దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యుల నియామకాలు, పదోన్నతి కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణ పేరిట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జనవరి 6న ముసాయిదా డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 5 లోగా ప్రజాభిప్రాయం సేకరించి, నూతన మార్గదర్శకాలు (guildelines) వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ముసాయిదా (Draft) పూర్తిగా యూనివర్సిటీలను కేంద్రీకరించడానికి, ప్రయివేటీకరణకు మరో ప్రయత్నంగా మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలు విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని బలహీనపరుస్తాయి. ఇవి మొత్తంగా ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ మూల సూత్రాలను బలహీన పరుస్తు న్నాయి.
ఇప్పటి వరకూ వైస్ ఛాన్సలర్ (వీసీ)ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ (Search Committee) వేస్తూ వస్తోంది. కమిటీలో ముగ్గురు సభ్యులు – యూజీసీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన సభ్యుడు, యూని వర్సిటీ కౌన్సిల్ ప్రతినిధి ఉంటు న్నారు. ఈ సెర్చ్ కమిటీ సీనియారిటీ, అర్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ముగ్గురు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్ ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు సవరించిన నియమాలు వైస్–ఛాన్సలర్ల ఎంపికలో రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ (Kerala) వంటి అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు వీసీల నియామకంపై గవర్నర్‌లతో విభేదిస్తున్నాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే వరుసలో ఉన్నాయి.
మొదటిసారిగా వీసీల నియామకాల్లో నాన్ అకడమిక్ వ్యక్తులను నియమించాలని తాజా ముసాయిదా సిఫార్సులు చేసింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులు కావాలంటే ప్రొఫెసర్‌గా లేదా కీలకమైన పరిశోధనలో లేదా అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం పది సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో, ప్రభుత్వ లేదా కనీసం ప్రభుత్వరంగ సంస్థలో కనీసం పది సంవత్సరాల సీనియర్ స్థాయి అనుభవం గడించి ఉంటే సరిపోతుంది.
ముసాయిదాలో రిజర్వేషన్లను మరిచారు. ఇది ఉన్నత విద్యలో పూర్తిస్థాయి కార్పొరేట్ సంస్కృతిని చొప్పిస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు నిర్దిష్ట బోధన సమయం ప్రస్తావించలేదు. ‘నెట్’ అవసరం లేకుండా ‘మాస్టర్స్ డిగ్రీ’ ఉంటే చాలు అనే విషయమైతే జీర్ణించుకోవటానికే కష్టంగా ఉంటుంది. 55 శాతం మార్కులతో మాస్టర్స్ సాధించిన వారిని యూజీసీ–నెట్‌లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేరుగా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. యూజీసీ (UGC) చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కళాశాలలో బోధించే అధ్యా పకుల అర్హతలు ఏమి ఉండాలో నిర్ణయిస్తుంది. ఇంత స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరిచేందుకు కీలు బొమ్మలా ఆడిస్తోంది.
చదవండి: బౌద్ధ సంస్కృతితోనే వికాసం, ప్రకాశం
కరిక్యులమ్, బోధనపరమైన అంశాలలో రాష్ట్రాల నియంత్రణ చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల నేపథ్యానికి అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించు కోవాలి. కానీ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం ఒకొక్కటిగా తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దుతోంది. వాటిని కాదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మన దగ్గర కూడా మేధావులు, విద్యావేత్తలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుం బిగించాలి. రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు దీనిపై నోరు మెదపాలి.
– కె. ప్రసన్న కుమార్,
ఆంధ్రప్రదేశ్ ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment