వ్యవసాయ సుంకాల కాపట్యం | Sakshi Guest Column On Agricultural tariff of USA | Sakshi
Sakshi News home page

వ్యవసాయ సుంకాల కాపట్యం

Published Wed, Apr 9 2025 12:19 AM | Last Updated on Wed, Apr 9 2025 12:19 AM

Sakshi Guest Column On Agricultural tariff of USA

విశ్లేషణ

అధిక సబ్సిడీలతో కూడిన అమెరికన్‌ వ్యవసాయ ఉత్పత్తులకు భారతదేశం తన మార్కెట్‌ను తెరవాలని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ చాలా ప్రత్యేకంగా కోరిన ట్లుగా నేను ఇటీవల చదివాను. అది చదివిన ప్పుడు, ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త నికోలస్‌ స్టెర్న్, తన భారతదేశ పర్యటనల సమయంలో క్లుప్తంగా చెప్పింది గుర్తొచ్చింది. ‘అమెరికా రైతులకు అలాంటి సబ్సిడీలను అందించడం తప్పేనని నేను అంగీకరిస్తున్నాను. కానీ అమెరికా ఉత్పత్తులకు భారతదేశం తన తలుపులు తెరవకపోతే అది విపత్తుకు దారితీస్తుంది.’

జార్జ్‌ బుష్‌ జూనియర్‌ హయాంలో 2001 నుండి 2005 వరకు పదవిలో ఉన్న యాన్‌ వెనెమన్‌ మొదలుకుని, అమెరికా వ్యవసాయ మంత్రులందరూ ఇదే విధమైన కపటత్వాన్ని పదే పదే ప్రదర్శించారు. కొంతకాలం తర్వాత వాషింగ్టన్‌ డీసీలోని  ‘ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (ఐఎఫ్‌పీఆర్‌ఐ)లో మాట్లాడుతూ, భారత వ్యవసాయాన్ని బలవంతంగా తెరవాలన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త వాదనను ఆమె ఎంత నిస్సిగ్గుగా సమర్థించిందో నాకు గుర్తుంది.

అమెరికాలోని కనీసం 14 వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గ్రూపులు,  భారతదేశ ఉత్పత్తి నిర్దిష్ట కనీస మద్దతు ధరపై పరిమితిని కోరుతూ అమెరికన్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌కు లేఖలు రాశాయి. అప్పుడే ఇండియాకు అమెరికా ఎగుమతులు చేయడానికి వీలుంటుంది మరి.

చైనా నిలబడిన తీరు
అందువల్ల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రారంభించిన అవాంఛ నీయ వాణిజ్య యుద్ధం పట్ల నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు.  అభివృద్ధి చెందుతున్న దేశాలను లొంగదీసుకోవడానికి ట్రంప్‌ చుట్టూ ఉన్న బిలియనీర్లు ఆయనకు తప్పుడు సలహా ఇస్తున్నారు.

అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అమెరికా పట్ల ధిక్కార వైఖరితో నిలబడటం ప్రారంభించాయి. కాబట్టి భారతదేశాన్ని కాస్త వంగమని మాత్రమే అడిగినప్పుడు, అది సాష్టాంగపడటానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను.

ఇక్కడ మరొక కథ చెబుతాను. కొన్నేళ్ల క్రితం, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, ‘చెడ్డ’ మానవ హక్కుల రికార్డు కారణంగా చైనాతో అమెరికా వ్యాపారం చేయదని వ్యాఖ్యానించారు. మరుసటి రోజు, నేను ‘బీబీసీ’ టీవీ ఛానెల్‌ని చూస్తున్నాను. ఒక జర్నలిస్ట్‌ అప్పటి చైనా అధ్యక్షుడిని అడుగుతున్నారు: ‘చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు చేసిన బెదిరింపునకు మీరు ఎలా స్పందిస్తారు?’ ఆయన సమాధానం కూడా అంతే చిన్నది: ‘యూఎస్‌తో వ్యాపారం చేయడమా? మేము నాలుగు వేల ఏళ్లకు పైగా అమెరికాతో వ్యాపారం చేయలేదు. కాబట్టి అది అంత ముఖ్యమైనదా?’

ఈ ప్రకటన తర్వాత, చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేయాలని తమ సొంత అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తిరగబడ్డాయి. బిల్‌ క్లింటన్‌ చివరికి దేశీయ పరిశ్రమ ముందు తల వంచి, మళ్ళీ ఎప్పుడూ ఆ సమస్యను లేవనెత్తలేదు.

సుంకాల వాణిజ్య సూత్రాలు
కొత్త సుంకాల యుద్ధానికి తిరిగి వస్తే, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవేశాన్ని పరిమితం చేసే విషయంలో ట్రంప్‌ భారత దేశాన్ని ‘సుంకాల రాజు’ అని విమర్శించవచ్చు. ఎందుకంటే, అమె రికా 5 శాతం సుంకాలను విధిస్తుంటే, భారత్‌ సగటున 39 శాతం సుంకాలను విధిస్తోంది. అయితే, భారత్‌ విధించే సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. 

దేశ అభివృద్ధి స్థాయి, వాణిజ్య పుస్తకాలలో పేర్కొన్న ‘ప్రత్యేక, భేదాత్మక వ్యవ హారం’ ఆధారంగా వీటిని విధించారు. భారత్‌ ఏ దశలోనూ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలియజేయాలి. భారత్‌ సాపేక్షంగా విధిస్తున్న అధిక సుంకాలు, అప్పటికే రూపొందించి ఉన్న వాణిజ్య సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. పైగా ఒక వ్యక్తి ఇష్టానిష్టాల ద్వారా వాటిని నియంత్రించడం ఉండదు.

మరోవైపు, వ్యవసాయానికి అమెరికా అందించే భారీ సబ్సిడీలే వాస్తవానికి సమస్య. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము మరిన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అమెరికా వ్యవసాయ సబ్సిడీలను కాదు’ అని అప్పటి యూరోపియన్‌ ట్రేడ్‌ కమిషనర్‌ పీటర్‌ మాండెల్సన్‌ పేర్కొన్న విషయాన్ని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ (2006 జూలై 21) స్పష్టంగా రాసింది. ‘అమెరికా రైతులతో పోటీ పడటానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మేము అమెరికా ఖజానాను ఎదుర్కోలేము’ అని అప్పటి భారత వాణిజ్య మంత్రి కమల్‌నాథ్‌ చెప్పింది ఆయన ఉటంకించారు.

రైతులకు ఎంత ఇస్తున్నారు?
గత కొన్ని సంవత్సరాలుగా, అమెరికా తన అధిక సబ్సిడీ వ్యవసాయం చుట్టూ నిర్మించిన రక్షణ కోటను మరింత బలోపేతం చేసుకుంది. అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన ఆర్థిక పరిశోధన సేవ నివేదిక ప్రకారం, రైతులు, పశువుల పెంపకందారులకు ప్రత్యక్ష ప్రభుత్వ వ్యవసాయ కార్యక్రమం కింద చెల్లింపులు 2025 నాటికి 42.4 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని అంచనా. నిజానికి 2024 నాటికి 9.3 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేశారు.

అంటే ఒక్కో రైతుకు అమెరికా ప్రభుత్వం సాలీనా రూ. 26.8 లక్షలను చెల్లిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలలో వివాదాస్పద అంశంగా మిగిలిపోయిన పత్తిని ఉదాహరణగా తీసుకుందాం. 2021 నాటికి 624.7 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్న కేవలం 8,103 మంది రైతులకు అమెరికా భారీ సబ్సిడీలను అందిస్తోంది (ఇండియాలో 98.01 లక్షల మంది రైతులు పత్తి సాగులో నిమగ్నమై ఉన్నారు). న్యూఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ డబ్ల్యూటీఓ స్టడీస్‌’ లెక్కల ప్రకారం, 2021లో అమెరికా పత్తి రైతుకు లభించిన వార్షిక మద్దతు 1,17,494 డాలర్లు కాగా, భారత్‌ విషయంలో అది కేవలం 27 డాలర్లు.

2006లో యూరోపియన్‌ యూనియన్‌ పత్తికి 139 శాతం సబ్సిడీ మద్దతును అందించింది. 2001లో అభివృద్ధి చెందిన దేశాల పరిమితి కంటే అమెరికా పత్తికి 74 శాతం అధిక మద్దతును అందించింది. వ్యవసాయ దిగుమతులకు తక్కువ సుంకాలు అని అమెరికా అనడం అంటే, తమ వ్యవసాయం బహిరంగ మార్కెట్‌ అని చూపించడం కోసమే! 

కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే, దిగుమతులను నియంత్రించడానికి అమెరికా 9,000 కంటే ఎక్కువ పన్నేతర అడ్డంకులు (ఎన్టీబీలు) విధించింది. దీంతో పోలిస్తే ఇండియా విధించిన ఎన్టీబీలు కేవలం 600. సుంకాలతోనే సుంకాలను అమెరికా సమం చేస్తుందని ట్రంప్‌ చెబుతున్నారు. భారత్‌ కూడా తన సొంత వ్యవసా యాన్ని కాపాడుకోవడానికి సరిపోలే పన్నేతర అడ్డంకులని ఉపయో గించడానికి తగినంత అవకాశం ఉంది. 

భారతపై ట్రంప్‌ వేసిన తాజా అదనపు 27 శాతం ప్రతిచర్య సుంకాలతో మన రొయ్యలు, బాస్మతేతర బియ్యం, గోదుమల ఎగుమతికి దెబ్బే. అమెరికాతో భారత వాణిజ్యంలో అవే దాదాపు 46 శాతం ఉంటాయి. ఏమైనా, భారత్‌ తన ఇంటిని క్రమబద్ధీకరించు కోవాలని అమెరికా కోరుకునే బదులు, అమెరికాయే వ్యవసాయరంగం ద్వారాలు తెరవాలని భారత్‌ అడగాల్సిన అవసరం ఉంది. అమెరికా వ్యవసాయం చుట్టూ ఉన్న అధిక సబ్సిడీ కోటను ముందుగా కూల్చి వేయాలని అడిగితేనే ఇది సాధ్యమవుతుంది.

దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త వ్యవసాయ, ఆహార నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement