
విశ్లేషణ
అరవై సంవత్సరాలపాటు అస్సాద్ వంశ నియంతృత్వంలో మగ్గి గత డిసెంబర్‌లో విముక్తి చెందిన సిరియా ప్రజలు కుదుట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అందుకు రెండు శక్తుల నుంచి సవాళ్లు ఎదురవుతు న్నాయి. ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన బషార్ అల్– అస్సాద్, ఇజ్రాయెల్! అస్సాద్ సవాలు కనీసం పరోక్షమై నది, ఇజ్రాయెల్‌ది ప్రత్యక్షమైనది.
డిసెంబర్ మొదటి వారంలో అస్సాద్ పతనం తర్వాత సిరియాను మరిచిపోయిన ప్రపంచం, పది రోజుల క్రితం అకస్మాత్తుగా పెద్ద ఎత్తున సాయుధ ఘర్షణ వార్తలు రావటంతో ఉలిక్కిపడింది. ఆ విధంగా దృష్టి ఉక్రెయిన్ యుద్ధం నుంచి కొద్ది రోజులపాటు ఇటు మళ్లింది. వారం రోజులపాటు ఆ ఘటనలలో సుమారు 1,500 మంది చనిపోయినట్లు అంచనా. అస్సాద్ పతనానికి ముందు పది రోజులపాటు సాగిన తిరుగుబాటులోనూ అంతమంది చనిపోలేదు.
తిరగబడిన అలావైట్ తెగ
ఈ ఘర్షణలకు కారణం, అస్సాద్‌కు చెందిన మైనారిటీ అలావైట్ తెగవారు తిరగబడటం! వారు ప్రధానంగా సిరియాలోని పశ్చిమ ప్రాంతాన మధ్యధరా సముద్ర తీరం వెంట నివసిస్తారు. వారు తెగను బట్టి మైనారిటీ మాత్రమేగాక, మతం రీత్యానూ మైనారిటీ. దేశంలో సున్నీలది మెజారిటీ కాగా వీరు షియాలు.
షియా రాజ్యమైన ఇరాన్, అస్సాద్‌ను బలపరచటానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి. తిరుగుబాటు విజయవంతమైనప్పటి నుంచి అలావైట్‌లలో సహజంగానే భయం ఏర్పడింది. వారు లెబనాన్‌కు తరలి పోవటం మొదలైంది. తిరుగుబాటు నాయకుడు అహమద్ అల్–షరారా, అటు వంటి ఆందోళనలు అక్కర లేదనీ, దేశంలోని అన్ని తెగలు, మతాలు, వర్గాలను ఏకం చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోవటం తన లక్ష్యమనీ మొదటి రోజునే ప్రకటించారు.
కానీ అలావైట్ షియాలకు, సున్నీలకు మధ్య స్థానికంగా కొన్ని కలహాలు జరగగా, ఉన్నట్లుండి అలావైట్ల పక్షాన సాయుధులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ప్రభుత్వ సేనలు మోహరించగా ఘర్షణలు తీవ్ర రూపం తీసుకున్నాయి. వారం రోజులలో 1,500 మంది చనిపోయినట్లు అనధికార అంచనా కాగా, ప్రభుత్వం చేసిన ప్రకటనను బట్టి వారిలో సుమారు 200 మంది సైనికులున్నారు.
మిగిలిన 1,300 మందిలో అలావైట్ పౌరులు ఎందరో, సాయుధ దళాల వారెందరో తెలియదు. అస్సాద్ సైన్యంలోని ఒక దళం తిరిగి ఒకచోట చేరి దాడులు ఆరంభించింది. అది స్థానికంగా జరిగిన పరిణామమా, లేక ప్రస్తుతం రష్యాలో తలదాచుకున్న అస్సాద్ ప్రమేయ ముందా అనేది తెలియదు. అందుకు అవకాశాలు తక్కువన్నది ఒక అభిప్రాయం.
ఆయనకు రష్యా మొదటి నుంచి మద్దతునివ్వటం, ప్రస్తుతం ఆశ్రయాన్నివ్వటం నిజమే అయినా, సిరియా కొత్త ప్రభు త్వంతో సత్సంబంధాలకు ప్రయత్నిస్తున్నది. మధ్యధరా సముద్రపు తూర్పు తీరాన భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో గల సిరియాలో రష్యాకు ఒక నౌకా స్థావరం, ఒక వైమానిక స్థావరం ఉన్నాయి. యూరప్‌ను ఎదుర్కొనేందుకు అవి చాలా అవసరం. అందువల్ల సిరియా కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల ద్వారా ఆ స్థావరాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రష్యా ఇంతకాలం అస్సాద్‌కు పూర్తి మద్దతుగా ఉండినప్పటికీ, తమ కొత్త పరిస్థితులలో రష్యా సహాయం అనేక విధాలుగా అవసరం గనుక, అల్–షరారా కూడా అందుకు సుముఖత చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో అస్సాద్‌ను సిరియాలో తన పాత సైనిక దళాల ద్వారా ఘర్షణలకు రష్యా అనుమతించటం జరిగేది కాదు. పరోక్షంగానైనా అస్సాద్ ప్రోత్సాహం లేక ఇది జరిగేది కాదనే అభిప్రాయమూ ఉంది.
అందరినీ ఏకం చేసే దిశగా...
ఈ తర్కాన్ని బట్టి చూసినపుడు, ఘర్షణలకు కారణం అస్సాద్ సైన్యానికి చెందిన స్థానికమైన ఒక సైనిక దళమని భావించవలసి ఉంటుంది. అల్–షరారా ప్రకటించింది కూడా అదే. ఆ ఒక్క దళాన్ని చివరకు తుడిచి పెట్టామన్నారాయన. అయితే, ఇటువంటి పరిస్థితి తిరిగి తలెత్తబోదనే హామీ ఏమైనా ఉందా? దేశ నిర్మాణంలో అలావైట్లు కూడా భాగస్వాములని, వివిధ వర్గాల మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండబోవని తమ తిరుగుబాటు విజయవంతమైన మొదటిరోజునే స్పష్టం చేసిన తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరారా, గమనార్హమైన పని ఒకటి చేశారు.
అది – ఘర్షణలపై నియమించిన విచారణ కమిటీలో అలావైట్లను కూడా చేర్చటం! ఘర్షణలలో తమ వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని ప్రత్యే కంగా చెప్పారు. ఈ వైఖరిలో రాజకీయమైన, పరిపాలనాపరమైన వివేకం కన్పిస్తాయి. సున్నీలు, షియాలు, క్రైస్తవులు, కుర్దులు, ద్రూజ్‌లు మొదలైన తెగలతోపాటు ప్రాంతాల వారీగా కూడా చీలి పోయి ఉన్న దేశాన్ని ఏకం చేయటం, ఒకటిగా ముందుకు నడిపించటం తేలిక కాదు. అగ్రస్థానాన గల నాయకుడు, తన పార్టీ, ప్రభుత్వం, సైన్యం అందరూ దార్శనికతతో ఏకోన్ముఖంగా పనిచేస్తే తప్ప ఆ లక్ష్యం ముందుకు సాగదు.
అటువంటి పరిణతిని అల్–షరారా మొదటినుంచి చూపుతుండటం విశేషం. తిరుగుబాటు ఇంకా విజయ వంతం కాక ముందు నుంచే ఈ అవసరాలు ఆయనకు అర్థమైనాయనుకోవాలి. అందు వల్లనే ఇస్లామిక్ స్టేట్ సంస్థతో సంబంధాలను కొన్ని సంవత్సరాల ముందే తెంచి వేసుకున్నారు.
అధికారానికి వచ్చిన మొదటి రోజునే తన పోరాట కాలపు అజ్ఞాతనామం అబూ మొహమ్మద్ జొలానీని, అసలు పేరు అహమద్ అల్–షరారాకు మార్చుకున్నారు. పౌర హక్కులు, మహిళల హక్కుల పరిరక్షణ చేయగలమన్నారు. అస్సాద్ కాలపు ఖైదీలందరినీ వెంటనే విడుదల చేశారు. ఆర్థికాభివృద్ధి, దేశాభివృద్ధి మొదటి ప్రాధాన్యాలని ప్రకటించారు.
ఈ ప్రకటనలన్నీ మొదటి 24 గంటలలోనే వెలువడ్డాయి. అసద్‌పై వేర్వేరు ప్రాంతాలలో తిరుగుబాట్లు చేస్తుండిన వర్గాలు ముందుకు వచ్చి తమ దళాలను ప్రభుత్వ సైన్యంలో విలీనం చేయాలన్న విజ్ఞప్తికి కుర్దులు మొదలైన కొందరు సానుకూలంగా నిర్ణయించారు.
షరారాను తీవ్రవాదిగా, తన సంస్థ హయాత్ తహరీర్ అల్–షామ్‌ను ఇస్లామిస్టు తీవ్రవాద సంస్థగా ప్రకటించిన వివిధ దేశాలు ఆ ముద్రను తొలగించటం, డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయాలను తిరిగి తెరవటం, షరారాతో సమావేశానికి ప్రతి నిధులను పంపటం వంటి ప్రక్రియలు మొదలయ్యాయి. ఇక ప్రధా నంగా మిగిలింది అమెరికా. వారి ప్రతినిధులు కూడా కలిసి సాను కూలంగా స్పందించటం, ఆంక్షలు ఎత్తివేయగలమనటం చేశారు గానీ, ట్రంప్ అధికారానికి రావటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
ఇజ్రాయెల్ ముప్పు
ఇదిట్లుండగా షరారా ఈ నెల 13న చాలా ముఖ్యమైన చర్య ఒకటి తీసుకున్నారు. అది – దేశానికి కొత్త రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని నియమిస్తూ, తాత్కాలిక రాజ్యాంగం ఒకటి ప్రకటించటం! అందులోని అంశాలలో తను మొదట పేర్కొన్న అన్ని విధాలైన హక్కులు ఉన్నాయి. అయితే, సిరియన్ తిరుగుబాటు విజయవంతమైన రోజునే సిరియాకు చెందిన గోలన్ కనుమలను ఇజ్రాయెల్ ఆక్రమించింది.
అక్కడి నుంచి ఖాళీ చేయబోమని, అక్కడ ఇజ్రా యెలీల సెటిల్మెంట్లు పెంచగలమని ప్రకటించింది. సిరియా దక్షిణ ప్రాంతం యావత్తును నిస్సైనిక మండలంగా మార్చగలమని హెచ్చ రించింది. పాశ్చాత్య దేశాలతోపాటు, ఐక్యరాజ్యసమితి ఖండించినా వెనుకకు తగ్గటం లేదు. సిరియాకు ఈ ముప్పు ఎట్లా పరిణమించ వచ్చునన్నది పెద్ద ప్రశ్న అవుతున్నది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment