వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే... | Sakshi Guest Column On Why To Give Bharat Ratna to Jyotirao Phule, Savitribai Phule | Sakshi
Sakshi News home page

వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే...

Published Wed, Apr 9 2025 12:27 AM | Last Updated on Wed, Apr 9 2025 12:27 AM

Sakshi Guest Column On Why To Give Bharat Ratna to Jyotirao Phule, Savitribai Phule

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి

సందర్భం

మహారాష్ట్ర అసెంబ్లీ మార్చి 22న ఫూలే దంపతులు: మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు ‘భారతరత్న’ ఇవ్వాలని అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ గౌరవా నికి ఫూలే దంపతులు తప్ప భారతదేశ చరిత్రలో మరో జంట దొరకదు. అసలు ప్రపంచంలోనే రెండు శరీరాలు ఒకే మనస్సుతో జీవితాంతమూ మానవ మార్పునకు కృషి చేసిన జంట మరోటి లేదు. అది ఒక్క ఫూలే జంట మాత్రమే. కేంద్రం వారికి భారతరత్న ఇచ్చి వారిపట్ల తమ గౌరవాన్ని చాటుకోవాలి.

మహాత్మా ఫూలే 1827 ఏప్రిల్‌ 11న పుడితే, 1831 జనవరి 3న సావిత్రి పుట్టింది. వారు జీవించి ఉన్న కాలానికి కాస్త ఇటు అటు ఈ దేశంలో సంఘ సంస్క ర్తలు ఎదిగారు. వారిలో కొంతమంది స్త్రీల జీవితాలను మార్చాలని ప్రయత్నించారు. ఉదాహరణకు మహారాష్ట్ర లోనే గోవింద రణడే, బెంగాల్‌లో ఈశ్వర చంద్ర విద్యా సాగర్, ఆంధ్రలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారిని తీసుకుందాం. వీరంతా బ్రాహ్మణ కులంలో పుట్టారు. బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడపిల్లలకు విద్య నేర్పించాలని, వితంతు వివాహాలు చేయించాలని మాట్లాడారు, రాశారు. కానీ వారి భార్యల స్థితి తమ కుటుంబాల్లోనే ఎలా ఉండేదో మనకు తెలియదు.

వారి గొప్పతనం గురించి ఎన్నో రచనలు వచ్చాయి. స్కూలు పాఠాల్లో సంఘ సంస్కర్తగా వారి గురించే పాఠాలు చెప్పేవారు. వారు అంటరానితనం గురించి, శూద్ర దళిత స్త్రీల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. కానీ ఫూలేల గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో చెప్పేవారు కాదు. వారి గురించి తెలిసిన అగ్ర కుల ఉపాధ్యాయులు వారి గురించి చెడుగా చెప్పే వారు. బెంగాల్‌లో కొద్దిపాటిగా ఉన్న భద్రలోక్‌ స్త్రీల  సంస్కరణ కోసం కృషి చేసిన ఈశ్వరచంద్ర గురించి నేను స్కూల్లో ఉండగానే చదివాను. 

కందుకూరి గురించి సరేసరి. కానీ ఫూలే గురించి నాకు తెలిసింది 1986–87 ప్రాంతంలో! ఆయన గురించి కాస్తా వివరంగా చదవడానికి ఒక్క పుస్తకం కూడా లేదు. వెతగ్గా, వెతగ్గా కోఠి ఫుట్‌పాత్‌ పాత పుస్తకాల్లో ధనుంజయకర్‌ ఆయన మీద రాసిన బయోగ్రఫీ దొరికింది. అది చదివాక నా తల తిరిగి పోయింది. అందులో సావిత్రి బాయి గురించి కొద్దిగానే ఉంది. ఇంత గొప్ప సాంఘిక సంస్కరణకు పాటుపడిన జంటను ఈ దేశ మేధావులు ఎందుకు పక్కకు పెట్టారు? కులం వల్ల!

ఇప్పుడు ఒక ఆరెస్సెస్‌/బీజేపీ ప్రభుత్వం, అదీ ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ జంటకు భారతరత్న ఇవ్వాలని రిజల్యూషన్‌ ఎందుకు పాస్‌ చేసింది? ఈ జంట అనుయాయుడైన అంబేడ్కర్‌ వాళ్ళు ప్రారంభించిన శూద్ర–దళిత విద్యా పోరాటం నుండి ఎదిగి ఒక రాజ్యాంగం రాశారు. దానివల్ల శూద్రులకు, దళితులకు ఓటుహక్కు వచ్చింది కనుక! వారి సంఖ్యా బలం, వారి ఆత్మగౌరవ చైతన్యం ఆరె స్సెస్‌ ప్రభుత్వాన్ని ఈ స్థితికి నెట్టింది. శూద్రుడైన శివాజీని దేశం ముందు పెట్టింది ఫూలేనే!

ఆరెస్సెస్‌ మాత్రమే కాదు, అగ్రకుల కమ్యూనిస్టు, ముఖ్యంగా బెంగాలీ కమ్యూనిస్టులు, దేశంలోని ఉదార వాదులు ఊహించని పరిణామం ఇది. బెంగాల్‌ మేధా వులు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్‌ రాయ్, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లను దేశం మొత్తం విద్యా రంగంలోకి చొప్పించారు. కానీ మహాత్మా ఫూలేను, సావిత్రిబాయిని, అంబేడ్కర్‌ను తమ రాష్ట్ర పరిధిలోకి రానివ్వలేదు. 

మండల్‌ కమిషన్‌ పోరాట చరిత్రను కూడా వాళ్ళు గుర్తించలేదు. ఈ సంవత్సరం ఫూలే దంపతులకు భారతరత్న వస్తే శూద్ర–దళిత ఆదివాసీ స్త్రీల చరిత్ర మార్చే చర్చ ఏ రాష్ట్రమూ పక్కకు పెట్టలేనంత ఎదుగుతుంది. ఫూలే జంట కేవలం భారత దేశానికే కాదు మొత్తం భూ ప్రపంచానికే ఏం పాఠం నేర్పారో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ భూమి మీద పెద్ద పెద్ద మతాలను స్థాపించిన బుద్ధుడు, జీసస్, మహమ్మద్‌ వంటి వారు నడిచారు. అందులో బుద్ధుడు, మహమ్మద్‌ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జీసెస్‌ శిలువేసి చంపబడ్డారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో జ్యోతి రావు ఫూలే, సావిత్రిబాయిని పెళ్ళి చేసుకొని పెళ్ళి అర్థాన్నే మార్చారు. అందుకు దీటుగా ఆమె భార్య అనే అర్థాన్నే మార్చారు.

వాళ్ళు 19వ శతాబ్దంలో ఎటువంటి భార్యా భర్తలుగా ఈ భూమి మీద నడిచారో కొన్ని ఉదా హరణలతో చూద్దాం. సావిత్రీబాయికి 9వ ఏట, ఫూలేకు 13వ ఏట పెండ్లి అయింది. అది బాల్య వివాహమే. అయితే ఫూలే ఏం చేశారు? ఆమెతో పడక గదిలో భర్తగా జీవించలేదు. ఆమెకు టీచరై అక్కడ చదువు చెప్పారు. అంత గొప్ప పనిచేస్తే పూనా పండితులు తిలక్‌ నేతృత్వంలో ఆయన తండ్రిని బెదిరించి, బట్టలు బయట పడవేయించి ఇంటి నుండి తరిమేయించారు. ఆ యువ దంప తులు దళిత వాడల్లో మకాం పెట్టి అక్కడే ఒక దళిత మిత్రుడి ఇంట్లో ఆడవాళ్ళకు స్కూలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే తన  దగ్గర పాఠాలు నేర్చుకున్న సావిత్రిని ఒక టీచర్ని చేశారు ఫూలే.

అంతేగాక కుటుంబాల నుండి బయటికి నెట్టబడ్డ వితంతువుల కోసం ఒక నివాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు – యశ్వంతరావుని పెంచుకున్నారు. అంతకు ముందు వాళ్ళి ద్దరూ 30 ఏండ్ల వయస్సులో ఉండగా సావిత్రి తండ్రి,ఖండోజీ పాటిల్‌ వచ్చి ఫూలేతో... ‘నేను సావిత్రిని ఒప్పించాను, మీకు పిల్లలు కావాలి కనుక మరో పెళ్ళి చేసుకో’ అని కోరాడు. దానికి ఫూలే... ‘లోపం సావి త్రిలో లేదు, నాలో ఉంది. ఆమెకు మరో పెండ్లి చేద్దాం. ముగ్గురం కలిసి పిల్లల్ని పెంచుతాం’ అని బదులు చెప్పారు. ఇటువంటి భర్త ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా!

ఫూలే 1890లో పక్షవాతంతో చనిపోయారు. ఆయన బంధువులు సాదుకున్న కొడుకు తలగోరు (తలకొరివి) పెట్టడానికి వీలులేదు అని గొడవ చేశారు. ఫూలే బంధువులలో ఒక పురుషుడు తలగోరు పెడ తానని వాదించాడు. సావిత్రి వారిని ధిక్కరించి ‘నేనే నా భర్తకు తలగోరు పెడతాన’ని చెప్పి ఆ కార్యం నిర్వర్తించారు. ఈ పని చేసిన మొదటి భారత స్త్రీ ఆమె. 1898లో బుబానిక్‌ ప్లేగు వ్యాపించిన సమయంలో సావిత్రీబాయి, డా‘‘ యశ్వంతరావు ప్రజలకు వైద్యం చేస్తూ అదే రోగానికి బలై చనిపోయారు.

ఈ జంటను మహారాష్ట్ర అగ్రకుల మేధావులు చాలా కాలం వెలుగులోకి రానివ్వలేదు. ఇప్పుడు ఆరె స్సెస్‌ ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రతిపాదించింది. ఇది కాంగ్రెస్‌కు మరో సవాలు కానుంది. శూద్ర బీసీలను ఆకట్టుకోవడంలో ఇది ఆరెస్సెస్‌కు పెద్ద ఆయుధమౌతుంది. అంబేడ్కర్‌కు భారతరత్న వీపీ సింగ్‌ ప్రభుత్వం ఇచ్చినా ఆరెస్సెస్‌–బీజేపీలు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇప్పుడు ఫూలేలకు భారతరత్నను తమ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిందని పెద్ద ప్రచారం ప్రారంభిస్తాయి. ఈ స్థితిలో తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఫూలే లను దీటుగా ఓన్‌ చేసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చాలా పెద్ద సమస్య అవుతుంది.

కనీసం ఈ రెండు ప్రభుత్వాల వాళ్ళు అటువంటి తీర్మానాలే అసెంబ్లీలలో పాస్‌ చేసి కేంద్రానికి పంపడం, ఫూలేలకు శూద్ర బీసీ జీవితాలను ప్రతిబింబించే మ్యూజియవ్‌ులను కట్టించడం చెయ్యాలి. 

ఈ రాష్ట్రాల్లో అగ్రకులాలు తమ చదువులకు పునాదులు వేసిన జంటగా ఫూలేలను చూడటం లేదు. వారి నుండి ఒక్క మేధావి కూడా వారి గురించి రాయడం, మాట్లాడటం చెయ్యడం మనకు కనిపించదు. వారిని గుర్తించి గౌరవించడం అన్ని కులాల ఆత్మగౌరవానికీ నిదర్శనం.

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు
(ఏప్రిల్‌ 11న మహాత్మా ఫూలే జయంతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement