
వాషింగ్టన్:రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి సంబంధించి తాము జరిపే చర్చల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్‌ను భాగస్వామిని చేస్తామని చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి16) ఫ్లోరిడాలో జరిగిన డేటోనా 500 కార్ రేసులకు విచ్చేసిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
అయితే ఈ వారం సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు జెలెన్‌స్కీ లేదా ఆయన ప్రతినిధులు హాజరవుతారా అన్నదానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. గత వారం రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఫోన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సుదీర్ఘచర్చలు జరిపారు.
దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో స్పందించారు.రష్యాతో జరిపే చర్చల్లో అమెరికా తమను కూడా భాగస్వామిని చేస్తే బాగుండేదన్నారు. అమెరికా మద్దతు లేకుండా తాము రష్యాను ఎదుర్కోలేమని, తాము ఎక్కువ కాలం జీవించలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ కేవలం యుద్ధానికి విరామం ఇచ్చి ఇంకా శక్తి కూడగట్టుకుంటున్నారని చెప్పారు. యూరప్‌కు ఎప్పటికైనా రష్యాతో ముప్పు పొంచి ఉందని జెలెన్‌స్కీ హెచ్చరించారు. కాగా, గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ హయాంలో రష్యాతో యుద్ధం చేయడానికిగాను ఉక్రెయిన్‌కు భారీ సాయం అందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment