గుడ్ న్యూస్‌.. ఇకపై యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు Indian universities and higher education institutions will now be permitted to offer admissions twice a year. Sakshi
Sakshi News home page

గుడ్ న్యూస్‌.. ఇకపై యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు: యూజీసీ

Published Tue, Jun 11 2024 2:48 PM | Last Updated on Tue, Jun 11 2024 4:14 PM

UGC allows colleges, universities to admit students twice a year

న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు ప్ర‌వేశాలు నిర్వ‌హించేందుకు యూనివ‌ర్సిటీ గ్రాంట్ క‌మిష‌న్‌(యూజీసీ) అనుమ‌తించింది. ఈ విష‌యాన్ని క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ఎమ్ జ‌గ‌దీష్ కుమార్ మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. 

2024-25 విద్యా సంవత్సరం నుంచి సంవ‌త్స‌రానికి  రెండుసార్లు అంటే జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతించ‌నున్న‌ట్లు  తెలిపారు. మే 5న జ‌రిగిన యూజీసీ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

కాగా ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రతి సంవత్సరం జూలై-ఆగస్టులో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీనివ‌ల్ల  భారతదేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు జూలై-ఆగస్టులో ప్రారంభమై మే-జూన్‌లో అకడమిక్ సెషన్‌ను ముగిస్తున్నాయి.

గత ఏడాది ఒక అకాడ‌మిక్ సంవ‌త్స‌రంలో దూర‌విద్య‌లో(ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌) విద్యార్థులు జ‌న‌వ‌రి, జూలైలో రెండుసార్లు ప్ర‌వేశం పొందేందుకు యూజీసీ అనుమ‌తించింది. ఈ నిర్ణయం వ‌ల్ల దాదాపు  అయిదు ల‌క్ష‌ల‌ మంది విద్యార్థులు మ‌రో విద్యా సంవత్సరం వరకు వేచి ఉండకుండా అదే ఏడాది డిగ్రీలొ చేరడానికి సహాయపడిందని కుమార్ పేర్కొన్నారు.  

‘‘మన దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్‌ కల్పించినట్లయితే అది ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఎంతో దోహదపడుతుంది. రెండుసార్లు అడ్మిషన్‌ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుంది. అటు కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు నిర్వహించుకోవచ్చు. తద్వారా పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని యూజీసీ చీఫ్‌ వెల్లడించారు.

రెండుసార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు తమ ఫ్యాకల్టీ, ల్యాబ్‌, క్లాస్‌రూమ్‌, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని వెల్లడించారు. భారతీయ విద్యా సంస్థలు ఈ విధానం పాటించడం వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ ప్రపంచంలో మనం మరింత మెరుగుకావచ్చని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు ఉంటుందన్నారు.

దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement