![Sakshi Guest Column On Falling standards of Universities in India](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/universities.jpg.webp?itok=mziuDOHU)
విశ్లేషణ
రాష్ట్రాల జాబితాలోని అంశాలు కొన్నింటిని, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో మరి కొన్నింటిని క్రమంగా దొడ్డిదారిన తన ఖాతా ల్లోకి మళ్లించుకొంటూ ఇప్పటికే కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా రూపొందించిన ముసా యిదాను బలవంతంగా రాష్ట్రాలపై రుద్ది, యూనివర్సిటీలపై పూర్తి స్థాయి పట్టుసాధించడానికి కేంద్రం అడుగులు వేయడంతో మరో కొత్త వివాదం మొగ్గ తొడిగింది.
యూజీసీ ప్రతిపాదించిన సంస్కరణలు అమలులోకి వస్తే...ఎంతో కీలకమైన వైస్ ఛాన్స్‌లర్ల నియామకాల్లో రాష్ట్రాలకున్న హక్కు లుప్తమైపోతుంది. ఇప్పటివరకు ఉపకులపతులుగా అర్హులైన వారిని నియమించడానికి సెర్చ్ కమిటీ వేయడం ఆనవాయితీగా ఉంది. సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి ఒకరు ఉంటారు.
సెర్చ్ కమిటీ ఎంతో కసరత్తు జరిపి 5 పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే... దానిని పరిశీలించి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపుతుంది. కానీ, కొత్తగా వచ్చే సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయానికి కత్తిరింపు వేశారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించే సంస్కరణలు చాలానే యూజీసీ ప్రతిపాదించింది. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయా అన్న అంశం పక్కన పెడితే... అసలు యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటి? నాణ్యతా ప్రమాణాలు పెంచే సంస్కరణలు కాకుండా పెత్తనం కోసం కేంద్రం వెంపర్లాడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
సంస్కరణలు ఏ రంగంలో చేపట్టాలి?
మన దేశంలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళా శాలల విద్యా ప్రగతి ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయన్నది నిర్వివాదాంశం. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి బంగారు బాటలు వేయ డంలో ఉన్నత విద్య, పరిశోధన కీలకమైనవి. ఆరోగ్యం, ఆహారం, ఉపాధి తదితర రంగాలలో ఎదురయ్యే సవాళ్లకు తగిన పరిష్కారం అందించే పరిశోధనలు పురుడుపోసుకొనేది యూనివర్సిటీ ప్రాంగణాలలోనే. వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలతో పోలిస్తే భారత్ ఎంతో వెనుకబడి ఉంది.
ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన యూనివర్సిటీలు పలు రుగ్మతలతో కునారి ల్లుతున్నాయి. నిధుల లేమి, రాజకీయ జోక్యం, బోధనా సిబ్బంది కొరత, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో యూనివర్సిటీల ప్రమాణాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ‘క్యూఎస్’ అనే ప్రఖ్యాత సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లోని 1,740 యూనివర్సిటీలను అధ్యయనం చేసి ర్యాంకులు ఇవ్వగా అందులో భారత్‌కు చెందిన 78 యూనివర్సి టీలు మాత్రమే ఆ ప్రమాణాలు అందుకోగలిగాయి.
ఒకప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశనం చేసి, వేల సంఖ్యలో గొప్ప విద్యావేత్తలను అందించిన నలంద, తక్షశిల, విశ్వభారతి, శాంతిని కేతన్ వంటి అత్యున్నత విద్యా పీఠాలు గలిగిన భారతదేశంలో నేడు అనేక యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు అడుగంటాయి. ఆవిష్కరణలకు మాతృమూర్తి వంటి విశ్వవిద్యాలయాలు విజ్ఞాన వెలుగులు ప్రసరించాలంటే అందుకు అనుగుణంగా మౌలిక సదు పాయాలు, నిష్ణాతులైన బోధనా సిబ్బంది ఉండాలి. రాజకీయ జోక్యానికి తావులేకుండా సమర్థత, అంకితభావం కలిగిన వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి.
విశ్వగురువు ఎలా అవుతాం?
2047 నాటికి మన దేశం ‘విశ్వగురువు’గా అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంగా పెట్టుకొన్నారు. ఈ లక్ష్యం గొప్పదే. అందుకు తగిన కార్యాచరణ అన్ని రంగాలలో కనపడాలిగా! ప్రత్యేకించి ఉన్నత విద్యారంగంలో, పరిశోధనా రంగంలో అభివృద్ధి పథంవైపు అడుగులు పడాలి. అందుకు భిన్నంగా ఈ రంగంలో అడు గులు తడబడుతున్నాయి.
అందుకు ఉదాహరణ దేశం నుంచి సుమారు 13 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం విదే శాల బాట పట్టడం. నాణ్యమైన ఉన్నత విద్యకు చిరునామాగా నేటికీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలే నిలుస్తు న్నాయి. వైద్య విద్య కోసం ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలైన రష్యా, అజర్‌జైబాన్, ఉక్రెయిన్ తదితర దేశాలకు భారతీయ విద్యార్థులు వేల సంఖ్యలో ‘క్యూ’ కడుతూనే ఉన్నారు.
జబ్బు ఒకటయితే, మందు మరొకటి వేసినట్లుగా... దేశంలోని విశ్వవిద్యాలయాలను అన్ని విధాలా బలోపేతం చేసే చర్యలను తీసు కోకుండా, దేశంలో విదేశీ యూనివర్సిటీలకు ద్వారాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేయడం, యూనివర్సిటీలపై రాష్ట్రాల హక్కుల్ని హరించి వేయడం విద్యావేత్తలను కలవరపరుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
దేశంలో విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని ఏర్ప రిస్తే... ఎటువంటి విదేశీ యూనివర్సిటీలు ఇక్కడకు వస్తాయి? ప్రపంచంలో పేరు బడిన తొలి 50 యూనివర్సిటీలు భారత్ కొస్తాయా? అని ప్రశ్నించుకొంటే స్పష్టమైన సమాధానం దొరకదు. పైగా ఇక్క డకు వచ్చే విదేశీ యూనివర్సిటీలపై తమ నియంత్రణ ఏదీ ఉండదనీ, కానీ పారదర్శకతతో ఉండాలని మాత్రమే కోరతామనీ యూజీసీ స్పష్టం చేసింది. అంటే... ఫీజుల వసూళ్ల విషయంలో విదేశీ వర్సిటీ లకు స్వేచ్ఛ ఉంటుంది.
అయితే అవి ప్రదానం చేసే డిగ్రీలకు, విదేశాలలో ఇచ్చే పట్టాలకు సమానమైన విలువ ఉంటాయన్నది ఒక్కటే విద్యార్థులను ఆకర్షిస్తోంది. విదేశీ యూనివర్సిటీలు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలో ముసాయిదా పత్రంలో నిర్దేశించకపోవడంతో అవి మన బ్యాంకుల నుంచే రుణాలు పొంది, వాటితోనే మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసి, లాభాల్ని మాత్రం తమ దేశానికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా విదేశీ యూనివర్సీటీలలో సంపన్నుల పిల్లలు మాత్రమే చదువు‘కొనే’ అవకాశం ఉన్నందువల్ల... దేశంలో ‘సంపన్న విద్యార్థి శ్రేణి’ మరొకటి నూతనంగా తయారవుతుంది.
బోధన–పరిశోధన
ఒకప్పుడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో జరిపిన పరి శోధనలకు అంతర్జాతీయంగా పేటెంట్లు లభించాయి. ఒక అంచనా ప్రకారం... దేశంలోని మన వర్సిటీలు ఏటా 24,000 డాక్టరేట్ పట్టాల్ని ప్రదానం చేస్తున్నాయి. అంటే ఏటా వేల సంఖ్యలో పరిశో ధనా పత్రాలు వెలువడుతున్నాయి. కానీ... వాటిని దేశాభివృద్ధి కోసం ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నారనేదే ప్రశ్నార్థకం. అసలు రీసెర్చ్ ఈ అంశం మీద జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఏది ఏమైనా... స్వదేశీ విశ్వవిద్యాలయాలకు రెండు కళ్లుగా భావించే బోధన, పరిశోధనలను పటిష్ఠం చేయాలి. విదేశీ విశ్వ విద్యాలయాల మోజులో స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలి.
విశ్వ విద్యాలయాలపై రాష్ట్రాల హక్కుల్ని కొనసాగించాలి. ఉపకులపతుల నియామకం పూర్తిగా రాజకీయమై పోయింది. రాజకీయాలకు అతీతంగా విశ్వ విద్యాలయాలు పని చేయగలిగే సంస్కరణలు తేవాలి తప్ప కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా కేంద్రం వ్యవహరించడం సమ్మతం కాదు.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment