Draft bill
-
కేంద్రం చేతి కీలుబొమ్మ యూజీసీ!
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యుల నియామకాలు, పదోన్నతి కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణ పేరిట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జనవరి 6న ముసాయిదా డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 5 లోగా ప్రజాభిప్రాయం సేకరించి, నూతన మార్గదర్శకాలు (guildelines) వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ముసాయిదా (Draft) పూర్తిగా యూనివర్సిటీలను కేంద్రీకరించడానికి, ప్రయివేటీకరణకు మరో ప్రయత్నంగా మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలు విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని బలహీనపరుస్తాయి. ఇవి మొత్తంగా ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ మూల సూత్రాలను బలహీన పరుస్తు న్నాయి.ఇప్పటి వరకూ వైస్ ఛాన్సలర్ (వీసీ)ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ (Search Committee) వేస్తూ వస్తోంది. కమిటీలో ముగ్గురు సభ్యులు – యూజీసీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన సభ్యుడు, యూని వర్సిటీ కౌన్సిల్ ప్రతినిధి ఉంటు న్నారు. ఈ సెర్చ్ కమిటీ సీనియారిటీ, అర్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ముగ్గురు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్ ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు సవరించిన నియమాలు వైస్–ఛాన్సలర్ల ఎంపికలో రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ (Kerala) వంటి అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు వీసీల నియామకంపై గవర్నర్లతో విభేదిస్తున్నాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే వరుసలో ఉన్నాయి.మొదటిసారిగా వీసీల నియామకాల్లో నాన్ అకడమిక్ వ్యక్తులను నియమించాలని తాజా ముసాయిదా సిఫార్సులు చేసింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులు కావాలంటే ప్రొఫెసర్‌గా లేదా కీలకమైన పరిశోధనలో లేదా అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం పది సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో, ప్రభుత్వ లేదా కనీసం ప్రభుత్వరంగ సంస్థలో కనీసం పది సంవత్సరాల సీనియర్ స్థాయి అనుభవం గడించి ఉంటే సరిపోతుంది.ముసాయిదాలో రిజర్వేషన్లను మరిచారు. ఇది ఉన్నత విద్యలో పూర్తిస్థాయి కార్పొరేట్ సంస్కృతిని చొప్పిస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు నిర్దిష్ట బోధన సమయం ప్రస్తావించలేదు. ‘నెట్’ అవసరం లేకుండా ‘మాస్టర్స్ డిగ్రీ’ ఉంటే చాలు అనే విషయమైతే జీర్ణించుకోవటానికే కష్టంగా ఉంటుంది. 55 శాతం మార్కులతో మాస్టర్స్ సాధించిన వారిని యూజీసీ–నెట్లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేరుగా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. యూజీసీ (UGC) చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కళాశాలలో బోధించే అధ్యా పకుల అర్హతలు ఏమి ఉండాలో నిర్ణయిస్తుంది. ఇంత స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరిచేందుకు కీలు బొమ్మలా ఆడిస్తోంది.చదవండి: బౌద్ధ సంస్కృతితోనే వికాసం, ప్రకాశంకరిక్యులమ్, బోధనపరమైన అంశాలలో రాష్ట్రాల నియంత్రణ చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల నేపథ్యానికి అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించు కోవాలి. కానీ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం ఒకొక్కటిగా తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దుతోంది. వాటిని కాదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మన దగ్గర కూడా మేధావులు, విద్యావేత్తలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుం బిగించాలి. రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు దీనిపై నోరు మెదపాలి. – కె. ప్రసన్న కుమార్,ఆంధ్రప్రదేశ్ ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్షులు -
ముసాయిదానే.. కొత్త చట్టం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికార్డులకు సంబంధించిన ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 (ఆర్వోఆర్)’ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు మినహా ముసాయిదా కింద రూపొందించిన అంశాలనే చట్టం రూపంలో అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త్వరలోనే దీనిపై ఓ స్పష్టత ఇస్తారని.. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. దాంతోపాటు ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేస్తారా? లేక అసెంబ్లీలో పెట్టిన బిల్లుపై విస్తృతంగా చర్చించి చట్టంగా చేస్తారా? అన్న దానిపై మాత్రం తర్జనభర్జన కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈనెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఆర్డినెన్స్ వచ్చే అవకాశం లేదని అంటున్నాయి. అయితే కేబినెట్ ఎజెండాపై బుధవారం స్పష్టత వస్తుందని, ఎజెండాలో భూముల చట్టం ఆర్డినెన్స్ ఉంటే రూపకల్పన, జారీ ఏర్పాట్లకు సిద్ధంగానే ఉన్నామని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా బిల్లు ఇదే.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్వోఆర్–2024’ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్వోఆర్–2020 చట్టంలో పరిష్కరించలేని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ 20 సెక్షన్లతో ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. 1936, 1948, 1971, 2020 నాటి ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి, వాటి అమలుతో చేకూరిన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టం ముసాయిదాను తయారు చేసింది. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాల అంచనాల ప్రకారం రూపొందించిన ఈ ముసాయిదాలో పాస్ పుస్తకాలు రాని భూముల సమస్యల పరిష్కారం, కొత్త రికార్డును ఎప్పుడైనా తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ లాంటి వెసులుబాట్లు కల్పిస్తూ అనేక అంశాలను ముసాయిదాలో పొందుపరిచారు. బిల్లు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్వోఆర్ చట్టానికి రెండోసారి మార్పు జరుగుతోంది. 2020లో బీఆర్ఎస్ హయాంలో ఆర్వోఆర్–2020 చట్టం అమల్లోకి తెచ్చారు. అందులోని అనేక అంశాలకు సవరణలు, మార్పు చేర్పులతో ఆర్వోఆర్–2024ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు పెట్టింది. ముసాయిదాపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి 23 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మంత్రులు, రెవెన్యూ శాఖ సీనియర్ అధికారులు, భూచట్టాల నిపుణులు, మేధావులు, సామాన్యులు.. ఇలా అన్ని వర్గాలు అభిప్రాయాలు స్వీకరించింది. ఈ వివరాలతో జిల్లాల కలెక్టర్లు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ మూడు అంశాలే కీలకం ప్రజలతోపాటు భూచట్టాల నిపుణుల నుంచి వచ్చిన అనేక సూచనలు, సలహాల్లో మూడు అంశాలు కీలకమని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ప్రతిపాదన ముసాయిదా చట్టంలో లేదని.. భూసమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు. అయితే రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు, ఆర్ఓఆర్ చట్టానికి సంబంధం లేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అయితే భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బీలో పెట్టిన 18లక్షల ఎకరాల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉందని అంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వొచ్చని, లేదా ముసాయిదా చట్టంలోని సెక్షన్–4 ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇక అప్పీల్, రివిజన్లకు సంబంధించిన అంశంలోనూ చాలా సూచనలు వచ్చాయి. తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్రే్టషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్‌ను కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్‌కు చేసుకోవాలని.. సెకండ్ అప్పీల్‌ను సీసీఎల్ఏకు, రివిజన్ కోసం ప్రభుత్వానికి లేదంటే సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చట్టంలో ప్రతిపాదించారు. అయితే ఈ అప్పీల్ అవకాశం ఆర్డీవో స్థాయిలోనూ ఉండాలని పలువురు సూచించారు. రిజిస్రే్టషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి అని.. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూఆధార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇస్తామన్న ప్రతిపాదనలపైనా పలు సూచనలు వచ్చాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. సాదాబైనామాలకు అవకాశం ఆర్వోఆర్–2024 చట్టం అమల్లోకి వస్తే పెండింగ్‌లో ఉన్న 9.4 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రత్యేక సెక్షన్లో ప్రతిపాదించారు. ఇక అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి ఈ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదనే విమర్శలున్నాయి. అయితే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడానికి, ఆర్వోఆర్ చట్టానికి సంబంధం లేదని.. అసైన్డ్ భూములపై హక్కులు రావాలంటే హక్కుల బదలాయింపు నిషేధిత చట్టాన్ని (పీవోటీ) సవరించాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు వివరిస్తున్నాయి. మొత్తమ్మీద ముసాయిదా చట్టంలో ఒకట్రెండు అంశాల్లోనే మార్పు ఉంటుందని.. అది కూడా మార్గదర్శకాలు తయారు చేసినప్పుడు వాటిలో పొందుపరుస్తారని పేర్కొంటున్నాయి. -
ప్రభుత్వ అధీనంలోకి టెలికాం, ఓటీటీ సర్వీసులు..? భారీ మార్పులు ఇవే..
ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్‌తోపాటు ఓటీటీలపై ఇకనుంచి ప్రభుత్వం ఆధిపత్యం కొనసాగనుందని వాదనలు వస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో టెలికమ్యూనికేషన్స్ డ్రాప్ట్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే ఓటీటీ, ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్ టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి. దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే ఎలాంటి నెట్వర్క్ లేదా టెలికమ్యూనికేషన్ సేవలనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది. తాజా డ్రాఫ్ట్ బిల్లుతో టెలికాం రంగాన్ని నియంత్రించేలా 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులోనే కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాన్ని కట్టడి చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీల ప్రవేశ రుసుము, లైసెన్స్ ఫీజు, పెనాల్టీ మొదలైనవాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనే ప్రపోజల్ కూడా ఈ బిల్లులో ఉందని తెలిసింది. ఒకేవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే వీటిలో భారీ మార్పు ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. -
Uttarakhand: యూసీసీకి సిద్ధం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) అమలు విషయంలో చర్యలు వేగవంతం చేసింది. సివిల్ కోడ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రూపొందించిన నివేదిక (ముసాయిదా) అతిత్వరలో ప్రభుత్వానికి చేరనుంది. తద్వారా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ బిల్లుకు చట్ట రూపం తేవాలని పుష్కర్‌సింగ్ దామీ సర్కార్ యోచిస్తోంది. దేశంలోనే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయబోయే తొలి రాష్ట్రంగా నిలిచేందుకు ఉత్తరాఖండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని సివిల్ కోడ్ రూపకల్పన కోసం ఏర్పాటు చేసింది దామీ సర్కార్. ఈ కమిటీ రెండు లక్షల మందికి పైగా పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మరో మూడు నాలుగు రోజుల్లో నివేదిక ప్రభుత్వాన్ని చేరనుందని సమాచారం. నివేదిక రాగానే.. యూసీసీని అమలులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తామని సీఎం పుష్కర్‌సింగ్ ఇదివరకే ప్రకటించారు. వచ్చే వారం ముసాయిదా (డ్రాఫ్ట్) కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. బిల్లులో బహుభార్యత్వం రద్దు ప్రధానాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సహజీవనం కొనసాగించాలనుకునే జంట తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధన కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కిందటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల హామీగా యూసీసీని చేర్చింది బీజేపీ. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
UPDATES తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. ఇవాళే(ఆదివారం) ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోద ముద్ర పొందడంతో అసెంబ్లీ సమావేశాల పొడిగింపు నిర్ణయం ఉపసంహరణ. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు. కానీ ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం పొందడంతో పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దాంతో తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు అంటూ స్పీకర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం ►1969 తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది ►భట్టి విక్రమార్క తన పాదయాత్రను రమ్మంగా వర్ణించారు ►మరో పర్యాయం పాదయాత్ర చేయాలని కోరుతున్నా ►పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు ►అది సహజమైన పరిణామం ►తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనసుల్ని తీవ్రంగా గాయపరిచింది కాంగ్రెసే ►బీజేపీ కూడా తెలంగాణను కించపరిచింది ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు ►సీఎల్పీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి ►నిన్న అసెంబ్లీలో అవమానం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి ►కేటీర్ వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు ►స్పీకర్ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ►కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ► స్పీకర్‌తో ముగిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ ► సభను తప్పుదోవ పట్టించేలా అధికార పక్ష వ్యవహరిస్తోందని ఆరోపణ ► కేటీఆర్ సభలో అబద్దాలు మాట్లాడారు: సీఎల్పీ నేత భట్టి ► కట్టడి చేయాల్సిన స్పీకర్ కూడా పట్టించుకోవడం లేదు ►దీనిపై స్పీకర్ ముందు నిరసన చేస్తున్నాం. ►కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలి. అసెంబ్లీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు నివాళులు ►తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన ► ఆర్టీసీ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్నుపడిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోని గవర్నర్ అయినా బిల్లు పాస్ చేయాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారని తెలిపారు. ► బిల్లుకు ఆమోదం తెలుపాలి అంటే ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని, అవసరమైతే అసెంబ్లీని రెండు రోజులు పొడిగించి ఆర్టీసీ బిల్లును ఆమోదించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు కోసం ప్రత్యేకంగా సెషన్ పెట్టాలని, దీనిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు. ►తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని కొంతమంది కోరుకుంటున్నారని ఆరోపించారు. నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు. ►సభ నిర్వహాణ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి సీతక్క వెళ్లిపోయారు. ►వరంగల్‌లో వరద నష్టంపై సమీక్ష చేశామని సభలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేస్తామని తెలిపారు. ధరణిలో చిన్న చిన్న సమస్యలున్నాయని వెంటనే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో డ్రగ్స్ సమస్య ఉందని, దీని నియంత్రణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ►అసెంబ్లీలో జీరో అవర్ టైంలో ప్రజా సమస్యలు లేవనెత్తారు ఎమ్మెల్యేలు. ధూల్‌పేట సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. తాత్కాలిక ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన ఆదివారం ప్రారంభమయ్యాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం తెరపడనుంది. బీఏసీ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఆదివారం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా ‘తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం’పై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశముంది. మరోవైపు ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు’శాసనసభలో పెట్టే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం ఉదయంలోగా ఈ బిల్లుకు గవర్నర్ అనుమతి తెలిపితే సభ ముందుకు ఈ బిల్లు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఐదు బిల్లులకు సభ ఆమోదం... మూడో రోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల అనంతరం ‘పల్లె ప్రగతి– పట్టణ ప్రగతి’పై జరిగిన లఘు చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం ఐదు బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు–2023, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2023ను ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించగా ఫ్యాక్టరీల (తెలంగాణ సవరణ) బిల్లు– 2023ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లు–2023ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించారు. తెలంగాణ పంచాయతీరాజ్ రెండో సవరణ బిల్లు 2023ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రవేశపెట్టిన ఈ బిల్లులను సభ ఆమోదించినట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. అంతకుముందు నిరుద్యోగ భృతి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. -
ఆర్టీసీ బిల్లు.. మరో ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లును ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు రాజ్‌భవన్ నుంచి ఇంకా అనుమతి దక్కలేదు. తాజాగా ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విస్ట్ ఇచ్చారు. మరో మూడు వివరాలపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీంతో గవర్నర్ సంధించిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానాలు సిద్ధం చేస్తోంది. ► ఆర్టీసీకి చెందిన భూములు, భవనాలు ఎన్ని ఉన్నాయి. ► డిపోలవారీగా ఉద్యోగుల సంఖ్య ఎంత? ► పర్మినెంట్ కానిఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా? ‘‘నిన్న బిల్లు పంపి ఇవ్వాళ సంతకం కావాలంటే కరెక్ట్ కాదు. నేను ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నా. ఏ బిల్లులోలైనా నిబంధనల ప్రకారమే నేను వెళ్తున్నాను. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నా. ప్రతీ బిల్లుకు కొన్ని రూల్స్ ఉంటాయి. కార్మికులకు వివిధ రూపాల్లో రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగాము. నేను పీపుల్ ఫ్రెండ్లి గవర్నర్ ను. బిల్లుపై రాజ్ భవన్ ఆఫీస్ కు ఎలాగైతే నిరసనగా వచ్చారో..ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయండి. రాజ్ భవన్ కు నిరసనగా కార్మికులు వచ్చినందుకు నేనేం బాధపడటం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్...హెల్త్ బెనిఫిట్స్ పై ముసాయిధలో స్పష్టత లేదు. మీరు భవిష్యత్ హక్కుల కోసం అడగటం న్యాయమే కానీ బకాయిల విషయంలో మీ పోరాట స్ఫూర్తిని ఎందుకు ప్రశ్నించడం లేదు?. నేను ఆర్టీసీ కార్మికుల కోసమే ఉన్నా...మీ హక్కుల కోసమే అడుగుతున్నా ప్రాధాన్యత క్రమంలో మీ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలని అడుగుతున్నా. బిల్లులో స్పష్టత లేవని గవర్నర్ అడుగుతున్నట్లు...ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. బాధ్యతాయుత గవర్నర్ వ్యవస్థలో భాగంగానే నేను మీ న్యాయమైన అంశాల విషయంలో స్పష్టత కోసమే ఆపాను. అంతే తప్ప ఇంకో ఉద్దేశం లేదు. భవిష్యత్ ఎలాంటి సమస్యలు రాకూడదనే బిల్లులో స్పష్టత కోరుతున్నా అని ఆమె యూనియన్ నేతలను ఉద్దేశించి ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యానించినట్లు సమాచారం. టీఎస్సార్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విజభన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? వీటితో పాటు ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను గవర్నర్ కోరారు. దీనికి ప్రభుత్వం నుంచి.. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. సంస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్ (TSRTC) యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పింఛన్లు, తదితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదన్న ప్రభుత్వం.. ప్రభుత్వంలో తీసుకున్న తర్వాత కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. వేతనాలు, భత్యం, కేడర్, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఈ మేరకు గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని.. శాసనసభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అంతకు ముందు గవర్నర్ ఆర్టీసీ బిల్లు డ్రాఫ్ట్‌పై సంతకం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాసేపు బస్సులు నిలిపివేసి నమ్మె చేపట్టారు. హైదరాబాద్‌లో రాజ్‌భవన్ వద్దకు చేరుకుని కొందరు ఉద్యోగులు గవర్నర్ సంతకం చేయాలంటూ ధర్నా చేపట్టారు. రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు క్లియరెన్స్ అవుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. -
మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ?
మనమున్న సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా చాలు మన వ్యక్తిగత సమాచారం బజార్లో పడినట్టే. మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఈ– కామర్స్ సైట్లు పౌరుల వ్యక్తిగత డేటాతో ఆటాడుకుంటున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేయడానికే ఇప్పుడీ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు–2022’’ను (డీపీడీపీ) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఆరేళ్లుగా మేధోమథనం సాగించిన కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు ముసాయిదా బిల్లును రూపొందించింది. గతేడాది నవంబర్‌లో ప్రజలు, సామాజిక సంస్థల అభిప్రాయం కోసం వెలువరించిన ముసాయిదా బిల్లులో అంశాలే ఇంచుమించుగా ఇందులో ఉన్నాయి. అయితే విదేశీ సంస్థలు సమాచార సేకరణలో కొన్ని ఆంక్షల్ని విధించారు. బిల్లులో ఏముందంటే ? డీపీడీపీ బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దీని వివరాలను కేంద్రం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని వివాదాస్పద అంశాలు అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలకు విస్తృతమైన మినహాయింపులు ఇవ్వడం, డేటా ప్రొటక్షన్ బోర్డు పాత్రను గణనీయంగా తగ్గించడం వంటివి ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రభుత్వాధికారులు, ఇతర నాయకులకు సంబంధించిన డేటా కూడా ఈ చట్టం కింద గోప్యంగా ఉంచడం వల్ల సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందనే ఆందోళనలున్నాయి. ఇంకా బిల్లులో ఉన్న అంశాలివే.. ► ఆన్లైన్ లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా వారి సమ్మతితో సేకరించాలి. దానిని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆ సంస్థలదే. తమ పని పూర్తి కాగానే ఆ సమాచారాన్ని తొలగించాలి. ► మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటాను సేకరించి ప్రాసెస్ చేయవచ్చు. అదే విదేశాల్లో వస్తు, సేవల వినియోగంలో మాత్రం డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. ► వివిధ సామాజిక మాధ్యమాలు, ఈ కామర్స్ సంస్థలు, మొబైల్ యాప్స్ జవాబుదారీ తనం పెరిగేలా సేకరించిన సమాచారాన్ని ఎలా భద్రపరుస్తున్నారు, ఏ రకంగా సేకరిస్తున్నారు ? పౌరుల సమాచారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు ? వంటి ప్రశ్నలకు ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ► ఏదైనా సమాచారం చుట్టూ వివాదం చెలరేగితే కేంద్రం ఏర్పాటు చేయనున్న డేటా ప్రొటక్షన్ బోర్డు ఆఫ్ ఇండియా వాటిని పరిష్కరి స్తుంది. ఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను కేంద్రమే నియమిస్తుంది. ► పౌరుల వ్యక్తిగత సమాచారం ఉల్లంఘన జరిగితే సదరు కంపెనీలకు అత్యధికంగా రూ.250 కోట్ల జరిమానా విధించవచ్చు. ► ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వేర్వేరు విధివిధానాలున్నాయి. జాతి భద్రతకు సంబంధించిన అంశాల్లో సమాచార సేకరణపై మినహాయింపులున్నాయి. ► పౌరులు తమ డేటాను వాడుకున్నారని భావిస్తే నష్టపరిహారం కోసం కోర్టుకి ఎక్కొచ్చు. చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించాల్సి వచ్చిన ప్పుడు వారి లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ► ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో వాణిజ్య లావాదేవీల్లో అత్యంత కీలకం కానుంది. గతంలో ఏం జరిగింది? వ్యక్తిగత డేటా పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిబంధనల్నీ విధిస్తూ ఉంటే మన ప్రభుత్వం 2018 నుంచి ఈ చట్టంపై కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కోసం ఉద్దేశించిన శ్రీకృష్ణ కమిటీ 2018లో ఒక ముసాయిదా బిల్లు కేంద్రానికి సమర్పించింది. కానీ కేంద్రానికి, దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలకి మధ్య ఒక అంగీకారం రాలేదు. చివరికి 2019లో ఒక ముసాయిదా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో సమగ్రత లోపించిందని స్వయంగా జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొనడం కలకలం రేపింది. డేటా పరిరక్షణ బిల్లు నిబంధనల్ని అతిక్రమించే వారి జాబితా నుంచి ప్రభుత్వం తనని తాను మినహాయించుకోవడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ బిల్లులో 81 సవరణలు చేయాలంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించడంతో గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది. విదేశాల్లో వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ప్రపంచంలోని 71% దేశాల్లో వ్యక్తిగత సమాచారం భద్రతపై కఠినమైన చట్టాలే ఉన్నాయి. వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సులో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా 194 దేశాల్లోని 137 దేశాలు డేటా పరిరక్షణ కోసం చట్టాలు రూపొందించాయి. ► ఆఫ్రికా దేశాల్లో 54గాను 33 దేశాల్లో (61%) డేటా చట్టాలు అమల్లో ఉన్నాయి. ► ఆసియా దేశాల్లో ఇది ఇంకా తక్కువగా 57% మాత్రమే ఉంది. ► 60 దేశాలకు గాను 34 దేశాలు చట్టాలను రూపొందించాయి. ఇక వెనుకబడిన దేశాలు 46కి గాను 22 దేశాల్లో మాత్రమే చట్టాలున్నాయి. అంతర్జాతీయంగా ఈయూ మోడల్, యూఎస్ మోడల్ చట్టాలే అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఈయూ మోడల్లో వ్యక్తిగత సమాచార సేకరణ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. పౌరుల డేటా బయటకు వచ్చిందంటే ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తాయి. అత్యధిక దేశాలు ఈ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. ఇక అమెరికా మోడల్లో డేటా భద్రతని వ్యక్తుల స్వేచ్ఛ పరిరక్షణగా చూస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యక్తుల పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లవు. వ్యక్తుల డేటా అవసరమైన ప్రతీ సారి వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
సరికొత్త ‘డేటా’ పరిరక్షణ
ఇటు పౌరసమాజ కార్యకర్తలనూ, అటు దిగ్గజ సైబర్ సంస్థలనూ సమానంగా వణికించిన పాత డేటా పరిరక్షణ ముసాయిదా బిల్లు స్థానంలో సరికొత్త ముసాయిదా బిల్లు శుక్రవారం వెలువడింది. పాత బిల్లు ఉపసంహరించుకున్న మూణ్ణెల్లలోపులో దీన్ని తీసుకురావడాన్నిబట్టి డేటా పరిరక్షణ బిల్లు విషయంలో కేంద్రం ఎంత పట్టుదలగా ఉన్నదో వెల్లడవుతోంది. 2019లో రూపొంది పార్లమెంటులో ప్రవేశించిన ముసాయిదా బిల్లుపై అన్నివైపులా తీవ్ర విమర్శలు చెలరేగటంతో దాన్ని ఉపసంహరించక తప్పలేదు. సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచివుంటున్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకమవుతున్నది. లక్షల కోట్లకు పడగెత్తిన మెటా (ఫేస్బుక్), ట్విటర్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థల వరకూ పౌరుల డేటాతో ఆటలాడుకుంటున్నాయి. వారి వ్యక్తిగత గోప్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేసేలా ఇప్పటికే చాలా దేశాలు పకడ్బందీ చట్టాలు చేశాయి. ఆ చట్టాలను ఉల్లంఘించిన పక్షంలో భారీ జరిమానాలు విధిస్తున్నాయి. కానీ మన దేశం మాత్రం పుష్కరకాలంగా తాత్సారం చేస్తోంది. చట్టం తెస్తామనటమే తప్ప దాని ఆచూకీ లేదు. అందుకోసం జస్టిస్ బీఎస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2018లోనే ఒక ముసాయిదా బిల్లును కేంద్రానికి సమర్పించింది. చివరకు మరో ఏడాది కాలం తర్వాత దాని ఆధారంగా కేంద్రం ఒక ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే తమ బిల్లుకూ, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకూ పొంతనలేదని జస్టిస్ శ్రీకృష్ణ పెదవి విరిచారు. పార్లమెంటు లోపలా, వెలుపలా ఆ ముసాయిదాపై విస్తృతంగా చర్చ జరిగిన సందర్భంగా అందులో సమగ్రత గల్లంతయిందని అనేకులు విమర్శించారు. డేటా పరిరక్షణ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఏ చర్యలు తీసుకోవాలో అందులో ప్రతిపాదించారు. కానీ దీన్నుంచి ప్రభుత్వం తనను తాను మినహాయించుకోవటం అన్ని వర్గాలనూ దిగ్భ్రాంతిపరిచింది. అలాగే ఇక్కడ సేకరించే డేటా సరిహద్దులు దాటిపోరాదన్న నిబంధన అందులో ఉంది. ఈ నిబంధన సరికాదని మెటా, ట్విటర్వంటివి విమర్శించాయి. చివరకు ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుంది. ఏమైతేనేం...ఆ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఆ సంఘం బిల్లుకు మొత్తం 81 సవరణలు సూచించింది. ఈ నేపథ్యంలో ఆ బిల్లు ఉపసంహరణే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. చాలా సైబర్ సంస్థలు, ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసు సంస్థలు వినియోగదారుల డేటాను ఇష్టానుసారం సేకరిస్తున్నాయి. వీటిల్లో చేరాలంటే చాలా వివరాలు సమర్పించుకోవాల్సి వుంటుంది. ఖాతా తెరవాలన్న తొందరలో అత్యధికులు వెనకాముందూ చూడకుండా అడిగిన వివరాలన్నీ అందజేస్తున్నారు. ఈ వ్యక్తిగత డేటాను సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ వివ రాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి పోయి పౌరుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కావటం, వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లో పడటం రివాజైంది. ఇలాంటివి చోటుచేసు కున్నప్పుడు ఆ మాధ్యమాలు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాయి. పకడ్బందీ రక్షణ వ్యవస్థ లేనప్పుడు డేటా సేకరణ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆ సంగతలా ఉంచి పౌరుల డేటాను ప్రభుత్వం అడిగినప్పుడు ఏం చేయాలన్న ప్రశ్న ఉండనే ఉంది. పాత ముసాయి దాలో భద్రతా సంస్థలకు పూర్తిస్థాయి మినహాయింపునీయటం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుత ముసాయిదాలో సైతం అదే కొనసాగింది. జాతీయ భద్రత కీలకం గనుక అవాంఛనీయ శక్తుల కదలికపై నిఘా వేయటం, వారి కార్యకలాపాలను కనిపెట్టి ఉండటం అవసరం కావొచ్చు. కానీ ఆ మాటున నికార్సయిన అసమ్మతిని అణచాలని చూడటం, ఆ కృషిలో నిమగ్నమయ్యే వ్యక్తులనూ, సంస్థలనూ వేధించటం సరైంది కాదు. ప్రభుత్వాల విధానాలూ, చర్యలూ సరిగాలేవని భావించిన వారు శాంతియుత పద్ధతుల్లో నిరసించటం ప్రజాస్వామిక హక్కు. దీనికి భంగంవాటిల్లని రీతిలో భద్రతా సంస్థలు మెలిగితే ఎవరూ అభ్యంతరపెట్టరు. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడే సమస్య తలెత్తుతుంది. ఏ అధికారైనా హద్దుమీరిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెప్పాలి. తాజా ముసాయిదాలో డేటా పరిరక్షణ బోర్డు ఏర్పాటు ప్రతిపాదన భేషైనది. పౌరుల వ్యక్తిగత డేటాను పరిరక్షించటంలో విఫలమైన సంస్థలపై రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించే అధి కారం ఈ బోర్డుకుంది. అలాగే డేటా లీకయిందని తెలిసిన వెంటనే ఖాతాదార్లకు ఆ సంగతి చెప్పక పోతే రూ. 200 కోట్లవరకూ జరిమానా విధించొచ్చు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరాక సేకరించిన డేటాను సంస్థలు పూర్తిగా తొలగించాలన్న నిబంధన, వినియోగదారులు తమ డేటా తొలగించాలని కోరినా, సవరించాలని కోరినా సంస్థలు అంగీకరించాలన్న నిబంధన మంచిదే. తమ డేటా సేకరణ ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూసేందుకు సంస్థలు ఆడిటర్‌ను నియ మించుకోవాలన్న నిబంధన కూడా మంచిదే. అయితే భారత్‌లో సేకరించిన డేటాను ఇక్కడి సర్వర్ల లోనే భద్రపరచాలన్న అంశంలో ప్రభుత్వం రాజీపడింది. అందుకు బదులు ఏయే దేశాల్లో డేటా ఉంచవచ్చునో ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. తనకు అవసరమైనపక్షంలో డేటా తీసుకోవటం సాధ్య పడే దేశాల్లో సర్వర్లు ఉండొచ్చన్నది సర్కారు భావన. మొత్తానికి తాజా ముసాయిదాపై కూడా లోతైన చర్చ జరగాలి. అందుకు పౌరుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణే గీటురాయి కావాలి. ఇదీ చదవండి: సెలక్షన్ కమిటీ రద్దు.. కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన -
అధిక సంతానం ఉంటే అనర్హులే.. యూపీ నూతన చట్టం
లక్నో: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేరు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరు. ఉద్యోగాలు చేస్తున్నవారికి పదోన్నతి సైతం దక్కదు. ప్రభుత్వం నుంచి ఏ రకమైన రాయితీలూ పొందలేరు. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడమే లక్ష్యంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు ముసాయిదాలోని ముఖ్యాంశాలివీ. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల విధానాన్ని కఠినంగా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పాలసీని ఉల్లంఘిస్తే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందడం అసాధ్యమే. ఈ మేరకు ‘ఉత్తరప్రదేశ్ జనాభా(నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు–2021’లో భాగంగా యూపీ లా కమిషన్(యూపీఎస్ఎల్సీ) ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ఈ ముసాయిదాను మెరుగుపర్చేందుకు ప్రజల సలహాలు, సూచనలు, వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు లా కమిషన్ వెల్లడించింది. జూలై 19లోగా ప్రజలు స్పందించాలని కోరింది. ముసాయిదాలో ఏముందంటే.. ► జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర జనాభా నిధిని ఏర్పాటు చేస్తారు. ► ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం సర్వీసు కాలంలో అదనంగా 2 ఇంక్రిమెంట్లు అందుకోవచ్చు. 12 నెలల పూర్తి వేతనం, భత్యాలతో మాతృత్వ, పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రభుత్వ వాటాను 3 శాతం పెంచుతారు. ► అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెటర్నిటీ సెంటర్లు నెలకొల్పుతారు. ఇక్కడ గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు సరఫరా చేస్తారు. ► ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులపై ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ► గర్భధారణలు, ప్రసవాలు, జననాలు, మరణాలను కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ► జనాభా నియంత్రణను అన్ని సెకండరీ పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలి. ► పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వనరులు పరిమితంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆహారం, సురక్షిత తాగునీరు, సరైన ఆవాసం, నాణ్యమైన విద్య, విద్యుత్ వంటి వసతులతోపాటు జీవనోపాధి తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. పరిమిత వనరులతో అందరికీ అన్ని వసతులు అందుబాటులోకి తీసుకురావడం కష్టం. అందుకే జనాభా నియంత్రణ, స్థిరీకరణ చర్యలు చేపట్టాలి. రాజకీయ అజెండాతోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాభా నియంత్రణ బిల్లు ముసాయిదాను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని యూపీ కాంగ్రెస్ ప్రతినిధి అశోక్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి బిల్లును తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా ధ్వజమెత్తారు. దేశంలో దళితులు, గిరిజనుల కారణంగానే జనాభా పెరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహూమూద్ వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణ కోసం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా అది ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగానే భావించాలన్నారు. -
కువైట్‌లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర?
దుబాయ్: ఎడారి దేశం కువైట్‌లోని భారతీయులకు పెద్ద ముప్పు వచ్చిపడింది. దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. దీంతో సుమారు ఎనిమిది లక్షల మంది భారతీయులు తప్పనిసరిగా ఆ దేశం వదిలి రావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీయుల సంఖ్యను క్రమేపీ తగ్గించుకోవాలన్న కువైట్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు దేశ రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందని న్యాయ, చట్ట సంబంధిత కమిటీ నిర్ణయించడంతో త్వరలోనే అక్కడి భారతీయులు కువైట్‌ను వదిలి రావాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. కువైట్ జనాభా: 43 లక్షలు ఇందులో కువైటీలు: 13 లక్షలు భారతీయులు: 14.5 లక్షలు 2018లో కువైట్‌లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తం: 480 కోట్ల డాలర్లు విదేశీయులపై వ్యతిరేకత! ముసాయిదా బిల్లు ప్రకారం కువైట్ జనాభాలో భారతీయులు 15 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కువైట్ జనాభా దాదాపు 43 లక్షలు కాగా ఇందులో కువైటీలు 13 లక్షల మంది ఉన్నారు. భారతీయుల సంఖ్య 14.5 లక్షల వరకూ ఉంది. ముడిచమురు ధరలు భారీగా పతనం కావడం, కోవిడ్–19 కారణంగా ఆర్థిక వ్యవహారాలు మందగించిన నేపథ్యంలో దేశం మొత్తమ్మీద విదేశీయులపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కరోనా బారిన పడ్డవారిలో విదేశీయులు ఎక్కువగా ఉండటం, కిక్కిరిసిపోయిన వలసకూలీల ఆవాసాలు దీనికి కారణమని భావిస్తూండటం కూడా ఒక కారణమైంది. కువైట్ జనాభాలో ఎవరెంతమంది? కువైటీలు: 30.36% ఇతర అరబ్ దేశాల వారు:27.29 ఆసియావాసులు:40.42% ఆఫ్రికావాసులు: 1.02% యూరప్‌వాసులు: 0.39% ఇతరులు: 0.52% ప్రస్తుతం కువైట్ మొత్తమ్మీద సుమారు 49 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కూడా విదేశీయుల సంఖ్యను తగ్గించాల్సిందిగా కోరుతున్నారు. కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ గత నెలలో విదేశీయుల సంఖ్యను ప్రస్తుతమున్న 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిద్దామని ప్రతిపాదించినట్లు కథనాలు వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్ మర్జూక్ అల్ ఘనేమ్ కువైట్ టీవీతో మాట్లాడుతూ దశలవారీగా విదేశీయులను తగ్గించే అంశంపై ఒక కమిటీ అసెంబ్లీకి సమగ్రమైన ముసాయిదా బిల్లును సమర్పిస్తుందని తెలిపారు కూడా. విదేశాల నుంచి వచ్చిన వారిలో అధిక శాతం మంది నిరక్షరాస్యులు లేదా కేవలం చదవడం, రాయడం మాత్రమే తెలిసిన వారు ఉన్నారని, కువైటీలకు వారి అవసరమేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని నియమించుకుంటే ఫర్వాలేదు. కానీ వీసా వ్యాపారుల జిమ్మిక్కు కారణంగా నైపుణ్యం లేని కూలీల వలసలు దేశంలోకి ఎక్కువయ్యాయి’ అని అసెంబ్లీ స్పీకర్ మీడియాతో అన్నారు. సంబంధిత కమిటీలకు ముసాయిదా బిల్లు విదేశీయుల సంఖ్యపై కోటా అమలు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు సంబంధిత కమిటీలకు వెళ్లనుంది. దాని ప్రకారం దేశ జనాభాలో భారతీయులు 15 శాతం కంటే ఎక్కువ ఉండరాదు. ఫలితంగా సుమారు ఎనిమిది లక్షల మంది కువైట్ వీడాల్సి ఉంటుంది. కువైట్‌లో భారతీయ ఎంబసీ లెక్కల ప్రకారం సుమారు 28 వేల మంది భారతీయులు ఆ దేశ ప్రభుత్వంలో నర్సులు, ఇంజనీర్లు, చమురు కంపెనీల్లోనూ పనిచేస్తున్నారు. సుమారు 5.23 లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తూండగా వీరిపై ఆధారపడ్డ వారు 1.16 లక్షల మంది ఉన్నారు. ఇందులోనూ సుమారు 60 వేల మంది భారతీయ సంతతి విద్యార్థులు దేశంలోని 23 పాఠశాలల్లో చదువుకుంటున్నారు. -
కార్మికులకు సాంఘిక భద్రత ఎప్పుడు ?
న్యూఢిల్లీ : దేశంలో అనియత రంగంలో 46.60 కోట్ల మంది పని చేస్తుండగా, వారిలో కేవలం 9.3 శాతం మందికి మాత్రమే సాంఘిక భద్రత ఉంది. అంటే మిగతా 90.7 శాతం మందికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఉద్యోగులు, శాసనసభ్యులు, జడ్జీలకు ఉపాధికి గ్యారంటీ లేదు. అందుకనే లాక్డౌన్ సందర్భంగా లక్షలాది మంది వలస కార్మికులు ప్రభుత్వ హెచ్చరికలు ఖాతరు చేయకుండా సొంతూళ్లకు బయల్దేరారు. జీ-20 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అనియత రంగంలో పని చేస్తున్న కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోనే భారత్ అయిదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడడానికి కూడా అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఎంతో కారణం. (ఇకపై కరోనా లక్షణాల్లో ఇవి కూడా..) వీరందరికి సాంఘిక భద్రతను కల్పించేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రస్తుతం ఆ బిల్లుపై కేంద్ర కార్మిక శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ చర్చిస్తోంది. రానున్న 20 ఏళ్లలో దేశంలోని ప్రతి పౌరుడికి సాంఘిక భద్రతను కల్పించే దిశగా ఈ ముసాయిదా బిల్లు ఉండాలి. అయితే అలాంటి లక్ష్యమేదీ బిల్లుకు ఉన్నట్లు లేదు. 1923 నుంచి 2008 మధ్య తీసుకొచ్చిన ప్రజల సాంఘిక భద్రతకు సంబంధించిన చట్టాలను ఒకే బిల్లు చేయబోతున్నారు. అందులో ఎనిమిది బిల్లులు 20వ శతాబ్దం తర్వాత వచ్చినవే. (యువత అభిరుచులపై సర్వే ) రానున్న రెండు దశాబ్దాల్లోగా భారత్‌లోని జనాభాలో దాదాపు 15 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారే ఉంటారు. వారిలో ఎంతో మంది ఉద్యోగం చేయాలనుకోవచ్చు. అలాంటప్పుడు సాంఘిక భద్రత కింద వారందరి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అవుతుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఓ నిధి గురించి కొత్త కోడ్‌లో ప్రస్తావించారు తప్పా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు లేవు. కొత్త బిల్లులో కాంట్రాక్టు కార్మికుల ఊసే లేకపోవడం అన్యాయమని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కంపెనీ యజమానులకు దళారి కాంట్రాక్టరు కార్మికులను సరఫరా చేస్తారు. వారిని కాంట్రాక్టర్ లేదా కంపెనీ యజమాని మోసం చేయడం తరచూ జరుగుతోంది. అలా జరగకుండా తగిన చర్యలను బిల్లులో ప్రతిపాదించాల్సిన అవసరం ఉందని కార్మిక నేతలు అభిప్రాయపడుతున్నారు. (తప్పు చేసినవారే తప్పించుకునే యత్నం.. ) -
ఆ ప్రకటనలపై కొరడా.. భారీ జరిమానా, జైలు
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యాలు, అభూత కల్పనలతో వ్యాపార ప్రకటనలు గుప్పించే వారిపై ఇకపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. కొన్ని రకాల రుగ్మతలు, వ్యాధులకు మేజిక్ రెమిడీల పేరుతో ప్రకటనల ద్వారా వినియోగదారులను మభ్యపెట్టాలని చూస్తే ఇకపై భారీ జరిమానా, కఠిన శిక్షలు అమలు చేసేందుకు యోచిస్తోంది. ఈ మేరకు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల చట్టం, 1954)కు ముసాయిదా సవరణను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల మేరకు నిబంధనలను ఉల్లఘించిన సదరు సంస్థలకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించనుంది. ఈ జాబితాలో 78 రకాల వ్యాధులను చేర్చింది. వీటిపై ప్రకటనలను నిషేధించనుంది. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి నివారణ, శరీరం, ముఖం రంగును మార్చే క్రీములు (ఫెయిర్ నెస్,స్కిన్ టోన్) లైంగిక సామర్థ్యం మెరుగుదల, యాంటీ ఏజింగ్ క్రీమ్, అకాల వృద్ధాప్యం, మహిళల్లో వంధ్యత్వం, జుట్టు తెలబడటం లాంటివి ముసాయిదా సవరణ చట్టంలో చేర్చింది. ఈ రుగ్మతలకు సంబంధించిన ఉత్పత్తులు, షరతులు ఏవైనా నయం చేసే మందులు, ‘మేజిక్ రెమెడీస్’ లాంటివి ప్రచారం చేయరాదని చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం, మొదటి ఆరోపణ రుజువైతే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10 లక్షల వరకు జరిమానా లేదా రెండూ శిక్షార్హమైనవి. తదుపరి నేరారోపణకు, రూ.50 లక్షల వరకు జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ సవరణ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ప్రజల నుండి, వాటాదారుల నుండి సూచనలు, సలహాలు అభ్యంతరాలను కోరాలని అధికారులు నిర్ణయించారు. ఈ నోటీసు జారీ చేసిన తేదీ నుండి 45 రోజులలోపు వాటిని అందించాల్సి వుంటుంది. -
డాక్టర్‌పై చేయిచేసుకుంటే పదేళ్ల జైలు!
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య నిపుణులపై దాడి చేసే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలు కల్పించే ముసాయిదా బిల్లును రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. వైద్యులు, వైద్యసేవా నిపుణులను తీవ్రంగా గాయపరిచిన వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా, అదేవిధంగా, ఆస్పత్రిపై దాడి చేసి నష్టం కలిగించిన వారికి ఆరు నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.50వేల నుంచి 5లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచామన్నారు. త్వరలోనే దీనిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు. దీని తర్వాత బిల్లును కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళుతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా జూన్‌లో దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. -
కౌలు రైతుల కష్టాలు గట్టెక్కినట్లే
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : కౌలు రైతులకు అన్ని రకాల సాయం అందేందుకు వీలుగా రాష్ట్ర మంత్రివర్గం ముసాయిదా బిల్లు ఆమోదించడంతో ఇక కౌలు రైతుల కష్టాలు తీరినట్లేనని చెప్పవచ్చు. తాము అధికారంలోకి వస్తే కౌలు దారుల రక్షణకు చట్టబద్దమైన భరోసా కల్పిస్తామని వైఎస్సార్ సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగా ప్రస్తుత చట్టానికి సవరణలు తీసుకొస్తున్నారు. దీంతో పలు ప్రభుత్వ రాయితీలు తమకు దక్కనుండడంతో జిల్లాలోని కౌలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆధీకృత రైతుల చట్టం–2011తీసుకొచ్చారు. అయితే ఈ చట్టంలో ఉన్న అనేక లొసుగుల కారణంగా అమలులో ఆశించిన ఫలితాలు సాధ్యం కాలేదు. ప్రధానంగా భూమిని కౌలుకు ఇస్తున్నట్లు యజమానులు రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించలేదు. యజమాని మౌఖిక అంగీకారంతో రెవెన్యూ గ్రామ సభల ద్వారా కౌలుదారులను గుర్తించి రుణ అర్హతకార్డులు (ఎల్‌ఈసీలు) పంపిణీ చేస్తున్నారు. ఎల్ఈసీ కాలపరిమితి జూన్ 1 నుంచి మే 31వ తేది వరకు ఉంటుంది. కౌలుదారులు భూమిపై హక్కును క్లెయిమ్ చేసుకోవడానికి లేదా సమర్పించుకోవడానికి రుణ అర్హత కార్డు సాక్ష్యంగా ఉపయోగించరాదని చట్టంలో పొందుపరిచారు. అలాగే అడంగల్‌లో అనుభవం దారునిగా కూడా కౌలుదారు పేరును నమోదు చేయరు. కౌలుదారులకు ఎల్‌ఈసీల ద్వారా ఇచ్చే రుణం కేవలం పంటపై మాత్రమేనని, భూమిపై కాదని ప్రభుత్వం ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొంది. భూ యజమానులకు ఇన్ని రక్షణలు కల్పించినప్పటికీ కౌలుదారుల కంటే ముందే బ్యాంకులకు వెళ్లి పంట రుణాలు పొందుతున్నారు. ఇందువల్ల కౌలుదారులకు పంట రుణాలు, బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ తదితర ప్రభుత్వ రాయితీలు అందకుండా పోయాయి. జిల్లాలో సుమారు లక్ష మంది వరకు కౌలు రైతులు ఉంటారని అనధికార అంచనాలు చెబుతున్నాయి. అయితే ఏనాడూ రెవెన్యూ గ్రామసభల ద్వారా 15 వేలకు మించి కౌలు రైతులను గుర్తించలేదు. కౌలు రైతులకు ఇచ్చిన ఎల్‌ఈసీలు, వారికి అందిన పంట రుణాల గణాంకాలను పరిశీలిస్తే ఈ చట్టం ఎంత అధ్వాన్నంగా అమలు జరుగుతుందో అర్థమవుతుంది. గత సంవత్సరం సుమారు 12 వేల మందికి రుణ అర్హత కార్డులు మంజూరు చేయగా, అందులో 883 మందికి వివిధ బ్యాంకుల ద్వారా 10.17 కోట్ల రూపాయల పంట రుణాలు అందాయి. ఈ సంవత్సరం జూన్ ఆఖరు వరకు 322 మంది కౌలు రైతులకు 2.93 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇచ్చారు. 2011లో ఏపీ ఆధీకృత రైతుల చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాక జిల్లాలో సుమారు 15 వేల మంది రైతులకు పంట రుణాలు అందాయని బ్యాంకర్లే స్పష్టం చేస్తున్నారు. ఇక ఏటా పెట్టుబడి సాయం... రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ముసాయిదా బిల్లు చట్ట రూపం దాలిస్తే కౌలు రైతులు 11 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా భూ యజమానులతో సాగు ఒప్పంద పత్రాలు రాసుకునేందుకు వీలుంటుంది. ఇందువల్ల కౌలు రైతులకు అనేక ప్రభుత్వ రాయితీలు అందనున్నాయి. ఒప్పంద పత్రాలు కలిగిన కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం యేటా అందించే రూ. 12,500 పెట్టుబడి సాయం అందుతుంది. దీంతోపాటు ఉచిత పంటల బీమా, పంట రుణం, ఇన్‌ఫుట్‌సబ్సిడీ తదితర రాయితీలన్నీ దక్కనున్నాయి. -
టెండర్లకు ‘న్యాయ’ పరీక్ష
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టెండర్ల ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదే వేదికపై ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త చట్టాన్ని తెచ్చేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ(కేబినెట్) సమావేశంలో ముందడుగు పడింది. టెండర్ల విధానంలో పారదర్శకత, ప్రజాధనం ఆదాకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలు, పక్షపాతం, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా కొత్తగా ‘ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం–2019’ ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఆమోదించారు. అవినీతిపై జరుగుతున్న పోరాటంలో ఈ చట్టం ఒక గొప్ప అడుగు అని మంత్రివర్గం అభివర్ణించింది. ముసాయిదా బిల్లులోని ప్రధాన అంశాలు.. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ సంబంధిత టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్లను పరిశీలన చేయించనున్నారు. జడ్జి పరిశీలన అనంతరమే మార్పులు, చేర్పులతో టెండర్ల ప్రతిపాదనలను ఖరారు చేస్తూ ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు వీలుగా ముసాయిదా బిల్లులో ప్రొవిజన్స్ ప్రతిపాదించారు. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యాలుగా ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేశారు. రూ.100 కోట్లకు పైగా విలువైన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి పరిధిలోకి తీసుకొస్తున్నారు. పనిని ప్రతిపాదిస్తున్న ప్రతి శాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే. టెండర్లను పిలవడానికి ముందే అన్ని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), జాయింట్ వెంచర్లు(జేవీ), స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) సహా ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రాజెక్టులపైనా న్యాయమూర్తి పరిశీలన చేయనున్నారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే జడ్జి పరిధిలోకి రావాల్సిందే. జడ్జికి సహాయంగా నిపుణులను ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, తనకు అవసరమైన నిపుణులను జడ్జి కోరవచ్చు. పనుల ప్రతిపాదనలను వారం రోజుల పాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. అనంతరం 8 రోజుల పాటు జడ్జి పరిశీలన చేస్తారు. జడ్జికి సూచనలు, సలహాలు అందిస్తున్న వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తుంది. న్యాయమూర్తి సిఫార్సులను సంబంధిత శాఖలు కచ్చితంగా పాటించాలి. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనలను ఖరారు చేయాలి. ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లాలి. ఎవరికీ అనుచిత లబ్ధి చేకూర్చకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని టెండర్ల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం జడ్జికి కల్పించారు. న్యాయమూర్తి, న్యాయమూర్తి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్ సర్వెంట్లుగా భావిస్తారు. దీనివల్ల వారికి రక్షణ ఉంటుందని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీఈడీబీ చట్టం రద్దు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) చట్టాన్ని రద్దు చేస్తూ, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ‘ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ చట్టం–2019’ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, పర్యవేక్షణ, ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనలే లక్ష్యాలుగా కొత్త చట్టం ఉండనుంది. కొత్త చట్టంలో భాగంగా సలహా మండలి చైర్మన్‌గా ముఖ్యమంత్రి, మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్ సెక్రటరీ తదితరులుంటారు. అలాగే ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహా మండలి ఉండనుంది. ఇందులో ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక నిపుణులు ఉంటారు. ప్రధాన కార్యాలయం విజయవాడలో, మరో కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, శిక్షణ ఇవ్వనున్నారు. -
త్వరలో అద్దె చట్టం
న్యూఢిల్లీ: దేశంలో భవనాలు, స్థలాలను అద్దెకు ఇవ్వడానికి సంబంధించి పలు నిబంధనలను రూపొందిస్తూ ‘అద్దె చట్టం’ తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఆగస్టు 1లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. స్థల/భవన యజమానులతోపాటు అద్దెకు ఉండేవారు నష్టపోకుండా ఉండటం కోసం కేంద్రం పలు నిబంధనలను ఈ బిల్లులో ప్రతిపాదించింది. బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు.. ► అద్దె పెంచాలంటే 3నెలల ముందే ఆ విషయాన్ని కిరాయిదారుకు యజమాని రాతపూర్వకంగా తెలియజెప్పాలి. ► అద్దెకు భవనం/స్థలం తీసుకున్నవారు ముందుగా ఒప్పందం చేసుకున్న కాలం కంటే ఎక్కువ రోజులు అక్కడ ఉంటూ, సమయానికి ఖాళీ చేయకపోతే 2–4 రెట్లు అధిక అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ► అడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ కింద యజమానులు వసూలు చేసే డబ్బు రెండు నెలల అద్దె కంటే ఎక్కువ ఉండకూడదు. ► ఇంట్లో ఏదైనా రిపేర్లు చేయించాల్సి వచ్చి, ఆ విషయాన్ని యజమాని పట్టించుకోకపోతే అద్దెకు ఉంటున్నవారు ఆ రిపేర్లు చేయించి, అందుకు అయిన వ్యయాన్ని అద్దెలో మినహాయించుకోవచ్చు. ఆ రిపేర్లు అద్దెకు ఉంటున్న వారే చేయించాల్సినవి అయినప్పటికీ వారు పట్టించుకోకపోతే, యజమాని ఆ పనిని చేపించి, అందుకు అయిన వ్యయాన్ని అడ్వాన్సు/సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకోవచ్చు. ► యజమానులు, కిరాయిదారుల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా అద్దె వ్యవహారాల విభాగం ఏర్పాటు ► అద్దె ఒప్పందం కుదుర్చుకున్న రెండు నెలల్లోపు యజయాని, అద్దెకు వచ్చిన వారు.. ఇద్దరూ వెళ్లి అద్దె ఒప్పంద పత్రాన్ని జిల్లా అద్దె వ్యవహారాల విభాగానికి సమర్పించాలి. ఈ విభాగానికి అద్దెను నిర్ణయించడం, సవరించడం వంటి అధికారాలు కూడా ఉంటాయి. ఢిల్లీలో నకిలీ దరఖాస్తులపై ఎఫ్ఐఆర్ ప్రధాన మంత్రి (పట్టణ) ఇళ్ల పథకం కోసమంటూ నకిలీ దరఖాస్తులను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదైంది. ఇళ్ల నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. -
పౌరసత్వ బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ/ గువాహటి: కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ ముసాయిదా బిల్లు–2018కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మిత్రపక్షం అస్సాం గణపరిషత్(ఏజీపీ) సహా ఈశాన్య రాష్ట్రాల్లోని పలు విద్యార్థి సంఘాలు, నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కేంద్రం ముందుకు వెళ్లేందుకే నిర్ణయించింది. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 2016లో తొలిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ) ప్రభుత్వం అప్పట్లో నియమించింది. అస్సాం, మేఘాలయలతో పాటు గుజరాత్, రాజస్తాన్‌లో పర్యటించిన ఈ కమిటీ.. ప్రజలు, నేతలు, నిపుణులు, వేర్వేరు సంఘాల అభిప్రాయాన్ని సేకరించింది. అలాగే అస్సాం, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు డీజీపీలతో చర్చించింది. ఈ నివేదికను సోమవారం కమిటీ లోక్‌సభకు సమర్పించగా, కొన్ని గంటల్లోనే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో హిందువులు మైనారిటీలవుతారు పౌరసత్వ బిల్లుపై అస్సాం మంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని తీసుకురాకుంటే రాబోయే ఐదేళ్లలో అస్సాంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతారని హెచ్చరించారు. అలా జరిగితే అస్సాం మరో కశ్మీర్‌గా మార్చాలనుకుంటున్న శక్తులకు లాభం చేకూరుతుందన్నారు. ఇది జిన్నా వారసత్వానికి, భారత వారసత్వానికి యుద్ధమని ఆయన తెలిపారు. మరోవైపు, ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించబోదని అస్సాం సీఎం సోనోవాల్ చెప్పారు. మద్దతు ఉపసంహరించుకున్న ఏజీపీ కేబినెట్ పౌరసత్వ ముసాయిదా (సవరణ) బిల్లు–2018ను ఆమోదించడంతో అస్సాంలో బీజేపీ ప్రభుత్వానికి తమ 14 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మితప్రక్షం అస్సాం గణపరిషత్(ఏజీపీ) ప్రకటించింది. ఈ విషయమై ఏజీపీ అధ్యక్షుడు, అస్సాం మంత్రి అతుల్ బోరా మాట్లాడుతూ.. ‘ఈ బిల్లును ప్రవేశపెట్టకుండా ఆపేందుకు చివరి ప్రయత్నంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశాం. దీనివల్ల అస్సాం ఒప్పందం, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) ప్రక్రియ నిర్వీర్యం అవుతాయని వివరించాం. మేం ఎన్డీయే కూటమిలో చేరినప్పుడు అక్రమ వలసదారుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ బీజేపీ ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విచారిస్తున్నాం’ అని తెలిపారు. ఏజీపీ మద్దతు ఉపసంహరణతో అస్సాంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చిన ఇబ్బందేమీ లేదు. మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం 74 మంది సభ్యుల బలముంది. 61 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్(12), ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తున్నారు. కాగా, పౌరసత్వ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో అస్సాం అంతటా ఆందోళనలు మొదలయ్యాయి. పౌరసంఘాలు, అల్ఫాతో కాంగ్రెస్, సీపీఐ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్లమెంటుతోపాటు అస్సాం భవన్ ముందు ఏఏఎస్‌యూ, కేఎంఎస్ఎస్ సభ్యులు నగ్నంగా నిరసన తెలిపారు. ముసాయిదా బిల్లులో ఏముందంటే.. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన మైనారిటీలు అంటే.. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్దులకు పౌరసత్వం కల్పిస్తారు. సరైన పత్రాలు లేకపోయినా వీరు కనీసం ఆరేళ్ల పాటు భారత్‌లో నివాసముంటే పౌరసత్వం ఇస్తారు. ఇందుకోసం పౌరసత్వ చట్టం–1955ను సవరించాల్సి ఉంటుంది. అయితే దీనిపై అస్సాం, మేఘాలయ, మిజోరం సహా ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 1971, మార్చి 24 తర్వాత రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను మతాలతో సంబంధం లేకుండా బయటకు పంపాలని అస్సాం ఒప్పందం–1985 చెబుతోంది. తాజాగా ఈ పౌరసత్వ ముసాయిదా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే అస్సాం ఒప్పందం నిర్వీర్యమై పోతుందని అక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం ప్రకటించాయి. లౌకిక దేశంలో మతాల ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వడం రా జ్యాంగ విరుద్ధమన్నాయి. కాగా, ఈ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని ఎన్డీయే మిత్రపక్షాలైన శివసేన, జేడీయూ ప్రకటిం చాయి. ఈ మూడు దేశాల నుంచి భారత్‌ను ఆశ్రయించే మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. కటాఫ్.. 2014, డిసెంబర్ 31 బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లో వివక్షకు గురై భారత్‌ను ఆశ్రయించిన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయమని సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదికలో తెలిపింది. బీజేపీ ఎంపీ రాజేంద్ర అగ్రవాల్ అధ్యక్షతన ఏర్పాటైన జేపీసీ తన 440 పేజీల నివేదికలో ‘వలసదారులకు అధికారికంగా పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం 2014, డిసెంబర్ 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం వీలవుతుంది. అంతేకాకుం డా వలసదారుల ముసుగులో పొరుగుదేశాలు పన్నే కుట్రలను తిప్పికొట్టవచ్చు’ అని తెలిపింది. పలువురు అడ్డుచెప్పిన ప్పటికీ చివరికి మెజారిటీ ఓటుతో నివేదికకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. -
సోషల్ మీడియాకు సంకెళ్లు
గత ఏడాది ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో షికార్లు చేసిన పుకార్లు.. దేశంలో పలుచోట్ల అల్లర్లు, మూక హత్యలకు అసలు కారణంగా నిలిచాయి. దీంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పుకార్లను కట్టడిచేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదిలింది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా ఐటీ చట్టాన్ని సవరిస్తోంది. భారీగా జరిమానాలు వేసి అసత్యవార్తలు, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేసే మాధ్యమాలను నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలకు భారత్‌లో ఖాతాదారులు చాలా ఎక్కువ. గత ఏడాది అనుభవాలతో ఇవి కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఫేక్ న్యూస్‌పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ, హెచ్చరిస్తూ భారీస్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. అసభ్య, అసత్య సందేశాలు, సమాచారం పంపకుండా ఖాతాదారులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాయి. కేంద్రం హెచ్చరికలు ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవి శంకర్ ఫేస్బుక్, వాట్సాప్‌లను హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తమ మాధ్యమం ద్వారా అనైతిక సమాచారం వ్యాప్తి కాకుండా ఫేస్బుక్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఎన్నికల ప్రకటనలు పోస్టుచేసే వారు వారి వివరాలు, ఎక్కడ నుంచి పోస్టు చేస్తున్నారనేవి విధిగా వెల్లడించాల్సిందే. 15 కోట్ల వరకు జరిమానా వదంతులు, అశ్లీల సమాచారాన్ని, దృశ్యాలను నియం త్రించడంలో విఫలమైన వెబ్సైట్లు, యాప్‌లపై భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ‘ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ పేరుతో ముసాయిదాను ఖరారు చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా, ఇంటర్నెట్ సంస్థల అధిపతులతో ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, వాటి జవాబుదారీతనాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. ‘అసత్య, అశ్లీల సమాచా రం సోషల్ మీడియాలోకి ఎక్కడ నుంచి వస్తోందో గుర్తించాలి, దాన్ని తొలగించాలి. ఈ దిశగా ప్రభుత్వం చట్టాన్ని సవరించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి’ అని ఓ ఉన్నతాధికారి అన్నారు. నిబంధలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ. 15 కోట్లు లేదా వాటి ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 4శాతం ఈ రెండింటిలో ఏది ఎక్కువయితే దాన్ని జరిమానాగా విధించాలని ప్రతిపాదించారు. -
టీచర్లపై కొత్త నిబంధనల కత్తి!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏ ఇతర ప్రభుత్వ శాఖల్లో లేని నిబంధనలను ప్రవేశపెడుతూ ప్రత్యేక చట్టాలు చేయడంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పరిపాలనా (టీచర్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్), ఉపాధ్యాయ బదిలీ (టీచర్ ట్రాన్సఫర్ యాక్ట్)లకు వేర్వేరుగా ప్రత్యేక చట్టాలను తెస్తుండడంపై టీచర్లు రగిలిపోతున్నారు. ఈ రెండు చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ ఇటీవల వెబ్సైట్లో పెట్టి టీచర్ల అభిప్రాయాలను కోరింది. ఈ చట్టాలపై కోర్టులు సైతం జోక్యం చేసుకోవడానికి వీల్లేని నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగు మాటున తెస్తున్న ఈ చట్టాలు సర్కారు బడుల్లో పనిచేస్తున్న1.80 లక్షల మంది టీచర్ల పాలిట శాపంగా మారనున్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. పాఠశాలల నిర్వహణ, టీచర్లకు సంబంధించి చట్టా్టలు, జీఓలు అనేకమున్నాయని.. వాటిని సమర్ధంగా అమలుచేస్తే చాలని, ఈ కొత్త చట్టాలు తేవడం వెనుక ప్రభుత్వ ఆంతర్యం వేరేగా ఉన్నట్లు స్పష్టమవుతోందని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉపాధ్యాయ పరిపాలనా బిల్లు కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో టీచర్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి వారి పనితీరును అంచనా వేసేలా అనేక ప్రమాణాలు నిర్దేశిస్తున్నారు. - బయోమెట్రిక్ అటెండెన్సు, సమ్మేటివ్ పరీక్షల్లో విద్యార్థుల ప్రమాణాల మెరుగుకు చర్యలు, జాతీయ, రాష్ట్రీయ అవార్డులు గెల్చుకోవడం, విధులు నిర్వహిస్తూనే ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పనిచేయడం వంటివి ఇందులో పొందుపర్చారు. - విద్యార్థులను పై తరగతులకు తగిన సామర్థ్యాలతో వెళ్లేలా చేయడం, చేరికలు పెంచడం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులతో సహ విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ప్రభుత్వానికి సమర్పించడం, పాఠశాల యాజమాన్య కమిటీల సమావేశాల నిర్వహణ, టెన్త్‌లో విద్యార్థుల ప్రమాణాల పెంపు, పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. - వీటిని అనుసరించి ఇన్సెంటివ్‌లను ఆయా ఉపాధ్యాయులకు మంజూరు చేయనున్నారు. ఇన్సెంటివ్ స్కీముకు సంబంధించి టీచర్లకు వ్యక్తిగత పనితీరుకు 70 పాయింట్లు, సంస్థాగత పనితీరుకు 30 పాయింట్లు ఇస్తారు. - ఉపాధ్యాయులు తప్పుడు మార్గాలు అనుసరిస్తే వారిని సర్వీసు నుంచి తప్పించే అధికారం విద్యాశాఖకు ఉంటుంది. దీనిపై కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని నిబంధనలు పెట్టారు. బదిలీల్లోనూ అనేక నిబంధనలు ఇక టీచర్ల బదిలీలకు సంబంధించి అనేక నిబంధనలను ప్రభుత్వం బదిలీల చట్టంలో పెడుతోంది. ఇతర శాఖలకు లేని అనేక షరతులు, నిబంధనలు ఇందులో ఉన్నాయి. - ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని టీచర్ల బదిలీల ప్రక్రియను ఒక క్రమపద్ధతిలో చేపట్టేందుకు వీలుగా ఈ చట్టాన్ని తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. - కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామాల్లో స్కూళ్లను 4 విభాగాలుగా విభజిస్తున్నారు. - హెచ్ఆర్ఎ, ప్రయాణ సదుపాయం, టీచర్, విద్యార్థుల నిష్పత్తి తదితరాలను అనుసరించి ఈ బదిలీల నిబంధనలు రూపొందించారు. - ఈ చట్టం ప్రకారం కొత్తగా నియమితులైన టీచర్లు, గతంలో గ్రామీణ ప్రాంతంలో చేయని వారికి నాలుగు, మూడు కేటగిరీల స్కూళ్లలో నియామక, బదిలీలు ఉంటాయి. - కొత్త టీచర్లు.. ఐదేళ్లలోపు సర్వీసులోని వారు నియమితులైన గ్రామీణ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి బదిలీకి అవకాశం కల్పించరు. - భార్యాభర్తల విషయంలో.. వారు పనిచేస్తున్న సమీప ప్రాంత స్కూల్లో ఖాళీలను అనుసరించి బదిలీకి అవకాశమిస్తారు. - కొత్త చట్టంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లకు టీచర్లు అందుబాటులో ఉండేలా ప్రాధాన్యమిస్తారు. - డీఎస్సీ ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లను గ్రామీణ ప్రాంత స్కూళ్లలోని ఖాళీల్లోనే తొలుత నియమిస్తారు. ఇది తప్పనిసరి చేస్తున్నారు. - ఎవరైనా క్రిమినల్ ఛార్జెస్, పెనాల్టీలను ఎదుర్కొంటున్నట్లయితే వారు నిర్ణీత సర్వీసు పూర్తికాకపోయినా వారిని తప్పనిసరిగా 4వ కేటగిరీకి బదిలీ చేస్తారు. - టీచర్లకు రొటేషన్ పద్ధతిలో బదిలీలకు ఈ చట్టంలో అవకాశం కల్పిస్తున్నారు. - బదిలీ కౌన్సెలింగ్ సందర్భంలో తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలు ఇచ్చే వారికి క్రమశిక్షణ చర్యలు.. ఇతర పెనాల్టీలు విధించేలా చట్టంలో నిబంధనలు పెడుతున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లేందుకు ఆస్కారం ఉండదు. ‘సుప్రీం’ తీర్పూ బేఖాతరు ఇదిలా ఉంటే.. విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం కూడా లేకుండా ఉపాధ్యాయులకు అనేక ఇతర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్దేశిస్తోందని, ఇక ముఖ్యులు వచ్చినప్పుడు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో టీచర్లను విద్యార్థులను ఆయా కార్యక్రమాలకు తరలిస్తున్నారని సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం టీచర్లకు ఒక్క ఎన్నికల సంఘ కార్యక్రమాల్లో మినహాయించి బోధనేతర కార్యక్రమాల్లో నియమించరాదని తీర్పులు ఇచ్చినా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు బోధన చేసే సమయం ఉండడంలేదని పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో ప్రమాణాలు సాధించడానికి ఆస్కారం ఎక్కడుంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, స్థానిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఇతరత్రా కారణాలవల్ల విద్యార్థులు సరైన ప్రమాణాలు సాధించలేకపోతే అందుకు టీచర్లను బాధ్యులను చేసేలా చట్టం తేవడం సరికాదంటున్నారు. చట్టాలపై ఉన్న దృష్టి చదువుపై లేదు ప్రస్తుత చట్టాల్లో అనేక నిబంధనలున్నాయి, వాటిని సమర్థంగా అమలుచేయించి విద్యార్థులకు మెరుగైన బోధన సాగించాల్సి ఉన్నా ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి కొత్త చట్టాలు తేవడం విచిత్రంగా ఉంది. పైగా ఏ శాఖలో లేని నిబంధనలు టీచర్లకే పెట్టడమేమిటి? టీచర్లపై బోధనేతర కార్యక్రమాలను రుద్దుతున్నారు. అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు.. వీటిని సరిచేయకుండా కొత్త చట్టాలెందుకు? – వి. బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ పోలవరం ప్రాజెక్టుపై టీచర్లు ప్రచారమా? ఇటీవల పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిస్తే ఆ పనులు టీచర్లకు అప్పగించారు. దానిపై విమర్శలు రావడంతో ఉపసంహరించుకున్నారు. ఇంతకన్నా దారుణమేమంటే పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు టీచర్లకు సంబంధం ఏమిటి? కోర్టుల జోక్యానికీ తావులేని రీతిలో నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్య హక్కులను హరించడం అన్యాయం. – బాబురెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనితీరు పాయింట్ల నిబంధనలు సరికాదు పాఠశాలల్లోని ప్రమాణాలకు అనేక స్థితిగతులు కారణమవుతాయి. ఈ పరిస్థితిలో టీచర్ల పనితీరును అంచనా వేసి పాయింట్లు ఎలా కేటాయిస్తారు? బోధనేతర సిబ్బంది ఏ పాఠశాలలో కూడా లేరని.. వారి పనులనూ టీచర్లకే అప్పగిస్తున్నారు. పైగా అలాంటి పనులకు పాయింట్లు అంటూ టీచర్లకు ప్రత్యేక చట్టాల ద్వారా నిబంధనలు పెట్టడం సరికాదు. – ఎస్. సింహాచలం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
రేప్‌కు మరణదండన!
న్యూఢిల్లీ: 12 ఏళ్ల లోపున్న బాలికలపై అత్యాచారం చేసిన కేసులో దోషులకు మరణశిక్ష ప్రతిపాదిస్తూ బిల్లును కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రధాని నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తాజా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఆర్డినెన్స్ రద్దవుతుంది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు.. ► 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారిపై రేప్‌కు పాల్పడి దోషిగా తేలితే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష(జీవితఖైదుగా పొడిగించొచ్చు) లేదా మరణ దండన విధిస్తారు. సామూహిక అత్యాచారం చేస్తే జీవితఖైదు లేదా ఉరిశిక్ష వేస్తారు. ► మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టేవారికి కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఈ శిక్షను జీవితఖైదుగా పొడిగించే వెసులుబాటు కల్పించారు. ► 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికలపై రేప్‌కు పాల్పడితే కనీస జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. దీన్ని కూడా జీవితఖైదుగా మార్చొచ్చు. ► అత్యాచారాలకు సంబంధించిన అన్ని కేసుల విచారణను 2 నెలల్లో పూర్తిచేయాలి. ► అప్పీళ్లను 6 నెలల్లోగా పరిష్కరించాలి. ► 16 ఏళ్ల లోపున్న బాలికపై రేప్, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులకు ముందస్తు బెయిల్ జారీ చేయడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ► ఒకవేళ వారికి బెయిల్ మంజూరీపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, 15 రోజుల ముందే బాధితురాలి తరఫు లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ► ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు ఆమోదం. ► చెరకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.20 పెంపు. దీంతో అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నుంచి మిల్లులు రైతులకు క్వింటాలు చెరకుకు కనీసం రూ.275 చెల్లించాలి. ► జైలులో శిక్ష అనుభవిస్తున్న వృద్ధ ఖైదీలకు కేంద్రం క్షమాబిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. శిక్షను కనీసం సగం పూర్తిచేసుకున్న 55 ఏళ్లకు పైబడిన మహిళలు, 60 ఏళ్లకు పైబడిన పురుషులను మూడు విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ అక్టోబర్ 2, వచ్చే ఏడాది ఏప్రిల్ 10, వచ్చే ఏడాది అక్టోబర్ 2న దఫాల్లో వారికి విముక్తి కలిగించనున్నారు. అయితే వరకట్న హత్యలు, అత్యాచారాలు, మనుషుల అక్రమ రవాణా, పోటా, టాడా, ఫెమా లాంటి తీవ్ర నేరాల్లోని దోషులకు ఈ పథకం వర్తించదు. ► మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలైన విదర్భ, మరాఠ్వాడాల్లో 81 సాగునీటి ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్ల సాయానికి అనుమతి. ► మైనారిటీ విద్యార్థులకు ప్రిమెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలను 2020 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఇందుకోసం రూ.5 వేల కోట్లకు వ్యయం కానుంది. -
క్యూబాలో సొంత ఆస్తిహక్కు!
హవానా: కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు త్వరలో సాకారం కాబోతోంది. ఇందుకు సంబంధించి సవరించిన రాజ్యాంగ బిల్లు వారం రోజుల్లో జాతీయ అసెంబ్లీ ముందుకు రానుంది. 1976లో ఫిడెల్ క్యాస్ట్రో అధ్యక్షతన ఏర్పాటైన సోషలిస్టు రాజ్యాంగం సొంత ఆస్తిహక్కుకి పూర్తిగా వ్యతిరేకం. పాత రాజ్యాంగంలో ఉన్న 137 ఆర్టికల్స్‌కు అదనంగా మరో 224 ఆర్టికల్స్‌ను కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని ముసాయిదాలో ప్రతిపాదించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ బిల్లు సభలో ఆమోదం పొందితే క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు చట్టబద్దమమవుతుంది. వ్యక్తిగత ఆస్తిని ఆమోదించడం అంటే చట్టబద్ధంగా ప్రైవేటు ఆస్తికి రక్షణనివ్వడమేననీ, తద్వారా ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ఇది ఊతమిస్తుందని ప్రభుత్వ అధికారిక పత్రిక గ్రాన్మా అభిప్రాయపడింది. రౌల్ క్యాస్ట్రో అనంతరం మిగ్వెల్ డియాజ్ కానెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రాజ్యాంగ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. 2011లో చేసిన చట్ట సవరణతో ఆస్తి అమ్మకాలపై నిషేధాన్ని తొలగించారు. -
దేశవ్యాప్తంగా డీఎన్ఏ డేటా బ్యాంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో డీఎన్ఏ డేటా బ్యాంకులను కేంద్రం త్వరలోనే ఏర్పాటు చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా పౌరుల డీఎన్ఏ వివరాలను బయటకు వెల్లడిస్తే మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ డీఎన్ఏ ముసాయిదా బిల్లును రూపొందించింది. డీఎన్ఏ ప్రొఫైల్స్, డీఎన్ఏ శాంపిల్స్, రికార్డులను బాధితులు, నిందితులు, అనుమానితులు, తప్పిపోయినవారు, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తుల్ని గుర్తించేందుకు మాత్రమే వాడతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ బిల్లు రూపకల్పనలో న్యాయశాఖ బయోటెక్నాలజీ విభాగం సలహాలను తీసుకుందన్నారు. ఈ ముసాయిదా బిల్లుకు ప్రస్తుతం న్యాయశాఖ తుదిరూపు ఇస్తోందన్నారు. డీఎన్ఏ సమాచారాన్ని అక్రమంగా కోరేవారికి కూడా మూడేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష వరకూ జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. వచ్చే సమావేశాల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఇటీవల కేంద్రం సుప్రీంకు తెలిపిందన్నారు. -
ఇష్టారాజ్యానికి ఓ ‘నల్ల’ చట్టం!
సాక్షి, అమరావతి: మేము తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నించరాదంటూ ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చే సాహసాన్ని భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం మాత్రం దీనికి అతీతులట! తన నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదంటూ చంద్రబాబు ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ మేరకు ముసాయిదా బిల్లుకు ఇటీవల కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఇది చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే.. ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారికి ఇష్టారాజ్యంగా భూములు, రాయితీలు కేటాయించుకోవచ్చు. పరోక్షంగా ప్రయోజనం పొందొచ్చు. ఇదేం అన్యాయం అని అడగడానికి, న్యాయం కోసం కోర్టుకు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఆ పిటిషన్లను కోర్టులు అనుమతించొద్దు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు సింగపూర్ తరహాలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తూ 2016 మార్చి 17న ప్రభుత్వం జీవో 87ను జారీ చేసింది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఆర్థికాభివృద్ధి మండలికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ముసాయిదా బిల్లును రూపొందించి ఫిబ్రవరి 21న మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. గతంలో జీవో ద్వారా ఏర్పాటైన సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీని, సీఎం నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిని కూడా ఈ ఆర్థికాభివృద్ధి మండలి పరిధిలోకి తీసుకొస్తూ వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించే ముసాయిదా బిల్లులోని పలు అంశాలు బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని, పలు శాఖలు చేయాల్సిన పనులపై గుత్తాధిపత్యం సాధించే అంశాలున్నాయని ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా సరే అభ్యంతరాలను తోసిపు చ్చుతూ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి తీసుకునే నిర్ణయాలను కోర్టుల్లో సవాల్ చేయడానికి వీల్లేదని, ఎలాంటి ప్రాసిక్యూషన్స్‌కు అవకాశం ఉండదని బిల్లులో స్పష్టం చేశారు. మండలి తీసుకునే నిర్ణయాలతోపాటు అందులో పనిచేసే సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, కన్సల్టెన్సీలపైనా ఏ న్యాయస్థానం లోనూ కేసులు వేయడానికి వీల్లేదని పేర్కొ న్నారు. ఆర్థికాభివృద్ధి మండలి మంచి ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకుంటుందని భావించాలని, ఈ నిర్ణయాలను తప్పుపట్టే పిటిషన్లను ఏ న్యాయస్థానాలు కూడా అనుమతించరాదని తేల్చిచెప్పారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలట! భారీ ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను రాబట్టేందుకు ఆర్థికాభి వృద్ధి మండలి దేశ విదేశాల్లో పర్యటించనుంది. నిబంధనల మేరకు విదేశీ పర్యటనల చార్జీలను, టీఏ, డీఏలను ఇస్తే చాలదని, పెద్ద ఎత్తున నిధులు అవసర మని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలని కూడా స్పష్టం చేశారు. అయితే, నిబంధనల మేరకు వర్తించే టీఏ, డీఏలు మాత్రమే వర్తిస్తాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. సొంత ప్రయోజనాల కోసమే... రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయాలను కోర్టుల పరిధి నుంచి తప్పిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించడం వెనుక లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ప్రభుత్వ పెద్దలు ఆర్థికాభివృద్ధి మండలి ముసుగులో మరింత ప్రయోజనం పొందడానికి వ్యూహం రచించారు. అస్మదీయులకు భూములు, రాయితీల కేటాయింపుపై ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన సీఎం వ్యూహత్మకంగా పావులు కదిపారు. అందుకే ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నించేందుకు వీల్లేదంటూ ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికార వర్గాల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎలక్ట్రిక్ వాహన విధానంపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని విస్తృత స్థాయి లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి రంగంలో కొత్త పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి రూపకల్పన చేస్తోంది. విద్యుత్, కార్మిక, రహదారులు, పన్నులు.. తదితర శాఖలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ విధానానికి ముసాయిదాను రూపొందిస్తోంది. ఈ వాహనాల ఉత్పత్తిరంగంలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 వేలమందికి ఉపాధి కల్పిం చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ విధానంలో ప్రభు త్వం పలు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ త్వరలో వివిధ ప్రభుత్వ శాఖలతో సమావేశం నిర్వహించి ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు అందించాల్సిన సహాయ, సహకారాలపై చర్చించనున్నారని తెలిసింది. అనంతరం విధాన ముసాయిదాకు తుదిరూపం ఇస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్ఎఫ్ తదితర పరిశ్రమలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలు సైతం రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో కర్ణాటక రాష్ట్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రా ల్లో ప్రకటించిన విధానాలను పరిశీలించి దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారవర్గాలు తెలిపాయి. -
ట్రిపుల్ తలాక్.. రేపు కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాం మతానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. లోక్‌సభలో డ్రాఫ్ట్ బిల్లును కేంద్రం ప్రవేశపెడుతోంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ తెలిపారు. లోక్‌సభ అధికారిక వెబ్ సైట్లో ది ముస్లిం ఉమెన్ బిల్లు(వివాహ హక్కుల చట్టం)-2017 పేరిట ఓ ప్రకటనను కూడా ఉంచింది. బిల్లు ప్రకారం తలాక్ ఏ రూపంలో ఉన్నా నేరమే. అందుకు గరిష్టంగా మూడేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 15నే ఈ డ్రాఫ్ట్ బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది కూడా. ఇక తన పార్టీ ఎంపీలందరికీ బీజేపీ ఇప్పటికే విప్ జారీ చేసింది. వివాదాస్పదమైన అంశం కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తప్పనిసరిగా రావాలంటూ ఎంపీలకు సూచించింది. ట్రిపుల్ తలాక్‌ను చట్టవిరుద్దంగా పేర్కొంటూ ఆగష్టు 22న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అవసరమైన చట్టం రూపకల్పన చేయాలని కేంద్రానికి సూచించగా.. ఇప్పుడు కేంద్రం ఆ పని చేయబోతుంది. ముస్లిం మహిళల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా బిల్లును రూపొందించామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ఇది వరకే తెలిపారు కూడా. అయితే మత పెద్దల అభిప్రాయాలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. -
అసెంబ్లీ సమావేశాలకు ‘పంచాయతీ’ పీటముడి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు పంచాయతీరాజ్ చట్టంతో పీటముడి పడింది. ఈ నెల మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్ గత నెల 17న అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇప్పటికీ పంచాయతీరాజ్ ముసాయిదా బిల్లు సిద్ధం కాలేదు. ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి కొత్తగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2017 అమల్లోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ముసాయిదా బిల్లు తయారీకి ప్రభుత్వం ఇటీవల కమిటీని నియమించింది. పంచాయతీరాజ్ చట్టం 73, 74వ రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్నది కావటంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముందస్తుగా కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని న్యాయ శాఖ ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు 250 పేజీల ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే 130 పేజీల వరకు కసరత్తు పూర్తయింది. వేగంగా కసరత్తు చేసినా మరో పది రోజులు పడుతుందని చెబుతున్నారు. ఇక కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు రూపొందించుకునే ఏ చట్టానికైనా రాష్టపతి అనుమతి తప్పనిసరి. బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు కేంద్రం అనుమతి కావాలి. ఇప్పటికిప్పుడు అనుమతి కోరినా.. కేంద్రం అంగీకరించేందుకు 15 రోజుల సమయం పడుతుందని సమాచారం. దీంతో ఈ నెలాఖరులోగా పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాల్లేవని తెలుస్తోంది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాక రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర చట్టానికి లోబడి రాష్ట్ర బిల్లు లేకుంటే కేంద్రం తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశాలుంటాయి. -
ఎంబీబీఎస్ పూర్తయ్యాక ‘నెక్ట్స్’ తప్పనిసరి
- ఆ పరీక్ష పాసైతేనే మెడికల్ ప్రాక్టీసుకు రిజిస్ట్రేషన్ - ముసాయిదా బిల్లును సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం - నెక్ట్స్ వద్దన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బుట్టదాఖలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదివిన వారికి జాతీయ స్థాయిలో మరో అర్హత పరీక్ష ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)’తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ముసాయి దాపై చర్చించాక దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు. అనంతరం అది చట్టంగా ఉనికిలోకి రానుంది. రాబోయే కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేసే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ‘నెక్ట్స్’పై కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన సంగతి తెలి సిందే. నెక్ట్స్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎంబీబీఎస్ తర్వాత మరో అర్హత పరీక్ష అవసరమే లేదని స్పష్టం చేసింది. నెక్ట్స్ పాసయితేనే మెడికల్ ప్రాక్టీస్‌కు రిజిస్ట్రేషన్ చేసే అంశాన్ని ముడిపెట్టడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. దీని వల్ల జాతీయ స్థాయి లో వైద్య విద్య నిర్వ హణపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొంది. ఎంబీబీఎస్ పరీక్ష పత్రాలను ఆరోగ్య విశ్వవిద్యాల యమే తయారు చేసి పరీక్ష నిర్వహిస్తుందని.. అనంతరం విశ్వ విద్యాలయం ఆధ్వ ర్యంలోనే వాల్యుయేషన్ చేస్తారని.. ఇంత పకడ్బందీగా పరీక్ష జరుగుతున్నప్పుడు ‘నెక్ట్స్’అవసరం ఏముం టుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేంద్రానికి విన్నవించారు. అనేక రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని తెలిసింది. అయితే కేంద్రం మాత్రం నెక్ట్స్‌ను అమలు చేయడానికే మొగ్గు చూపుతోంది. వైద్య ప్రమాణాలు పడిపోతున్నాయనే.. వైద్య విద్యలో ప్రమాణాలు పోతున్నాయన్న భావన తోనే కేంద్రం నెక్ట్స్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయిం చింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో అనేకచోట్ల వైద్య విద్య ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తనిఖీలకు వెళ్తున్న సందర్భంలో అనేక కాలేజీలకు సొంతంగా ప్రొఫెసర్లు ఉండటం లేదు. వైద్య విద్యార్థులకు హాస్టల్స్, లైబ్రరీ వంటి మౌలిక సదు పాయాలు ఉండటం లేదు. ఉదాహరణకు ఇటీవల నిజామాబాద్ లోని ప్రభుత్వ మెడి కల్ కాలేజీ, హైదరా బాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలను ఎంసీఐ తనిఖీ చేసినప్పుడు రెండు చోట్లా అవసరమైన ప్రొఫెసర్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేవని తేలింది. దీంతో నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని 150 ఎంబీబీఎస్ సీట్లు, ఉస్మానియాలో 50 ఎంబీబీఎస్ సీట్లకు వచ్చే ఏడాదికి ఎంసీఐ అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీల పరిస్థితే ఇలా ఉంటే ఇక ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పరిస్థితులు అత్యంత అధ్వా నంగా ఉంటున్నాయన్న భావన కేంద్రంలో ఉంది. అనేకచోట్ల పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఎంసీఐ అధికారుల్లో నెలకొని ఉంది. మరోవైపు ప్రైవేటు కాలేజీలు రూ.కోట్లు డొనేషన్లు తీసుకుని సంబంధిత విద్యార్థులకు పరీక్షల్లో సహకరిస్తున్నా యన్న అను మానాలూ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వీటన్నింటినీ కట్టడి చేయడం కష్టమని.. అందుకే జాతీయస్థాయిలో అర్హత పరీక్ష నిర్వహిస్తే.. నిజమైన అర్హులెవరో తేలుతారని.. వారికే మెడికల్ ప్రాక్టీసు రిజిస్ట్రేషన్ చేయవచ్చనేది కేంద్రం ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. -
సొసైటీ భూములపై నిఘాకు కొత్త చట్టం
• రెవెన్యూశాఖ జోక్యం చేసుకునేలా సహకార చట్టం–2016కి రూపకల్పన • సహకార భూముల్లో అక్రమాలు జరిగితే వెనక్కి లాగేసుకునే వీలు సాక్షి, హైదరాబాద్: మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీస్ (మ్యాక్స్) చట్టాన్ని కొత్త సహకార చట్టంలో కలిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ అనుమతి తీసుకుంది. దీనిపై సహకార శాఖ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపారు. వివిధ సొసైటీలు ఇళ్లు ఇతరత్రా అవసరాల కోసం తీసు కున్న భూముల్లో అక్రమాలు నెలకొంటే వాటిని కట్టడి చేయడానికి... ఆ భూములను తిరిగి వెనక్కు తీసుకోవడానికి రెవెన్యూ శాఖకు అవకాశం కల్పించాలని ప్రతిపాదిం చారు. భారీ మార్పులు చేర్పులతో నూతన సహకార చట్టం–2016 రానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముసాయిదా బిల్లును రూపొందిస్తారు. అవసరమైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేకుంటే వచ్చే సమావేశాల్లో సహకార చట్టం–2016 ఉనికిలోకి రానుంది. మ్యాక్స్‌తో అక్రమాల వెల్లువ... సహకార చట్టం, మ్యాక్స్‌లు వేర్వేరుగా ఉన్నాయి. మ్యాక్స్ ద్వారా అనేక డెయిరీ, హౌసింగ్ తదితర సొసైటీలు పనిచేస్తు న్నాయి. వీటిల్లో అనేక సొసైటీలు అక్రమాలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. సొసైటీ లు అనేకం ప్రభుత్వ భూములను తీసుకొని అక్రమాలు చేస్తున్నాయన్న ఆరోపణలు న్నాయి. వాటిపై నియంత్రణే లేదు. కొన్ని హౌసింగ్ సొసైటీలు భూములు తీసుకొని అక్రమంగా అర్హత లేనివాళ్లకు కట్టబెడుతున్న ట్లు బయటకు పొక్కాయి. ఇలా సొసైటీల్లో జరిగే అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సహకారశాఖకు అవకాశం లేకుండా పోయింది. మ్యాక్స్‌లో సవరణలు చేసే బదులు దాన్నే సహకార చట్టంలో కలిపే యాలనేది సహకారశాఖ ఉద్దేశం. ఆ ప్రకారం నూతన చట్టాన్ని తీసుకురావాలనేది సర్కారు యోచన. కట్టుదిట్టంగా మార్పులు చేర్పులతో నూతన చట్టాన్ని తీసుకొస్తే కొన్ని సొసైటీల అక్రమాలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెబుతున్నారు. -
రాష్ట్రంలోనూ భూసేకరణ చట్టం
ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు సమీకరించేందుకు రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముసాయిదా రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ను కమిటీ చైర్మన్‌గా, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్, న్యాయశాఖ కార్యదర్శిని సభ్యులుగా, అడ్వకేట్ జనరల్‌ను ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించింది. గోవా, కేరళ, రాజస్థాన్‌ల్లోని కొత్త చట్టాలను పరిశీలన, అవసరమైతే ఆయా రాష్ట్రాల అధికారులను ఆహ్వానించేందుకు కమిటీకి ప్రభుత్వం అధికారం కల్పించింది. -
కొత్తగా 6 మండలాలు
వరంగల్ జిల్లాలోకి హసన్‌పర్తి, శాయంపేట హన్మకొండలోకి దేవరుప్పుల ముసాయిదాకు తుది రూపు సర్కారుకు నివేదించిన కలెక్టర్ కరుణ సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా(డ్రాఫ్ట్) నివేదికను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఆదివారం సాయంత్రం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనకు సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరిచారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మండలం, డివిజన్, జిల్లా స్థాయి అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపి నివేదిక రూపొందించారు. కలెక్టర్ పంపిన నివేదికను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి, తుది మార్పులు చేయనుంది. పునర్విభజన ముసాయిదా ప్రకటనను సోమవారం జారీ చేయనుంది. కలెక్టర్ వాకాటి కరుణ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం రూపొందించిన నివేదికలో చివరి క్షణం వరకు మార్పు లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొత్త మండలాల్లో కలిపే గ్రామాలపై ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండేలా చూసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. మొదట రూపొందించేది ముసాయిదా నివేదికే కావడంతో అధికారులు సైతం ఈ విషయంలో కాస్త ఉదారంగానే వ్యవహరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం రూపొందించిన ముసాయిదా నివేదికలో రోజురోజుకు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని నివేదికలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 51 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఖిలావరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), వేలేరు(ధర్మసాగర్), చిల్పూరు(స్టేçÙన్‌ఘన్‌పూర్) మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న జమ్మికుంట... కొత్తగా ఏర్పడుతున్న హన్మకొండ జిల్లాలో కలవనుంది. జమ్మికుంటలోని ఇల్లందకుంటను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి వివరాలను మరోసారి పరిశీలించి జిల్లా యంత్రాంగం ఆదివారం తుది ముసాయిదా నివేదికను రూపొందించింది. శనివారం వరకు హన్మకొండ జిల్లాలో ఉన్న హసన్‌పర్తిని ఇప్పుడు వరంగల్ జిల్లాలోకి మార్చారు. అలాగే మొదట యాదాద్రి జిల్లాలో కలపాలని నివేదిక రూపొందించిన దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొన్నారు. మొదట వరంగల్ జిల్లాలో, తర్వాత భూపాలపల్లి జిల్లాలో కలపాలని పేర్కొన్న శాయంపేట మండలం తుది నివేదికలో వరంగల్ జిల్లాలోనే ఉంది. వరంగల్ జిల్లాలో 17, హన్మకొండ జిల్లాలో 19, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15, మానుకోట జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. కొత్తగా హన్మకొండ, హుజూరాబాద్, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. తుది ముసాయిదాకు ప్రభుత్వ స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ముసాయిదా నివేదికలోని వివరాలు ఇవీ... వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ. హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది). ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్. మానుకోట : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సిం హులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం. యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం. సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. -
వికలాంగుల ముసాయిదా బిల్లు ఆమోదించాలి
బాలసముద్రం : వికలాంగుల ముసాయిదా బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టి బిల్లును ఆమోదింపజేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌నపీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి అంజయ్య డిమాండ్ చేశారు. వికలాంగు హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటి సమావేశం హంటర్‌రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా అంజయ్య పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల ఉద్యోగ రిజర్వేషన్లకై సుప్రీంకోర్టు తీర్పును పార్లమెంట్లో ప్రత్యేక చర్చ చేపట్టాలన్నారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం 100 రోజుల్లోనే బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని చెప్పిన హామీ ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ తగిన అర్హతలు ఉన్నా వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల నిరుద్యోగుల వేదిక రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, రమేశ్, మున్నా, నర్సింగ్, యాకయ్య, జయంగీర్, తిరుపతి, రవి, సుమన్, సంపత్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా అడ్డరాజు, గజ్జి పైడిలను ఎన్నుకున్నారు. -
తప్పని విస్తరణ
చర్చకు రాని ప్రముఖ ముసాయిదా బిల్లులు ఈ నెల 24కు ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు సమావేశాల గడువును విస్తరించే దిశగా ప్రభుత్వ సన్నాహాలు బెంగళూరు: ప్రభుత్వం రూపొందించిన కొన్ని ముఖ్యమైన ముసాయిదా బిల్లులను ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టకపోవడంతో వర్షాకాల సమావేశాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 24తో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టి సభ అనుమతి పొందేందుకు గాను ఐదు రోజుల పాటు సమావేశాల నిర్వహణను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గురువారం సాయంత్రం బెళగావిలోని సువర్ణసౌధలో జరిగిన సభా సలహా సమితి సమావేశంలో సైతం తీర్మానం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈనెల 24న ముగియాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు 29 వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బెళగావిలో సువర్ణసౌధలో 10రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి మూడు రోజులు చెరకు రైతుల ఆత్మహత్యలే ప్రతిధ్వనించాయి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల పట్ల చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో కన్నడనాడులో చెరుకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించడంతో పాటు రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రతిపక్షాలు మూడు రోజుల పాటు సభా కార్యకలాపాలను సజావుగా సాగనివ్వలేదు. అనంతరం లోకాయుక్తపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఉభయ సభలు అట్టుడికాయి. లోకాయుక్త వై.భాస్కర్‌రావును పదవీచ్యుతిడిని చేయాలనే డిమాండ్‌తో బీజేపీ, జేడీఎస్‌లు సంయుక్తంగా ఎమ్మెల్యేల సంతకాల సేకరణను సైతం ప్రారంభించాయి. ఇక ఇంకోరోజు రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖలో వెలుగుచూసిన పరుపులు, దిండ్ల కుంభకోణంతో ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీశాయి. ఇలా బెళగావిలోని సువర్ణసౌధలో 10రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికే ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో ప్రభుత్వం రూపొందించిన కొన్ని ముఖ్యమైన ముసాయిదా బిల్లులను సభల్లో ప్రవేశపెట్టలేకపోయారు. ఇక సువర్ణసౌధలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. తిరిగి సోమవారం నుంచి బెంగళూరులోని విధానసౌధలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24నాటికి ఈ సమావేశాలు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదాన్ని పొందేందుకు గాను ఐదు రోజుల పాటు సభా కార్యకలాపాలను పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వ సేవల హామీ ముసాయిదా బిల్లు విడుదల
ముంబై : నిర్దిష్ట వ్యవధిలోగా ప్రభుత్వ సేవలు అందించకుంటే సదరు అధికారికి జరిమానా విధించే మహారాష్ట్ర ప్రభుత్వ సేవల హామీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం సలహాలు, సూచనలు ఆహ్వానించింది. ముసాయిదా బిల్లు ప్రకారం, ‘‘ప్రతి అర్హుడు నిర్దిష్ట వ్యవధిలోగా కొన్ని సేవలను పొందే హక్కు కలిగి ఉంటాడు. ప్రతి ప్రభుత్వ సంస్థ తమ కార్యాలయంలో లభించే సేవలను గూర్చిన సమాచారాన్ని తమ నోటీస్ బోర్డుపై తెలియచేయాలి. నియమిత అధికారి (దరఖాస్తులను పరిశీలించే వారు) వివరాలను, ‘తొలి పునర్విచారణ అధికారి’, రెండో పునర్విచారణ అధికారి’ వివరాలను కూడా తెలియపరచాలి. దరఖాస్తు సమర్పించిన తేదీ నుంచి నిర్దిష్ట వ్యవధి మొదలవుతుంది. దరఖాస్తును స్వీకరించిన అనంతరం సదరు దరఖాస్తుదారునికి రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో ‘ప్రత్యేక దరఖాస్తు సంఖ్య’ను కేటాయిస్తారు. దరఖాస్తులో కోరిన సదరు సేవను అందించే వ్యవధిని కూడా దానిలోనే పేర్కొంటారు. అధికారి నిర్దిష్ట వ్యవధిలోగా సదరు సేవను అందించాలి లేదా కారణాలు చూపుతూ దరఖాస్తును తిరస్కరించాలి. ‘ప్రత్యేక సంఖ్య’ ఆధారంగా దరఖాస్తుదారుడు ఆన్లైన్లో తన దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. తనకు లభించిన సేవను బట్టి అసంతృప్తికి గురైనా లేక దరఖాస్తు తిరస్కరణకు గురైనా దరఖాస్తుదారుడు 30 రోజులలోగా తొలి పునర్విచారణ అధికారిని ఆశ్రయించవచ్చు. సరైన కారణం లేకుండా సేవను అందించడంలో విఫలమైనందుకు సదరు అధికారికి పునర్విచారణ అధికారి జరిమానా విధించవచ్చు. రెండో పునర్విచారణ అధికారికి కూడా అప్పీలు చేసుకోవచ్చు. అధికారికి విధించిన జరిమానాను అతని వేతనంలో నుంచి మినహాయించాలని రెండో పునర్విచారణ అధికారి అకౌంట్స్ ఆఫీసర్‌ను ఆదేశించవచ్చు. ఇదిలా ఉండగా, సేవలందించడంలో విఫలమైన అధికారిది ‘దుష్ర్పవర్తన’గా పరిగణించరాదని కూడా ముసాయిదా బిల్లు పేర్కొంటోంది. నిర్దిష్ట వ్యవధిలో సేవలందించేందుకు నియమిత అధికారులకు, అపెల్లేట్ అధికారులకు శిక్షణనిస్తామని ప్రభుత్వం తెలిపింది. నియమితి అధికారులు ఏడాది కాలంలో ఒక్క పొరపాటుకూడా చేయకపోతే వారికి నగదు ప్రోత్సహకాలు కూడా ఇస్తామని పేర్కొంది. ప్రభుత్వం ప్రజా సేవల అమలు కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి (పాలనా సంస్కరణల విభాగం), పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక విభాగాలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులు ఉంటారు. ఈ కమిటీ ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందచేసే చర్యలను సిఫార్సు చేస్తుంది. అలాగే ప్రభుత్వ అధికారుల పనితీరును విశ్లేషిస్తుంది. ఈ కమిటీ వార్షిక నివేదికను విధానసభలో ప్రవేశపెడతారు. -
రైతుల భూములకు సర్కారు బేరం!
సీఆర్డీఏకు విశేషాధికారాలు కల్పిస్తున్న ముసాయిదా బిల్లు రైతులు ఒప్పుకుంటే భూసమీకరణ.. ఒప్పుకోకపోతే భూసేకరణ సీఆర్డీఏ ముసాయిదా బిల్లులో సమీకరణకు విధివిధానాలు స్థిరచరాస్తుల సేకరణకు ప్రత్యేక ‘మార్గదర్శకాలు’ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం రైతుల నుంచి సేకరించే భూములను ఆ తర్వాత అమ్ముకోవడానికి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)కు అధికారం కట్టబెట్టనున్నారు. తుళ్లూరు ప్రాంతంలో రైతుల నుంచి సేకరించే భూముల్లో 13,836 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములను సేకరించడానికి వీలుగా ప్రభుత్వం సీఆర్డీఏను ఏర్పాటు చేస్తోంది. సీఆర్డీఏకు సంబంధించిన రూపొందించిన బిల్లును త్వరలో ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ముసాయిదా బిల్లు ప్రకారం ప్రభుత్వం సేకరించే భూములపై సీఆర్డీఏకు విశేషాధికారాలు కట్టబెట్టనుంది. సమీకరణ కు పలు మార్గదర్శకాలు పొందుపరిచారు. ప్రభుత్వం సేకరించిన భూములను సీఆర్డీఏకు బదలాయిస్తారని.. ఆ భూములను ఎలాంటి అవసరాలకైనా విక్రయించుకోవడానికి అథారిటీకి అధికారం ఉంటుందని బిల్లులోని 104 సెక్షన్లో పొందుపరిచారు. రాజధాని కోసం తొలి విడతలో 29 గ్రామాల్లో భూములను సమీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం భూములను ఏవిధంగా సమీకరించాలన్న అం శాలను బిల్లు ముసాయిదాలోని సెక్షన్ 100 లో పొందుపరిచారు. భూ సమీకరణకు అంగీకరించనిపక్షంలో 2013 భూ సేకరణ చట్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.కొత్త రాజధాని ప్రాంతంలో స్థిర, చరాస్తులను సేకరించే అధికారాన్ని సీఆర్డీఏకు కట్టపెట్టారు. స్థిర, చరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా లేదా మార్పిడి లేదా కానుకలుగా లేదా తాకట్టు పద్ధతిలో లేదా సంప్రదింపుల ద్వారా సేకరించవచ్చునని ముసాయిదాలో పేర్కొన్నారు. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) విధానానికి అంగీకరించని యజమానులతో సీఆర్డీఏ తొలుత పరస్పర సంప్రదింపులు, అంగీకారం విధానంలో భూ మిని సేకరించేందుకు ప్రయత్నించాలని నిర్దేశించారు. అవి కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి జరుగుతాయని, ఈ షరతులు, నిబంధనలకు భూ యజమానులు అంగీకరించిన పక్షంలో సంప్రదింపుల ద్వారా సెటిల్మెంట్ చేసుకోవాలని వివరించారు. ఈ విధానానికి కూడా అంగీకరించని పక్షంలో 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించాలని పేర్కొన్నారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలేమంటే... అవసరమైన ఎలాంటి భూమినైనా లేదా రిజర్వ్ చేయడానికైనా 2013 భూ సేకరణ చట్టం కింద అథారిటీ (సీఆర్డీఏ) సేకరిస్తుంది. మౌలిక అభివృద్ధి లేదా ప్రాదేశిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి, జోనల్ అభివృద్ధి ప్రణాళికల కోసం అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ లేదా టౌన్ ప్లానింగ్ లేదా అభివృద్ధి ప్రణాళిక కింద సేకరిస్తారు. అలా సాధ్యం కాని పక్షంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పారదర్శకంగా సహాయ, పునరావాసం కల్పిస్తూ తగిన పరిహారాన్ని చెల్లించి సేకరిస్తారు. అథారిటీ కోరిక మేరకు ఈ భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకును సీఆర్డీఏ ఏర్పాటు చేస్తుంది. సేకరించిన, కేటాయించిన, కొనుగోలు చేసిన, ఇతర మార్గాల్లో సమీకరించిన భూమలను ఈ బ్యాంకు పరిధిలోకి తీసుకొస్తారు. ప్రభుత్వం, సీఆర్డీఏల మధ్య పరస్పర అంగీకారంతో ఆ ప్రాంతంలోని అభివృద్ధి చెందిన లేదా అభవృద్ధి చెందని ఎటువంటి భూమినైనా విక్రయించుకోవడానికి బిల్లులో సెక్షన్ 102(3) కింద వీలు కల్పించారు. నిర్ధారించిన నిబంధనల మేరకు ప్రభుత్వ అసైన్డ్ భూములను అధారిటీ స్వాధీనం చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ నిర్ధారించిన పరిహారాన్ని అసైన్డ్ భూముల వారికి చెల్లిస్తారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించే భూమికి నష్టపరిహారం చెల్లించకుండా వారు కోరితే మరో ప్రాంతంలో అభివృద్ధి హక్కుల బదిలీ (టీడీఆర్) చేయడానికిగాను అభివృద్ధి హక్కు పత్రం (డీఆర్సీ) ఇస్తారు. ఈ హక్కుల బదిలీ ఆ భూమి విలువతో సమానంగా ఉండేలా చూడాలి. ఈ టీడీఆర్‌ను నిర్మాణ ప్రాంతం పెంచుకోవడానికి కూడా వినియోగించుకోవచ్చు. భూమి ఇచ్చే వ్యక్తి దీన్ని సొంతగా వినియోగించుకోవచ్చు లేదా ఎవరికైనా విక్రయించుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న స్థిర, చరాస్తులను అధారిటీ పేరుతో తన వద్దే ఉంచుకోవడం లేదా విక్రయించడం లేదా కాంట్రాక్టుకు ఇచ్చే అధికారం సీఆర్డీఏ కలిగి ఉంటుంది. -
మహిళా భద్రత చట్టం ముసాయిదా బిల్లులో మార్పులు?
* పలు సూచనలు చేస్తూ మళ్లీ డీజీపీ, నగర సీపీకి పంపిన రాష్ట్ర హోంశాఖ * పురుషుడి జేబులో ఎవరైనా మహిళ ఫొటో ఉన్నానేరమనడంపై అభ్యంతరం * నిర్భయ చట్టంలాగే, దీనిపైనా విస్తృత చర్చ జరగాల్సిందేనన్న కమిటీ సభ్యులు సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు రూపొందించిన చట్టం ముసాయిదా బిల్లుపై వారిస్థాయిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ చట్టంలో కొన్ని నిబంధనల పట్ల రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ చట్టంపై నిర్భయ చట్టంలాగే విస్తృతస్థాయి చర్చ జరగాలని రాష్ట్ర మహిళా భద్రతా కమిటీకి చెందిన కొందరు సభ్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చట్టం ముసాయిదాలో కొన్ని మార్పులు సూచిస్తూ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డిలకు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ఈ బిల్లును పంపించింది. రాష్ట్ర మహిళా భద్రత కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్రంలో కొత్తగా మహిళా భద్రతా చట్టం ముసాయిదాను సీపీ మహేందర్‌రెడ్డి రూపొందించారు. ఈ మేరకు ఆది వారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై కూడా చర్చించారు. కాగా, ఈ ముసాయిదాలో కొన్ని అంశాలు స్పష్టంగా లేవని, దీనివల్ల న్యాయపరంగా చిక్కులెదురవుతాయని రాష్ట్ర హోంశాఖతోపాటు కొందరు కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిసింది. ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపుల విషయాల్లో ఎవరు నేరస్తులవుతారు? దానికి తగిన ఆధారాలేమిటనే విషయంలో స్పష్టత లేదని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ చట్టం ప్రకారం.. పురుషుడి జేబులో ఎవరైనా మహిళ ఫొటో ఉన్నా.. అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తారనే నిబంధనపై రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని తెలిసింది. నిజానికి కొందరు తమకిష్టమైన సినీ హీరోయిన్ల ఫొటోలు పెట్టుకుంటారని, మరికొందరు ఫేస్ బుక్‌లో తమకు నచ్చిన వారి ఫొటోను పెట్టుకుంటారని, వీరందర్నీ నిందితులుగా ఎలా పేర్కొంటారని, అలా చేయడం వలన వాళ్లు తప్పు చేసినట్లుగా ఎలా గుర్తిస్తారని అడిగినట్లు సమాచారం. ఇలాంటివే మరికొన్ని సున్నిత అంశాలున్నాయని వీటిపై లోతుగా అధ్యయనం చేయాలని పలువురు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈవ్‌టీజింగ్‌పై తమిళనాడులో అమల్లో ఉన్న చట్టాన్ని ఆధారంగా చేసుకుని మహిళాభద్రత చట్టం రూపొం దించడం బాగానే ఉందనీ, దీనికి ముందు జాతీయస్థాయిలో నిర్భయ చట్టంలాగే దీనిపైనా చర్చ జరగాలని వారు సూచిం చినట్లు సమాచారం. దీంతో న్యాయపరంగా సమస్యలు తలెత్తవని, మరోవైపు మరింత కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకురావడానికి ఆస్కారం ఏర్పడుతుందని వారన్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర హోంశాఖ వెనక్కి పంపించిన తాజా చట్టం ముసాయిదాపై డీజీపీ, సీపీ అవసరమైన మార్పులు చేర్పులు చేసి తిరిగి రాష్ట్ర న్యాయశాఖ పరిశీలనకు పంపిస్తారనీ, అనంతరం సీఎం కేసీఆర్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీన్ని కేంద్ర హోంశాఖ ఆమోదం కోసం పంపిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. -
`బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలనేది నిర్ణయిస్తాం`
హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరిందంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. అయితే అసెంబ్లీలో మొదటి ప్రాధాన్యత బిల్లుపై చర్చకు ఉంటుందని ఆయన అన్నారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి... బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలనేది నిర్ణయిస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కాగా, కేంద్ర హోం మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ తీసుకొచ్చిన 5 బండిళ్లలో ఉన్న ముసాయిదా బిల్లు ప్రతులను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతికి అందజేసిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రానికి తెలంగాణ ముసాయిదా బిల్లు
తెలంగాణ ముసాయిదా బిల్లు కాసేపట్లో రాష్ట్రానికి చేరనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతిని కలిసి ముసాయిదా బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సురేష్ కుమార్ ఆయనకు అందజేస్తారు. దీనిపై చర్చించి, అభిప్రాయాలను తెలియజేయడానికి రాష్ట్ర అసెంబ్లీకి జనవరి 23 వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు మీద ఇప్పటికే సీమాంద్ర ప్రాంత నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఓ తీర్మానం చేయాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే మరోవైపు తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరిపోయింది. -
ఇప్పుడు కాకుంటే జనవరిలో: దిగ్విజయ్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభ జనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్రం శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతికి పంపించవచ్చని, ఆయన దాన్ని అసెంబ్లీకి పంపుతారని రాష్ట్ట్ర్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో అభిప్రాయాలు చెప్పేందుకు రాష్ట్రపతి తగినంత గడువు ఇస్తారని తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో విభజన బిల్లు వచ్చేది, లేనిది అసెంబ్లీలో అభిప్రాయాల వెల్లడికి రాష్ట్రపతి ఇచ్చే గడువుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడం సాధ్యంకాని పక్షంలో జనవరిలో ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తెస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం దిగ్విజయ్ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొందరు సీమాంధ్ర నేతలు, పార్టీ హైకమాండ్‌ను కూడా ధిక్కరిస్తూ మాట్లాడుతున్నారని ప్రస్తావించగా, ‘వారు అలాంటి పంచ్‌లు వేయడాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నా’ అని బదులిచ్చారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్ చేతికి కట్టబెట్టడాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లగా, ‘ఆయనకు ఏం కావాలంటా!’ అని ఎదురు ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాన్ని ఎలా నియంత్రిస్తుంది అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి పార్టీ నేతలు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. వారు సమస్యలను ప్రస్తావించవచ్చు. వాటిని బిల్లులో చేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని అన్నా రు. అసెంబ్లీలో బిల్లును గెలిపిం చేందుకు ఎలాంటి వ్యూహాంతో వెళతారని అడగ్గా ‘ రెండు భిన్న రాష్ట్రాలు ఉన్నాయి. మేము రెండు భిన్న వ్యూహాలను అనుసరిస్తాం’ అని నవ్వుతూ బదులిచ్చారు. తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రి సర్వే ఎంపీలు మధుయాష్కీ, సురేష్ షెట్కార్, కోమటిరెడ్డి ్డ, అంజన్‌కుమార్, పొన్నం, రాజయ్య, పాల్వాయి, గుత్తా, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు దిగ్విజయ్‌ను కలిసి బిల్లును కేబినెట్ ఆమోదించడంపై ధన్యవాదాలు తెలిపారు. -
నిరుద్యోగులకు ఎదురుచూపులే!
రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆలస్యమే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇక లేనట్టే. కొత్త రాష్ట్రాలు ఏర్పడే వరకు నియామకాలు అంతే సంగతులు. కేంద్ర మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల భర్తీ ఆలస్యం కానుంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పని చేస్తుందని ముసాయిదా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పడే వరకు తెలంగాణకు అవసరమైన సేవలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అందిస్తుందని ఆ బిల్లులో పేర్కొంది. ఈ లెక్కన కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అసెంబ్లీ, హైకోర్టులతోపాటు నూతన రాష్ట్రానికి సర్వీస్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రూల్స్‌ను ఆయా రాష్ట్రాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉద్యోగాల భర్తీ అంత త్వరగా సాధ్యం కాదు. వీటితోపాటు అవసరమనుకుంటే ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాలతో కొత్తగా జోన్లను ఏర్పాటు చేసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఉన్న జోన్లను కొనసాగించడం కాకుండా కొత్త జోన్లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల భర్తీలో మరింత ఎక్కువ జాప్యం అయ్యే అవకాశమూ ఉంది. దీంతో నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మరో ఏడాది, ఏడాదిన్నర కాలం ఎదురు చూడక తప్పేలా లేదు. పక్క రాష్ట్రానికి అప్పగించే అవకాశం ఉన్నా: రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం రెండు రాష్ట్రాలకు ఒకే సర్వీస్ కమిషన్ ఉండొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో మాత్రం కేంద్రం అలా చేయలేదు. కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ ఏర్పడే వరకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సేవలను యూపీఎస్సీ అందిస్తుందని పేర్కొంటూ ఆ అధికారాన్ని తమ వద్ద పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కే పని చేస్తుందని అందులో పేర్కొంది. అన్ని ఉద్యోగాల భర్తీ వాయిదా: రాష్ట్రంలో గడిచిన ఐదారు నెలల్లో దాదాపు 65 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారానే 12 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ప్రకటించినపుడే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. గ్రూపు-1, 2, 4, లెక్చరర్స్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అయితే ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ లోగా తెలంగాణ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఇక నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు మొదలవ్వడంతో ఈ నెల 22 లేదా వచ్చే నెల 5న నిర్వహించాలని భావిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వాయిదా వేయక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. -
పాత పర్మిట్లతోనే..
ఓ రాష్ట్రంలో అనుమతులతోనే ఇరు రాష్ట్రాల్లో తిరగవచ్చు సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యే నాటికి వాహనాలు తీసుకున్న పర్మిట్లతోనే ఇరు రాష్ట్రాల్లోనూ తిరగవచ్చని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో అనుమతి పొందినందున మరో రాష్ట్రంలో తిరుగనీయబోమని అనడానికి వీల్లేదని పేర్కొంది. ఇతర రాష్ట్ర వాహనం అయినందున ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని చెప్పడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన జరిగే ముందురోజు వరకు ప్రస్తుత రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అనుమతులు తీసుకున్నా.. వాటి వ్యాలిడిటీ ఉన్నంతకాలం రెండు రాష్ట్రాల్లోనూ తిరిగే హక్కు ఉంటుందని పేర్కొంది. ట్రాన్స్‌పోర్టు వాహనాల నుంచి ఎలాంటి టోల్, ప్రవేశ రుసుములు వసూలు చేయడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో టోల్ టాక్స్, ప్రవేశ రుసుములు, ఇతర చార్జీలు వసూలు చేయాల ంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని, కేంద్రం రెండు రాష్ట్రాలతో చర్చించి నిర్ణయిస్తుందని పేర్కొంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో లేదా ప్రభుత్వం వాణిజ్య అవసరాల కోసం రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించినా, అభివృద్ధి చేసినా వాటి వద్ద టోల్, ప్రవేశ రుసుములు వసూలు చేయవద్దన్న నిబంధన వర్తించదని పేర్కొంది. -
జనాభా ప్రాతిపదికనే.. ఆస్తులు, అప్పుల పంపిణీ
అప్పులు రూ. 1,51,450 కోట్లు సీమాంధ్రది రూ. 85,310 కోట్లు తెలంగాణది రూ. 66,140 కోట్లు సాక్షి, హైదరాబాద్: అప్పులు, ఆస్తులు, ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాలో, వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలను కూడా జనాభా ప్రాతిపదికనే పంపిణీ చేయనున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా ఇదే ప్రాతిపదికన పంపిణీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు రూ. లక్షన్నర కోట్లకు పైగా ఉన్నాయి. మొత్తం రాష్ట్రానికి చేసిన అప్పులు సుమారుగా రూ. 1,42,000 కోట్లు కాగా... విదేశీ సంస్థల నుంచి సీమాంధ్ర ప్రాంతానికి ప్రయోజనం కలిగే ప్రాజెక్టుల కోసం రూ. 2,950 కోట్లు, తెలంగాణ జిల్లాల్లో ప్రయోజనం కలిగేవాటికి రూ. 1350 కోట్లు, కేవలం హైదరాబాద్ కోసం రూ. 4,200 కోట్లు.. మొత్తంగా రూ. 8500 కోట్లు కలిపి సుమారు రూ. లక్షన్నర కోట్ల అప్పులున్నాయి. ప్రాంతాల వారీ అప్పులను ఆయా ప్రాంతాలకే కేటాయించి, లెక్కించగా... సీమాంధ్ర వాటా అప్పు రూ. 85,310 కోట్లు, తెలంగాణ వాటా రూ. 66,140 కోట్లుగా తేల్చారు. రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున ఆయిల్ కంపెనీలు, ఆబ్కారీ శాఖలు అన్ని జిల్లాల వ్యాట్‌ను అక్కడే చెల్లిస్తున్నారు. ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేయాల్సి ఉన్నందున... ఏయే జిల్లాల్లో వినియోగానికి సంబంధించి, ఆ జిల్లాలోనే వ్యాట్ చెల్లించాలని స్పష్టం చేశారు. ఆదాయ పంపిణీని కూడా ఇరు రాష్ట్రాల మధ్య లెక్క తేల్చారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఆదాయం రూ. 1,27,000 కోట్లు కాగా... అందులో స్థానిక వినియోగం ఆధారంగా హైదరాబాద్‌లో రూ. 20,000 కోట్లు, మిగతా తెలంగాణ జిల్లాల్లో రూ. 41,000 కోట్లు, సీమాంధ్రలో రూ. 66,000 కోట్లుగా తేల్చారు. -
అన్నీ ఢిల్లీ గుప్పెట్లోనే !
రెండు రాష్ట్రాల అధికారాలూ అక్కడే.. నదీజలాల విషయంలో కేంద్రం అనుమతి తప్పనిసరి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఉత్తిమాటే.. తెలంగాణలో పోలవరంకు భూసేకరణ కష్టమే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నదీ జలాల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు అన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లిపోయాయి. ప్రధానంగా నదీజలాల విషయంలో ప్రతిపాదిత రెండు రాష్ట్రాల చేతులను కట్టివేస్తూ ముసాయిదా బిల్లును కేంద్రం రూపొందించింది. కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రం ఏర్పాటు చేసే బోర్డుల అనుమతి లేనిదే తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ ఒక్క చెక్ డ్యామ్ కూడా నిర్మించుకునే పరిస్థితి లేదు. ఆ అనుమతులు వచ్చేలోపే ఎగువ రాష్ట్రాలు మరిన్ని నిర్మాణాలు చేసుకుంటాయి. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ సహాయ, పునరావాసం, పర్యావరణ అనుమతులు అవసరమని మెలిక పెట్టారు. పోలవరం ముంపు ప్రాంతం తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో ఉంది. దాంతో ప్రాజెక్టు భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం నుంచి అనుమతి రావడం ప్రశ్నార్థకమే. సమైక్యంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ కష్టతరమైన విషయం తెలిసిందే. లెండి, జూరాల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వ్యయాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా.. ఆయా రాష్ట్రాలు ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు వినియోగించటం గమనార్హం. సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర సాయం అందిస్తుందని సీమాంధ్ర మంత్రులు, కేంద్రం చేసిన ప్రచారాలు, లీకులు అన్నీ బోగస్ అని తేలింది. రాజధాని నిర్మాణం కోసం కేవలం భవనాలకు, డెరైక్టరేట్ల నిర్మాణాలకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుందని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి భూ సేకరణ గురించి బిల్లులో ప్రస్తావనే లేదు. గతంలో ఏర్పాటైన జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల రాజధాని ఏర్పాటుకు కేంద్రం కేవలం రూ. 150 కోట్ల చొప్పున సాయం అందించింది. ఛత్తీస్‌గఢ్‌కు నక్సలైట్ల సమస్య కారణంగా రూ. 200 కోట్ల రూపాయలిచ్చింది. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు కూడా కేవలం కొన్ని వందల కోట్ల రూపాయల సాయంతో కేంద్రం సరిపుచ్చే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ ఆస్తుల్లో సీమాంధ్రకు వాటా లేదు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటి నుంచి రాజధాని హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన అస్తుల్లో సీమాంధ్రకు ఎటువంటి వాటా, పరిహారం లేదు. ముసాయిదా బిల్లులో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా ఇస్తూ 49 శాతం వాటా కేంద్రానికి ఉంచుకుంది. సీమాంధ్రలోని గ్యాస్ విషయానికి వస్తే కేవలం రాయల్టీ మాత్రమే ఆ రాష్ట్రానికి ఇవ్వనున్నారు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉంటాయని కూడా బిల్లులో స్పష్టం చేశారు. పదవ షెడ్యూల్ కిందకు వచ్చే రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన 42 శిక్షణ సంస్థలు, కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉంటాయని బిల్లులో స్పష్టం చేశారు. అలాగే 9వ షెడ్యూల్ కిందకు వచ్చే ఆర్టీసీ, పౌర సరఫరాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ జెన్కో, ట్రాన్స్‌కో, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, రాష్ట్ర బ్రూవరేజెస్ కార్పొరేషన్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థతో సహా మొత్తం 44 సంస్థలు తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఈ సంస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయనుంది. ఖమ్మం జిల్లాలో సమగ్ర స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటు, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ సాధ్యాసాధ్యాలు, తెలంగాణలో ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు, సీమాంధ్రలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు.. వీటన్నింటిని కేంద్రం పరిశీలిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఆఖరికి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రస్థాయి సంస్థలతో పాటు హైకోర్టును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని కూడా కేంద్ర ప్రభుత్వం నియుమించబోయే నిపుణుల కమిటీయే నిర్ణయిస్తుంది. రాష్ట్రం వెలుపల ఉన్న ప్రభుత్వ ఆస్తుల విషయంపై కూడా కేంద్రమే నిర్ణయం తీసుకోనుంది. ఏపీ భవన్ కేంద్రం చేతిలోనే.. రాష్ట్ర విభజన అనంతరం.. ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోకే వెళ్లిపోనుంది. కేబినెట్ ఆమోదం తెలిపిన ముసాయిదా ప్రకారం రాష్ట్రానికి అవతల ఉన్న రాష్ట్ర ఆస్తులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతాయి. అందులో ఏపీ భవన్ ఒకటి. -
టీ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం ధర్మం: జేపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం ధర్మమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. లేదంటే ఎమ్మెల్యేలందరికీ విడివిడిగా అవకాశమిచ్చి వారి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా అన్న ప్రశ్నకు ‘బలవంతంగా చేసే నిర్ణయాన్ని లోక్‌సత్తా పూర్తిగా వ్యతిరేకిస్తుంది’ అని బదులిచ్చారు. -
అసెంబ్లీ పరిశీలనకు మాత్రమే బిల్లు!
విభజనపై ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానిదే పూర్తి అధికారం సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా రాష్ట్రాల విభజనకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు ఎటువంటి నిర్ణయాధికారమూ లేదని రాజ్యాంగంలోని 3వ అధికరణ స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటు పరిధికి లోబడే ఉంటుంది. ఈ అధికరణ ప్రకారం.. రాష్ట్ర విభజనకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించే అవకాశం ఎక్కడా లేదు. విభజనపై కేంద్ర ప్రభుత్వం రూపొందించి పంపే ముసాయిదా బిల్లు మాత్రమే రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీ పరిశీలనకు వస్తుంది. అసెంబ్లీ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా విభజనపై పార్లమెంటే తుది నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఏదైనా రాష్ట్రం నుంచి తమ రాష్ట్రాన్ని విభజించాలని లేదా తమ రాష్ట్రాలను విలీనం చేసి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు కేంద్రానికి ప్రతిపాదించి, తమ అభీష్టాన్ని నెరవేర్చుకున్న సందర్భాలున్నాయి. అటువంటి సందర్భాల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీలు విభజనకు లేదా విలీనానికి సంసిద్ధత తెలుపుతూ తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపే సంప్రదాయం కూడా లేకపోలేదు. ఇది కేవలం సంప్రదాయమే. ఇటువంటి తీర్మానానికి ఎటువంటి రాజ్యాంగబద్ధతా లేదు. కొన్ని ఏళ్ల క్రితం జార్ఖండ్, చత్తీస్ఘఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ సంప్రదాయం ప్రకారం ఏర్పాటైనవే. స్వాతంత్య్రానంతరం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం జరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఇటు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో, అటు హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలోనూ.. విలీనానికి సంసిద్ధత తెలియజేస్తూ ఈ సంప్రదాయం ప్రకారమే తీర్మానాలు చేశారు. మహారాష్ట్ర నుంచి విదర్భను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, ఉత్తరప్రదేశ్‌ను 4 రాష్ట్రాలుగా విభజించమని కోరుతూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏళ్లు గడచిపోతున్నాయి. అయినప్పటికీ, ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ విభజన తీర్మానం రెండుసార్లు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదే పదే నమ్మబలుకుతున్నారు. అయితే, రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం వీరి మాటలకు ఎటువంటి హేతుబద్ధతా లేదన్నది గమనించదగిన విషయం. ఇంతకీ 3వ అధికరణ ఏం చెబుతోందంటే..? కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల్లో ప్రాంతాల, సరిహద్దుల, పేర్ల మార్పులను పార్లమెంటు చట్టం ద్వారానే చేయాలి. ఎ. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఉన్న రెండు, మూడు రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. బి. రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం. సి. రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించడం. డి. రాష్ట్ర సరిహద్దులను మార్చడం. ఈ. రాష్ట్రం పేరు మార్చాలంటే... రాష్ట్రపతి సిఫారసు ఆధారంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. బిల్లు ప్రభావం రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతం, సరిహద్దులు, పేరు మార్పులపై ఉంటే బిల్లును ఆ రాష్ట్ర శాసనసభకు, రాష్ట్రపతికి పంపి, నిర్దిష్ట గడువులోగా అభిప్రాయాలు కోరవచ్చు.