
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్‌అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్–2025 (యూడబ్ల్యూఎమ్‌ఈఈడీఏ)గా మార్చారు.
వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్‌సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.
అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది.
కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి.
ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది.
వక్ఫ్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్‌గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది.
వక్ఫ్ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి.
అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు.
ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.
- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'
- డానీ