
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల విధింపు నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలపై ట్రంప్ స్పందించారు. సుంకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.
ఈ తరుణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో.. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించే సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని నేను అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అది ఎంత కష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ నిర్ణయం వల్ల బాధపడినా సరే. వెనక్కి తగ్గకూడదని అన్నారు.
👉ఇదీ చదవండి : ట్రంప్‌కు హ్యాండ్సాఫ్ సెగ
సోమవారం పునఃప్రారంభం అనంతరం స్టాక్ మార్కెట్లు భారీ క్రాష్ అవుతాయన్న అంచనాల నడుమ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుంకాల విధింపుపై నెలకొన్న ఆందోళనల్ని తొలగించేందుకు తన అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తోందని చెప్పారు. సుంకాల విధింపు తర్వాత అమెరికాతో వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి 50కి పైగా దేశాలు తమని సంప్రదించాయని వెల్లడించారు.
‘టారిఫ్ విధింపుపై యూరోప్, ఆసియా ఇతర దేశాది నేతలతో మాట్లాడాను. యాభైకి పైగా దేశాలు వ్యాపార, వాణిజ్యం విషయంలో అమెరికా ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. మీ దేశం మా దేశంతో చేసే వాణిజ్యంలో ఎలాంటి లోటు ఉండకూడదు. లోటు ఉంటే మాకు నష్టమే. మేం లాభాల్ని ఆశించడం లేదు. అటు నష్టం, ఇటు లాభం కాకుండా సమతూల్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు వారితో చెప్పామని, అందుకు వారు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. టారిఫ్ విధింపు తర్వాత మాతో వ్యాపారం, వాణిజ్యం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని తెలిపారు.