యాతో చర్చల సమయంలో పై చేయి సాధించలేక పోయినా కనీసం సమ ఉజ్జీ అయేందుకు కొన్ని ఎత్తుగడలను అనుసరించారు. తూర్పున విశాలమైన భూభాగాలను ఆక్రమించిన రష్యా, పోక్రొవ్ స్కీ అనే కీలకమైన నగరంపై దృష్టి కేంద్రీకరించింది.
దానిని ఆక్రమిస్తే, ఆ మొత్తం ప్రాంతానికి గుండెకాయ వంటి కూడలి కేంద్రం తన అధీనమై ఉక్రెయిన్ తీవ్రంగా బలహీనపడుతుంది. ప్రస్తుతం ఆ నగరానికి కొద్ది కిలోమీటర్ల దూరానికి చేరిన రష్యన్ సేనలు, చర్చల లోగా దాని స్వాధీనానికి భీకర యుద్ధం సాగిస్తు న్నాయి. ఉక్రెయిన్ ఆ నగర రక్షణకు పోరాడుతూనే, రష్యాతో ఉత్తర సరిహద్దున గల కుర్‌స్క్ ప్రాంతంలోకి అకస్మాత్తుగా చొచ్చుకు పోయింది.
చర్చలు జరిగినపుడు ఈ రెండు నగరాలు బేరసారాల కోసం ఉపయోగపడాలన్నది ఇరువురి ఎత్తుగడ. ఇటువంటి చివరి దశ యుద్ధ క్రీడలే మరికొన్ని సాగుతున్నాయి. రష్యా ఉత్తర కొరియన్ సేనలను రప్పించటం, ఉక్రెయిన్ యూరప్ సహాయంతో తన రాజ కీయ బేరసారాల శక్తిని పెంచుకోజూడటం, రష్యా పైకి దీర్ఘ శ్రేణి క్షిపణుల ప్రయోగం వంటివన్నీ అవే. మొత్తానికి ఈ చివరి దశ క్రీడ లకు జనవరి చివరిలోగా కొద్ది సమయమే మిగిలి ఉంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment