విశ్లేషణ
గత సంవత్సరం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 11,973 మంది పౌరులు మరణించారు; ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు. మానవ జాతి చరిత్రలోనే 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. రికార్డు స్థాయిలో చలికాలం కూడా మొదలైంది. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పగలదనీ, కాబట్టి అది ప్రాణాంతకమనీ యువల్ నోవా హరారీ లాంటి మేధావులు నొక్కి చెబుతున్నారు. మానవ జాతి అంతం కోసం సైన్స్ సృష్టించిన రాక్షసి ఏఐ కానుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాళ్లు ఇవే. యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ విపరిణామం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రపంచ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
నూతన సంవత్సరం రోజున కొన్ని పతాక శీర్షికలను చూద్దాం. అమెరికాలోని న్యూ ఓర్లి యన్స్‌లో సంబరాల్లో మునిగి తేలుతున్న వారిమీదికి ఓ ఉగ్రవాది బండిని నడిపించి 15 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ షంషుద్దీన్ జబ్బార్ ఆ గుంపుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని హతమార్చారు. ఒకప్పుడు జబ్బార్ అమెరికన్ సైన్యంలో పనిచేశాడు.
జరగనున్న ఉపద్రవ సంకేతాలను పసిగట్టడంలో ఇది అమెరికన్ నిఘా ఏజెన్సీల వైఫల్యమేనని చెప్పాలి. అతడికి నేరమయమైన గతం ఉంది. అయినా కఠినమైన భద్రతా తనిఖీ నుంచి తప్పించుకున్నాడు. ఈ నిర్లక్ష్యానికి అమాయకులైన అమెరికన్ పౌరులు మూల్యం చెల్లించారు.
ఈ విషాదం అక్కడితో ముగిసిపోలేదు. న్యూ ఓర్లియన్స్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ ముందు ఒక ట్రక్కు పేలింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఒక పాదచారి మరణానికి కారణమైన ఆ ట్రక్కు, అమెరికన్ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ సన్నిహత సహచరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఫ్యాక్టరీలో తయారైనది.
ఇక మూడో ఘటన న్యూయార్క్‌లోని క్వీన్స్ బరోలో చోటుచేసుకుంది. అక్కడ నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యాసాన్ని రాసే సమయానికి అమెరికన్ పోలీసులు వాటిని స్పష్టమైన ఉగ్రవాద చర్యలుగా పేర్కొనలేదు. కానైతే ఈ వరుస ఘటనలు అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అశాంతిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.
ఈ మూడు ఘటనలే కాకుండా, ఇతర ప్రాంతాలలో జరిగిన మరో రెండు, మన ప్రపంచంలో దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు జరగనున్నట్లు చెబుతున్నాయి. అవేమిటంటే, నూతన సంవత్సరం రాత్రి పూట, గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి 12 మందిని చంపేసింది.
రెండవ ఘటనలో, గ్యాస్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసు కున్న ఉక్రెయిన్, రష్యా నుండి మిగిలిన యూరప్‌కు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కొనే యూరప్‌పై దాని ప్రభావం మాటేమిటి?
ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి?
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్న డోనాల్డ్ ట్రంప్ కోసం ముళ్ల కిరీటం ఎదురుచూస్తోంది. ట్రంప్ అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయ రంగాలలో కూడా సవాళ్లతో పోరాడవలసి ఉంటుంది. న్యూ ఓర్లియన్స్, న్యూయార్క్, లాస్ వెగాస్ ఘటనలు మరోసారి అమెరికా అజేయం అనే భావనను దాని లోపలి నుండే ఛేదించవచ్చని స్పష్టంగా చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ వివాదాన్ని ట్రంప్ సంతృప్తికరంగా ఎలా పరిష్కరించగలరు?
నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న రష్యా–ఉక్రె యిన్ సైనిక ఘర్షణ రష్యా సైనిక శక్తిపై, దాని ఆధిపత్యంపై సందేహా లను రేకెత్తిస్తోంది. బలమైన నాయకుడైన వ్లాదిమిర్ పుతిన్ సైనిక శక్తిలో కూడా బలహీనతలు ఉన్నాయని గత మూడేళ్ల పరిణామాలు చూపిస్తున్నాయి. ఆయన పెంచుకున్న ప్రతిష్ఠకూ, సంవత్సరాలుగా ఆయన శ్రద్ధగా నిర్మించుకున్న ఖ్యాతికీ బీటలు వారుతున్నాయి.
పతనమవుతున్న ఏకఛత్రాధిపతి ఇతరులను నాశనం చేయడానికి ఉన్న ప్రతి కిటుకునూ ఉపయోగిస్తాడనే వాస్తవానికి చరిత్ర సాక్ష్యంగా ఉంది. గ్యాస్ పైప్‌లైన్ స్వాధీన ఘటన జరిగినప్పటి నుండి, పుతిన్ తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఆందోళన కలుగుతోంది.
అంటే 2025 సంవత్సరానికి ఉన్న ముఖ్యమైన ప్రాధాన్యత యుద్ధాలను ఆపడమేనా? ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ హక్కుల గణాంకా లను చూస్తే, యుద్ధాలు మానవాళిని ఎలా రక్తమోడిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం, 2024 జనవరి నుండి అక్టోబర్ 21 వరకు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 622 మంది పిల్లలతో సహా కనీసం 11,973 మంది పౌరులు మరణించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనల ప్రకారం, ఇజ్రా యెల్–హమాస్ యుద్ధంలో గత 14 నెలల్లో 17,000 మంది పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు.
ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య అయిన వాతావరణ సంక్షోభాన్ని చూద్దాం. మానవ జాతి చరిత్రలో 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. వాతా వరణ సదస్సు విఫలమైనప్పటి నుండి, వాతావరణ చర్యలపై ఏకాభిప్రాయానికి రాబోయే సంవత్సరాల్లో సవాళ్లు తీవ్రమవుతా యనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చలి కాలం ప్రారంభమవడం కూడా దీనికి సూచన. ఈ సవాలును మరింతగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ట్రంప్ గెలుపు బలహీనపరుస్తుంది. వాతా వరణ సంక్షోభంపై ఆయనకున్న తీవ్రమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే.
మన దృష్టిని ఆకర్షించిన మరో సమస్య ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్. కృత్రిమ మేధ బలాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత, జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ కొన్ని సందర్భోచి తమైన ప్రశ్నలను లేవనెత్తారు. కృత్రిమ మేధ అబద్ధం చెప్పగలదని ఆయన నొక్కి చెప్పారు. చాట్‌జీపీటీ4ని ఓపెన్ ఏఐ ప్రారంభించి నప్పుడు, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘కాప్చా’ను పరిష్కరించమని వారు కోరినట్లు హరారీ సోదాహరణ పూర్వకంగా తెలిపారు.
అయితే చాట్‌జీపీటీ4, ఆ కాప్చాను పరిష్కరించలేక పోయింది. తర్వాత దాన్ని టాస్క్‌రాబిట్ అనే వెబ్ పేజీకి యాక్సెస్ ఇచ్చారు. కాప్చాను ఛేదించే పనిని చాట్‌జీపీటీ4 ఔట్‌సోర్స్ చేసి, సర్వీస్ ప్రొవైడర్‌కు తనకు సరిగ్గా కళ్లు కనబడవనీ(మనిషి లాగే), తనకోసం చేసిపెట్టమనీ అడిగింది. దాంతో అల్గోరిథమ్‌ను రూపొందించిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పడం ఎలా నేర్చుకుందో వారు అర్థం చేసుకోలేకపోయారు.
హరారీ, ఇతర ప్రజా మేధావులు కృత్రిమ మేధ పాత్రను ప్రశ్నించడానికి ఇదే కారణం. ఇది మానవులు రూపొందించిన స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల మొదటి సాధనం. కాబట్టి కృత్రిమ మేధ ప్రాణాంతకం అని వారు నొక్కిచెబుతున్నారు.
దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తారనడంలో సందేహమే లేదు. 2024 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 21న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరాన్ని క్లోన్ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. దానిద్వారా న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని ఓటర్లకు వేలకొద్దీ ఆటోమేటెడ్ కాల్స్ చేశారు. ఈ ఆపరేషన్‌ను చేపట్టిన లింగో టెలికాం కంపెనీకి తర్వాత 1 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా పడింది. భారతదేశంలో కూడా, నటి రష్మిక మందాన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఉదంతాన్ని చూశాం. ప్రశ్న ఏమిటంటే, మానవ జాతి అంతం కోసం సైన్స్ ఒక రాక్షసిని సృష్టించిందా?
మానవాళికి ముప్పు కలిగించే యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ అనే మూడు సవాళ్లపై 2025 సంవత్సరం ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలదా?
శశి శేఖర్
వ్యాసకర్త ‘హిందుస్థాన్’ ప్రధాన సంపాదకుడు
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment