
త్వరలో లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్స్ యాక్ట్
నిర్వహణలేమితో తరచూ ప్రమాదాలు
2015 ముసాయిదా బిల్లుకు మెరుగులు దిద్దాలని ప్రభుత్వం ఆదేశం
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి నిర్ణయం
గత ఏడాది మే 27న హైదరాబాద్ నాగోల్‌లోని ఓ హోటల్లో లిఫ్ట్ కేబుల్ తెగి ఎనిమిది మంది గాయపడ్డారు. జూలై 27న తుకారాంగేట్‌లో68 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. జూలై 15న హఫీజ్‌పేటలో లిఫ్ట్ వైర్‌తెగిపడి ఒకరు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆగస్టు 26న గుడిమల్కాపూర్‌లో లిఫ్ట్ పైకప్పు కూలి 65 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు.
గతనెల 22న మాసబ్‌ట్యాంక్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. తాజాగా మార్చి 12న సంతోష్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు’ ఇలా నిత్యం ఏదో ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేవలం షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే కాదు సామూహిక, వ్యక్తిగత గృహ సముదాయాల్లోనూ లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, పిల్లల కోసం వీటిని అమర్చుకుంటున్నారు. అయితే లిఫ్ట్‌ల తయారీ కంపెనీలపై మెజార్టీ ప్రజలకు అవగాహన లేదు. నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలామంది బిల్డర్లు మార్కెట్లో తక్కువ ధరకు లభించే లిఫ్ట్ పరికరాలను కొనుగోలు చేసి అమర్చుతున్నారు.
అయితే, వీటిపై నిర్వహణతోపాటు నియంత్రణ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లో అమల్లో ఉన్న లిఫ్ట్ పాలసీని తెలంగాణలోనూ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
అధ్యయనం, ముసాయిదా రూపకల్పన కోసం రెండు రోజుల క్రితం ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ లిఫ్ట్ యాక్ట్– 2015 ముసాయిదాకు మెరుగులు దిద్దాలని ఆదేశించింది. అలాగే, ఇతర రాష్ట్రాల్లో పాలసీ ఏ విధంగా ఉందనే అంశంపై ఆరా తీసే పనిలో తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ విభాగం నిమగ్నమైంది.
ప్రమాణాల మేరకు లేకపోవడం వల్లే..
అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) ఇవ్వడానికి పురపాలక శాఖ అమలు చేస్తున్న జీఓ 168లో లిఫ్ట్ ఏర్పాటు గురించి ప్రస్తావన ఉన్నా.. దాని నాణ్యత, నిర్వహణ, నియంత్రణపై ఎలాంటి ఆంక్షలు లేవు. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా 10 వేల వరకు ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిలో 20 శాతమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు ఉన్నట్లు అంచనా.
మిగిలినవి కనీస నైపుణ్యంలేని తయారీ దారులు విక్రయిస్తున్నవే. తయారీ సంస్థల వద్ద ఐదారేళ్లు పని చేసిన వర్కర్లే స్వయంగా ఎలివేటర్ల తయారీని ప్రారంభిస్తున్నారు. వీరు బిల్డర్ల వద్ద తక్కువ ధరకు కాంట్రాక్టులు తీసుకుని నాసిరకం లిఫ్ట్‌లను అమర్చుతున్నారు. అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో లిఫ్ట్‌లను ఏర్పాటు చేసిన సంస్థలు ఆ తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. బీఐఎస్ నిబంధనల ప్రకారం లిఫ్ట్‌ను నిర్మించే సమయంలో దానిలో ఎంత మంది వెళ్లొచ్చు? ఎంత బరువు మోయగలదు? వంటి అంశాలను స్పష్టం చేయాల్సి ఉంది.
ప్రమాణాల మేరకు కరెంట్ సరఫరా ఉందా? నాణ్యమైన పరికరాలు (ఆటోమేటిక్ డోర్లు, మోటారు, కేబుల్, సెన్సర్లు, ఫ్యాన్లు, లైట్లు, అత్యవసర ఫోన్, అగ్ని నిరోధక పరికరాలు) ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా.. చట్టం లేకపోవడంతో చాలామంది పట్టించుకోవడం లేదు. 20 ఏళ్లకు పైబడిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. చాలాచోట్ల ఇప్పటికీ పాతవే దర్శనమిస్తున్నాయి. సర్టిఫైడ్ నిపుణులతోనే ఎలివేటర్లను ఇన్‌స్టాల్ చేయించుకోవడంతోపాటు నిర్వహణ సరిగా ఉందని నిర్ధారించుకుంటేనే లిఫ్ట్ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని తెలంగాణ విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి సీహెచ్.రామాంజనేయులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment