భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల (ఎఫ్‌హెచ్‌ఇఐ) క్యాంపస్‌ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణ ఉదారంగానూ, సమర్థంగానూ ఉందని చెప్పాలి. ఇది నూతన విద్యా విధానపు సిఫార్సులను అనుసరిస్తోంది. అయితే, ఇది ఇప్పటికే ఉన్న దేశంలోని విద్యా వ్యవస్థలను సవాలు చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక అవకాశంతోపాటు ఆందోళన కరమైన విషయం కూడా! ఇంకా, విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన భారతీయ క్యాంపస్‌లోని విద్యాపరమైన నాణ్యతను తమ దేశంలోని ప్రధాన క్యాంపస్‌తో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చాలా గొప్ప ఆలోచనే అయినప్పటికీ, క్రమబద్ధీకరణ యంత్రాంగం దీన్ని ఎలా అనువర్తించగలుగుతుంది?
యూజీసీ క్రమబద్ధీకరణ విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు పాలన పరంగా ప్రత్యేక అధికారాలకు అనుమతిస్తోంది. అన్ని విభాగాలలో యూజీ/ పీజీ/ డాక్టోరల్/ పోస్ట్‌డాక్టోరల్ అధ్యయనాలు, డిగ్రీల ప్రదానం, డిప్లొమాలు, సర్టిఫికేట్‌లను ఇచ్చే వీలు కల్పిస్తోంది. ఈ విదేశీ విద్యా సంస్థలు మొత్తం సబ్జెక్ట్‌వారీగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 500 లోపు ఉంటే అది నిజంగా గొప్ప అడుగే. కాకపోతే, ప్రపంచంలో కనీసం 20 ప్రముఖ ర్యాంకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల ఈ ర్యాంకింగ్ సంస్థల చర్యలలో పాల్గొనడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ర్యాంకింగ్‌లను ఎలా ప్రామాణీ కరిస్తారనేది ప్రశ్న. కాకపోతే భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం కోసం 2022లో జరిగిన విద్యా సంబంధ సహకార నియంత్రణ నేపథ్యంలో చూస్తే, ఉమ్మడి డిగ్రీ, ద్వంద్వ డిగ్రీ కార్య క్రమాలకు ఉత్తేజకరమైన కాలం ముందుందని చెప్పొచ్చు.
దేశంలో అడుగుపెట్టే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ఈ క్రమ బద్ధీకరణ ద్వారా, భారతీయ ఉన్నత విద్యా సంస్థలు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించవచ్చు. జాయింట్ వెంచర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్షాలు తమ వనరులతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి అంగీక రించే వ్యాపార పరమైన ఏర్పాటు అని మనం అర్థం చేసుకున్నప్పటికీ – విదేశీ ఉన్నత విద్యా సంస్థ భౌతిక, విద్యా, పరిశోధనా మౌలిక సదుపాయాలతో కూడిన స్వతంత్ర క్యాంపస్‌ను కలిగి ఉండాలని ఈ నిబంధన ఎందుకు నొక్కి చెబుతోంది? దాని విద్యాపరమైన, పరిశోధనా కార్యక్రమాలను సీరి యస్‌గా నిర్వహించడానికి ఏ విదేశీ ఉన్నత విద్యా సంస్థ అయినా భారతదేశంలో ఉండటం కోసం భూమిపై, వనరులపై పెట్టుబడి పెడుతుందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న భారతీయ క్యాంపస్ లతో వనరులను పంచుకునే సహకార క్యాంపస్ నమూనా మరింత ఆచరణీయంగా ఉంటుంది.
ఇప్పుడు ‘కంపెనీ’ పాత్రను చూద్దాం. నిర్దేశిత లక్ష్యాల కోసం, సెక్షన్ 8 కింద నమోదు అయిన కంపెనీ, లాభాలు ఏవైనా ఉంటే, వాటిని ఆ నిర్దేశిత లక్ష్యాల కోసమే ఉపయోగించాలి. లాభాలను దాని సభ్యులకు చెల్లించకూడదు. ఇంకా, ఇండియన్ ట్రస్ట్ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక విదేశీయుడు లేదా ఎన్నారై, భారతీయ ట్రస్ట్‌కు ట్రస్టీగా ఉండకూడదు.
అయితే ఫెమా చట్టం, 1999 నిబంధనలకు అనుగుణంగా ఉండే పక్షంలో నిధులను సరిహద్దులు దాటించడానికీ, విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణకూ, చెల్లింపులకూ, అమ్మకాలకూ అను మతిస్తోందని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఏదో లోపం ఉందని గమనించాలి. నిధులను స్వదేశానికి పంపగలిగే వీలు ఉన్నట్లయితే, సంబంధిత విదేశీ ఉన్నత విద్యా సంస్థ లాభాలను పొందగలదని దీని అర్థమా? అంటే ఇప్పుడు విద్య ‘లాభార్జన’ కోసమా?
భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుతుందని ఈ క్రమబద్ధీకరణ ఆశిస్తోంది. ఏ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ఏయే కార్యక్రమాలతో తమ క్యాంపస్‌లను మన దేశంలో ఏర్పరుస్తాయి; వారు స్థానిక అధ్యాపకులను తీసుకుంటారా, అంతర్జాతీయంగానా; విద్యార్థుల ప్రవేశం కోసం వారు ఉప యోగించే కొలమానాలు ఏవి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
సాంప్రదాయకంగా, అక్రిడిటేషన్ అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలలో నాణ్యతా తనిఖీ విధానం. విదేశీ ఉన్నత విద్యా సంస్థ నాణ్యతాపరమైన హామీ, ఆడిట్‌కు లోనవుతుందనీ, యూజీసీకి తన నివేదికను సమర్పించాలనీ ఈ క్రమబద్ధీకరణ నిర్దేశిస్తోంది. ఏదైనా నెరవేరదగిన హామీ నెరవేర్చని పక్షంలో వినియోగదారు న్యాయస్థానంలో పరిష్కారాన్ని కోరవచ్చు.
ఒక విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన రుసుముల చట్రాన్ని నిర్ణ యించుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ అనుమతించడం నిజానికి ప్రగతి శీలమైనది. భారతదేశంలోని విద్యాసంస్థలు మాత్రం ఫీజు నిర్ణా యక కమిటీల ఇష్టాలకు లోబడుతున్నప్పుడు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు? ఫెమా నిబంధనలు ఉన్నప్ప టికీ, పరిమాణాత్మకం కాని మొత్తాలను ఎల్లప్పుడూ సర్దుబాటు చేయ వచ్చు. అలాంటప్పుడు, అకడమిక్ పరపతి ఆధారితమైన రుసుము చట్రాన్ని తప్పనిసరి చేయడం మరింత విశ్వసనీయమైన ఎంపిక.
విదేశీ ఉన్నత విద్యా సంస్థ అందించే కార్యక్రమాలు ఆన్‌లైన్ , బహిరంగ మరియు దూరవిద్యా (ఓడీఎల్) విధానంలో అనుమతించ బడవు అనే షరతు నిర్బంధపూరితంగా ఉంది. ఎమ్‌ఐటి, స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్ వంటి అ్రగ్రశ్రేణి విద్యాసంస్థలు అద్భుతమైన ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యూజీసీ అనేక ఓపెన్, దూరవిద్యా నిబంధనలను సడలించినప్పుడు, వాటిని మన విద్యార్థులకు ఎందుకు దూరంచేయాలి?
విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్‌లను గుర్తించడానికి రెండు ముఖ్యమైన కొలమానాలు ఏవంటే... అంతర్జాతీయీకరణ, పరిశో ధన. భారతీయ క్యాంపస్‌లలో విదేశీ విద్యార్థులు, అధ్యాపకులు వర్ధిల్ల డాన్ని అంతర్జాతీయీకరణ అంటారు. ఒక ప్రముఖ ఫ్యాకల్టీ ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మెరుగైన పరిశోధనా సౌకర్యాల కోసం, లేదా తన పరిధిలోని అత్యుత్తమ వ్యక్తులతో పరస్పర సంభాషణ కోసం; అవకాశాలను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలకు దారితీసే పేటెంట్లను, ఐపీఆర్‌లను తమ హోదాకు జతచేసు కోవడం కోసం పనిచేస్తారు. అవి సాధ్యం కాదని తెలిసినప్పుడు, మహా అయితే ఏదో ఒక వారం సందర్శన కోసం తప్ప, ఎవరూ బయ టకు రారు. అప్పుడు విదేశీ ఉన్నత విద్యా సంస్థ ఎలా పని చేస్తుంది?
అధ్యాపకులు, సిబ్బంది నియామకంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఈ క్రమబద్ధీకరణలో అత్యంత ముఖ్యమైన భాగం. మన సంస్థలలోని అత్యుత్తమ అధ్యాపకులు విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు వలసవెళ్లే అవకాశం ఉండటం ఈ నిబంధనకు రెండో కోణం. బహుశా, చివరికి ఒక కొత్త సాధారణ స్థితి ఏర్పడవచ్చు. ఆ స్థితి మన విద్యా సంస్థలలో నాణ్యతను పెంచినట్లయితే, దానిని స్వాగతించాలి.
మన విద్యా సంస్థల ఫీజు కమిటీ సిఫార్సులు, అడ్మిషన్ల కోసం రాష్ట్ర లేదా కేంద్ర నిబంధనలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలి. అధ్యాపకు లను ఎన్నుకోవడంలో, ఫీజులను నిర్ణయించడంలో ప్రవేశ నిబంధనలను ఏర్పర్చడంలో మన సంస్థలకు స్వయంప్రతిపత్తిని ఎందుకు పొడిగించకూడదు? అవన్నీ అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలకు చెందిన అవే కొలమానాలపై పోటీ పడాలని భావిస్తున్నాం కదా!
ఏదైనా ప్రయోగం విషయంలో దాని విమర్శకులు దానికి ఉంటారు. విదేశాల్లోని మాతృసంస్థల్లో అయ్యేదానితో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో, విదేశీ విద్యార్హతలతో భారతీయ విద్యార్థులు నాణ్యమైన విద్యను ఇక్కడే పొందేందుకు ఈ క్రమబద్ధీకరణ వీలు కల్పిస్తే, ఇది స్వాగతించాల్సిన విషయమే. అయితే ఐఐటీల వంటి మన ప్రథమశ్రేణి విద్యాసంస్థలను సాధారణంగా ఎంపిక చేసుకునే విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాంపస్‌లలో చేరేలా ప్రభావితం అయితే, అది ఆందోళన కలిగించే అంశం అవుతుంది.
అందుకే, నాణ్యతా ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగినందున విద్యారంగానికి భారీ పెట్టుబడులు అవసరం. పరిశోధనా సౌకర్యాల్లో భారీ స్థాయి వృద్ధి అవసరం. ప్రభుత్వ నిధులను అలా ఉంచుతూనే, విదేశీ నిధులను అనుమతించడం, విజయవంతమైన వ్యవస్థలను అనుసరించడం మేలు.
ఎస్‌ఎస్ మంథా, ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మాజీ ఛైర్మన్; అశోక్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment