What Is National Credit Framework In Telugu, Briefly Explained By UGC Chairman - Sakshi
Sakshi News home page

Credit Framework: ఒకే విద్యా విధానం.. మార్కుల స్థానంలో క్రెడిట్స్‌.. ఏమిటిది?

Published Thu, Apr 13 2023 10:43 AM | Last Updated on Thu, Apr 13 2023 12:45 PM

What is National Credit Framework Explain By UGC chairman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా జాతీయ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీష్‌కుమార్‌ స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్‌ ఇవ్వడం దీని ఉద్దేశమని చెప్పారు. నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌సీఆర్‌ఎఫ్‌)ను యూజీసీ సోమవారం విడుదల చేసింది. దీనిపై వస్తున్న సందేహాలపై యూజీసీ ఛైర్మన్‌ సమగ్ర వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.  

ఏమిటీ ఎన్‌సీఆర్‌ఎఫ్‌? 
విద్యావిధానానికి జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం దీని ఉద్దేశం. దీనికోసం సమీకృత క్రెడిట్‌ విధానాన్ని అన్ని విద్యా సంస్థలు అనుసరిస్తాయి. పాఠశాల, ఉన్నత విద్య, ఒకేషనల్, స్కిల్‌ ఎడ్యుకేషన్‌.. ఏదైనా మార్కులతో పనిలేకుండా క్రెడిట్స్‌గానే పరిగణిస్తారు. దీనికోసం జాతీయ స్థాయిలో పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్య విద్యలకు ప్రత్యేక క్రెడిట్‌ విధానంతో మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.  

క్రెడిట్‌ విధానం అంటే..? 
వివిధ స్థాయిల్లో మార్కుల స్థానంలో క్రెడిట్స్‌ ఇస్తారు. ఒక విద్యార్థి సంవత్సరంలో రెండు సెమిస్టర్లలో 30 గంటల బోధన (ఏదైనా సబ్జెక్టులో) తరగతులకు హాజరవ్వాలి. ప్రతీ సెమిస్టర్‌కు 20 క్రెడిట్స్‌ ఉంటాయి. ఏడాదికి 40 క్రెడిట్స్‌ వస్తాయి. అన్ని సబ్జెక్టులు కలిపి 1200 గంటల బోధన సమయంలో విద్యార్థి 40 క్రెడిట్స్‌ పొందే వీలుంటుంది. విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత దీన్ని లెవర్‌–1గా భావిస్తారు. 6–8 తరగతులు పూర్తి చేస్తే లెవల్‌–2, తర్వాత 9, 10 తరగతులు పూర్తి చేస్తే లెవల్‌–3గా, 11, 12 పూర్తి చేస్తే లెవల్‌–4గా గుర్తిస్తారు.

స్కూల్‌ విద్య మొత్తంగా 160 క్రెడిట్స్‌ ఉంటాయి. మూడేళ్ళ బ్యాచిలర్‌ డిగ్రీలో ప్రతి సంవత్సరం 40 క్రెడిట్స్‌ చొప్పున మొత్తం 120 క్రెడిట్స్‌ ఉంటాయి. నాలుగేళ్ళ డిగ్రీని 6.5 లెవల్‌గా, మూడేళ్ళ డిగ్రీ తర్వాత మాస్టర్‌ డిగ్రీని లెవల్‌ 7గా, నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌ డిగ్రీ, పీహెచ్‌డీని కలిపి 8 లెవల్‌గా చూస్తారు. పీహెచ్‌డీ పూర్తిచేసిన విద్యారి్థకి మొత్తం 320 క్రెడిట్స్‌ ఇస్తారు. ఒకేషనల్, స్కిల్‌ ఎడ్యుకేషన్‌కు కూడా వివిధ స్థాయిలో (4.5 నుంచి 8 లెవల్స్‌) క్రెడిట్స్‌ ఉంటాయి.  

క్రెడిట్స్‌ నిల్వ ఇలా... 
ప్రతీ లెవల్‌లో విద్యార్థి సాధించిన క్రెడిట్స్‌ అన్నీ అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ (ఎబీసీ) టెక్నాలజీ ప్లాట్‌ఫాంలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి విద్యా సంస్థ ఈ ప్లాట్‌ఫాం కిందకు వస్తుంది. క్రెడిట్స్‌ ఆధారంగానే విద్యార్థి స్థాయిని ఎన్‌సీఆర్‌ఎఫ్‌ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు టెన్త్‌ తర్వాత ఐటీఐ పాస్‌ అయిన విద్యార్థి అదనంగా లాంగ్వేజ్‌ కోర్సు చేస్తే ఇది 12వ క్లాసుకు సమానం అవుతుంది. అతను యూనివర్సిటీలో చేరేందుకు వీలు కల్పిస్తుంది.

అదే విధంగా 5వ స్థాయి విద్యార్థి బ్రిడ్జ్‌ కోర్సులు అదనంగా చేస్తే అదనపు క్రెడిట్స్‌ వస్తాయి. అతను నేరుగా 8వ క్లాసు పరీక్షకు హాజరవ్వొచ్చు. విద్యార్థి ఆన్‌లైన్‌ కోర్సులు చేసినా ఆ క్రెడిట్స్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. క్రెడిట్స్‌ను లెక్కగట్టడానికి ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఇవి అకడమిక్, స్కిల్, అనుభవం ద్వారా పొందే విద్యను బట్టి  ఉంటాయి.  

ఇవి కూడా క్రెడిట్సే.. 
అకడమిక్‌ విద్యే కాదు... క్రీడలు, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్, మ్యూజిక్, హెరిటేజ్, ట్రెడిషనల్‌ స్కిల్స్, ఫైన్‌ ఆర్ట్స్‌ వంటి ప్రత్యేక కళలకూ క్రెడిట్స్‌ ఇస్తారు. ఇవి కూడా క్రెడిట్‌ బ్యాంకులో చేరతాయి. క్రెడిట్‌ సిస్టమ్‌ను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్నారు. కొన్ని క్రెడిట్స్‌ను అన్‌స్కిల్డ్, కొన్ని క్రెడిట్స్‌ను స్కిల్‌ అని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే మన దేశమూ అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్‌ విధానం ఇచ్చేందుకు ప్రయతి్నస్తోంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement