విశ్లేషణ
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమనీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 5న చేసిన ఆకస్మిక ప్రతిపాదన ఆసక్తిని కలిగించింది. చర్చలకు ఆయన సుముఖతను చూపటం ఇది మొదటిసారి కాదు. యుద్ధం రెండున్నరేళ్ల క్రితం మొదలు కాగా చర్చల ప్రస్తావనలు గతేడాదిగా వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్ దేశాల అధినేతలు, వివిధ అంత ర్జాతీయ సంస్థల బాధ్యులు ఈ మాట అంటూనే ఉన్నారు. కానీ కొన్ని కీలకమైన షరతులను పుతిన్ మొదటి నుంచీ పెడుతున్నారు. వీటిని జెలెన్‌స్కీ అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చర్చలంటూ జరిగినా, అవి ఎలా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు.
జెలెన్‌స్కీ గత జూన్‌లో స్విట్జర్లాండ్‌లో తొంభైకి పైగా దేశాలతో శాంతి సదస్సు నిర్వ హించారు. కానీ ఆ సదస్సుకు ఆయన రష్యాను ఆహ్వానించలేదు. ఆ కారణంగా చైనా వెళ్లలేదు. అంతలోనే ఆయన, త్వరలో మరొక సదస్సు జరపగలమనీ, దానికి రష్యాను ఆహ్వానించగలమనీ ప్రకటించారు. ఆ సదస్సుకు హాజరయ్యేటట్లు రష్యాను ఒప్పించవలసిందిగా కోరేందుకు తన విదేశాంగ మంత్రి దిమిత్రి కునేబాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వద్దకు రాయబారం పంపారు. ఉక్రెయిన్ ప్రతి పాదనలు ఏమిటో చూసి అపుడు స్పందించగలమన్నది రష్యా జవాబు.
ఇవన్నీ జూన్, జూలై పరిణామాలు. అటువంటిది ఇపుడు పుతిన్ ఆకస్మికంగా చర్చల ప్రతిపాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆకస్మికం, ఆశ్చర్యకరంగా తోచటానికి మరికొన్ని కారణాలు న్నాయి. జూన్, జూలై పరిణామాల తర్వాత, కొంత వెనుకముందులుగా చర్చలు ప్రారంభం కావచ్చునని పలువురు భావిస్తుండగా, ఆ తర్వాత కొద్ది వారాలకే ఉక్రెయిన్ సైన్యం తమకూ, రష్యాకూ మధ్యగల ఉత్తర సరిహద్దు నుంచి రష్యాకు చెందిన కర్‌స్క్ ప్రాంతంపై వేలాది సైన్యంతో మెరుపుదాడి చేసి తగినంత భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇది మరొక ఆశ్చర్యకర పరిణామం.
ఎందుకంటే, యుద్ధం జరుగుతున్నది తూర్పు ప్రాంతాలలో. అక్కడ రష్యాది పూర్తి పై చేయిగా ఉండి రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తున్నారు. ప్రస్తుతం పోక్రొవ్‌స్క్ అనే అతి కీలకమైన కూడలి పట్టణం వద్ద యుద్ధం కేంద్రీకృతమై ఉంది. ఆ పట్టణాన్ని కోల్పోతే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమంతా ప్రమాదంలో పడుతుంది. స్వయంగా ఉక్రె యిన్ సైన్యం చెప్తున్న దానిని బట్టి ఆ కేంద్రం కొద్ది రోజులలోనే రష్యా చేజిక్కవచ్చు. అటువంటి విపత్కర స్థితిలో పోక్రొవ్‌స్క్‌కు అదనపు బలాలను పంపి రక్షించుకునేందుకు బదులు కర్‌స్క్‌పై దాడి ఎందుకు అన్న సందేహాలు తలెత్తాయి.
ఆ చర్చను కొద్దిసేపు వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, చర్చల మాట రెండు వైపుల నుంచీ కొత్త కాదు. కానీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనటం కొత్తమాట. ఇక్కడ ఒక స్పష్టీకరణ అవసరం. వ్లాడివాస్టోక్‌లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఈ మాట వచ్చింది. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ మాట అన్నట్లు వార్తలలో కనిపించింది గానీ, అది నిజం కాదని ఆ వీడియోను చూసినపుడు అర్థమవుతుంది. పుతిన్ ఒక లిఖిత ప్రకటనను చదవటం అందులో కనిపిస్తుంది. అనగా, ముందే ఆలోచించి చెప్పిన మాట అది.
వార్తలలో వెలువడిన దానిని బట్టి రష్యా అధ్యక్షుడు అన్నది, చర్చలకు తాము సిద్ధం. అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్య వర్తిత్వం వహించాలి. వారీ పని చేయగలరు. యుద్ధంతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను వారు పరిష్కరించగలరనే విశ్వాసం ఉంది. ఈ అంశంపై తాను వారితో నిరంతరం సంప్రదిస్తున్నాను. జెలెన్‌స్కీ, బైడెన్ ఇరువురితో మోదీ మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్ర వహించేందుకు మోదీకి ఇది మంచి అవకాశం అన్నది పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్య. యథా తథంగా ఈ మాటలు ముఖ్యమైనవే.
పుతిన్ మరికొన్ని ముఖ్యమైన మాటలన్నారు. వీడియోలో వినిపించిన ఆ మాటలు ఎందువల్లనో వార్తలలో కనిపించలేదు. అవి, ఉక్రెయిన్‌తో చర్చలకు షరతుల వంటివి. అవి ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పాలనలో గల డొనెటెస్క్, లుహాన్‌స్క్, ఖేర్సాన్, జపోరిజిజియా అనే నాలుగు తూర్పు ప్రాంతాలను రష్యాకు వదలి వేస్తున్నట్లు ప్రకటించాలి. (ఇప్పటికే రష్యా అధీనంలో గల క్రిమియా గురించి ఆయన ప్రస్తావించలేదు గానీ, ఆ విషయమై రాజీకి, చర్చలకు అవకాశం లేదని గతంలోనే అన్నారు.) ‘నాటో’లో చేరబోమని కూడా ఉక్రెయిన్ ప్రకటించాలి. ఆ నాలుగు ప్రాంతాల నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించాలి. ఇవి జరిగితే ‘అదే నిమిషంలో’ యుద్ధాన్ని విరమించి చర్చలను ప్రకటిస్తాము.
అనగా ఇవి చర్చలకు షరతులన్నమాట. ఈ షరతులను పుతిన్ మొదటినుంచీ పెడుతున్నారు. ఆ విషయంలో రాజీ లేదంటున్నారు. వీటిని జెలెన్‌స్కీ తమ వైపు నుంచి అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. పైగా, రష్యా 2014లో ఆక్రమించిన క్రిమియాను తిరిగి ఇవ్వవలసిందేనంటున్నారు. ఇదే మాట ఇటీవల కూడా పునశ్చరించారు. పైన పేర్కొన్న నాలుగు ప్రాంతాలలో గణనీయమైన భాగాన్ని ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్రమించుకోగా, అక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు. నాటో సభ్యత్వం తమ హక్కని వాదిస్తున్నారు.
అనగా, ఇవన్నీ చర్చలకు పుతిన్, జెలెన్‌స్కీల షరతులన్నమాట. తమ సార్వ భౌమత్వం, భౌగోళిక సమగ్రతల పరిరక్షణకు అవసరమని జెలెన్‌స్కీ చెబుతున్నారు. నాటో కూటమి విస్తరణ నుంచి ఆత్మరక్షణకూ, ఆ నాలుగు ప్రాంతాలలో మెజారిటీలో గల రష్యన్ భాషీయులపై చిరకాలంగా సాగుతున్న ఉక్రెయిన్ వేధింపులు, తరచూ ప్రాణ హననం నుంచి వారిని రక్షించుకునేందుకు ఇది తప్పనిసరి అని రష్యా వాదిస్తున్నది.
ఈ షరతులలోని సహేతుకతలలోకి వెళితే రెండు వైపులా న్యాయం కనిపిస్తుంది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు రక్షణ ఉండవలసిందే. అదే విధంగా, అమెరికన్ నాటో కూటమి క్రమంగా రష్యా సరిహద్దుల వైపు విస్తరిస్తూ, ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చు కొనజూస్తూ, రష్యా అస్తిత్వానికే ముప్పు తలపెడుతున్నపుడు, వారు ఆత్మరక్షణ కోసం ప్రయత్నించరాదని అనలేము. అట్లాగే, పై నాలుగు ప్రాంతాలలోని రష్యన్ భాషీయులపై మొదటినుంచీ తీవ్రమైన వేధింపు మాట నిజమైనందున, వారికి రక్షణ అవసరం.
ఈ విధమైన పరిస్థితులు, షరతుల మధ్య ఇండియా, చైనా, బ్రెజిల్‌లు రాజీ మార్గం కనుగొనటం ఎంత మాత్రం తేలిక కాదు. ఉభయ పక్షాలు ఈ షరతులు విధించటం, వాటిని వారు పరస్పరం తిరస్కరించటం ఇప్పటికే పలుమార్లు జరిగాయి. నాటో ద్వారా ప్రపంచాధిపత్యం అనే లక్ష్యం గల అమెరికా, ఆ కూటమిలో చేరరాదని ఒకవేళ ఉక్రెయిన్ నిర్ణయించుకున్నా అందుకు సమ్మతించే అవకాశం కనిపించదు. ఆ విధంగా మధ్యవర్తుల బాధ్యత మరింత క్లిష్టతర మవుతుంది.
అదట్లుంచి భారత్, చైనా, బ్రెజిల్ ప్రముఖ దేశాలు కావటమే గాక రష్యాతో పాటు బ్రిక్స్ కూటమిలో భాగస్వాములు. తన ఆధిపత్యానికి నష్టమని భావించే అమెరికా ఆ కూటమిని భంగ పరిచేందుకు మొదటినుంచి ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితులన్నింటి మధ్య, ఒకవేళ అసలు ఈ ముగ్గురి మధ్యవర్తిత్వమంటూ సాకారమైనా, అది ఏ విధంగా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు. ఇంతకూ ఈ ప్రతిపాదనకు జెలెన్‌స్కీ స్పందన ఏమిటో తెలియదు... ఆయన ఇండియా, చైనాల పాత్రను ఇప్పటికే కోరి ఉన్నప్పటికీ.
తిరిగి యుద్ధం విషయానికి వస్తే, కర్‌స్క్‌పై ఉక్రెయిన్ దాడిలోని ఉద్దేశం రష్యన్ సైన్యాన్ని పోక్రొవ్‌స్క్ నుంచి అటు మళ్లించేట్లు చేయటమని సైనిక నిపుణులు ఊహాగానాలు చేశారు. కానీ రష్యన్ వ్యూహకర్తలు ఆ పని చేయక పోక్రొవ్‌స్క్‌ను, ఇతర తూర్పు ప్రాంతా లను ఆక్రమించే పని సాగిస్తున్నారు. ఆ విధంగా కర్‌స్క్ వ్యూహం విఫలమైందని ఇపుడు ఉక్రెయిన్ సైన్యాధికారులే అంగీకరిస్తున్నారు.
ఉక్రెయిన్ కొత్త సైన్యాధిపతి జనరల్ అలెగ్జాండర్ సిరిస్కియీ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, కర్‌స్క్ వైపు నుంచి కూడా తమపై దాడికి రష్యా ఆలోచించటంతో దానిని నిరోధించేందుకు తామే ముందు దాడి చేశామన్నారు గానీ అది నిజమని తోచదు. అటువైపు రష్యన్ యుద్ధ సన్నాహాలు అసలు లేనే లేవు. పుతిన్ ప్రతిపాదనకు రాగల రోజులలో జెలెన్‌స్కీ స్పందనలు వచ్చినపుడు గానీ ఈ విషయమై కొంత స్పష్టత రాదు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment