డిసెంబర్ 3న జరిగిన వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘మనిషి జీవితంలో, దేశాభి వృద్ధిలో వ్యవసాయం ప్రాముఖ్యత’’ అనే అంశంపై జరిగిన విస్తృ తమైన చర్చల్లో పలు మౌలిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా, నేడు ప్రతి మనిషి తన జీవితంలో వ్యవసాయానికి ఉన్న స్థానాన్ని, ప్రాముఖ్యతను గుర్తించగలుగుతున్నాడా? తమ ఆహార భద్రత వ్యవసాయంతోనే ముడిపడి ఉందన్న వాస్తవం ఎంతమంది ప్రజలకు తెలుసు? వ్యవసాయ ప్రాముఖ్యతను ప్రభుత్వాలే విస్మరిస్తున్నప్పుడు.. ప్రజలను తప్పుపట్టాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశం అయ్యాయి.
నేటికీ 70% మందిపైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే అతిపెద్ద రంగం వ్యవసాయమని.. ఇందులో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అవగాహన ఉన్న వారు కొంతమందే. కొన్ని దేశాల్లో వ్యవసాయ విద్యకు ఉన్న డిమాండ్ ఇతర రంగాల్లోని విద్యకు లేదు. వివిధ పంటలపై పరిశోధన, నూతన వంగడాల వృద్ధి, చిరుధాన్యాలసాగు, నూనెగింజల పరిశోధన, అభి వృద్ధి.. మొదలైన అంశాలలో పుష్కలమైన అవకాశాలు ఇక్కడి విద్యార్థులకు కూడా ఉన్నాయి. కానీ, వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే సాహసం చాలామంది చేయడం లేదు.
ప్రైవేటీకరణ, ఉదారవాద విధానాలు, ప్రపంచీకరణల మేలు కలయికగా చెప్పబడే ఈ నయా ఉదార ఆర్థిక విధా నాలు దేశంలో మొదలైన క్షణం నుంచే వ్యవసాయ రంగానికి పెను సవాళ్లు మొదలయ్యాయి. సన్న, చిన్నకారు రైతాంగం నడ్డి విరగడం మొదలైంది అప్పుడే. రైతాంగానికి ఇన్‌పుట్స్ అందించడంలో ప్రభుత్వ చొరవ తగ్గింది. పారి శ్రామికాభివృద్ధి పేరుతో వ్యవసాయోగ్యమైన భూములను రైతుల నుండి బలవంతంగా సేకరించి పారిశ్రామిక వేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ఆర్థిక సంస్కరణల్లో ప్రధాన ఎజెండాగా మారింది. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా క్రమేపీ 14 శాతానికి దిగజారింది. వ్యవసాయాభివృద్ధి రేటు ఇతర రంగాల కంటే కనిష్టంగా నమోదు కావడం 1995 తర్వాత ఎక్కువైంది.
బ్యాంకింగ్ రంగంపై అంతకుముందున్న నియంత్రణ సడలిపోవడంతో జాతీయ బ్యాంకులు సైతం తమ సామాజిక బాధ్యత నుండి వైదొలగాయి. చిన్న, సన్నకారు రైతులకు రుణాలు అందించడం తగ్గించి.. పారిశ్రామిక వేత్తలకు నామమాత్రపు షూరిటీపై వందలకోట్ల రుణాలు ఉదారంగా అందించడం, పర్యవసానంగా వారు వేలకోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం పెట్టడం పరిపాట య్యింది. దీంతో, గ్రామీణ ప్రాంత రైతాంగం విధిలేని పరిస్థితుల్లో అధిక వడ్డీపై అప్పులు చేస్తున్నారు.
నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భాగంగా ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)తో 1995లో చేసుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు దేశ వ్యవసాయరంగాన్ని సంక్షోభ స్ధాయికి చేర్చాయి. దేశంలోకి ఆహార ధాన్యాలతోపాటు హార్టికల్చర్, వంటనూనెలు, డెయిరీ, ఫిషరీస్ ఉత్పత్తులు కూడా దేశంలోకి కుప్పలుతెప్పలుగా వచ్చి పడటం మొదలైంది. ఎగుమతుల అవకా శాలు పెరుగుతాయని మభ్యపెట్టినప్పటికీ.. అటువంటి అవకాశాలు దేశ రైతాంగానికి దక్కలేదు.
మరోపక్క సేంద్రియ ఎరువుల వాడకాన్ని తగ్గించి అధిక ఉత్పత్తి కోసం పంటపొలాల్లో హానికర రసాయనిక ఎరువులు, నియంత్రణ లేకుండా పురుగు మందుల్ని విని యోగించే విధానాలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం పెరిగింది. ఫలితంగా భూసారం తగ్గిపోయింది. పర్యావరణ సమస్యలు ఎక్కువయ్యాయి. వీటన్నింటి కారణంగానే.. గత 10 సంవత్సరాలలో దేశంలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా.. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 నుండి నేటి వరకు దేశంలో దాదాపు 8 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
ఈ సందర్భంలో ‘వ్యవసాయం దండగకాదు.. పండుగ’ అని చాటిచెప్పి, రైతులలో భరోసా నింపిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2003లో వైఎస్ చేపట్టిన పాదయాత్రలో.. వ్యవసాయ రంగానికి 9 గంటలు ఉచిత విద్యుత్ వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చాక నిలు పుకొన్నారు. నాటి నుంచి నేటివరకు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అన్నది ఆక్సిజన్‌లా పనిచేస్తూనే ఉంది. 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం అందించే నగదుకు తోడుగా ప్రకటించిన ‘వైఎస్సాఆర్ రైతు భరోసా’ ఓ వినూత్న పథకం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసి రైతాంగానికి ఏడు మార్గాల ద్వారా రైతులకు ఆదాయం అందించడంపై దృష్టి పెట్టింది.
అనేక కోణాల నుంచి ముప్పేటన దేశాన్ని ఆవరించిన ఆర్థిక మాంద్యం దేశ ప్రజలకు శరాఘాతమే. దీన్ని అధిగమించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా తమవంతు సామాజిక బాధ్యతగా వ్యవసాయ రంగంలో విరివిగా పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. క్యూబాలో సంక్షోభం ఏర్పడినప్పుడు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎంత చిన్న స్థలం ఉన్నా.. ఆహార పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం మొదలుపెట్టారు.
తమ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా.. సహకార పద్ధతిలో ఇచ్చిపుచ్చుకోవడం, మిగు లును మార్కెట్‌లో అమ్మి లాభాలను పంచుకోవడం చేశారు. జపాన్‌లో కూడా ఇదే విధానంలో రెండో ప్రపంచయుద్ధం మిగిల్చిన విషాదాన్ని అధిగమించి తొలినాళ్లలో వ్యవసాయరంగం ద్వారానే తమ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసుకున్నది. ప్రజా భాగస్వామ్యంతో వ్యవసాయం అనే విధానం క్రమంగా అనేక దేశాలకు విస్తరించింది. పొలం నుంచి పళ్లెం వద్దకు అనే ప్రాతిపదికపై సీఎస్‌ఏ (కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్)లు పనిచేస్తున్నాయి. ఈ విధానాన్ని దేశంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలి. పౌర సమా జం భాగస్వామ్యం వహించాలి. ఆర్థిక మాంద్యం తట్టుకోవడానికి వ్యవసాయాన్ని ఆలంబనగా చేసుకోవాలి.
వ్యాసకర్త,
చీఫ్ విప్, ఏపీ శాసనమండలి,
డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.
Comments
Please login to add a commentAdd a comment